Wednesday, May 27, 2026

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అనుగ్రహభాషణం: ‘గోమాత వైభవం’ >>>>> పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డిగారి ఔదార్యంతో వినే భాగ్యం: వనం జ్వాలా నరసింహారావు

 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి 

అనుగ్రహభాషణం: ‘గోమాత వైభవం’

పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డిగారి 

ఔదార్యంతో వినే భాగ్యం    

శాంతావసంతం, గ్రీన్ వాక్ వేస్, రాజేంద్రనగర్, 

మంగళవారం (మే 26, 2026)

వనం జ్వాలా నరసింహారావు

మంగళవారం (26-05-2026) సాయింత్రం ఆరు గంటల ప్రాంతంలో, హైదరాబాద్ నగరానికి సుదూరంలో, రాజేంద్రనగర్ పరిసరాలలో, పలురకాల వృక్షాల మధ్యన వున్న, ప్రఖ్యాత భారతీయ పారిశ్రామికవేత్త, వ్యాక్సిన్ తయారీ సంస్థ శాంత బయోటెక్నిక్స్ వ్యవస్థాపకుడు, డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి (కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి) గారి గృహ ప్రాంగణం మధ్యలో, ప్రశాంత గ్రామీణ వాతావరణాన్ని పోలిన విశాలమైన ఆవరణలో, ‘గోమాత వైభవం’ గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అనుగ్రహభాషణం వినే మహద్భాగ్యం కలిగింది నాకు. వాస్తవానికి నేను వరప్రసాద్ రెడ్డి గారి దగ్గరకు వెళ్లాలని అనుకున్నది, ఇటీవల పుస్తక రూపంలో నేను రాసిన ‘Simplified and Faithful Rendering of the Adi Kavya’, Valmiki Ramayana: The Greatest Epic (Bala and Ayodhya Kandas)’ ప్రతిని వారికి అందచేయడానికే!

అయితే నా అదృష్టంకొద్దీ అదే సాయంత్రం, వారి ఇంటి ఆవరణలో, ఆహ్లాదకరమైన ఆరుబయట, గోమాత వైభవం అనే అంశం మీద బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి అనుగ్రహ భాషణం వినే అవకాశం వరప్రసాద్ రెడ్డి గారు కలిగించడమే కాకుండా, వారికీ, నాకూ పరిచయమున్న కొందరు పాతమిత్రులను కలుసుకునే వీలైంది. సుమారు రెండున్నర గంటలకు పైగా వారి ఇంట్లో గడిపిన సందర్భంలో డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డిగారికే కాకుండా, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారికి కూడా నా ఆంగ్ల (రామాయణం) పుస్తకంతోపాటు, ‘సజీవ వాహిని సనాతన ధర్మం తెలుగు పుస్తకాన్ని ఇచ్చే అవకాశం వరప్రసాద్ రెడ్డిగారి ద్వారా కలిగింది. నేను పుస్తకాలను ఇవ్వగానే కొన్ని నిమిషాలపాటు ఆసక్తికరంగా వాటిని పరిశీలించడం చాగంటివారి మంచిదనానికి నిదర్శనం.

చాగంటివారు తమ అనుగ్రహభాషణాన్ని అత్యంత హృద్యంగా, ఆధ్యాత్మిక గాంభీర్యంతో, వినోదరసాన్ని కలిపి వివరించిన అంశాలు శ్రోతలను ఆలోచింపజేసేలా, భక్తి భావాన్ని పెంపొందించేలా నిలిచాయి. లోకంలో తల్లి స్థానం పొందిన వారు నలుగురని: జననమాత, భూమాత, లోకమాత, గోమాతని పేర్కొంటూ, గోవును మించిన దైవం లేదని ఆహుతుల హర్షధ్వానాల మధ్య ఆయన స్పష్టం చేశారు. పంచామృతాలలో పాలు, పెరుగు, నేయి వంటి మూడు అమూల్య పదార్థాలు గోమాత నుంచే లభిస్తాయని గుర్తుచేశారు. ఆవుపాలు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రసాదిస్తాయని చెబుతూ, వందలాది ఆవుల మధ్య విడిచిన దూడ తన తల్లి దగ్గరకే చేరడం ఆ పాలను త్రాగిన మహిమేనని ఉదాహరణగా వివరించారు. గోమూత్రం, ఆవుపేడ వంటి ప్రతి అంశమూ మానవ జీవితానికి ఉపయోగకరమని, గోవు చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేసినా పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుందని చెప్పారు.

