Sunday, February 11, 2024

వేదం నేర్పిన విద్వత్సభలు, చర్చలు, గోష్టులు, మీమాంసలు, తర్కాలే నేటి సెమినార్లు, శిక్షణలు, వర్క్ షాపులు ..... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-11 : వనం జ్వాలా నరసింహారావు

 వేదం నేర్పిన విద్వత్సభలు, చర్చలు, గోష్టులు, మీమాంసలు, తర్కాలే

నేటి సెమినార్లు, శిక్షణలు, వర్క్ షాపులు

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-11

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (12-02-2024)

‘దేవతలను స్తుతించేది ఋగ్వేదం. ఋగ్వేదంలోని మంత్రాలను ఋక్కులు అంటారు. యజ్ఞయాగాది క్రతువులు, వాటి విధి విధానాన్ని నిర్దేశించేది యజుర్వేదం. యజుర్వేదంలోని మంత్రాలను యజస్సులు అంటారు. యజ్ఞం ఒక బృహత్కార్యం, ఒక సత్కార్యం, ఒక సమాజ కళ్యాణ కార్యం అవుతుంది. యజ్ఞం ఒక్కడికే సాధ్యం కానిది. చాలామంది అవసరం అవుతారు. యజ్ఞం కోసం కొందరు జనులు ఏకం కావాలి. యజ్ఞం ఐకమత్యం నేర్పుతుంది. నలుగురు కలిసి చేసిన బృహత్కార్యం యజ్ఞం అవుతుంది. ఈ బృహత్కార్యానికి ఎవరో పదిమంది కలుస్తే సరిపోరు. నిపుణులు, ప్రత్యేక విద్యలో నైపుణ్యం కలవారు కలిసి పని చేస్తేనే యజ్ఞం అవుతుంది. యజ్ఞం అనగానే స్పురించేది యజ్ఞకుండం, యజ్ఞవాటిక లాంటివి. యజ్ఞకుండానికి గుంట తవ్వేవారు కావాలి. కుండ నిర్మాణానికి ఇటుకలు కావాలి. ఇటుకలు చేసేవారు, ఇటుకలు తెచ్చే బండి, బండికి కట్టిన పశువులు, బండి తోలేవాడు, ఇటుకతో కుండ నిర్మించే వాస్తు శిల్పి కావాలి. ఇప్పటికి కుండ మాత్రమే సిద్ధం అయింది. 

         ‘యజ్ఞానికి కావాల్సిన తగిన సమిధలు నిర్ణయించే శాస్త్రజ్ఞులు కావాలి. యజ్ఞం సామాజిక కార్యం. ఇది సమాజానికి ఉపకరించేది కావాలి. వేదం కొన్ని రకాల సమిధలు మాత్రమే యజ్ఞానికి విధించింది. అవే కావాలి. ఇవి తెచ్చేవారు కావాలి. సమిధలు ఇచ్చే చెట్టును ప్రార్థించే మంత్రాలు కూడా వేదంలో ఉన్నాయి. అడవుల ప్రాధాన్యతను ఎప్పుడో వేదం గుర్తించింది. సమిధలు యజ్ఞవాటికకు చేర్చడం కూడా ఒక ప్రక్రియే. అది కూడా శాస్త్రయుక్తంగా జరగాలి. యజ్ఞకుండం, సమిధలకు ఇంత పరిశ్రమ అవసరం. యజ్ఞకుండంలో అగ్ని రగిల్చాలి. ఆహుతులకు ఆవు నేయి కావాలి. అది పొందడం కూడా ఒక ప్రక్రియే. యజ్ఞం చేయడానికి హోతలు కావాలి. వారికి శిక్షణ ఇవ్వడానికి గురుకులాలు కావాలి. వేదం తెలిసిన గురువులు దొరకాలి. యజ్ఞానికి ఇంకా అనేకం కావాలి. యజ్ఞం జరిగేచోట విద్వత్సభలు, చర్చలు, గోష్టులు, మీమాంసలు, తర్కాలు నిర్వహించాలి. నేటి సెమినార్లు, శిక్షణలు, వర్క్ షాపులు వేదం నుండి నేర్చుకున్నవే!.

