Tuesday, May 19, 2026

మరుమాముల వారి ఐదవ అవధాన శిక్షణ సప్తాహం >>>>> అవధాన విద్యా వికాస పరిషత్ పద్య శిక్షణ శిబిరం : వనం జ్వాలా నరసింహారావు

 మరుమాముల వారి ఐదవ అవధాన శిక్షణ సప్తాహం

ఆధ్వర్యం, దార్శనికం, నిర్వహణ దత్తాత్రేయ శర్మగారి

అవధాన విద్యా వికాస పరిషత్ పద్య శిక్షణ శిబిరం

వనం జ్వాలా నరసింహారావు (మే నెల 19, 2026)

         తెలుగు సాహిత్యపు ఆస్వాదనా సుగంధం, అవధాన విద్య వైభవం, గురుశిష్య పరంపరలోని పవిత్రత: ఈ మూడింటినీ ఒకే వేదికపై ప్రత్యక్షంగా ఆస్వాదించే అరుదైన సందర్భాలు జీవితంలో చాలావరకు రావు. అలాంటి అనుభూతినే ‘మరుమాముల దత్తాత్రేయ గారి ఐదవ అవధాన శిక్షణ సప్తాహం’ నాకు కలిగించింది. మరుమాముల సోదరులు దత్తాత్రేయ శర్మగారు, వెంకటరమణ (దర్శనమ్) శర్మగార్ల నిరంతర తపన, అవధాన విద్య పట్ల వారి అంకితభావం, నవతరానికి తెలుగు పద్యసంపదను అందించాలనే వారి సంకల్పం అంతర్లీనంగా ప్రస్ఫుటమయ్యే విధంగా తెలియచేయాలన్న భావనే ఈ వ్యాసం. నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఒక సాధారణ సాహిత్యాభిమాని మాత్రమే అయినప్పటికీ, అక్కడ కనిపించిన సాహిత్యానురాగం, యువతలోని ప్రతిభ, గురువుల ఆదరణ: ఇవన్నీ హృదయాన్ని తాకిన అనుభూతులుగా మిగిలిపోయాయి. ఆ అనుభవాన్నే పాఠకులతో పంచుకోవాలనే ఆత్మీయ భావంతో ఈ రచన సాగుతుంది.

ధార్మిక, ఆధ్యాత్మిక, తెలుగు భాషా సంబంధిత ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి, అదికూడా తెలుగు రాష్ట్రాలలో చేయడానికి, పరిపూర్ణ భగవదనుగ్రహం, పూర్వజన్మ సుకృతం, తల్లితండ్రుల అనిర్వచనీయ ఆశీర్వాద బలం, వీటన్నిటికీ తోడు క్రమశిక్షణతో కూడిన పట్టుదల, ధైర్యం అవశ్యం. ఇవన్నీ వున్న అతి కొద్దిమందిలో, అగ్రభాగాన, వర్తమాన సమాజంలో పదుగురికి తెలిసినవారు మరుమాముల బ్రదర్స్: మరుమాముల సోదరులైన దత్తాత్రేయ, వెంకటరమణ శర్మ ద్వయం. నా అదృష్టం కొద్దీ ఈ ఇరువురి పరిచయ భాగ్యం ఎప్పుడో కలగడం, నాకొక ఊహించని గుర్తింపుగా, వారిద్దరూ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు నేనేమీ సహాయం చేయలేకపోయినా, ఒక ప్రత్యేక అతిథిగా నన్ను పిలవడం, బహుశా నా పూర్వపుణ్యం కావచ్చునేమో! ఆ ఇరువురు సోదరులకు (పెద్దవాడిగా) ఆశీ:పూర్వక నమస్కారాలు.

         కొద్ది రోజుల క్రితం దత్తాత్రేయ శర్మగారు ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి గతంలో నిర్వహించినట్లుగానే మరోమారు (ఐదవ) అవధాన శిక్షాణ సప్తాహం నిర్వహిస్తున్నామని, నేను ఏదో ఒకరోజున తప్పక రావాలని పిలిచినప్పుడు ‘అవధాన విద్యా వికాస పరిషత్ వారి ఆధ్వర్యంలో జరిగే మరో విశిష్ట కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కలుగుతున్నందుకు సంతోషం వేసింది. అందులో భాగంగానే నిన్నటి నుండి (మే నెల 18, 2026) ఏడురోజులపాటు, మేనెల 24 వరకు జరుగుతున్న పద్య శిక్షణ శిబిరానికి వెళ్లి సుమారు రెండుగంటల పాటు ఒక అత్యద్భుతమైన అవధాన ప్రక్రియలో భాగమైన ‘దత్తపది, వర్ణన, ధారణ’ కార్యక్రమంలో పాల్గొన్నాను. అవకాశం కలిగినప్పుడు కాసేపు ప్రసంగించడం, అవధానం మీద నా భావాలను క్లుప్తంగా వెల్లడి చేయడం  కూడా నా అదృష్టమే.

