Saturday, May 30, 2026

కృష్ణ రాయబారం, సమరానికి ‘సై’ >>>>> (18 రోజుల కురుక్షేత్ర మహాభారత సంగ్రామ విశేషాలు-1) : వనం జ్వాలా నరసింహారావు

 కృష్ణ రాయబారం, సమరానికి ‘సై’

(18 రోజుల కురుక్షేత్ర మహాభారత సంగ్రామ విశేషాలు-1)

వనం జ్వాలా నరసింహారావు

(భక్తి పత్రిక, జూన్ నెల 2026)

{తింటే గారెలే తినాలి...వింటే భారతం వినాలి. తెలుగువారికి మహాభారతం అంటే తగని ప్రీతి. పద్దెనిమిది పర్వాల మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామ ఘట్టం ఆద్యంతమూ ఆసక్తికరమైనది. అచ్చంగా భారతంలో పర్వాల సంఖ్య వలెనె కురుక్షేత్ర సంగ్రామం కూడా పద్దేనిమిడ్ అక్షౌణిల సేనావాహిని మధ్య పద్దేనిమిడ్ రోజులపాటు జరగడం విశేషం. కురుక్షేత్ర సంగ్రామ విశేషాలను ఆంధ్రమహాభారతం ఆధారంగాపద్దెనిమిది భాగాలుగా భక్తి పత్రిక పాఠకులకు అందించబోతున్నాం. అందులో ఇది మొదటి భాగం.)-సంపాదకుడు, భక్తి పత్రిక  

కురుక్షేత్ర సంగ్రామం పూర్వరంగంలో రాజనీతికి శిఖరాయమాణమైన రాయబార ఘట్టంలో శ్రీకృష్ణుడు ఒక దివ్యాదివ్యవిభావం.  కౌరవుల దగ్గరికి రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు, ప్రముఖులందరూ కూర్చున్న తరువాతనే కూర్చున్నాడు. సభ అంతటా శ్రీకృష్ణాధీనమైన ఒక దివ్యానుభూతి వాతావరణం నెలకొన్నది. కొలువుకూటంలో వున్న వారందరూ శ్రీకృష్ణ సందర్శనంతో సంతోష పరవశులయ్యారు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి, కౌరవపాండవులు పాలు, నీరులాగా కలసి మెలసి జీవించడం మంచి పనని, వారలా వుండే విధంగా నడిపించడం ధృతరాష్ట్రుడి బాధ్యత అని అన్నాడు. ఆ విధంగా ‘న్యాయం, హితంతెలియచేశాడు. భరతవంశ గౌరవ, సంప్రదాయ పరిరక్షణను సోదాహరణంగా వివరించాడు.

భరతవంశపు కీర్తి

         ‘భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, పొత్తు, పెంపు, కరుణ కలిగి నుతి కెక్కింది. దాయాది భాగాలకై తగవులాడుకొని కుత్తుకలను ఉత్తరించుకోవటానికి ఎప్పుడూ సిద్ధం కాలేదు. రాజ్యాన్ని త్యాగం చేయటమే గాని దానికై వంశ నాశనానికి పూనుకోవటం భరతవంశ సంప్రదాయం కాదు. ఆ వంశం యొక్క సుచరిత్ర క్రమాన్ని ఇప్పుడు తప్పటం దేనికి’ అని అంటూ, ధృతరాష్ట్రుడు కౌరవవంశ రాజులలో అగ్రగణ్యుడు కావాలంటే ఈ న్యాయం పాటించాలని శ్రీకృష్ణుడు అపష్టం చేశాడు. దుర్యోధనాదులు భరతవంశ సంప్రదాయాన్ని కలుషితం చేస్తున్నారని కూడా అన్నాడు. కౌరవపాండవుల మధ్య  యుద్ధమే జరుగుతే మహావిపత్తు కలుగుతుందని, తన మాటలమీద విశ్వాసం వుంచి సంధి జరిపించాలని కోరాడు. శ్రీకృష్ణుడు పాండవులు చెప్పమన్న మాటలు కూడా ధృతరాష్ట్రుడితో వివరంగా చెప్పాడు.

