Wednesday, August 28, 2024

సీతమ్మ సందేహం : వనం జ్వాలా నరసింహారావు

 సీతమ్మ సందేహం

వనం జ్వాలా నరసింహారావు

భక్తి పత్రిక (సెప్టెంబర్, 2024)

{భరతుడు తిరిగి వెళ్లిపోయాడు. అయోధ్యకు సమీపంలోని నందిగ్రామంలో పాదుకాపట్టాభిషేకం జరిగింది. సీతారామలక్ష్మణులు చిత్రకూటం విడిచిపెట్టి దండకారణ్యం వైపుకు మళ్లారు. ఆ సమయంలో విల్లమ్ములు ఎక్కుపెట్టి అడుగు ముందుకు వేస్తున్న రాముడిని సీత ఆపింది. రాక్షసులతో అనవసర విరోధం కొని తెచ్చుకోవద్దని నచ్చ చెప్పింది. రాముడు తన మనో నిశ్చయాన్ని ఆమెకు చెప్పాడు. ఆ సన్నివేశంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తిదాయకంగా ఉంటుంది}

శ్రీరాముడి వనవాస కాలంలో భరతుడు రామపాదుకలు పట్టుకెళ్లాడు. చిత్రకూటాన్ని వదిలి, అత్రి ఆశ్రమానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే ఆయన రాక్షస సంహారం ఆరంభించాడు. అది సీతాదేవికి ఇష్టం లేదు.

‘ప్రాణేశ్వరానువ్వు ధర్మ నిరతుడవు కాబట్టి నీలో ఏ పాపాలూ కనబడవునువ్వు సత్యంధర్మం తప్పని వాడివి కాబట్టే తండ్రి వాక్యాన్ని పాలించడానికి ఇంత శ్రమ పడ్తున్నావుసత్యంధర్మం నీలో ఏ కొరతా లేకుండా వున్నాయిఇంత సత్యంధర్మం విజితేంద్రియులకు తప్ప ఇతరులకు లభించవు. నువ్వెంత జితేంద్రియుడివో నాకు తెలుసుమిథ్యాభిభాణం, పరదారా సంగమాభిలాష నీలో లేవుఆ విషయం గురించి నేనేం చెప్పను. కాకపోతే నువ్వు ఆయుధాలతో అరణ్యానికి పోవడం నాకిష్ఠం లేదు.’ అన్నది సీతాదేవి. 

‘జ్ఞానహీనులు పగలేకపోయినా ఇతరుల ప్రాణం తీస్తారు. కానీ అది నీకు తగదుమునిలాగా తిరగాలనుకుంటున్న నీకునీ తమ్ముడికి హింసించే సాధనాలైన విల్లు, బాణాలు ఎందుకు? ఆత్మరక్షణ కోసమని అంటావేమోఈ మునులందరూ ఆత్మరక్షణ కొరకు ఏ ఆయుధాలు ధరించారునువ్వు సాయుధుడవైనందువల్ల మునులు వచ్చి నిన్ను రక్షించమని అడిగారంటావానిన్ను రాక్షసులు హింసించడానికి వస్తే క్షత్రియుడవైన నువ్వు వారిని ఎదుర్కోవడానికి నువ్వు ఆయుధాలు పట్టవచ్చుకానిమీరు ముందుగానే విల్లు, ఆయుధాలు పట్టిన తీరు చూస్తే మీరో యుద్ధ ప్రయత్నంలో పోతున్నట్లున్నదిమీ శుభంహితం కోరినదాన్నైన నేనునిష్కారణ విరోధంతో మీకేం అశుభం కలుగుతుందో అని భయపడుతున్నాను. నువ్వు సత్యంధర్మం పాటించేవాడివిఇంతదాకా ఆ రెంటినీ సమంగా కాపాడుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు రెంటికీ విరోధం వచ్చేట్లున్నది. సత్యంతో విరోధించే ధర్మంధర్మం కాదు. ధర్మంతో విరోధించే సత్యంసత్యం కాదు.’ అని కూడా అన్నది.

పాపపు బుద్ధి పుడుతుంది

ఆ తరువాత, మీకు ఇప్పుడు తోవలో ఎవరైనా రాక్షసుడు కనిపిస్తే వాడిమీద బాణం వేసి చంపుతారు. అదే రాక్షసులకుమనకు విరోధ కారణమవుతుందిరాక్షసులు మనకు ప్రత్యక్షంగా అపకారం చేయనప్పుడు, ఎవరో ఋషీశ్వరులు చెప్పారని రాక్షసులను చంపి మనం కయ్యానికి కాలు దువ్వడం నాకిష్ఠం లేదునిష్కారణంగా ఎవరినీ చంపనని అంటావాహింసించవచ్చే వారినే హింసిస్తానంటావాఅలా అయితే నీ ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుందిదానికి సరైన కారణం కావాలిక్షత్రియులకు చేతిలో ఆయుధం వుంటే బలాన్ని, తేజాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి మీ ఆయుధాలను ఇక్కడే వుంచి పోదాం.’ అని సలహా ఇచ్చింది.


