సమకాలీన సినిమా విజ్ఞాన సర్వస్వం, రెంటాల ‘ఫస్ట్ రీల్’
వనం జ్వాలా నరసింహారావు
సినిమాలంటే అంతంతమాత్రమే ఇష్టపడే నాలాంటివాడిని, సినిమా సంబంధమైన సమకాలీన విజ్ఞాన స్వర్వస్వం, ‘మన సినిమా, ఫస్ట్ రీల్’' పుస్తకం, మా అమ్మాయి ప్రేమ మాలిని ద్వారా నా చేతికి అందిన తక్షణమే నన్ను ఆకట్టుకోవడమే కాకుండా, అందులోని విషయాలను దాదాపు ఆమూలాగ్రంగా చదివేస్థితి కలిగించిందంటే, దానికి ‘సంస్కృతం నుంచి సైన్స్ దాకా’ చదివి, ముచ్చటగా మూడు పీజీలు మూడు ప్రధాన నగరాలలో పూర్తిచేసిన పుస్తక రచయిత ‘రెంటాల జయదేవ’ను మనస్ఫూర్తిగా అభినందించాలి. మానవ విలువల పరిరక్షణకు సాహిత్యం ఎంత మోతాదులో అవసరమో, సమకాలీన నవ-సమ సమాజంలో సినిమా మాధ్యమం ద్వారా విలువల పరిరక్షణకు విమర్శనాత్మక దృక్ఫధంతో సాహిత్యపరంగా, సినిమా చరిత్రను గ్రంధస్తం చేయడం అంతే అవసరం.
‘మన సినిమా, ఫస్ట్ రీల్’' పుస్తకానికి ముందు మాటలు రాసిన ప్రముఖులలో ఒకరు, ‘తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన భారతీయ దర్శక ధీరుడు, పద్మశ్రీ ఆవార్డు గ్రహీత’ ఎస్ఎస్ రాజమౌళి, పుస్తకాంశం ‘సినిమా ప్రేమికులకు గొప్ప ఫీల్’ అంటూ చెప్పిన విషయాల సంగ్రహం కూడా ఇదే. ‘సినిమా పుట్టుక ఒక అద్భుతం. అసలు సినిమా అనేదే ఓ మహాద్భుతం! అన్ని కళలను తనలో ఇముడ్చుకున్నది సినిమా’ అంటారాయన. అందుకే, భావితరాలవారికి సినిమా సంబంధిత విజ్ఞానాన్ని అందించాలి. పండిత రచయితల రెంటాల వంశంలో జన్మించి, ‘తెలుగు సినిమా రాజధాని విజయవాడ’లో పెరిగి, తెలుగు సాహిత్యంలో పీహెచ్డి సాధించిన ‘నా స్నేహితుడు’ డాక్టర్ రెంటాల జయదేవ, ఈ పనిని సమర్థవంతంగా చేసినందుకుకు, సినీరంగ ప్రముఖులతో సహా ఆబాల గోపాలం సినీ ప్రేక్షకులు ఆయనను మనసారా అభినందించాలి. బహుశా జయదేవ, తన ‘పంచ ప్రాణాలను’ సాహిత్యం, సినిమా, సంస్కృతీ, సమాజం, స్నేహంలో నిలిపినందువల్లే ఇది సాధ్యపడవచ్చు. ‘పుస్తకం డాక్టరేట్ కు అర్హమైన గొప్ప పరిశోధనా గ్రంథం’ అన్న రాజమౌళి మాటలు పూర్తిగా నిజం. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