‘యజ్ఞం మానవ జాతికి అనేకం నేర్పింది. సంఘం, సమాజం, కలిసిమెలిసి పనిచేయడం, శ్రమ విభజన, విద్య, నైపుణ్యం, బోధన, శిక్షణ, సంపద పరిరక్షణ, ఉపయోగం, సమాజ క్షేమం, సంఘ క్షేమం, విశ్వ శ్రేయస్సు, మానవ కల్యాణం ఇలా అనేకం నేర్పింది యజ్ఞం. మనం తినే మెతుకు కోసం, తాగే నీటికోసం, ఎన్నో యజ్ఞాలు జరిగాయి. జరుగుతున్నాయి. జరుగనున్నాయి. వేదం ఇంతమంది శ్రమకు కర్త అయింది. మానవ కల్యాణం కోసం జరిగే ప్రతి బృహత్కార్యమూ యజ్ఞమే!’.

         ‘హయమేధం, అజమేధం లాంటి యజ్ఞ యాగాదులలో పశుహింస విధించబడింది. అయితే పాశ్చాత్య విద్వాంసులు, వేదంలోని మహత్తరమైన విషయాలను వదిలి, కేవలం యజ్ఞాల్లోని పశుహింస ఆధారంగా “వేదం ఆర్యుల ఆటవిక జీవనం” అని నిశ్చయించారు. కొందరు భారతీయ మేథావులు అది నమ్మారు కూడా! పాశ్చాత్య విద్వాంసులు వేదాన్ని అధ్యయనం చేశారు. కొంతమేరకు వారి పరిధిలో అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న దాని ఆధారంగా భారతీయ సంస్కృతి మీద దాడి చేశారు. భారత మేధావులను నమ్మించారు. వేదంలో పాశ్చాత్యులు ఈనాటికీ కనీవినీ ఎరుగని అంశాలున్నాయి. వీటన్నిటినీ విడిచి కేవలం జంతు వధ మీదనే ఆధారపడి వేదాన్ని అపఖ్యాతి పాలుచేయడం ఎందుకు? భారత ధర్మాన్నీ, భారత తాత్త్వికతనూ కించపరచడం వారి ప్రధాన ఉద్దేశం. భారతీయులు వేదకాలంలో ముమ్మాటికీ మాంసాహారులే. అనంతర కాలంలో వారు శాకాహార ప్రాశస్త్యం గుర్తించారు. పాశ్చాత్యులు ఇంకా గుర్తించాల్సి ఉంది. వేదకాలంలో స్వంతానికి కాకుండా సంఘానికి ఉపయోగపడ్డప్పుడు మాత్రమే యజ్ఞంలో పశువధ చేశారు. ఆహారం కోసం జంతువును వధించడం తప్పు కాదు. దానిని దేవతలకు అర్పించి భుజించడం ఒక విశేషం. యజ్ఞం ఆ విశిష్టతను సంతరించుకుంది’.

