విజ్ఞాన సర్వస్వ సమాన విషయ పరిజ్ఞాన భాగ్యం
డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులతో
మంగళవారం (ఏప్రిల్ 7, 2026) సాయంత్ర సమావేశం
వనం జ్వాలా నరసింహారావు
ముముక్షుజన మహాపీఠాదిపతులు, శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్ర గురుదేవుల
వద్ద సమాశ్రయణ భాగ్యం పొందగలిగిన, తెలుగునాట జీయర్ స్వాముల
అనుగ్రహ పాత్రుడైన, నా పూర్వ సహాద్యోగి, ప్రజా పరిపాలన,
విద్య, ధార్మిక సేవా రంగాలలో విశేషానుభవం
కలిగిన ప్రతిభాశాలి, అనుపమాన విద్యార్హతలు కలిగి, పబ్లిక్ పాలసీలో పీహెచ్‌డీతో
పాటు రాజకీయ శాస్త్రం, ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీలను
ప్రప్రథమ ర్యాంకుతో, అదనంగా బిఎడ్, సంస్కృతంలో పీజీ డిప్లొమా సాధించిన విజ్ఞానఖని, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డులు పొందిన విశిష్ట
వశిష్టుడు, డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు నిన్న
సాయంత్రం మా ఆహ్వానం మేరకు, రామభక్త విజయ రాఘవ దాసు జోగేష్ తో
కలిసి మా ఇంటికి వచ్చారు. ఆ ఇరువురితో నేను, నా శ్రీమతి
విజయలక్ష్మి సంభాషించిన మూడుగంటల సమయం ‘విజ్ఞాన సర్వస్వ సమాన విషయ పరిజ్ఞానం.’
చిలకపాటి విజయరాఘవాచార్యులు
గురించి విపులంగా చెప్పడం ఎవరి తరం కాదు. క్లుప్తంగా చెప్పడం మరీ కష్టతరం. కాని
ఆయన గురించి తెలిసింది, ఇతరుల ద్వారా విన్నది, కన్నది, ఆయన నోట తెలుసుకున్నది, ఆయన అభిమానులతో పంచుకోవడం నా కనీస ధర్మం. ఒక మహానుభావుడిని గురించి ఈ
తరాలవారికి, భావి తరాలవారికి, తెలియచెప్పాల్సిన బాధ్యత
కర్తవ్యానికన్నా మించిన కార్యం. అదే ఈ చిన్న ప్రయత్నం.
1972 నుండి 2002 వరకు లెక్చరర్‌గా, తరువాత రీడర్‌గా, విభాగాధిపతిగా శాతవాహన కళాశాలలో సేవలందించారు.
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా
బాధ్యతలు నిర్వహించారు. 2002లో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి
మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా అంతర్జాతీయ కార్మికసంస్థ
ఆధ్వర్యంలోని బాలకార్మిక నిర్మూలన ప్రాజెక్టును అత్యంత సమర్థంగా నిర్వహించారు. సమాజంలోని
వివిధ వర్గాల వారికి అవగాహన కల్పిస్తూ శిక్షణా మాడ్యూల్స్ రూపొందించారు. ఆ
సంస్థలోనే రెగ్యులేటరీ అడ్మినిస్ట్రేషన్ కేంద్రానికి ప్రొఫెసర్ గా, అధిపతిగా పనిచేశారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ విభాగాలకు శిక్షణా
కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారత ప్రభుత్వ
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ గుర్తించిన విశిష్ట శిక్షకుడిగా సేవలందించారు.
2007 నుండి 2010 వరకు తిరుమల తిరుపతి దేవస్థాన హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శిగా కీలక
బాధ్యతల్లో పనిచేశారు. ఈ కాలంలో ధార్మిక, సాంస్కృతిక
కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ సామాజిక సమగ్రత, ఆధ్యాత్మిక
విలువలను ప్రోత్సహించడానికి తనవంతు కృషి చేశారు. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో
శ్రీ గోవింద కళ్యాణాల కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సమానత్వ భావనను
పెంపొందించారు.
2010 నుండి 2018 వరకు దేవాదాయ శాఖలో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్
డైరెక్టర్‌గా పనిచేసి ఆలయ పరిపాలనలో శిక్షణా కార్యక్రమాలకు ఒక నిఘంటువు తరహా
అర్థాన్ని, ఆవశ్యకతను మరెవ్వరికీ సాధ్యపడని రీతిలో
కలిగించారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కార్యదర్శిగా కూడా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి శాఖలో చీఫ్ కన్సల్టెంట్‌గా పనిచేసి యువతకు నైపుణ్యాలు, ఉపాధి
అవకాశాలను పెంపొందించే కార్యక్రమాలను చేపట్టారు.
