రామరాజభూషణుడి వసు చరిత్ర కథాంశం-2
ఇంద్రుడి
ప్రేరణ వల్ల వివాహితులైన వసురాజు, గిరిక
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(15-07-2024)
ఈ విధంగా
మంజువాణి ఉపరిచర వసువు కథను, గిరికాదేవి జన్మ వృత్తాంతాన్ని
మునివేషంలో వున్న మంత్రికి సవివరంగా చెప్పింది. పొదలమాటున వున్న రాజు కూడా ఆ కథంతా
విన్నాడు. గిరిక నెమ్మదిగా తలెత్తి వసురాజును చూసింది. సిగ్గు పడింది. వసురాజు
చక్కదనాన్ని చూస్తూ ఉండిపోయింది. రాజు అక్కడికి వచ్చాడు కాబట్టి తమ అభిమతాలన్నీ
తీరాయని మంజువాణి అన్నది. ఆయన్ను పొందగలిగినందుకు గిరిక చాలా అదృష్టవంతురాలని
అన్నది. ఆ భువనమోహిని చిన్నతనం నుండీ వసురాజును కీర్తిస్తూనే వున్నదని అన్నది.
ముని వేషంలో వున్న మంత్రి వసురాజును,
గిరికను ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్లిపోయి, తన కపట వేషాన్ని తీసేసి మంత్రి
వేషంలో తిరిగి అక్కడికి వచ్చాడు. గిరికను,
వసురాజును వంటరిగా వదిలి అంతా అక్కడి నుండి తప్పుకున్నారు. వసురాజు మనస్సు
పూర్తిగా గిరిక మీదే లగ్నమైపోయింది. ఆమె పరిస్థితి కూడా అంతే.
ఇంకా అక్కడే
ఎక్కువకాలం వుంటే మంచిది కాదని, గిరిక ఎలాగూ రాజును ప్రేమించిందని, రాజధానికి పోయి పురోహితులను సంప్రదించి
గిరికతో వివాహానికి ముహూర్తుం నిర్ణయం చేద్దామని మంత్రి అన్నాడు. ఆ తరువాత
మంత్రితో కూడి వసురాజు ఆలోచనలలో మునిగి తేలుతూ నగరానికి వెళ్లాడు.
మంత్రితో కలిసి అధిష్టానపురం నగరానికి చేరుకున్న వసురాజు
ఏపనిమీదా ఆసక్తి కనపరచలేదు. ప్రతి పనీ పరధ్యాసతో లాంఛనప్రాయంగా ముగించేవాడు. అనుక్షణం గిరికన్యను
తలచుకుంటూ నీరసించి పోయాడు. అక్కడ స్త్రీరత్నమైన గిరిక ఏమీ దొరకని స్థితిలో
పడిపోయి తన హృదయ చోరుడి వర్ణచిత్రం వ్రాసింది. ఆమెకూడా వసురాజులాగానే
విరహావస్థలోపడి ఉన్మత్తురాలైపోయింది. కూతురు అలా మానసిక వ్యధతో కుంగిపోవడం తల్లి
శుక్తిమతీదేవి గమనించింది. కూతురును తన కౌగిట్లో పొదివి పట్టుకున్నది.
మన్మథబాధ భరించలేక గిరికన్య ఉద్యానవనంలో విహారానికి
పోయింది. చెట్టు-చెట్టునూ, పుట్ట-పుట్టనూ వసురాజు గురించి అడిగింది. ఆమె పడుతున్న విరహ తాపాన్ని
గమనించిన ఆమె ఇష్టసఖి మంజువాణి ఆమెను ఉపశమింపచేయడానికి పరి-పరి విధాల ప్రయత్నం
చేసింది. తాను పోయి గిరిరాజ కన్య వృత్తాంతాన్ని వసురాజుకు చెప్తానని, ఆయన మనస్సు, ఆలోచన తెలుసుకొని వెంటనే వస్తానని, శుభవార్తను తీసుకు వస్తానని అంటుంది గిరికన్యతో, ఇతర చెలికత్తెలతో. ఆమె
వెళ్లిన తరువాత మిగిలిన చెలికత్తెలు గిరికన్యను ఊరడించసాగారు. ఇంతలో వసురాజు
దగ్గరికి వెళ్లిన మంజువాణి ఆయనిచ్చిన పద్మరాగముద్రికతో కూడిన ఉంగరాన్ని పుచ్చుకుని
వినువీధిలో రాసాగింది. మంజువాణి గిరికన్యను చేరుతున్నకొద్దీ దాని అరుణిమ ఎక్కువ
కాసాగింది.
