Friday, April 24, 2026

విజ్ఞానం, నాగరికత, కర్తవ్యం! >>>>> వనం జ్వాలా నరసింహరావు

 విజ్ఞానం, నాగరికత, కర్తవ్యం!

వనం జ్వాలా నరసింహరావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (25-04-2026)

భారతీయ నాగరికతకు మాత్రమే ప్రత్యేకమైన అనేకానేక ప్రాచీన గ్రంథాలు, తాత్విక, వైదిక సంప్రదాయాలు, అసమానతలను ఎక్కడా ప్రస్ఫుటంగా పేర్కొనడం జరగలేదు. వాటిని, కనీసం కొన్నిటినైనా, చదివి, అర్థం చేసికుని, అన్వయించుకునే సామర్థ్యం వుంటేనే విషయం బోధపడుతుంది. మానవులంతా సామర్థ్యంలో సమానంగా పుడతారని అవన్నీ స్పష్టంగా ఘోషించాయి. జన్మించిన ప్రతి వ్యక్తినీ, ‘జన్మతో శూద్రుడు’ అనే వర్ణిస్తాయి అవన్నీ. అభ్యాసం, నియమశీలత, ధర్మాచరణ, సత్యావగాహన ద్వారా మాత్రమే ఎవరైనా ‘బ్రాహ్మణ స్థితి’ని సాధిస్తారు. ‘బ్రాహ్మణత్వం వారసత్వంగా లభించేది కాదు. సాధించబడేది.’

పరమ సత్యాన్ని, జ్ఞానాన్ని, విశ్వ సూత్రాన్ని సూచిస్తుంది బ్రాహ్మన్. వేదాలు, ఉపనిషత్తులు, ఇతర సంబంధిత గ్రంథాల ద్వారా జ్ఞానాన్ని అభ్యసించి, అధ్యయనం చేసి, సంరక్షించి, ప్రచారం చేసి, విజ్ఞానాన్ని ఆబాలగోపాలానికి పంచినవారిని ‘బ్రాహ్మణులు’ అని సమాజం గుర్తించింది. వారి కర్తవ్యాలలో అభ్యాసం, బోధన, యజ్ఞాలు, కర్మకాండలు నిర్వహించడం, సమాజానికి నైతిక మార్గదర్శకత్వం ఇవ్వడం, జ్ఞాన పరంపరను కొనసాగించడం ఉన్నాయి. ‘స్వచ్ఛంద దారిద్ర్యం’ అనే మహత్తర, మానవీయ సిద్ధాంతాన్ని త్రికరశుద్ధిగా ఆచరించడం సహితం బ్రాహ్మణులకు ప్రధానం. వైదిక తాత్త్విక గ్రంథాలలో వివరించిన విధంగా, మహర్షులు ఆచరించినట్లుగా, బ్రాహ్మణ జీవనయానానికి నిస్వార్థం ప్రధాన లక్షణం. బ్రాహ్మణుడు తపస్సు, నియమశీలత, సరళమైన జీవితం గడుపుతాడు. ఇవన్నీ ఆచరించడానికి ప్రాచీన సమాజం మాదిరిగానే, ఆధునిక సమాజం తోడ్పాటు అత్యంత అవశ్యం. విమర్శలకు అతీతంగా వారి విధానాలను గౌరవించాలి.  

మహర్షి అగస్త్యుడు అనేక సంవత్సరాల తపస్సుతో సంపాదించిన తన సంపూర్ణ తపోశక్తిని రాజ్యంలో కరువు నివారణ కోసం స్వచ్చందగా త్యాగం చేసిన మహనీయ బ్రాహ్మణుడు. అదే అగస్త్యుడు తన కుమార్తె వివాహం కోసం నిధులను సమకూర్చుకోవడానికి భిక్షాటన చేశాడు. విశ్వవిఖ్యాత వాగ్గేయకారుడు త్యాగరాజు తనకు రాజు ఇస్తానన్న సంపదను సున్నితంగా తిరస్కరించాడు. సమాజానికి నిస్వార్థంగా సేవచేసిన ఎందరో బ్రాహ్మణులు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ సిద్ధాంతాన్ని కఠినంగా ఆచరించారు. యుగయుగాలుగా బ్రాహ్మణులు ‘స్వచ్ఛంద దారిద్ర్యం’ అనే ఆదర్శాన్ని నిబద్ధతతో పాటిస్తూ వచ్చారు.

