సింగమై ఉరికిన .... చక్రధారి
(18 రోజుల కురుక్షేత్ర మహాభారత సంగ్రామం-3)
వనం జ్వాలా నరసింహారావు
భక్తిపత్రిక ఆగస్ట్ నెల, 2026 సంచిక
శ్రీకృష్ణరాయభారం విఫలం కావడంతో కురుక్షేత్ర
సంగ్రామానికి తెరలేచింది. మొదటిరోజు యుద్ధం గీతాప్రయుక్తంగా ముగిసింది. అయితే, మొదటి రోజు యుద్ధంలో కౌరవులది పైచేయి కావడంతో ధర్మరాజు మనస్సు దుఃఖభరితమై పోయింది. యుద్ధం విరమించాలన్న
భావనను వ్యక్తపరిచాడు. తమ్ములను, కొందరు స్నేహితులను
వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి పోయాడు. తమ్ములు భీష్ముడితో యుద్ధం చేయడానికి సమర్థులు కారేమోనన్న అభిప్రాయాన్ని వెల్లడించిన ధర్మరాజు. తన పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన రాజులను భీష్ముడికి ఎరగా సమర్పించలేనని, తాను తిరిగి అడవులకు పోయి
అక్కడే కూరలు,
ఆకులు తింటూ వుంటానని శ్రీకృష్ణుడితో అన్నాడు. తమ కర్తవ్యం
ఏమిటో
చెప్పమని కోరాడు ఆయన్ను.
శ్రీకృష్ణుడు అతడికి ధైర్యవచనాలు
చెప్పాడు. ఆవేదన చెందవద్దని, ఆయనకు ఎదురెవ్వరూ లేరన్నాడు.
నీ తమ్ముళ్లు నలుగురూ లోకాలను జయించగల సమర్థులని చెప్పాడు. భీష్ముడిని
శిఖండి జయిస్తాడని,
శత్రుపక్షం వారందరినీ వరుసగా ఎదో ఒక తీరున తాను సంహరింప చేస్తానని
కూడా మాట ఇచ్చాడు శ్రీకృష్ణుడు. పాండవుల పక్షాన పోరాడే
వారంతా తమ ప్రాణాలను అర్పించడానికి, విజయం చేకూర్చడానికి
సిద్ధంగా వున్నారని అన్నాడు. ఆ మాటలకు తృప్తి చెందిన ధర్మరాజు, యుద్దోత్సాహంగా వున్న ధృష్టద్యుమ్నుడితో, మర్నాటి యుద్ధంలో
అద్భుతమైన
‘క్రౌంచవ్యూహాన్ని’ నిర్మించి ఆయన
తెలివితేటలను చూపించమని అడిగాడు. ధర్మరాజు చెప్పినట్లే
చేస్తానన్నాడాయన.
రెండోరోజు యుద్ధం ప్రారంభమైంది. ధృష్టద్యుమ్నుడు
క్రౌంచవ్యూహం పన్నాడు. అందులో అర్జునుడు ముక్కుగా, కుంతి భోజుడు,
శైల్యుడు కన్నులుగా, ద్రుపదుడు తురాయిగా,
దశార్ణరాజు, శూరసేన రాజు, కిరాతరాజు కుత్తుకగా,
భీముడు, ధృష్టద్యుమ్నుడు కుడి-ఎడమ
రెక్కలుగా అయ్యారు. అభిమన్యుడు, సాత్యకి, ద్రౌపది కొడుకులు,
పౌండ్ర, చోళ పాండ్యులు భీముడి
దగ్గరికి చేరారు. నకుల సహదేవులు, ఘటోత్కచుడు,
శంబర వత్స రాజులు, ధృష్టద్యుమ్నుడి దగ్గర చేరారు. కేకయరాజు, కాశిరాజులతో కలిసి
విరాటుడు మొల
స్థానంలో నిలిచాడు. హూణపతి మొదలైనవారు ధర్మరాజు చుట్టూ చేరి
ఆయన వెనక వున్నారు. ఇలా వున్నదా వ్యూహం.