వాస్తవానికి నేను చాగంటివారు అక్కడికి రావాల్సిన సమయంకంటే వరప్రసాద్ రెడ్డిగారి ఇంటికి ఒక గంట ముందుగానే వెళ్లినప్పటికీ, వారు ఆరోజు నిర్వహణాకార్యక్రమంలో నిమగ్నమై వున్నప్పటికీ, ఒక అతిథికి చేయాల్సిన మర్యాదలకు ఎలాంటి భంగం కలగకుండా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవడం వారి సంస్కారానికి ఒక మచ్చుతునక మాత్రమే. అంతేకాకుండా, నన్ను అనుగ్రహభాషణం నిర్వహించాల్సిన ఆవరణకు వెళ్లమనకుండా, ఇంటిలోపల ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూచోబెట్టి, చల్లటి మజ్జిగ తెప్పించి ఇచ్చి, చాగంటివారు రావడంతోనే నేనున్న చోటుకే వారు వచ్చే విధంగా వారిని అంగీకరింపచేసి, కార్యక్రమం ప్రారంభం కాకముందే నా పుస్తకాలను ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇచ్చే ఏర్పాటు చేసిన వరప్రసాద్ రెడ్డిగారికి ధన్యవాదాలు చెప్పడమే నేను చేయగలిగేది.

అనుకున్న సమయానికి కొంచెం అటుఇటుగా అనుగ్రహభాషణం ఆరంభమైంది. దానికంటే ముందు, డాక్టర్ భువనగిరి ఫణి పవన్ శాస్త్రి తన జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిన మహోన్నత గ్రంథం భవద్గీతను విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్త్వ వికాసానికి మార్గదర్శకంగా వుండే రీతిలో రచించిన ‘చిన్ని భగవద్గీతను చాగంటివారు ఆవిష్కరించారు. అలాగే గోమాత కీర్తనల ఆడియోను కూడా వారు ఆవిష్కరించారు.

చాగంటివారు తమ అనుగ్రహభాషణకు ముందు, చివర, గత పది-పదిహేను సంవత్సరాలుగా మాతాపితలను వారి వర్ధంతుల సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ, వరప్రసాద్ రెడ్డిగారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి తాను వస్తున్న విషయం, ఆ సందర్భంగా ఒక ఆధ్యాత్మిక అంశం మీద మాట్లాడే అవకాశంతోపాటు, ఆహుతులలో ఎందరో పెద్దలను కలిసే అవకాశం కలగడం తన అదృష్టంగా చెప్పుకున్నారు. వరప్రసాద్ రెడ్డిగారి ఆదేశం మేరకు ‘గోమాత వైభవం మీద ప్రసంగిస్తానని ప్రారంభించారు. నడుస్తున్నది గ్రీష్మ ఋతువే అయినప్పటికీ, వాతావరణం చల్లగా వుండడం శుభాసూచనగా పేర్కొన్నారు.