కాలక్రమంలో కేవలం ఒక ఉన్నత సామాజిక వర్గంగా ముద్రపడిన ‘బ్రాహ్మణ’ కులం అనే భావనకు; జ్ఞానం, సత్యం, సమస్త లోకక్షేమం ప్రధానంగా శాశ్వత తత్వమైన ‘బ్రాహ్మణత్వం’ అనే పవిత్ర భావనాత్మక లౌకిక సిద్ధంతానానికీ మధ్య స్పష్టమైన తేడా ఉంది. ఒకటి ఇంకొకదానికి అనుబంధం, సంబంధం వున్నవి కావచ్చు. పరమ సత్య జ్ఞానమైన బ్రహ్మజ్ఞానం కలిగినవాడు, జన్మతో సంబంధం లేకుండా, తాత్వికంగా బ్రాహ్మణుడే. ప్రజల్లో అకారణంగా విస్తరించిన అభిప్రాయానికి భిన్నంగా, వర్ణవ్యవస్థను సృష్టించినవారు బ్రాహ్మణులు కాదనేది గుర్తించాల్సిన సత్యం, వాస్తవం. సామాజిక విభజనలు భారతదేశానికే పరిమితం కాదనేదీ నిజమే.

తప్పొప్పులు కాసేపు పక్కనబెడితే, ఈ విభజనలు వృత్తి, పాలన, ధార్మిక పాత్రల ఆధారంగా ఏర్పడ్డాయి. సామాజిక సమన్వయాన్ని సాధించేందుకు సహజంగా అభివృద్ధి చెందినదే వర్ణవ్యవస్థ. అప్పటి సమాజం, అప్పట్లో నెలకొన్న అవసరాలకు అనుగుణంగా మాత్రమే దీనిని గుర్తించింది. ఒక వర్ణం ఎక్కువ, మరొకటి తక్కువ అనే భావనతో కాకుండా, స్వభావతః పరస్పర ఆధారిత వ్యవస్థగా ఉండేది. కాలానుగునంగా, సామాజిక, రాజకీయ కారణాలు, దండయాత్రలు, వలస పాలనల నేపధ్యంలో కఠినత్వం పెరిగింది. సామాజిక, సార్వజనీన ఆమోదయోగ్యమైన, సులభ వ్యవస్థ, పోనుపోనూ కఠినతరమై, బ్రాహ్మణులను లక్ష్యంగా చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.

బ్రాహ్మణుల కృషి ఆధ్యాత్మిక, మేధో, సాంస్కృతిక, రాజకీయ రంగాలన్నింటినీ ఆవరించిన మాట వాస్తవమే. కాని వారు ఎన్నడూ ‘ఆక్రమించుకోలేదు.’ పరిమిత ఆలోచనతో మాట్లాడేవారికి, బ్రాహ్మణులు కర్మకాండల నిర్వహణతోసహా, సంస్కరణ, అభివృద్ధి, సామాజిక పరిరక్షణకు ప్రేరకశక్తులుగా ముమ్మూర్తులుగా నిలుస్తూ వస్తున్న విషయం, యుగయుగాలుగా, బ్రాహ్మణులు మహోన్నత భారతీయ తాత్విక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ వస్తున్న విషయం అవగాహనలో లేదు. విదేశీ దండయాత్రలు, పాలన సాగినా, భారతదేశ నాగరిక స్వరూపం నిలదొక్కుకుంది. నిరంతరత్వానికి ప్రధానమైన కీలక గ్రంథాలను, సంప్రదాయాలను, విలువలను కాపాడిన వారిలో గణనీయంగా బ్రాహ్మణులు కూడా ఉన్నారనేది వాస్తవం.