         ఇక ఈ నాటి ‘దత్తపది, వర్ణన, ధారణ’ నిర్వహించిన యువ అవధాని ‘నల్లాన్ చక్రవర్తుల సాహిత్’ గురించి ఆసక్తికరమైన విషయాలను కొన్నైనా చెప్పాలి. హైదరాబాద్ నగరానికి చెందిన సాహిత్, ప్రస్తుతం ఖరగపుర్‌ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సాహిత్ తల్లిదండ్రులు: రంగాచార్యులు, అనురాధ. చిన్నప్పటి నుంచి చదువులో, అభ్యాసంలో చురుగ్గా ఉండే సాహిత్ ఆరేళ్ల వయస్సులోనే పాట రాసే స్థాయికి చేరుకున్నారు. ఆ వయస్సులోనే పాట రాశాడు. ఆడుకునే వయసులోనే సాహితీ ప్రయాణాన్ని మెుదలు పెట్టాడు. పదేళ్లకే శతకం రాశాడు.

పదహారేళ్లకే నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అవధానం చేసే స్థాయికి ఎదిగాడు. 20 ఏళ్లలోపే 19 అష్టావధానాలు చేసాడు. కష్టపడి తన ప్రతిభతో ఐఐటీలో చేరి అటు సాంకేతిక విద్యలోనూ అత్యద్భుతంగా రాటు తేలుతూ,  ఇటు అవధానవిద్య, ఆర్షధర్మ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ అవధానిగా, ధార్మికవేత్తగా,  సాహితీవేత్తగా విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. సాహిత్ విజయగాథ ఎందరికో స్ఫూర్తిదాయకం. మరెందరికో ఆదర్శం. ఐఐటీ విద్యార్ధి అత్యుత్తమ అవధాని ఎలా అయ్యారో అని శోధిస్తే, ప్రాధమికంగా, దేవుడు ప్రసాదించిన ప్రత్యేక జ్ఞానంతో సాహిత్యం, అవధానంలో అంచలంచెలుగా ఎదిగాడు.

అన్నిటికన్నా మించి, మూడేళ్ల క్రితం.. మరుమాముల దత్తాత్రేయ శర్మ స్థాపించిన అవధాన విద్యా వికాస పరిషత్ వేదికగా ప్రథమ అష్టావధానం చేశాడు. ఇప్పటి వరకు పలు వేదికలుగా 19 అవధానాలు పూర్తి చేశాడు. ఆన్‌లైన్‌లోనూ అవధానాలు చేశాడు. ఈనాటి సాహిత్ అవధాన ధారణా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి అడుగడుగునా బాల అవధానికి ఇచ్చిన ప్రోత్సాహం మన తెలుగు అవధాన ప్రక్రియకే తలమానికం.

ఈ నాటి నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అవధానంలోని విశేష ప్రక్రియలలోని కొన్నిటిని కార్యక్రమానికి హాజరుకానివారికోసం ఇక్కడ పొందు పరచడం ఔచిత్యమైన ఆలోచనగా భావించాలి. ఉదాహరణలుగా కొన్ని:

సమస్యలు:

భావనజేయ సృష్టికి శుభమ్ములు గూర్చెడివేళ నాపయినన్

జీవుల కర్మదీక్ష తుది చేసెడి వేళ భావజాంబవై

గ్రావజమై రహించెడి పరాత్పరి నీవను నిశ్చయమ్ముతో

శ్రీవని గౌరివనుచు చేసెద ప్రస్తుతి భారతీసతీ!!

****

శూరులు పాండవువ్ విధిని జొచ్చి వసింపగ మత్స్య భూమిలో

దూరగ  కృష్ణ కీచకుడు తోటి విచేష్టల నన్నదమ్ములున్

జేరి యసహ్యతన్ గలిగి జీవన పౌరుప మాయుధమ్ములున్

గారెకు  చిల్లు పెట్టవలె గాండివమిమ్మనె  భీమసేనుడే!

****

శీర్ణ శరీరుడౌచు కడు చింత వెసన్ విరహాగ్ని దగ్ధుడై

కర్ణములందునన్  దయిత కంఠమె  కన్నులయందు మేల్

వర్ణమె గల్గు వానికి హలాహల సోదరుడుండు నట్టి యా

పూర్ణిమనాడు  చీకటులు గ్రమ్ముట  వింతకాదుగా!

