పెట్టుబడుల ప్రకటనలతో సరిపోలని ప్రగతి
(ప్రపంచ ఆర్థిక వేదిక భావితరాలకు ఎలా ఉపయోగకారి?)
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిట్ పేజి (12-02-2025)
{ప్రపంచ ఆర్థిక వేదిక అంతర్జాతీయ భాగస్వామ్యాలను నిర్మించేందుకు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పెట్టుబడులను ఆకర్షించేందుకు విశిష్టమైన వేదికగా ఎదుగుతున్నప్పటికీ, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ-ఉపాధి కల్పనవంటి వాస్తవిక ప్రయోజనాలు సాధించడం గురించి నిరంతరం అనుమానాలు వ్యక్తమవుతూనే వున్నాయి.}-సంపాదకుడి క్లుప్త పరిచయం
ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్-డబ్ల్యుఇఎఫ్) వార్షిక సమావేశాలను, అంతర్జాతీయ పెట్టుబడుల అవగాహన ఒప్పందాలకు (ఏమ్వోయూ) పరిమితం చేయకుండా, పారిశ్రామిక, ఆర్ధిక, సామాజిక రంగాలలో నిష్ణాతులైన పలువురు ప్రపంచ స్థాయి ప్రభావశీలులైన వ్యక్తులతో, దీర్ఘకాలిక పరిచయాలకు, నిరంతర నెట్వర్కింగ్ చేయడానికి, వర్తమానంలో, భవిష్యత్తులో ప్రపంచ దిశ-దశ ఏమిటి అనే విషయంలో అవగాహన కలగడానికి అవకాశంగా ఉపయోగించుకోవాలని ఆర్ధిక విశ్లేషకుల అభిప్రాయం. ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వెల్లడి చేశారు. ఇటీవలి డబ్ల్యుఇఎఫ్ దావోస్ వార్షిక సమావేశంలో, భారత కంపెనీలతో సహా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో పెద్ద ఎత్తున అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు కొందరు ముఖ్యమంత్రుల అవాస్తవ ప్రకటనల నేపథ్యంలో ఇలాంటి విశ్లేషణలకు ప్రాముఖ్యత వున్నదనాలి.
డబ్ల్యుఇఎఫ్ స్విట్జర్లాండ్‌లోని ఒక అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థగా 1971 జనవరి 24న జర్మన్ ఇంజనీర్, ఆర్థికవేత్త క్లాస్ స్క్వాబ్ తన 33 వ ఏట, యూరోపియన్ల యాజమాన్య వేదిక (యూరోపియన్ మేనేజ్‌మెంట్ ఫోరమ్) పేరుతోస్థాపించారు. దీని లక్ష్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, వ్యాపార, రాజకీయ, విద్యావేత్తలతో పాటు సమాజంలోని ఇతర ప్రతిభాశీలురైన నాయకులను ఒక ఉమ్మడి వేదిక మీదకు చేర్చి, వార్షిక సదస్సులు నిర్వహించి, ప్రపంచ, ప్రాంతీయ, పారిశ్రామిక విధానాలను రూపొందించడం. ఇటీవల ముగిసిన 54వ డబ్ల్యుఇఎఫ్ వార్షిక సమావేశం జనవరి 15-19, 2025 మధ్య దావోస్‌లో జరిగింది. కీలకమైన ప్రపంచ-ప్రాంతీయ సవాళ్లను పరిశీలించి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వృద్ధిని ప్రేరేపించడం, భౌగోళిక రాజకీయ తాకిడులకు ప్రతిస్పందించడం లాంటివి డబ్ల్యుఇఎఫ్ చేపట్టింది.
ఇందులో అంతర్జాతీయ సంస్థల, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారుగా 3000 మంది ప్రపంచవ్యాప్త విధాన నిర్ణేతలు, ప్రభుత్వ, వ్యాపార, పౌర సమాజ విద్యాసంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరిలో దేశాధినేతలు, ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఉన్నారు. అమెరికా నుండి 674 మంది, ఇంగ్లాండ్ నుండి 270, చైనా నుండి 140 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత దేశం నుండి, గతంలో కంటే, అత్యధిక సంఖ్యలో 133 మంది ప్రతినిధులు (‘ఒకే బృందం, ఒక భారతీయ ప్రదర్శన’ అనే థీమ్‌తో) హాజరయ్యారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు రాష్ట్ర ముఖ్యమంత్రులతో సహా, వివిధ రంగాల నుండి సుమారు 100 మంది సీఈఓలు పాల్గొన్నారు.
