భారతావనిలో బ్రాహ్మణ రాజ్యాలు, రాజులు, చక్రవర్తులు
(స్వర్గీయ బిఎన్ శాస్త్రి ‘బ్రాహ్మణ రాజ్య సర్వస్వం’
ఆధారంగా)
వనం జ్వాలా నరసింహారావు (ప్రజాతంత్ర జూలై 19, 2026)
స్వర్గీయ డాక్టర్ బి ఎన్ శాస్త్రి
రచించిన ఏడువందల పేజీల బృహత్ అధ్యయనాత్మక,
పరిశోధనాత్మక గ్రంథం, ‘బ్రాహ్మణ రాజ్య సర్వస్వం’ వాస్తవంగా చెప్పాలంటే
బ్రాహ్మణ రాజులకు సంబంధించిన ఒక అరుదైన ‘విజ్ఞాన సర్వస్వం’ అనవచ్చేమో. భారతావనిలో బ్రాహ్మణ రాజ్యాల ఆవిర్బావం, ఆరోహణ, అవరోహణల సమగ్ర విశ్లేషణ ఈ పుస్తకంలో
పొందుపరచడం జరిగింది. దాని క్లుప్తీకరణ ఈ వ్యాసం. భారత దేశ మహోన్నత నాగరకిత చరిత్రకు
శ్రీకారం చుట్టి, వైదిక ధర్మం వర్ధిల్లడానికి అమోఘమైన కృషి చేసి, మంత్రి, దండనాయక, పురోహిత పదవులను మాత్రమే అలంకరించడం కాకుండా,
అవసరార్థం, ఆపద్ధర్మంగా, ప్రజారక్షణ
ధ్యేయంగా, సామ్రాజ్యాలను స్థాపించిన మహనీయులు బ్రాహ్మణులు.
అంతగా ప్రాచుర్యం పొందని,
చరిత్రకార్లు పొందనీయని, ప్రసిద్ధమైన 26 బ్రాహ్మణ రాజ్య వంశాల గురించి పరిశోధనాత్మకంగా, సోదాహరణంగా, నిరూపిస్తూ, విపులీకరించారు శాస్త్రిగారు తన ‘బ్రాహ్మణ రాజ్య సర్వస్వం’ పుస్తకంలో. ఇందులోని యావత్ సమాచారం అధ్యయనం,
పరిశోధన, శాసనాలలాంటి సాక్ష్యాధారాల ఆధారంగా సేకరించి
క్రోడీకరించినదే. ఋగ్వేదం, ఋషులు,
మహర్షులు, రాజులు, మహారాజులు, చక్రవర్తులు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, ఆర్యులకాలంనాటి వ్యవసాయం, సాంఘిక, సామాజిక అంశాలు, జానపదాలు,
గణతంత్ర రాజ్యాల సంక్షిప్త సమాచారం ఆ అరుదైన, అపురూపమైన, మహత్తర అధ్యయన గ్రంధంలో నిక్షిప్తం చేశారు, నాకు
వ్యక్తిగతంగా పరిచయమున్న బి ఎన్ శాస్త్రి గారు.
శుంగ వంశీయ బ్రాహ్మణ రాజులు మగధ
సామ్రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 185 నుండి క్రీస్తు పూర్వం 73 వరకు 112 సంవత్సరాలు
పాలించారు. చారిత్రిక,
శాసనపరమైన ఆధారాలను బట్టి, వీరిది
భారద్వాజ గోత్రం. వేదవేదాంగాలను, సకల శాస్త్రాలను అధ్యయనం చేసినవారు. వైదిక
మతోద్ధరణ దిశగా, మౌర్య వంశీయుల కాలంలో కుల బ్రాహ్మణులుగా, వైదిక మతవ్యాప్తికి అమాత్య పదవులను అధిష్టించి, క్రమేపీ రాజకీయాలలో ప్రవేశించి, వైదికధర్మ నిరతితో, ప్రజలను ఉత్తేజితులను చేసి వారిని వైదిక
మతం వైపు మరల్చారు. శుంగ వంశీయ చివరిరాజైన దేవభూతి మరణానంతరం, మంత్రి వాసుదేవుడు, మగధ
సింహాసనాన్ని అధిష్టించి కాణ్వ వంశాన్ని స్థాపించాడు.
