Friday, April 17, 2026

వీగిన అనవసర, అవాంఛనీయ డిలిమిటేషన్ బిల్లు >>>>> సహకార సమాఖ్య స్ఫూర్తికి తృటిలో తప్పిన ప్రమాదం : వనం జ్వాలా నరసింహరావు

 వీగిన అనవసర, అవాంఛనీయ డిలిమిటేషన్ బిల్లు

సహకార సమాఖ్య స్ఫూర్తికి తృటిలో తప్పిన ప్రమాదం

వనం జ్వాలా నరసింహరావు

(ఏప్రిల్ 18, 2026)  

ఏప్రిల్ 16, 2026 గురువారం నాడు లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును, డిలిమిటేషన్ బిల్లును; కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. పరస్పర సంబంధం కలిగిన ఈ చారిత్రాత్మక బిల్లులు, దశాబ్దాలుగా నియోజకవర్గాల సీట్ల సర్దుబాటు లేదా పెంపుపై ఉన్న స్తంభనను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. లోక్‌సభ సభ్యుల సంఖ్యను 850కి పెంచడమే కాకుండా, 2029 నాటికి 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలును సాధ్యం చేయడానికి ఉద్దేశించినవివి. గత రాజ్యాంగ నిబంధనల ప్రకారం 2026 తర్వాత జరిగే తొలి జనగణన ఆధారంగానే డిలిమిటేషన్ జరగాల్సి ఉండగా, ఆ నిబంధనను పక్కనపెట్టి, తక్షణ అవసరాల కోసం 2011 జనగణన గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రతిపాదించడం ఇక్కడ గమనించదగ్గ విషయం.

సాంప్రదాయ జనగణన కాలచక్రాలకు అతీతంగా, అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్వచించే డిలిమిటేషన్ ప్రక్రియను ఈ చట్టం ప్రతిపాదిస్తోంది. ప్రారంభ తీర్మానం లోక్‌సభలో 207 మంది సభ్యుల మద్దతుతో ఆమోదం పొందగా, 157 మంది వ్యతిరేకించారు. ఇంతటి కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలోనూ 104 మంది సభ్యులు గైర్హాజరు కావడం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా భారతావని ఏడు దశాబ్దాలకు పైగా సాధించిన స్థిరమైన పరిణామ క్రమాన్ని, 78 సంవత్సరాల వయసున్న నేను ప్రత్యక్షంగా చూసిన అనుభవంతోనూ, ఉన్నత స్థాయి నిర్ణయాధికారులతో సన్నిహితంగా పనిచేసిన బాధ్యతతోనూ, ఉత్తమ పరిపాలన కేంద్రాలతో అనుబంధం రీత్యాను, ఒక సమతుల్య దృక్కోణాన్ని ఈ అంశం మీద వినయపూర్వకంగా సమర్పించాలని భావిస్తున్నాను.

డిలిమిటేషన్ ఒక అనివార్యమైన పరిణామంగానో లేదా అనవసరమైన అనర్థంగానో భావించబడే దిశగా సాగుతోంది. అలాంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఒక కీలకమైన (నిర్మాణాత్మక?) పునర్వ్యవస్థీకరణ, మారుతున్న రాజకీయ పరిణామాలు వేదికవుతున్నాయి. 'ఉత్తర-దక్షిణ' విభజన చర్చను తెరపైకి తెస్తున్నాయి. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణ రాష్ట్రాలు, తత్ఫలితంగా పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నష్ట నివారణ ప్రయత్నంలో భాగంగా, డిలిమిటేషన్ తర్వాత అన్ని రాష్ట్రాల లోక్‌సభ సీట్ల సంఖ్య (దాదాపు) రెట్టింపు అవుతుందని, ఏ రాష్ట్రం కూడా తన ప్రస్తుత ప్రాతినిధ్య బలాన్ని కోల్పోదని ఎన్డీయే ప్రభుత్వం సంకేతాలిచ్చింది. అయినప్పటికీ, విమర్శకులు ఈ ప్రతిపాదనలోని హేతుబద్ధతను తీవ్రంగా, సాక్ష్యాధారాలతో వ్యతిరేకిస్తున్నారు.