‘అంతేకాకుండా శస్త్ర సంయోగంవల్ల కలిగే కీడు అంతా, ఇంతాకాదుఅగ్నిహోత్రుడు దేనిని ఆశ్రయిస్తాడోదాన్నే దహించి వేస్తాడుఅలాగే శస్త్రం కూడా తన్నెవరు ధరిస్తారో వారికే కీడు చేస్తుందిఇదంతా నీకు తెలిసిన విషయమే. నేను నేర్పడం లేదుమీరు మరచిన దానిని జ్ఞప్తికి వచ్చేట్లు చెప్పానునేనెంత దూరం ఆలోచించినా ఇప్పుడుఇక్కడమీ ప్రయత్నం నాకిష్ఠం కావడం లేదు.  మునివృత్తికి శాంతి ప్రధానం. ఆయుధ ధారణ కౌర్య ప్రధానం. ఒకటి శుద్ధ సాత్త్వికం, ఇంకొకటి శుద్ధ తామసం. నువ్వు చేయబోయే ఈ పని పరస్పర విరుద్ధ గుణాలున్నది. కాబట్టి రెండింటిలో ఒకటి వదలు. శస్త్రాన్నైనా వదలు, లేదా, క్షాత్రమైనా వదలుకో.’ అని వివరించింది.

‘శస్త్రాన్ని ధరిస్తే దాన్ని ఉపయోగించాలన్న పాపపు బుద్ధి పుట్తుందికాబట్టి నువ్వు అడవుల్లో వున్నన్నాళ్లు శస్త్రం ధరించవద్దు. శస్త్రాన్ని ధరించాలనుకుంటేఅయోధ్యకు మరలిపోయిన తరువాతగృహస్థ ధర్మంలో వున్నప్పుడుధర్మ సంరక్షణార్థం శస్త్రాన్ని ధరించవచ్చు. అనుభవించాల్సిన ఐశ్వర్యంపాలించాల్సిన భూమి వదలిపెట్టి మునిలాగా అడవుల్లోకి వచ్చిన నువ్వుమునిలాగానే తపస్సు చేస్తే మంచిది. ధర్మంతో ధనం లభిస్తుందిధర్మం వల్ల సుఖం కలుగుతుందిధర్మంతో చేసే సత్కర్మలు మంచి ఫలితాలను ఇస్తాయిధర్మహీనుడు చేసే సత్కర్మలు ఫలించవుధర్మం చెడితే జగమంతా చెడుతుందినువ్వు అడవుల్లో తిరిగినంత కాలం హింసా వ్యాపారం లేకుండా వుండకూడదారాముడు క్రూరుడు అంటారేమోనని విచారిస్తున్నాను’ అన్నది సీత.

ప్రతిజ్ఞ వీడను

సీతతో జవాబుగా శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నాడు.

‘దండకారణ్యంలో నివసిస్తున్న మునీశ్వరుల సమూహాలు మా దగ్గరకు వచ్చి, అనేకవిధాలుగా తాము పడుతున్న దుఃఖాలను చెప్పి, తమను రక్షించాలని ప్రార్థించారు. దండకారణ్యంలో వున్న రాక్షసులు తమపై పగ బూని, తాము హోమం చేస్తున్న సమయంలో తమను బాధపెట్తున్నారని, ఆ బాధ పడలేక తమకు రక్షకుడు ఎవరు వస్తారో అని విచారపడ్తుండగా, తమ పుణ్యఫలం వల్ల నేను దొరికానని అన్నారు. తపస్సు చేయడం సులువు కాదనీ, అది మిక్కిలి కష్టకార్యమనీ, అంత కష్టపడి చేద్దామంటే మధ్య-మధ్యలో విఘ్నాలు కలుగుతున్నాయనీ, తమ తపశ్సక్తి పోగొట్టుకోదల్చు కోలేక వారిని శపించడం లేదనీ, ఎంతమందిని అలా శపించగలమనీ, ఒక వేళ శపించినా తమకింక ఏ శక్తి మిగుల్తుందనీ, జీవించినా వ్యర్థమే కదా అనీ, వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్లిలా చెప్పగా వారిని కాపాడాలని ప్రతిజ్ఞ చేశాను. వట్టి మాటలు చెప్పి కన్నీళ్లు తుడిచి పంపలేదు.’