ఈ వంశానికి చెందిన
నలుగురు రాజులు, మగధ
సామ్రాజ్యాన్ని 45 సంవత్సరాలు పాలించారు. వాస్తవానికి శుంగ వంశపు 112 సంవత్సరాల రాజ్యపాలనలో చివరి 45 సంవత్సరాలు
కాణ్వ వంశీయుల పాలన ఇమిడి వున్నది. ఆ తరువాత శాతవాహన
వంశ ప్రభువులు, అజేయులై మగధ సామ్రాజ్యాన్ని జయించి,
సువిశాల భారత భూభాగాన్ని పాలించారు. కాణ్వ
వంశం అంతరించిన తరువాత గుప్త సామ్రాజ్య స్థాపన వరకు మగధ రాజ్య చరిత్ర అనిశ్చితంగా
వున్నది. శాతవాహన చక్రవర్తులలో గౌతమీపుత్ర శాతకర్ణి అమితమైన బలపరాక్రమ సంపన్నుడు. దక్షిణాపథానికి
మజోజ్వల చరిత్రను అందించి, భారతదేశ
మహోన్నత చరిత్రకు శ్రీకారం చుట్టిన శాతవాహనులు తెలుగువారి
కీర్తి చంద్రికలను దిగ్దిగంతాలకు వ్యాపింప చేశారు. వీరి
తొలి నివాసం కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతం.
శాతవాహనుల తరువాత
దక్షిణాపథాన స్వాతంత్ర్యం ప్రకటించుకున్న వారిలో
ఇక్ష్వాకు వంశీయులు కూడా వున్నారు. గుంటూరు,
నల్లగొండ, మహబూబ్ నగర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, జగ్గయ్యపేట, మధిర, నేలకొండపల్లి ప్రాంతాలు ఇక్ష్వాకు
వంశీయుల పాలనలో వుండేవి. ఇక్ష్వాకు వంశీయుల పాలనాకాలంలో
నాగార్జునకొండలోని బౌద్దారామ విహారాలు,
చైత్యాలయాలు, పారావత మహావిహారం, సరికొత్త
అందాలను సంతరించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వున్న బౌద్ధ సన్యాసులు, ప్రచారకులు,
గురువులు, మతాభిమానులు, వేల సంఖ్యలో నాగార్జునకొండ బౌద్ధ
క్షేత్ర సందర్శనానికి వచ్చేవారు.
పల్లవ రాజ్యాన్ని స్థాపించడంతో,
ఇక్ష్వాకు రాజ్యం అంతరించింది. మొత్తం ఏడు
శతాబ్దాల పాటు కొనసాగిన వీరి పాలనలో, ప్రాచీన పల్లవులది
మూడు శతాబ్దాలు, మహా పల్లవులది నాలుగు
శతాబ్దాలు సాగింది. ఇక్ష్వాకు, విష్ణుకుండిన వంశీయుల చరిత్రలలో పల్లవ
రాజన్యుల ప్రశంస వున్నది. ఇక్ష్వాకుల అనంతరం పాలించినవారు బృహత్పలాయన వంశీయులు. శాతవాహనుల
అనంతరం పాలించిన రాజ వంశాలలో శాలంకాయన వంశం ఒకటి. శాతవాహన
సామ్రాజ్య పతనానంతరం ఆంధ్రదేశాన్ని ఏకఛ్చత్రాదిపత్యంగా పాలించిన బ్రాహ్మణ రాజవంశాలలో
విష్ణుకుండిన వంశం పేర్కొనదగినది. మహోజ్వల చరిత్ర కల విష్ణుకుండిన రాజన్యుల చరిత్ర
అనుపమానమైనది. అసదృశమైనది.
విష్ణుకుండిన రాజ్యం అంతరించిన పిదప, మాఠర వంశీయుల పాలనలోకి
వచ్చింది. సముద్ర గుప్తుడి దక్షిణాపథ, దక్షిణ భారత దిగ్విజయానంతరం కళింగ రాజ్యం
చిన్న, చిన్న రాజ్యాలుగా తలెత్తాయి. మాఠర వంశీయుల పాలన అంతరించిన తరువాత
కళింగ దేశాన్ని గాంగ వంశీయులు స్వాధీనపర్చుకున్నారు. శాలంకాయన రాజుల సామంతులుగా, ఏలిన మూలరాజు
వంశీయులు పరాక్రమవంతులు. సాహసోపేతులు. అరివీర భయంకరులు. ఈ వంశం అంతరించిన తరువాత, కుషాణు, శాతవాహన
వంశాలు పతనమైన అనంతరం, భారతదేశ చరిత్రలో
ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన రాజవంశం గుప్త వంశం.
