ధర్మభూమి, కర్మభూమి మన అఖండ భారతావని
భారతీయ, హైందవ, వైదిక
సంస్కృతి – ‘సజీవ వాహిని సనాతన ధర్మం’
-1
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(12-08-2024)
సమస్త ప్రపంచంలో ప్రత్యేకత సంతరించుకున్న ఒక జీవన విధానమైన భారతీయ, హైందవ, వైదిక సంస్కృతిని
మించిన ఉత్తమోత్తమమైన సనాతన ధర్మబద్ధమైన సంస్కృతి మరొకటి లేనే లేదు. ప్రపంచ సామాజిక
వ్యవస్థలలో హిందూ వైదిక వ్యవస్థ ఒక ఉదాత్తమైన వ్యవస్థ. సార్వకాలికమై, శాశ్వతమై, స్థిరమై, యుగ, యుగాలుగా వర్ధిల్లుతూ, ఎన్ని సాంఘిక
విప్లవాలొచ్చినా చెక్కు చెదరకుండా, నిశ్చలంగా, సజీవంగా వుంది.
వేదకాలంనాటి నాస్తికుల నుండి, ఆధునిక కాలంనాటి అజ్ఞానుల వరకూ
ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా సనాతన ధర్మాన్ని కించపరిచినా ఫలితం
శూన్యమే,
తాత్కాలికమే!
మన వేదాలు, భారత, భాగవత, భారత, శ్రీరామాయణం
సనాతన భారత సంస్కృతీ రూపాలు.
క్లుప్త సుందర వివరంగా ఈ విషయాలను తెలుసుకునే ముందు, ఇటీవల నేను
రాసిన ‘సజీవ
వాహిని సనాతన ధర్మం’ అనే పుస్తకానికి నలుగురు మహనీయులు, సనాతన ధర్మ
పరిరక్షకులు, సనాతన
ధర్మ వ్యాప్తికి అవిశ్రాంత కృషి సల్పుతున్న ఋషితుల్యులు కంచి కామకోటి
పీఠాదిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ధార్మిక
తపస్వి బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ, భద్రాచలం శ్రీ
సీతా రామచంద్ర స్వామి ఆలయం ఆస్థాన పురోహితులు గుదిమెళ్ళ
మురళీకృష్ణమాచార్యులు, తిరుమల
తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్తు
పూర్వ కార్యదర్శి డాక్టర్ చిలకపాటి విజయ
రాఘవాచార్యులు, పేరుకు
‘పుస్తకానికి ముందుమాట’ అని అన్నప్పటికీ, సనాతన ధర్మాన్ని గురించి సూటిగా, అద్భుతంగా
మూడు-నాలుగు వాక్యాలలో రాశారు. వాటిని యధాతథంగా ప్రస్తుతించుకోవడం సమంజసం.
ముందుగా, కంచి
స్వామి తమ దివ్య సందేశంలో ‘సజీవ వాహిని సనాతన ధర్మం’ ఒక మహోన్నత వ్యాసాల సంకలనమని, తెలుగు భాష
తెలిసిన ఆస్తికులు వీటిని
చదవడం వల్ల
విశేష ఉపయోగాన్ని
పొందగలరని పేర్కొన్నారు. ఇది సనాతన ధర్మసర్వస్వాన్ని ‘అరచేతిలో అద్భుతం’లా హస్తగతం
చేసిందని వ్యాఖ్యానిస్తూ సామవేదం వారు, వేదాలనుండి ప్రబంధాలవరకు
విస్తరించిన సంప్రదాయ సాహితీవీచికల వైభవాలు ఒక క్రమ పద్ధతిలో ఇందులో సాక్షాత్కరించాయని, అన్నీకలిపి ఒకే సూత్రంతో
అల్లబడి,
ఒకే
హారంగా ఏర్పడి, ఈ పుస్తకంగా
రూపొందిందని ప్రశంసించారు. ‘మొత్తంగా సనాతన ధర్మం సృష్ట్యాదినుండి ఇప్పటివరకు, ఎప్పటివరకైనా
‘శాశ్వత సజీవవాహిని’
అని ప్రతి వ్యాసం ఋజువు చేస్తోంది. ఈ పుస్తకం ధర్మావగాహనని కలిగించడమేకాక, ధర్మాచరణకు
ప్రేరేపిస్తూ, సంశయరహితమైన
ధృఢత్వంలోతరువాతి తరాలకు అందేలా నిలబెట్టగలది.’ అని ముగించారు.