జనాభా ప్రాతిపదికన జరిగే పునర్వ్యవస్థీకరణ వల్ల ఉత్తరప్రదేశ్ (80 నుంచి సుమారు 120–125 స్థానాలకు), బీహార్ (40 నుంచి సుమారు 60–62 స్థానాలకు), మహారాష్ట్ర (48 నుంచి 72–75 స్థానాలకు) అత్యధికంగా లబ్ధి పొందే రాష్ట్రాలుగా కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఐదు ప్రధాన రాష్ట్రాల ఉమ్మడి వాటా ప్రస్తుతం ఉన్న 37 శాతం నుండి ఏకంగా 43 శాతానికి పెరుగుతుంది. తద్వారా లోక్‌సభలో ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం గణనీయంగా పెరగడమే కాకుండా, ఆ ప్రాంత సీట్ల సంఖ్య సుమారు 367కు చేరే అవకాశం ఉంది.

కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు పార్లమెంటరీ ప్రాముఖ్యత విషయంలో  సాపేక్షంగా నష్టపోయే ప్రమాదముందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 17 నుంచి సుమారు 26కు పెరగవచ్చని అంచనా. అయితే, ఐదు దక్షిణ రాష్ట్రాల ఉమ్మడి స్థానాల సంఖ్య 129 నుంచి 195కు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, సభలోని మొత్తం స్థానాల పెంపు దృష్ట్యా వాటి సమిష్టి వాటా సుమారు 24 శాతంగా కొనసాగుతుందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. జనాభా నియంత్రణలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాలను శిక్షించి, జనాభా పెరుగుదలను ప్రోత్సహించే విధంగా ఈ నమూనా ఉందంటూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తన తీవ్ర ఆందోళనను, అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

దశాబ్దాల తరబడి అనేక పరీక్షలను, మార్పులను, ఒడుదుడుకులను అధిగమిస్తూ విజయవంతంగా ప్రజాస్వామ్య పరిణితి, పరిణామం చెందిన ‘మహా భారతదేశం’ లో, డిలిమిటేషన్ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నది. ఎన్డీయేతర పార్టీల పాలనలోని దక్షిణాది రాష్ట్రాలు, జాతీయ రాజకీయాల్లో తమ ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోతుందనే నిజాయితీగల ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామం జాతీయ సమైక్యత, సహకార సమాఖ్య స్ఫూర్తిపై ప్రతికూల ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. డిలిమిటేషన్ ప్రక్రియ విచిత్రమైన గణాంకాల సర్దుబాటు కాకూడదు. ప్రాంతీయ విభజన రేఖలను ప్రస్ఫుటం చేసేదిగా ఉండకూడదు.

ఈ దృక్కోణం, రాజకీయ పక్షపాతమో లేదా ఆవేశపూరిత స్పందనో కాదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆరితేరిన అనుభవజ్ఞులు, దార్శనికత కలిగిన నాయకులు ప్రతిపాదించిన సమగ్ర ఆలోచనా సరళికి అనుగుణంగా, దగ్గరిగా ఉన్నదే. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ వంటి వారు ఈ అంశంపై సమతుల్యమైన, ప్రగతిశీల దృక్పథాన్ని ప్రదర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకత్త్వం కూడా డిలిమిటేషన్ మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. 'సహకార సమాఖ్య వ్యవస్థను' (Cooperative Federalism) బలంగా కాంక్షించే నాలాంటి పలువురు ఈ ఆందోళనలతో బహిరంగంగా ఏకీభవిస్తున్నారు.


సమాన ప్రాతినిధ్యం, ప్రజాస్వామ్యానికి పునాదికి ప్రాథమిక సూత్రం. దానిని అమలు చేసే విధానం కూడా సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలి. అభివృద్ధిని కాంక్షిస్తూ, జనాభా నియంత్రణలో క్రమశిక్షణను పాటిస్తూ, జాతీయ పురోగతికి అంకితమైన రాష్ట్రాలను ఈ ప్రక్రియ శిక్షించేలా ఉండకూడదు. నా తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక రంగాల్లోని అనేక ప్రమాణాల్లో అద్భుతమైన పనితీరును, గత దశాబ్ద కాలానికి పైగా కనబరిచాయి. ఇటువంటి పరిస్థితుల్లో, కేవలం పాతబడిన, కాలం చెల్లిన గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవడం తెలంగాణ లాంటి రాష్ట్రాలను తీవ్ర అన్యాయానికి, అననుకూల స్థితికి గురిచేయడమే!