ఒక్క గడ్డిపోచైనా ఆవుకు తినిపిస్తే మహాపుణ్యమేనని, గోశాలకు తరచూ వెళ్లలేనివారు ఇంట్లో గోవు చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, ప్రతిరోజూ తమ శక్తికి తగ్గట్టు కొంత ధనం దాచుకుని అవకాశం వచ్చినప్పుడు గోశాలలో ఆవులకు ఆహారం అందిస్తే స్వర్గసుఖాలు సిద్ధిస్తాయని ఆయన భావోద్వేగంతో వివరించారు. గోవును భక్తితో పూజించినవారికి మరే కారణం చేత నరకలోక ప్రాప్తి వచ్చినా, ఆ గోవే అక్కడికి చేరి తన తోక సహాయంతో వారిని స్వర్గానికి చేర్చగలదని పురాణోక్తిని ప్రస్తావించారు. ఆవు డెక్కల ధూళి కలిపి స్నానం చేస్తే రోగాలు దరిచేరవని కూడా చెప్పారు.

మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు వివరించిన గోమాహాత్మ్యాన్ని స్మరించుకుంటూ, తనదైన శైలిలో వాటిని అన్వయించుకుంటూ, అనేక విశేషాలను చాగంటి వారు అద్భుతంగా వివరించారు. ధర్మరాజు ‘గోవుల మహిమ ఏమిటి?’ అని అడిగినప్పుడు, అంపశయ్యపై ఉన్న భీష్ముడు శాంతి, అనుశాసనిక పర్వాలలో గోవుల వైభవాన్ని విపులంగా వివరించిన విషయాన్ని ప్రస్తావించారు. గోదాన మహిమను కూడా ధర్మరాజు కోరిక మేరకు భీష్ముడు వివరించాడని చెప్పారు. గోవూ, బ్రాహ్మణుడూ ఒకే తత్త్వానికి చెందినవారని, బ్రహ్మ వారిని రెండు రూపాలుగా సృష్టించాడని, గోవు హవిస్సుకూ, బ్రాహ్మణుడు మంత్రాలకూ ఆధారమని భీష్ముడు పేర్కొన్న విషయాన్నీ వివరించారు. సర్వవేదాలకు మూలమైన బ్రాహ్మణుని విలువను సాక్షాత్తు శివుడే నిర్ణయించడం కష్టమని, గోవు మహిమ కూడా అంతటిదేనని వివరించారు.

గోవు అగ్నిమయమనీ, అమృతమయమనీ, యజ్ఞాలకు పవిత్రమైన మార్గమనీ, దేవతలకు స్వర్గానికి చేరే నిచ్చెనలాంటిదనీ భీష్ముడు చెప్పిన విషయాలను చాగంటి వారు సామాజిక మార్పులకు అన్వయించుకుంటూ హృద్యంగా వివరించిన తీరు అద్భుతం. పాలు పితికే కంచుపాత్రతో సహా ఆవును భక్తితో ఒక సద్బ్రాహ్మణునికి దానం చేస్తే, ఆ గోవుకు ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని దివ్య సంవత్సరాలు దాత దేవలోకంలో నివసిస్తాడని, తన వంశంలోని ఏడు తరాలకు ఉత్తమలోకాల ప్రాప్తి కలుగుతుందని భీష్ముడు చెప్పినట్లు కూడా వివరించారు. గోదానం చేసినవాడు ముక్తిని పొందుతాడని, గోవులను దానం చేసినవారికి అపూర్వమైన పుణ్యలోకాల సౌఖ్యాలు సిద్ధిస్తాయని చెప్పారు.

ఆవుపాలు అమృతంతో సమానమని దేవేంద్రుడు చెప్పాడనీ, ఇటీవల ఆధునిక పశువైద్యులు కూడా అదేచెప్తున్నారనీ, అందువల్ల గోదానం అమృతదాన ఫలాన్నిస్తుందని, మునులు గోవులను ప్రాణస్వరూపాలుగా భావిస్తారని, గోదానం ప్రాణదానంతో సమాన ఫలితాన్ని ఇస్తుందని వివరించారు. గోవును స్వీకరించేవాడిని పరీక్షించి దానం చేయాలని, లేకపోతే గోవు శోకించి ఆ శోకం దాతను నరకానికి నెడుతుందని కూడా భీష్ముడు హెచ్చరించినట్లు చెప్పారు. భూమి, విద్య, గోవు: ఈ మూడే దానాలలో శ్రేష్ఠమైనవని, గోదాన ఫలాన్ని బ్రహ్మదేవుడుకూడా పూర్తిగా వివరించలేడని, ఆవులు సూర్యకిరణాలవంటివని, గోదానం చేసినవారు సూర్యుడిలా ప్రకాశిస్తారని చెప్పిన విషయాలను ఆసక్తికరంగా చర్చించారు.