         ‘యజ్ఞంలో జంతువును వధించడం కాదు, బలి ఇవ్వడం జరిగింది. బలి అంటే త్యాగం. దేవతలు మనకు అనేక ఉపకారాలు చేస్తున్నారు. వారికి ప్రత్యుపకారం అసాధ్యం. లాంఛనంగా వారికి ఏదైనా అర్పించాలి అనిపిస్తుంది. ఏమి అర్పించగలం? జంతువును అర్పిస్తాం. తన ఆహారానికి చంపడానికి, దేవతకు అర్పించడానికీ, బలి ఇవ్వడానికీ చాలా అంతరం ఉంది. వధించడం తన కోసం. బలి కృతజ్ఞతా పూర్వకం! వేదంలో “స్వాహా” అనే పదం వస్తుంది. ఇది సుమారు “అంకితం,అర్పణం” అనే అర్థంలో వస్తుంది. స్వాహా అనే పదంలో “స్వ+ఆ+హా” అనే అక్షరాలున్నాయి. తనకున్న ఆసాంతం అర్పిస్తున్నాను అని దీనర్థం. అందరూ ఆత్మార్పణం చేయలేరు. అందరూ ఆత్మార్పణం చేస్తే సమాజం నిలవదు. కాబట్టి ఆత్మార్పణకు ప్రత్యామ్నాయంగా జంతుబలి ఇచ్చేవారు. సకల ప్రాణులతో మమేకం కావడం స్వాహా అవుతుంది. సకలమూ తానే అనుకోవడం,ఆత్మవత్సర్వ భూతాని స్వాహా” అవుతుంది. తనలో భగవంతుని దర్శించడం “అహం బ్రహ్మాస్మి” అనుకోవడం స్వాహా ఉటుంది. బలి ఒక్క వేదానికీ, ఒక్క భారత ధర్మానికి మాత్రం పరిమితం కాదు. భారతజాతి జంతుబలికి బదులు కొబ్బరికాయ సమర్పించుకునే ఉన్నత దశకు వచ్చింది. నారికేళంలో హింసలేదు. రక్తం బదులు నీరు ప్రవహిస్తుంది’.

         ‘రామాయణంలో అంబరీషుడి, శునశ్సేపుడి కథ చదువుతే విశ్వామిత్రుడు పశుబలి లేకుండానే యజ్ఞఫలం కలిగించిన విషయం అర్థం చేసుకోవచ్చు. విశ్వామిత్రుడు శునశ్సేపుడిని రక్షించి, నరబలినీ, పశుబలినీ మాన్పించిన ఉదంతం అవగతమౌతుంది. అదొక మహాత్కార్యంగా భావించాలి. వేదంలో అధ్వర యజ్ఞం గురించి చెప్పడం జరిగింది. ఆధ్వర యజ్ఞం అహింసా యజ్ఞం అవుతుంది. కొందరైతే యజ్ఞమే అధ్వరం అంటారు. అంటే యజ్ఞాలన్నీ అహింసాలే! వేదంలో కొన్ని పశువుల పేర్లు యజ్ఞసంబంధంగా చెప్తారు. వేదం పరోక్షవాది. దాని అంతరార్థాలు వేరు. పశువుల పేర్లు సంకేతాలు మాత్రమే! అవి వాస్తవంగా కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. వీటిని ఆత్మజ్ఞానం అనే అగ్నిలో హవనం చేయాలని అర్థం.’

‘కర్మవాదులు ఈ అర్థాన్ని గ్రహించలేరు. వారు స్వప్రయోజనాల కోసం యజ్ఞాలు చేస్తారు. ఈ కర్మకాండను ఆచార్యులు, మహాత్ములు ఖండించారు. వారు వేదాలను నిరసించనూలేదు, ఖండించనూలేదు. వేదానికి మనిషి మీద అనంతమైన విశ్వాసం. మానవుడు నిష్కల్మష, పవిత్ర జీవనం ఏర్పరుచుకోవాలని వేదం అనేక చోట్ల ఆదేశించింది. ఒక పవిత్ర జీవి, ఒక ఆత్మార్పణం చేసిన మహానుభావుడు, ఒక లోక కల్యాణం సాధించిన మహా పురుషుడు భగవానుడు అవుతున్నాడు. వేదం మనిషిని “సమిధాసి” అన్నది. మనిషి సమిధ వంటి పవిత్రుడు అని దీనర్థం. సమిధ తాను జ్వలిస్తుంది. అన్యులకు కాంతినీ, వేడినీ ప్రసాదిస్తుంది. మానవుడు అలాంటివాడు కావాలని వేదం ఆశిస్తుంది. ఆత్మ సమర్పణయే యజ్ఞ స్వరూపం. దానితోనే లోక కల్యాణం, లోక హితం, లోక శాంతి, లోక కాంతి.         

