మరోమారు చూస్తాం ‘స్మార్ట్ పరిపాలన’
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (02-07-2024)
{ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబునాయుడు చొరవతో రూపుదిద్దుకున్న ఓఎంఆర్ ఫార్మాట్ ఆధారిత ‘శిక్షణ అవసరాల విశ్లేషణ’ అనతికాలంలో, బృహత్తరమైన (State Training Initiative) ‘స్టేట్ ట్రైనింగ్ ఇనిషియేటివ్’ (ఎస్‌టిఐ) కు మార్గం సుగమం చేసి, ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ ను ఒక విశిష్టమైన ‘కెపాసిటీ, కాపబిలిటీ బిల్డింగ్’ అభివృద్ధి సంస్థగా మార్చి వేసింది.} – సంపాదకుడి క్లుప్త వ్యాఖ్యానం
విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా
చంద్రబాబునాయుడు,
రెండవ పర్యాయం బాధ్యతలు స్వీకరించిననాడు తనను కలిసిన అఖిలభారత
సర్వీస్ అధికారులతో జరిపిన క్లుప్త సమావేశంలో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై
సున్నితంగా స్పందిస్తూ, తనదైన శైలిలో విమర్శించారు. ఉమ్మడి
అంధ్రప్రదేశ్, ప్రస్తుత అంధ్రప్రదేశ్ రాష్టంలో, తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పనిచేసిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో
సహా పలువురు నిబద్ధతకలవారి సమర్థతను, నిజాయితీని, పనితీరును దెబ్బతీసే విధంగా పరిపాలన సాగిందని ఆయన చెప్పారు. గత
ప్రభుత్వాలమీద విమర్శలు చేసే పద్ధతిలో ఒక సరికొత్త సాంప్రదాయాన్ని చంద్రబాబునాయుడు
నెలకొల్పారనాలి. పాలానపరమైన నైతిక విలువలను పాటించే వ్యక్తైన చంద్రబాబునాయుడు
గురించి, ముఖ్యంగా ఉమ్మడి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా
పనిచేసిన రోజులనాటి ఆయన ‘స్మార్ట్ (SMART) పాలన’ (సింపుల్,
మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్,
ట్రాన్స్పరెంట్) గురించి తెలిసిన కొందరికి మాత్రమే, బహుశా అయన సద్విమర్శలు సులభంగా
అర్థం అవుతాయి.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి (ఎంసీఆర్
హెచ్ఆర్డీ ఇన్‌స్టిట్యూట్) సంస్థలో, 9 సంవత్సరాలు ఫ్యాకల్టీ సభ్యుడిగా, అదనపు
డైరెక్టర్ గా పనిచేసిన నాకు, సరిగ్గా అదే 9 సంవత్సరాలు సిఎంగా వున్న చంద్రబాబునాయుడుకు,
‘స్మార్ట్ పాలన’ను, దానిపట్ల పట్ల ఆయనకు వుండే అసాధారణమైన
ఆసక్తిని, విషయ సామర్థ్యాన్ని, నిబద్ధతను సమీపంగా పరిశీలించే
అవకాశం కలిగింది. అప్పటి ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ (డిజీ) పీవీఆర్‌కే
ప్రసాద్, అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడీజీ) ఊర్మిళాసుబ్బారావు,
తదితర అధికారుల తోడ్పాటుతో, తనదైన దార్శనికతతో, అనాథగా ఉన్న ఐఓఏ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్) ను మాజీముఖ్యమంత్రి
చెన్నారెడ్డి మరణానంతరం, డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ గా పేరుమార్చి,
ప్రపంచ ‘మానవ అభివృద్ధి, శిక్షణా కేంద్రాల’ లో
అగ్రస్థానంలో నిలిపిన ఘనత ముమ్మాటికీ చంద్రబాబునాయుడుదే.
ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థీకృత శిక్షణ, తద్వారా వారి
పనితీరు, సామర్థ్య పెంపుదలకు సంబంధించి, జాతీయ శిక్షణా
విధానం (నేషనల్ ట్రైనింగ్ పాలిసీ-ఎన్‌టిపి) మార్గదర్శకాలకు అనుగుణంగా, చంద్రబాబునాయుడు విలువైన సమయాన్ని కేటాయించారు. ఒకసారి, నేను ఎడీజీ (అప్పటికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషనే అది) ఊర్మిళాసుబ్బారావు,
1996 సంవత్సరాంతంలో, ఇన్స్టిట్యూట్ సందర్శనకు వచ్చిన ‘ఓడిఎ’ (డిఎఫ్ఐడి) ప్రతినిధివర్గంతో
సీఎం చంద్రబాబునాయుడిని కలిసినప్పుడు, రాష్ట్ర ప్రయోజనాల
దిశగా, ఆ ప్రతినిధివర్గం సభ్యులతో ఆయన ముఖ్యమైన ఒక విషయాన్ని
ప్రస్తావించారు. ‘ఐఓఏ’ ను సుపరిపాలన కేంద్రంగా, తత్సంబంధమైన
జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ విధానాలను గుర్తించే సంస్థగా అభివృద్ధి
చేయడానికి నిధులు సమకూర్చమని అడిగారు. ప్రతినిధివర్గం సూచనప్రాయంగా అంగీకరించి, తక్షణ ప్రతిపాదనలు ఇవ్వమని కోరారు.
