ప్రాణ భయం లేనిదే పరిణామవాదం
ఆత్మపరిశీలన,
కార్యరూపంలో ధర్మం
వనం
జ్వాలా నరసింహారావు
{{ప్రజాతంత్ర
దినపత్రిక (ఏప్రిల్ 12, 2026)}}
వావిలికొలను
సుబ్బారావు రావు (వాసుదాస స్వామి) రాసిన ఆంధ్రవాల్మీకి రామాయణం, అయోధ్య కాండ మందరం
చివర్లో అద్భుతంగా వర్ణించిన శ్రీరాముడి దినచర్య ఆధునిక పరిణామవాదానికి
(ఎవోల్యూషణ్ సిద్దాంతం) మార్గదర్శి అనవచ్చేమో! కాండ చివర్లో శ్రీరాముడి దినచర్య గురించి ఎందరికో
తెలియని ఎన్నో విషయాలను సోదాహరణంగా,
సందర్భోచితంగా వివరిస్తూ ఆయన ఈ అంశాన్ని సృజించారు అద్భుతంగా.
సాధువులను
రక్షణకు, పాపాత్ముల వినాశనానికి, ధర్మ
స్థాపనకు, ప్రతియుగంలో శ్రీమన్నారాయణుడు భూమ్మీద అవతరిస్తుంటాడు. ఈ అవతారాలే
మళ్లీ వస్తుంటాయి. వాస్తవానికి, పది
ప్రధాన అవతారాలే కాకుండా కొన్ని గౌణావతారాలు కూడా సంభవిస్తుంటాయి. ఈ అవతారాలే పునరావృతమవడం
వల్ల, ఇప్పటికి ఎన్ని మత్స్యావతారాలు, నృసింహావతారాలు, శ్రీరామావతారాలు,
కృష్ణావతారాలు అయ్యాయో చెప్పడం కష్టం. అవతారాలు వచ్చినప్పుడల్లా వారితో పాటే
హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, బలిచక్రవర్తి, రావణ, కుంభకర్ణులు,
కంస, శిశుపాలులు
లాంటి వారు కూడా వస్తారు. వారి సహాయకులు, సహచరులు, తల్లిదండ్రులు, అవతార
పురుషుడికి కావాల్సినవారు సహితం వస్తారు. అలాంటప్పుడు పరిణామవాదం తప్పనాలా?
ముక్తి, జన్మరాహిత్యం అనే పదాలు వ్యర్తమైనవా?
అవతారాలు
రావడం నిజమే. వారికి కావాల్సినవారు, విరోధులు రావడం నిజమే. బ్రహ్మేంద్రాదులు,
అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సప్తర్షులు, ఇలా అందరూ పుట్టడం యదార్థమే. అయినా ‘పరిణామ
వాదం’ తప్పుకాదు. ముక్తి అనేది వ్యర్థపదం కానేకాదు. బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు
లాంటి పదాలన్నీ ఆయా పదవుల పేర్లే కాని ఆ ఉపాధిలో వుండే జీవాత్మల పేర్లు కావు. ఆడిన
ఆటే ఆడాలి. పాడిన పాటే పాడాలి. అంతమాత్రాన పరిణామవాదం తప్పడానికి వీలులేదు. ముక్తి
అనేది వ్యర్థ పదార్ధం కానేకాదు. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ అనే
పదవుల్లో వుండేవారు మారుతూ వున్నారంటే,
కొత్తవారికి అవకాశం ఉన్నట్లే కదా.
అలాగే
బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు, ఇతర దేవతల పదవుల్లో వున్నవారు పోగానే, స్థానం ఖాళీ
కాగానే, మరో అర్హుడు ఆ స్థానంలోకి వస్తాడు. వాడి ఉద్యోగం వీడు చేస్తాడు. ఇలా వచ్చేవాడు
భిన్న జీవుడే కాని ఇంతకు ముందు వున్నవాడు కాదు. కాబట్టి ‘పరిణామ వాదానికి ప్రాణభయం’
లేదు. ముక్తుడికి పునర్జన్మ భయం లేదు. పరిణామక్రమంలో నడిమధ్యలో తెంపులు లేవు. ఒక
స్థానంలో రెండు జీవులుండవు. పరిణామం అంకెల లాంటిది. ఒకటి అనే అంకె ఒకటే అవుతుంది
కాని రెండు కాదు కదా! అందువల్ల,
జీవయాత్రా విషయంలో పరిణామమే సరైన మార్గం. లోకంలో వున్న వ్యత్స్యాలన్నిటికీ సరైన
సమాధానం చెప్పేది కూడా పరిణామమే.