సందికార్యం ధృతరాష్ట్రుడి చేతిలోనే వుందని, ‘ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత ఫలితాన్ని పొందలేని దుస్థితి కలిగినప్పుడు సమర్థులు ఉపేక్షించ కూడదు. అలా చేస్తే వారికే చేటు కలుగుతుంది. కౌరవుల వలన సత్యానికి ధర్మానికి హాని చేకూరింది. సత్యాన్ని, ధర్మాన్ని పాలించే పాండవులను దైవం తప్పక రక్షిస్తాడు’ అని చెప్పాడు. సభలో వున్న జామదగ్న్య మహాముని, కణ్వమహాముని, నారదుడు, శ్రీకృష్ణుడి మాటలు విని కురువంశాన్ని కాపాడమని దుర్యోధనుడికి చెప్పారు. తానేమీ చేయలేనని ధృతరాష్ట్రుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు.

         విశ్వరూప ప్రదర్శన

దుర్యోధనుడు క్షత్రియ ధర్మం ప్రకారం తాను యుద్ధం చేస్తానన్నాడు. యుద్ధం చేస్తే విజయమో, వీరస్వర్గమో లభిస్తుందని, పాండవులకు సగ భాగం ఇవ్వడానికి తాను అంగీకరించనన్నాడు. తామూ, పాండవులు భూమిని పంచుకుని పరిపాలించడం జరగదని, ‘వాడి సూది మొన మోపినంత మాత్రమైనా భూమినిపంచి పాండవులకు తానివ్వనని, తమలో ఎవరో ఒకరు యుద్ధంలో విజయం సాధించి రాజ్యం చేయాలని తన నిర్ణయమని అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు చెప్పినట్లే రణరంగంలో అతడు ఓడిపోతాడని, యుద్ధం రాబోతున్నదని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. గాంధారి హితవాక్యాలు కూడా దుర్యోధనుడికి నచ్చలేదు.

         తనను బంధించాలని ప్రయత్నం చేసిన దుర్యోధనుడిని చూసి, శ్రీకృష్ణుడు చిరునవ్వుతో విశ్వరూపం ప్రదర్శించాడు. నారదాది మహర్షులకు, భీష్మ, ద్రోణ, విదుర, సంజయులకు తన విశ్వరూపం చూడడానికి దివ్యదృష్టి ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. తనకు కూడా ఆ భాగ్యాన్ని కలిగించమని వేడుకున్న ధృతరాష్ట్రుడికి కూడా దివ్యదృష్టిని ఇచ్చాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి కోరిన విధంగా మల్లీ గుడ్డివాడిని చేసి, విశ్వరూపాన్ని ఉపసంహరించాడు. శ్రీకృష్ణుడు సభ నుండి బయల్దేరి వెళ్లిపోయాడు. 

ఆ తరువాత శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్లాడు. కర్ణుడి జన్మ రహస్యం చెప్పాడు. కుంతీదేవి సూర్యుడివల్ల అతడికి జన్మనిచ్చిందని, అందువల్ల ఆయన పాండురాజు పెద్ద కుమారుడని, కర్ణుడు తమ అన్న అని ధర్మరాజుకు తెలిస్తే అతడికే రాజ్యభారం వహించడానికి పట్టం కడుతారని, కాబట్టి తనతో కలిసి పాండవుల దగ్గరికి కలిసి రమ్మని అన్నాడు. దేవేంద్ర వైభవంతో మహానీయుడివై మహీమండలాన్ని పరిపాలించమని పలికాడు. కుంతీదేవి తనను కనికరం లేకుండా గంగలో తోసిందనీ, సూతదంపతులు తనను దయతో పెంచారనీ, తనను వారు కన్నకుమారుడిలాగా చూశారనీ, ఇప్పుడు వారిని వదిలితే ధర్మం తప్పినవాడిని అవుతాననీ కర్ణుడు బదులు చెప్పాడు.