శక రాజులు, క్షహరాట వంశీయులు భారతావని పశ్చిమ
భాగంలోను, ఉత్తర భాగంలోనూ, చిన్న,
చిన్న రాజ్యాలను స్థాపించుకుని పాలిస్తూ ప్రబల శక్తి సమన్వితులై
వున్న సమయంలో గుప్త వంశీయుల పాలన మొదలైంది. గుప్త రాజుల పరిపాలనను స్వర్ణయుగ
పాలనగా పరిగణింపబడుతున్నది. భారతీయ సంస్కృతీ వికాసానికి ఈ వంశీయులు దోహద పడ్డారు.
భారతజాతి ప్రపంచంలో ఉన్నత సంస్కారంగల జాతిగా గుప్తుల కాలంలో ప్రసిద్ధికెక్కింది.
పదమూడుమంది గుప్త వంశపు రాజులు భారత భూభాగాన్ని ఏలారు.
గుప్త వంశ చక్రవర్తులు
బ్రాహ్మణులైనప్పటికీ, వారు తమ పేరు చివర పితృ వంశ నామాలనే నిలుపుకున్నారు. మౌర్య, శాతవాహన సామ్రాజ్యాల నాటి ప్రాభవాన్ని పునరుద్ధరించడానికి
ఆవిర్భవించిన రాజ వంశం గుప్త వంశం. చంద్రగుప్తుడు
రాజ్యానికి వచ్చిననాటి నుండి, గుప్త శకం
ప్రారంభమైంది. ఇతడు గుప్తరాజ్యాన్ని ఉన్నత స్థితికి తీసుకు రావడానికి కృషి చేసిన
మహారాజుగా కీర్తి గాంచాడు. భారతదేశం విచ్చిన్నమై అదఃపతనమవుతున్న సమయంలో భారతజాతిని
ఉద్ధరించడానికి, దేశ సమగ్రతను కాపాడడానికి, భారత జాతి సంస్కృతీ సభ్యతలను,
ఆచార వ్యవహారాలను పరిరక్షించడానికి దండయాత్రలు చేసి మహాస్మారాజ్య నిర్మాణం చేసిన
ఘనులు వీరు.
గుప్త చక్రవర్తుల సామంతులుగా మాళవ గుప్తులు
వ్యవహరించబడ్డారు. గుప్తరాజ్య పతనానంతరం ఈ వంశీయులు స్వాతంత్ర్యాన్ని
ప్రకటించుకున్నారు. ఈ రాజ వంశీయులు మాళవ రాజ్య పాలకులుగా వుండేవారు. తరువాత మగథ
రాజ్యాన్ని ఏలారు. గుప్త రాజ్య పతనానంతరం ఘూర్జరులు ప్రసిద్ధికెక్కారు.
పూర్వకాలంలో గుజరాత్ ఘూర్జర దేశంగా పరిగణించబడింది. గుజరాత్ ప్రాంతాన్ని ఏలడం వల్ల
వీరు ఘూర్జరులు అని పిలువబడ్డారు. భారతావని
మీద దండయాత్రలు చేసిన హూణుల వెంట ఘూర్జరులు వచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
దడ్డరాజు వంశేయులు రాజస్థాన ఘూర్జర రాజుల సామంతులుగా వుండి, తరువాత బాదామీ చాళుక్యుల విధేయ సామంతులుగా మారి, ఘూర్జర రాజ్యాన్ని
పాలించారు. భారత దేశంలోని ప్రాచీన రాజ వంశాలలో మౌఖరి
వంశం కూడా ఒకటి. మహాభారతంలో మద్ర దేశాధీశుడు, అశ్వపతి వంశీయుడు, మౌఖరులు ఈ ఆశ్వపతి
వంశానికి చెందిన వారు. వీరు గొప్ప రాజ్యాన్ని నెలకొల్పి పాలించారు. మౌఖరి వంశేయులు
గొప్ప రాజులుగా కీర్తించబడి వైభవోపేతంగా పాలించారు.