         ‘వేదానికి తొలినుంచీ ఒక అపకారం జరిగింది. వేదం తొలుత సాహిత్యం. కర్మకాండ తరువాత చేరింది. బహుశః కర్మకాండ వల్లనే వేదం ఇంతకాలం నిలిచిందేమో! అయితే కర్మకాండ సాహిత్యానికి గ్రహణం పట్టించింది. కర్మకాండ స్వప్రయోజనపరులకు ఉపయోగపడింది. వేదం వారి చేతి కీలుబొమ్మ అయింది. వేదానికి సాహిత్యం ఉందని జనానికి తెలియకుండా పోయింది. గౌతమ బుద్ధుని దగ్గరనుంచి రామానుజునిదాకా అందరూ వేదపు శ్రేయోభిలాషులే. వారు నిరసించింది కర్మకాండనే! జగద్గురువు ఆదిశంకరుడు విసిగిపోయాడు. “అవిద్యద్విషయం కర్మ” అని ఉపనిషత్తులను ఆశ్రయించాడు. కేవలం కర్మకాండను దృష్టిలో పెట్టుకుని పాశ్చాత్య విద్వాంసులు వేద సమాజాన్ని వక్రీకరించారు. వారి వక్రభాష్యాలకు ఆధునిక వేదవ్యాఖ్యాతలు స్పందించారు. వారి వేదంలోని పదాలకు ఆధ్యాత్మిక అర్థాలు వెదకడానికి కృషి చేస్తున్నారు’.

         ‘మానవుడి మహిమను, శక్తిని, అప్రతిహిత ప్రభావాన్ని యజుర్వేదం గుర్తించింది. యజుర్వేదంలో నరుడి వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని అనేక చోట్ల ప్రస్తావించి స్తుతించింది. మానవుడు పరిపూర్ణుడు కావాలి. అతడికి ఆత్మజ్ఞానం కలగాలి. అతడు సమర్థుడు. వాటిని సాధించగలడు. యజుర్వేదానికి ఆ విశ్వాసం ఉంది. అందుకే మానవుడి మహత్తును వివరిస్తుంది. మానవుడు తాను అమరుడను అనుకోవాలి. నిత్య మృత్యు భయం ఉన్నవాడు కార్యసాధకుడు కాజాలడు. అమరత్వం అంటే మృత్యువు లేకుండడం కాదు. శతశరత్తులు జీవించడం. నరుడు మృతి చెందుతాడు. తన పుత్రుడి రూపంలో జీవించుతాడు. అవిచ్చిన్నంగా కొనసాగే సంతానమే అమరత్వం. నిరంతరత్వమే అమరత్వం. నరుడు తన శక్తిని గ్రహించాలి. అతడికి ఆత్మ విశ్వాసం కలగాలి. శక్తి, ఆత్మ విశ్వాసం కలవాడు సాధించలేనిది లేదు. మనిషి తాను బాగుపడడం కాదు, లోకానికి సాయపడాలి. సమాజ జీవితానికి తోడ్పడాలి. క్రమంగా జ్ఞానం పెంచుకోవాలి. ఈ దేశం నాది నుంచి వసుధైవ కుటుంబం, లోకమే నా కుటుంబం అనే స్థితికి రావాలి’.

         ‘యజ్ఞానికి అగ్ని, ఆజ్యం, సమిధ అత్యవసరం. అగ్ని అంటే వేడి, వెలుగు. సమస్త ప్రపంచం, సమస్త ప్రాణులు అగ్ని మూలంగానే జీవిస్తున్నాయి. అగ్ని ఆరిపోయిన నాడు అంతరిస్తున్నాయి. ఈ సూత్రం గ్రహ నక్షత్రాదులకు సహితం వర్తిస్తుంది. సృష్టి సాంతం అశాశ్వతం. పరమాత్మకు తప్ప ఏ పదార్థానికీ శాశ్వతం లేదు. యజ్ఞానికి వాడే అగ్ని మానవ దేహంలో ఉంది. అది ఉన్నంత సేపే జీవిత దీపం వెలుగుతుంటుంది. ఒకరు నమ్మినా, నమ్మకున్నా, విశ్వాసం ఉన్నా, లేకున్నా, అర్థం అయినా, కాకున్నా, మానవ శరీరంలో నిత్య యజ్ఞాగ్ని కాపురం ఉంటున్నది. జ్ఞానం కలవాడు ఈ విషయం గుర్తిస్తాడు. యజ్ఞం స్వంతం కోసం మాత్రం కాదు. మానవ కల్యాణం, లోక కల్యాణం, జీవ కారుణ్యం కోసం. కాబట్టి, జ్ఞాని తన జీవితాన్ని మానవ కల్యాణానికి అప్పగిస్తాడు. అంకితం చేస్తాడు. అగ్ని నిరంతరం ప్రజ్వరిల్లుతుండాలి. అది ఆరడానికి వీల్లేదు. మానవుడి తొలి కర్తవ్యం, తొలి హక్కు జీవించడం. “శరీరమాద్యం ఖలు ధర్మసాధనం”. ధర్మం సాధించాలంటే తొలుత కావలసింది దేహం’.