నాదైన పద్ధతిలో, నా అలవాటు ప్రకారం పుస్తకం ఆసాంతం తిరగేస్తున్నప్పుడు, అన్నిటికన్నా నన్ను ఆకట్టుకున్నది జయదేవ ‘సంభాషణాత్మక రచనాశైలి.’ రచయితకు, పాఠకుడికి మధ్య వుండాల్సిన సంబంధం సంభాషణ లాంటిదని నా అభిప్రాయం. అలా వున్నప్పుడే పాఠకుడు పుస్తకాన్ని మనసుపెట్టి చదవగలడు. ఇరువురు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థంకాకపోతే ఆ సంభాషణకు అర్థంలేదు. అలాగే రచయిత రాసింది పాఠకుడికి అర్థంకాకపోతే అసలు అది భాషే కాదు. రచన అంతకంటే కాదు. ఇదే విషయాన్ని జీన్ పాల్ సాత్రే ‘సాహిత్యం అంటే ఏంటి’ అన్న తన పుస్తకంలో చతురోక్తులతో ధృవ పరుస్తాడు. రచయిత తన మేథస్సునుండి పెల్లుబుకిన ఆలోచనను, పాఠకులు అర్థంచేసుకుని, ఆకళింపు చేసుకునే రీతిలో వాక్యంగా మలిచినప్పుడే, ఆ రచనకు గుర్తింపు వస్తుందంటాడు జీన్ పాల్ సాత్రే. నలుగురితో చదివించలేని రచన చిత్తుకాగితంతో సమాన మంటాడు. రచనంటే కేవలం సాహితీ ప్రక్రియ మాత్రమే కాదు. రచయితకు, పాఠకుడికి మధ్య తలెత్తనున్న ఘర్షణ. అలాగే విశ్వనాథుడు ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న విషయం అందరికీ తెలిసిందే. రెంటాల జయదేవ రాసిన ‘మన సినిమా ఫస్ట్ రీల్’ చదువుతుంటే, ఈ విషయాలు గుర్తుకు వచ్చాయి.
మరో ముఖ్యమైన విషయం, సమకాలీన అంశంపై రచన చేయడం అనేది సవాలుతో కూడుకున్న పని అనేది. శతాధిక వసంతాల భారతీయ సినిమా పుట్టుపూర్వోత్తరాలైనా, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ తెరవెనుక కథైనా, ‘కాళిదాస్’ చరిత్రైనా, సంపూర్ణ దక్షిణ భారతీయ సినిమా కథాకమామీషైనా, పరిశోధనాత్మక ఆధారిత మరే అంశమైనా, రచనా పరంగా కానీ, అంశం పరంగా కానీ విజయవంతం కావాలంటే సందర్భానుసారంగా (Contextualize) విషయవివరణ (Content) ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటూ వుండాలి. సమకాలీన అంశం రచనలో ప్రాథమిక స్థంభం. ఇది అంశానికి సంబంధించిన కాలం, స్థలం, సామాజిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యాలను అందిస్తుంది. ఇక విషయం అనేది రచన యొక్క అసలు మూలం. ఇది వివరాలను, వాస్తవాలను, విశ్లేషణలను అందిస్తుంది. పరిపూర్ణమైన విషయవివరణ, నిర్ధిష్టమైన సమాచారాన్ని చేర్చడం ద్వారా పాఠకులకు స్పష్టతనూ, సంపూర్ణతనూ అందిస్తుంది. ఈ విధంగా విశ్లేషించి చూస్తే అద్భుతంగా సాగింది పుస్తక రచన.