మంజువాణి వచ్చి వసురాజు ఇచ్చిన ఉంగరాన్ని గిరికకు ఇచ్చింది.
అక్కడి వృత్తాంతం చెప్పమని చెలికత్తెలు మంజువాణిని అడిగారు. జవాబుగా ఇలా చెప్పింది
మంజువాణి: “మీరు చెప్పిన విధంగానే, గిరిక మనస్సులోని విచారాన్ని వసురాజుకు
చెప్పడానికి గగన మార్గంలో ప్రయాణం చేసి ఆయన్ను చేరుకున్నాను. మొదట వసుమహారాజు నగరం
ఏదో కనుక్కోవడం కష్టమైంది. కొంత పరిశీలన చేసి ఆయన నగరమైన అధిష్టానపురాన్ని
గుర్తించగలిగాను. ఆయన రాజ సౌధం మీద వ్రాలాను. వసురాజు గృహద్వారాన్ని సమీపించాను. అదృశ్య
రూపంలో వసురాజు కేళీ భవనంలో ప్రవేశించాను. అక్కడ వసురాజును, ఆయన
మందిరాన్ని చూశాను. అక్కడ వున్న స్త్రీలు వసురాజు పరిస్థితిని గురించి
చర్చించుకుంటున్నారు. గిరిక వున్న క్రీడావనానికి వెళ్లివచ్చినప్పటి నుండి ఆయన
అదోలా ఉన్నాడని వారు మాట్లాడుకుంటున్నారు. రాజు వున్న రత్నమందిరంలో ప్రవేశించాను.
వసురాజు నీమీద విరహతాపంతో కుమిలి పోతున్నాడని గ్రహించాను”.
“గిరికను ఉద్దేశించి వసురాజు కఠినంగా మాట్లాడడం,
నిష్ఠూరాలు ఆడడం గమనించి అదే సరైన సమయమనుకొని మాట్లాడసాగాను. నా మాటల ద్వారా గిరిక
హృదయ తాప వర్ణన వసురాజు హృదయానికి ములుకులాగా తాకినట్లయింది. మాట్లాడుతున్నదెవరో
వసురాజుకు మొదలు అర్థం కాలేదు. మంజువాణి ఏదైనా సందేశం తీసుకు వచ్చిందా అన్న
అనుమానం కలిగింది వసురాజుకు. తనకు గిరిక అంటే పూర్ణమైన అనురాగం వున్నదని, గిరిక కూడా అదే భావనతో వున్నదని తెలుసుకున్నాను కాబట్టి ఇక తనకు ఊరట
కలిగిందన్నాడు. తానేం చేయాలని అడిగాడు. ఆయన ఆత్మీయతకు,
మమకారానికి నాకు ఆశ్చర్యం కలిగింది. నేను గిరిజాదేవి ఆనవాలుగా తీసుకెళ్లిన ఆమె
కంఠహారాన్ని వసురాజు హృదయ స్థానంలో వుంచాను. ఆ హారం ఆయన శరీరాన్ని తాకడంతోనే ఆయన
తాపం పోయినట్లు మాట్లాడసాగాడు”.
“అ ఆతరువాత నేను నా అదృశ్య రూపాన్ని వదిలి, వచ్చింది
నేనేనని, హారం ఇచ్చింది నేనేనని, మంజువాణినని చెప్పాను. వసురాజు
తన మనస్సులో గిరిక పట్ల వున్న అనురాగాన్ని వివరించాడు. ఇంద్రుడికి తన వృత్తాంతం
తెలిసిందని, ఒక మంచి రోజు చూసుకొని కోలాహలుడి దగ్గరికి
వెళ్లి వివాహ ప్రస్తావన చేయనున్నాడని అన్నాడు వసురాజు. ఈ శుభ వార్తను నీకు
(గిరికకు) తెలియచేయమని అన్నాడు. అలా అంటూ తన చేతి ఉంగరాన్ని నాకు నిదర్శనంగా ఇచ్చి
పంపాడు”.