దేవతలకు ఆకలి వేసి బ్రహ్మవద్దకు వెళ్లినప్పుడు ఆయన ఇచ్చిన అమృతపు పరిమళాలనుంచి కామధేనువు ఉద్భవించిందనీ, దానినుంచే గోవులు పుట్టాయని పురాణగాథను వివరించారు. హిమాలయాలపై తిరుగుతున్న గోవులలో ఒక దూడ పాలు త్రాగుతుండగా ఎగిరిన పాలనురుగు శివుని శిరస్సుపై పడిన సందర్భంలో, బ్రహ్మదేవుడు ఆవుపాలు అమృతసమానమని ప్రశంసించి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడనీ, అప్పుడు శివుడు గోవులకు ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించే వరం ఇచ్చాడనీ చెప్పారు.

ఆవుపేడలో లక్ష్మీదేవి నివసించడానికి కారణమైన ‘గోశ్రీసంవాదం’ గాథను కూడా చాగంటి వారు చక్కగా వివరించారు. లక్ష్మీదేవి గోవుల మధ్య నివసించాలని కోరగా, ఆమె చంచలస్వభావం కారణంగా మొదట గోవులు నిరాకరించాయని, తరువాత వేదాలు తమ మలమూత్రాలను పవిత్రమని పేర్కొన్నందున వాటిలో నివసించమని అనుమతించాయని, లక్ష్మీదేవి అంగీకరించి అందులోనే స్థిరపడటంతో గోవుల పేడ మహిమ మరింత పెరిగిందని వివరించారు.

ఇలా గోమాహాత్మ్యానికి సంబంధించిన అనేక పురాణ విశేషాలు, ఆధ్యాత్మికత, ఆచరణీయమైన సార్వజనీన సందేశాలు, భక్తి, విజ్ఞానం, వినోదం: ఇవన్నీ సమన్వయంతో సుమారు గంటసేపు సాగిన అనుగ్రహభాషణంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నారు; ‘అయ్యో! ఇంత త్వరగా అనుగ్రహభాషణం అయిపోయిందా!’ అని ఆహుతులు అనుకునే విధంగా ఆయన ప్రవచనం సాగింది. గోమాత వైభవానికి సంబంధించిన మరెన్నో ఆసక్తికరమైన, ఆధ్యాత్మికతపరమైన, సార్వజనీనమైన, ఎవరైనా సులభంగా ఆచరించ వీలుకలిగిన విజ్ఞానపరమైన విశేషాలను ఒకింత వినోదాత్మకంగా తెలియచేశారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు.  

చాగంటి గారి అనుగ్రహభాషణంలో నేను ఆసక్తికరంగా గమనించిన చాలా ముఖ్యమైన విషయం: కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతి కీర్తిశేషులు, పరమ పూజ్యులు, జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి (మహాపెరియవ లేదా కంచి పరమాచార్య), భారతీయ సనాతన ధర్మ, వేదాల పరిరక్షణకు చేసిన కృషి అపారమైనదని పేర్కొంటూ,  గోసంరక్షణకు ఆయన చేసిన కృషిని అద్భుతంగా చాగంటి కోటేశ్వరరావు గారు వివరించిన తీరు. కంచి పరమాచార్య ఒకప్పటి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినప్పుడు జరిగిన విషయాన్ని చెప్పారు.