బ్రహ్మాండకోటులు అనంతం. జీవకోటులూ
అనంతమే. ప్రపంచం నిత్యం. సంసారం నిత్యం. కాలం నిత్యం. నది ఒడ్డున నిలుచుని
చూస్తుంటే నీళ్లు, నీటి బిందువులు దాటిపోతూనే వుంటాయి. వాటి స్థానంలో మరికొన్ని
వస్తాయి. ఒక నీటి బిందువు సముద్రంలో ప్రవేశించగానే ఆద్యంతాలలో శూన్య స్థానం
లేనట్లే, జీవుడు ముక్తుడు కాగానే ఆ స్థానంలో కాని, ఆదిలో కాని, శూన్యం వుండదు.
కాబట్టి, ఆస్తంబ బ్రహ్మ పర్యంతం, అంటే గడ్డిపోచ
లేదా స్తంభం నుండి బ్రహ్మ దేవుని వరకు, బ్రహ్మ జన్మ దివసం మొదలు లయ దినం దాకా,
ఎంతైతే చర్య జరుగుతుందో, ఆ తరువాత
వచ్చే బ్రహ్మల కాలంలో అంతే చర్య, అట్లాగే,
కాకపోతే, ఇసుమంత భేదంతో జరుగుతుంది.
ఇది
సృష్టిలోని అత్యల్ప జీవి నుండి అత్యున్నత జీవి వరకు ఉన్న సమస్త చరాచర సృష్టిని
సూచిస్తుంది. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపాన్ని తెలియ చేస్తుంది. శ్రీరామవతారం
వైవస్వత మన్వంతరంలో ఐదవ మహాయుగమైన త్రేతాయుగంలో సంభవించింది. కృతయుగానికి 1728000
సంవత్సరాలు, త్రేతాయుగానికి 1296000, ద్వాపరయుగానికి 864000, కలియుగానికి 387000
కలిపి మొత్తం ఒక మహాయుగానికి 4275000 సంవత్సరాలు వుంటాయి. ఇలాంటి వేయి మహాయుగాలు
బ్రహ్మకు ఒక పగలు, మరో వేయి మహాయుగాలు ఒక రాత్రి అవుతుంది. ఇవి రెండూ కలిస్తే ఒక
రోజవుతుంది. దాన్నే కల్పం అంటారు. 360 కల్పాలు
బ్రహ్మకు ఒక సంవత్సరం. 36000
కల్పాలు బ్రహ్మాయువు.
త్రిమూర్తులలో అవతారాలు విష్ణువుకే కాని
మిగతా ఇద్దరికీ లేవు. విష్ణువు రాజసుడైన బ్రహ్మను సృష్టికార్యానికి, తామసుడైన
శివుడిని సంహారకార్యానికి నియమించి, రక్షాభారాన్ని తనమీద వేసుకుని, దానికి అవసరమైన
విధంగా ప్రవర్తిస్తాడు. దీనికి శాస్త్రీయ, సామాజిక హేతుబద్ధత లేకపోలేదు. శ్రమ
పడితే బిడ్డలు పుట్టుతారు. వారిని చంపడం కష్టమేమే కాదు. రక్షణ కలిగించడం మాత్రం
సులభం కాదు. దానికొరకు ఎన్ని వేషాలో వేయాలి. సర్వకాల సర్వావస్థలయందు బిడ్డలను
కనిపెట్టుకుని, వారి యోగ క్షేమాలను విచారిస్తూ,
వారిని సన్మార్గంలో నడపడం తేలిక విషయం కాదు. కాబట్టే విష్ణువు ఆ బాధ్యత
తీసుకున్నాడు. ఆ క్రమంలోనే మనిషి రూపంలో త్రేతాయుగంలో, రామావతారంగా జన్మించాడు.
