తెలుగు భాషా సౌందర్యం, అష్ట దిగ్గజ కవుల మధ్య జరిగిన
చమత్కారమైన సవాళ్లు, వెటకారాలు
వనం జ్వాలా నరసింహారావు
తెలుగు భాషా సౌందర్యం కేవలం గొప్ప
వర్ణనల్లోనే కాదు, కవుల మధ్య జరిగిన చమత్కారమైన సవాళ్లు,
వెటకారాల్లో కూడా దాగి ఉంది! అలాగే, కవిత్వం
అంటే కేవలం ప్రశంసలు గుప్పించడం కాదు, తోటి కవి పొరపాట్లను
అంతే సునిశితంగా, హాస్యస్ఫోరకంగా ఎత్తిచూపడం కూడా ఒక కళే.
దీనికి అద్దం పడుతుంది అల్లసాని పెద్దన, తెనాలి రామలింగడి
మధ్య జరిగిన ఈ ఘట్టం. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, శ్రీకృష్ణదేవరాయల
భువనవిజయం కొలువును తలచుకుంటే అల్లసాని పెద్దన, తెనాలి
రామకృష్ణుల పేర్లు మొదట గుర్తొస్తాయి. వారిద్దరి మధ్య జరిగిన ఒక రసవత్తరమైన
సాహిత్య పోరు, రామకృష్ణుడి చమత్కారానికి అద్దం పట్టే ఒక
అద్భుతమైన చాటు పద్య విశేషం.
ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన
అంతటి మహాకవి ఛందస్సు కోసం ఒక చిన్న వ్యాకరణ దోషం చేస్తే, దానిని రాయల కొలువులో అందరిముందూ తెనాలి రామకృష్ణుడు తనదైన
శైలిలో ఎలా వెటకరిస్తూ తప్పుబట్టాడో, ఆనాటి సాహిత్య లోకపు
చమత్కారం ఎంత ఆసక్తికరమైనదో తెలుసుకుంటే కలిగేది మరింత ఆసక్తే కాని మరొకటి
కానేకాదు. ఇలా నేను ఈ విషయం మీద రాయడానికి అసలు నేపథ్యం, గరికిపాటి వారి
విశ్లేషణే. ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ డాక్టర్
గరికిపాటి నరసింహారావు గారు ఇటీవల (ఆలశ్యంగా నేను వీక్షించిన) ఒక ప్రసంగంలో ఈ
ఘట్టం వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని అద్భుతంగా వివరించారు.
డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారి
చమత్కారభరిత ప్రసంగాల ద్వారా ఈనాటికీ ఇటువంటి ఎన్నో రసవత్తరమైన సాహిత్య ఘట్టాలు
వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల వారు ఒక వీడియోలో వివరించినట్లుగా, శ్రీకృష్ణదేవరాయల
భువనవిజయం కొలువులో ఒకనాడు కేవలం 'లఘువులతోనే' (దీర్ఘాలు, సున్నాలు లేని అక్షరాలతో) పద్యం చెప్పాలనే
ఒక వినూత్నమైన, ఒక కఠినమైన సాహిత్య సవాలు, నేపథ్యం ఎదురైంది. ఆ సమయంలో ఆంధ్రకవితా
పితామహుడు అల్లసాని పెద్దన గారు ఆశువుగా పద్యం అల్లుకుంటూ వెళ్లారు. అయితే,
పద్యం ముగించే క్రమంలో ఛందస్సును, లఘువుల
నియమాన్ని కాపాడుకోవడం కోసం ఆయన ‘అమావాస్య రాత్రి’ అనే అర్థంలో సాగాల్సిన చోట,
వ్యాకరణ సూత్రాలను పక్కనబెట్టి బలవంతంగా ‘అమవస నిసి’ అనే పదాన్ని
ప్రయోగించాల్సి వచ్చింది.
పెద్దన గారి కవిత్వం, రామకృష్ణుడి
వెటకారం! తెలుసుకుని తీరాల్సిందే. 'అమవస నిసి' అనే ఒకే ఒక్క పదంపై శ్రీకృష్ణదేవరాయల కొలువులో జరిగిన ఒక ఆసక్తికరమైన సాహిత్య
యుద్ధం గురించి, మహాకవుల మధ్య సాగిన ఆ హాస్యభరితమైన చమత్కార పద్యం గురించి
గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం వింటుంటే, ప్రత్యక్షంగా ‘భువన విజయం’ చూస్తున్నట్లే వున్నదనవచ్చునేమో! అలా,
అలనాడు, శ్రీకృష్ణదేవరాయల కొలువులో అల్లసాని పెద్దన గారు ఆ
సందర్భంలో మహారాజు ‘అన్నీ లఘువులతో కూడిన’ ఒక పద్యం
చెప్పమన్నప్పుడు, చదివిన పద్యం:
కలనాటి ధనము లక్కర
గలనాటికి దాచ కమల గర్భుని
వశమా
నెల నడిమి నాటి వెన్నెల
యలవడునే గాదె బోయె నమవస
నిశికిన్!
సభలో అందరూ పెద్దన గారి ప్రతిభను కొనియాడుతుంటే, వికటకవి తెనాలి రామకృష్ణుడు మాత్రం ఆ ప్రయోగంలోని లొసుగును
వదల్లేదు. వెంటనే, రామకృష్ణుడి ఆక్షేపణ తెలియచేసాడు. పెద్దన
గారు ఛందస్సు కోసం వాడిన ఆ తప్పుడు పదాన్ని ఆక్షేపిస్తూ, రామకృష్ణుడు
కూడా అదే 'లఘువుల' నియమాన్ని
పాటిస్తూ ఆశువుగా ఎదురు దాడి చేశారు.