‘నేనే దిక్కని నమ్మిన ఆ ఆశ్రితులను ఎలాగైనా పాడైపొమ్మని తిరస్కరించడం ధర్మమా? హింస నిషేధం అనేది నేను అంగీకరిస్తా. నిరపరాధులైన సాధువులను హింసించడాన్ని హింస అంటారు కాని అసాధువులను హింసించడాన్ని హింస అనరు కదా? రాక్షస వధమీద నాకున్న ఉద్దేశం ఏంటి? అదేమన్నా వినోద క్రీడా నాకు? వాళ్లను నేను కామంతో కాని, క్రోధంతో కాని, లోభంతో కాని, మదమాత్సర్యాలతో కాని, మోహంతో కాని చంపాలనుకోవడం లేదు. సాధువుల మేలుకొరకై చేసే పని మాత్రమే. ఈ మునులు అడవుల్లో, అక్కడొక కాయ, ఇక్కడొక కూర తెచ్చుకుని దాంతోనే కడుపు నింపుకుని దేహయాత్ర చేస్తారు. రాక్షసులేమో మృగాలనే కాకుండా మనుష్యులను కూడా పీక్కుని తింటారు. మునులు ధర్మపద్ధతిన నడుస్తే, వారు దయాదాక్షిణ్యాలు లేకుండా క్రూరపద్ధతిన నడుస్తారు. ఇలాంటి నిష్కారణ హింసాపరాయణులైన రాక్షసులను వధించి శిష్ట రక్షణ చేయడం అధర్మమా?’

ఇది నా నిశ్చయం

‘నాకు సత్యం అన్నింటికంటే ముఖ్యం కాబట్టి ప్రాణాలున్నంతవరకు ఆడినమాట తప్పను. నువ్వే దిక్కని నన్ను ఆశ్రయించి, ఎప్పుడుకూడా ఇతరులకు హాని కలిగించే వాటి జోలికి పోకుండా, దిక్కులేనివారిగా వున్న మునులను, రాక్షసులు పనిగట్టుకుని వధించారు. ఇంతకంటే విరోధమైన పని ఏమన్నా వుందా చెప్పు? నన్ను ఆశ్రయించేదాకా ఎవరేపాపాలు చేసినా వారి పాపఫలం వాళ్లే అనుభవిస్తారని, వారిని నేను రక్షించే ప్రయత్నం చేయను. ఒకసారి నన్ను ఆశ్రయిస్తే, నేనే దిక్కని వారి రక్షాభారం నామీద వేస్తే, పాపకార్యాలు చేయకుండా వుండే దిక్కులేనివారిని రక్షించడమే నాపని. దానికి నేను కట్టుబడి వున్నాను. అలాంటి వారిని, నా రక్షణలో వున్నవారిని, నా ఆశ్రితులను, రాక్షసులు చంపుతున్నారు. నా భక్తులు నాప్రాణంతో సమానం. నా భక్తులను భాదించడమంటే నన్ను బాధించడమే. ఇక నా మనోనిశ్చయం విను. సత్యాన్ని రక్షించేందుకు ప్రాణాలైన విడుస్తాను. ప్రాణాలకంటే ఇష్టమైన నిన్నైనా విడుస్తాను. నీ కంటే ప్రియమైన తమ్ముడినైనా విడుస్తాను. కానీ ప్రతిజ్ఞ విడువను. అందునా, మునుల కార్యాన్ని రక్షించడం నా విధి. వారే వచ్చి, నేను చేయాల్సిన పనిని గుర్తుచేసిన తరువాత, వారికి ప్రతిజ్ఞ చేసికూడా ఎలా నెరవేర్చకుండా వుంటాను? నన్ను నమ్మి, నన్ను స్మరించి, నన్ను ధ్యానించి, అర్చించి, జపించి, సేవించి, వర్ణించి, కీర్తించి నాపై ఋణమెక్కించిన వారి ఋణం నేను తీర్చుకోవద్దా? అని సీతకు నచ్చచెప్పాడు.  

తర్వాత చిత్రకూటం నుండి బయల్దేరి సీతారామలక్ష్మణులు అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటారు. ఆయన తన భార్య, పరమ పతివ్రత అనసూయాదేవిని సీతాదేవికి పరిచయం చేశాడు. వారిరువురి మధ్య జరిగిన సంభాషణలో రామచంద్రమూర్తి తన పరాక్రమంతో స్వయంవరంలో తనను పెళ్లి చేసుకున్న వివరాలను సీత అనసూయకు చెప్పింది. మరునాడు మునీశ్వరుల దీవెనలు తీసుకుని సీతారామలక్ష్మణులు తిరిగి ప్రయాణమయ్యారు. దండకారణ్యం ప్రవేశించారు.