బ్రాహ్మణుడు జ్ఞానాన్ని ఎప్పుడూ వ్యాపారంగా భావన చేసి అమ్మడు. బ్రాహ్మణతత్వ సంప్రదాయంలో జ్ఞానం వాణిజ్య వస్తువుగా కాకుండా, నలుగురితో పంచుకునే పవిత్రమైనదిగా భావించడం ప్రత్యేకత. బ్రాహ్మణుడికి బోధన వృత్తి కాదు, ఒక కర్తవ్యం. కర్మకాండల నిర్వహణ జ్ఞానశక్తి ప్రదర్శన కాదు. సమాజ ఆధ్యాత్మిక కొనసాగింపుకు, పునరుద్ధరణకు చేసే పవిత్ర కార్యం. ఈ తత్వం, ‘బ్రాహ్మణులకు ప్రత్యేక హక్కులా’? అని వితండ వాదన చేసే కుహనా ఆధునిక భావనను తీవ్రంగా పరిగణించి, సవాలు చేస్తున్నది. చారిత్రకంగా బ్రాహ్మణులు సాధారణ జీవితం గడిపి, మేధో పరమైన ఆధ్యాత్మిక సాధనలకు అంకితమయ్యారు.

ఏదేమైనా ఆధునిక భారతావనిలో బ్రాహ్మణుల స్థితిగతులు మారిపోయాయి. జ్ఞానం, మార్గదర్శకత్వంకోసం ఎందరెందరో బ్రాహ్మణులను ఆదరాభిమానాలతో ఆశ్రయించిన రోజులు పోయాయి. సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే దుస్థితి కలిగింది. జ్ఞానం ద్వారా, వ్యూహాత్మక నాయకత్వం పాలకులకు స్వచ్చందంగా అందించడంలో గుర్తింపు పొందిన బ్రాహ్మణ సామాజిక వర్గంలోని మెజారిటీ కుటుంబాలు, ప్రాథమిక జీవనోపాధి కోసం కూడా పోరాడాల్సి వస్తున్నది.

ఏ మాంధాతల కాలంలోనో, అన్యాయాలను, అవి నిజమైనవైనా, అతిశయోక్తా? లేదా అపార్థాల ప్రాతిపదికా? అనే విషయాన్ని మరుగుపరచి, నేటి బ్రాహ్మణులకు వాటిని ఆపాదించే ప్రయత్నం సరైనదేనా? ఇది మౌలిక ప్రశ్నలకు దారితీస్తున్నది. అతికొద్ది చారిత్రక కట్టు కథనాల ఆధారంగా సమాజంలో విద్వేషాన్ని రగిలించి, కొనసాగించడం న్యాయమా? నిందలు మోపడం సమసమాజ స్థాపనకు తోడ్పడతాయా, లేక విభేదాలకు మరింత ఊతమిస్తాయా? కొందరు మహాశయులు ప్రవచించే ‘గతంలోని పీడకులు, పీడితులు’ ఇంకా వున్నారా? ఉన్నదల్లా సమానత్వం, సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న బ్రాహ్మణులతో కూడిన సమిష్టి వ్యవస్థే. ఒక్క బ్రాహ్మణ వర్గాన్నే లక్ష్యంగా చేయడం అన్యాయమే.

అత్యంత వేగంగా సాంకేతికాభివృద్ధి జరుగుతున్నప్పటికీ, నైతిక అస్పష్టత అంతకంటే పెరుగుతున్న వర్తమాన యుగంలో, సరైన మార్గదర్శకత్వం, తాత్విక స్పష్టత, సాంస్కృతిక, సాంప్రదాయ నిరంతరత్వం మరింత అవసరం. ఉజ్జ్వల సామాజిక భవిష్యత్తు అంటే, కులాల గుర్తింపులను కాపాడడం కాదు. బ్రాహ్మణులు అనాదిగా ప్రాతినిధ్యం వహించిన జ్ఞానం, సేవా భావాన్ని పునరుజ్జీవింపజేయడంలో న్యాయం, ధర్మం, అవసరం. యుగయుగాలుగా, ఈ నాగరికతాధారిత విలువలను బ్రాహ్మణుల అసాధారణ జీవన విధానం ధృవీకరించింది.

