Monday, August 12, 2024

పాదుకా పట్టాభిషేకం : వనం జ్వాలా నరసింహారావు

 పాదుకా పట్టాభిషేకం

వనం జ్వాలా నరసింహారావు

భక్తి పత్రిక (ఆగస్ట్ నెల, 2024) 

వనవాసం మాన్పించి శ్రీరాముడిని వెనక్కు తీసుకువెళ్లాలని చిత్రకూట పర్వతానికి భరతుడు వచ్చాడు. తనతోపాటు వశిష్ఠుడు, జాబాలి వంటి మునులను, కౌసల్యాదులను కూడా వెంటపెట్టుకుని వచ్చాడు. వారందరూ ఆయనను శ్రీరామునిని వెనుకకు రమ్మని ప్రార్థించారు. కానీ ఆయన అంగీకరించలేదు. తాను తండ్రి మాటకే కట్టుబడి వుంటానని చెప్పి ఒప్పించి పంపాడు. ఆ తరువాత శ్రీరాముని బదులుగా ఆయన పాదుకలే రాజ్యభారాన్ని వహించాయి.

         భరతుడు చెప్పినదంతా విన్నతరువాత తమ్ముడా! మనతండ్రి అధర్మాత్ముడై రాజ్యం నీకివ్వలేదు. నీ తల్లి వివాహకాలమందు కన్యాశుల్కంగా తన రాజ్యాన్ని ఆమె కొడుక్కి ఇస్తానని ప్రమాణం చేశాడు. ఆ మాట ప్రకారమే రాజ్యం నీకు సంక్రమించింది. తండ్రిని సత్యవాక్యపాలకుడిని చేయడమే నాకిష్టం. నీతో రాలేను అన్నాడు శ్రీరాముడు.

జాబాలి సందేశం

భరతుడితో పాటుగా చిత్రకూటానికి జాబాలి మహర్షి కూడా వచ్చాడు. ఆయన నాస్తికుడుగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన కూడా రాముడిని వెనక్కు రప్పించాలనే ఉద్దేశ్యంతో వున్నాడు. ఆయన శ్రీరాముడితో సుదీర్ఘ ప్రసంగం చేశాడు.

‘సర్వం తెల్సిన నీకు  పామరుడిలాగా బుద్దిమాంద్యం ఎలా కలిగింది? తండ్రి, తండ్రి అని అంటున్నావే? మనిషికి తండ్రి అనేవాడెవరు? బందువులెవ్వరు? ఒకడిని తండ్రి అనీ, ఒకరిని తల్లి అనీ అనడం బుద్ధిలేనితనమే! ఒక ప్రాణికి, మరొక ప్రాణికి సంబంధమే లేదు. ఈ తల్లిదండ్రుల దేహాలు సత్రాలు, చలువ పందిళ్ళ లాంటివి. వీటికోసం వివేకవంతుడు తాపత్రయపడడు. యౌవనంలో అనుభవయోగ్యం కాని చెడుమార్గాన్ని ఎందుకు కోరుకుంటున్నావు?’ అని ప్రశ్నించాడు.

‘పురుషుడు ఒక స్త్రీ గర్భంలో బీజం వేస్తే అది స్త్రీ రక్తంతో కలిసి పిండమై, ప్రాణంతో పుడుతున్నది. తండ్రి ఒక అల్ప సహాయం మాత్రమే. ఆ మాత్రానికి ఎందుకు తండ్రి, తండ్రి అని అంటున్నావు? నాలుగు భూతాల సంయోగమే దేహం. పుట్టినవాడు ఎన్ని రోజులకైనా చావాల్సిందే. ఇది ఆలోచించకుండా పిచ్చివాడిలా వ్యర్థంగా ఏమిటో అంటున్నావు. ఇదేం అనాలోచిత ప్రసంగం? ఒకడి ద్వారా మరొకడికి అయ్యే పనేంటి? ఒకడు ఇంకొకడికి ఏంచేయగలడు? ముసలితనం రాకుండా కాపాడగలమా? చావురాకుండా ఆపగలమా? పుట్టినప్పుడు తానొక్కడే పుట్టాడు, చనిపోయేటప్పుడు ఒక్కడే చస్తాడు. అప్పుడీ తండ్రులలో, బంధువులలో ఒక్కడైనా వెంట వస్తారా? అలా రానప్పుడు వీరు కన్నవారెలా అయ్యారు? బంధువులెలా అయ్యారు?’ అని కూడా ప్రశ్నించాడు.