వేదాంత బోధ

రామాయణంలో శ్రీసీతారామలక్ష్మణులు మినహా, తక్కినవారందరూ సందర్భానుసారంగా వచ్చినవారే. ఈ ముగ్గురి సంబంధం చిద చిదీశ్వరుల సంబంధాన్ని తెలుపుతున్నది. ప్రకృతికి అధిష్ఠాన దేవత లక్ష్మి. ఆవిడే సీత. ఈమె చైతన్య స్వరూపిణి. ప్రకృతి బద్ధమైన ఆత్మ స్థానంలో సీతను చెప్పారు. లక్ష్మణుడు ప్రకృతి సంసర్గంలేని జీవుడు. కాబట్టే ఆయన్ను భార్యతో జంజాటంలేని వాడిగా చెప్పారు. శ్రీరాముడు ఈశ్వరుడు. ప్రకృతి బద్ధజీవుడు, శుద్ధజీవుడు. ఇరువురూ ఈశ్వరుడిని ఆశ్రయించి, ఆయనకు శేషభూతులై ఉంటారు. ఈ తత్వం తెలిసినవాడు ముక్తుడవుతాడని భగవద్గీత చెపుతోంది. శ్రీమద్రామాయణం ఈ ముగ్గురి సంబంధమనే విషయం ఆద్యంతం బోధిస్తున్నది. అందుకే రామాయణం పదేపదే చదవాలి.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

Monday, August 26, 2024

సనాతన ధర్మం సార్వజనికం, సార్వకాలికం, సార్వమూలికం ..... భారతీయ, హైందవ, వైదిక సంస్కృతి – ‘సజీవ వాహిని సనాతన ధర్మం’ -3 : వనం జ్వాలా నరసింహారావు

 సనాతన ధర్మం సార్వజనికం, సార్వకాలికం, సార్వమూలికం

భారతీయ, హైందవ, వైదిక సంస్కృతి – ‘సజీవ వాహిని సనాతన ధర్మం’ -3

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (26-08-2024)

బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను ఉద్భవింపచేశాడు. వేదాలను సమగ్రంగా అధ్యయనం చేసే శక్తి లేనివారికి వేదవ్యాసుడు వేదాలను, పురాణాలను లోకానికి అందించాడు. వేదవ్యాసుడికి పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు అనే నలుగురు శిష్యులు వుండేవారు. వీరు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే నాలుగు వేదాలను వ్యాసమహర్షి ఉపదేశించిన క్రమంలో అన్ని లోకాలలో ఆవిష్కరించారు.

మానవ సమాజానికి ఆదర్శ ప్రాయం ఋగ్వేద సమాజం. ‘ఋగ్వేదం ఒక పరిపూర్ణ, శాంతియుత, స్వయం సమృద్ధ సమాజాన్ని సృష్టించింది. అయోమయంలో వుండి, అడుగంటనున్న ప్రపంచ మానవ సమాజానికి ఆదర్శప్రాయం ఋగ్వేద సమాజం. ఈ సమాజంలో ఒక స్థిరమైన రాజకీయ వ్యవస్థ, స్థిరపడిన మానవ సంబంధాలు, ఉమ్మడి కుటుంబాలు, ప్రేమాభిమానాలు, అనుబంధాలు అమృతప్రాయములైనాయి. గ్రామాల్లో శాంతి, సహకారం, సద్భావం అవతరించాయి. స్త్రీలకు ఆస్తి హక్కు, కుటుంబ యాజమాన్యం కలిగించారు. ఋగ్వేద జీవన విధానమే ప్రపంచమంతటా కొనసాగింది.’

           మానవుడి సృష్టి ఆదిగా ఎదుగుతున్న ఒక మహా దివ్యవరం.  ‘వేదం సకల ప్రాణులను సమానంగా పరిగణించింది. మానవులు, పశువులు, పక్షులు, వృక్షాలు, పర్వతాలు సమానమని దర్శించినది. వీటిలో కొన్నిటిని దేవతలలో చేర్చినది. అంటే, అవి మానవజాతి జీవనానికి అత్యవసరమని గుర్తించడమే. అంతేకాదు, వాటికి హాని కలిగించరాదని, పూజించాలని నిర్ణయించడమే. మానవుడు పంచభూతాలను, తన పిశాచ దాహానికి, విషపూరితం చేస్తున్న అత్యంత ఆధునికమని భావిస్తున్న రాక్షస యుగానికి, వేదం ఇచ్చిన సందేశం అమృతప్రాయం. కాని ఆశ రక్కసి. అది అమృతాన్ని హరిస్తుంది. మనిషిని యంత్రంగా మార్చి, విషమిచ్చి ఆత్మహత్యకు పురికొల్పేది పురోగతి కాదు. కృతజ్ఞత, దయ, కరుణ, ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం, అనుబంధం మానవత లక్షణాలు.

భారత జాతికి ప్రాచీన సంస్కృతి, మహోన్నత నాగరికత, విలక్షణ సాంప్రదాయం, కాలానికి అందని చరిత్ర, అపార సాహిత్యం, అనంత కళలు వున్నాయి. వేదం మానవ జీవితామృతం. వేదమే నరపశువును మానవుడిగా మార్చినది. అతనికి బందాలు, అను బందాలు, సంబందాలు నేర్పినది. మానవ సంబంధాలు అన్నిటికీ ప్రధానమైనవి. నేటి మన మానవ సంబందాలు అనాదిగా జరుగుతున్ననిరంతర సాంఘిక, అధ్యయన, ఆచరణ ఫలితాలు. ఆత్మజ్ఞానాన్ని కేవలం భారతీయులు మాత్రమే సాధించినారు. పాశ్చాత్యులు దీనిని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, పూర్తిగా అవగాహన చేసుకోవడానికి యుగాలు పడుతుంది. విశ్వాన్ని సృష్టించిన వాడు సృష్టికి పూర్వం ఎక్కడ నుండి సృష్టించాడన్నది మేధావులు ప్రశ్నించుకోవాలి! ఇది ఇంతవరకు ప్రశ్నగానే మిగిలి పోయింది! అసలు ఈ భూమి దేనిమీద నిలిచి ఉన్నది? ఇది కూడా ఈనాటివరకూ మనిషి మేధస్సుకందని, అంతుచిక్కని కోట్ల కోట్లాది రూకల ప్రశ్న.