ఇదిలా
వుండగా, గుప్త సామ్రాజ్య
పతనానంతరం వంగ దేశంలో ఒక స్వతంత్ర రాజ్యం ఆవిర్భవించింది. దీని
సమగ్ర సమాచారం లభ్యం కావడం లేదు. బాదామీచాళుక్య చక్రవర్తి కీర్తివర్మ,
టిబెట్ రాజు స్రోన్బట్సన్ దండయాత్రల వల్ల వంగ రాజ్యం పతనమై పోయింది. వంగ రాజ్యం
వంగ, గౌడ రాజ్యాలుగా విభజించబడింది. గౌడ దేశం ఉత్తర,
పశ్చిమ వంగ దేశ భాగాలుగా వ్యాపించి వుండేది. దక్షిణ,
తూర్పు భాగాలు వంగ దేశంగా పరిగణించబడేవి. వంగ దేశ ప్రాచీన నామం సమతత. మాణ వంశీయులు
వంగ దేశంలోని పర్వత ప్రాంతాలను పాలించారు. వీరి రాజ్యం మిడ్నాపూర్, గయల దాకా విస్తరించి వుండేది. శైలోద్భవ వంశీయులు వీరికి సామంతులుగా
వుంటూ, స్వతంత్రులయ్యారు.
దక్షిణాపథ, దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధికెక్కిన రాజవంశాలలో
కదంబ వంశం ఒకటి. కదంబులు శివపూజా దురంధరులు. కాదంబులు బహుశా అలనాటి విరాటరాజు
వంశానికి చెందిన మత్స్య వంశీయులై వుండవచ్చు.
కదంబ వంశీయులు వేద విద్యలను ప్రోత్సహించి అనేక దేవాలయాలను నిర్మించారు.
వేదవేదాంగేతిహాసాలను అభ్యసించారు. వాస్తవానికి, గుప్త సామ్రాజ్య పతనానంతరం, ఒకటి-రెండు మినహా,
ఏర్పడిన అనేక స్వతంత్ర రాజ్యాలన్నీ చిన్నవి. ఈ రాజ
వంశాల వారిలో వల్లభీలు, కదంబులు, ఘూర్జరులు,
మౌఖరులు, కామరూప పాలకులు,
తదితరులున్నారు. వల్లభి (గ్రామాన్ని?) నగరాన్ని రాజధానిగా పాలించినవారు వల్లభి
రాజవంశీయులు. వల్లభి నగరం మైత్రక వంశీయుల రాజధానీ నగరం.
దక్షిణ భారత దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన శకం ప్రారంభానికి
మూడవ శతాబ్దిలోని మధ్యకాలం గుర్తుగా నిలిచి వున్నది. నాలుగున్నర శతాబ్దాల కాలం
దక్షిణ భారతదేశంలోని విశాల ప్రాంతం మీద రాజ్యాధికారం వహించిన శాతవాహనులు ఈ
కాలంలోనే చారిత్రిక రంగం నుండి అదృశ్యులయ్యారు. శాతవాహనుల అనంతరం హైదరాబాద్ రాజ్య
దక్షిణ ప్రాంతంలో శకులు రాజ్యాధికారానికి వచ్చినట్లు తెలుస్తున్నది. కాకపొతే, రాజ్యాదిపత్యానికి
వచ్చిన వంశీయులలో వాకాటకులను పురాణాలు ఉటంకించక పోవడం వింతగా గోచరిస్తున్నది.
శాతవాహనుల అనంతరం వచ్చిన కిలకిల, కోలికిల రాజుల అనంతరం వాకాటకులకు చెందిన
వింధ్యశక్తి రాజ్యాదిపత్యానికి వచ్చినట్లు పురాణాలలో కనిపిస్తున్నది.
వాకాటక రాజ్యం మీద దండయాత్ర చేసీ, నల వంశీయులు పలు
ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. తదనంతరం, వాకాటక రాజ్యం, విష్ణుకుండిన
రాజ్యంలో విలీనం అయింది. సమర్థవంతులైన పాలకులు,
జ్ఞానవంతులైన రాజ్య నిర్వాహకులు, కళా సాహిత్య పోషకులైన
అనేకమంది ప్రఖ్యాత రాజులను ఈ వాకాటక శాఖ సృష్టించింది. బ్రహ్మాండమైన వాకాటక సామ్రాజ్యం అకస్మాత్తుగా విచ్చిన్నం కావడానికి
కారణాలను చరిత్రలో భద్రపర్చలేదు.