నాగరికత, విజ్ఞానం, కర్తవ్యం, భాద్యత, కాలమాన సామాజిక వ్యవస్థల పరస్పర భావజాల ప్రభావంతో, తదనుగుణ పరిస్థితులను అన్వయించుకుంటూ, సనాతనంగా, అనాదిగా అభివృద్ధి చెందడం భారతదేశ ప్రత్యేకత. అత్యంత ప్రాచీన సమాజాల నుండి, ఆధునిక సమ సమాజాల వరకు జరిగిన, జరుగుతున్న ప్రస్తానం కూడా.  వ్యక్తుల సామర్థ్యం, స్వభావం, సామాజిక అవసరాలకు అనుగుణంగా సజీవ పాత్రల పోషణ ప్రక్రియ రూపుదిద్దుకుంటూ సాగుతున్నది. సార్వజనీన ఆమోదయోగ్యమైన విశిష్ట కార్యాచరణ ప్రాతిపదికన, విభజన, వ్యవస్థల అభివృద్ధి జరిగింది. ఆ ప్రక్రియలో అంతర్భాగంగా, ఒక సజీవవాహినిగా, మహోన్నత భారతీయ నాగరికతలో, శాస్త్రీయ విధానంలో, క్రియాశీలక ప్రత్యేకతతో వైదిక తత్త్వజ్ఞానానికి, సామాజిక అవసరాలకు అనుగుణంగా, సహజమైన నిర్మాణం జరిగింది. ఎవరి ప్రమేయం ఏదీలేదు.

ఇది కర్తవ్యాధారితమైన, వృత్తి-ప్రవృత్తి పరమైన విభజనగా భావించడం సమంజసం. కారణాలేవైనా, సహేతుకమా, నిర్హేతుకమా అనేది పక్కన పెడితే, నిండి నిభిడీకృతమై, పరిపరివిధాల కాలానుగుణంగా దానికి భాష్యం చెప్పడం విశేషం. అసంబద్ధ విషయాలకు ఒక కులాన్ని భాద్యత చేయడం పరిపాటిగా మారింది. ఇటీవలి కాలంలో కొందరు, ప్రాచీన మహత్తర భారతీయ నాగరికత మిగిల్చిన అనంతమైన మేలును పక్కనపెట్టి, ఈకకుఈక లాగడం హాస్యాస్పదం. కేవలం ఒక సామాజిక గుర్తింపుగా మాత్రమే కాకుండా, ‘బ్రాహ్మన్ అంటే జ్ఞానం, సత్యం, విశ్వ చైతన్యానికి అత్యున్నత సాకారంగా భావించబడడం సమంజసమని ‘మేథావులు’ గుర్తించడం సర్వవిదాల శ్రేయస్కరం. 

నిజమైన అర్థంలో ‘బ్రాహ్మణుడు’ అనేది కేవలం జన్మ ఆధారంగా నిర్వచించడం జరుగలేదు. జ్ఞానాన్వేషణ, తదనుగుణంగా త్రికరణ శుద్ధిగా ఆచరణ ద్వారానే నిర్వచించబడింది. అతి ప్రాచీన వైదిక తత్త్వశాస్త్ర పరంగా ‘బ్రాహ్మణత్వం’ శాశ్వతం, సార్వత్రికం, సమగ్రతలను కలిగిన ఒక కఠిన వాస్తవం. కులాన్ని అతిక్రమించి, కులం అనే భావనకు అతీతంగా, జ్ఞానాన్ని అన్వేషించే, ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికీ ఒక నిరంతర ప్రక్రియలాగా అందుబాటులో ఉంటున్నది. కాలక్రమేణా, ‘మేథావుల’ అవగాహన రాహిత్యం, వక్రీకరణ, చారిత్రక అపార్థాలు, సామాజిక, రాజకీయ కథనాలు మంచిని  మసకబార్చాయి.

ఫలితంగా, వారు సాధించిన విజయం తాత్కాలికమే! లేదా తాత్కాలిక శాశ్వతమే! బ్రాహ్మణులను నాగరికత అభివృద్ధికి తోడ్పడినవారిలో, తమవంతు భూమిక మనఃస్ఫూర్తిగా నిర్వహించిన వారిగా కాకుండా, అనుమానాస్పద చారిత్రక అన్యాయాల ప్రతీకలుగా చూపే విఫల ప్రయత్నం జరగడం, కొనసాగడం దురదృష్టం. ఎప్పడిదో, ఏనాటి గతానికో సంబంధించిన వివాదాస్పద అపార్థాల కోసం నేటి యావత్ బ్రాహ్మణ సమాజాన్ని నిందించడం ఎందుకు? అనే ప్రశ్నను నిజాయితీగా వేసుకోవాలి. బ్రాహ్మణుల ఆవిర్భావం, పరిణామం, ఆరోహణ, అవరోహణలు, నిరంతర కృషి, సమాజ హితం, విజ్ఞాన ప్రసార ప్రస్తానం, తదితర అమూల్యమైన సానుకూలత అంశాలను సమగ్రంగా పరిశీలించడం, అధ్యయనం చేయడం, రాజ్యాంగం నిర్దేశించిన, ఆశించిన, సామాజిక సమతుల్యతను పాటించడం అత్యవసరం.

