Sunday, August 18, 2024

పూర్ణావతారుడైన శ్రీకృష్ణుడు సాంప్రదాయ, సనాతన ధర్మ జగత్ గురువు ...... భారతీయ, హైందవ, వైదిక సంస్కృతి – ‘సజీవ వాహిని సనాతన ధర్మం’ -2 : వనం జ్వాలా నరసింహారావు

 పూర్ణావతారుడైన శ్రీకృష్ణుడు సాంప్రదాయ, సనాతన ధర్మ జగత్ గురువు

భారతీయ, హైందవ, వైదిక సంస్కృతి – ‘సజీవ వాహిని సనాతన ధర్మం’ -2

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (19-08-2024)

వేదవ్యాసభగవానుడు మానవాళికి ప్రసాదించిన మహోన్నత ఇతిహాసమైన శ్రీమహాభారతం వైదిక పురాణాలు, ధర్మ, తత్వ, వేదాంత, న్యాయ సహా సకల శాస్త్రాల సమ్మిళితం. అనంతమైన భారతీయుల వైదిక జ్ఞానం, జీవన విధానానికి మూలం. సనాతన ధర్మానికి ప్రతీక. సనాతన ధర్మ శాస్త్ర విజ్ఞాన సర్వస్వం. లోకరీతిని వివిధ కోణాలలో వివరిస్తూనే, సానూన్య ధర్మాలనూ, విశేషధర్మాలనూ సోదాహరణంగా ఉపదేశించే ధర్మనీతి సంహిత. ధర్మసూక్ష్మాలను సూత్రీకరించే జాతీయ కావ్యం. మహాభారతంలో అనేక సందర్భాలలో ధర్మం మీద సందర్భోచితంగా విజ్ఞానపరమైన చర్చలు కనిపిస్తాయి. ఇవి నిశితంగా విశ్లేసిస్తే సనాతన ధర్మ విచారణ అర్థం చేసుకోవచ్చు.

ఉదాహరణకు నారదుడు ధర్మరాజుకు రాజధర్మం గురించి చెప్పిన విషయాలన్నీ సనాతన ధర్మాలే. అజ్ఞాతవాసానికి వెళ్లేముందు ధౌమ్యుడు పాండవులకు చెప్పిన సేవాధర్మాలు, ‘సామాన్య నియమావళి’, వృత్తి ధర్మ ప్రభోధ, ఎన్నటికీ ఆచరణ యోగ్యమైన సనాతన ధర్మాలే. కురుక్షేత్ర సంగ్రామానికి పూర్వం, హస్తినలో ధృతరాష్ట్ర, దుర్యోధన, విదుర, కుంతీదేవిలను కలవడంతో సహా, రాజనీతికి శిఖరాయమాణమైన శ్రీకృష్ణ రాయబారం వరకూ దౌత్యవేత్తలు నేర్చుకునే ధర్మాలు అనేకం. కురుపాండవ యుద్దారంభంలో అర్జున విషాదయోగం,  శ్రీకృష్ణుడి తత్త్వజ్ఞానోపదేశం (భగవద్గీత), అర్జునుడి అహంకార, మమకారాలను తొలగించి, క్షత్రియ ధర్మం యుద్ధమని చెప్పి, ఆత్మజ్ఞానం కలిగించి, ఆధ్యాత్మికతత్త్వం బోధించి, కర్తవ్యోన్ముఖుడిని చేయడం ధర్మాలలోకల్లా గొప్ప ధర్మం. అహర్నిశలూ ఆచరణయోగ్యమైన సనాతన ధర్మం. 

భారతంలో శాంతి, ఆనుశాసన పర్వాలు చదివి, అర్థం చేసుకుంటే, ఆధునికతకు అన్వయించుకునే అద్భుతమైన సనాతన ధర్మాలన్నో అవగతమౌతాయి. అంపశయ్యపై వున్న భీష్ముడు, శ్రీకృష్ణుడి ఆదేశానుసారం సమస్త సనాతన ధర్మాలను ధర్మరాజుకు ఉపదేశించి నిర్యాణం చెందాడు. వేదవ్యాసమహర్షి సంస్కృతంలో, బమ్మెర పోతన తెలుగులో రచించిన శ్రీమద్భాగవతం ఒక మహా పురాణ గ్రంథం, వేదవేదాంత తత్త్వాల కలయిక, సనాతనధర్మసారం. భాగవత కథానాయకుడు, పూర్ణావతారుడైన శ్రీకృష్ణుడు సాంప్రదాయ, సనాతన ధర్మ జగత్ గురువు. మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశాత్మక భగవద్గీత సనాతనధర్మాలకు ఆలవాలమైన  విజ్ఞానసర్వస్వం. సృష్టి క్రమాన్ని, రహస్యాలను, వివరాలను, వికాసాలను, అపురూపమైన ప్రకృతి రహస్యాలను, జీవుల నడవడికను, జీవన విధానాన్ని ఆవిష్కరించే మహావైజ్ఞానిక గ్రంథం భాగవతం. 

