Wednesday, August 28, 2024

సీతమ్మ సందేహం : వనం జ్వాలా నరసింహారావు

 సీతమ్మ సందేహం

వనం జ్వాలా నరసింహారావు

భక్తి పత్రిక (సెప్టెంబర్, 2024)

{భరతుడు తిరిగి వెళ్లిపోయాడు. అయోధ్యకు సమీపంలోని నందిగ్రామంలో పాదుకాపట్టాభిషేకం జరిగింది. సీతారామలక్ష్మణులు చిత్రకూటం విడిచిపెట్టి దండకారణ్యం వైపుకు మళ్లారు. ఆ సమయంలో విల్లమ్ములు ఎక్కుపెట్టి అడుగు ముందుకు వేస్తున్న రాముడిని సీత ఆపింది. రాక్షసులతో అనవసర విరోధం కొని తెచ్చుకోవద్దని నచ్చ చెప్పింది. రాముడు తన మనో నిశ్చయాన్ని ఆమెకు చెప్పాడు. ఆ సన్నివేశంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తిదాయకంగా ఉంటుంది}

శ్రీరాముడి వనవాస కాలంలో భరతుడు రామపాదుకలు పట్టుకెళ్లాడు. చిత్రకూటాన్ని వదిలి, అత్రి ఆశ్రమానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే ఆయన రాక్షస సంహారం ఆరంభించాడు. అది సీతాదేవికి ఇష్టం లేదు.

‘ప్రాణేశ్వరానువ్వు ధర్మ నిరతుడవు కాబట్టి నీలో ఏ పాపాలూ కనబడవునువ్వు సత్యంధర్మం తప్పని వాడివి కాబట్టే తండ్రి వాక్యాన్ని పాలించడానికి ఇంత శ్రమ పడ్తున్నావుసత్యంధర్మం నీలో ఏ కొరతా లేకుండా వున్నాయిఇంత సత్యంధర్మం విజితేంద్రియులకు తప్ప ఇతరులకు లభించవు. నువ్వెంత జితేంద్రియుడివో నాకు తెలుసుమిథ్యాభిభాణం, పరదారా సంగమాభిలాష నీలో లేవుఆ విషయం గురించి నేనేం చెప్పను. కాకపోతే నువ్వు ఆయుధాలతో అరణ్యానికి పోవడం నాకిష్ఠం లేదు.’ అన్నది సీతాదేవి. 

‘జ్ఞానహీనులు పగలేకపోయినా ఇతరుల ప్రాణం తీస్తారు. కానీ అది నీకు తగదుమునిలాగా తిరగాలనుకుంటున్న నీకునీ తమ్ముడికి హింసించే సాధనాలైన విల్లు, బాణాలు ఎందుకు? ఆత్మరక్షణ కోసమని అంటావేమోఈ మునులందరూ ఆత్మరక్షణ కొరకు ఏ ఆయుధాలు ధరించారునువ్వు సాయుధుడవైనందువల్ల మునులు వచ్చి నిన్ను రక్షించమని అడిగారంటావానిన్ను రాక్షసులు హింసించడానికి వస్తే క్షత్రియుడవైన నువ్వు వారిని ఎదుర్కోవడానికి నువ్వు ఆయుధాలు పట్టవచ్చుకానిమీరు ముందుగానే విల్లు, ఆయుధాలు పట్టిన తీరు చూస్తే మీరో యుద్ధ ప్రయత్నంలో పోతున్నట్లున్నదిమీ శుభంహితం కోరినదాన్నైన నేనునిష్కారణ విరోధంతో మీకేం అశుభం కలుగుతుందో అని భయపడుతున్నాను. నువ్వు సత్యంధర్మం పాటించేవాడివిఇంతదాకా ఆ రెంటినీ సమంగా కాపాడుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు రెంటికీ విరోధం వచ్చేట్లున్నది. సత్యంతో విరోధించే ధర్మంధర్మం కాదు. ధర్మంతో విరోధించే సత్యంసత్యం కాదు.’ అని కూడా అన్నది.