యూరోపియన్ మేనేజ్‌మెంట్ నిపుణలకు, అమెరికన్ మేనేజ్‌మెంట్ మెలకువలను, విధివిధానాలను నేర్పించడమనే క్లాస్ స్క్వాబ్ ప్రారంభ ఆలోచన, క్రమంగా ఆర్థిక, సామాజిక సమస్యలపై దృష్టి పెట్టడంగా మార్పు చెందింది. 1971 సంవత్సరం నాటి ప్రారంభ సమావేశానికి 400 మంది దిగ్గజ యూరోపియన్ వ్యాపారవేత్తలను, వివిధరంగ నిపుణులను ఆహ్వానించి, స్క్వాబ్ తన పూర్వ పరిచయాలతో, నేర్పరితనంతో, చాకచక్యంతో వ్యూహాత్మకంగా తక్షణ, భవిష్యత్తు నిధులను సమీకరించాడు. స్విస్ ఫెడరల్ ప్రభుత్వ పర్యవేక్షణలో లాభాపేక్షలేని సంస్థగా స్థాపించబడిన డబ్ల్యుఇఎఫ్, ప్రతిఏటా ప్రశాంతమైన పర్వత ప్రాంతం దావోస్‌లో ‘వార్షిక సమావేశాలు’ నిర్వహించడం ఆనవాయితీగా సాగుతున్నది. పరస్పర సహకార చర్చలకు అనువైన స్థలంగా దీన్ని ఎంచుకున్న స్క్వాబ్, డబ్ల్యుఇఎఫ్ ను ‘దావోస్ ఆత్మ’గా పేర్కొన్నారు.
(ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్, నైపుణ్యం సంతరించుకున్న ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్త. ప్రజా-పౌర సంబందాల నిపుణుడు. జాతీయ-అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక క్షేత్రాల్లో పేరొందిన వ్యక్తి. వీటికి అదనంగా, ప్రపంచ ఆర్ధిక వేదికను మరింత సార్ధక మార్పులు తేవడానికి, మరింత వినయం, బాధ్యత, నైతికతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఆద్యతన భవిష్యత్తులో సమాయత్తం చేయాలి. పెద్ద స్థాయిలో పెట్టుబడులు ఆర్థికాభివృద్ధికి సానుకూలమైన మార్గదర్శకాలు. ఇవి వాస్తవ వ్యతిరేక ప్రకటనలతో సరిపుచ్చకుండా, అసలు-సిసలైన అభివృద్ధి సంకేతాలుగా మారడం అత్యవసరం. నైతికతతో కూడిన ఆధునిక విధానాలతో ప్రపంచ ఆర్థిక వేదిక తన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ, వర్తమాన, భవిష్యత్తు సమాజానికి దార్శనికతను ఇవ్వడానికి దోహదపడేలా ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్ జాగ్రత్త పడాలి. వేదిక మరింత అర్థవంతం కావాలి.)
దావోస్‌లో డబ్ల్యుఇఎఫ్ కి స్థిరమైన ప్రాంగణం లేదు. కాకపోతే, పరిశోధన, వాణిజ్యం, సాంకేతికతపై దృష్టి సారించి, వ్యాపారం, ప్రభుత్వం, విద్యాసంస్థలు, పౌర సమాజాల నాయకులు కలవడానికి, వారిని కలపడానికి, చైనా దాలియాన్లో, మరికొన్ని ఇతర ప్రదేశాలలో ‘నూతన చాంపియన్ల ప్రత్యేక వార్షిక సమావేశాలు’ (యాన్యువల్ మీటింగ్స్ ఆఫ్ ద న్యూ చాంపియన్స్) డబ్ల్యుఇఎఫ్ నిర్వహించింది కొన్ని పర్యాయాలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015లో దాలియాన్‌లో జరిగిన అలాంటి ఒక ప్రత్యేక సమావేశంలో పాల్గొని, తనదైన ప్రత్యేక శైలిలో, తెలంగాణను పెట్టుబడుల స్వర్గంగా ప్రచారం చేయడంలో పూర్తిగా సఫలమయ్యారు. ఆ సమావేశంలో ఆయన చేసిన ‘రాజనీతిజ్ఞతతో కూడిన ఉపన్యాసం’ లోభారత ఆర్థిక వ్యవస్థను సమర్థించడం, చైనా అభివృద్ధిని ప్రశంసించడం, తెలంగాణ సాధించిన అభివృద్ధిని తెలియచేయడం విశేషం.