ఇదంతా ఒకెత్తైతే, వాల్మీకి
రామాయణంలోని 24 వేల సంస్కృత శ్లోకాలను కంఠస్థం చేసిన
మహానుభావుడిగా ఆయన ప్రత్యేక ఖ్యాతి తెలుగునేల నాలుగు చెరగులా అందరికీ తెలుసు. ఆ
శ్లోకాలకు తెలుగు, ఆంగ్లం, సంస్కృత
భాషల్లో అనర్గళంగా, సులభంగా, ఏసమయంలోనైనా అప్పటికప్పుడు
ప్రతిపదార్థ తాత్పర్య భాష్యం చెప్పగల అపూర్వ, అసమానమైన ప్రావీణ్యం, సమర్థత ఆయనకే ఉన్నది.
ఈ విశిష్ట ప్రతిభ ఆయన ఆధ్యాత్మిక పాండిత్యాన్ని, అపారమైన,
అనంతమైన, భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఆయనకున్న లోతైన
అవగాహనను ప్రతిబింబిస్తుంది. భారత, భాగవత, కావ్యాల నుండి, ఆధునిక రాజనీతి
శాస్త్రాల నుండి కూడా అనర్గళంగా, అలవోకగా ఎలాంటి
సందర్భాన్నైనా అప్పటికప్పుడు చెప్పగల ధారణా మహనీయుడు.
నిరంతర కృషీవలుడైన
విజయరాఘవాచార్యులు ఏనాడూ సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడరు. అందుకే, ‘పుణ్యం, పురుషార్థం’ అన్న చందాన ఇటీవల కొంతకాలంగా, అపురూపమైన కొండాపూర్
(హైదరాబాద్) శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ట్రస్టీ, కార్యదర్శిగా
సేవలందిస్తూ సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక,
సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 1972 నుండి నిరంతర
ప్రజాసేవలో కొనసాగుతున్న ఆయన జీవితం సమాజ సేవ, విద్యాభివృద్ధి,
ధార్మిక విలువల పరిరక్షణకు అంకితమయింది. తెలుగు, ఆంగ్లం,
హిందీ, సంస్కృత భాషలపై ఆయనకు పట్టు ఉంది. ఆయన
సేవలు అహరహం సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయి, నిలుస్తున్నాయి, భవిష్యత్తులో కనీసం మరో మూడు దశాబ్దాల కాలంపాటు నిలుస్తాయి కూడా.
ఇంతవరకూ రాసింది కేవలం
చిన్నపాటి ఉపోద్హాతమే. మా సాహచర్యంలో ఆయన, నేను కలిసి సంభాషించిన సమయాలలో అక్షరలక్షలు
చేసే ఆయన చెప్పిన మాటలు చాలావరకు నాకు గుర్తుండడానికి కారణం విజయరాఘవాచార్యులు
నాలో ప్రవేశపెట్టిన ‘రామభూతమే.’ అలాటి
వాటిలో కొన్ని ఆయన చెప్పిన రాసిన మాటలుగా ఇక్కడ ఉదహరిస్తాను.
శ్రీ రామాయణాన్ని 'సీతాయాశ్చరితం మహత్' అన్నారు మహర్షి వాల్మీకి అని అంటూ, ఆ భాష్యాన్ని కొనసాగించారు ఒక పర్యాయం....కాదు...కాదు...చాలా
చాలా సార్లు. ‘కవితావనంలో సంచరిస్తూ శ్రీరామ కధను నినదించే
మునిసింహం వాల్మీకి మహర్షి. లోకహితం కోరి, ఉత్తమ ధార్మిక సమాజ
నిర్మాణానికి సోదాహరణ ప్రాయమైన మానవ మాత్రులు ఎలా ప్రవచించాలో, ప్రవర్తించాలో, ప్రభావ సంపన్నంగా ఆచరణ చరణులు
కావాలో శ్రీ సీతారాముల కథకు సంసృత భాషలో 24వేల శ్లోకాలతో 6 కాండలతో (ఆపైన ఉత్తరకాండతో కలిపి 7 కాండలతో)
మనకు అందించారు మహర్షి వాల్మీకి. ఆ
మహాకావ్యం 'ఆదికావ్యం’గా, వాల్మీకి
'ఆదికవి'గా లబ్ద ప్రతిష్టమైంది. శ్రీరామాయణం
తదుపరి అనేకమైన ప్రపంచ భాషలలో అనువదించబడింది, ఆయా అనువాదకుల భావనా ప్రకర్షలలో, భావనా
సృజనతో!’