పాపపు బుద్ధి పుడుతుంది

ఆ తరువాత, మీకు ఇప్పుడు తోవలో ఎవరైనా రాక్షసుడు కనిపిస్తే వాడిమీద బాణం వేసి చంపుతారు. అదే రాక్షసులకుమనకు విరోధ కారణమవుతుందిరాక్షసులు మనకు ప్రత్యక్షంగా అపకారం చేయనప్పుడు, ఎవరో ఋషీశ్వరులు చెప్పారని రాక్షసులను చంపి మనం కయ్యానికి కాలు దువ్వడం నాకిష్ఠం లేదునిష్కారణంగా ఎవరినీ చంపనని అంటావాహింసించవచ్చే వారినే హింసిస్తానంటావాఅలా అయితే నీ ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుందిదానికి సరైన కారణం కావాలిక్షత్రియులకు చేతిలో ఆయుధం వుంటే బలాన్ని, తేజాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి మీ ఆయుధాలను ఇక్కడే వుంచి పోదాం.’ అని సలహా ఇచ్చింది.


‘అంతేకాకుండా శస్త్ర సంయోగంవల్ల కలిగే కీడు అంతా, ఇంతాకాదుఅగ్నిహోత్రుడు దేనిని ఆశ్రయిస్తాడోదాన్నే దహించి వేస్తాడుఅలాగే శస్త్రం కూడా తన్నెవరు ధరిస్తారో వారికే కీడు చేస్తుందిఇదంతా నీకు తెలిసిన విషయమే. నేను నేర్పడం లేదుమీరు మరచిన దానిని జ్ఞప్తికి వచ్చేట్లు చెప్పానునేనెంత దూరం ఆలోచించినా ఇప్పుడుఇక్కడమీ ప్రయత్నం నాకిష్ఠం కావడం లేదు.  మునివృత్తికి శాంతి ప్రధానం. ఆయుధ ధారణ కౌర్య ప్రధానం. ఒకటి శుద్ధ సాత్త్వికం, ఇంకొకటి శుద్ధ తామసం. నువ్వు చేయబోయే ఈ పని పరస్పర విరుద్ధ గుణాలున్నది. కాబట్టి రెండింటిలో ఒకటి వదలు. శస్త్రాన్నైనా వదలు, లేదా, క్షాత్రమైనా వదలుకో.’ అని వివరించింది.

‘శస్త్రాన్ని ధరిస్తే దాన్ని ఉపయోగించాలన్న పాపపు బుద్ధి పుట్తుందికాబట్టి నువ్వు అడవుల్లో వున్నన్నాళ్లు శస్త్రం ధరించవద్దు. శస్త్రాన్ని ధరించాలనుకుంటేఅయోధ్యకు మరలిపోయిన తరువాతగృహస్థ ధర్మంలో వున్నప్పుడుధర్మ సంరక్షణార్థం శస్త్రాన్ని ధరించవచ్చు. అనుభవించాల్సిన ఐశ్వర్యంపాలించాల్సిన భూమి వదలిపెట్టి మునిలాగా అడవుల్లోకి వచ్చిన నువ్వుమునిలాగానే తపస్సు చేస్తే మంచిది. ధర్మంతో ధనం లభిస్తుందిధర్మం వల్ల సుఖం కలుగుతుందిధర్మంతో చేసే సత్కర్మలు మంచి ఫలితాలను ఇస్తాయిధర్మహీనుడు చేసే సత్కర్మలు ఫలించవుధర్మం చెడితే జగమంతా చెడుతుందినువ్వు అడవుల్లో తిరిగినంత కాలం హింసా వ్యాపారం లేకుండా వుండకూడదారాముడు క్రూరుడు అంటారేమోనని విచారిస్తున్నాను’ అన్నది సీత.