ధర్మజుని యుద్ధ సన్నాహాలు

శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి ఉపప్లావ్యానికి వచ్చి ధర్మరాజును కలిసి, కౌరవులు సంధికి అంగీకరించలేదని చెప్పాడు. దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు కాని పాండవులకు రాజ్యం ఇవ్వడని స్పష్టం చేశాడు. అంతా విన్న ధర్మరాజు రణరంగానికి కదలమని తమ్ములను ఆదేశించాడు. పాండవుల పక్షాన వున్న ఏడక్షౌహిణుల సైన్యాన్ని నడిపించగలిగి, భీష్ముడిని ఎదుర్కునే శక్తి-సామర్థ్యాలు కల మేటి విలుకాడెవ్వరని ఆలోచనచేసి, ద్రోణాచార్యుడిని నిర్మూలించడానికే ఉద్భవించి, బాహుబలం, ప్రతాపం కలవాడైన ధృష్టద్యుమ్నుడు సర్వసైన్యాధిపతిగా  వుండడానికి తగినవాడని నిర్ణయించారు.

ఆ తరువాత ఏడక్షౌహిణుల సైన్యానికి విడివిడిగా అధిపతులను శ్రీకృష్ణుడినే నిర్ణయించమని ధర్మరాజు కోరాడు. ద్రుపదుడిని, విరాటుడిని, సాత్యకిని, జరాసంధుడి కుమారుడు సహదేవుడిని, చేకితానుడిని, శిశుపాలుడి కొడుకు ధృష్టకేతువుని, శిఖండిని ఏడక్షౌహిణులకు అధిపతులుగా నియమించమని శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు. ఇది జరిగిన మర్నాడు ధర్మరాజు నిండు కొలువులో శ్రీకృష్ణుడి ఆదేశానుసారం ద్రుపదుడు మొదలైనవారిని వేర్వేరుగా అక్షౌహిణులకు నాయకులను చేశాడు. ధృష్టద్యుమ్నుడికి ప్రత్యేకంగా అభిషేకం చేసి, సర్వసేనాధిపత్యానికి పట్టం కట్టాడు. ప్రయాణ భేరి మోగగానే యుద్ధయాత్రకు సమస్త సైన్యాలు సంసిద్ధమయ్యాయి. పాండవులు ద్రౌపదీదేవికి వెళ్లి వస్తామని చెప్పి వీడ్కోలు తీసుకున్నారు.

ధర్మరాజు రథాన్ని అధిరోహించాడు. ఆయనకు నమస్కరించిఅర్జునుడు శ్రీకృష్ణుడి సారథ్యంలోని రథం మీద ఎక్కి తన శంఖాన్ని పూరించాడు. ఆ రథం మీద హనుమద్ద్వజం రెపరెపలాడుతున్నది. భీముడు, నకులుడు, సహదేవుడు, అభిమన్యుడు, ఉపపాండవులు రథాలను అధిరోహించే ముందర ధర్మరాజుకు నమస్కరించారు. ధృష్టద్యుమ్నుడు ధర్మరాజుకు సాగిలపడి నమస్కరించి అశ్వాన్ని అధిరోహించాడు. సేనతో కలిసి ధర్మరాజు కురుక్షేత్రాన్ని సమీపించాడు. హిరణ్వతి అనే ఒక పవిత్ర నది ఒడ్డున ఆగాడు. శ్రీకృష్ణుడు యుద్దారంభానికి సిద్ధమనే సంకేతంగా పాంచజన్యాన్ని పూరించాడు. ధర్మరాజాదులు కూడా అలాగే తమ వీరశంఖాలను పూరించారు.

కౌరవుల పక్షాన ...

ఇదిలా వుండగా, తాము సైన్యంతో విడిది చేయాల్సిన స్థలం కురుక్షేత్రమని అంటూ, దుశ్శాసనుడిని అన్ని పనులు చూసుకోమని  చెప్పిన దుర్యోధనుడు మర్నాడు కొలువు కూటానికి వచ్చాడు. ద్రోణాచార్యుడిని, రాధేయుడిని, అశ్వత్థామను, బాహ్లికుడిని, శల్యుడిని, కృపాచార్యుడిని, భూరిశ్రవుడిని, శకునిని, కృతవర్మను, కాంభోజరాజును, సైంధవుడిని కౌరవుల పదకొండక్షౌహిణులకు సేనానాయకులుగా నియమించాలని నిశ్చయించిన దుర్యోధనుడు వారందరినీ సభకు పిలిపించాడు. వారిని సేనాపతిత్వానికి అభిషిక్తులు కమ్మని కోరి, వారందరినీ వైభవంగా అక్షౌహిణీపతులుగా అభిషిక్తులను చేశాడు దుర్యోధనుడు.