 ‘మానవుడు ఏకాకిగా, వంటరిగా, వేరుగా జీవించలేడు. పశుపక్ష్యాదులు సహితం వంటరి జీవితాన్ని గడుప లేవు. తోడూ, నీడా లేనిది జీవితం సాగదు. ఒంటరి బ్రతుకు ఒక బ్రతుకే కాదు. జీవితంలో ఎక్కువకాలం కలిసి వుండడానికి మగకు ఆడ, ఆడకు మగ తోడు అవసరం. ఈ జంట తోడుకు మాత్రమేకాకుండా గురుతరమైన కుటుంబ బాధ్యతలు నిర్వహించాల్సి వున్నది. సమాజపు స్వరూప, స్వభావాలు ఎటువంటివి అయినా, అది దంపతులు, కుటుంబం మీదనే ఆధారపడతారు. మంచి కుటుంబమే మంచి సమాజమవుతుంది. ఏ ఇద్దరి స్వభావాలు, అభిరుచులు, అభిప్రాయాలు ఒకే తీరుగా వుండవు. ఇది ప్రకృతి రీతి. అలాగైతే ఒక ఆడ, మగ జంటను కూర్చడం అవసరం. మనిషి పశుపక్ష్యాదుల  నుండి నేర్చినాడో, లేక, అవసరమే అలా చేసినదో? ప్రశ్నార్థకం! ఆడ, మగను కలపడానికి పవిత్రమైన వివాహ బంధాన్ని ఏర్పరిచినారు. ఈ వివాహ బంధాన్ని నిలపడానికే సాహిత్యంలో అనేక విషయాలు కనిపిస్తాయి’.

         ‘వేదంలో రాజకీయాన్ని గురించి స్పష్టంగా ఉన్నది. మేధావిని, సామాజిక నేతను, ధర్మాన్నే రాజును చేస్తుంది అంటుంది వేదం. భారత తాత్త్వికతలో ధర్మం, సమాజం రాజకీయాన్ని శాసించింది. ఇలా అనడం మరింత సమంజసం. ప్రస్తుతం రాజకీయం కండకావరం, ధన మదంతో సమాజాన్ని శాసిస్తున్నది. ఇది భారత, పాశ్చాత్య తాత్త్వికతల మౌలిక భేదం. రాజు, రాచరికిం, చంచలం కారాదు. స్థిరం కావాలి. ప్రజలు అభిలషించేట్లుగా రాజు రాజ్యం చేయాలి. రాజ్యానికి హాని కలుగకుండ సమాజం, రాజకీయం చూడాలి.’   

మానవజాతి అభ్యుదయానికి నియమబద్ధమైన జీవితం నేర్పినదే వేదం. ‘భూలోకంలో సత్యమే భగవంతుడనీ, సత్యం మీదనే ధర్మం ఆధారపడి ఉందనీ, సత్యం అంటే నిజం చెప్పడం మాత్రమే కాదనీ, సమాజ జీవితం చాలావరకు నిజం మీదనే ఆధారపడి ఉందనీ, ప్రభుత్వ, న్యాయ యంత్రాంగం నిజం చెప్పించడానికే ఏర్పడిందనీ ఒక భావన వుంది. అయితే, అందరూ భావించిన దానికి భిన్నంగా, ప్రభుత్వ, న్యాయ యంత్రాంగం ఆసాంతం అబద్ధం మీదనే ఆధారపడింది! కార్యనిర్వహణ నిజం చెప్పదు, న్యాయం నిజం చెప్పదు, శాసనం నిజం చెప్పదు, అన్నింటిలోనూ అబద్ధాల సాక్ష్యాలే! ఎవరూ నిజం చెప్పరు. ఈ సమాజం అసత్యాల మీద ఆధారపడి ఉంది. నిజం చెప్తే వ్యవస్థ పేకమేడలా కూలుతుంది. ఇలాగే వుంటుందని వేదాలు ఘోషించాయి.