****

దౌహిత్రునకున్ దెలుపుచు

తాహితమున్  తాతపలికె ధార్మిక

సాహిత్య హారి గాంచు, కు

సాహిత్యము చదువువాడు చవటగ మారున్!

****

దత్తపదులు:

అంశం (1) --శివకేశవ అభేదం .... నంది--గరుడ -ఎలుక- చిలుక

ఆ నందిం చి పరస్పరమ్ము సతమున్ ధ్యానించి చిత్తమ్ములన్

నానారీతులలోన ప్రేమ చిలుకన్ తత్త్వంబులందేకమౌ తన్

స్థానంబందుచునుండు కంజెలుకన్  కట్టంగ నెవ్వారికౌ

ప్రాణంబట్లుగ నెంచుచున్ గరుడ వాన్ స్వామిన్ హరున్ గొల్చుడీ!!

****

అంశం (2)... ప్రస్తుతి.... మల్లి -నాథ -సూరి-వర

కాళిదాసుకైన మెలైన మల్లి య

యందురసమ నాధ యగుచునుండ

మహిమతెలుప వ్యాఖ్య మన సూరి  వ్రాసెను

మల్లినాధు డదియ మనకు వరము!!

****

అంశం (3) .... భారతి నగవు వర్ణన .... నగ-నగ-నగ-నగ

నగ ధరు కోడలి నగవులు

నిగమార్ధములన్  వచించు నిగనిగల నగన్

సగమున గనబడు శశివలె

నగజాతమ్ములను కోరు హాయిని గొల్తున్!!

****

అంశం (4) – శ్రీరామపట్టాభిషేకం .... ముద్ర-ముద్ర-ముద్ర-ముద్ర

పొందుగ నిల్వ చెంతను స ముద్ర ధరా తనూజయై

పొందగ లోకులన్ నయన ముద్ర మణీయసుధాశ్రుధారలన్

పొందగ డెందముల్ విమల ముద్ర స సారము రామచంద్రుడే

నందెను పట్టమున్ నేడయోధ్యను భాస్కర రాజముద్రతో

****

వర్ణన: సాహిత్యం బది పూర్వజన్మముల సంస్కారంబుతో నబ్బు భా

షాహీనత్వము  సద్గురోత్తముల విద్యాబోధనన్ గల్గు, నే

నీహర్మ్యాన నిమిత్త మాత్రుఁడను వాగీశానుసంకల్పమే

యూహింపన్ గలవాడనే కలుగు నుద్యోగంబు నీ దీక్షలో.

****

ఈ సందర్భంగా ‘భాగ్యనగరం భాగ్యమైన అవధాన విద్యా వికాస పరిషత్’ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి పరిషత్ అధ్యక్షుడు మరుమాముల మాటల్లో చెప్పుకోవడమే బహుశా సమంజసమేమో. ‘దైవదత్తమైన ప్రతిభకు వ్యుత్పన్నత తోడైతే, లభించిన పాండిత్యాన్ని నిరంతర అభ్యాసంతో మెరుగు పరుచుకుంటే, శిలలాంటి వాడైనా శిల్పంగా మారుతాడు అన్న ధ్యేయంతో ఆవిర్భవించినదే అవధాన విద్యా వికాస పరిషత్’ అని దత్తాత్రేయ శర్మగారు అంటారు. ప్రపంచ భాషలలో మరేదానికీ లేనివిధంగా, కేవలం తెలుగుభాషకు (సంస్కృతం కూడా) మాత్రమే పరిమితమైన ఈ అమోఘమైన విద్యను భావితరాలవారికి అందించాలనే సదుద్దేశంతో జూన్ నెల 6, 2021 (ఐదేళ్ల క్రితం) రూపుదిద్దుకున్నదీ ‘అవధాన విద్యా వికాస పరిషత్.’

గరికిపాటి నరసింహారావు గారి చేతులమీదగా జరిగిన ఆరంభ కార్యక్రమానికి బహుశా నేను కూడా హాజరయ్యానని అనుకుంటాను. అంచెలంచలుగా పురోగామిగా ప్రస్తానం చేస్తున్న పరిషత్, ప్రతి ఏటా మే లేదా జూన్ నెలలలో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో వారంరోజులపాటు నిరాటంకంగా నిర్వహిస్తున్న శిక్షణ నవతరం అవధానులకు ఆలంబనగా నిలుస్తున్నది. ఈ ఐదేళ్లలో, బహుశా ఎవరూ ఊహించని రీతిలో, అవధాన శిక్షణ, పద్యరచానాభ్యాస శిక్షణ పొందిన అనేకమందిలో అద్భుతమైన ప్రావీణ్యంతో పదిమంది అవధానులు కావడం మామూలు విషయం కాదు. అవధాన శిక్షణా శిబిరాలలో పాల్గొంటున్న ఛాత్రావధానులకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ఆమోదించిన ధృవీకరణ పత్రాలను ఇవ్వడం ఒక విశేషం.