‘కానీ వాల్మీకి
రామాయణాన్ని యధాతథంగా 24వేల పద్యాలతో 7 కాండలుగా "శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం"గా చక్కని తెలుగు భాషలోనికి అనువాద గంగావతరణం చేసిన
మహామహానుభావులు వాసుదాసస్వామివారు. వారే తమ ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని 1908లో కడప సమీపంలోని
ఒంటిమిట్టలో గల శ్రీ కోదండ రామస్వామివారికి అంకితమిచ్చి ధన్యులైన అనన్య
శ్రీరామభక్తులు. తొలి వాల్మీకి ఆంధ్రానువాదకర్తలు. రాబోయే కాలంలో తమ ఆంధ్ర వాల్మీకి రామాయణం
మారిన కాలానికి తగ్గట్లుగా అర్థం కావాలని భావించిన వాసుదాస స్వామి 'మందరం'
అనే పేరుతో తను 24వేల పద్యాలకు చక్కని
తాత్పర్యాలను రచించారు. “మందరం”
పేరుతో ఆంధ్రవాల్మీకి తాత్పర్య రామాయణం విస్తృతమైంది.’
మా సంభాషణలలో వాసుదాసుగారి
ప్రస్తావన తరచు రావడానికి కూడా నేపధ్యం వున్నది. నేను (ఆంధ్ర) వాల్మీకి రామాయణం మొదలు
మందర మకరందంగా, ఆ తరువాత ‘ఆంధ్రవాల్మీకి రామాయణ రసరమ్య గాథలు’గా రాయడానికి పూర్వ
రంగమే ఆ నేపధ్యం. గత శతాబ్దం, తొంభైవ దశకం చివర్లో, ఈ శతాబ్దం ఆరంభంలో, నేను
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న రోజుల్లో సంస్థ
కేటాయించిన ఇంటిలో నా స్థిర నివాసం. అప్పట్లో, మా పొరుగునున్నది బ్రహ్మశ్రీ శ్రీమాన్ చిలకపాటి విజయరాఘవాచార్యులు.
వారు లేచింది మొదలు నిద్ర పోయేదాక రామనామం తప్ప దేని మీద మనస్సు పోనీయని అపర
రామభక్తుడు. ప్రతినిత్యం రామాయణ పారాయణం చేస్తూ జ్ఞానవృధ్ధుడుగా కనిపించేవారు.
నా నిత్య కృత్యాలు
చాలవరకు ఆయనకు నచ్చకపోయినా, నేనంటే మాత్రం ఇష్టం. ఆయన ఉదయం
అనుష్టానం చేసుకుంటుంటే, మా నాన్న స్వర్గీయ వనం శ్రీనివాసరావు గారు
గుర్తొచ్చేవారు. వాసుదాసుగారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణం అన్ని కాండల్నీ, కనీసం పాతిక
సార్లకు పైగా పారాయణం చేసినారాయన. వాసుదాసుగారూ ఆయన శిశ్యులు సుబ్బదాసుగారూ
(దాసశేషుడు) ఖమ్మం జిల్లాలోని వనంవారి కృష్ణాపురం గ్రామంలో వున్న మా ఇంట్లో వారి
పాదాలు మోపి మా ఇంటిని పావనం చేసారు నా బాల్యంలో చాలా సంవత్సరాల కింద. నేనూ మా
నాన్నగారితో నా చిన్నతనంలో తెనాలి దగ్గర అంగలకుదురులోని వారి ఆశ్రమానికి వెళ్లాను
ఒకటి-రెండు సార్లు. ఇటీవలి కాలంలో కూడా చాలా సార్లు వెళ్లడం జరిగింది.