వేదం మానవ జాతికి భగవంతుడు ప్రసాదించిన తొలి ప్రసాదం. ‘వ్యాస భగవానుడు మానవ సమాజ శ్రేయోభిలాషి. అతడు రానున్న కలియుగాన్ని దర్శించాడు. నాటి అవిశ్రాంత మానవుడిని దర్శించాడు. అతని ఆజ్ఞతను దర్శించాడు. స్వప్రయోజన తత్త్వాన్ని, స్వార్థాన్నీ, కాలుష్యాన్నీ కూడా దర్శించాడు. వ్యాస భగవానుడు అనంత వేదాలను సహితం దర్శించాడు. వేదాల విశాలతను, కలియుగపు సంకుచిత నరుణ్ణి చూశాడు. అతడికి జాలి కలిగి, కలియుగ మానవులకు ఉపకారం చేయాలనుకున్నాడు. ఉపకారం చేయడమే అతడి జీవితం. వ్యాసభగవానుడు కృపావాత్సల్యాలు కలవాడు. రానున్న కాలంలో జనానికి తీరిక ఉండదనీ, వాళ్లు అజ్ఞానులనీ గ్రహించాడు. ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించాడు. మానవ జాతి సాంతం వ్యాసభగవానునికి రుణపడి ఉంటుంది. ఏమి చేసినా అతని ఋణం తీరదు. వేదం పవిత్రాతిపవిత్రం. వేదం పావనం. మంత్రానికి మాన్యత ఉంది. మంత్రానికి ప్రభావం ఉంది. వేదం ఒక ఆకాశం. ఒక సముద్రం’.

సంస్కృతి, నాగరికత, సభ్యతలను యుగయుగాలుగా నిలిపింది వేదం. ‘మానవుడు తాను గెలిచాను అని అనుకున్నది, ఓటములకు ఒప్పుకున్నది, సాధించినది, సాధించనున్నది, సాధించలేనిది, వీటన్నింటికి యోని, మూలం ఆలోచనే. ఆలోచన అర్థం, అనర్థం అవుతున్నది. న్యాయం, అన్యాయం, సత్యం, అసత్యం, క్రమం, అక్రమం అవుతున్నది. జగత్తులకు కళ్యాణకరం, వినాశకరం అవుతున్నది. అన్నింటికీ మూలం ఆలోచనే! ఆలోచనే శాస్త్రం, విజ్ఞానం, సైన్స్, దృష్టి. చివరకు ఆలోచనే ఆలోచన. వేదం ఆలోచన మాత్రం కాదు. వేదం శాస్త్రాలకు తల్లి లాంటిది. తల్లి ఎంతమంది పిల్లలనైనా ఇవ్వగలదు. కాని, ఎందరు పిల్లలయినా ఒక తల్లిని ఇవ్వలేరు! మానవుడు వాస్తవాలపై జీవించడం లేదు. సృష్టి ప్రారంభమై కోట్ల సంవత్సరాలు దాటిపోయినది. ఇంత సుదీర్ఘ కాలంలో శాస్త్రం, సైన్స్, ఏదేదో కనుగొన్నానని మానవుడు విర్రవీగుతున్నాడు. నాటి నుండి నేటివరకు మనిషికి ‘జీవితం’ అనే పదం  అర్థం చేసుకొవడానికి కాలం పరుగులు తీసింది.

భారతీయ నాగరికత, సంస్కృతి, సంప్రదాయం హిమవదున్నతం, నిత్యనూతనం. ‘ఇన్ని వేల సంవత్సరాలుగా సంస్కృతం హిమవదున్నతమై, నిశ్చలంగా, సూర్యకాంతిలా, సజీవంగా నిలిచి ఉంది. ఇందుకు సాక్ష్యం అనంతమూ, అమరమూ అయిన సంస్కృత సాహిత్యం! వేదం, ఉపనిషత్తు, రామాయణం, భారత, భాగవతాలు కాలపు జరా జీర్ణాలను ఎదిరించి నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి. తొలినుంచే అక్షరబద్ధం అయిన వేదానికి భాష, లిపి, ప్రాణం వున్నాయి. వేదం భూమి, ఆకాశం, వాయువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలలాగా శాశ్వతం. ఏ ఒక్క సమాజపు సొత్తు కాదు. సమస్త మానవాళికి చెందింది. తూర్పున ఉదయించి, సమస్త ప్రాణిజాలానికి వెలుగును ప్రసాదించే సూర్యుడిలాంటిది వేదాన్ని అర్థం చేసుకోవడానికి స్వర జ్ఞానం అవసరం.