శ్రీరాముడి జనన కాలంలో గురువు, చంద్రుడు,
కర్కాటక లగ్నంలో వున్నారు. అంటే జన్మ లగ్నం కర్కాటకం. మేషంలో రవి,
బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు వున్నారు. చక్రాకార
సంవత్సరాలు, కాల పరిమాణాలకు అనుగుణంగా, సంవత్సరాలను
గ్రహాల గమనాలతో అనుసంధానించేందుకు ఉపయుక్తంగా, గ్రహాల స్థానాలను నిర్ణయించే సాంప్రదాయ
జ్యోతిష గ్రంథం, కాల ప్రకాశిక ఆధారంగా, ప్రమాధి సంవత్సరంలో ధనస్సులో గురువు,
కుంభంలో శని ఉంటారు. ఖరనామ సంవత్సరంలో ధనస్సులో గురువు,
కర్కాటంలో శని వుంటారు. శోభకృతునామ సంవత్సరంలో ధనస్సులో గురువు,
శని ఇద్దరు వుంటారు. రాక్షసనామ సంవత్సరంలో ధనస్సులో గురువు,
మేషంలో శని వుంటారు. ప్రభవనామ సంవత్సరంలో ధనస్సులో గురువు,
కన్యలో శని వుంటారు. ఖరనామ సంవత్సరంలో ధనస్సులో గురువు వుంటే,
ఆయన కర్కాటకానికి రావడానికి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది.
ఖరకు
ఎనిమిదవది విలంబినామ సంవత్సరం. శ్రీరాముడి జననకాలంలో గురువు కర్కాటకంలో, శని తులలో,
ఉన్నందున ఆయన పుట్టిన సంవత్సరం విలంబి. నక్షత్రం పునర్వసువు. ఇది నిర్ధారించడానికి
శ్రీమద్రామాయణంలో ఇదామిద్ధమైన ఆధారాలు లేవు. శ్రీరంగమహాత్మ్యం అనే గ్రంథంలో
భగవంతుడు బ్రహ్మకు చెప్పిన మాటల ఆధారంగా కొంత తెలుస్తున్నది. తాను రఘువంశం వారు
పాలించే అయోధ్యకు పోవాలని అనుకుంటున్నాననీ, అక్కడ నాలుగు మహాయుగాలుంటాననీ, ఆ
తరువాత కావేరీ తీరానికి పోయి చంద్ర పుష్కరిణీ తీరంలో శయనిస్తాననీ చెప్పాడు
బ్రహ్మతో. విష్ణువు ఆజ్ఞానుసారం బ్రహ్మ తాను అర్చిస్తున్న శ్రీరంగధామాన్ని
ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చాడు. ఆయన ఫాల్గుణమాసం, శుక్లపక్షం,
పౌర్ణమినాడు, ఫల్గుణీ నక్షత్రాన, కుమారులు,
మనుమలతో, సంబరాలు జరుపుకున్నాడు. నాలుగు మహాయుగాలు గడిచాయలా.
తదనంతరం జరిగిన పరిణామంలో, ఐదవ
త్రేతాయుగంలో కొడుకులకై దశరథుడు అశ్వమేధ యాగాన్ని చేశాడు. ఆ యుగంలోనే శ్రీరామ జననం
అయింది. జన్మించింది విలంబినామ సంవత్సరం కాబట్టి హేవిలంబిలో అశ్వమేధయాగం,
పుత్రకామేష్టి చేశాడు. దుర్ముఖి చైత్రమాసంలో అశ్వం విడిచారు. బిడ్డలు లేరని దశరథుడు
విచారపడ్డది మన్మథనామ సంవత్సరంలో. పునర్వసువు నక్షత్రంలో బుధవారం నాడు
శ్రీరామజననం. భరతుడు గురువారం పుష్యా నక్షత్రంలోను, లక్ష్మణ, శత్రుఘ్నులు
శుక్రవారం ఆశ్లేషా నక్షత్రంలోనూ జన్మించారు. చైత్ర బహుళ పంచమి సోమవారంనాడు నామకరణం
జరిగింది. పరాభవ సంవత్సరంలో తొమ్మిదో ఏట ఉపనయనం జరిగింది.