          జగత్తు సృష్టి, స్థితి, లయలు పరమాత్ముడి తోనే ఏర్పడ్డాయనీ, ఆయన ఉనికితోనే సృష్టికి ఉనికి ఏర్పడిందని, వ్యాస మహర్షి, బమ్మెర పోతన భాగవతం ఆదిలోనే తెలియచేశారు. ఈ విశ్వానికి పరమ పురుషుడు ఒక్కడేనని, ఆయనే పుట్టించడం, పాలించడం, నాశనం చెయ్యడం అనే పనులను బ్రహ్మ, విష్ణు, శివుడు అనే పేర్లతో చేస్తూ ఉంటాడని, వారిలో శ్రీహరి సకల చరాచర కోటికి శుభాలను ఇస్తాడని, ఆ క్రమంలోనే భగవంతుడు 21 అవతారాలను ఎత్తాడని, అనేక ధర్మాలకు భాష్యం చెప్పాడని, భాగవతం వివరిస్తుంది. భాగవతాన్ని వినడం వల్ల, చదవడం వల్ల భగవంతుడి మీద ప్రేమ కలిగి, విష్ణువును సేవించాలనే బుద్ధి పుడుతుంది. రెప్పపాటు కాలం హరినామ స్మరణ చేసినా చాలు, ముక్తి కలుగుతుంది.

శ్రీమహాభాగవతంలో ప్రపంచోత్పత్తి గురించి, అంతుచిక్కని సృష్టి రహస్యం గురించి, పిండోత్పత్తి క్రమం గురించి అనేక రహస్యాలున్నాయి. సృష్టి అంతా భగవత్ సృష్టే. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల పుట్టుకకు కారణం ఆ వాసుదేవుడే! పద్నాలుగు లోకాలు ఆ శ్రీహరి నియమించినవే! సురలంతా ఆ దివ్య స్వరూపుడి శరీరం నుండి పుట్టినవారే! వేదాలు, యుగాలు, తపస్సులు, యోగాలు, విజ్ఞానం ఇవన్నీ నారాయణుడికి చెందినవే! సర్వాంతర్యామి, సర్వాత్ముడు, అన్నిటికీ సాక్షీభూతుడు ఆ పరమేశ్వరుడే! అతడి అనుగ్రహంతో మాత్రమే బ్రహ్మ సృష్టిస్తూ ఉంటాడు.

కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత, అర్జునిడి కోరిక ప్రకారం, శ్రీకృష్ణుడు లోగడ యుద్ధంలో చెప్పిన అద్భుతమైన తత్త్వబోధక వాక్యాలన పరతత్త్వాన్ని, ఉత్కృష్టమైన, జ్ఞానరూపమైన బ్రహ్మతత్త్వాన్ని మరోమారు తెలియచేశాడు. వాటిలో ముఖ్యమైనవి: ‘ధర్మ సాధనకు శరీరం గొప్ప సాధనం. ధర్మం విశిష్టమైన మోక్షజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రాణులన్నీ సత్త్వంలోనే పుట్తాయి. అందులోనే ప్రవర్తించి, అందులోనే అణగిపోతాయి. మూడు గుణాలతో కూడిన సత్త్వచరిత్ర ఇదే. సనాతనధర్మం శుభప్రదమైన అత్యుత్తమ మార్గం. దీనిద్వారా శ్రేయోరూపమైన మోక్షసాధన సులభం. ఆత్మవిద్యా సాధకులు కాకుండా ఎవరుకూడా మోక్షప్రాప్తిని పొందలేరు. జ్ఞానం విశిష్టమైనది. అది ఎప్పుడూ నశించదు. దానిని తెలియడం వల్ల అభిమానం, అహంకారం, మమత తొలగి మానవుడు నిర్మలుడవుతాడు. అట్లాంటివాడే మోక్షమార్గాన్ని అవలంబించ గలుగుతాడు.’