ప్రత్యేక ఆహ్వానితులకే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొనే వీలుంది. ఆర్థిక, రాజకీయ రంగంలో ప్రధాన పాత్రదారులు, క్లిష్టతరమైన ప్రపంచ సమస్యలను పరిష్కరించడం లాంటి డబ్ల్యుఇఎఫ్ లక్ష్యాలను ముందుకు తీసుకుపోగలిగేవారు సమావేశాలకు ఆహ్వానితులు. పెట్టుబడుల అవకాశాలకోసం తెరవెనుక లాబీయింగ్ చేయడానికి ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు. బహుశా అందువల్లనే, భారతదేశంనుండి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఈ వేదిక వార్షిక సమావేశాలలో పాల్గొంటారు. ఈ వేదికను 'జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక విధానాలను రూపకల్పన చేయడానికి ప్రోత్సహించే 'సామాజిక సంస్థ'గా కూడా చెప్పుకోవచ్చు. నిర్వాహకుల అవగాహనకు అతీతంగా, 'నియంత్రణల సడలింపుకు, మార్కెట్ స్వేచ్ఛకు’ ప్రాధాన్యమిచ్చే ‘నయా ఉదారవాద విధానాల' వేదికగా డబ్ల్యుఇఎఫ్ మారుతున్నదన్న విమర్శ వస్తున్నది. బహుశా, ప్రజల సార్వజనీక, విస్తృత ప్రయోజనాలకు ఈ వేదిక సరిపడకపోవచ్చునేమో. ఏదేమైనా, అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల పెట్టుబడి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఇది ప్రధాన వేదికే.
(1997లో దేవేగౌడ పాల్గొన్న రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొన్న మొదటి భారత ప్రధాని నరేంద్ర మోదీ. 2018 డబ్ల్యుఇఎఫ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న మోడీ, పలువురి ప్రశంసలను పొందిన అలనాటి తన కీలక ప్రసంగంలో, భారతదేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సులభతర వాణిజ్యం, విరివిగా పెట్టుబడి అవకాశాలను ప్రధానంగా ప్రస్తావించారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాలను సోదాహరణంగా ప్రస్తావిస్తూ, ప్రపంచ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షించారు. పర్యావరణ మార్పులు, తీవ్రవాదం వంటి ప్రపంచ సమస్యలపై అనర్ఘళంగా మాట్లాడుతూ, భారత్‌ను బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తిగా అభివర్ణించారు. ఈ నేపధ్యంలో, ఇటీవలి సమావేశంలో భాగంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వేదికమీద భారతదేశం 7% ఆర్థిక వృద్ధి సాధించడాన్ని క్లాస్ స్క్వాబ్ సముచితంగా ప్రశంసించారు.)
నారా చంద్రబాబునాయుడు 1990-2000 మధ్య కాలంలో, ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొన్న తొలి భారతీయ ముఖ్యమంత్రులలో బహుశా ప్రధముడు కావచ్చు. ఆ వేదికను చాకచక్యంగా ఉపయోగించుకుని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విదేశీ ప్రత్యక్ష–పరోక్ష పెట్టుబడుల కేంద్రంగా మలిచారు. హైదరాబాద్‌ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా రూపొందించి, దేశ ఐటీ వృద్ధిలో, ఆయన నిర్వహించిన పాత్ర అమోఘం. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో చర్చలు జరిపారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 2023లో నూ, ఇప్పుడూ కూడా, పాల్గొని, అమెజాన్, సన్ పెట్రోకెమికల్స్, టిల్‌మన్ గ్లోబల్ హోల్డింగ్స్ వంటి హేమాహేమీ సంస్థల నుండి రూ 1.78 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను తెలంగాణకు సాధించారు. ఈ పెట్టుబడులద్వారా సుమారు 49,550 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నట్లు ప్రభుత్వ అంచనా. ముఖ్యమంత్రిని, ఆయన సహచర ప్రతినిధుల బృందాన్ని అభినందించాలి.