సందర్భం లేకుండా విషయవివరణ ఆకర్షణీయంగా ఉండదు. అదే విధంగా, విషయవివరణ లేకుండా సందర్భం నిష్ఫలంగా మిగిలిపోతుంది. ఎవరైనా రచయిత ఈ రెండింటి సమన్వయాన్ని సమర్థవంతంగా రూపొందిస్తే, వారి రచన విశ్వసనీయతను పొందటమే కాక, సమగ్రమైన సమాచారం అందించగలదు. ప్రత్యేకించి, ఒక అంశాన్ని ‘విజ్ఞాన సర్వస్వం’ మాదిరిగా వివరించడానికి ఈ పరస్పర ఆధారిత సంబంధం కీలకం. సూక్ష్మతతో కూడిన పలు సినీరంగ విషయాలను, సమయస్పూర్తిని జోడించి, రచయిత జయదేవ సమర్థవంతంగా తన పుస్తకంలో ఆవిష్కరించడం విశేషం. ఈ రెండింటి పరస్పర సంబంధాన్ని కూలంకషంగా చక్కగా అవగాహన చేసుకుని, అద్భుతంగా రాసిన పుస్తకం ‘మన సినిమా, ఫస్ట్ రీల్.’ భారత, ముఖ్యంగా దక్షిణ భారత సినిమా సంగ్రహ చరిత్ర సమగ్రంగా రాయాలంటే సందర్భం, విషయవివరణ మధ్య ఉన్న సవాళ్లను, సమన్వయాన్ని అర్థం చేసుకుంటూ ఆసాంతం రచన సాగాలి. అదే విజయవంతంగా జరిగింది ‘మన సినిమా, ఫస్ట్ రీల్’ పుస్తకంలో.
‘ఎందుకంటే’ అన్న శీర్షికన ఎమెస్కో సంపాదకులు దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి రాసినట్లు, ‘చరిత్రను ఎప్పటికప్పుడు రాసిపెట్టక పోతే, మనకు గతం తెలియకుండా పోతుంది. వర్తమానంలోనూ, భవిష్యత్తు కోసమూ, నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో దొరక్కుండా పోతాయి.’ ఆ లోటు లేకుండా, ‘సినీ సాహిత్యాన్ని’ జయదేవ మన ముందు వుంచారు. ‘తెలుగు వారి సినిమా చరిత్ర పరిజ్ఞానాన్ని ఈ పుస్తకం కచ్చితంగా మెరుగుపెడితుంది’ అని ఆయన రాసిన వాక్యాలు అక్షర సత్యాలు. సినిమా దర్శకులలో అత్యంత ప్రతిభాశాలి, మూడు భాషలలో సందేశాత్మక, ప్రయోగాత్మక, కథాభరిత వైవిధ్యంగల తన సినిమాలతో ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించిన ‘సినీరంగ భీష్మాచార్యుడు’ సింగీతం శ్రీనివాసరావు మెప్పు పరిపూర్ణంగా పొందిన పుస్తకం ఇది. అంతటి గొప్పవాడినే ‘కళ్ల ముందు రీళ్లు తిరిగిన గతం’ అనిపించగలిగిందంటే పుస్తకం విలువ అర్థం చేసుకోవచ్చు. ‘సినిమాను నిత్యం ప్రేమించి, శ్వాసిస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వివరాలున్నాయి’ అని రాస్తూ, తన జీవితంలోని ఎన్నో సందర్భాలు, సంఘటనలు, హెచ్ఎం రెడ్డి, ఎల్వీ ప్రసాద్, సి పుల్లయ్య, పీ పుల్లయ్య, కెవి రెడ్డి లాంటి ఎందరో మహానుభావులతో ఎదురైన తన అనుభవాలు జ్ఞప్తికి తెచ్చుకున్నారు సింగీతం శ్రీనివాసరావు. ‘తెరవెనుక కష్టానికి అక్షర రూపం!’ అన్న ‘ఊర్వశి శారద, పుస్తకం చదివి తన నట ప్రయాణాన్ని నెమరు వేసుకున్నారు.