సృష్టి అంతా పంచభూతాత్మకమని, నరుడిని పాపపుణ్యాలు వదలవని, జీవితాన సర్వాంతర్యామి ప్రజ్ఞ అని, జీవనంలోని సుఖదుఃఖాలు, రాగద్వేషాలు, సర్వజీవన వ్యాపారాలు ప్రజ్ఞాజనితాలే అని, కాబట్టి ప్రజ్ఞ కీర్తికరమని అనడం నిశ్చయమని, అన్ని విధాలా ప్రజ్ఞయే ఉత్తమాశ్రయమని వేదవ్యాసుడు భీష్ముడి మాటల్లో చెప్పిస్తాడు మహాభారతంలో. మానవుడు చేస్తుండే దానం, తపస్సు, పెద్దల సేవ అనే పనులన్నీ మార్పు చెందేవిధానం, వాటి పర్యవసానం, దాని ఫలితం కూడా స్పష్టం చేశాడు భీష్ముడు.

 ‘శుభం వెంట శుభం, అశుభం వెంట అశుభం, భయం మీద భయం, చేటుమీద చేటు, కీడుమీద కీడు, పరుగు పరుగున వెన్నంటి వచ్చి మనిషిని కుంగదీస్తుంది. నరుడిని ధర్మం మరొక ధర్మానికి నడిపించి అతడికి శుభపరంపర కలిగేట్లు చేస్తుంది. అదే అధర్మమైతే వ్యతిరేక దిశలో సాగి, ఫలితాలు కూడా వ్యతిరేకంగా వుంటాయి. నరుడు చేసిన పాపపుణ్యాలు అతడిని నీడలాగా వెన్నంటి వుంటూ, అతడు చనిపోతే అవీ అతడిని అనుసరించి పరలోకాలకు వెళ్లుతాయి. అతడు జీవించి వుంటే అవీ అతడితో పాటే జీవిస్తూ అతడు చేసే ప్రతి పనిమీదా తమ ప్రాభవాన్ని చూపుతూ వుంటాయి. నరుడు బతికినా, చనిపోయినా అతడు చేసిన పాపపుణ్యాలు మాత్రం అతడిని వదలవు. తమ ప్రభావాన్ని చూపుతూనే వుంటాయి అని భీష్ముడు చెప్పడంలో ఎంతో అర్థం వున్నది. ఆచారం ధర్మానికి మూలమని, ఇది అనూచానంగా, పరంపరగా మానవ సమూహంలో ఒక తరం నుండి మరొక తరానికి వారసత్వంలాగా అందుతూ వుంటుందని, అయితే ఈ సుదీర్ఘ కాలవాహినిలో కొన్ని ఆచారాలు కాలం చెల్లి అసందర్భాలుగా, అసంగతాలుగా మారుతూ వుంటాయని, వివేకైన నరుడు కాలానుగుణమైన మార్పుతో ఆచారాన్ని స్వీకరించాలని, భావన. 

మహాభాగవతంలో ‘కాలం కథ చక్కగా వివరించడం జరిగింది. ఈశ్వరుడు కాలానికి తగిన రూపం ధరించి, తగిన రూపాన్ని గైకొని, కేవలం వినోదానికై తనను తానే సృష్టించుకున్నాడు. ఈశ్వరుడిలోనే లోకాలన్నీ ఉంటాయి. అన్ని లోకాలలోనూ ఈశ్వరుడు ఉంటాడు. అనంత విశ్వానికి కార్యం, కారణం రెండూ ఆయనే! ఆ మహాపురుషుడి నుండి వెలువడి విశ్వం ప్రకాశిస్తున్నది. శ్రీమహావిష్ణువు మాయవల్ల విశ్వమంతా ఒక పద్ధతిలో పుట్టి, పెరిగి, నాశనమవుతూ ఉంటుంది. భవిష్యత్తులోనూ ఇలాగే జరుగుతుంది. పరమేశ్వరుడి సృష్టికి అంతం, అన్యవస్తు సంయోగం, రెండూ అవసరం లేదు. ఈ యావత్ ప్రపంచం పుట్టుకే వేరు.