గుదిమెళ్ళ వారు తమ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేస్తూ, ‘అపౌరుషేయమైన వేదమే అఖిల
ధర్మాలకు మూలం. సనాతన ధర్మానికి అదే ఆలవాలం. ఆ వేదోక్త ధార్మిక కర్మ విశేషాల జీవన
విధానమే సనాతన ధర్మం. కాలం చెల్లిన ధర్మం కాకుండా సదాతనమై, సదాయతనమై, ఆచరించబడే కర్మవిశేషమే
సనాతన ధర్మం. సర్వకాలాలలో అనుష్ఠానయోగ్యమైన శ్రుత్యుక్త ధర్మమే సనాతన ధర్మం. అందుకే ఇది సజీవవాహిని.
సదాచార జీవన ప్రవాహిణి. సత్య, ధర్మాలు రెండూ ఈ వైదిక సంస్కృతికి జీవనాడులు. సత్యం
వచనీయం,
ధర్మం ఆచరణీయం.
వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు, వ్యక్తిధర్మాలు, విశేషధర్మాల నానారూపాత్మకం ఈ ధర్మం. ఈ
ధర్మాలన్నీ సదాయతనాలు. సదాత్మకమై, తదుపాసనాత్మకమైన పావన జీవన
సంవిధానమే ఈ సనాతన ధర్మం. అందుకే ఇది సనాతనము, సదాయతనమూ. దేవస్థానం, వేదస్థానం, యజ్ఞస్థానం
అనే మూడింటి వైభవాన్ని, ప్రాభవాన్ని సులభతరమైన
శైలిలో అందిస్తున్న చక్కని ఈ కోశాన్ని సనాతన
సంస్కృతికి చెందిన ప్రతి హిందువు తప్పకుండా చదవాలి’ అని రాష్రారు.
చిలకపాటి వారు ‘సార్వజనికం, సార్వకాలికం, సార్వమూలికం సనాతన ధర్మం’
అని అంటూ,
‘భారతీయ తాత్త్విక
ధారకు ఆధారం వేదవాజ్మయం లేదా సనాతన ధార్మికసాహిత్యం. ఇందులో సిద్దాంతమున్నదీ, వ్యాఖ్యానమున్నదీ, ఆచరణాత్మకమైన
క్రియాపాదమూ ఉన్నది. దాని వివరణ వ్యాఖ్యాన రూపంలో లేదా భాష్య రూపంలో బహు విస్తారమై
ఉంటుంది. అవి జ్ఞానసాగరం కాబట్టి
భాష్యకారులు
తమతమ
వివరణలతో సుసంపన్నం చేశారు. ఈ నేపధ్యంలో రాసిన సజీవ వాహిని సనాతన
ధర్మం మహాగంభీరమైన తాత్త్వికధార, సంక్షిప్త సుందరమైన
వ్యాఖ్య. సనాతన ధర్మం
అంటేనే భారతీయ జీవన విధాన సంవిధానం. భారతదేశానికి ‘విశ్వగురు’ పీఠాధిపత్యాన్ని
అనుగ్రహించిన మహాద్భుత శ్రీకోశసంహిత, ధర్మసింధువు, నిర్ణయసింధువు, మనుధర్మం, శ్రీరామాయణ, భారత, భాగవత, భగవద్గీతాది
అసంఖ్యాక గ్రంథాలలో అక్షరబద్ధం చేయబడిన ధర్మాలను, అష్టాదశపురాణ
ప్రబోధాలను
సంక్షిప్తీకరించి
సంకలించిన ‘సజీవ
వాహిని సనాతన ధర్మం’ సామాన్యులనేగాక
మాన్యులనూ, ధీమాన్యులనూ, ఆమోదప్రమోదాలతో
అలరిస్తుంది.’