ఇక కౌరవ సేనలు మూడు వ్యూహాలుగా
ఏర్పడింది. మధ్యలో భీష్ముడు నిలబడ్డాడు. కురుపాండవ
సేనలు రెండూ యుద్ధానికి సన్నద్ధులై ఒకరినొకరు ఎదుర్కొన్నారు. భీష్ముడు పాండవుల వ్యూహాన్ని చిన్నాభిన్నంచేశాడు. భీష్ముడి విజృంభణ చూసిన అర్జునుడి కోరిక మేరకు, శ్రీకృష్ణుడు
భీష్ముడి దిక్కుగా రథాన్ని తీసుకెళ్లాడు. అర్జునుడు
భీష్ముడితోను,
సహాయంగా వచ్చిన కౌరవ వీరులతోను పోరాడుతుంటే, అర్జునుడికి
సహాయంగా సాత్యకి మొదలైన వారొచ్చారు. అర్జునుడి ధాటికి కౌరవ
వీరులు
చెల్లాచెదరైపోయారు. అది చూసి దుర్యోధనుడు భీష్ముడిని
అధిక్షేపించాడు. భీష్ముడు అతడి మాటలకు
నొచ్చుకున్నాడు.
ఆ తరువాత, భీష్మార్జునుల మధ్య జరిగిన తీవ్రమైన యుద్ధంలో, భీష్ముడు తన బాణాలతో శ్రీకృష్ణుడి వక్షఃస్థలంపై కొట్టాడు. అర్జునుడు భీష్ముడి సారథిని నొప్పించాడు. ఇరువురూ సమ ఉజ్జీగా పోరాడారు. మరోవైపున ధృష్టద్యుమ్నుడికి, ద్రోణాచార్యుడికి భీకరమైన యుద్ధం జరిగింది. ఎవరూ తగ్గలేదు. ద్రోణాచార్యుడి
ధాటికి
ధృష్టద్యుమ్నుడు ఆగలేకపోయాడు. అప్పుడు భీముడు
ధృష్టద్యుమ్నుడిని ఆదుకున్నాడు. కళింగరాజు, ఇతర కౌరవ వీరులు భీముడిని ఎదుర్కున్నారుప్పుడు. భీముడు భయంకరమైన శౌర్యాన్ని ప్రదర్శించి, కళింగదేశ రాజు
శ్రుతాయువు కొడుకైన శక్రదేవుడిని, తమ్ముడు భానుమంతుడిని సంహరించాడు. శ్రుతాయువు కూడా
మూర్ఛపోయాడు. అప్పుడు భీష్ముడు రంగంలో దిగి భీముడిని కలత
పెట్టాడు.
కంపించిన రణరంగం
ధృష్టద్యుమ్నుడికి, అశ్వత్థామకు
మధ్య యుద్ధం జరిగింది. లక్ష్మణ
కుమారుడికి,
అభిమన్యుడుకి మధ్య జరిగిన యుద్ధంలో తన కొడుకు నొచ్చిన సంగతి తెలిసికొని దుర్యోధనుడు అభిమన్యుడు మీదికి యుద్ధానికి పోయాడు. ఆయన వెంటే భీష్మద్రోణాది వీరులు కూడా అభిమన్యుడి మీదికి వెళ్లారు. తన కొడుకుని అనేకమంది వీరులు చుట్టుముట్టడం చూసిన అర్జునుడు
అటువచ్చి
భీభత్సాన్ని సృష్టించాడు. అతడి ధాటికి రణరంగం కంపించింది.
కౌరవసేనలు భయంతో వెనుకంజ వేశాయి. వారలా పారిపోవడం చూసిన
శ్రీకృష్ణుడు,
అర్జునుడు విజయగర్వంతో తమ శంఖాలను పూరించారు.
భీష్ముడు కౌరవసేన దుస్థితిని గమనించి
ద్రోణుడితో,
శ్రీకృష్ణుడు తన రథానికి సారథిగా వుండగా అర్జునుడు
కౌరవసేనలను సంహరించాడని,
రథం నడపడంలో శ్రీకృష్ణుడిని మించిన నేర్పుగల సారథి లేడని, అంత గొప్ప సారథి లభించడం వల్ల రథికుడిగా అర్జునుడు
రాణించి కౌరవ సేనలను చీల్చి చెండాడగలిగాడని, ఘోరమైన యుద్ధ భూమిని క్రీడారంగంగా చేసికొని వీరవినోద విహారం చేశాడని అన్నాడు.
