Monday, July 8, 2024

శంభళ గ్రామంలో పుట్టబోయే ‘కల్కి’ ఎవరు? ....... సుమతి లాబ్ గర్భస్థ శిశువా? ‘దేవప్రభ-హరివ్రతుల’ సంతానమా? : వనం జ్వాలా నరసింహారావు

 శంభళ గ్రామంలో పుట్టబోయే ‘కల్కి’ ఎవరు?

సుమతి లాబ్ గర్భస్థ శిశువా? ‘దేవప్రభ-హరివ్రతుల’ సంతానమా?

 వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (09-08-2024)

          ఇటీవలికాలంలో, బహుశా ఏ సినిమా గురించి, ఎప్పుడు కూడా జరగనంతటి పెద్ద మోతాదులో, భిన్నాభిప్రాయాలతో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్న ‘కల్కి’ సినిమాను చూసాం. సినిమాలు బాగా చూసే అలవాటు వున్నవారు, టైటిల్స్ వేయడం దగ్గరనుండి, కళాకారుల ఎంపిక, హావభావాల విషయాలతో సహా, ప్రతి సన్నివేశాన్ని, అంశాన్నీ నిశిత దృష్టితో చూస్తుంటారు. సినిమా తనకు నచ్చిన విధంగా వుండాలని కోరుకోవడం తప్పు కాదు. నాలాంటి వారికి మాత్రం సినిమా రెండు-మూడు గంటల ఆహ్లాదం, ఆనందం, సమయ వినియోగం. ఇది ‘కల్కి సినిమా తప్పొప్పులు ఎంచే సమీక్ష కాదు. అద్భుతమైన ఇదే సినిమాను, మరింత అద్భుతంగా ఎలా నిర్మించే వీలుందో తెలియచేసే అభిప్రాయం మాత్రమే. ‘కల్కి రెండవ భాగం లో, దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు.

కల్కి అని అందరూ అంటున్న ‘కల్కి 2898 ఏడీ’ చూస్తుంటే అర్థమయ్యేది, ఇంచుమించు అదొక తరహా ‘డిస్టోపియన్ థీమ్’ అనే విషయం. అవసరమైన మేరకు చేసిన అనుకరణ ప్రయత్నంలో భాగంగా నిర్మించిన పురాణ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ తెలుగు సినిమా కల్కి. తెలుగు సినిమారంగ దిగ్గజమైన వైజయంతీ ఫిల్మ్స్ అధినేత అశ్వనీ దత్ నిర్మాణంలో, యువదర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలో, హేమాహేమీలైన నటీనటులు, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశాపటానీ, రాజేంద్రప్రసాద్, పశుపతి, అన్నా బెన్, శోభన తదితరులు నటించారు.

ల్యాబ్ ద్వారా గర్భిణి (కల్క్యావతారం గురించిన ప్రస్తావన వున్న భాగవత, రామాయణాలలో సహజంగా తల్లితండ్రులకు పుట్టబోయే బిడ్డగానే పేర్కొనడం దీనికి విరుద్ధం) అయిన ఎస్యుఎమ్-80 (సుమతి) కి ‘కల్కి గా పుట్టబోయే బిడ్డను, పౌరాణిక కాలంనాటి ‘అశ్వత్థామ మహాభారత యుద్ధ కాలంనాడు శ్రీకృష్ణుడి ఆజ్ఞాసుసారం రక్షించే లక్ష్యం, దాన్ని విచ్చిన్నం చేయడానికి ‘సుప్రీం యస్కిన్ ప్రయత్నాలు ఈ కల్కి సినిమా కథ సెంట్రల్ థీమ్. సినిమా ఆసాంతం వినిపించే, కనిపించే పేర్లు, దృశ్యాలలో ప్రధానంగా సుప్రీం యస్కిన్, కాంప్లెక్స్, అందులో ప్రవేశానికి మిలియన్ యూనిట్లు, కమాండర్ మానస్, కౌన్సిలర్ బాని, ఎస్యుఎమ్-80 లేదా సుమతి, భైరవ, కృత్రిమ మేథస్సు-బుజ్జి, అశ్వత్థామ, మరియమ్, మరికొన్ని వున్నాయి. నటుడు ప్రభాస్ భైరవ పాత్రను కర్ణుడిగా సూచించడం సినిమా ప్రీక్లైమాక్స్ లో చూపించారు.