కలభ్రులు పూర్వ పల్లవ రాజ్యాన్ని అంతం చేసి,
తమిళ రాజ్యాన్ని ఆక్రమించారు. పల్లవ వంశీయులు కలభ్రులను
ఓడించి, తమిళ భూభాగాల నుండి తరిమివేసి, పల్లవ
రాజ్యాన్ని ఉద్ధరించాడు. కాంచీ నగరం రాజధానిగా దక్షిణాపథ, దక్షిణ భారత
దేశాలలోశక్తి సమన్వితులై వైభవోపేతంగా పరిపాలన చేశారు. మహా పల్లవ ప్రభువులుగా
గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు కలభ్ర,
చోళ, మాళవ, సింహళ, కేరళ రాజ్యాధీశుల మీద దండెత్తి విజయం సాధించారు. చాళుక్య
రాజులతో పోరాడవలసి వచ్చినందున, వారిని
ఎదుర్కొని పల్లవ రాజ్య భాగాలను రక్షించుకున్నారు. వీరి కాలంలో
సంస్కృత భాషకు ఆదరం లభించినది.
ఈ వంశీయులు వేంగీ
రాజ్య దక్షిణ భాగాలను, పల్లవ రాజ్యానికి ఉత్తరంలో వున్న ప్రాంతాలను పల్లవ రాజ్యంలో
చేర్చుకున్నారు. దీంతో పల్లవ రాజ్య ప్రతిష్ట ఇనిమడించినది.
కాని బాదామీ చాళుక్యులతో వైరం ముదిరినది. ఆ తరువాత తంజావూరు పట్టణంలో చోళ రాజ్యం
స్థాపించ బడింది. దరిమిలా, పల్లవుల
అధికారం పూర్తిగా అంతరించింది. భారత
దేశంలోని రాజపుత్ర స్థానాన్ని పాలించిన రాజవంశాలలో ప్రతీహార వంశం ప్రముఖమైనది. ఇది
తరువాత కాలంలో గొప్ప శక్తి సమన్వితమైన రాజ్యంగా రూపుదిద్దుకున్నది. ప్రతీహార
వంశానికి చెందిన రాజులు ప్రాగ్దక్షిణ ప్రదేశాలలో చిన్న చిన్న రాజ్యాలను
స్థాపించుకుని పాలించారు. ఘూర్జర రాజ్యాన్ని ప్రతీహార వంశానికి చెందిన ప్రధానమైన
శాఖ వారు పాలించినట్లు కూడా ఆధారాలున్నాయి.
నాగభట్టు అనే ప్రతీహార ప్రభువు మ్లేచ్చరాజును ఎదిరించి
ఓడించాడు. భారతావని మీద దండెత్తి వచ్చిన అరబ్బు రాజులను కూడా ఓడించాడు. సైన్యాన్ని
సమీకరించుకొని, మాళవము, రాజపుత్ర స్థానం, ఘూర్జరము లోని కొన్ని
ప్రాంతాలను జయించి శక్తి సమన్వితమైన ప్రతీహార రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇతడు భారత
జాతి గర్వించదగ్గ మహారాజు. విదేశీయుల దాడులను అరికట్టి గొప్ప జాతీయ నాయకుడిగా
ప్రసిద్ధికెక్కాడు. ఈ వంశీయుడైన రణహస్తి,
వత్సరాజుగా ప్రఖ్యాతుడు. మధ్య రాజపుత్ర స్థానాన్ని పాలించాడు. భోజుడు
రాజ్యాధికారం వహించిన తరువాత అనేక రాజ్యాలను జయించి పూర్వ ప్రతీహార రాజ్యాన్ని
పునరుద్ధరించాడు.
ప్రతీహార భోజుడు కడు సమర్థుడు. యుద్ధ విద్యా విశారదుడు.
విశాల సామ్రాజ్యాన్ని తన వారసులకు అప్పచెప్పి మరణించాడు.