ధర్మాన్ని నిలబెట్టడం, సమాజానికి నిస్వార్థంగా సేవ చేయడం, జ్ఞానాన్ని కాపాడటం, పదిమందికి పంచడం బ్రాహ్మణ లక్షణాలు, గుణాలు. దేవాలయాలలో అర్చకత్త్వం కూడా అందులో భాగమే. ఇందులో తప్పేమిటి? మన భవిష్యత్తు కులగౌరవంలో కాదు. కర్తవ్యగౌరవంలో ఉంది. వంశ పరంపరలో కాదు. విలువల పరంపరలో ఉంది. మన విలువను నిర్ణయించేది వంశం కాదు. జ్ఞానం. గౌరవాన్ని నిర్ణయించేది పుట్టుక కాదు. సాధన. జ్ఞానమే ప్రమాణం, ధర్మమే మార్గం, సేవే లక్ష్యం.

అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ బ్రాహ్మణ తత్వవేత్త, వేదాంతవేత్త ఆది శంకరాచార్యుడు భారత ఉపఖండమంతా విస్తృతంగా సంచరిస్తూతన తత్వాన్ని ఇతర ఆలోచనాపరులతో పంచుకుని, వేదాంత చింతనను పునరుజ్జీవింపజేసి, కర్మకాండల కఠినత్వాన్ని తొలగించి, విభేదాలకు అతీతంగా గుర్తింపు పొందిన సంస్కర్త. సమతా దిశలో మహత్వ పూర్ణమైన కార్యక్రమాలు సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించిన మహనీయుడు రామానుజాచార్యుడు బ్రాహ్మణుడే. సమాజంలోని అన్ని వర్గాలకు ఆధ్యాత్మిక సాధన ద్వారాలను తెరిచి, కులభేదం లేకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఇదే విధంగా మరొక బ్రాహ్మణుడు, ద్వైత తత్వవేత్త మాధ్వాచార్యుడు కూడా తన వంతు కృషి చేశారు.

ఆధునిక యుగంలో కందుకూరి వీరేశలింగం తొలితరం సాంఘిక సంస్కర్తలలో ఒకరు. తాను జీవించిన కాలంలో సమాజం మద్దతు లభించకపోయినప్పటికీ, ఆయన మహిళల విద్యను, వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించారు. బాల్య వివాహాలకు, వరకట్న వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం చూపు లోపం ఉన్నప్పటికీ సామాజిక సంస్కరణకు కొత్త దిశను చూపి, సమానత్వానికి కట్టుబడి నిలిచారు. గురజాడతో కలిసి, మధ్యయుగ ఆచారవాదాన్ని, సామాజిక దోషాలను, మూఢనమ్మకాలను, లింగ అసమానతను, అంటరానితనాన్ని, దళిత విద్యా వెనుకబాటుతనాన్ని వ్యతిరేకిస్తూ పునరుజ్జీవనానికి పునాది వేశారు.

గిడుగు రామమూర్తి సాహిత్యం ద్వారా సంస్కరణకు కృషి చేసిన మరొక ప్రముఖుడు. వీరంతా సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల్లో జన్మించి, తొలితరం సామాజిక సంస్కర్తలుగా ప్రసిద్ధికెక్కారు. అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ లేదా ఆర్‌కే), బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి, సిపిఐ మావోయిస్టు ఉద్యమానికి జీవితాంతం నాయకత్వం వహించారు. సామాజిక అవసరాలకు అనుగుణంగా మారడం బ్రాహ్మణుల ప్రత్యేకత.