ఊర్మిళాసుబ్బారావు ప్రారంభ ప్రతిపాదనను తయారు చేశారు. ఉహించని
రీతిలో, ఆ ప్రాధమిక ప్రతిపాదన, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
సూచనలు, సలహాలతో, మార్పులు-చేర్పులు
జరిగి, 2001 సంవత్సరంలో ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్
(సీజీజీ)’ స్థాపనకు దారితీసింది. ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ విశాలమైన
ప్రాంగణంలో, డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (డిఎఫ్ఐడి), ప్రపంచ
బ్యాంక్ సంయుక్త ఆర్ధిక సహకారంతో రూపుదిద్దుకున్న, అప్పటి ప్రామాణికాల ప్రకారం, అత్యాధునిక ‘సుపరిపాలన కేంద్రం’ భవన సముదాయాన్ని నాటి బ్రిటన్ ప్రధానమంత్రి
టోనీ బ్లేర్ ప్రారంభించి, క్యాంపస్ ఆవరణలో చాలా సమయం గడిపి,
చంద్రబాబునాయుడుతో ఇన్‌స్టిట్యూట్ అతిధిగృహంలో కాసేపు ద్వైపాక్షిక సమావేశమయ్యారు.
సిఎం చంద్రబాబునాయుడుతో, నేను ఎడీజీ ఊర్మిళాసుబ్బారావు జరిపిన
మరో సమావేశంలో ఎడీజీ సూచనను సూత్రప్రాయంగా
అంగీకరించిన సీఎం, ఉన్నతోద్యోగుల నుండి జూనియర్ అసిస్టెంట్ల దాకా వున్న సుమారు ఐదు
లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులందరి ‘శిక్షణ అవసరాల విశ్లేషణ (Training Needs Analysis)’ కోసం ఓఎంఆర్
(ఆప్టికల్ మార్క్ రీడర్) షీట్ల ద్వారా విషయ సేకరణ జరిపి,
జాతీయ శిక్షణా విధానానికి (NTP) అనుగుణంగా, ‘(టీఎఫ్‌ఎ) Training For All’ (ప్రతి ఉద్యోగికీ శిక్షణ విధానాన్ని) అమలు చేయాలని నిర్ణయించారు. అంతవరకు
ఐఓఏకి శాస్త్రీయమైన శిక్షణా విధానంకానీ, ఉద్యోగుల
శిక్షణావసరాలకు అనుగుణంగా, శిక్షణా కార్యక్రమాల అమలుకానీ,
జరగడం లేదు.
అలా అలనాడు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబునాయుడు చొరవతో
రూపుదిద్దుకున్న ఓఎంఆర్ ఫార్మాట్ ఆధారిత ‘శిక్షణ అవసరాల విశ్లేషణ’ అనతికాలంలో, బృహత్తరమైన
(State Training Initiative) ‘స్టేట్
ట్రైనింగ్ ఇనిషియేటివ్’ (ఎస్‌టిఐ) కు మార్గం సుగమం చేసి, ఎంసీఆర్
హెచ్ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ ను ఒక విశిష్టమైన ‘కెపాసిటీ, కాపబిలిటీ బిల్డింగ్’ అభివృద్ధి
సంస్థగా మార్చి వేసింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి కనీసం 60 గంటల శిక్షణను
అందించే సామర్థ్యాలను సమకూర్చే దిశగా, రాష్ట్ర ప్రభుత్వ మానవ
వనరుల అవసరాలను తీర్చడానికీ, మానవ వనరులను అభివృద్ధి చేసే బాధ్యతను డాక్టర్
ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ కు అప్పగించారు.
ఇన్‌స్టిట్యూట్ శిక్షణ గదులు, వీడియో కాన్ఫరెన్స్
హాల్, మూడంతస్తుల బిల్డింగ్ కాంప్లెక్స్ విస్తరణ, ప్రపంచ స్థాయి ఆడిటోరియం, అతిధి గృహాలు, హాస్టల్ సదుపాయాలు, మైక్రోసాఫ్ట్ ఐటీ అకాడమీ లాంటి సౌకర్యాల
కల్పన చేసి, సంస్థను ‘స్టేట్ ఆఫ్
ఆర్ట్’ స్థాయికి తెచ్చారు. అప్పటికీ, ఇప్పటికీ, బహుశా ఎప్పటికీ, చంద్రబాబు నాయుడు, డిజీ పీవీఆర్‌కే ప్రసాద్, ఎడీజీ ఊర్మిళాసుబ్బారావుల ‘ఇంప్రింట్’ సంస్థమీద స్పష్టంగా
కనిపిస్తుంది.