ఇంతకూ వివరంగా ఏమిటీ సనాతన ధర్మం? వేదాలలో, ఉపనిషత్తులలో, అష్టాదశ
పురాణాలలో, రామాయణ, భారత, భాగవత
గ్రంథాలలో, సాక్షాత్తు శ్రీకృష్ణ
పరమాత్మ అర్జునిడికి, భీష్మాచార్యులు
ధర్మరాజుకి, విశ్వామిత్రుడు
శ్రీరాముడికి ప్రవచించిన ధర్మబోధనల్లో, మనుస్మృతిలో, ఇంకా అనేకానేక
పౌరాణిక,
ఇతిహాస గ్రంథాలలో, పలు సందర్భాలలో
ప్రస్తావించిన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడం, సముద్రాల్లో
అగాధాలు తెలుసుకోవడం కన్నా
ఎన్నో రెట్లు ఎక్కువ కష్టం. ధర్మం సనాతమైనా, అదునాతనమైనా, అర్థమైతే అది ధర్మమే!
సనాతన ధర్మానికి, వేల, లక్షల
సంవత్సరాలనాటి హైందవ ధర్మానికి, మనుధర్మానికి
వ్యతిరేకం అని మాట్లాడుతున్న అవివివేకులకు, ఇది అనాదిగా పరిమళిస్తున్న
ఆధ్యాత్మిక సౌరభం అనే విషయం తెలియదు.
సదాచారం అంటే ఏమిటి? సమాజ శ్రేయస్సంటే ఏమిటి? ఉత్తమోత్తమైన
ధర్మమంటే ఏమిటి? ఎవరెవరు
ఏవిధంగా తమ విద్యుక్త
ధర్మాలను త్రికరణ శుద్ధిగా
ఆచరించాలి? క్షమాగుణం
అంటే ఏమిటి? మనో
నిగ్రహం ఎలాంటిది? శాస్త్ర విజ్ఞానం అంటే
ఏమిటి?
ఆత్మజ్ఞానం
ఎలాంటిది?
కాలానుగుణంగా
స్త్రీ పురుష ధర్మాలు ఎలా మారుతాయి? వైవాహిక ధర్మం అంటే ఏమిటి? దాంపత్య ధర్మం ఎలా
వుండాలి?
తల్లితండ్రులను, పెద్దవారిని, గురువులను ఎలా
గౌరవించాలి? ఇలాంటివన్నీ సనాతన ధర్మంలో
భాగాలే. ఇందులో విమర్శకులకు ఏ విధంగా తప్పు కనిపిస్తుందో తెలియదు.
వేదకాలం నాటి నుండీ ప్రత్యేకత సంతరించుకున్న జీవన విధానమైన
భారతీయ,
హైందవ, వైదిక
సంస్కృతిని మించిన ఉత్తమోత్తమమైన సనాతన ధర్మబద్ధమైన సంస్కృతి మరొకటి లేనే లేదు. ప్రపంచ
సామాజిక వ్యవస్థలలో హిందూ వైదిక వ్యవస్థ ఒక ఉదాత్తమైన వ్యవస్థ. ఏది ఆర్య ధర్మమో, ఏది ఆర్ష ధర్మమో, ఏది సనాతన
ధర్మమో,
ఏదికాదో నిర్ణయించే
అర్హత ఎంతవరకుందో వీటిని గుడ్డిగా
వ్యతిరేకించేవారు విజ్ఞతతో ఆలోచించు కోవడం మంచిదేమో! అనాదిగా సంస్కృతీ సాంప్రదాయాలకు
నిలయమైన భారతావనిలో ఎవరెవరు ఎటువంటి ధర్మాలను ఆచరించారనేదే ప్రధానం. వాటిని
భావితరాలవారు ఎలా అర్థం చేసుకోవాలనేది ముఖ్యం. మన ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, వేదకాలంనాటి
ధర్మశాస్త్రాలు చెప్పిందంతా బూటకం అని వాదించే కన్న అందులోని
ధర్మాలను,
అధర్మాలను
అవగాహన చేసుకోవడం కూడా
ముఖ్యం.