జన్మ ఆధారంగా బ్రాహ్మణత్వం నిర్ణయించబడుతుందనే భావనను ఖండించే ఉదాహరణలు అనేకం ఉన్నాయి. క్షత్రియుడిగా జన్మించిన ఋషి విశ్వామిత్రుడు తీవ్రమైన తపస్సు, ఆత్మసాక్షాత్కారం ద్వారా బ్రహ్మర్షి స్థాయిని సాధించాడు. బ్రాహ్మణేతర నేపథ్యం నుంచి వచ్చిన మహర్షి, బ్రహ్మర్షి వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని రచించాడు. వారి జీవితాలు అధ్యయనం చేస్తే, బ్రాహ్మణత్వం వారసత్వంగా, జన్మతహా లభించేది మాత్రమే కాదని, అది సాధన ద్వారా పొందేదన్నది స్పష్టమవుతున్నది.

‘సూతుడు శౌనకాది మహామునులకు..’ అని చెప్పే బ్రాహ్మణుల మాటలు వినని ఆస్తిక, నాస్తిక మహాశయులు బహుకొద్దిమందే! మహామహా పూజ్యనీయుడైన సూత మహర్షి వ్యక్తిత్వం తరతరాలుగా, యుగయుగాలుగా, అజరామరంగా భాసిల్లుతున్నది. బ్రాహ్మణుడిగా జన్మించకపోయినా, బ్రాహ్మణుడిగా మారకపోయినా, ‘అష్టాదశ (18) పురాణ విజ్ఞానానికి’ పటిష్టమైన మూలాధారంగా నిలిచారు. ఆయన ద్వారా జ్ఞాన సముపార్జన చేసినవారిలో మహర్షులు, జన్మతః బ్రాహ్మణులు ఉన్నారు.

విశాల దృక్ఫద పౌరాణిక కథనాలు, సృష్టి రహస్య తత్త్వం, తాత్విక జ్ఞానాన్ని అనునిత్యం ఆయన ధారపోశారు. భగవంతుడికి కుల భేదం లేదనిఅగ్రవర్ణాలు, అల్పవర్ణాలు అనేవి సత్యనారాయణ వ్రతం దగ్గర అసలే పనికిరావని నిర్ధారిస్తూ, ‘ప్రపంచం మొత్తం మీద సామ్యవాద కథ సత్యనారాయణ స్వామి వ్రత కథ’ అని చెప్పిన మహనీయుడు సూతమహర్షి. దీనిలోని సంకేతం స్పష్టంగా ఉన్నది. గౌరవం వంశానికి, కులానికి, వర్ణానికి పరిమితం కాదు. జ్ఞానాని మాత్రమే చెందుతుంది. ‘సంప్రదాయ పరిరక్షకులు’గా పేరుపొందిన బ్రాహ్మణులు, అధ్యయనం, ఆత్మసాక్షాత్కారంతో బోధనాధికారాన్ని సంపాదించిన ఒక మహర్షి ఎదుట శిష్యులుగా కూర్చొన్నారు. ఇదీ భారతీయ మహోన్నత సంస్కృతి.

ఈ ఉదాహరణలు ఒక అఖండమైన నాగరిక సూత్రం స్పష్టం చేస్తున్నాయి. సమాజ సేవ కోసం జ్ఞానాన్ని సంపాదించి, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి, దానిని ఇతరులకు పంచిన వారిని ఆదికాలం నుండి బ్రాహ్మణులుగా గౌరవించారు. ఇది ఒక వర్గానికి చెందిన ప్రత్యేక హక్కు కాదు. ఇది ఒక ఉన్నత సాధన మార్గం. బ్రాహ్మణత్వం అనేది అధికారం కాదు. అది ఆత్మాన్వేషణ. అది వారసత్వం కాదు. అది ఆచరణ. అది పేరులో కాదు. పరమార్థంలో ఉంది. (ఇది నా పూర్తి వ్యాసం)

1 comment:

  1. Interesting. I think when this caste system was introduced, it would have been for the division of labour. However, over the time, it has become hierarchical structure. Also, when it was division of labour, maybe everyone is getting remunerated equally or lead their lives in a comfortable or dignified manner. As now, only a certain set of jobs are high paying jobs, everyone is trying to get into it. Nothing wrong in it but now a new societal hierarchy is is being formed. At any time, there will be always the haves and have-nots. That is only truth and will always be there. Rest of the divisions are all temporary.

    ReplyDelete