బీఆర్ఎస్ చూపిన బాట ఉంది కదా
(సమగ్ర కుటుంబ సర్వే ద్వారా దశాబ్దం క్రితమే
బీసీల అభ్యున్నతికి కేసీఆర్ చొరవ)
వనం జ్వాలా నరసింహరావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (12-02-2025)
దశాబ్ద కాలం క్రితం నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)’ గణాంకాలు, ఇటీవల నిర్వహించిన ‘తెలంగాణ కులగణన (టీసీఎస్)’ గణాంకాల మధ్య, బీసీల జనాభా శాతం వ్యత్యాసం వున్నదన్న చర్చ తీవ్రంగా జరుగుతున్నది. బీసీల జనాభా శాతం పెరిగిందన్న ప్రభుత్వ వాదన సరైనది కానే కాదని, వాస్తవానికి తగ్గిందని బీఆర్ఎస్ నాయకులు సోదాహరణంగా గణాంకాలను ఉటంకిస్తూ విభేదిస్తున్నారు. టీసీఎస్ లో పెరిగిన బీసీల శాతం ముస్లిం బీసీలను జనరల్ బీసీ కేటగిరీలో చేర్చడంవల్లేనన్నది బీఆర్ఎస్ నాయకుల వాదన. ‘బీసీల హక్కులసాధన విషయంలో, రిజర్వేషన్ల విషయంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టాలి. సిఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని కేవలం అసెంబ్లీలో చెప్పడమే కాకుండా త్రికరణశుద్ధితో ఆచరణలో పెట్టడానికి చొరవ తీసుకోవాలి.
బీజేపీ నాయకులు కూడా శాసనసభ లోపల, వెలుపల టీసీఎస్ విషయంలో తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎస్కేఎస్ గణాంకాలలో బీసీ శాతం గురించి పారదర్శకత లేదన్న ప్రభుత్వ వర్గాల ఆరోపణ అసమంజసం అనేది కూడా వంద శాతం సహేతుకం. గణాంకాలను నిశితంగా విశ్లేషించి చూసేవారికి, చిటికెడంత ఆశ్చర్యం కలుగుతున్నదనాలి. ఎందుకంటే, ఎస్కేఎస్ డేటాను ‘ఎత్తిపోతల పథకం’ లాగా అటుది-ఇటుగా, ఇటుది-అటుగా ‘నకల్’ చేసే ప్రయత్నం జరిగినట్లు అనుమానం కలుగుతున్నది.
ఒక ప్రధాన ప్రతిపక్షంగా, గతంలో చిత్తశుద్ధితో సమగ్ర కుటుంబ సర్వే చేసిన ప్రభుత్వ పార్టీగా, ఒక ఆరోపణ చేసినప్పుడు, వారిచ్చే సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఇలా చేయకుండా, ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసనసభ వెలుపలా, లోపలా, ప్రత్యారోపణలు చేయడం, ప్రజాస్వామ్య విలువలకు సరిపోదేమో! ప్రభుత్వం, దాని నాయకుడు, ఒకింత సంయమనం పాటించి, అసహనం వీడి, డేటాలను సమన్వయంచేస్తూ, అన్వయించుకుంటూ, రాజ్యాంగ ప్రమాణాల, సామాజిక వాస్తవాల, చట్టపరమైన పరిమితులకు అనుగుణంగా శాస్త్రీయతతో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు నిజమైన లబ్దిదారులకు చేరేలా ఆలోచన చేస్తానని ‘రాజనీతిజ్ఞతతో’ చెప్పడం సమంజసం. విమర్శకు ప్రతివిమర్శ సమాధానం కాదు.