ఆర్జునుడిని
చూస్తుంటే అతడు మూడవ కన్ను విప్పిన పరమ శివుడిలాగా
కనిపిస్తున్నాడని,
కౌరవ సేనలు అధీనం తప్పాయని, పారిపోయే సేనలను మళ్లించమని ద్రోణుడికి చెప్పాడు
భీష్ముడు. సూర్యాస్తమయం అవుతున్నందున భీష్మద్రోణులు యుద్ధాన్ని
ఆపాలని నిర్ణయించారు. భీష్ముడు అందరినీ యుద్ధభూమినుండి నిష్క్రమించమని ఆజ్ఞాపించి కౌరవ సేనలను మరలించాడు.
గరుడవ్యూహం – అర్థచంద్రాకార వ్యూహం
పాండవులు కూడా తమ
శిబిరాలకు పోయారు. కురుక్షేత్ర సంగ్రామంలో రెండవరోజు
యుద్ధంలో అర్జునుడి విజృంభణతో పాండవులది పూర్తిగా
పైచేయి అయింది. మర్నాడు భీష్ముడు సేనను ‘గరుడ
వ్యూహం’ గా తీర్చిదిద్దాడు. ఆ
వ్యూహం ముక్కుగా,
అందం, బలం చేకూరే విధంగా
స్వయంగా భీష్ముడే నిలబడ్డాడు. ద్రోణుడు, కృతవర్మ కన్నులుగా, కృపుడు,
అశ్వత్థామ శిరస్సుగా, త్రిగర్తులు, భూరిశ్రవుడు,
శల్యుడు, భగదత్తుడు, సౌవీరరాజు,
సింధుభూపతి, జయద్రథుడు కంఠంగా, దుర్యోధనాదులు
వీపుగా, విందుడు, అనువిందుడు,
కాంభోజరాజు, శూరసేనరాజు తోకగా, మగధరాజు,
కళింగరాజు మొదలైనవారు కుడి రెక్కగా, కర్ణాటక,
కోసల సేనలు తదితరులుఎడమ రెక్కగా
అయ్యారు.
మిగిలినవారు అటు-ఇటు సర్దుకున్నారు.
దుర్యోధనుడి వ్యూహాన్ని ఛేదించడం లక్ష్యంగా, ‘అర్థచంద్రాకారం’లో
పాండవుల వ్యూహాన్ని అమర్చమని అర్జునుడు సూచించడంతో, ధృష్టద్యుమ్నుడు అలాగే తీర్చిదిద్దాడు. ఆ అర్థచంద్రాకార వ్యూహంలో భీముడు, పాండ్య మగధ సేనలతో కూడి, కుడి కొసన నిలిచాడు. పక్కనే విరాటుడు,
ద్రుపదుడు నిలిచారు. నీలుడితో పాటు ధృష్టకేతుడు, కాశీదేశ కరూశదేశ సేనలతో
నిలిచాడు. శిఖండితో పాటు ధృష్టద్యుమ్నుడిని ముందుంచుకుని
యుధిష్టరుడు వ్యూహానికి మధ్యగా నిలిచాడు. అటు పక్కగా సాత్యకి,
నకుల సహదేవులు, ద్రౌపది కొడుకులు, అభిమన్యుడు,
ఘటోత్కచుడు, కేకయరాజులు వ్యూహంలో
భాగంగా నిలిచారు. శ్రీకృష్ణుడు సారథిగా అర్జునుడు ఎడమ కొసన నిలిచాడు. మిగిలిన రాజులు వారి-వారి స్థానాలలో నిలిచారు.
కలిసికట్టుగా పోరాటం
అర్జునుడు విజృంభించి కౌరవ సేనలోని
కాల్బలాన్ని చీకాకు పరిచాడు. మొత్తం కౌరవ సేనను విధ్వంసం
చేయడంతో కౌరవులు అంతా ఏకమై అతడిని ఎదుర్కొన్నారు. అప్పుడు పాండవులు అందరూ ఏకమై పోయారు. భీష్ముడి నాయకత్వంలో కౌరవ సేన, భీముడి నాయకత్వంలో పాండవ సేన వెనుకంజ వేయకుండా పోరాడారు. భీష్మద్రోణాది
కురువీరులు,
భీముడు, ఘటోత్కచుడు, సాత్యకి,
అభిమన్యుడు మొదలైన పాండవ వీరులు యుద్ధంలో పాల్గొన్నారు. దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేసి మూర్ఛపోయాడు.