సినిమా మొదటి భాగం పతాక సన్నివేశంలో, సుమతి కృత్రిమ గర్భం నుండి సేకరించిన సీరం ఒకేఒక చుక్కను సుప్రీం యస్కిన్ తన శరీరంలోకి పంపడం, తక్షణమే దాని ప్రభావం వల్ల అప్పటికే ఒక ‘సూపర్ హ్యూమన్ గా వున్న అతగాడు మరింత ‘యవ్వన సూపర్ హ్యూమన్ గా రూపాంతరం చెందడం, అంతకు పూర్వమే కౌన్సిలర్ బానికి దొరికిన ‘అర్జునిడి గాండీవాన్ని’ అతడు సునాయాసంగా పైకెత్తడం, (లోగడ అది దొరికిన తరువాత కొంతకాలానికి లేపడానికి ఎవరికీ సాధ్యపడలేదు!!!), తన లాబ్ నుండి ఐదు నెలల గర్భిణిగా తప్పించుకుని శంభాలకు వెళ్లిన సుమతిని తానే స్వయంగా వెనక్కు తెస్తానని ప్రకటించడం, ఆ తరువాత ప్రపంచాన్ని పునర్నిర్మాణం చేస్తాననడం ప్రధానాంశాలు. సుప్రీం యస్కిన్ ను  ‘కంసుడు అని, కాదు .... కాదు, ‘కలి అని భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి, ఇంకా వెల్లడవుతూనే వున్నాయి.

వాస్తవానికి  ‘అర్జునిడి గాండీవం మహాభారత సంగ్రామం తరువాత, మరీ ముఖ్యంగా శ్రీకృష్ణుడి నిర్యాణం తరువాత, అతడు ప్రయోగించినప్పుడే విఫలమైంది. శ్రీకృష్ణుడి పదహారువేలమంది భార్యలను, అష్టభార్యలను, ఇతర ద్వారకావాసులందరినీ ఆ నగరం దాటించి అర్జునుడు తీసుకుపోతున్నప్పుడు  మార్గమధ్యంలో వారి ఆభరణాలను గజదొంగలు అపహరించడం జరిగింది. మహాభారత యుద్ధాన్ని ఒక్కతాటిమీద గెలిపించిన అర్జునుడి ‘గాండీవ ప్రయోగం’ ఆ సాధారణ కిరాతకులను ఏమీ చేయలేక పోయింది. దైవం ప్రతికూలంగా వుండడం వల్ల అర్జునుడికి ఆ సమయంలో ఒక్క మంత్రం కూడా స్ఫురణకు రాలేదు. ‘సుప్రీం యస్కిన్ కు అదెలా (కల్కి రెండవ భాగంలో) ఉపయోగపడనున్నదో వేచి చూడాలి. ఆయన పక్షాన వున్న ఆ దైవమెవరో నిర్మాత-దర్శకులు వివరిస్తారేమో బహుశా. సినిమా వేరు, వాస్తవం వేరా? ఏమో!

వాల్మీకి రామాయణంలో ‘కల్కి ప్రస్తావన వున్నది. స్వాయంభువ మనువు ప్రార్థన మేరకు ఆయన దశరథుడిగా పుట్టినప్పుడు భగవంతుడు ‘శ్రీరాముడు’ గా పుత్రుడయ్యాడు. యదువంశంలో వసుదేవుడిగా పుట్టినప్పుడు ‘శ్రీకృష్ణుడు’ గా ఆయనకు పుత్రుడయ్యాడు. మూడోజన్మలో ‘శంభళ గ్రామం’ లో, కలియుగంలో, నాలుగోపాదంలో, హరివ్రతుడనే బ్రాహ్మణుడికి ‘కల్కి’ గా పుట్టగలడు. మనువు భార్య సుశీల, కౌసల్య పేరుతో దశరథుడికి, దేవకి పేరుతో వసుదేవుడికి, దేవప్రభ పేరుతో హరివ్రతుడికి భార్యగా వుండి, మూడు జన్మలలో విష్ణుమూర్తికి తల్లి అవుతుంది. శంబళ-సంబళ-శంభళ-సంభల అనే రూపాంతరాలు కూడా శంబళ గ్రామానికున్నాయి. కలియుగం కాలపరిమాణం 432000 సంవత్సరాలని అంటారు. 5,125 సంవత్సరాలు గడిచాయని అంచనా. కల్కి అవతారం (నమ్మితే) జరిగేది కలియుగాంతంలోనే. దానికి ఇంకా 4,26,875 సంవత్సరాలు మిగిలివుంది. ‘2898 ఏడీ’ సంవత్సరంలో కల్కి అవతారం అన్న భావన సరైనదేనా? ఏమో!