మారుతున్న సామాజిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో, డిలిమిటేషన్ 15 సంవత్సరాలనాటి 2011 జనగణాంకాలపై ఆధారపడటం సమంజసంకాదు. గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా జనాభా విన్యాసాల్లోనూ, ఆర్థికాభివృద్ధి రంగాల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ, దేశ స్థూల జాతీయోత్పత్తికి (GSDP) గణనీయమైన తోడ్పాటును అందిస్తోంది. సమాచార సాంకేతికత, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం వంటి విభాగాల్లో వినూత్న ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా, జనాభా నియంత్రణలోనూ అద్భుతమైన పురోగతిని సాధించింది. ఇటువంటి ప్రగతిశీల రాష్ట్ర ప్రయోజనాలను అశాస్త్రీయ గణాంకాలతో ముడిపెట్టడం హేతుబద్ధం కాదు.

జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలకు కేవలం సమాన ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా, అవి సాధించిన ప్రగతికి సరైన గుర్తింపునివ్వడం అత్యంత సమంజసం. ఈ నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ‘హైబ్రిడ్ మోడల్’ అద్భుతమైన ప్రత్యామ్నాయంగా భావించడం సమంజసం. జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా, రాష్ట్రాల పనితీరు (Performance-based criteria) ఆధారంగా నియోజకవర్గాల కేటాయింపులో సమతుల్యతను పాటించాలనే ‘హైబ్రిడ్ మోడల్’ విధానం అటు సహకార సమాఖ్య స్ఫూర్తిని, ఇటు బాధ్యతాయుత పాలన ఆవశ్యకతను అద్దం పడుతోంది.

ఇది ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రాన్ని దెబ్బతీయకుండా, సమాంతరంగా ప్రగతిశీల విధానాలను అనుసరించే రాష్ట్రాలను నిరుత్సాహపరచకుండా ముందుకు సాగే ఒక ప్రయోజనకర నమూనా మార్గాన్ని సూచిస్తున్నది. మొత్తం డిలిమిటేషన్ ప్రక్రియను అత్యంత సునిశితంగా, జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. తద్వారా 'ఉత్తర-దక్షిణ' విభజన అనే భావన బలపడకుండా చూడవచ్చు. వైవిధ్యంలో ఐక్యతే భారతదేశ వాస్తవ బలం. ఏ విధానమైనా, అది ఎంతటి ఉన్నత ఆశయంతో రూపొందించినదైనా, ప్రాంతీయ అసమానతలకు తావు లేకుండా, జాతీయ ఐక్యతను మరింత బలోపేతం చేసే విధంగా ఉండాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ, అందరినీ కలుపుకునిపోయేలా  వివిధ ప్రక్రియల రూపకల్పన జరగాలి.

దీనిమీద చర్చ పరస్పర గౌరవం, ఉమ్మడి ఆకాంక్షలు, దేశ పురోగతి అనే బృహత్తర లక్ష్యాల ప్రాతిపదికన సాగాలి. డిలిమిటేషన్ అంటే, చట్టసభల స్థానాలకు సంబంధించి భౌగోళిక సరిహద్దులను పునర్నిర్వచించే ప్రక్రియ. ప్రజాస్వామ్య మూల సూత్రాలకు అనుగుణంగా, ప్రతి పౌరుడి ఓటుకు సమాన ప్రాముఖ్యత లభించేలా చూడటమే దీని ప్రధాన ఉద్దేశం. ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ’ అనే రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి, పారదర్శకంగా, రాగద్వేషాలకు అతీతంగా, శాస్త్రీయంగా జరగాల్సిన అవసరమున్నది.  