అది చూసిన కౌరవసేన
పారిపోసాగింది. ద్రోణుడు, భీష్ముడు వారిని మరలించడానికి చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. పారిపోయే సేనను భీముడు వెంబడించాడు. మరోవైపు సాత్యకి, అభిమన్యుల
చేతిలో శకుని ఓడిపోయాడు. మరో దిక్కున అర్జునుడు కౌరవసేనను
వెన్నాడి తరిమికొట్టాడు. మూర్ఛనుండి తేరుకున్న దుర్యోధనుడు
యుద్ధ భూమికి వచ్చి భీష్మ ద్రోణులు వున్న చోటుకు వెళ్లి,
వారికి పాండవుల మీద పక్షపాతం వున్నదని ఆరోపించాడు. దేవేంద్రుడితో పాటు దేవతల సేన మొత్తం దండెత్తి వచ్చినా సరే, యుద్ధభూమిలో పాండవులు నిలబడితే వారిని జయించడం సాధ్యం కాదని భీష్ముడు స్పష్టంగా పేర్కొంటూ,
అతడలా మాట్లాడడం న్యాయం కాదన్నాడు. తన శక్తివంచన లేకుండా పాండవుల సేనలను సంహరిస్తానని చెప్పి, భీష్ముడు విజృంభించి, ఆర్జునుడిని
ఎదుర్కున్నాడు.
ఎక్కడ చూసినా పరాక్రమంతో విజృంభించిన
భీష్ముడే కనిపించాడు. ప్రళయకాల రుద్రుడిలాగా పరాక్రమ నృత్యం
చేశాడు. పాండవులు అప్పుడు ఏమీ చేయలేక పోయారు.
భయభ్రాంతులయ్యారు. భీష్మద్రోణులను ఎదుర్కొనమని ఆర్జునుడిని ప్రేరేపించాడు శ్రీకృష్ణుడు. అర్జునుడి రథాన్ని చూసిన భీష్ముడు తన బాణాలతో శ్రీకృష్ణుడి రథాశ్వాలను,
అర్జునుడిని నొప్పించాడు. శ్రీకృష్ణుడు స్వయంగా
దెబ్బతిన్నాడు.
అర్జునుడు కూడా దెబ్బ తిన్నట్లు అర్థం చేసుకున్నాడు.
పాండవులు పారిపోవడం చూశాడు. ఇక ఇప్పుడు తాను
ఉపేక్షిస్తే వీలులేదనుకున్నాడు శ్రీకృష్ణుడు. భీష్ముడిని చంపి ధర్మరాజుకు జయం చేకూర్చాలనుకున్నాడు.
చక్రధారియైన శ్రీకృష్ణుడు
పారిపోతున్న పాండవ సేనలను వెనుకంజ
వేయవద్దని సాత్యకి
విజ్ఞప్తి చేశాడు. తానున్నాను భయపడవద్దని అంటూ అర్జునుడి
రథానికి ముందు వచ్చి నిలబడి పాండవులను వెనక్కు రమ్మని
అంటున్న సాత్యకితో శ్రీకృష్ణుడు, దుర్యోధనుడి గెలుపు తాను
సహించలేనని,
భీష్ముడిని సంహరిస్తానని, ద్రోణుడి పని పట్తానని,
కౌరవ యోధుల అవయవాలు చీల్చి చెండాడ గలనని,
కౌరవ సేనలను నాశనం చేయగలనని, భూభారాన్ని కుంతీ పుత్రులైన పాండవులకు కట్టబెట్టగలనని, తన భుజ పరాక్రమాన్ని చూపించి, చక్రాయుధాన్ని ప్రయోగించి, విక్రమ వీరవిహారం చేస్తానని అన్నాడు. అలా అంటూనే, శ్రీకృష్ణుడు తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని సంస్మరించాడు. వెంటనే చక్రం ఆయన దగ్గరికి వచ్చింది.