‘స్టేట్ ట్రైనింగ్ ఇనిషియేటివ్’ ప్రారంభించిన తొలినాళ్లలో,
దానిని శాస్త్రీయంగా అమలుపరచడానికి, ‘శిక్షణా నైపుణ్యం, ఉన్నత స్థాయి-శ్రేణి అర్హతలున్న ఒక ప్రధాన శిక్షకుని (మాస్టర్ ట్రయినర్)’
కోసం ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ ప్రయత్నాలు చేసింది. అప్పట్లో, బ్రిటన్ ‘థేమ్స్ వ్యాలీ యూనివర్శిటీ’ లో శిక్షణ పొంది, అలాంటి అర్హతలు
కలిగివున్న వారు, భారత దేశం మొత్తంలో కేవలం 8 మంది మాస్టర్ ట్రయినర్లు మాత్రమే
వుండేవారు. వారందరిలో, ఇండియన్ నావల్ స్టోర్స్ మేనేజ్మెంట్ సర్వీస్‌లో సీనియర్
స్థాయి ఉద్యోగిగా, అప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక
శిక్షణా సంస్థ ‘ఐఎస్టీఎం’ లో డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న, ‘టాప్ ర్యాంకర్
మాస్టర్ ట్రైనర్’ ఎంపీ సేథి సేవలను ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఉపయోగించుకోవడానికి డిజీ పీవీఆర్‌కే
ప్రసాద్ ప్రతిపాదనలను పంపించారు. ఆ ప్రతిపాదన సాఫల్యం కావడంలో జాప్యం కలిగితే, పీవీఆర్‌కే అభ్యర్ధన మేరకు, నాటి రక్షణ మంత్రి మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్
తో సిఎం చంద్రబాబునాయుడు స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఇన్‌స్టిట్యూట్ లో సీనియర్
స్థాయిలో ఆయన చేరిక, ఇన్‌స్టిట్యూట్ శిక్షణా సామర్థ్యతను ఆకాశమే హద్దుగా చేసింది.
ఉద్యోగుల శిక్షణను ప్రాధాన్యతా అంశంగా నిర్ద్వందంగా
గుర్తించిన చంద్రబాబునాయుడు, అది సఫలం కావడానికి, వివిధ శాఖాధిపతుల, సీనియర్ ఐఏఎస్
అధికారుల నిబద్ధతను కాంక్షిస్తూ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు, నేను, సేథి
ఉమ్మడిగా డిజైన్ చేసినదే మూడురోజుల వర్క్ షాప్ మాడ్యూల్ ‘ఓరియంటేషన్ టు మేనేజ్‌మెంట్
ఆఫ్ ట్రైనింగ్ (ఓఎంఓటి).’ సిఎం చంద్రబాబునాయుడు, డిజీ పీవీఆర్‌కే ప్రసాద్ కనుసన్నులలో
నిర్వహించిన 15-16 వర్క్ షాపులకు సుమారు 200 ఐఏఎస్, ఐపీఎస్,
నాన్-కాడర్ అధికారులు హాజరయ్యారు.
‘ఉద్యోగులందరికీ శిక్షణ’ అన్న భావన,
సిద్దాంతం, విధాన నిర్ణయం, కేవలం ఉద్యోగులకు మాత్రమే పరిమితం
చేయలేదు చంద్రబాబునాయుడు. ఆయన సూచన, సలహా మేరకు, పాలనా వ్యవహారాలకు సంబంధించిన వివిధ అంశాల గురించి,
1999 ఎన్నికల తరువాత, ముఖ్యమంత్రి సహా మొత్తం రాష్ట్ర మంత్రిమండలి,
హెచ్ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ లో మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నది.
డిజీ పీవీఆర్‌కే ప్రసాద్, ఎడీజీ ఊర్మిళాసుబ్బారావు
ఆధ్వర్యంలో జరిగిన ఆ శిక్షణా కార్యక్రమానికి నేను సహితం కోఆర్డినేట్ చేశాను.
హార్వార్డ్ విశ్వవిద్యాలయంకు చెందిన మేనేజ్‌మెంట్ (గురు) నిపుణుడు,
పద్మ భూషణ్ అవార్డు గ్రహీత,
కొయంబత్తూర్ కృష్ణా రావు ప్రహ్లాద్ (సీకే ప్రహ్లాద్) అప్పట్లో డాక్టర్
ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ ను సందర్శించినప్పుడు, చంద్రబాబునాయుడు
చేసిన ఐటీ రంగ అభివృద్ధిని, ప్రోత్సాహకాలను, పరిపాలనలో టెక్నాలజీ, ఇ-గవర్నెన్స్ వినియోగాన్ని, ప్రజా సేవలను మెరుగుపర్చడాన్ని, ఆర్థిక అభివృద్ధి
చేయడాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అగ్రస్థానంలో నిలపడాన్ని
అభినందిస్తూ, ప్రసంశల వర్షాన్ని కురిపించారు. ప్రస్తుత
అంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా చంద్రబాబునాయుడు, అదే విధానాన్ని మరింత వేగవంతం చేస్తూ,
25 సంవత్సరాల క్రితం ఆయన చొరవతో రూపుదిద్దుకున్న సంస్కరణలను వర్తమాన
అవసరాలకు అనుగుణంగా, పునఃపరిశీలించి అమలుచేస్తే మంచిదేమో.
No comments:
Post a Comment