కోలాహల పర్వత గర్వాన్ని అణచిన వసురాజు
రామరాజభూషణుడి వసు చరిత్ర కథాంశం-1
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(08-07-2024)
యావత్ మహీతలాన్ని పరిపాలించి, పేరు ప్రఖ్యాతులు
గడించి, దేవేంద్రుడి నుండి వరంగా ఎన్నో గౌరవ చిహ్నాలను పొంది, మిలమిల మెరిసిపోతున్న విమానంలో ఎక్కి తిరుగుతూ వుండే, ఛేది దేశాధిపతైన వసువు అనే మహారాజు కథే వసుచరిత్ర. దీన్ని సూతుడు
శుకశౌనకాది మహామునులకు నైమిశారణ్యంలో తెలియచేశాడు.
అధిష్టానపురం అనే మహానగరం రకరకాల శోభలతో అలరారుతూ వుంటుంది.
సకల విద్యలకు ఆ నగరం ఆటపట్టు. నగరంలో ఎక్కడ చూసిన ధాన్యపు రాశులే! వేదసమ్మతమైన
హితోక్తులు చెప్పే బ్రాహ్మణోత్తములు ఎందరో వున్నారానగరంలో. వారు సకల విద్యలలోను
ఆరితేరినవారు. సువర్ణ సంపదలతో నిండి అలరారుతూ వుంటుంది ఆ మహానగరం. ఆ నగరంలోని
రాజులు ప్రతిభావైవిధ్యాలతో వెలుగొందుతుంటారు. కుబేరుడిని మించిన ధనవంతులు ఆ నగర
వైశ్యులు. రైతులు ధాన్యపు రాశులను భద్రపరుస్తారు.
ఆ మహానగరానికి పరాక్రమవంతుడైన వసు నృపాలుడు అధిపతి. వసురాజు
ఎనలేని కీర్తి సంపద ఆర్జించాడు. శౌర్యంలో అతడికి సమానులెవరూ లేరు. దానంలో,
వితరణలో ఆయనకు ఆయనే సాటి. ప్రజలపట్ల అనుగ్రహం చూపేవాడు. అవసరమైతే పరాక్రమం
ప్రదర్శించేవాడు. సర్వసమర్థుడై పరిపాలన చేశాడు. ఒకనాడు హిమవత్పర్వత శాఖైన కోలాహల
పర్వతం శుక్తిమతి నదీప్రవాహానికి అడ్డు నిలవగా వసురాజు తన కాలిగోటితో ఆ పర్వతాన్ని
పక్కకు నెట్టాడు. దాంతో అతడి కాలిగోరు ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైనదిగా
చెప్పుకున్నారు. ఆ పరాక్రమాన్ని తిలకించిన ఇంద్రుడు వసురాజుతో స్నేహం చేయసాగాడు.
సామంతరాజులు ఆయనకెప్పుడూ లోబడి వుండేవారు. వసురాజు చేత పరాభవించబడిన పర్వతం
కొన్నాళ్లు ఆయన కాళ్ల దగ్గరే పడి వున్నది. ఆ తరువాత దానిమీద దయతలచి వదిలేశాడు. ఆ
పర్వతం మీద రాజు అప్పుడప్పుడూ విహారం చేసేవాడు.
ఇదిలా వుండగా ఒక సంవత్సరం వసంత ఋతువు ప్రవేశించింది.
రాజుగారి ఉద్యానవనంలో చెట్లు చిగురులు వేశాయి. మన్మథదేవుడు చైత్రమాసంలో
మీనధ్వజారోహణం చేస్తాడు. మలయమారుతం అనే రథం ఎక్కి ప్రయాణం చేస్తాడు. మారుతం వసంత
సమాగమంతో విజృంభిస్తుంది. అది చేసే అల్లరి
అంతా-ఇంతా కాదు. వనపాలకులు మారుతం చేస్తున్న అల్లరిని, ఆగడాన్ని వసురాజుకు
విన్నవించారు. వారి
మాటలు వినగానే ఉద్యానవనం అంతా ఒక్కసారి తిరిగిరావాలని, విహరించాలని రాజుగారికి
కోరిక కలిగింది. తనకొరకై సిద్ధం చేసిన అపురూపమైన రథంలో ఉద్యానవన విహారానికి
బయల్దేరాడు రాజు.