లోకంలో ప్రాణికోటికి మేలు, కీళ్లు, చావు, బతుకులు, సుఖానుభావాలు, దుఃఖపీడనలు వచ్చి పడుతూ వుంటాయి. అయితే ఎప్పుడు మేలు జరిగినా, ఎప్పుడు కీడు వాటిల్లినా, సుఖం కలిగినా, దుఃఖం ముంచుకొచ్చినా, మనిషి సమభావంతో నిలిచి వుండాలి. అప్పుడే మేలు, కీడుల ప్రభావం అలాంటి వారిమీద ప్రసరించదు. నరులలో శరీర బలం, బుద్ధి, వివేకం, పనులలో ఎంతో సామర్థ్యం కలవారున్నారు. ఇవేవీ లేనివారు కూడా పుష్కలంగానే వున్నారు. కాని కాలుడు మాత్రం కాలం సమీపించినప్పుడు ఇరుతెగలవారినీ స్వేచ్చగా, తిరుగులేకుండా హరించివేస్తూనే వున్నాడు. కాలుడి దగ్గర బలవివేక సామర్థ్యాలేవీ కొరగావడం లేదు. త్రిగుణాలు శాంతించి ఉన్నవారిలో అలుక కలగదు. విధి కోరికను బట్టి ప్రాణుల జీవితాలలో వికాసం కానీ, వినాశం కానీ జరుగుతుంటుంది. విధి చేష్టలు బలీయాలు. ఇతరుల దైన్యాన్ని చూసి ఎకసెక్కాలాడడం నీచ స్వభావం’ అని భీష్ముడి మాటలుగా భారతంలో చెప్పడం జరిగింది.

వేదాలలో చెప్పబడిన ధర్మం, అర్థం, కామం అనే మూడు ప్రశస్తమైన పురుషార్థాలలో ఏది లభిస్తే గొప్పగా వుంటుందో అంపశయ్య మీద వున్న భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు ఇలా: ‘ధర్మం ముఖ్య పురుషార్థం. అర్థకామాలు సైతం పురుషార్థాలే. ధర్మాన్ని అనుసరించి అర్థకామాలను అనుభవించాలి. ధర్మ విరుద్ధమైన అర్థకామాలు శ్రేయస్సు కలిగించవు. అర్థకామాలకంటే ధర్మమే ప్రధానం. పురుషార్థాలలో శ్రేష్టమైన ధర్మాన్నే ఆచరించాలి’. మానవుడు పాపకార్యాలకు పూనుకోవడానికి, పుణ్యకార్యాలు చేయడానికి కారణం లేకపోలేదని, పుణ్యపాపాలు రెండు అంటకుండా వుండి, మోక్షం పొందే అవకాశం కూడా లేకపోలేదని అన్నాడు భీష్ముడు. సంపదలు దుఃఖ నిలయాలని, కామసుఖం, దివ్యసుఖం, ఆశలేమి వల్ల కలిగే సుఖానికి ఈడు కావని, అర్థం అనాయాసంగా లభించగానే ఆశ కూడా పెరిగిపోతుందని, ఆశాప్రభావం వల్ల కలిగే మమకారం పెరిగిపోతుందని, మమకారం తొలగితే తృష్ణ అనే సాగరం ఎండిపోతుందని భీష్ముడు అన్నాడు.

జీవాత్మ కడలి కెరటాల లాగా పుట్టుతూ, గిట్టుతూ వుంటుందని, భూమి, నీరు, కాంతి, గాలి, ఆకాశం, అనే పంచ భూతాల స్వభావాలైన వాసన, ద్రవం, తేజస్సు, చలనం, శబ్దం అనేవి ఇంద్రియాల ద్వారా గ్రహింపునకు వస్తాయని చెప్పాడు భీష్ముడు. చెవి, ముక్కు, నోరు, తోలు, కన్ను అనే ఇంద్రియాలు వాసనను కలిగించే పంచభూతాల గుణాలు అనుభవానికి రావడానికి ఉపకరణాలుగా పనిచేస్తాయని అన్నాడు. వీటి ద్వారా అనుభవం కలగడానికి ఆధారభూమి మనస్సని, ఆ మనస్సు ద్వారానే విషయజ్ఞానం లభిస్తుందని చెప్పాడు. ప్రాపంచిక విషయజ్ఞానం మానవుడిలో ప్రవృత్తిని రేకెత్తించి జననమరణ చక్రంలో పడేసి తిప్పుతుందని, ఆ చక్రభ్రమణం నుండి బయట పడాలంటే ఇంద్రియాలను మళ్లించి మనస్సుతో వాటిని చేర్చితే బుద్ధిని అణచి వేయవచ్చని, ఆవిధంగా పురుషుడు అంతర్ముఖుడైనప్పుడు అతడిలో బుద్ధి గోచరించని స్థితి కలుగుతుందని వివరించాడు భీష్ముడు.

(వేదం, భారతం, భాగవతం, శ్రీరామాయణం భారతీయ సంస్కృతీ రూపాలు:

సజీవ వాహిని సనాతన ధర్మంపుస్తకం నుండి సంక్షిప్త సేకరణ)

 

 

No comments:

Post a Comment