ఎస్కేఎస్, టీసీఎస్ సర్వేలలోని మెరుగైన అంశాలను తీసుకుని, వాటిని సమీకృతం చేసి, ‘అత్యధిక సంఖ్యాకులకు అత్యధిక మేలును అందించే’ సిద్ధాంతాన్ని పాటిస్తూ, వివక్షతలకు తావీయకుండా, రాజకీయ ప్రేరణల ప్రభావం లేకుండా, అవసరమైతే ఒక శాస్త్రీయ ప్రత్యామ్నాయ ‘హైబ్రిడ్ మోడల్’ రూపొందించే ఆలోచన చేస్తామని సభాముఖంగా సభానాయకుడు శాసనసభలో హామీ ఇచ్చినట్లయితే ఆయన వ్యక్తిత్వం ఆకాశం ఎత్తున ఎదిగేది. అదొక మేలైన మార్గంగా పరిణమించడానికి బాటలు వేసేది. తద్వారా రాజకీయాలకు అతీతంగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు నిజమైన లబ్దిదారులకు చేరువలోకి వచ్చే సదవకాశం పరిపూర్ణంగా కలిగేది.
ప్రభుత్వం, దాని నాయకుడి వాదననే పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తే, వారు చెప్తున్నట్లు, ‘తెలంగాణ కులగణన’ ఎంత మేలు కలిగించేదైనప్పటికీ, బీసీ జనాభాశాతం గణనలో తేడాలు, ముస్లిం బీసీలను హిందూ బీసీలతో కలిపి చూపడంలాంటి అంశాలు మేధావుల, మేదావేతరుల ఆక్షేపణలకు, తీవ్ర చర్చకు అవకాశం ఇస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో వీటిని పోల్చి చూపిస్తూ, బీఆర్ఎస్ నాయకుకు పేర్కొంటున్న వ్యత్యాసాలను, అధికారపక్ష నాయకులు ఎవరికీ నచ్చిన రీతిలో వారు, శక్తివంచనలేకుండా తమ వాదనను సమర్ధించుకోవడం హాస్యాస్పదం. ఇలా వాదించడానికి పూర్వం, ఎస్కేఎస్ ‘మాక్రో-లెవల్’ హోలిస్టిక్ డేటను’’ అందులోని అంతర్గత సందేశాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవడమే, ప్రస్తుతం ప్రబుత్వం ముందున్న సమగ్ర విధానానికి కీలకం. టీసీఎస్ పూర్తిగా నాణ్యమైనదని, ఎస్కేఎస్ కానేకాదని, వాదించడానికి బదులు, ఇవి పరస్పరం అనుబంధంగా, అదనపు పరిశీలనగా, పరిపూరకంగా, సమృద్ధిగా వున్నాయని అంటే మేలేమో!
ఎస్కేఎస్ 100% గృహ గణనను జరిపి గణాంకాలను క్రోడీకరించగా, దీనికి భిన్నంగా, టీసీఎస్ కేవలం 96.9% కవరేజీ మాత్రమే సాధించింది, ఆ గణన ఆధారంగానే, కులాల వారీగా వివరమైన విభజనను అందించింది. అయితే, ఎస్కేఎస్ కు టీసీఎస్ కు వున్న గణాంక వ్యత్యాసాలను సమగ్రంగా, కూలంకషంగా అధ్యయనం చేయకుండా, ఒకింత పాక్షిక ధోరణితో, అనవసర భయాందోళనలకు దారితీసేలా ప్రభుత్వపక్ష రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులైన మేథావులు, అనుమానాల నివృత్తి దిశగా కాకుండా వ్యాఖ్యలు చేయడం సమస్యను జటిలం చేయడంతోసహా, బీసీలకు జరగాల్సిన మేలు జరగకుండా చేస్తున్నారు. టీసీఎస్ డేటాను భూతద్దంలో చూపడానికి ముందుగా, ఎస్కేఎస్ డేటాను నిష్పక్షపాతంగా పరిశీలించడం, అదీ లోతైన అవగాహనతో చేయడం అత్యవసరం. సమగ్ర కుటుంబ సర్వే, కులగణన సర్వేలు రెండింటినీ సమన్వయపరుస్తూ, గణాంకాలను సమగ్రంగా విశ్లేషించి, సంక్షేమ, రిజర్వేషన్ విధానాలను రూపొందించడం ప్రభుత్వానికి మంచిది.