మా శ్రీమతికి మా
నాన్న గారి పూజ-పునస్కారాల వారసత్వం వచ్చింది. నాకంతగా అబ్బ లేదు. విజయరాఘవ గారినీ, ఆయన భక్తి సంబంధమైన మాటలను ఎప్పుడూ వింటుంటే ఆమె: ‘మీరు అన్న గారి
మార్గంలోనన్నా పోతారు, లేదా, ఆయన మీ దారికన్నా వస్తారు’ అనేది, మేమిద్దరం
చర్చించుకుంటుంటే. అదే నిజమైంది కొద్ది రోజుల్లో. నేను రామాయణం చదువుతాను, మీదగ్గరుంటే
ఇవ్వండి, అయితే వాసుదాసు గారు వ్రాసిన ఆంధ్రవాల్మీకి రామాయణం మాత్రమే కావాలన్నాను. అలా
అడగటానికీ, అదే కావాలంటానికీ ప్రత్యేక కారణం ఏమీ లేదు. నేను రామాయణం చదువుతానంటే ఆయన కొన్నాళ్ళు నమ్మలేదు.
నేనూ గట్టిగా అడగనూలేదు. ఆయన ఇవ్వనూ లేదు. నేను ఆలోచన వచ్చిన వెంటనే చదవటమూ
జరగలేదు.
మళ్ళీ నిత్య జీవితం. దైనందిన చర్యలు. మధ్యలో మా జిల్లాలోనే వున్న భద్రాచల
రాముడినీ, పొరుగు రాష్ట్రంలో ఉన్న శ్రీరంగనాధ స్వామినీ, దర్శించుకొనే
భాగ్యం కలిగింది, డిసెంబర్ 2002-జనవరి 2003 లో. ‘శ్రీ
రామావతార సమయంలో శ్రీ సీతా రాముల దర్శనం ఏదోవిధంగా కలగందే ఈ జన్మలో శ్రీరంగనాధుని
(శ్రీరంగం) దర్శనం కలగనే కలగదు’ అన్నారు విజయరాఘవ గారు
(ఇదేమాట నిన్న మా సంభాషణలో కూడా మరీ మరీ గుర్తుకు తెచ్చారు). జనవరి
15, 2003 న తన ఇంట్లోకి పిల్చి, స్నానం చేసి రమ్మని, వాసుదాసుగారి
శ్రీమదాంధ్రవాల్మీకి రామాయణం సుందరకాండ మందరం నా చేతిలో పెట్టారు. రామాయణం మొత్తం చదవడానికి
ముందు ఇది చదవమన్నారు. ఎందుకంటే, రామాయణం పఠనమో, పారాయణమో సుందరకాండ
తోనే మొదలెట్టాలన్నారు. అవునేమోననుకుని చదవడం ప్రారంభించాను.
సరీగ్గా పది రోజుల్లో ఆసాంతం చదివాను. ఏరోజుకారోజు, వీలున్నప్పుడల్లా
చదివేవాడిని. చదివిన విషయ సారాంశం ఎప్పటికప్పుడు బడి పిల్లాడిలా, విజయరాఘవ గారికి
అప్ప చెప్పే వాడిని. వశిష్ఠుడి నోట బ్రహ్మర్షి అంటేనే విశ్వామిత్రుడు
ఒప్పుకున్నాడట! నేను చదువుతున్నానన్న నమ్మకం ఆయనకు కలిగితేనే నాకెందుకో
తృప్తనిపిన్చేది. పదిరోజుల్లో చదవడం గొప్ప కాదు. నన్ను ప్రేరేపించి, ప్రోత్సహించి
చదివించిన ఆయన గొప్పతనం అది. ఆ తరువాత సుందరకాండతో ప్రారంభించి అన్ని కాండలను
రాయగలిగానంటే అది విజయరాఘవాచార్యుల ప్రోద్బలం,
ప్రోత్సాహమే. ఆ ప్రస్తానం నాకంటే విజయరాఘవాచార్యులు గారే చక్కగా వివరించారు ఒకానొక
సందర్భంలో. నిన్న రాత్రి సంభాషణలో కూడా ఆ విషయాన్నే మరోమారు గుర్తు చేశారు. ఆయన
జ్ఞాపకశక్తికి జోహార్లు. ఆయన మాటల్లోనే ఆ వివరాలు:
‘శ్రీమాన్ వనం జ్వాలా
నరసింహారావు గారి జీవన సాఫల్య తపః ఫలాన్ని
‘శ్రీరామాయణ కథార్ణవం'
అనో ‘శ్రీరామాయణ
సుధామృతమో' అనో అనవచ్చును. లౌకిక ప్రాపంచిక సౌరభాలతో
సతమతంగా వుంటున్న కాలంలో ‘జ్వాలా’ గారికి శ్రీరామ భూతం పట్టింది. ఆరోజు జనవరి 15, 2003. ‘సుందరుడ’నిపించుకున్న హనుమ వారిని ఆవహించిన పుణ్యావహం! జ్వాలలో ఎదో ఒక భద్రమైన మార్పు కన్పిస్తూ
వచ్చింది. మేమిద్దరం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో
ఉన్నతోద్యోగులం. రోజంతా కలిసిమెలిసి వుండే
ఉద్యోగులం. ఇరుగు పొరుగులం. ఆయన పద్దతి
నాకు నచ్చేది కాదు. ఆయనది ఉధృతి,
నాది నెమ్మతి. కానీ మా చెలిమి చిలుము పట్టనిది. జ్వాలా జనవరి,
2003లో వాసుదాస స్వామి వారి "సుందరకాండ’' అత్యంత శ్రధ్ధా భక్తులతో అనజాలను కానీ అత్యంత శ్రద్ధాసక్తులతో చదివి, ఒంట
పట్టించుకున్నట్లు ఏ రోజు కారోజు నా 'పరిప్రశ్నల’- జవాబుల
ద్వారా నేను గ్రహించేవాడిని. ఇది ఆ సీతారాముల చలవ చూపుల జలపాత స్నాన ఫలం
వారి జీవితంలో!’