శ్రీకృష్ణుడు ఆ చక్రాయుధాన్ని తన
కుడిచేతికి
అమర్చుకున్నాడు. గుర్రాల కళ్ళాలు జాగ్రత్తగా విడిచి కిందికి
దూకాడు. భూమి
దద్దరిల్లగా విజృంభించాడు. శ్రీకృష్ణుడు గర్వించి వున్న
భీష్ముడి మీదికి ఉరికాడు. దుర్యోధనుడి యోధ ముఖ్యులు
నివ్వెరపోయారు. శ్రీకృష్ణుడిని అలా చూసిన భీష్ముడు ఆయన ఆవిధంగా తనను ధన్యుడిని చేస్తున్నాడని, శీఘ్రంగా రమ్మని, ఆయనకు తోచిన విధంగా చేయమని నమస్కరిస్తూ ప్రార్థించాడు. భీష్ముడు ఇలా అంటుండగానే అర్జునుడు రథం మీది నుండి దూకి, పరుగెత్తిపోయి, శ్రీకృష్ణుడిని వెనుకవైపు నుండి గట్టిగా పట్టుకున్నాడు. కాని, శ్రీకృష్ణుడు ఆర్జునుడిని పెనుగాలిలా ఈడ్చుకుని పోయాడు.
అప్పుడు అర్జునుడు మొండికేసి కూర్చుని, శ్రీకృష్ణుడితో,
‘ఓ శ్రీకృష్ణా! నీకోపం ఉపశమింప చేసుకోవయ్యా! నీవే కదా పాండవులకు సంరక్షకుడవు! నువ్వే ప్రతిజ్ఞ
తప్పితే,
ఇక ప్రతిజ్ఞను పాలించే ధర్మరాజు మాట ఏమిటి? ధర్మరాజు
పరాక్రమం ఏమికావాలి? ఈ చర్య నీకు తగినదా? ఈ విధంగా ఆయుధం పట్టుకుని ప్రతిజ్ఞమీరి యుద్ధం చేయడం నీకు తగునయ్యా? శాంతించు. నీ సహాయంతో కౌరవ సేనను రూపుమాపడం నాకు సులువు’ అని అన్నాడు. ఆ మాటలకు కోపం పోగొట్టుకున్న శ్రీకృష్ణుడు వెనక్కు మరలి, రథం ఎక్కి,
సారథి పీఠం మీద కూర్చున్నాడు. కృష్ణార్జునులు ఇద్దరూ శంఖాలు పూరించారు.
ఆ తరువాత అర్జునుడు విజృంభించాడు.
కౌరవ సేనను నాశనం చేశాడు. కౌరవ పక్షం నుండి ఎంతమంది
వీరులు ఎదుర్కొన్నా అర్జునుడిదే పైచేయి అయింది. అతడు ప్రయోగించిన ఐంద్రాస్త్రం కౌరవ సేనను చిత్తు చేసింది. అర్జునుడు విజయ గర్వంతో దేవదత్తాన్ని,
శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించారు. ఇద్దరూ సింహనాదాలు
చేశారు.
అప్పుడే సూర్యాస్తమయం అయింది. ఆ మలిసంధ్యలో భీష్ముడు, ద్రోణుడు,
బాహ్లికుడు తమ సేనలను ఉపసంహరించి, కాగడాల వెలుగులో తమ విడిదులకు వెళ్లారు. పాండవులు ఉత్సాహంగా ఉప్పొంగిపోయి,
తమతమ నివాస స్థలాలకు పోయారు.
నాలుగోరోజు విశేషాలు
కురుక్షేత్ర సంగ్రామంలో నాలుగవ రోజున
తెల్లవారగానే కౌరవ
సేనాధిపతైన భీష్ముడు ముందు నడిచి వెళ్లాడు రణరంగానికి. అతడి
వెనుకనే దుర్యోధనుడు,
ద్రోణుడు, బాహ్లికుడు, కౌరవ
సేనలు కదిలి వెళ్లాయి. అలా వస్తున్న కౌరవ సేనను పరికించి
చూశారు కృష్ణార్జునులు. కౌరవ, పాండవ సేనలు ఒకరినొకరు ఎదుర్కుని యుద్ధం చేయసాగారు. రెండు పక్షాలూ నొచ్చాయి. భీష్ముడు అర్జునుడి మీద అధికంగా విజృంభించాడు. దుర్యోధనుడు,
ద్రోణుడు, వివింశతి, కృపుడు,
సోమదత్తుడు, శల్యుడు, భీష్ముడితో కలిసి యుద్ధానికి దిగగా, అభిమన్యుడు ఆ ఏడుగురినీ
అగ్నిహోత్రుడిలాగా ఒక్కడే ధైర్యంగా ఎదుర్కున్నాడు.