‘సమగ్ర కుటుంబ సర్వే’ దేశంలోనే అలా నిర్వహించిన వాటిలో మొదటిది. ఆగస్టు 19, 2014 న, తెలంగాణ రాష్టవ్యాప్తంగా, ఆనాడున్న 90 లక్షల కుటుంబాలను కవర్ చేస్తూ నిర్వహించబడింది. ‘ప్రతిఒక్కరి సమగ్ర సామాజిక-ఆర్థిక గణాంకాలను’ సేకరించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్టంగా, లాభదాయకంగా అర్హులైనవారికి అందేలా చూడడం సర్వే మౌలిక లక్ష్యం. మానవ వనరుల సహాయంతో ఒకేఒక్క రోజులో పూర్తి డేటా సేకరించి, కేవలం 14 రోజుల్లో కంప్యూటర్ డేటా ఎంట్రీ చేశారు. ‘మానవ శక్తి + సాంకేతికత’ కలయికతో అనుకున్నది సాధించడంవల్ల, ఇది దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇదే బాటలో, దశాబ్దం తరువాత, ‘మొదటి కుల గణన’ అంటూ, 112 లక్షల కుటుంబాలను కవర్ చేసినట్లు ప్రభుత్వం చెప్తున్నది. ఈ గణనకు ఎస్కేఎస్ లాగా ఒకేఒక్క రోజు కాకుండా, 50 రోజులకు పైగా సమయం పట్టింది.
సర్వేల మధ్య సారూప్యతలు, వ్యత్యాసాలు వున్నాయనేది వాస్తవం. సమగ్ర కుటుంబ సర్వే 100% గణన ఆధారంగా బీసీల జనాభాను 51 శాతంగా పేర్కొంది. టీసీఎస్ 96.9% కవరేజీ ఆధారంగా బీసీల శాతం 56.33గా పేర్కొంటూనే, హిందూ బీసీలు 46.25 శాతం, ముస్లిం బీసీలు 10.08 శాతం అని ‘మెలిక’ పెట్టింది. షెడ్యూల్డ్ కులాలు ఎస్కేఎస్ లో 18 శాతం కాగా, టీసీఎస్ లో 17.43 శాతం. షెడ్యూల్డ్ తెగలు ఎస్కేఎస్ లో 10 శాతం కాగా, టీసీఎస్ లో 10.45 శాతం. ఇతర కులాలవారు (ఓసీలు) ఎస్కేఎస్ లో 21 శాతం కాగా, టీసీఎస్ లో 15.79 శాతం గా నమోదైంది. రెండు సర్వేలలో ఎస్సీ, ఎస్టీ శాతాలు దాదాపు ఒకేలా వుండడం గమనార్హం. ఎస్కేఎస్ 51 శాతం బీసీ జనాభాలో ముస్లిం బీసీలు లేరు. బహుశా ఎస్కేఎస్ ఓసీ జనాభాలో అది కలిసి వుండే అవకాశాలున్నాయేమో?
అప్పుడు ముస్లిం బీసీలను బీసీ జనాభాలో కలిపినట్లయితే ఎస్కేఎస్ బీసీ శాతం, టీసీఎస్ బీసీ శాతం; ఎస్సీ, ఎస్టీ శాతాల మాదిరిగానే దాదాపు సమానం అవుతాయి. ఈ అంతరాన్ని సరిగ్గా అర్థంచేసుకుని, అనుమానాలను నివృత్తి చేసుకోకుండా, టీసీఎస్ బీసీ శాతం పెరిగిందని ఏకపక్షంగా వాదించడం సమంజసం కాదు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుదల విషయంలో పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందనడంలో సందేహం లేదు. ఫిబ్రవరి 4, 2025న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడుతూ, కేంద్రం కూడా టీసీఎస్ తరహాలో కుల, సామాజిక-ఆర్థిక సర్వే నిర్వహించాలంటూ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ఆమోదించింది. అదొక ‘చారిత్రాత్మక దినంగా’ పేర్కొన్నారు సిఎం. ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి, టీసీఎస్ ‘చారిత్రక ప్రాముఖ్యతను’ నొక్కి వక్కాణిస్తూ, బీసీల హక్కుల సాధన విషయంలో, రిజర్వేషన్ల విషయంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టాలని సూచించారు. మంచిదే!