భోజుడి తరువాత రాజ్యానికి వచ్చిన ప్రతీహార పాలకులు బలహీనులు,
భోగాలాలసులు. వారి పాలనా కాలంలో మాళవము రాష్ట్రకూటుల స్వాధీనమైపోయింది. కాని, భోజుడి
అనంతరం రాజ్యానికి వచ్చిన మహేంద్రపాలుడు పూర్వ ప్రతీహార సామ్రాజ్యంలో వున్న
మాళవమును తిరిగి జయించగలిగాడు. తరువాత రెండవ
భోజుడు ప్రతీహార సామ్రాజ్యాధినేత అయ్యాడు. అంతఃకలహాల్లో కూరుకుని బలహీనపడివున్న
ప్రతీహార రాజ్యభాగాలను రాష్ట్రకూటులు ఆక్రమించుకున్నారు. మహీపాలుడు ప్రతీహార
సామ్రాజ్యాన్ని పునరుద్ధరించినప్పటికీ, రాష్ట్రకూట, పాల వంశీయుల దండయాత్రల వల్ల
క్షీణించ సాగింది. శతాబ్దికాలం మహావైభవంగా ఉత్తర భారత దేశంలో మహా సామ్రాజ్య స్థాపన
చేసిన వంశంగా ప్రసిద్ధికెక్కింది. తరువాత పాల వంశం
ఏర్పడినది. పాల వంశీయుల పాలన సుమారు 400 సంవత్సరాలు సాగింది.
డాక్టర్ బి ఎన్ శాస్త్రిగారు పరిశోధనాత్మకంగా ప్రతిపాదించిన ఈ 26 రాజవంశాల చరిత్ర,
భారత చరిత్రలో బ్రాహ్మణుల పాత్ర, సంప్రదాయ పరిమితులకు అతీతంగా ఎంత విశాలమైందో స్పష్టంగా తెలియజేస్తుంది. శుంగులు,
కాణ్వులు, శాతవాహనులు, విష్ణుకుండినులు,
గుప్తులు, కదంబులు, పల్లవులు తదితర రాజవంశాలు విజ్ఞానం,
సమర్థ పరిపాలన,
యుద్ధ నాయకత్వం,
ధర్మరక్షణ, ఈ నాలుగూ ఒకే సమాజంలో సమన్వయంగా వికసించగలవని చారిత్రకంగా నిరూపించాయి. అంతిమంగా, ఈ చారిత్రక ఆధారాలు ఒక విలువైన సందేశాన్ని అందిస్తున్నాయి. చరిత్రను ఊహలతో కాదు, సాక్ష్యాధారాలతోనే అర్థం చేసుకోవాలి. కాలానుగుణంగా సమాజాలు తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ రూపాంతరం చెందుతుంటాయి.
ఇలాంటి అనేక విశిష్ట అధ్యాయాలను వెలికితీసిన డాక్టర్ బి ఎన్ శాస్త్రిగారి పరిశోధన,
గతాన్ని సమతుల్య దృష్టితో అధ్యయనం చేయాలని,
భారత నాగరికత వైభవాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలని ప్రేరణనిస్తుంది. చరిత్ర ఒక స్పష్టమైన హెచ్చరికను అందిస్తోంది: భారతదేశ బ్రాహ్మణ సమాజాన్ని
ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదు. జ్ఞానం, క్రమశిక్షణ,
దూరదృష్టి, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము
మలచుకునే సామర్థ్యం వారి చారిత్రక వైశిష్ట్యానికి పునాదులు. సంక్షోభాలను ఎదుర్కొవాల్సి
వచ్చినప్పుడు, అవసరాన్ని బట్టి నాయకత్వం వహించడానికైనా,
మార్గదర్శకత్వం అందించడానికైనా, నాటి రాజవంశాల నుండి నుండి నేటి ప్రజాస్వామ్య
యుగంలో ఒక సర్వేపల్లి, ఒక వీవీ గిరి,
ఒక పీవీ దాకా, అందరూ ముందుకు వచ్చి తమ బాధ్యతను
నిర్వర్తించిన అనేక సందర్భాలకు భారత చరిత్ర పదేపదే సాక్ష్యంగా నిలిచింది. భవిష్యత్తులో
కూడా నిలుస్తుంది.


గొప్ప పుస్తకం! అంతే గొప్ప సమీక్ష!
ReplyDeleteఅందరూ చదవాల్సింది,అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం కావాల్సివుంది.
జ్వాలాగారి ప్రజ్ఞ అనుపమానమైనది ❤️🌹🙏