భీష్మార్జునుల యుద్ధాన్ని పలువురు ఆసక్తిగా వీక్షించారు. అదే సమయంలో అశ్వత్థామ,
భూరిశ్రవుడు, శల్యపుత్రుడు, చిత్రసేనుడు అంతా కలిసి అభిమన్యుడిని చుట్టుముట్టారు. అయినా అభిమన్యుడు ఏ
మాత్రం
వెనక్కు తగ్గలేదు.
అభిమన్యుడి వీరత్వాన్ని చూసి, అర్జునుడు కూడా విజృంభించాడు. అప్పుడు త్రిగర్తులు, కృతవర్మ,
కేకయులు, ఆర్జునుడిని, అభిమన్యుడిని చుట్టుముట్టారు. ఇదిచూసి ధృష్టద్యుమ్నుడు
అర్జునుడికి సహాయంగా వచ్చాడు. కౌరవ వీరులను గట్టిగా ఎదుర్కొన్నాడు. తనతో విజృంభించి యుద్ధానికి దిగిన శల్యతనయుడిని సంహరించాడు ధృష్టద్యుమ్నుడు. కొడుకు మరణం చూసిన శల్యుడు ధృష్టద్యుమ్నుడి మీద విజృంభించాడు. యుద్ధంలో
అలసిపోయిన
ధృష్టద్యుమ్నుడికి సహాయంగా వచ్చిన అభిమన్యుడు శల్యుడిని
ఎదిరించాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో నకుల సహదేవులు
వైరిపక్షంలో వున్న తమ మేనమామ శల్యుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది.
నకులసహదేవులకు సహాయంగా ద్రుపదుడు, విరాటుడు వచ్చి కౌరవ సేనను తరిమికొట్టారు. ఇంతలో మధ్యాహ్నం అయింది. ఇది
గమనించిన భీష్ముడు మరోపక్కన భీముడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు భీముడికి సహాయంగా సాత్యకి వచ్చాడు. సాత్యకి రావడం చూసిన రాక్షస వీరుడు అలంబసుడు అతడిని ఎదిరించాడు. కాని సాత్యకి బాణాలకు అలంబసుడు వెనక్కు మళ్లాడు.
విజయ
గర్వంతో సింహనాదం చేసిన సాత్యకితో సోమదత్తుడి కొడుకు
భూరిశ్రవుడు యుద్ధానికి దిగాడు. వీరిరువురికి ఇరు పక్షాల
సేనలు అండగా వచ్చాయి. అప్పుడు భీముడు భయంకర స్వరూపం ధరించి దుర్యోధనుడి తమ్ములను వెనక్కు పారదోలాడు.
దుర్యోధనుడు ధైర్యంగా నిలబడి భీముడిని
ఎదిరించి,
యుద్ధం చేసి, భీముడి విల్లు ఖండించి,
ఒక బాణంతో భీముడి వక్షస్థలాన్ని కొట్టగా అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అభిమన్యుడు, ధృష్టద్యుమ్నుడు,
ద్రోపదీ పుత్రులు, భీముడు మార్ఛపోవడం చూసి దుర్యోధనుడిని చుట్టుముట్టారు. అనేక బాణాలను అతడిమీద ప్రయోగించారు. భీముడు మూర్ఛనుండి తేరుకుని విజృంభించాడు. ఆ సమయంలో భగదత్తుడు
భీముడి మీదికి యుద్ధానికి దిగాడు. దుర్యోధనుడు కూడా తన
రథంమీద వచ్చి భీముడి పైన బాణం వేయగా దానికి ధాటికి అతడు తట్టుకోలేక పోయాడు.
మరోవైపు నుండి భీమసేనుడు
విజృంభించాడు. అతడి విజృంభణ చూసి దుర్యోధనాదులు కలత
చెందారు. అతడిమీడికి ఎవరొచ్చినా భీముడు యుద్ధరంగంలో గదను పట్టుకుని విహరించసాగాడు. అతడికి అభిమన్యుడు, ద్రుపదుడి కొడుకులు సహకరించారు. దుర్యోధనుడి ప్రోద్బలం
వల్ల విజృంభించిన కౌరవ సేనలను అరికట్టాడు భీముడు. కౌరవ సేనమీద భీముడితో సహా అభిమన్యుడు, ధృష్టద్యుమ్నుడు బాణాలు కురిపించి చీకాకు పరిచారు. భీముడు కౌరవ సేనను నాశనం చేశాడు. దుర్యోధనుడి పది మంది తమ్ములను సంహరించాడు. (సశేషం)


No comments:
Post a Comment