అలాగే (వేదవ్యాస) బమ్మెర పోతనామాత్య శ్రీమద్భాగవతంలో, అశ్వత్థామ ప్రయోగించిన ‘బ్రహ్మశిరోనామ అస్త్రం’ బారినుండి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భస్థ శిశువును వాసుదేవుడు (శ్రీకృష్ణుడు) రక్షించాడు. శిశువు జననమప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బాణాన్ని ఎదుర్కోవడానికి, అంగుష్ఠమాత్ర దేహంతో, గద ధరించి విష్ణువు శిశువు ముందు ఆవిర్భవించాడు. గదను గిరగిరా తిప్పుతూ, బాణాగ్నిని గదతో ముక్కలు చేసి, శిశువుకు రక్షణ కలిగించి అదృశ్యమయ్యాడు. ఉత్తరకు పుట్టిన కుమారుడే ‘పరీక్షిత్తు. ఆ విధంగా వేదవ్యాస-పోతన భాగవతంలో గర్భస్థ శిశువును దైవం కాపాడిన విధానం స్పష్టం చేసిన సందర్భం ఇది. కల్కి సినిమాలో ‘అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) సుమతి గర్భస్థ శిశువును కాపాడబోయే సన్నివేశాన్ని నిర్మాత-దర్శకులు ఎలా చూపబోతున్నారనేది కూడా ఆసక్తి కలిగించే విషయమే!

వాస్తవానికి ‘కలి ప్రవేశం ఈ పాటికే జరిగింది. బహుశా సినిమాలో ‘సుప్రీం యస్కిన్ కలి పాత్ర కావచ్చునేమో! ధర్మరాజు స్థానంలో పట్టాభిషిక్తుడైన పరీక్షిత్తు కలియుగారంభంలోనే ‘కలిని’ శిక్షించాడని భాగవతం చెప్తున్నది. ఒకనాడు, ధర్మదేవుడు వృషభ రూపాన్ని ధరించి ఒంటికాలితో సంచరిస్తూ, ఆవు రూపంలో కన్నీరు కారుస్తున్న భూదేవితో సంభాషించుకునే సమయంలో, పరీక్షిన్మహారాజు అక్కడికి వచ్చాడు. అయన చూస్తుండగానే, వృషభాన్ని, గోవును రాజు వేషంలో ఉన్న క్రూరుడు (కలి), తన్నడంతో అవి నేలమీద పడిపోయాయి. వెంటనే పరీక్షిత్తు తన ఖడ్గంతో ‘కలి’ ని చంపడానికి ప్రయత్నించాడు. వాడప్పుడు తన రాజవేశాన్ని విడిచి పరీక్షిత్తు పాదాలమీద పడి చంపవద్దని ప్రాధేయపడగా, వాడిని మందలించి వదిలాడు.