‘భాషల ఎల్లలు చెరిపిన అఖిలభారత పుస్తకం ఇది అనీ, పుస్తకంలో ప్రస్తావించిన అన్ని భాషల సినిమాలలో నటించిన సమకాలీన నటుడిని అనీ’ రాస్తూ, దక్షిణ భారతదేశానికి చెందిన రంగస్థల నటుడు, విలక్షణ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రకాశ్ రాజ్ ఈ పుస్తకం విషయంలో మరెవ్వరూ చెప్పని ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ సినిమా వచ్చేవరకు ఆంధ్ర ప్రాంతపు సంస్కృతి, సంప్రదాయం, మాండలికమే కనిపించేవనీ, ఆ తరువాత తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, యాస, గోస, మట్టి కథలు, మనిషి వ్యధలు, ఆచారాలు, వ్యవహారాలు తెరమీదకు వచ్చాయనీ, మరో కొత్త సాంస్కృతిక చరిత్ర తెరపై దృశ్యబద్ధం అయిందనీ, ఆ దృష్టితో సినిమాలను అవలోకించడం, అధ్యయనం చేయడం, అవసరమనీ అన్నారు. అలా తెలియచేసే అవసరాన్ని ఫస్ట్ రీల్’ రచనల లాంటివి తీరుస్తాయని, ఒకరకంగా ఇది ‘స్టడీ ఆఫ్ అవర్ కల్చరల్ గ్రోత్’ అని అన్నారు. ‘మన సినీ సౌధపు గతాన్ని తెలియచేస్తూ, వర్తమానాన్ని విశ్లేషిస్తూ, భవిష్యత్తువైపు ఆశాభావంతో అడుగులు వేయించారు రెంటాల జయదేవ. మన సినిమా చరిత్రకు అరుదైన అక్షర రూపంగా ఇది చాలా ఇంపార్టెంట్ బుక్’ అన్నారు.
‘మన సినిమా, ఫస్ట్ రీల్’ పుస్తక రచయిత డాక్టర్ రెంటాల జయదేవ ‘పాతికేళ్ల పంచరంగుల కల’ అనే శీర్షికన తాను ఈ పుస్తకం ఎందుకు రాసిందీ, రాయాల్సి వచ్చిందీ వివరిస్తూ తత్సంబంధిత సమగ్ర నేపధ్యాన్ని కఠోర నిజాలతో సహా ఆవిష్కరించారు. ‘నువ్వు జీడీ పైసల’ పొదుపుతో సినిమా చూసిన సందర్భాలు, సినిమా డిస్ట్రిబ్యూటర్ల ఒకప్పటి ఆదరణ, పెద్దల పరిచయాల ‘లర్నింగ్ ఎక్స్పీరిఎన్స్,’ విజయవాడ ఫిల్మ్ సొసైటీ, ఇస్కాస్ ఫిల్మ్ సొసైటీ జ్ఞాపకాలు, కల్చరల్ రిపోర్టింగ్ అనుభవాలు, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలను చూసిన అనుభవం, ‘సినీ విజ్ఞాన సర్సస్వాల’ లాంటి వ్యక్తుల పరిచయాలు, సినిమా జర్నలిజం అంటే తూష్ణీభావం లాంటి అంశాలను పేర్కొంటూ, గతంలో సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర రాసిన వారెవరూ సినీ సాహిత్యాన్ని అందులో ఒక చిరు శాఖగానైనా ప్రస్తావించలేడనీ, ఆమాటకొస్తే, అసలు సాహిత్యంగానే పరిగణించలేదనీ ఆవేదన వ్యక్తపరిచారు.
566 పేజీలలో, అవతారికకు అదనంగా 8 అధ్యాయాల కింద, 45 అంశాలుగా ‘మన సినిమా, ఫస్ట్ రీల్’ పుస్తకాన్ని రూపొందించారు రచయిత జయదేవ. శతాధిక వసంతాల భారతీయ సినిమా, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా,’ తెరవెనుక కథ, తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్,’ టాకీ పులి హెచ్ఎం రెడ్డి, తొలినాళ్ల తమిళ టాకీ కథ, తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ రిలీజ్ వివాదం, కన్నడిగుల విజయగీతిక, మౌనం వీడిన మలబారు సీమ అనే శీర్షికన ఉన్నాయి ఎనిమిది అధ్యాయాలు. అధ్యాయాలు, అంశాలకు సంబంధించిన విషయాలను క్లుప్తీకరిస్తూ రచయిత కొన్ని ఆసక్తికరమైన వివరాలను తన ముందుమాటల్లో ప్రస్తావించారు. దానికి సంబంధించిన ముందు-వెనుకల పేరాల సారాంశం ఈ సమీక్షలో రాస్తే పాఠకులు ముందుకు సాగడం సౌలభ్యం.