మహారాజు దర్శనానికి అదే సరైన సమయం అని భావించిన సామంతరాజులు
అక్కడికి చేరుకున్నారు. రాజుగారి రథం ఉద్యానవనం దగ్గర ఆగింది. ఆయన రథం మీదనుండి
కిందికి దిగాడు. వెంటవచ్చిన సామంత రాజులను పొమ్మన్నాడు. తన స్నేహితులతో కలిసి
ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. వనాగ్రసీమను పరికించి చూశాడు రాజు. అరటి చెట్లను,
పాడుతున్న చిలకలను, సాష్టాంగపడుతున్న వన వృక్షాలను, సంపెంగచెట్లను, ఇంకా ఆనేక రకాల వృక్షాలను చూశాడు
రాజు. ఇంతలో వసురాజుకు శుక్తిమతీనదిలో ఒదిగి దాక్కుని వున్న కోలాహల పర్వతం
గుర్తుకు వచ్చింది. దాని దగ్గరికి వెళ్లాలని కుతూహలం కలిగింది.
వసురాజు తన మంత్రితో సహా కోలాహల పర్వత ప్రాంతాన్ని
చేరుకునేసరికి వారికి సురాపాన మత్తతతో మునిగిపోయిన దేవతాస్త్రీల మనోహర సంగీత నాదం
వినవచ్చింది. ఆ నాదానికి తన్మయుడైపోయాడు వసురాజు. మరో పక్కనుండి కోకిలల గేయసముదాయం
వినవస్తోంది. ఇంకో పక్క నుండి నెమళ్ళ గుంపుల నాట్యధ్వని వినవస్తోంది.
అలా...అలా...అనేక గాన సంపుటలు ఒకే సమయంలో వినపడసాగాయి. పర్వత విశేషాలను తనివితీరా
చూడ సాగాడు వసురాజు. తన మంత్రితో కూడి వసురాజు ఒక చంద్రశిలమీద కూచున్నాడు. ఆ
సమయంలో వారికొక మధురగానం వినవచ్చింది. అది ఎక్కడినుండి వస్తున్నదో,
ఎవరిదో, వారు ఎక్కడ వున్నారో కనుక్కొని రమ్మని మంత్రికి
చెప్పాడు రాజు. ఆ వివరాలు తెలిస్తే అక్కడికి పోదామని అన్నాడు రాజు.
మంత్రి రాజుగారి ఆదేశానుసారం బయల్దేరాడు. ఆయనకు ఒకలోయ
కనిపించింది. అక్కడ నదీ ప్రవాహం, అనేక రకాల చెట్లు, పక్షులు కనిపించాయి.
అక్కడ మంత్రికి ఒక దివ్య మందిరం కనిపించింది. ఆ మందిరం ముందర నవరత్నాల ముగ్గులు
కనిపించాయి. అది నానా శోభలతో వెలిగిపోతున్నది. ఆ మందిరంలో కొందరు వనితా రత్నాలు
వున్నట్లు ఆయన భావించాడు. చెట్లచాటునుండి ఆ మందిరంలోకి చూడసాగాడు. లోపల ఒక సుందరి
కూచుని వుండడం గమనించాడు. ఆమె అక్కడ కూచుని వీణ వాయిస్తూ వున్నది. ఆమె చుట్టూ
కొంతమంది చెలికత్తెలున్నారు. ఆమె గురించి మహారాజుకు చెప్పిరావడానికి మంత్రి
వసురాజు దగ్గరికి వెళ్లాడు.
మంత్రి తాను చూసినదంతా చెప్పాడు. తాను చూసిన సుందరి
అందాన్ని వర్ణించాడు. ఆమెకు ఎదురుపడకుండా దూరంగా చెట్ల చాటు నుండి చూసిన సంగతి
విన్నవించుకున్నాడు. త్వరగా వెళ్లి ఆమెను సందర్శించుకొని రావాలని రాజుగారు
కుతూహలపడ్డాడు. వసురాజు విరహ వాతావరణంలో మునిగిపోయాడు. రాజు,
మంత్రి కలిసి బయల్దేరారు. కన్య వున్న మందిరం కనిపించింది. ఆ దివ్యమందిరాన్ని పొదల
మాటున నిలబడి అతి జాగ్రత్తగా పరిశీలించి చూశాడు వసురాజు. ఆ సుందరిని చూడగానే ఆయన
కన్నులకు ఉత్సుకత ఎక్కువైంది. శరీరం అంతా అనురాగంతో నిండిపోయింది. ఆమె
సౌందర్యాన్ని అలాగే చూస్తూ ఉండిపోవాలని అనుకున్నాడు. ఆమెను ఆపాదమస్తకం గమనించాడు.