కానీ, ఏడేళ్లు వెనక్కు పొతే, 2017 ఏప్రిల్ 16న ‘తెలంగాణ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు రిజర్వేషన్ బిల్లు’ అసెంబ్లీలో ఆమోదించబడిన వేళ, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రిజర్వేషన్ల విషయంలో నిర్ణయాత్మక రాష్ట్ర హక్కులను గట్టిగా, అత్యంత సమర్ధవంతంగా సభలో ప్రసంగించడం ఇంతకంటే ‘మరింత చారిత్రాత్మక ఘట్టం’ అని చెప్పాలి. కేసీఆర్ మాట్లాడుతూ, సమగ్ర కుటుంబ సర్వే డేటా పరిపూర్ణమైనదని, అత్యున్నత న్యాయస్థానం విధించిన 50% పరిమితిని దాటి రిజర్వేషన్లు పెంచడానికి అది సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదని స్పష్టం చేశారు. బీసీల రిజర్వేషన్ల పెంపునకు కేసీఆర్ అపారమైన చొరవ తీసుకున్నారు. అలాగే ముస్లిం బీసీ-ఇ రిజర్వేషన్ 4 శాతం నుండి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్ 6 శాతం నుండి 10 శాతానికి, ఎస్సీ రిజర్వేషన్ 15 శాతం నుండి 16 శాతానికి పెంచే ప్రతిపాదన చేసారు. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి, రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ల (42 శాతం) పెంపుతో సహా, మొత్తం రిజర్వేషన్లను 62%కి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఆ దిశగా నిరంతర కృషి చేశారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయ ప్రయోజనాలకొరకు గణాంకాలను వాడుకోవడం కాకుండా, వాటిని సామాజిక న్యాయ సాధనంగా ఉపయోగించాలి. బాధ్యాతాయుతమైన ప్రతిపక్షం, అందునా మొట్టమొదటిసారిగా రికార్డ్ స్థాయి సమగ్ర కుటుంబ సర్వే ఒకేఒక్క రోజులో ద్విగ్విజయంగా చేయించిన ప్రభుత్వ పార్టీ నాయకులుగా ఇచ్చిన సూచనలను మన:స్ఫూర్తిగా ప్రభుత్వం స్వీకరించాలి. గగ్గోలు పెట్టడం సరైనది కాదు. ఏదేమైనా, కేసీఆర్, రేవంత్ అనుసరించే మార్గాలలోనే వ్యత్యాసం కనబడుతున్నది. ఎవరి మార్గాన్ని ఎవరు అనుసరిస్తున్నారో, అనుకరిస్తున్నారో అనేది వేరే సంగతి. కాకపోతే, వినయంగా వాస్తవాలను అంగీకరించకపోవడంలోనే తేడా కనిపిస్తున్నది. రాజకీయమంటే ఇదేనేమో! ‘మీ చర్యలు ఇతరులను మరిన్ని కలలు కనేటట్టు, మరికొంత ఎక్కువగా నేర్చుకునేటట్టు, ఎక్కువ పనిచేసేట్లు, ఇంకా మెరుగయ్యేటట్టు ప్రేరేపిస్తే, అప్పుడు మీరు నిజమైన నాయకుడు అవుతారు’ అని అమెరికా 6వ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ అన్నాడు. అంటే, నాయకుడి ప్రధాన బాధ్యత, తాను నడుస్తూ, ఇతరులను తనతోపాటు నడిపిస్తూ లక్ష్యసాధన దిశగా మలచుకోవడం. ‘సర్వేలు, డేటాను పక్కన పెడితే’ – ఎవరు ఎవరిని ప్రేరేపించారు? ఎవరి ప్రభావం ఎవరిమీద పడింది? అనేది అందరూ గుర్తించాల్సిన అవసరం వుండి.