చరిత్ర అంటే నాలుగు గట్ల మధ్య బంధించిన చెరువు నీళ్లు కాదనీ, అది నిరంతరం ప్రవహించే జీవనదనీ, సినిమా చరిత్ర అయినా అంతేననీ అంటూ వివరంగా మున్ముందు చెప్పబోయే కొన్ని అంశాలను ప్రస్తావించారు రచయిత. ‘తమిళ సినిమాగా ప్రచారమవుతూ తెలుగువారు వదిలేసిన కాళిదాస్ నిజానికి తెలుగు డైలాగుల సినిమా. మొట్టమొదటి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద రిలీజ్ తేదీ సెప్టెంబర్ 15, 1931 కాదు. అసలు రిలీజ్ తేదీ ఫిబ్రవరి 6, 1932. మొదటి పూర్తి తమిళ టాకీ హరిశ్చంద్ర భక్త ప్రహ్లాద తరువాత వచ్చినదే. మొదటి కన్నడ టాకీ కథానాయిక త్రిపురాంబ అంటూ ప్రచురిస్తున్న ఫోటోలో ఉన్నది వేరెవరో తమిళ కథానాయిక’ లాంటివి వీటిలో ప్రధానం. సందర్భానుసారంగా సుమారు రెండువేల అరుదైన అలనాటి పత్రికా ప్రకటనలను, చాయా చిత్రాలను పుస్తకంలో పొందుపర్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు రచయిత.
‘మన సినిమా, ఫస్ట్ రీల్’ పుస్తకంలోని ప్రధాన అంశాలన్నీ సమీక్షలో పేర్కొనాలంటే అది ఒక ‘మోనోగ్రాఫ్’ లాగా తయారవడం తధ్యం. అందుకే అతి కొన్ని మాత్రమే తెలుసుకుందాం. ‘ప్రపంచంలో సినీ మాధ్యమానికి ఉన్నంత వయస్సు, ఉద్విగ్నభరిత చరిత్ర భారతదేశంలోని సినీ పరిశ్రమకు కూడా సొంతం. ప్రపంచంలో రెండో అతిపెద్ద సినీ పరిశ్రమగా వెలుగొందుతున్న భారతీయ సినిమా ఇప్పుడు కీలకమైన మైలురాయికి చేరింది. చలన చిత్రాల రూపకల్పనకు దిగిన మొట్టమొదటి భారతీయుడు, ‘సావే దాదాగా’ పిలువబడే హరిశ్చంద్ర సఖారామ్ భట్వాడేకర్. తెలుగు సినిమా ఆదిపురుషుడు రఘుపతి వెంకయ్య నాయుడు 1909-12 మధ్యకాలంలోనే ప్రముఖ సినీ దర్శకుడిగా ఎదిగారు. తెరపైకి వచ్చిన తొలి భారతీయ నటీమణులు, దుర్గాబాయ్ కామత్, ఆమె కూతురు కమలాబాయ్ గోఖలే. దక్షిణాది మూకీ పితామహుడు నటరాజ ముదలియార్. దక్షిణాదిలో తయారైన తొలి కథాచిత్రం కీచక వధమ్.’