అయోధ్య వివాదంపై సెప్టెంబర్ 30, 2010 న వెలువడిన
అలహాబాద్ హైకోర్ట్ సెక్యులర్ తీర్పులో న్యాయమూర్తులు ఋగ్వేదం, కార్ల మార్క్స్, ఖురాన్, ఇక్బాల్, ప్రొఫెట్
మహమ్మద్,
డార్విన్
లాంటి అనేక సనాతన, అధునాతన పుస్తకాల్లోని
మహనీయుల మాటలను ఉటంకించారు. జస్టిస్ సుధీర్ అగర్వాల్ తీర్పు పాఠాన్ని ఋగ్వేదంలోని
సంస్కృత శ్లోకాలతో ఆరంభించారు ఇలా: ‘ప్రళయావస్థలో శూన్యం తప్ప ఏమీ లేదు. కేవలం
పంచ భూతాలు మాత్రమే వుండేవి. ఏ లోకమూ లేదు. భూమ్యాకాశాలూ లేవు. అలాంటప్పుడు
ఎవరు ఎవరిని కదిలించారు? ఎలా కదిలించారు? అంతా అనిశ్చిత
స్థితే!’ అని మొదలవుతుందా శ్లోకం.
చావు పుట్టుకలు అప్పుడు తెలియదని, సూర్యచంద్రులు
వున్నారో,
లేరో
తెలియనందున రాత్రి, పగలు
తేడా లేదని
అంటూ, అప్పుడు ఎవరికీ అంతుచిక్కని ఒక
పర బ్రహ్మ స్వరూపం, తన శక్తితో సృష్టి
ప్రక్రియను ప్రారంభించాడని, ఆ శక్తికి అతీతమైంది మరేదీ లేదని పేర్కొన్నారు.
‘సృష్టికి పూర్వం అంతా శూన్యమే. అంతా చీకటిమయం. అంతటా జలమయం. సృష్టి ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో
ఎవరికీ తెలియదు. పండితులకు, మేధావులకు కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే వారంతా సృష్టి
తర్వాతే పుట్టారు కనుక. సృష్టికి కారకుడైన ఆ శక్తే సృష్టిని కొనసాగిస్తున్నదా, లేక, మరెవరన్నా
చేస్తున్నారా? అనేదీ అంతుచిక్కని
విషయమే. అసలా శక్తికి కూడా తెలుసో, లేదో?’ అని ఆరంభించి, వివాదం విషయం
ప్రస్తావిస్తారు న్యాయమూర్తి అగర్వాల్.
అద్వితీయ గీర్వాణ భాషా గ్రంథాలుగా, సనాతన ధార్మిక ‘ధర్మ
త్రివేణి'
స్థావరాలుగా, భారతీయ ఆధ్యాత్మిక
ఔన్నత్యాన్ని నినదించే ఋషి ప్రసాదాలుగా ప్రసిద్ధికెక్కిన శ్రీరామాయణ, భారత, భాగవతాలకు ఆలవాలమైన
ధర్మభూమి,
కర్మభూమి
మన అఖండ భారతావని. అర్థం, అవగాహన చేసుకోగలిగితే, ఈ మూడింటిలో
దర్శనమిచ్చే అనేక ధర్మాల సమాహారమే ‘సనాతన ధర్మం.’ మానవ విలువలను
కాపాడేందుకు నిరంతరాన్వేషణ జరుగుతుందనడానికి వాల్మీకి రామాయణ గాధే చక్కటి ఉదాహరణ. రామాయణమే
ఆదికావ్యం. వేదంలాగా స్వతఃప్రమాణం.
వేదార్థం ఇందులో విస్తరించి చెప్పడం జరిగింది. సనాతన ధర్మం తెలుసుకోవాలంటే
శ్రీరామాయణం చదవాల్సిందే!!! అర్థం చేసుకున్నప్పుడే సనాతన
ధర్మాన్ని హేతుబద్ధంగా విమర్శించడానికి అర్హులు.
(వేదం, భారతం, భాగవతం, శ్రీరామాయణం
భారతీయ సంస్కృతీ రూపాలు:
‘సజీవ
వాహిని సనాతన ధర్మం’ పుస్తకం నుండి సంక్షిప్త
సేకరణ)
No comments:
Post a Comment