ద్వాపర యుగం ముగిసి కలియుగం వచ్చిన తరువాత, కల్క్యావతార సూచన, కలి ప్రభావం వల్ల ధర్మచ్యుతి ఎలా జరగనున్నది అనే విషయాలను భాగవతంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. వర్ణ ధర్మాలను, ఆశ్రమ ధర్మాలను కూలదోసి ధర్మభ్రష్టులై ప్రజలు సంచరిస్తారని చెప్పబడింది. ధర్మం పూర్తిగా అడుగంటినప్పుడు, ముకుందుడు, తన భక్తుల కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం,శంభల’ అనే గ్రామంలో ‘విష్ణుయశుడు’ (వాల్మీకి రామాయణంలో పేర్కొన్న హరివ్రతుడు) అనే బ్రాహ్మణుడికి కుమారుడిగా కల్కి రూపంలో అవతరించి, సమస్త దేవతా సమూహం ఎదురు చూస్తుంటే, దేవదత్తమనే మహాశ్వాన్ని అధిరోహించి, శిష్టాచార విహీనులైన వారిని తన ఖడ్గంతో ఖండఖండాలుగా నరికి వేసి, ధర్మ రక్షణ చేస్తాడని వున్నది.  

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత, కృపాచార్యుడు, కృతవర్మ తోడురాగా, అశ్వత్థామ, పాండవుల శిబిరానికి వెళ్లి, ద్రౌపది ఐదుగురు కొడుకులతో సహా, అక్కడలేని శ్రీకృష్ణుడు, సాత్యకి, పాండవులు తప్ప అందరినీ చంపాడు. దానికి ప్రతిగా, అశ్వత్థామకు పుట్టుకతోనే వున్న ‘శిరోమణి ని తెచ్చి ఇవ్వమని పాండవులను కోరింది ద్రౌపది. భీముడు, నకులుడు, ధర్మరాజు, అర్జున సమేతంగా కృష్ణుడు, అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలు వెళ్ళిన వ్యాసాశ్రమానికి అశ్వత్థామ కొరకు బయల్దేరాడు.

అశ్వత్థామ, అర్జునుడు ద్రోణుడు ఇచ్చిన ‘బ్రహ్మశిరోనామకాస్త్రాలను ప్రయోగించడంతో ప్రళయం చోటుచేసుకున్నది. అప్పుడు వ్యాసుడు, నారదుడు అక్కడికి వచ్చి ఇరువురిని శాంతింప చేసి, వారి అస్త్రాలను ఉపసంహరించేట్లు చేశారు. తన శిరోమణిని పాండవులకు ఇవ్వమని, అలా చేస్తే అశ్వత్థామ ప్రాణాలు తీసినంతగా వారు సంతోషిస్తారని వ్యాసుడు రాజీ మార్గాన్ని సూచించాడు. అశ్వత్థామ తన అస్త్రం పాండవేయుల గర్భాలకు హాని కలిగించి తృప్తి పడి ఉపశమిస్తుంది గాక! అని అన్నాడు. పాండవుల సంతానం తాలూకు గర్భాలన్నింటి మీద అస్త్రం విడిచి పెట్టడం చూశాడు శ్రీకృష్ణుడు. పాండవ వంశం నిలబెట్టేందుకు తాను ఒకడిని (ఉత్తర గర్భం) రక్షిస్తానని స్పష్టం చేశాడు శ్రీకృష్ణుడు.  

తన మాటలు లక్ష్యపెట్టని అశ్వత్థామను ఉద్దేశించి శ్రీకృష్ణుడు, పిల్లలను చంపిన అతడిని ఆహారం లేకుండా, నిస్సహాయుడుగా, కంపుకొట్టే రక్తంతో, శరీరం కాలిపోతుంటే వేల సంవత్సరాలు తిరుగుతాడని అన్నాడు. కల్కి సినిమాలో ‘అశ్వత్థామ’ పాత్రలో అమితాబ్ బచ్చన్ ను చూస్తుంటే శ్రీకృష్ణుడి శాపం జ్ఞప్తికి రాకమానదు. (సినిమాలో శపించిన తీరు వేరే విధంగా వున్నది. అశ్వత్థామను పుట్టబోయే ‘కల్కి గర్భాన్ని కాపాడమని అన్నట్లు చూపారు. నిజమేమో!) అశ్వత్థామ తన ‘శిరోమణి’ని పాండవులకు ఇచ్చి తపోవనానికి వెళ్లాడు. భీముడు శిరోమణిని ద్రౌపదికి ఇవ్వగా, ఆమె ధర్మరాజుకు ఇచ్చింది. సందేహం అల్లా, ధర్మరాజు దగ్గరున్న అలనాటి శిరోమణి, కల్కి సినిమాలో ‘రాయ’ అనే అమ్మాయికి ఎలా లభించింది అని?