విస్తృత ఆమోదం పొందిన ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా, జనాభా మార్పులకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులను కాలానుగుణంగా పునర్వ్యవస్థీకరించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. కాకపోతే, జనాభా నియంత్రణ ప్రమాణాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం కూడా అత్యంత ఆవశ్యకం. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం సహా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం డిలిమిటేషన్ చేపట్టినా, వివిధ ప్రాంతాల మధ్య ఉన్న రాజకీయ, సామాజిక అసమానతలను తొలగించడమే ప్రధాన ధ్యేయంగా ఉండాలి. సమతుల్యమైన అభివృద్ధి, సమాన ప్రాతినిధ్యం కలగలిసినప్పుడే దేశ ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుంది.

ఇలా చేయడానికి బదులుగా, డిలిమిటేషన్ ప్రక్రియ సరికొత్త అసమతుల్యతలకు దారితీస్తే, ప్రాధమిక ఉద్దేశమే దెబ్బతినడం కాకుండా ఎన్నికల ప్రక్రియ ప్రాథమిక స్ఫూర్తిని కూడా బలహీనపరుస్తుంది. రాజకీయ పక్షపాతాలకు లేదా స్వల్పకాలిక ప్రయోజనాలకు తావులేకుండా ఈ ప్రక్రియ సాగాలి. వాస్తవానికి, స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం, ప్రారంభంలో, లోక్‌సభ స్థానాల కేటాయింపు జనాభా ప్రాతిపదికన సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే లక్ష్యంతోనే మొదలైంది. కానీ ఈ విధానం ఆచరణలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. 1951 జనగణాంకాల ఆధారంగానే తొలి సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో, అంటే 1952 నుంచి 1957 వరకు కొనసాగిన తొలి లోక్‌సభలో ఎన్నికైన సభ్యుల సంఖ్య 489 కాగా, గరిష్ట సభ్యుల సంఖ్య 499గా ఉండేది.

ఆ సంఖ్య తదుపరి పునర్వ్యవస్థీకరణ జరిగిన 1963 వరకు మార్పు లేకుండానే కొనసాగింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనంతరం 1963లో మొత్తం స్థానాల సంఖ్య 522కు పెరగ్గా, 1973 నాటికి అది 543కు చేరింది. అప్పట్లో 1971 జనగణనను ప్రాతిపదికగా తీసుకుని, లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 వద్ద స్థిరపరిచారు. దేశంలో మొదటి డిలిమిటేషన్ కమిషన్ 1952లో ఏర్పడగా, ఆ తర్వాత 1963, 1973 మరియు 2002 సంవత్సరాల్లో కమిషన్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రాలను భౌగోళిక నియోజకవర్గాలుగా విభజించే కీలక బాధ్యతను ఈ డిలిమిటేషన్ కమిషన్‌కే అప్పగించారు. అయితే, జనాభాతో నిమిత్తం లేకుండా చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కనీసం ఒక లోక్‌సభ స్థానం ఉండేలా రాజ్యాంగబద్ధమైన హామీ ఇవ్వడం విశేషం.

లోక్‌సభ స్థానాలను రాష్ట్రాలకు కేటాయించే ప్రక్రియ, ప్రతి రాష్ట్ర జనాభాకు, అక్కడి స్థానాల సంఖ్యకు మధ్య గల నిష్పత్తి దేశవ్యాప్తంగా సాధ్యమైనంత సమానంగా ఉండాలనే రాజ్యాంగ నిబంధనపై ఆధారపడి ఉంటుంది. అయితే, వ్యవస్థలోని ప్రాథమిక రూపకల్పనలో తలెత్తిన సవాళ్లు త్వరలోనే సవరణల అవసరాన్ని నొక్కిచెప్పాయి. ఈ క్రమంలోనే 1952లో చేపట్టిన రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా, అప్పటివరకు నియోజకవర్గ జనాభాపై ఉన్న గరిష్ఠ పరిమితిని తొలగించారు. ఈ మార్పు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో మరింత వెసులుబాటును, సౌలభ్యాన్ని కల్పించింది.