సంస్కృతి, విశ్వాసం, ధర్మం, న్యాయం, సత్యం, జీవన విధానమే భారత తాత్వికత. ‘భారతం ఒక నేల, దేశం మాత్రమే కాదు. అది ఆకాశమంత, భూగోళమంత, సముద్రమంత, సంస్కృతి, విశ్వాసం, ధర్మం, న్యాయం, సత్యం, జీవన విధానం. భారతదేశం కర్మ భూమి. కర్మ అంటే పని. కార్మికుడు అంటే పనిచేసేవాడు. కర్మభూమి అంటే పని, కృషి, నైపుణ్యానికి విలువ ఇచ్చే దేశం అని అర్థం. మానవుడు స్వశక్తితో దేవత కాగలడని నమ్మకం కలిగించిన కర్మ భూమి, భారత భూమి. కర్మ, పని, పరిశ్రమ, నైపుణ్యం లాంటి వాటికి అంతటి గౌరవం, స్థాయి, అంతస్తు కలిగించిన భారతతాత్వికత జడం కాదు, కాల ప్రవాహం వంటిది. అది స్రవంతి! భారత సిద్దాంతం ఒకటి కాదు, అనేకం. మన తత్త్వం, ప్రకృతి తత్త్వం. భిన్నత్వంలో ఏకత్వం మన జీవన విధానం. వేదాలకు భిన్నమైన జైన, బౌద్ధ, చార్వాకాలతో మనం సహజీవనం చేశాం. ఇస్లాం, క్రైస్తవంతో సహజీవనం చేస్తున్నాం. భారత ధర్మం, సిద్దాంతం, తాత్త్వికత, గతాన్ని ధ్వంసం చేయదు. భవిష్యత్తును శాసించదు. సకల ఆలోచనా విధానాలతో గంగా ప్రవాహంలాగా నిరంతరం పవిత్రంగా ప్రవహిస్తుంటుంది. భారతీయులంతా బహు దేవతారాధకులు. ఇది భారతీయ మతం. జాతి స్వభావం, నాగరికత, సంస్కృతి.’

వేదం నేర్పిన విద్వత్సభలు, చర్చలు, గోష్టులు, మీమాంసలు, తర్కాలే నేటి సెమినార్లు, శిక్షణలు, వర్క్ షాపులు. ‘యజ్ఞం మానవ జాతికి అనేకం నేర్పింది. సంఘం, సమాజం, కలిసిమెలిసి పనిచేయడం, శ్రమ విభజన, విద్య, నైపుణ్యం, బోధన, శిక్షణ, సంపద పరిరక్షణ, ఉపయోగం, సమాజ క్షేమం, సంఘ క్షేమం, విశ్వ శ్రేయస్సు, మానవ కల్యాణం ఇలా అనేకం నేర్పింది యజ్ఞం. మనం తినే మెతుకు కోసం, తాగే నీటికోసం, ఎన్నో యజ్ఞాలు జరిగాయి. జరుగుతున్నాయి. జరుగనున్నాయి. వేదం ఇంతమంది శ్రమకు కర్త అయింది. మానవ కల్యాణం కోసం జరిగే ప్రతి బృహత్కార్యమూ యజ్ఞమే!’.

‘వేదం మానవజాతికి పరమాత్మ ప్రసాదించిన తొలి అక్షర గ్రంథం. వేదం విషయంలో శ్రద్ధ కావాలి. శ్రద్ధ కలవాడికి జ్ఞానం లభిస్తుంది. వేదాద్యయనానికి విధి నిషేధాలు లేవు. తిట్టడానికీ కూడా వేదం చదవనూవచ్చు. అభ్యంతరం లేదు. వేదం రామాయణం, భారతాదుల లాంటి కథా కావ్యం కాదు. వేదం కర్మ సాహిత్యం. చదవడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. చదివినవే మళ్లీ చదవాల్సి రావచ్చును. ఒక్కొక్కసారి విసుగు కూడా కలగవచ్చును. ఇది జీవితం లాంటిది. జీవితంలో చేసిన పనులే చేసేది, అప్పుడప్పుడూ విసుగు కలుగుతుంది. వేదంలో వర్ణ వ్యవస్థను గురించిగాని, కులమతాలను గురించిన జాడలు కాని అంతగా కనిపించవు. వేదంలో ఎక్కడా వేదాధ్యయనం కొందరికి మాత్రమే పరిమితమైనట్లుగాని, కొందరిని నిషేధించినట్లు గాని, లేశ మాత్రం లేదు. అలాంటి ఆధారమే కనిపించదు. వేదం ఎండలాంటిది. వెన్నెల లాంటిది. గాలి లాంటిది. నీరు లాంటిది. వేదం సర్వ జనీనం, సర్వ కాలీనం, సనాతనం, పురాతనం, మహత్తమం.

పాశ్చాత్య దేశాలు వేదంలోని భారత వైద్య విధానాన్ని అనుకరిస్తున్నారు. అప్రాకృత కృత్రిమ సంతానం, శస్త్ర చికిత్స, అవయవాలు అతికించడం వేదకాలం నాటివే. అథర్వ వేదంలో అనేక చికిత్స విధానాలున్నాయి. వాటిలో మూలికా చికిత్స దేహానికి సంబంధించినది. వ్యాధి ఉపశమనానికి, నివారణకు, నిర్మూలించడానికీ ఉపయోగపడుతుంది. యుద్ధాల్లో శత్రువును బలహీనపరిచే ప్రయోగాలున్నాయి. వైద్యంలోనూ బహు విధానాలు చెప్పడం జరిగింది. కాకపోతే వేదంలో పేర్కొన్న మూలికలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నదీ, లేనిదీ తెలియదు. క్రిములు, వాటివల్ల కలిగే రోగాలు, చికిత్స కూడా చెప్పబడింది.