         ‘అగ్ని నిత్యం జ్వలించడానికి సమిధ కావాలి. అన్నం నరుడి దేహానికి సమిధ అవుతుంది. అందుకే వేదం అన్నానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మానవుడు అన్నం జీవించడానికి మాత్రమే తినాలి. తినడానికి జీవించరాదు. ఈ అన్నం భగవత్ ప్రసాదం. దీనిని భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని నిలపడానికి భుజించారు. అన్నార్తులకు అన్నం పెట్టడమే యజ్ఞం అవుతుంది. మనం పెట్టిన అన్నం అన్నార్తుడు తినడాన్ని చూడడంలో ఆనందం ఉంది. ఆనందమే యజ్ఞఫలం. అన్నం జీవించడానికి, జీవితం మానవ కళ్యాణానికి అని జ్ఞాని అయినవాడు గుర్తిస్తాడు. ఆచరిస్తాడు. అన్నం అగ్నిని నిలుపడానికి మాత్రమే. అగ్నిని ప్రజ్వరిల్లచేయాలి. అందుకు ఆజ్యం అవసరం. జ్ఞానం ఆజ్యం అవుతుంది. జ్ఞానంతో అగ్ని జ్వలిస్తుంది. ప్రకాశిస్తుంది. కాంతివంతం అవుతుంది. జ్ఞానాగ్నితో ఆత్మదర్శనం కలుగుతుంది. తానెవరో అర్థం అవుతుంది. మానవ దేహంలోనే సకల దేవతలూ నివసిస్తున్నారు. ఈ దేహం దేవతల సదనం. అవయవాల అధిష్టాన దేవతలను ఉపనిషత్తులు వివరించాయి. తానెవరు? దేవతలకు నివాస గృహం. ఇంద్రాది సకల దేవతలు తనలోనే ఉన్నారు. అన్ని శక్తులు తనవే! తాను సర్వ శక్తిమంతుడు. సకలం సాధించగలడు. ఈ దేహంలో పరమాత్మ ఉన్నాడు. తన ఆత్మ పరమాత్మ స్వరూపం. ఇదే ఆత్మదర్శనం.’

         ‘తాను ఇంతటి శక్తిమంతుడు. అణు విస్ఫోటం అంతటి శక్తి తనలో ఉంది. ఈ శక్తిని దేనికి ఉపయోగించాలి? శక్తి వినాశానికీ, కళ్యాణానికీ రెంటికీ ఉపయోగ పడ్తుంది. ఈ శక్తి మానవ కళ్యాణానికి, సామాజిక కళ్యాణానికి, జగత్ కళ్యాణానికి అని గుర్తించడం ఆత్మజ్ఞానం అవుతుంది. ఆత్మదర్శనం లేని ఆత్మజ్ఞానం అసాధ్యం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆరు యజ్ఞాలను గురించి ప్రవచించారు. అవి వరుసగా: ద్రవ్య యజ్ఞం, తాప యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, యోగ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, సంశిత యజ్ఞం. పరమాత్మలో యజ్ఞాన్నీ, యజ్ఞంలో పరమాత్మనూ దర్శించడం పరమ యజ్ఞం అవుతుంది.

(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

No comments:

Post a Comment