వసురాజు మనస్సు ఇంతవరకూ పరాయత్తం కాలేదు. ఇప్పుడు ఆయన తన
మనస్సులో ఈ కన్యారూపాన్ని నిలుపుకొని కొనియాడసాగాడు. ఆమె సౌందర్యానికి
ముగ్దుడైపోయాడు. రాజు, మంత్రి ఆలోచన చేసిన తరువాత ముని వేషంలో మంత్రి ఆమె దగ్గరికి పోయాడు.
ఆయన్ను చూసి సుందరి ఆయనకు నమస్కారం చేసింది. ప్రియపురుషుడిని వివాహం చేసుకుంటావని
ఆమెను ఆశీర్వదించాడు ముని వేషంలోని మంత్రి. మునికి అర్ఘ్యపాద్యాది సేవలను చేసిన
తరువాత ఆయన వివారాలను అడిగింది సుందరి చెలికత్తె మంజువాణి. తాను గౌతముడి
వంశీయుడినని, క్షీర సముద్రంలో పుట్టానని, తన పేరు కూడా గౌతముడే అని, తాను సూర్యుడిని
ప్రేమిస్తున్నానని, ఉద్యానగతుడైన తన స్వామితో అటువైపుగా
వచ్చానని, అపర లక్ష్మీదేవిలాగా కనిపిస్తున్న ఆ సుందరి
గోత్రనామాలు చెప్పమని అడిగాడు.
ఆ కన్య పేరు సింధునందన అని, ఆమెనే అంచలేంద్ర నందన
అని కూడా అంటారని, దానర్థం నదీ పుత్రి,
పర్వత పుత్రి అని, అంటూ, మంజువాణి ఆ
సుందరి జన్మక్రమాన్ని తెలియచేసింది ఇలా. “ఈ భూమ్మీద వసురాజు అనే చక్రవర్తి
వున్నాడు. అతడి పరాక్రమం లోకాతీతమైనది. అతడి నివాస స్థలమైన అధిష్టానపురం సంపదలతో
అలరారుతూ వుంటుంది. రాజధానికి కంఠాభరణం లాగా శుక్తిమతి అనే నది వున్నది. ఆ నదికి ఇష్టసఖి నర్మదానది.
వేత్రవతి, సరస్వతి నదులు చెలికత్తెలు. అంతా కలిసి ఒకనాడు బ్రహ్మదేవుడి దగ్గరకు
వెళ్లివస్తుంటే ఒక సంఘటన జరిగింది. శుక్తిమతీదేవికి పర్వత శ్రేష్టుడైన ఒక పురుషుడు
తారసపడ్డాడు. అతడు అనుపమ భాగ్యశాలైన హిమవంతుడి కుమారుడు. పార్వతీదేవికి తమ్ముడు.
పరమేశ్వరుడికి ముద్దుల మరది. పర్వతరాజు శుక్తిమతీదేవిని చూసి ఆకర్షితుడయ్యాడు.
ఇద్దరూ మోహంలో చిక్కుకుపోయారు. కోలాహలుడు శుక్తిమతి చెంతకు చేరాడు. ఆమె కూడా
రాజుకు స్వాగతం పలికింది. అర్ఘ్యపాద్యాదులను ఇచ్చింది. పూజావిధులు నెరవేర్చింది”.
“తాను ఆమె
పొందుకోరి వచ్చానని, ఎల్లప్పుడూ ఆమెను విడువకుండా వుంటానని, తనను అంగీకరించమని పర్వతరాజు కోరాడు
శుక్తిమతిని. తన స్వభావం నీచాతినీచమైనదని, ఎప్పుడూ పల్లానికే పోతుంటానని, అతడేమో చలించని స్వభావం కలవాడని, తాను పరుగులు తీస్తుంటానని, అతడేమో ధైర్యంగా ఒక్క చోటే నిలుచుంటాడని, ఇలా
పరస్పర విరుద్ధ గుణాలు కల ఇద్దరు ఒకటిగా కూడడం సమంజసంగా వుండదని, తమకు స్నేహం సరిపడే విషయం కాదని, కాబట్టి ఆయన పట్ల అనురాగం కలగడం కష్టం, అసాధ్యమని శుక్తిమతి తేల్చి చెప్పింది.