ప్రతిజ్ఞ వీడను

సీతతో జవాబుగా శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నాడు.

‘దండకారణ్యంలో నివసిస్తున్న మునీశ్వరుల సమూహాలు మా దగ్గరకు వచ్చి, అనేకవిధాలుగా తాము పడుతున్న దుఃఖాలను చెప్పి, తమను రక్షించాలని ప్రార్థించారు. దండకారణ్యంలో వున్న రాక్షసులు తమపై పగ బూని, తాము హోమం చేస్తున్న సమయంలో తమను బాధపెట్తున్నారని, ఆ బాధ పడలేక తమకు రక్షకుడు ఎవరు వస్తారో అని విచారపడ్తుండగా, తమ పుణ్యఫలం వల్ల నేను దొరికానని అన్నారు. తపస్సు చేయడం సులువు కాదనీ, అది మిక్కిలి కష్టకార్యమనీ, అంత కష్టపడి చేద్దామంటే మధ్య-మధ్యలో విఘ్నాలు కలుగుతున్నాయనీ, తమ తపశ్సక్తి పోగొట్టుకోదల్చు కోలేక వారిని శపించడం లేదనీ, ఎంతమందిని అలా శపించగలమనీ, ఒక వేళ శపించినా తమకింక ఏ శక్తి మిగుల్తుందనీ, జీవించినా వ్యర్థమే కదా అనీ, వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్లిలా చెప్పగా వారిని కాపాడాలని ప్రతిజ్ఞ చేశాను. వట్టి మాటలు చెప్పి కన్నీళ్లు తుడిచి పంపలేదు.’

‘నేనే దిక్కని నమ్మిన ఆ ఆశ్రితులను ఎలాగైనా పాడైపొమ్మని తిరస్కరించడం ధర్మమా? హింస నిషేధం అనేది నేను అంగీకరిస్తా. నిరపరాధులైన సాధువులను హింసించడాన్ని హింస అంటారు కాని అసాధువులను హింసించడాన్ని హింస అనరు కదా? రాక్షస వధమీద నాకున్న ఉద్దేశం ఏంటి? అదేమన్నా వినోద క్రీడా నాకు? వాళ్లను నేను కామంతో కాని, క్రోధంతో కాని, లోభంతో కాని, మదమాత్సర్యాలతో కాని, మోహంతో కాని చంపాలనుకోవడం లేదు. సాధువుల మేలుకొరకై చేసే పని మాత్రమే. ఈ మునులు అడవుల్లో, అక్కడొక కాయ, ఇక్కడొక కూర తెచ్చుకుని దాంతోనే కడుపు నింపుకుని దేహయాత్ర చేస్తారు. రాక్షసులేమో మృగాలనే కాకుండా మనుష్యులను కూడా పీక్కుని తింటారు. మునులు ధర్మపద్ధతిన నడుస్తే, వారు దయాదాక్షిణ్యాలు లేకుండా క్రూరపద్ధతిన నడుస్తారు. ఇలాంటి నిష్కారణ హింసాపరాయణులైన రాక్షసులను వధించి శిష్ట రక్షణ చేయడం అధర్మమా?’