‘తెరమీద నటీనటుల మాటలు వినిపించిన తొలి మోషన్ పిక్చర్ జాజ్ సింగర్ చూసేందుకు అమెరికా న్యూయార్క్ సినిమాహాలు ముందు జనం గుంపులు గుంపులుగా నిలబడడం విశేషం. జీజీభాయ్ జమ్షెడ్జీ మదన్ ఆధ్వర్యంలోని మదన్ థియేటర్స్ భారతదేశంలో తొలిసారిగా కలకత్తాలోని వారి స్వంత ఎల్ఫిన్స్టన్ పిక్చర్ ప్యాలెస్ లో “మెలోడీ ఆఫ్ లవ్” అనే విదేశీ టాకీ చిత్రాన్ని ప్రదర్శించింది. తొలి భారతీయ సినీ గీతం ఆలమ్ ఆరా చిత్రంలోని “దేదే ఖుదా కే నామ్ పర్ ప్యారే..”. వెండి తెర మాట నేర్వడంతో దూసుకొచ్చిన సింగింగ్ స్టార్ పేరు కజ్జన్. తొలి భారతీయ మహిళా డైరెక్టర్ ఫాతిమా బేగ్ ముగ్గురు కథానాయికల తల్లి! ఫస్ట్ దక్షిణాది స్టార్ హీరోయిన్ టిపి రాజ్యలక్ష్మి’. ఇలా రాసుకుంటూ పోతే ఎన్నెన్నో వున్నాయి. ఆ వివరాలు పూర్తిగా పుస్తకం చదివితేనే అవగాహనకొస్తాయి. సమీక్షకు అందనంత ఎత్తున అద్భుతంగా మలిచారు రచయిత.
‘మన సినిమా, ఫస్ట్ రీల్’ పుస్తకంలో విశేషంగా చెప్పుకోవాల్సింది, చివరలో ‘బంగారు పళ్లానికి గోడచేర్పు’ అనే ‘ఎపిలోగ్’ లాంటి ఆకర్షణీయమైన శీర్షిక. అందులో పుస్తకాన్ని గురించి, రచయిత గురించి, పలువురు ప్రముఖుల ప్రశంసలున్నాయి. ఆ ప్రముఖులు: విఎకె రంగారావు, వకుళాభరణం రామకృష్ణ, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, స్వర్గీయ కాట్రగడ్డ నరసయ్య, గంటి రమాదేవి (గంటి సుబ్రహ్మణ్య శర్మ), డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి. అసూయపడాల్సినంత ఎత్తుకు ఎదుగుతాడు జయదేవ అనీ, పరిశోధనాత్మక రచన అనీ, ఎవరూ చేయని కృషి ఇది అనీ, దక్షిణాదికే గర్వకారణం అనీ, ఈ తరం విజ్ఞానఖని జయదేవ అనీ ప్రశంసలు కురిపించారు వీరంతా.
రెంటాల రచించిన ‘మన సినిమా, ఫస్ట్ రీల్’ పుస్తకం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పుట్టుక, పురోగతిపై ఆవిష్కరించిన ఒక విలక్షణ దృక్కోణం. పుస్తకాన్ని ఆసాంతం చదివితేనే కాని దానికి సంబంధించిన ప్రత్యేకమైన విశేషాలు అర్థం కావు. తెలుగు సినిమాల ఆరంభ దశలు, మౌన చలనచిత్రాల నుంచి ప్రాసంగిక చలనచిత్రాల దాకా ఉన్న పరిణామాలను సమగ్రంగా ఆవిష్కరిస్తుంది. సినిమా సామాజిక జీవనంపై, సంస్కృతిపై చూపించిన ప్రభావాన్ని నిగ్రహంగా విశ్లేషించింది. ‘మన సినిమా, ఫస్ట్ రీల్’ ఒక చారిత్రక ప్రాముఖ్యమైన పరిశోధనాత్మక పుస్తకం అనడంలో అతిశయోక్తి లేదు. మున్ముందు మరిన్ని రెంటాల ‘రీళ్లు’ రావాలి. (కూతురు ప్రేమ సలహా, సౌజన్యంతో).
No comments:
Post a Comment