పర్వతరాజు ఆమె చెప్పిన మాటలు వినకుండా బలం ప్రయోగించి, పరాక్రమం ప్రదర్శించి, శుక్తిమతిని లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు.
శుక్తిమతి అసహయురాలై వసురాజును ప్రార్థించింది. శుక్తిమతికి అడ్డుగా నిలిచాడు
కోలాహలుడు. నదీగర్భం పగిలిపోయి నీరు భూమ్మీద అనేక పాయలుగా స్రవించసాగింది.
భూమండలంలో సంచలనం బయల్దేరింది. జనం కూడా వసురాజుకు మొరపెట్టుకున్నారు. వసురాజు తన
కాలిగోటితో కోలాహల పర్వతాన్ని ఆకాశం వైపుకు ఎగురవేశాడు. ప్రజలంతా సంతోషించారు”.
“కోలాహల పర్వత
గర్వాన్ని అణచిన వసురాజును ప్రజలు కీర్తించారు. తాను చేయలేని పని వసురాజు
చేసినందుకు దేవేంద్రుడు ఆనంద భరితుడయ్యాడు. స్వయంగా వసురాజు దగ్గరికి వచ్చి దర్శనం
ఇచ్చాడు. ఒక అపురూపమైన రథాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఆ రథం మీద లక్ష్మీదేవి, విష్ణుమూర్తి సూర్యమండలం అంతా పర్యటన చేశారని
చెప్పాడు. ఆ విమాన యజమానికి సువర్ణప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. ఆ విమానం ఎక్కే
అర్హత బ్రహ్మకు, విష్ణువుకు, శంకరుడికి తప్ప అన్య దేవతలకు లేదన్నాడు. ఆ విమానాన్ని ఎక్కి వసురాజు
తన నివాసానికి రాకపోకలు సాగించాలని కోరాడు ఇంద్రుడు. వసురాజు ఆ కానుకను
స్వీకరించాడు. శుక్తిమతీ తీరవాసులైన మునులు వసురాజుకు ‘ఉపరిచరుడు’ అనే బిరుదు ఇచ్చారు. వసురాజు ఆయన
అనుకున్నప్పుడల్లా ఆ విమానం మీద విహారం చేస్తూ నానలోకాలు తిరిగేవాడు.ఆయనకు
శుక్తిమతీ నది క్రీడా సరోవరం కాగా,
కోలాహల పర్వతం క్రీడా పర్వతమైంది”.
“జలప్రవాహానికి
అడ్డుగా నిలిచిన కోలాహల పర్వతరాజు సంఘర్షణవల్ల శుక్తిమతీనదికి గర్భం ఏర్పడింది. ఒక
శుభ ముహూర్తాన ఒక ఆడ శిశువు, ఒక మగ శిశువు కలిగారామెకు. ఈ విషయం
తెలుసుకున్న కోలాహలుడు కూడా సంతోషపడ్డాడు. శుక్తిమతి తన కుమారుడికి ‘వసుపదుడు’ అని పేరు పెట్టింది. బాలికకు ‘గిరిక’ అని నామకరణం చేశారు బ్రాహ్మణులు. తన ఇద్దరు
సంతానాన్ని శుక్తిమతి జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తోంది. గిరిక అల్లారుముద్దుగా
పెరిగింది. తల్లి కుమార్తెను చదువుల సరస్వతిగా తయారు చేసింది. తండ్రి ఆమెను వీణా
వాద్య ప్రవీణురాలిగా చేశాడు. ఆమె వీణానాదం చేయడానికి ఒక మణి గృహాన్ని నిర్మించి
ఇచ్చాడు. ఆ ‘గిరిక’ యే ఈ కన్య. చెలికత్తెలైన వారంతా
వనదేవతలు”.
(తరువాయి రెండవ భాగం)
(జయంతి
పబ్లికేషన్స్ వారి కమలాసనుడు వచన రచన ఆధారంగా)
No comments:
Post a Comment