మహాభారతంలో ధర్మం మీద అనేక రకాల చర్చలు జరిగాయి. త్యాగానికి నిదర్శనమైన శిబి చక్రవర్తి చరిత్ర, ధర్మవ్యాధుడి వృత్తాంతం అందులోని పతివ్రత మహాత్మ్యం, ధర్మాధర్మ విచక్షణా జ్ఞానం ఆవశ్యకత,  ఆపద్ధర్మం విశేషం, పేరాశ ఎలా పాపాలన్నిటికీ మూలం అనే అంశం, ధర్మం సర్వమూ ఎందుకు ఆచరణ యోగ్యం అనే విషయం, మోక్ష కారణమైన జ్ఞానం, సద్గుణ లక్షణాలు, విధి చేష్టితాలు అంటే ఏమిటి,  కర్మల ఫలాల ధర్మస్వరూపం ఏవిధంగా ఒక్కటే అనే వివరణ, దైవానుకూలతకు పవిత్రత ఎందుకు ముఖ్యం, అహింస తీరుతెన్నులు, ‘గో, భూ, విద్యా, అన్న, జల, సువర్ణ, గొడుగు, చెప్పుల దానాలు’ ఏవిధంగా గొప్పవి, భారతంలో చెప్పినవే.

కణికుడు, నారదుడు,  ధౌమ్యుడు బోధించిన రాజనీతి, భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన రాజ ధర్మాలలో భాగంగా....బ్రహ్మ నీతి శాస్త్రం, దండనీతి, బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యంగా రాజ్యపాలన చేయాలన్న అప్పటి ధర్మం, ధర్మపాలన చేయడమే రాజ ధర్మం అనే సూక్తి, ధర్మమార్గానువర్తనం, ఉపేక్ష, యుద్ధనీతి, ధర్మాపేక్ష, మృదుత్వంతో సాధించరానిదేదీ లేదనే వాస్తవం, విశ్వసాహితీజగత్తులో నిరుపమానమైన యక్షప్రశ్నలు, ధర్మరాజు సమాధానాలు ప్రధానంగా భారతంలో వున్నాయి.

ధర్మాలు అనేక విధాలుగా ఉంటాయి. వాటిలో ఆచరించదగిన ఉత్తమ ధర్మం ఇలాంటిదని ఆ ధర్మ స్వరూపం తెలిసిన మహనీయులు మాత్రమే చెప్పగలరు. కాల పరిణామం వల్ల ధర్మం అందుకు భిన్నంగా గోచరిస్తుంది. స్పష్టతను కోల్పోయి మరుగున పడుతుంది. సనాతన ధర్మ స్వరూపం తెలిసిన మహనీయులు మాత్రమే దాన్ని గురించి చెప్పగలరు. కాల పరిణామం వల్ల, పరిశీలాత్మకమైన సూక్ష్మబుద్ధి లేనందువల్ల, అధర్మమే ధర్మం అనే భావన కలిగిస్తున్నది. ధర్మం దారితప్పుతున్నది. తద్వారా దోషం ఏర్పడుతున్నది.  సనాతన ధర్మ సూక్ష్మం తెలియని వారి మాటలు ప్రమాదకరమైనవని, వారి బోధలు విని కార్యాచరణకు పూనుకునేవారికి చివరకు దుఃఖమే మిగులుతుంది. ఈ విధయాలలో అప్రమత్తంగా వుండాలి’ అని భీష్ముడు అమ్పశయ్యమీద నుంచి చివరగా ధర్మరాజుకు, ఎప్పుడో, ఏనాడో చెప్పిన మాటలు సదాస్మరణీయం, ఆచరణీయం, అనుభవైకవేద్యం. వందల, వేల సంవత్సరాల తరువాత కూడా అవి అన్వయిస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

అందుకే, ఇందుకే, భారతీయ, హైందవ, వైదిక సంస్కృతికి ప్రతీకైన ‘సనాతన ధర్మం సృష్ట్యాదినుండి ఇప్పటివరకు, ఎప్పటివరకైనా శాశ్వత సజీవవాహిని. “సదాత్మకమై, తదుపాసనాత్మకమైన పావన జీవన సంవిధానమే సనాతన ధర్మం. ఇది సనాతనము, సదాయతనమూ. సనాతన ధర్మం సార్వజనికం, సార్వకాలికం, సార్వమూలికం.’ భారతీయ తాత్త్విక ధారకు ఆధారం వేదవాజ్మయం, భారత, భాగవత, రామాయణ ధార్మికసాహిత్యం.

(వేదం, భారతం, భాగవతం, శ్రీరామాయణం భారతీయ సంస్కృతీ రూపాలు:

సజీవ వాహిని సనాతన ధర్మంపుస్తకం నుండి సంక్షిప్త సేకరణ)