ఇక్కడ మరొక్క విషయం చెప్పుకోవాలి.
దశరథుడు కైకేయి పక్షపాతి అంటారు. కైకేయికి కౌసల్యమీద విరోధ భావం. ఆమెకు వివాహ
కాలంలో దశరథుడు చేసిన వాగ్దానం గుర్తుకొచ్చినప్పుడల్లా, తన భర్త రాముడికి ఉపనయనం
చేయడేమోనన్న కించిత్ అనుమానం కౌసల్యకు వుండేది. రాముడికి ఉపనయనం అయిన తరువాత ఆమెకు
ధైర్యం కలిగింది. అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి 25 సంవత్సరాలు కాగా,
సీతాదేవికి 18 సంవత్సరాలు. శ్రీరాముడికి 12 ఏళ్ల వయసున్నప్పుడు, సౌమ్యనామ
సంవత్సరంలో యాగరక్షణ కొరకు విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు. ఈ విషయం
మారీచుడు రావణాసురుడితో సీతాపహరణం ముందర చెప్పినట్లు రామాయణంలో వుంది. దశరథుడు
విశ్వామిత్రుడికి చెప్పిన మాటలనే మారీచుడు రావణుడికి చెప్పాడు.
శ్రీరాముడికి
12 సంవత్సరాల వయసున్నప్పుడు, సీతకు ఆరేళ్ళ వయసులో వారి వివాహం జరిగింది. దీనికి
దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగం కాపాడడానికి రామలక్ష్మణులు వెళ్లిన రోజు నుంచి
మిథిలా నగరం వెళ్లడం వరకు తీసుకోవచ్చు. సౌమ్యనామ సంవత్సరం మాఖ బహుళంలో
శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట పోయారు. మొదటి రోజున సరయూనది తీరంలో,
మర్నాడు గంగా సరయూ సంగమ దర్శనం, మూడవ
రోజున తాటక వధ, నాలగవ రోజున అస్త్రాలు గ్రహించడం,
సిద్ధాశ్రమం చేరుకోవడం జరిగింది. ఐదవ రోజున విశ్వామిత్రుడి మౌన దీక్ష,
యాగారంభం. ఆ తరువాత ఆరు రోజులు యాగరక్షణ, పడవ
రోజున సుబాహు వధ జరిగింది. ఆ రాత్రి సిద్దాశ్రమంలోనే వుండి, మర్నాడు
విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు ప్రయాణం సాగించారు.
11వ
రోజున తన కథనాన్ని వినిపించాడు విశ్వామిత్రుడు. మర్నాడు గంగావతరణం వివరణ. 13వ
రోజున విశాల నగర ప్రవేశం, మర్నాడు
అహల్యా శాప విమోచనం జరిగాయి. 15 వ నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి, శివ ధనుర్భంగం
చేశాడు. 26వ రోజున గోదానం జరిపించారు రాముడితో. 27 వ రోజున శుక్ల త్రయోదశి శుభ
దినం కాబట్టి, ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతారాముల కల్యాణం జరిగింది. ఉత్తర ఫల్గుణీ
నక్షత్రం శ్రీరాముడి జన్మ నక్షత్రానికి ఆరవది. వివాహ తంతు మొత్తం ఐదు రోజులు
జరిగింది.
27
వ రోజు ఫాల్గున శుద్ధ త్రయోదశి అయితే, అయోధ్య నుండి బయల్దేరిన రోజు మాఘబహుళ విదియ
కావాలి. విదియ, హస్తా రోజు ప్రయాణానికి మంచి రోజే. అది శ్రీరాముడికి ధృవతార కూడా
అవుతుంది. కాబట్టి ఆ రోజున హస్త పోయిన తరువాత అభిజిల్లగ్నంలో ప్రయాణమై వుండాలి.