ఇది నా నిశ్చయం

‘నాకు సత్యం అన్నింటికంటే ముఖ్యం కాబట్టి ప్రాణాలున్నంతవరకు ఆడినమాట తప్పను. నువ్వే దిక్కని నన్ను ఆశ్రయించి, ఎప్పుడుకూడా ఇతరులకు హాని కలిగించే వాటి జోలికి పోకుండా, దిక్కులేనివారిగా వున్న మునులను, రాక్షసులు పనిగట్టుకుని వధించారు. ఇంతకంటే విరోధమైన పని ఏమన్నా వుందా చెప్పు? నన్ను ఆశ్రయించేదాకా ఎవరేపాపాలు చేసినా వారి పాపఫలం వాళ్లే అనుభవిస్తారని, వారిని నేను రక్షించే ప్రయత్నం చేయను. ఒకసారి నన్ను ఆశ్రయిస్తే, నేనే దిక్కని వారి రక్షాభారం నామీద వేస్తే, పాపకార్యాలు చేయకుండా వుండే దిక్కులేనివారిని రక్షించడమే నాపని. దానికి నేను కట్టుబడి వున్నాను. అలాంటి వారిని, నా రక్షణలో వున్నవారిని, నా ఆశ్రితులను, రాక్షసులు చంపుతున్నారు. నా భక్తులు నాప్రాణంతో సమానం. నా భక్తులను భాదించడమంటే నన్ను బాధించడమే. ఇక నా మనోనిశ్చయం విను. సత్యాన్ని రక్షించేందుకు ప్రాణాలైన విడుస్తాను. ప్రాణాలకంటే ఇష్టమైన నిన్నైనా విడుస్తాను. నీ కంటే ప్రియమైన తమ్ముడినైనా విడుస్తాను. కానీ ప్రతిజ్ఞ విడువను. అందునా, మునుల కార్యాన్ని రక్షించడం నా విధి. వారే వచ్చి, నేను చేయాల్సిన పనిని గుర్తుచేసిన తరువాత, వారికి ప్రతిజ్ఞ చేసికూడా ఎలా నెరవేర్చకుండా వుంటాను? నన్ను నమ్మి, నన్ను స్మరించి, నన్ను ధ్యానించి, అర్చించి, జపించి, సేవించి, వర్ణించి, కీర్తించి నాపై ఋణమెక్కించిన వారి ఋణం నేను తీర్చుకోవద్దా? అని సీతకు నచ్చచెప్పాడు.  

తర్వాత చిత్రకూటం నుండి బయల్దేరి సీతారామలక్ష్మణులు అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటారు. ఆయన తన భార్య, పరమ పతివ్రత అనసూయాదేవిని సీతాదేవికి పరిచయం చేశాడు. వారిరువురి మధ్య జరిగిన సంభాషణలో రామచంద్రమూర్తి తన పరాక్రమంతో స్వయంవరంలో తనను పెళ్లి చేసుకున్న వివరాలను సీత అనసూయకు చెప్పింది. మరునాడు మునీశ్వరుల దీవెనలు తీసుకుని సీతారామలక్ష్మణులు తిరిగి ప్రయాణమయ్యారు. దండకారణ్యం ప్రవేశించారు.

వేదాంత బోధ

రామాయణంలో శ్రీసీతారామలక్ష్మణులు మినహా, తక్కినవారందరూ సందర్భానుసారంగా వచ్చినవారే. ఈ ముగ్గురి సంబంధం చిద చిదీశ్వరుల సంబంధాన్ని తెలుపుతున్నది. ప్రకృతికి అధిష్ఠాన దేవత లక్ష్మి. ఆవిడే సీత. ఈమె చైతన్య స్వరూపిణి. ప్రకృతి బద్ధమైన ఆత్మ స్థానంలో సీతను చెప్పారు. లక్ష్మణుడు ప్రకృతి సంసర్గంలేని జీవుడు. కాబట్టే ఆయన్ను భార్యతో జంజాటంలేని వాడిగా చెప్పారు. శ్రీరాముడు ఈశ్వరుడు. ప్రకృతి బద్ధజీవుడు, శుద్ధజీవుడు. ఇరువురూ ఈశ్వరుడిని ఆశ్రయించి, ఆయనకు శేషభూతులై ఉంటారు. ఈ తత్వం తెలిసినవాడు ముక్తుడవుతాడని భగవద్గీత చెపుతోంది. శ్రీమద్రామాయణం ఈ ముగ్గురి సంబంధమనే విషయం ఆద్యంతం బోధిస్తున్నది. అందుకే రామాయణం పదేపదే చదవాలి.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

No comments:

Post a Comment