‘కంచి పరమాచార్య తన సుదీర్ఘ పాదయాత్రలలో భాగంగా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడి దేవస్థానం గోశాలలో బస చేశారు. పరమాచార్య నిరాడంబరతకు నిదర్శనం: పీఠాధిపతి అయినప్పటికీ విలాసవంతమైన వసతులకు దూరంగా ఉండే అలవాటు కలిగిన ఆ మహనీయుడు, గోవులను సాక్షాత్ లక్ష్మీస్వరూపంగా భావించడం వల్ల, గోశాల పవిత్రమైన స్థలమని అక్కడే గడిపారు. అప్పుడే కాకుండా ఎల్లప్పుడూ ఆయన తన దైనందిన కాలకృత్యాలను, స్నానాదులను లోకానికి దూరంగా, అత్యంత సహజ సిద్ధమైన వాతావరణంలో, సర్వసాధారణంగా గోశాల పరిసరాల్లో శాస్త్రోక్తంగా ముగించుకునేవారు.’

‘సనాతన ధర్మంలో, ఆయుర్వేదంలో గోమూత్రానికి, పంచగవ్యాలకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. పరమాచార్య దీని ప్రాముఖ్యతను తరచూ ప్రస్తావించేవారు. ‘గోమూత్రే గంగా వసతి’ అంటే గోమూత్రంలో గంగాదేవి నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పరమాచార్య స్వయంగా గోమూత్రాన్ని శరీరంపై చల్లుకోవడం (ప్రోక్షించుకోవడం) లేదా గోమూత్రంతో కూడిన నీటితో స్నానం చేయడం వల్ల శారీరక, మానసిక కల్మషాలు తొలగిపోయి అపారమైన పుణ్యం, ఆరోగ్యం లభిస్తాయని బోధించారు,’ అని అన్నారు చాగంటివారు.

వాస్తవానికి, పరమాచార్య నడయాడిన అలనాటి శ్రీశైలం గోశాల, నేడు శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో ఆధునీకరించబడింది. ప్రస్తుతం అక్కడ వేలాది గోవులను సంరక్షిస్తూ, సాంప్రదాయ పద్ధతిలో గోమూత్రం,  గోమయంతో ‘గో-అర్క్ (ఔషధ అర్కం), విభూతి, దంతమంజన్ వంటి పవిత్ర ఉత్పత్తులను తయారు చేస్తున్నారనే విషయం బహుశా చాలామంది దృష్టికి రాకపోవచ్చు.

అనుగ్రహ భాషణ మధ్యమధ్యలో రెండుమూడు పర్యాయాలు చెప్పిన మరో ముఖ్యమైన విషయం: ‘గోప్రాదాన్యత, గోసేవావశ్యకత’ అనే అంశం మీద తాను తరచు చెప్పిన వివరాలను ఎప్పటికప్పుడు శ్రద్ధగా విని,  పెమ్మరాజు రవికిషోర్ గారనే మహనీయ వ్యక్తి ‘ధర్మవర్ధిని’ శీర్షికతో రూపొందించిన చిత్రరచనతో కూడిన టేబుల్ కాలెండర్ ప్రతి ఇంట్లోనూ వుండాల్సిన అపురూపమైనదనే సంగతి. చాగంటి గారు చెప్పినట్లే అనుగ్రహభాషణ అనంతరం వెళ్ళిపోతున్న ఆహుతులందరికీ దాన్ని ప్రత్యేక కానుకగా ఇచ్చారు డాక్టర్ వరప్రసాద్ రెడ్డిగారు. దానితో పాటు చక్కగా పండిన రెండు మామిడి పళ్లను కూడా అందరికీ పంచారు.