1976లో చేపట్టిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, జనాభా పెరుగుదల అధికంగా ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించేలా ప్రోత్సహించేందుకు, లోక్‌సభ స్థానాల సంఖ్యను 1971 జనగణన ప్రాతిపదికన స్తంభింపజేశారు. వాస్తవానికి రాజ్యాంగ సూత్రాల ప్రకారం ప్రతి జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్రాల వారీగా సీట్ల కేటాయింపును 1971 స్థాయిలోనే ఉంచుతూ, స్తంభింపజేసిన  గడువును 2026 వరకు పొడిగించారు. అంటే, డిలిమిటేషన్ మీద సమీక్ష 2026 తర్వాత జరిగే తొలి జనగణన అనంతరం మాత్రమే చేపట్టాలని అప్పట్లో స్పష్టంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, నిర్ణీత గడువు కంటే ముందే ఈ ప్రక్రియను ఇప్పుడే అత్యవసరంగా తెరపైకి తీసుకురావడం, సందేహాలకు తావిస్తోంది. ఇది కేవలం పక్షపాత రాజకీయ ప్రయోజనాల కోసమేనా అనే ప్రశ్నలు వెల్లువెత్తడంలో తప్పులేదు.

మొత్తం పరిస్థితిని సమగ్ర కోణంలో పరిశీలిస్తే, డిలిమిటేషన్ అనేది కేవలం భౌగోళిక సరిహద్దుల సవరణ మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్య సమానత్వానికి అతిపెద్ద గీటురాయి అనాలి. అయితే, ఈ ప్రక్రియను అమలు చేసే క్రమంలో సమకాలీన వాస్తవాలను విస్మరిస్తే సహకార సమాఖ్య వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. జనాభా గణాంకాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే, అభివృద్ధిని శిరసావహించి దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా అప్రాధాన్యతకు గురయ్యే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో, కేవలం జనాభానే కాకుండా అభివృద్ధి, సామాజిక బాధ్యత, వివిధ అభివృద్ధి రంగాలలో పనితీరు వంటి అంశాలను సమన్వయం చేసే ఒక 'సమగ్ర జాతీయ దృక్కోణం' నేడు అనివార్యం.

దేశ ఐక్యత అనేది ఒక సున్నితమైన తాడు వంటిది. ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య ఏమాత్రం విభేదాలు పొడసూపినా అది జాతీయ సమైక్యతకు, సమగ్రతకు భంగం కలిగిస్తుంది. ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీసే ఏ ప్రయత్నమైనా భావి భవిష్యత్ తరానికి అశాంతిని మిగిల్చే హెచ్చరికగా మారే ప్రమాదమున్నది. అందుకే, ఈ డిలిమిటేషన్ ప్రక్రియ కేవలం అంకెల గారడీగా మిగిలిపోకుండా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా, విశాల జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భారతదేశం, ఈ ప్రక్రియ ద్వారా మరింత బలోపేతం కావాలే తప్ప, ప్రాంతీయ అసమానతల మధ్య చిక్కుకోకూడదని ఆశిద్దాం. ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని, రాష్ట్రాల ప్రగతిని సమానంగా గౌరవించాలి. అప్పుడే ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి పరీక్షగా మిగిలిపోకుండా, దేశ సమగ్రతను కాపాడే కీలక ముందడుగుగా చరిత్రలో నిలుస్తుంది.

ప్రాంతీయ అసమానతలపై ఆందోళనలు, సమాఖ్య స్ఫూర్తిపై సందేహాల నేపథ్యంలో, తీవ్ర చర్చలు, రాజకీయ సమీకరణాల మధ్య ఈ శుక్రవారం (ఏప్రిల్ 17, 2026) జరిగిన ఓటింగ్‌లో రాజ్యాంగ (131వ సవరణ) డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. ఏప్రిల్ 16న జరిగిన ప్రాథమిక డివిజన్ ఓటింగ్‌లో మద్దతు లభించినప్పటికీ, తుది ఓటింగ్‌లో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీ లభించకపోవడంతో బిల్లు ఆగిపోయింది. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఒక మలుపు తిప్పడమే కాకుండా, భవిష్యత్ రాజకీయ దిశను ప్రభావితం చేసే పరిణామంగా మారనుంది. సహకార సమాఖ్య వ్యవస్థ భవితవ్యంపై మరిన్ని చర్చలకు వేదిక కాబోతున్నది.

No comments:

Post a Comment