         భీష్ముడి దగ్గరికి వెళ్లి వారిని సేనానాయకులుగా పరిచయం చేశాడాయనకు. యావత్ యుద్ధానికి రణభారం వహించి సర్వసైన్యాధిపత్యం నిర్వహించడానికి అంగీకరించమని భీష్ముడిని ప్రార్థించాడు. తాను సర్వసేనాధిపత్యం వహిస్తానని, తనను ఎదుర్కోగల పురుషులెవ్వరూ భూమ్మీద లేరని, అయితే తాను ఆర్జునుడిని మాత్రం ఎదుర్కోలేనని అన్నాడు. పాండుకుమారులను సంహరించడానికి తనకు చేతులు రావని కూడా చెప్పాడు. ముందు తనను కాని, కర్ణుడిని కాని యుద్ధం చేయడానికి నియోగించమని అన్నాడు. అలా అయితేనే తాను సర్వసేనాధిపత్యం వహిస్తానని స్పష్టం చేశాడు. తానెలాగు భీష్ముడు రణరంగంలో నేలకూలేదాకా యుద్ధం చేయనన్నానుగా అన్నాడు కర్ణుడు. సరే అని భీష్ముడు కౌరవుల సర్వసేనాధిపతిగా పట్టం కట్టుకోవడానికి అంగీకరించాడు. దుర్యోధనుడు సర్వసేనాధిపత్యానికి భీష్ముడిని అభిషేకించి, ఆయన్ను ముందుంచుకొని కురుక్షేత్రానికి నడిచాడు. కురుక్షేత్రంలో కౌరవ-పాండవ సేనలు చేరి యుద్ధానికి సిద్ధమయ్యాయి. 

సంజయుని వ్యాఖ్యానం

పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవపాండవులు యుద్ధానికి సంసిద్ధమై వున్న సమయంలో సంజయుడితో కూడి వున్న ధృతరాష్ట్రుడి దగ్గరకు వేదవ్యాస మహర్షి వచ్చాడు. యుద్ధాన్ని ఆయన ప్రత్యక్షంగా చూడాలనుకుంటే దివ్యదృష్టిని ఇస్తానని అన్నాడు. జవాబుగా ధృతరాష్ట్రుడు, అన్నదమ్ముల మధ్య జరిగే ఘోర యుద్ధాన్ని తాను చూడలేనని, కేవలం వినగలనని, ఆ ఏర్పాటు చేస్తే చాలని కోరాడు. వేదవ్యాసుడు కరుణించి, యుద్ధ విషయాలను ధృతరాష్ట్రుడికి జరిగినవి జరిగినట్లుగా చెప్పడానికి సంజయుడిని నియోగించాడు. సంజయుడికి కొన్ని అతిలోక శక్తులు ప్రసాదించాడు. దాని ప్రకారం, సంజయుడు యుద్ధభూమిలో ఇష్టం వచ్చినట్లు నిర్భయంగా తిరగవచ్చు. అతడిని ఏ ఆయుధాలు తాకలేవు. అందరి మాటలు వినగలదు. మనసులను పసిగట్టగలడు.