ఆ టేబుల్ కాలెండర్లోని చిత్ర రచన సంబంధమైన, ప్రతివారినీ ఆకట్టుకునే, కొన్ని వ్యాఖ్యలు: “గోసంరక్షణా ప్రాధాన్యతను శ్రీవెంకటేశ్వరుడు నిరూపించడం; తండ్రి మాటను అనుసరించి కళ్యాణరాముడొనర్చిన గోదానము; గోవులను రక్షించి ‘గోవిందు’ డగుట; పంచగవ్య ప్రాశన ఫలితము; దిలీపుడు, సుదక్షినుల గోపూజ, గోవులకు గ్రాసమివ్వడం సకలాభీష్ట సిద్ధి కారకము; గోమాత లక్ష్మితో భగవాన్ రమణుల అనుబంధం; గోవు మలమూత్రములు లక్ష్మీ స్థానములు; గోసేవ ఇహపరదాయకము; మహాస్వామి-గోసంరక్షణ; అనుకూల దాంపత్యము కొరకు వివాహమందలి ముఖ్యఘట్టములలో నూతన వధూవరులు కపిలగోవును స్మరించుట; గోప్రదక్షిణ సుఖ, వృద్ధి కారకము” మొదలైనవి వున్నాయి.

ముగించే ముందు, డాక్టర్ కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారి గురించి రెండు-మూడు మాటలు. వివిధ రంగాలలో ఆయన అనుభవం, కృషి గురించి, ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలకు ఆయన చేస్తున్న తోడ్పాటు, అందిస్తున్న సహాయం గురించి తెలియనివారు చాలా తక్కువమంది వుంటారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, సామాన్యులకు అందుబాటులో ఉండే తక్కువ ఖర్చుతో కూడిన వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసే లక్ష్యంతో, 1993లో శాంత బయోటెక్నిక్స్ లిమిటెడ్‌ని స్థాపించారు వరప్రసాద్ రెడ్డిగారు. శాంత బయోటెక్నిక్స్ మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన రీకాంబినెంట్ హెపటైటిస్ బి వ్యాక్సిన్‌ను తయారు చేసింది. సైన్స్, ఇంజినీరింగ్ రంగంలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 2005లో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది.  

తెలుగు కళలు, సాహిత్యం, హాస్యం, ఆధ్యాత్మికత, సంగీత స్ఫూర్తిని ప్రచారం చేయడం ప్రధాన లక్ష్యంగా వరప్రసాద్ రెడ్డిగారి ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘హాసం పబ్లికేషన్స్’ తత్సంబంధిత విషయాలపై అనేక పుస్తకాలు ప్రచురించింది. వాస్తవానికి, హాసం పబ్లికేషన్స్’ ప్రచురించిన రెండవ పుస్తకం నేను రాసిన ‘అనుపమ గీతాల తిలక్’ అని పదిమందికి చెప్పడానికి చాలా చాలా గర్వంగా వుంది. బహుశా పాతిక-ముప్పై సంవత్సరాల క్రితం, ఆ పుస్తకం ఆవిష్కరణ పూర్వరంగంలో ఒక సాయింత్రం, అప్పట్లో జూబిలీ హిల్స్ లో నివసిస్తున్న వరప్రసాద్ రెడ్డిగారిని, స్వర్గీయ కేబీ తిలక్ గారి ద్వారా మొదటి పర్యాయం కలవడం జరిగింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఆర్వోగా పనిచేస్తున్నప్పుడు రెండు-మూడు సార్లు కలిశాను.

మళ్లీ ఈ విధంగా మరో పర్యాయం వరప్రసాద్ రెడ్డిగారిని కలిసే అవకాశం కలిగింది. వరప్రసాద్ రెడ్డిగారూ, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. అలాగే నా మనసులో అనుకున్న ఆలోచనకనుగుణంగా, నా పుస్తకాలను బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారికి ఇవ్వగలిగే అవకాశం, అదనంగా ‘గోమాత వైభవం పైన వారి అనుగ్రహభాషణం వినే అదృష్టం కలిగించినందుకు కూడా.  

(ఫోటోలు గొల్లపూడి రవిగారి సౌజన్యంతో) 

1 comment:

  1. చాగంటి గారి ప్రవచనం లోని విశేష అంశాలు గురించి చాలా బాగా వివరించారు సార్. వందే గో మాతరం వందే భూ మాతరం. 🙏

    ReplyDelete