‘2003 నుండి 2019 వరకు శ్రీ రామానుగ్రహపాతం అవిచ్ఛిన్నంగా వారిపై పడుతూ వచ్చింది. మన
దేశంలో వున్నా, ఇతర దేశాలలో వున్నా ఆయన ‘సుహృలేఖిని’ శ్రీమదాంధ్ర, వాల్మీకి
మందర మధనాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు శుద్ధ ప్రతులను 'ఈమేయిల్' లో నాకు పంపిస్తుండేవారు. ఆ క్రమంలో
తాను వాసుదాసస్వామికి ‘అనువక్త’గా, ‘వాచవి'గా వారి రామాయణాన్ని సంక్షిప్త సుందరమాధుర్యకావ్యంగా మలిచారు. 16 సంవత్సరాల తపస్సు చేశారు. స్వాధ్యాయం వంటి మందర పారాయణ పరమాన్నం గావించారు.
2004లో ప్రారంభమైన ‘మందర మకరంద మాధుర్యప్రచురణాస్వాదం' మొదట సుందరకాండ (2002), ఆ
పైన బాలకాండ (2010). అయోధ్యకాండ (2017). అరణ్యకాండ (2018), కిష్కింధాకాండ (2019) యుద్ధకాండ (2019) లు ప్రచురితమైనాయి.
శ్రీరామానుగ్రహం ఆవిధంగా జ్వాలా గారిని వరించింది.’
‘వాసుదాస స్వామి వారు 120
సంవత్సరాల పూర్వం తమ 70
ఏండ్ల వయసులో రోజుకు 20 గంటలు
శ్రమించి ఆంధవాల్మీకాన్ని తెలుగువారికి అందించారని, తెలుగు
నేలన నడయాడిన అప్పటి మహాకవులు, భక్తులు, సాహితీ ప్రియులు వారిని
సంభావించేవారు. వారు పాదం మోపిన గృహాంగణాలన్నీ వాల్మీకి ఆశ్రమాలుగా, శ్రీ సీతారాములు కొలువైన దివ్యమంగళ ప్రాంగణాలుగా భావించే వారని
మాపెద్దలు చెప్పేవారు. జ్వాలా గారి
పితృపాదులు పరమపద వాసులైన శ్రీనివాసరావు గారు ‘మందరా’న్ని పెక్కుమార్లు పారాయణం
చేసిన పుణ్యఫలం వల్ల వారి పుత్రుని చేత ఇలాంటి గొప్ప ‘రచనా, ప్రవచనా క్రైంకర్యం' ఆకాశవాణిలోనూ, పఠన, పాఠన, ప్రవచన
బాణిలోనూ ప్రచారమౌతున్నది.’