ప్రపంచ ఆర్థిక వేదిక అంతర్జాతీయ భాగస్వామ్యాలను నిర్మించేందుకు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పెట్టుబడులను ఆకర్షించేందుకు విశిష్టమైన వేదికగా ఎదుగుతున్నప్పటికీ, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ-ఉపాధి కల్పనవంటి వాస్తవిక ప్రయోజనాలను ఎంతవరకు సాధిస్తున్నది అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతూనే వున్నాయి. చంద్రబాబునాయుడు పాలన చేసిన రోజుల నుండి, ఉమ్మడి అంధ్రప్రదేశ్, తదనంతర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు ఈ వేదికను సద్వినియోగం చేసుకుని, బిలియన్ డాలర్లలో పెట్టుబడులు పొందినట్లు ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనలు ఎంతమేరకు దీర్ఘకాలిక అభివృద్ధి సాధించడానికి దోహదపడుతాయనేది కూడా ‘బిలియన్ డాలర్ల’ ప్రశ్నే! లేదా, రాజకీయ స్వప్రయోజనాలను ప్రచారం చేసుకోవడానికేనా అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది.
ఈ నేపథ్యంలో, జనాభా సమస్యను మొట్టమొదట సూత్రీకరించిన విశ్వవిఖ్యాత బ్రిటీష్ ఆర్థికవేత్త రాబర్ట్ థామస్ మాల్థస్ ‘జనాభా సిద్ధాంతాన్ని’ ప్రపంచ ఆర్థిక వేదికలో రాజకీయ నాయకులు ప్రకటించే బిలియన్ డాలర్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే ఆసక్తికరంగా వుంటుంది. ఆహారధాన్యాల పెరుగుదల రేటు కంటే జనాభా పెరుగుదల రేటు హెచ్చుగా ఉంటుందని మాల్థస్ తన సిద్ధాంతంలో వివరించాడు. అంటే, మాల్థస్ సిద్ధాంతం ప్రకారం, ఆహార ధాన్యాల వృద్ధి అంకశ్రేణి క్రమంలో - అంటే 1, 2, 3, 4, 5... పద్ధతిలో పెరుగుతుంటే, జనాభా వృద్ధి గుణశ్రేణి క్రమంలో – అంటే, 1, 2, 4, 8, 16... పద్ధతిలో పెరుగుతుంది. డబ్ల్యుఇఎఫ్ వేదిక ఆధారంగా జరిగే ‘అవగాహనా ఒప్పందాలు’ దరిమిలా ‘అవి కలిగించే వాస్తవ ప్రయోజనాల’ మధ్య కూడా ఇలాంటి అసమానతలే వున్నాయి.
పెట్టుబడుల ప్రకటనలు, ఆర్థిక ప్రగతి, అభివృద్ధి భ్రమ, భారీ ఉద్యోగ-ఉపాధి కల్పనల ఆశలు రేకెత్తిస్తాయి. కానీ ఈ ప్రకటనల స్థాయిలో వాస్తవిక ఫలితాలు వుండడం లేదు. నిధుల విడుదల, మౌలిక ప్రాజెక్టుల అమలు, క్షేత్రస్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు సాధించడంలో అనేక నియంత్రణ సమస్యలు, ఆర్థిక అనిశ్చితులు, రాజకీయ ప్రేరిత హైప్ ప్రకటనలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ అసమానత కారణంగా అభివృద్ధి అంతరం ఏర్పడుతోంది. వాగ్దానాల ప్రకారం ఆర్థిక మార్పు సాధించడంలో విఫలమవ్వడం వల్ల సంశయాలు, విలంబం, విధాన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి పెట్టుబడుల ప్రకటనలు వాస్తవ ప్రగతితో అనుసంధానమయ్యేలా జాగ్రత్తపడాలి.
No comments:
Post a Comment