శంభల ప్రస్తావన; కల్క్యావతార సూచన, కల్కి తల్లితండ్రులు దేవప్రభ-హరివ్రతుడి పూర్వ జన్మ వృత్తాంతం; దైవ సహాయం లేనప్పుడు అర్జునిడి గాండీవం నిరుపయోగం; ఉత్తర గర్భస్థ శిశువును దైవం కాపాడినవిధానం; అశ్వత్థామ శిరోమణి, బ్రహ్మశిరోనామకాస్త్రం, ఆహారం లేకుండా, నిస్సహాయుడుగా, కంపుకొట్టే రక్తంతో, శరీరం కాలిపోతుంటే వేల సంవత్సరాలు తిరిగే నేపధ్యం లాంటి విషయాలన్నీ రామాయణ, భారత, భాగవతాలలో పేర్కొనడం జరిగింది. వీటిని యథాతథంగా కాకపోయినా సందర్భోచితంగా, సినిమాటిక్, థిమాటిక్ గా, ప్రేక్షకుల ఆసక్తినిబట్టి,  ‘కల్కి సినిమాలో వీక్షించే అవకాశం సినిమా చూసినవారికి కలుగుతుంది.

హెచ్ జి వెల్స్ టైమ్ మెషిన్ అనే 1895 నాటి డిస్టోపియన్ నవలలో, భవిష్యత్తులో సుమారు 800,806 సంవత్సరాలు ఒక ప్రత్యేక వాహనం ఉపయోగించి ప్రయాణం చేయడం, ‘కల్కి’ సినిమాలో కనిపించిన రూమీస్ ట్రక్, బుజ్జి, లాంటివి చూస్తుంటే గుర్తుకొస్తుంది. అదే విధంగా బ్రేవ్ న్యూ వరల్డ్ అనే మరో డిస్టోపియన్ నవలలో, భవిష్యత్ సమాజాన్ని సైన్స్, సామర్థ్యం చుట్టూ తిప్పిన విధానం కూడా కల్కి సినిమాలో కనిపిస్తుంది. పిల్లలను గర్భం వెలుపల సృష్టించి, క్లోన్ చేయడం ద్వారా సమాజం శాస్త్రీయ, విభజన స్వభావాన్ని పూర్తిగా వివరించాడు రచయిత ఆల్డస్ హక్స్లీ. కల్కి సినిమాలో మరో విధంగా, గర్భస్థ శిశువు పిండానికి చెందిన సీరం తీయడం, దాని ఒకేఒక చుక్క ప్రభావం పరోక్షంగా ప్రస్తావించడం, హక్స్లీ నవలను గుర్తుకు తెచ్చింది. కృత్రిమ మేథస్సుకు సంబంధించిన అనేకానేక విషయాలు పలు సందర్భాలలో చూపించిన విధానం కూడా ఆసక్తిగానే వున్నాయి.

భారత, భాగవత, రామాయణ కథాంశాలను, సందర్భోచితంగా, సాంకేతిక పరంగా అనుసంధానం చేసి చూపించే ప్రయత్నాన్ని అభినందించాలి. కాకపోతే, అక్కడక్కడా ఒకింత వాస్తవ విరుద్ధంగా వుండి వుండవచ్చు. మారుతున్న సమాజంలో విభిన్న రుచుల వ్యక్తులందరినీ తృప్తి పరచడం కన్నా, తృప్తిగా సినిమా చూద్దామనుకునే పలువురిని తృప్తి పరచడమే ప్రధానం. ఆ దిశగా ఈ సినిమా ‘గ్రాండ్ సక్సెస్’ అనాలి. మొత్తం మీద ‘కల్కి 2898 ఏడీ’ సినిమా, అర్థం, అవగాహన చేసుకుంటే, ఒక అద్భుతమైన నూతన ప్రయోగమనీ, పరిశోధనాత్మక ఆధారిత సినిమా అనే అభిప్రాయానికి రావడంలో అతిశయోక్తి లేదు.

No comments:

Post a Comment