ఈ విధంగా జరిగిన కథ అంతా మంజువాణి ద్వారా విన్న గిరిక ఆ
ఉంగరాన్ని చేతిలో తీసుకున్నది. వంటికి అద్దుకున్నది. ఆ ఉంగరం మీద వసురాజు పేరు
చూసి, ఆయన్నే చూసినట్లు సిగ్గు పడింది. ఆ ఉంగరాన్ని తన వేలుకు ధరించింది. అప్పుడే
వివాహం అయిపోయినంత ఉత్సాహంగా వున్నదామెకు. ఈ విషయమంతా విన్న గిరిక తల్లి
శుక్తిమతీదేవి కూడా సంతోషించింది.
ఇదిలా వుండగా ఇంద్రుడు మొదలుగాగల దిక్పాలకులు కోలాహలుడి
దగ్గరికి వచ్చారు. శుభకార్య నిర్వహణకు వస్తున్న ఇంద్రుడికి కోలాహలుడు స్వాగతం
పలికాడు. ఇంద్రుడికి అతిథి పూజ చేశాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. తన ఉన్నతికి
తగినట్లుగా ఇంద్రుడిని గౌరవించాడు. ఆయన వెంట వచ్చిన వారందరినీ పలకరించి,
మన్నించి, గౌరవించాడు. తన కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు.
తండ్రి ఆదేశం ప్రకారం గిరిక అందరికీ నమస్కారం చేసింది. అంతా ఆమె చక్కదనాన్ని, సౌందర్యాన్ని చూసి మెచ్చుకున్నారు. గిరికకు తగిన వరుడు ఒకడున్నాడని అంటూ, ఇంద్రుడు, వసురాజు గురించి చెప్పాడు. అలాంటివాడు
అల్లుడు కావడం కంటే అదృష్టం ఇంకేమి వుంటుందని అన్నాడు. కోలాహలుడు ఆ మాటలకు
కృతజ్ఞతాపూర్వకంగా ఇంద్రుడి వైపు చూశాడు. తనకు ఇంతకన్నా సౌభాగ్యం ఏముందని అన్నాడు.
ఇంద్రుడి స్నేహితుడైన వసురాజుకు తన కూతురును ఇచ్చి వివాహం జరిపించమని వేడుకున్నాడు
కోలాహలుడు.
అంతకు ముందే అక్కడికి చేరుకున్న శుక్తిమతీదేవి, ఆమెతో
పాటు వచ్చిన ఇతర నదీకాంతలు (నర్మద, గంగ, వాఘిరా, యమునా,
రుద్రాంఘ్రిజ, తామ్రపర్ణి, పినాకిని, శీతాద్రిజాత) గిరిక వైభవానికి సంతోషపడ్డారు. హిమవంతుడు మేనక సమేతంగా
వచ్చాడు. మైనాకుడు సముద్ర గర్భం నుండి పైకి వచ్చాడు. మేరు,
మందర పర్వత శ్రేష్ఠులు వచ్చారు. ఇంకా ఎందరో గిరిక వివాహం చూడడానికి వచ్చారు. ఆ
పర్వతం మొత్తం పెద్ద పట్టణంగా తయారైంది. ఆ రాత్రే వివాహానికి ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించమని,
వదూవరులకు శుభం కలిగే విధంగా ఆశీర్వదించమని దేవేంద్రుడు తన గురువు బృహస్పతిని కోరాడు.
వివాహానికి మిథున లగ్నం అనుకూలం అన్నాడు బృహస్పతి.