సీతారాముల కళ్యాణమైన తరువాత, అంటే, బహుళ విదియతో ముగిసి, తదియనాడు జనకుడు బిడ్డలకు
అరణాలిచ్సిన తరువాత, చవితినాడు అప్పగింతలై, ఫాల్గుణ బహుళ పంచమి నాడు అయోధ్యకు
ప్రయాణమయ్యారు. షష్టి, సప్తముల్లో పరశురాముడి గర్వభంగం అయింది. దశమినాడు అయోధ్య
ప్రవేశం జరిగింది. ఆ తరువాత 12 సంవత్సరాలు సుఖసంతోషాలతో గడిచింది. ఆ విధంగా బాల
కాండ మొత్తం 24 సంవత్సరాల వృత్తాంతం.
దుందుభి
నామ సంవత్సర చైత్ర శుద్ధ చవితినాడు దశరథుడు, శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని
పౌరులతో-మంత్రులతో ఆలోచన చేసి, పంచమి నాటి ఉదయం పుష్యా నక్షత్రంలో యౌవరాజ్య
పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించాడు. మరో రకంగా చెప్పాలంటే, చైత్ర శుద్ధ పంచమే
వనవాసారంభమైన రోజు. మర్నాడు గంగాతీర వాసం, ఆ మర్నాడు గుహుడి దర్శనం. అయోధ్య
విడిచిన మూడో రోజు సప్తమినాడు జడలుజడలు ధరించడం, నాలుగోనాడు అష్టమి రోజున
భరద్వాజాశ్రమం వెళ్లడం జరిగింది. ఐదవనాడు నవమిన యమున దాటారు. ఆరవనాడు దశమీ రోజున
చిత్రకూటమి వెళ్లి వాల్మీకి దర్శనం చేసుకుని, పర్ణశాల నిర్మించుకున్నారు. అదే
రోజున అక్కడ అయోధ్యలో దశరథుడు మరణించాడు.
శ్రీరాముడు
అయోధ్య విడిచిన 17 వ రోజున భరతుడు అక్కడికి చేరుకున్నాడు. మర్నాడు తండ్రికి కర్మలు
ప్రారంభించాడు. 29 వ రోజున కర్మకాండలన్నీ పూర్తయ్యాయి. మర్నాడు 30 వ రోజున వైశాఖ
శుద్ధ చవితినాడు రాజకర్తలు భరతుడిని రాజ్యభారం వహించమని కోరారు. 31 వ రోజున పంచమీ
నాడు సభకు వచ్చిన భరతుడిని వసిష్ఠుడు పట్టాభిషేకం చేసుకొమ్మని అడిగాడు. భరతుడు
తిరస్కరించాడు. మర్నాడు వైశాఖ శుద్ధ షష్టి రోజున భరతుడు చిత్రకూటానికి బయల్దేరాడు.
అదే
రోజున గుహుడిని కలిశాడు. మర్నాడు సప్తమినాడు జడలు ధరించాడు. భరద్వాజుడి విందు
స్వీకరించాడు. 34 వ రోజున, వైశాఖ శుద్ధ అష్టమి నాడు, చిత్రకూటానికి బయల్దేరి
శ్రీరామదర్శనం చేసుకున్నాడు. అదే రోజున రాముడు తండ్రికి నీళ్లు విడిచాడు. 35 వ
రోజున రామ-భరత సంభాషణ అనంతరం మర్నాడు భరతుడికి తన పాదుకలను ఇచ్చాడు శ్రీరాముడు.
అదే రోజు, అంటే, వైశాఖ శుద్ధ దశమిన భరతుడు అయోధ్యకు చేరాడు. 37 వ రోజున వైశాఖ
శుద్ధ ఏకాదశి నాడు భరతుడు నందిగ్రామం చేరాడు. భరతుడు వెళ్ళిపోయిన తరువాత పౌర్ణమి
వరకు చిత్రకూటం లోనే వుండి సీతారామలక్ష్మణులు, వైశాఖ బహుళ పాడ్యమినాడు అత్రి
ఆశ్రమానికి చేరారు. సీత అనసూయతో సంభాషణ చేసింది కూడా ఆ రోజో లేదా మరునాడో
అయ్యుండాలి. ఎందుకంటే అనసూయ చంద్రవర్ణన చేసింది కాబట్టి.
ఏదేమైనా
ప్రాణ భయం లేనిదే పరిణామవాదం!


No comments:
Post a Comment