         ‘కష్టపడి వైదిక కర్మలు చేస్తున్నారు. చనిపోయినవాడు అన్నం తింటాడా? చనిపోయినవారి పేరు చెప్పి ఇతరురులు తింటున్నారు. దీనివల్ల లాభం ఏమిటి? బతికున్నవాడు అన్నం తింటే చనిపోయినవాడి కడుపెలా నిండుతుంది? ఒకడు కూడు తింటే మరొకడి కడుపెలా నిండుతుంది? బుద్ధికలవారు ఇవి విని నమ్ముతారా? మబ్బుల్లో నీరును నమ్ముకుని చెరువు నీరు తెగగొట్టుతారా? చనిపోయిన తరువాత ఎదో సుఖం కలుగుతుందని ప్రత్యక్ష రాజ్య సుఖాన్ని పోగొట్టుకునే బుద్ధిలేనివాడు ఎవరైనా వుంటారా? కాబట్టి లోకం సమ్మతించే ఆలోచన చేయి. అయోధ్యకు పోయి తక్షణమే పట్టాభిషేకం చేసుకో’ అని సలహా ఇచ్చాడు.

శ్రీరాముని సమాధానం

జాబాలి మాటలకు శ్రీరాముడు జవాబుగా ‘నీ మాటలను బట్టి నువ్వు నియమహీనుడివని, పాపివని తెలసుకున్నా. నేను చేసిన ప్రతిజ్ఞను సముద్రంలో కలిపి, సత్యాన్ని నాశనం చేసి, అసత్యమాడి పరలోక సుఖం ఎలా అనుభవించను? రాజు నాస్తికుడై, దేవుడు లేడు, పరలోకం లేదని చెప్తే ధర్మం, సత్యం అనేవి నశిస్తాయి కదా? సర్వ జగాలకు సత్యమే ఆధారం, సత్యమే శ్రేష్ఠం. మోక్షాన్ని కోరేవాడు సత్యాన్నే పలకాలి. సత్యమే లక్ష్మీవాసస్థానం. ప్రపంచానికంతా సత్యమే నియంత. సత్యానికి లోబడి ప్రపంచం నడుస్తున్నది. సత్యమే ప్రపంచం నిలబడడానికి మూలాధారం. మోక్షప్రాప్తికి సాధనం సత్యం. సత్యం విడిచిన వారికి ఇవేవీ పనిచేయవు. నరుడు సత్యమే ప్రధానంగా కలవాడు కావాలి.’

         ‘సత్పురుషులు ఆచరించాల్సిన వానప్రస్థ ఆశ్రమాన్ని, జడలు ధరించి సత్యం కొరకై నేను స్వీకరించా. సత్యమే ప్రదానంగాగల పురుషుడికి కీర్తి, యశస్సు, లక్ష్మి తమంతట తామే వలచి వస్తాయి. ఈ లోకంలో ఇవి సమకూర్చడమే కాకుండా సత్యం స్వర్గలోకానికి తోడుగా పోయి దివ్యసుఖాన్ని కలిగిస్తుంది. ఇలాంటి సత్యాన్ని ఎవరు వదులుకుంటారు? నాకు లభించినదానితో పంచేద్రియాలను సంతోషపెట్తూ, శాస్త్రం మీద, కర్మఫలం మీద నమ్మకంతో, పాపరహితమైన మనసుతో, సత్కార్యాలు చేస్తూ, పితృవాక్యాన్ని పాలిస్తూ కాలం గడుపుతాను. ఈ భూమండలంలో వున్నవారు పుణ్యకర్మలే చేయాలి. ఇక్కడ పుణ్యం చేసినవారు అక్కడ సుఖం అనుభవిస్తారు. ఇక్కడ పాపం చేసినవారు అక్కడ దుఃఖం అనుభవిస్తారు.’

‘సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, ఇవన్నీ ఉద్యోగాలే. ఎవరు ఏ సంకల్పంతో కర్మలను ఆచరిస్తారో, వారికి ఆ కర్మలఫలంగా పదవులు లభిస్తాయి. వీరంతా కొంతకాలం ఆ పదవుల్లో వుండి వేరేవారికి స్థానం కలిగిస్తారు. బ్రహ్మ రుద్రేంద్రాది పదవులన్నీ కర్మఫలాలే. ఫలదాత భగవంతుడైన విష్ణువే. భగవంతుడైన విష్ణువు సృష్టికర్త అయి తన్ను సృజించుకుంటున్నాడు. భగవంతుడు అవ్యాకృతాత్ముడై మళ్లీ, మళ్లీ సృష్టిని సంకల్పిస్తాడు. ఆ శక్తివల్ల ప్రకృతి క్షోభిల్లి, తమస్సు, ప్రకృతి, మహత్తు, అహంకారం ముందుగా పుట్టాయి. అహంకారం నుండి ఆకాశతన్మాత్ర, వాయువు, అగ్ని, జలతన్మాత్ర, పృథివీ, ఔషదులు, వరుసగా ఉద్భవిస్తాయి. ఇది పరిణామం (Evolution). ప్రకృతి జడం కాబట్టి దానంతట అది పరిణామం చెందలేదు. ఇవన్నీ చేసేవాడు భగవంతుడే! సర్వం భగవంతుడే అని అర్థం.’