వేదవ్యాసుడు అంతర్థానమై పోయిన తరువాత, ‘రాజుకు భూమి కామధేనువై వర్తిల్లుతుంది. శక్తి, సామర్థ్యాలున్న రాజులు, ఉపాయంకల రాజులు, తమకు ఎంతో విశాలమైన రాజ్యం ఉన్నప్పటికీ, తృప్తి చెందక, తండ్రి-కొడుకు, అన్న-తమ్ముడు అనే విచక్షణ లేకుండా యుద్ధం చేసి భూమిని బలవంతంగా లాక్కుంటారు అని చెప్పాడు సంజయుడు. పూర్వకాలం నుండి రాజులు భూమికోసం పోరాడుతూనే వున్నారని, కౌరవపాండవులు కూడా భూమికోసం పోరాడడం వెనుకటి పరిపాటిమాత్రమే కాని కొత్త తప్పేమీ కాదని అన్నాడు. దైవం ఎవరిని అనుకూలిస్తే వారికి విజయం చేకూరుతుందని, ఏం జరగనున్నదో అని ధృతరాష్ట్రుడు దుఃఖించాల్సిన పని లేదని చెప్పాడు. వేదవ్యాసుడిని మనసులో ధ్యానం చేసుకుని, సంజయుడు, తాను చూసిన, తనకు తెలియవచ్చిన భారత యుద్ధ విశేషాలను యుద్ధం మొదలైనప్పటి నుండి ధృతరాష్ట్రుడికి వివరించసాగాడు.

సమరానికి ప్రారంభం      

మర్నాడు సూర్యోదయం కాగానే యుద్ధం ఆరంభం అయింది. సేనాపతైన భీష్ముడు ప్రత్యేక ఆకర్షణగా వెలుగొందాడు. ఆయన రథం, దానికి కట్టిన గుర్రాలు, ఆయన ధరించిన వస్త్రాలు, పట్టుకున్న ధనుస్సు, బంగారు తాడిచెట్టుతో రెపరెపలాడుతున్న జెండా, కాంతులీనే కవచం అన్నీ ప్రత్యేకంగా కనిపించాయి. ఇక మిగిలిన మహావీరుల రథాలు, జెండాలు కూడా ప్రత్యేకంగానే వున్నాయి.

పూర్వం మహావీరులు తమ రథాలకు అమర్చిన జెండా మీద వారిని స్ఫురింపజేసే ఒక చిహ్నం ఫలానా వీరుడని గుర్తు పట్టడానికి వీలుగా వుండేది. ద్రోణాచార్యుడి జెండా గుర్తు బంగారంతో నిర్మింపబడిన యజ్ఞవేదిక. కృపాచార్యులవారి జెండా బంగారం కాంతితో మెరసిపోయే ఆబోతు విలాస వైభవం.  ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ జెండా గుర్తు, వెలుగులు విరజిమ్మే మణి నిర్మితమైన సింహం తోక.  శల్యుడి జెండా గుర్తు, రత్నాల రాళ్లతో ధగ ధగా మెరిసిపోయే అరటిచెట్టు. వీరంతా తమ రథాలపై వారి జెండాలు రెపరెపలాడుతుండగా, ముచ్చట్లు చెప్పుకొంటూ, అమితోత్సాహంతో, చతురంగబలాలతో పరిహాస వచనాలు వెదజల్లుకుంటూ కదనరంగానికి కదలి వెళ్లారు.    

కృతవర్మ, జయద్రథుడు, విందుడు, అనువిందుడు, భగదత్తుడు, శకుని, బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, సుదక్షిణుడు, బృహద్బలుడు, నీలుడు, సుశర్మ, అలంబసుడు, హలాయుధుడు, సాల్వ, సౌవీర, శూరసేన, ఆభీర, యవన మొదలైన రాజులందరూ యుద్ధభూమికి తరలి వెళ్లారు కౌరవుల పక్షాన. వీరివెంట పది అక్షౌహిణుల సైన్యం తరలి వెళ్లగా, పదకొండో అక్షౌహిణి బలం వెంటరాగా సార్వభౌముడు దుర్యోధనుడు కదన రంగానికి కదిలి వెళ్లాడు. అతడి వెంట ఆయన తమ్ములు దుశ్శాసనుడు, దుర్మర్షణుడు, వివింశతి, వికర్ణుడు వెళ్లారు. (మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన 11, పాండవుల పక్షాన 7 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అక్షౌహిణి అనగా: 218170 రథాలు, 218170 గజాలు, 65610 గుర్రాలు, 109350 కాల్బలం)