ఇదంతా కొంత గతం, కొంత వర్తమానం. నిన్న మంగళవారం సాయింత్రం
వారు మా ఇంటికి రావడం, వచ్చి వారి విలవైన సమయాన్ని మాతో
గడపడం విశేషం. అలా గడిపిన సందర్భంలో గత పాతిక సంవత్సరాల మా పరిచయంలో వారిని
గురించి నాకు తెలియని చాలా విషయాలు వారిద్వారా తెలుసుకోవడం మా దంపతులకే కాకుండా, ఇతరులతో పంచుకునే అవకాశం లభించినట్లయింది. వారు మా ఇంటికి రావడానికి ప్రధాన
కారణం నేను ఇటీవల ఆంగ్లంలో రాసిన బాల, అయోధ్య కాండల ‘పుస్తకావిష్కరణ
పూర్వ ప్రతిని’ నా నుండి స్వయంగా స్వీకరించడం, దానికి తనదైన
శైలిలో విశ్లేషణాత్మక పరిచయవాక్యాలను ఆంగ్లంలో రాయడానికి సహృదయంతో అంగీకరించడమే.
ఉభయకుశలోపరిలాగా, ఇరువురం ఒకరిని మరొకరు చిరు సత్కారం
చేసుకున్నాం. వారి పుస్తకాలను నాకు బహుకరించారు. మా శ్రీమతి అభ్యర్ధన మేరకు సమీప
భవిష్యత్తులో మా ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకాన్ని విజయరాఘవాచార్యులు గారే స్వయంగా
నిర్వహించడానికి అంగీకరించారు. పూర్వరంగంలో చేపట్టాల్సిన వాటిని సరళీకరించారు. చిలకపాటి
వారు చెప్పిన విశేషాంశాలను గుర్తున్నంతవరకు, వారి
హితులకొరకు, సన్నిహితుల కొరకు, శ్రేయోభిలాషుల కొరకు, వారిని గురించి పూర్తిగా తెలియనివారి కొరకు ఇక్కడ పేర్కొంటున్నాను.
చిలకపాటి విజయరాఘవాచార్యుల జన్మస్థలం
నెల్లూరు జిల్లా, గూడూరు. పుట్టిన తేదీ నవంబర్ 9, 1949. ప్రఖ్యాత ‘బిల్హణీయం’ కావ్యకర్త చిత్రకవి సింగరాచార్యుల
13 వ తరం వారసుడు ఈ మహానుభావుడు. మాతామహులు శ్రీమాన్ కులపతి చిత్రకవి రాజగోపాలచార్యులు,
చిత్రకవి శ్రీనివాస వరదాచార్యులు. మేనమామ సుప్రసిద్ధ సత్సంప్రదాయ సాహిత్యవేత్త చిత్రకవి
ఆత్రేయస్వామి. తండ్రిగారు చిలకపాటి నమ్మాళ్వార్. ఒంగోలు సమీపంలోని చిలకపాడు
గ్రామవాసి. చీరాలలో స్థిర నివాసం. పెద్ద కుటుంబం. చీరాలలోని ఐటీసీ-ఐఎల్టీడీ కంపెనీలో
ఉద్యోగి. విజయరాఘవాచార్యుల చదువు డిగ్రీ
వరకు చీరాలలోనే సాగింది.
మామగారు, కన్యాదాత దూపాటి రంగారామానుజాచార్యులు. చీరాలలో
వుండగా వీరి కుటుంబానికి అక్కడివారి ఆదరాభిమానాలు, విశేష సంప్రదాయ మర్యాదలు లభించేవి.
శ్రీవైష్ణవ సంప్రదాయ నిష్టులుగా చీరాలలో వుండే వైశ్యులు, పద్మశాలీలు, కాపులు, తెలగవారు, ముస్లింలు,
వీరిని మన్ననలతో గౌరవించి, పెద్దలుగా ఆదరించేవారు. వేలాదిమందికి తండ్రిగారు, మామగారు, వీరూ అక్షరాభ్యాసం చేసేవారు. 1969 వరకు
వీరి జీవితం చీరాలలోనే గడిచింది. భాగవతోత్తములు, స్వామీజీలు,
సాధువులు, ఎవరు, ఏవేళ వచ్చినా వీరి
ఇంట్లో చారు, మజ్జిగ, చింతకాయ పచ్చడి
ఆతిథ్యం సర్వసాధారణం.
తాను తెలివిగలవాడిని కాదని, తనది అతి సామాన్యమైన బ్రతుకని మాటల మధ్యలో అన్నారు
విజయరాఘవాచార్యులు. 1964-68 మధ్యకాలంలో డిగ్రీ చదువుతున్నప్పుడు, బట్టలు, బూట్లు ఇచ్చి, పెరేడ్ అయిపోయిన తరువాత టిఫిన్ కూడా
పెడతారని తెలుసుకుని, నాలుగు సంవత్సరాలు ఎన్సీసీ లో చేరానని
చెప్పారు. అందులో ఎదిగానని, కొంత మేరకు క్రమశిక్షణ, సైనిక జీవనశైలి తనకు ఆ విధంగానే అబ్బిందని అన్నారు. (దాపరికం లేకుండా
చెప్పడం అంటే ఇదే కదా!)