ఇంద్రుడు ఆ తరువాత వసురాజు దగ్గరికి వెళ్లాడు. వాస్తవానికి
వసురాజు ఆయనకొరకు ఎదురు చూస్తున్నాడు. తనకు పాదాభివందనం చేసిన వసురాజును
ఆశీర్వదిస్తూ ఇంద్రుడు, ఆయన్ను “పెండ్లికొడుకువు అగుదువుగాక” అని అన్నాడు. కోలాహలుడి దగ్గర
జరిగిన విషయాలన్నీ చెప్పి, ఆ రాత్రే ముహూర్తమని అంటూ
అక్కడికి బయల్దేరమన్నాడు. వెంటనే రాజాజ్ఞప్రకారం అధిష్టానపురం స్వర్గధామం లాగా
అలంకరించడం జరిగింది. వసురాజును దేవతాస్త్రీలు పెండ్లికొడుకును చేశారు. ఆ తరువాత
ఆయన వివాహ వేదిక దగ్గరికి వచ్చాడు. సమస్త అలంకారాలతో పెళ్లికూతురుగా తయారైన గిరిక
కూడా వివాహ వేదిక మీదికి వచ్చింది. ఆమె లక్ష్మీదేవిలాగా శోభాయమానంగా ఒప్పుతున్నది.
దిక్పాలకుల భార్యలంతా గిరికాదేవికి వివాహ సమయంలో అలంకార
విశేషాలను కానుకలుగా పంపారు. అంతకు ముందే వసురాజును అలంకరించారు. గిరిజావసురాజుల
వివాహం చూడడానికి సంధ్యాదేవి వచ్చింది. ఇంతలో లగ్నం సమీపించింది. సరస్వతీదేవి
వసురాజును చూడడానికి వచ్చింది. గిరిక, వసురాజులు శ్రీ మహాలక్ష్మి, విష్ణుమూర్తి లాగా వున్నారు. సుముహూర్తం కాగానే కోలాహల రాజు, వసురాజుకు
తన కూతురును కన్యాదానం చేశాడు. బృహస్పతి మంత్రాలు చదివాడు. గిరిక కంఠానికి వసురాజు
మంగళ సూత్ర ధారణ చేశాడు. బృహస్పతి శుభాశీస్సులు పలికాడు. వధూవరులు తలంబ్రాలు
పోసుకున్నారు. ఆ తరువాత వారి వివాహ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన వారందరికీ
విందులు చేశారు.
వసురాజు, గిరిక ఈ విధంగా ఇంద్రుడి ప్రేరణ వల్ల
వివాహితులయ్యారు. పెళ్లి నాలుగు రోజులు పూర్ణాహుతులు మొదలైన హోమక్రియలు చక్కగా
జరిగాయి. దేవతలు సంతృప్తిచెందారు. వదూవరులకు ఎన్నో వరాలిచ్చారు. దీవెనలిచ్చారు.
కానుకలిచ్చారు. ఇంద్రుడు వసురాజుకు
దివ్యమైన వేణు దండాన్ని ఇచ్చాడు. అది శతకోటి వజ్రాయుదాలకు సమానమని చెప్పాడు.
కోలాహల పర్వతరాజు, శుక్తిమతీదేవి, వసురాజు వివాహ మహోత్సవానికి వచ్చిన ఇరుపక్షాల
బంధువులను తగురీతిగా సత్కరించారు. అత్తగారింటికి వెళ్లనున్న గిరికకు అన్ని రకాల
సలహాలు, సూచనలు ఇచ్చింది తల్లి శుక్తిమతీదేవి.
అంపకాలైన తరువాత వసురాజు గిరికతో కలిసి విమానం ఎక్కి
ఆకాశమార్గంలో తన నగరానికి ప్రయాణమయ్యాడు. ఆ తరువాత రాజ గృహానికి చేరుకున్నారు.
క్రమంగా సమస్త ప్రజలచేత కొనియాడబడుతూ వసురాజు శుభ సంపదలతో వెలగసాగాడు. వసురాజు,
గిరిక, రతీమన్మథుల్లాగా; వాణీవిరించులలాగా; శచీసురేంద్రుల
లాగా; లక్ష్మీనారాయణుల్లాగా సుఖ సంతోషాలతో కాలం గడిపారు.
వసురాజు గిరిక పట్ల నిరంతరాసక్తితో మెలుగుతూ వున్నాడు. అతడి కీర్తి దశదిశలా
వ్యాపించింది. అతడి జయలక్ష్మి, రాజ్యలక్ష్మి సుస్థిరంగా, ఐశ్వర్యంతో అలరారింది.
(జయంతి పబ్లికేషన్స్ వారి కమలాసనుడు వచన రచన ఆధారంగా)
No comments:
Post a Comment