వ్యూహ ప్రతివ్యూహాలు  

మహాభారత యుద్ధంలో నేటి భారత దేశం ఎల్లలు దాటిన కాంభోజ దేశం నుండి సేనలు, యవనులు, రాక్షసులు పాల్గొనడం ఒక విశేషం. ఒక విధంగా అది తొలి ప్రపంచ యుద్ధం’ అని ఒక మహాకవి వర్ణించారు. ఈ నేపధ్యంలో భీష్ముడు రాజులందరినీ ఒక చోట సమావేశపరచి, యుద్ధం స్వర్గంలో ప్రవేశించడానికి తెరువబడిన ద్వారం అని, రణరంగమే రాజులకు పంట చేనని, యుద్ధభూమిని దర్శించడం అంటే పెన్నిధిని చూసినట్లే అని అన్నాడు. రాజులలో ఉత్సాహం పొంగిపోయింది. కర్ణుడు, అతడి స్నేహితులు, కొడుకులు, మంత్రులు, బంధువులు యుద్ధంలో పాల్గొనకూడదని దుర్యోధనుడితో అన్నాడు భీష్ముడు. ఆ విధంగా భీష్ముడు కర్ణుడిని యుద్ధ రంగానికి రాకుండా నిషేధించాడు. ఇది దుర్యోధనుడికి బాధ కలిగించే అంశమైనా, భీష్ముడిని ప్రశంసించాడు.

భీష్ముడు మనుష్యాకారమైన ఒక గొప్ప ‘నరవ్యూహాన్ని’ అమర్చాడు. ఆ వ్యూహంలో భాగంగా యుద్ధం చేయడానికి తనతోపాటు ద్రోణుడిని, కృపాచార్యుడిని, అశ్వత్థామను, కృపవర్మను, శల్యుడిని, బాహ్లికుడిని, సోమదత్తుడిని, భూరిశ్రవుడిని నిలిపాడు. మధ్యలో దుర్యోధనుడు తన తమ్ములతో వుండేలా ఏర్పాటు చేశాడు ఆ వ్యూహాన్ని. ఆ వ్యూహంలో మరో విశేషం, ఆయా సైన్యాలను కాపాడడానికి రక్షగా ఏనుగులు అమర్చబడ్డాయి. వాటి ముందు రథాలు, రథాలకు రక్షగా అశ్విక బలాలు, అశ్విక బలాలకు రక్షగా విలుకాండ్రు, వారికి రక్షగా ఆయుధాలు ధరించిన సైనికులు నిలిచే ఏర్పాటు జరిగింది. ఇలాంటి దృఢమైన వ్యూహాన్ని కనీవినీ ఎరుగమని చూసిన వారంతా ఆశ్చర్యం చెందారు.

ఏడు అక్షౌహిణుల పాండవుల సేన సహితం యుద్ధ రంగానికి కదిలింది. ధర్మరాజు, ఆయన వెంట భీముడు వచ్చాడు. దేదీప్యమానంగా ప్రకాశించే ఆంజనేయుడి జెండా వున్న దివ్యమైన రథం మీద సారథిగా శ్రీకృష్ణుడు వుండగా, దేవదత్తం అనే శంఖం పూరిస్తూ అర్జునుడు యుద్ధ భూమికి బయల్దేరి వెళ్లాడు. నకుల సహదేవులు సల్లాపాలు ఆడుకుంటూ బయల్దేరి యుద్ధరంగానికి వచ్చారు. అభిమన్యుడు, ద్రౌపదీదేవి కొడుకులు ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు రణరంగానికి కదలి వచ్చారు. ద్రుపదుడు, ఆయన కొడుకులు, తమ్ముళ్లు, విరాటుడు, సాత్యకి, చేకితానుడు, శిఖండి, మగధ దేశాధిపతి సహదేవుడు, ఆయన తమ్ముడు, ధృష్టకేతుడు, ఘటోత్కచుడు, పాండ్యరాజు; శిబిరాజు, కాశ కరూశాది రాజులు, పంచ కేకయులు కూడా యుద్ధానికి తరలి వచ్చారు. భీష్ముడి నరవ్యూహం కన్నా గొప్పదైన ‘అచల వ్యూహాన్ని దృష్టద్యుమ్నుడు పన్నాడు.

(తరువాయి వచ్చే సంచికలో)


No comments:

Post a Comment