‘ఎందరో మహామహానుభావులు నన్ను
చేరదీశారు. మా గృహాన్ని సుసంపన్నం చేశారు. నన్ను ప్రభావితం చేశారు. వారిలో పెద్ద
జీయర్, చిన జీయర్, వానమామలై, శ్రీవిల్లిపుత్తూరు, మధురాంతకం, పెరంబదూరు, ఆంధ్ర
జీయర్ల పాదధూళి నా తలరాతను సంస్కరించింది’ అన్నారు చిలకపాటి. 2000 సంవత్సరం నుండి
పీవీఆర్కే ప్రసాద్, కేవీ రమణాచారిలతో తాను గడిపిన కాలం తన
జీవితంలో స్వర్ణయుగమని, రమణాచారి తిరుమల శ్రీనివాసుని సన్నిధి కైంకర్య బిక్ష
పెట్టిన ప్రాతఃస్మరణీయుడు అని, వారింటి ఊడిగం చేసినా ఆయన ఋణం
తీరదని వినమ్రంగా చెప్పారు. తన జీవనయానంలో వారు చూపిన ప్రేమ,
దయ, ఆదరం, నిత్యస్ఫూర్తిదాయకమని చెప్పారు.
అపర వేదాంత దేశికులు
మహామహానుభావులు, పరమహంస సములు, పాదుకా సహస్ర వ్యాఖ్యాతలు వాచస్పతి కేవీ
రాఘవాచార్యస్వామి శ్రీచరణులతో తాను గడిపిన సమయాలు తనను అలౌకిక మార్గానికి
మళ్ళించాయని గుర్తు చేసుకున్నారు. ‘శ్రీ రామానుగ్రహ విశేషం వల్ల 1987 విజయదశమి
నాడు శ్రీవాల్మీకి రామాయణ ఆజీవన పారాయణాన్ని భాగవత మంగళా శాసనంగా ప్రారంభించాను. ఇప్పటికి
175 సార్లు పూర్తయింది. కనీసం 208 సార్లు నడిస్తే చాలని ప్రార్థన చేస్తున్నాను.’
అన్నారు. తనకు పూర్వీకుల పూర్వకాలం నాటి ‘భోషాణం’లో ఏవిధంగా గోవిందరాజీయం, రామాయణం
కావ్యాలు లభించినాయో చెప్పినప్పుడు, వాటినే తనకు పూర్వీకుల
ఆస్తిలాగా ఇవ్వడానికి సోదరులు ఎలా అంగీకరించారో విశదీకరించినప్పుడు ఒకింత
ఆనందభాష్పాలను వారి నేత్రాలలో గమనించాము. రామానుగ్రహం ఏవిధంగా లభిస్తుందో సోదాహరణంగా
చెప్పారు చిలకపాటివారు.
1998 సంవత్సరంలో తన భార్య
రమాదేవి హనుమజ్జయంతి నాడు ‘దివ్యసాకేతం’
చేరిందని, అప్పటినుండి లౌకిక, సాంఘిక రంగాలలో ఎదుగుదల
కనిపించినా, ఉద్యోగ పర్వంలో,
అంతరాంతరాలలో ధైర్యం, స్థైర్యం ఒడుదుడుకులుగానే
సాగుతున్నట్లు ఆవేదనతో చెప్పారు. కాకపొతే, టీటీడీలో
కార్యనిర్వహణాధికారులు రమణాచారి, పీవీఆర్కే ప్రసాద్ ల ఆధ్వర్యంలో
తాను సైతం ‘ఉడుతను’ కావడానికి కారణమైనందున తన బ్రతుకు పండిందని, ఆ విధంగా ఎప్పటికీ
తృప్తి పడుతుంటానని వినమ్రంగా చెప్పారు విజయరాఘవాచార్యులు.