         ఇలా శ్రీరామచంద్రమూర్తి మాట్లాడగా, జాబాలి, ‘నేను నాస్తికుడిని కాదు. నిజానికి నాస్తి అనేది లోకంలో లేదు. సర్వం అస్తియే! నాస్తికుడిని కాకపోయినా ఎందుకు నాస్తికవాదం చేశానంటావా? మీరిద్దరూ రాజ్యాన్ని అంగీకరించకపోతే రాజ్యం, ప్రజలు ఏగతి పట్టాలి? దేశం ఎంతటి దుస్థితికి వస్తుంది? ఈ మహావిపత్తును ఆలోచించి న్యాయంగా రాజ్యం నీది కాబట్టి నువ్వు రాజు కావడం ధర్మమని అనుకున్నాను. న్యాయోక్తులన్నిటికీ విరుగుడు మాటలు చెప్పిన నీకు, మార్గంలోనైనా నిన్ను అంగీకరించేలా చేద్దామనుకున్నాను. ఎప్పుడైనా ధర్మహాని కలిగితే, ఇలాంటి కష్టకాలం వస్తే, మళ్లీ నాస్తికవాదన చేస్తాను. ఒక పని నెరవేరాలంటే ఎన్ని విధాల ప్రయత్నించినా తప్పులేదు’ అని అంటాడు.

           భరతుడు చిత్రకూట పర్వత సందర్శన ఘట్టం అది. ఆ సమయంలో జాబాలి ప్రసంగం తరువాత వసిష్ఠుడు సృష్టి రహస్యాన్ని వివరించాడు. ‘బ్రహ్మాండమంతా జలంతో నిండి సముద్రంగా వున్నప్పుడు భూమి సృష్టించబడింది. పరబ్రహ్మంవల్ల దేవతలు, బ్రహ్మ కలిగారు. భూమి నీట్లో మునుగుతున్నప్పుడు విష్ణువు ఆదివరాహమై తన కొమ్ముతో దాన్ని పైకెత్తాడు. అవ్యయుడు, నిత్యుడు, పరబ్రహ్మం వల్ల కలిగిన బ్రహ్మ తన కొడుకులైన మరీచ్యాదులతో ప్రపంచమంతా వ్యాపించాడు. సర్వత్రా ప్రకాశించే ఆకాశమే పరబ్రహ్మం. ప్రపంచం ప్రళయకాలంలో చీకట్లో మునిగి వుండేది. అప్పుడు మహత్తుతో మొదలైన ప్రకృతి సూక్ష్మ ప్రకృతైన తమస్సులో లీనమై తమస్సు భగవంతుడితో ఏకీభావంగా వుండేది. ప్రత్యక్ష ప్రమాణానికి అగమ్యంగా, చీకట్లో వస్తువులు కళ్లకు కనబడని విధంగా, ఇది ప్రపంచమని గుర్తించగల చిహ్నాలు లేకుండా, శబ్దం వల్ల కూడా తెలియకుండా అంతా నిద్రావస్తలో వున్నట్లుండేది. అటుపై బ్రహ్మ మొదలుకుని శ్రీరాముని వరకు మీ సూర్యవంశం కొనసాగుతోంది అని చెపుతూ రఘువంశ రాజుల వంశక్రమాన్ని కూడా వివరించాడు ఇలా:

         ‘బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి భాస్కరుడు, భాస్కరుడికి మనువు, మనువుకు ఇక్ష్వాకుడు పుట్టారు. అయోధ్యను మనువు ఇక్ష్వాకుడికి ఇచ్చాడు కాబట్టి శ్రీరాముడి వంశానికి ఇక్ష్వాకుడే మూలపురుషుడు. అతడికి కుక్షి, ఆ కుక్షికి వికుక్షి, అతడికి బాణుడు పుట్టారు. బాణుడికి జన్మించిన అరణ్యుడే రావణుడితో యుద్ధం చేసి శపించాడు. అరణ్యుడికి బృథువు కలిగాడు. దేహంతో స్వర్గానికి పోయిన త్రిశంకుడు అతడి కుమారుడే. త్రిశంకుడికి యువనాశ్వుడు, అతడికి మాంధాత పుట్టారు. మాంధాత కొడుకు సుడంది. అతడి కొడుకులు ధ్రువసంధి, ప్రసేనజతుడు. ధ్రువసంధి కొడుకు భరతుడు. అతడి కొడుకు అసితుడు. ఇతడిని హైహయులు, తాలజంఘులు యుద్ధంలో ఓడించి రాజ్యం నుండి వెళ్ళగొట్టారు. ఆయనకు ఇద్దరు భార్యలు.’

         ‘వారిలో ఒకామె అయిన కాళిందికి బ్రహ్మతో సమానుడైన కొడుకు సగరుడు పుట్టాడు. ఆ వంశ పరంపరలో, అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కకుథ్సుడు, రఘువు, కల్మాషపాదుడు, oఖనుడు, సుదర్శనుడు. నహుషుడు, నాభాగుడు పుట్టారు. అతడికి అజుడు, సువ్రతుడు అనే ఇద్దరు కొడుకులున్నారు. అజుడి కుమారుడు దశరథుడు. దశరథుడి కొడుకుల్లో నువ్వు పెద్దవాడివి. కాబట్టి రామచంద్రా! నీ తండ్రిలాగా నువ్వు కూడా భూమిని పాలించు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవారిలో ఇప్పటిదాకా వంశపరంపరంగా పెద్దవాడే రాజవుతున్నాడు. కాబట్టి నువ్వు కూడా వంశధర్మాన్ని అనుసరించి, రాజ్యాభిషేకానికి అంగీకరించి ప్రజలను పాలించు’ అని ముగించాడు వసిష్టుడు.

రామ పాదుకలు

         ఇవన్నీ విన్న తదుపరి, శ్రీరాముడు తెగేసి చెప్పిన మాటలకు సమాధానంగా భరతుడిలా అన్నాడు. ‘అన్నా! సరే! నీ మాట వింటా. నేనెంత ప్రార్థించినా నీ మనసు కరగడం లేదు. నీకు నామీద నిర్మలమైన మనసుంటే, ఈ బంగారు పాదుకలమీద నీ పాదాలను వుంచు’ అని వాటిని ఆయన పాదాల దగ్గర వుంచాడు. శ్రీరాముడు అలాగే చేశాడు.

భరతుడు వాటిని భక్తితో తీసుకుని రెండు చేతులు జోడించి ఇలా అన్నాడు: ‘అన్నా! నేను చెప్పే మాట సావాధానుడవై విను. నేనూ నీవలనే జటావల్కల ధారినవుతాను. ఊరిబయట ఇల్లు ఏర్పాటు చేసుకుంటాను. రాజ్యతంత్రం అంతా పాదుకలకు అప్పచెప్పి, నీరాక కోసం ప్రాణం బిగబట్టి వుంటాను. పదిహేనో ఏడు మొదటి రోజున నువ్వు రాకపోతే నేను అగ్నిలో దూకుతాను.’ అని చెప్పి శ్రీరాముని అజ్ఞ చొప్పున తిరుగు ప్రయాణం అయ్యాడు.

రామపాదుకలను పట్టపుటేనుగు కుంభస్థలంలో వినయంగా పెట్టి, శ్రీరాముడికి నమస్కరించాడు. రామచంద్రమూర్తి కూడా అందరికీ వీడ్కోలు పలికాడు. ఆ తరువాత, భరతుడు పట్టుపు ఏనుగు మీద వున్న పాదుకలను తీసి తన తలమీద పెట్టుకుని, శత్రుఘ్నుడితో కలిసి రథం ఎక్కాడు. దారిలో చిత్రకూటం సమీపంలో వున్న భరద్వాజ ఆశ్రమాన్ని చూశాడు. అన్న లేని అయోధ్యకు వెళ్లలేక, అయోధ్య సమీపంలోని నందిగ్రామంలో శ్రీరాముడి రాకకొరకు పద్నాలుగేళ్లు వేచి ఉన్నాడు. పావుకోళ్లు రెంటినీ బంగారు సింహాసనం మీద వుంచి వాటికి పట్టాభిషేకం చేశాడు. ఇదీ ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం.’

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

 

No comments:

Post a Comment