పై పద్యం చివరి పాదంలో ‘అమవస
నిశికిన్’ (అమవస నిసి) అనే పదాన్ని పెద్దన గారు
వాడారు. ‘అమావాస్య’ అనేది తత్సమ పదం కాగా, దాని వికృతి రూపం
‘అమవస.’ ఒక గొప్ప కవి అయి ఉండి, ఛందస్సు కుదరడం కోసం ఇలాంటి
గ్రామ్య, వికృతి పదాన్ని ‘నిశి’ (రాత్రి) అనే పదంతో కలిపి వాడటం తప్పు అని సభలో
ఎవ్వరూ అనలేదు కానీ తెనాలి రామకృష్ణుడు మాత్రం ఊరుకోలేదు. దానికి కొనసాగింపుగా, తెనాలి రామకృష్ణుడి చమత్కార పద్యం కూడా తెలుసుకోవాలి. పెద్దన గారి
ప్రయోగాన్ని తప్పుబడుతూ, ఆయన్ను ‘అల్లసాని’ అనడానికి బదులు
‘అలసని’ (అలసత్వము కలిగినవాడు) అని హేళన చేస్తూ రామకృష్ణుడు ఆశువుగా ఒక పద్యం
చెప్పారు. తెనాలి రామకృష్ణుడి చమత్కార పద్యం ఇలా సాగింది:
ఎమి తిని సెపితివి కపితము?
బమపడి వెరి పుచ్చకాయ వడి తిని చెప్పితో?
ఉమెతకయను తిని చెప్పితో?
అమవస నిసి యనుచు నీవు అలసని పెద్దనా!
ఈ పద్యంలో రామకృష్ణుడు కావాలనే
తప్పుడు ఉచ్చారణలతో, గ్రామ్య పదాలతో నింపేశారు. పద్యంలో కావాలనే
అక్షర దోషాల వంటి ప్రాకృత, గ్రామ్య శైలిని (ఎమి, సెపితివి,
కపితము, బమ, వెరి,
ఉమెతకయ) వాడి పెద్దన గారిని వెటకరించారు. పెద్దన గారిని ‘ఓ అల్లసాని
పెద్దనా! (అలసరిపోయిన పెద్దనగారా!) అసలు నువ్వు ఏమి తిని ఈ కవిత్వం చెప్పావు?
భ్రమపడి పిచ్చి పుచ్చకాయ (వెర్రిపుచ్చకాయ) తిని చెప్పావా? లేదా బుద్ధి భ్రమణం కలిగించే ఉమ్మెత్తకాయ తిని చెప్పావా? 'అమావాస్య రాత్రి' అనడానికి 'అమవస
నిసి' అని ఎలా అన్నావు?’
తెనాలి రామకృష్ణుడు చేసిన చమత్కార
విమర్శ ఆనాటి సాహిత్య వైభవానికి మచ్చుతునక. గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగాల
ద్వారా ఇలాంటి మన తెలుగు భాషా రత్నాలు ఈ తరానికి అందడం నిజంగా అభినందనీయం. రామకృష్ణుడు
పద్యం యొక్క భావం కూడా మామూలిదేమీ కాదు. తెలుగు సాహిత్య చరిత్రలో కవుల మధ్య జరిగిన
ఇలాంటి రసవత్తరమైన, చమత్కారభరితమైన చాటు పద్య సంభాషణలు ఎంతో
ప్రసిద్ధి చెందాయి.
శ్రీకృష్ణదేవరాయల కొలువులోని భువనవిజయం
అనే సాహిత్య సభను అలంకరించిన ఎనిమిది మంది గొప్ప కవులను అష్టదిగ్గజాలు అంటారు. ఆ
ఎనిమిది మంది మహాకవుల పేర్లు: అల్లసాని పెద్దన (ఆంధ్రకవితా
పితామహుడు); నంది తిమ్మన (ముక్కు తిమ్మన); ధూర్జటి; తెనాలి
రామకృష్ణుడు (రామలింగడు లేదా వికటకవి); మాదయ్యగారి మల్లన; అయ్యలరాజు
రామభద్రుడు; పింగళి సూరన; రామరాజభూషణుడు (భట్టుమూర్తి). ఈ
ఎనిమిది మంది కవులు తెలుగు సాహిత్యానికి అమూల్యమైన ప్రబంధాలను కానుకగా ఇచ్చారు.
పెద్దన గారిని 'అల్లసాని' అనడానికి బదులు 'అలసని' (అలసిపోయినవాడు) అని సంబోధిస్తూ: ‘ఓ పెద్దనా,
బుద్ధి భ్రమింపజేసే ఉమ్మెత్తకాయ తిని ఈ కవిత్వం చెప్పావా? 'అమవస నిసి' అనే ప్రయోగం ఎలా చేశావు?’ అంటూ ఆయన చేసిన చమత్కార విమర్శ ఆనాటి సాహిత్య వైభవానికి మచ్చుతునక. అన్నిటినీ
మించి, తెలుగు భాషా సౌందర్యాన్ని, ఆనాటి
కవుల సమయస్ఫూర్తిని గరికిపాటి నరసింహారావు గారు తమ విశ్లేషణతో అద్భుతంగా
ఆవిష్కరించారు.


No comments:
Post a Comment