నాలుగు ధర్మాచార్య సదస్సులు, కళ్యాణోత్సవాలు, ఆటవిక,
ఏజన్సీ ప్రాంతాలలో గోవింద కళ్యాణాలు (కళ్యాణమస్తు) నిర్వహించే భాగ్యం కలగడమే
కాకుండా, దేవాదాయశాఖ శాఖ వారి శిక్షణా సంస్థకు డైరెక్టర్ గా
హైదరాబాద్, విజయవాడలలో ఆ శాఖలో పనిచేసే అన్ని విభాగాల
ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, డాక్టర్ మర్రి
చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి, అఖిలభారత
సర్వీసులవారికి శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం, తనను, నవీకృతం చేశాయని, ఇంకా చేస్తుంటాయని ఒకింత గర్వంగా
చెప్పుకున్నారు చిలకపాటివారు.
1976-2007 మధ్యకాలంలో
నాగార్జునసాగర్ గురుకుల కళాశాలలో అధ్యాపక,
ప్రధానాచార్యత్త్వం, తన జీవితంలో ఒక వెలుగు పథంగా సగర్వంగా
చెప్పుకున్నారు. ‘మా భాత్రగణం అధిరోహణం చేసిన క్రమం, అత్యున్నత
పదవులలో విరాజమానులైనా, నన్ను పలకరిస్తున్నప్పుడు పొందుతున్న
ఆనందసందోహం, ఇంకా జీవించి వుండాలనిపిస్తున్నద’న్నారు
విజయరాఘవాచార్యులు.
విజయరాఘవాచార్యులు గారికి
ప్రస్తుతం ముగ్గురు ప్రతిభామూర్తులైన సోదరులున్నారు. ఇద్దరు కుమార్తెలు. ఒక
కుమారుడు. దౌహిత్రి హరిచందన, దౌహిత్రుడు
హరిచరణ్, మరొక దౌహిత్రుడు అనంత శ్రీచరణ్, ఇలా ఇంట్లో అంతా ఉన్నత చదువులు చదివి, వున్నత పదవులలో వున్నవారేనని సంతోషంగా చెప్పారు. కుమారుడు కులశేఖరాళ్వార్,
కోడలు ఇందిరా హరిప్రియ, పౌత్రి కౌమిది అందరికంటే చిన్నదని
వారి విషయమూ చెప్పారు. కుమార్తెలు మాధవి, హేమశ్రీ అని
అన్నారు.
తన వయసిప్పుడు 76
సంవత్సరాలని, కేవలం పెన్షన్ మాత్రమే
జీవనాధారమని అన్నారు. తన పూర్వీకులు గ్రామ కరణీకంతోపాటు, వైష్ణవ సాంప్రదాయ నిష్టతో
వైద్యం, వైదికం, జ్యోతిష్యం, పౌరాణిక రంగాలలో తరించారని చెప్పారు. ‘ఎందరో మహానుభావులు, పరమ భాగవతోత్తములు, హితవరులు,
కేవలం దయాభావనతో అనుగ్రహించిన జ్ఞాన, దాన, అన్న పానాదుల బిక్షతో
ఏ రంగంలోనూ ప్రావీణ్యంలేని నేను ఇన్నేళ్లు బ్రతుకు గడిపాను.’
ఇంతటి మహానుభావుడు మా
ఇంటికి రావడం భాగ్యమే. తీసుకొచ్చిన రామభక్త విజయరాఘవ దాసు జోగేష్ కు సదా
కృతజ్ఞతలు. రాబోయే వారం రోజులలో విజయరాఘవాచార్యులు తన జీవనయానంలో మరో మైలురాయికి
చేరుకుంటున్నారు. మరో బాధ్యతాయుతమైన పదవిని చేపట్టబోతున్నారు. ఆ పదవి ద్వారా చిలకపాటివారి
విజ్ఞాన, సంస్కార, ఆధ్యాత్మిక సమ్మిళితం, భగవత్ భాగవత భక్తి దినదినాభి వృద్ధి
చెందుతున్న వర్తమాన కాలంలో, వాటి అవసరార్థం భక్తులు వెళ్లే పరమ పవిత్ర స్థలాల నిర్వహణ,
నిర్మాణాత్మక సిబ్బందికి ఆజన్మాంతం ఉపయోగంగా వుండబోతున్నదనడంలో ఇసుమంతైనా సందేహం
లేదు.
వారికి ముందస్తు
శుభాకాంక్షలు. ఆయురారోగ్య (ఐశ్వర్యాన్ని) ప్రసాదాన్ని చిలకపాటి వారికి నిరంతరం
సమకూర్చాలని శ్రీరామచంద్రుడిని మనసారా ప్రార్థిస్తున్నాను.


No comments:
Post a Comment