తెలంగాణ కులగణన సర్వే డేటా ప్రభావం రిజర్వేషన్ విధానాన్ని, ముస్లిం బీసీల ప్రాభల్యం కారణంగా, ప్రతికూలంగా మారుస్తుందేమోనని, బీసీ నేతలు, మేధావులు సహజంగానే భయపడుతున్నారు. సర్వేలో ముస్లిం బీసీలను జనరల్ బీసీ క్యాటగిరీలో చేర్చడం వల్ల, హిందూ బీసీల వాటా తగ్గిపోతుందని వారు భావిస్తున్నారు. ఆందోళన పడుతున్నారు. ఇది సహజం. సర్వే డేటాను సమాజ వాస్తవాలను ప్రతిబింబించేలా, మారుతున్న సామాజిక-ఆర్ధిక అవసరాలకు అనుగుణంగా రిజర్వేషన్ విధానాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. రాజకీయ లక్ష్యాలకు వాడకుండా, నిజమైన సామాజిక సంక్షేమానికి ఉపయోగపడేలా ఉండాలి.
అందుకే భేషజాలను పక్కనపెట్టి, ఎస్కేఎస్ డేటాను తెలంగాణ కులసర్వే డేటాకు ఎలా అనుసంధానం చేయవచ్చో ఆలోచించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాలకు మేలుకలిగేలా, పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయ ‘హైబ్రిడ్ మోడల్‌ను’ రూపొందించాలి. వివాదాన్ని తీవ్రతరం చేయకుండా, పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నం జరగాలి. సామాజిక-ఆర్థిక దృక్పథంలో సమతుల్య అభివృద్ధి అవసరం. దానికి చొరవ చూపాల్సింది ప్రభుత్వమే. దాని నాయకుడు. ప్రతిపక్షాల సహకారం కూడా కోరాలి.
వివిధరంగాలకు చెందిన బీసీ సామాజిక వర్గాల ప్రతినిథుల భయాలను ప్రభుత్వం తొలగించాలి. సర్వపక్ష సహకారంతో సామరస్య బాటలు వేయాలి. ప్రభుత్వం, మేధావులు, అధికార-ప్రతిపక్ష బీసీ నాయకులు ఉమ్మడిగా రాజకీయ అడ్డంకులను అధిగమించే దిశగా ఎవరిపాత్ర వారు పోషించాలి. (‘పోప్ ఎన్నిక విధానం’ మాదిరిగా) ఒక నెల రోజులు ఆలశ్యమైనా, ఏకాభిప్రాయ సాధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పూనుకోవాలి. ‘బీసీల హక్కులసాధన విషయంలో, రిజర్వేషన్ల విషయంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టాలి.
రేవంత్ రెడ్డి కేవలం అసెంబ్లీలో చెప్పడమే కాకుండా త్రికరణశుద్ధితో దాన్ని ఆచరణలో పెట్టడానికి చొరవ తీసుకోవాలి. సర్వపక్ష ఆమోదమార్గం అన్నిటికన్నా ఉత్తమమైనది. దీని ద్వారా ఒక సమతుల్యమైన ‘హైబ్రిడ్ మోడల్’ అమలుకు మార్గం సుగమం అవుతుంది. (సమగ్ర చర్చల, ఏకాభిప్రాయం అనంతరం ‘తెల్ల పొగ’-వైట్ స్మోక్-క్షణం కోసం ఎదురు చూద్దాం!) సమగ్ర కుటుంబ సర్వే అయినా, తెలంగాణ కుల సర్వే అయినా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తమ హక్కులను పరిరక్షించుకోవాలి. ఆ దిశగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వేసిన బలమైన పునాదులమీద నిర్మాణం చేసే బాధ్యత మలి ముఖ్యమంత్రిమీద వున్నది.
No comments:
Post a Comment