గతంలో జరిగిన శిక్షణా శిబిరాలు: జూన్ 6, 2022 నుండి జూన్ 12, 2022 (మొదటిది), మే 8, 2023 నుండి మే 14, 2022 (రెండవది), మే 20, 2024 నుండి మే 26, 2024 (మూడవది), మే 9, 2025 నుండి మే 15, 2025 (నాలగవది) వరకు. ఉద్దండ అవధాన పండితులైన గరికిపాటి, కడిమెళ్ళ, మేడసాని మోహన్, మాడుగుల, వద్దిపర్తి గార్లతో పాటు జీఎం రామశర్మ, శ్యామలానంద ప్రసాద్, అయాచితం లాంటి ఎందరో కవిపండితులు పాల్గొని ఆచార్య్లుగా పాఠాలు చెప్పారు. భరత్ శర్మ, శ్రీహర్ష, సందీప్ శర్మ, పార్వతీశ్వర శర్మ, బాలసుబ్రహ్మణ్యం, చంద్రశేఖర రావు, సాయికుమార్, నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అవధాన ప్రదర్శనలను అత్యద్భుతంగా ఇచ్చారు.  

గతంలో అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వహించిన నాలుగు శిబిరాలలో అవధానులుగా: బోరెల్లి హర్ష, యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, సుసర్ల సుధన్వ, కౌతా రామకృష్ణ, వింజమూరి సంకీర్త్య శర్మ, గట్టెడి విశ్వంత్, విష్ణుభొట్ల కార్తీక్, నేతి శ్రీకర్, ఉప్పల ధడియం అనన్య, కొనిమ్తి రమేష్, గోవింద్ గోవర్ధన్, తదితరులున్నారు.

శిక్షణా శిబిరంలో బోధించే అంశాలను వివరించారు దత్తాత్రేయ శర్మగారు. అవి: దార-ధారణ, సమస్యాపూరణం, దత్తపది, వారగణనము, క్లిష్టప్రాసలు, పద్యరచన, సంస్కృత భారతి, భాషా వ్యాకరణ అంశాలు, అష్టావధాన సంవిధానం, నిషిద్ధాక్షరి, అవధానం-సాంకేతిక పరిజ్ఞానం, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, వర్ణనలు, కవిసమయములు, విశేష యతులు, ప్రాస భేదాలు, విశేష వృత్తాలు, జంట వృత్తాలు, అప్రస్తుత ప్రసంగం, నిఘంటు పరిజ్ఞానం, పురాణ పద్యపఠనం, పద్యరచన, ఎత్తుగడ, ముగింపు మెళకువలు, బంధ యమక చిత్రకవిత్వం, అవధానం-వ్యక్తిత్వ వికాసం, అవధానం-ఐతిహాసిక దృక్ఫదం, తదితర అంశాలు.

ఈ మంగళవారం ఉదయం ఒక సాహిత్య సదస్సులో పాల్గొనే అవకాశం కలిగినందుకు కలిగించినందుకు మరుమాముల దత్తాత్రేయ శర్మగారికి, వారి సోదరుడు మరుమాముల వెంకట రమణ (దర్శనమ్) శర్మగారికి ధన్యవాదాలు. అవధానం అనేది కేవలం జ్ఞాపకశక్తి ప్రదర్శన కాదు; అది భాషా వైభవం, ధారణా శక్తి, సంస్కార సంపద, గురుకృప, నిరంతర సాధనల సమ్మిళిత రూపం. అలాంటి మహోన్నత విద్యను సమకాలీన తరానికి చేరువ చేస్తూ, యువతలో సాహిత్యాసక్తిని రగిలిస్తూ ‘అవధాన విద్యా వికాస పరిషత్’ చేస్తున్న సేవ నిజంగా అభినందనీయం. ఈ ఐదవ అవధాన శిక్షణ సప్తాహం ద్వారా నాకు కలిగిన ఆనందం, ఆశ్చర్యం, గర్వం మాటల్లో పూర్తిగా వ్యక్తం కావు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించి, తెలుగు సాహిత్య గగనంలో కొత్త అవధాన తారలు వెలుగొందాలని మనసారా ఆకాంక్షిస్తూ, ఈ సాహిత్య యజ్ఞానికి హృదయపూర్వక నమస్సులతో నా మాటలను ముగిస్తున్నాను. 

No comments:

Post a Comment