Monday, October 15, 2018

సహజీవనాన్ని నేర్పే బతుకమ్మ : వనం జ్వాలా నరసింహారావు


సహజీవనాన్ని నేర్పే బతుకమ్మ
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (16-10-2018)

         రకరకాల హిందువుల పండుగలకు తెలంగాణ పుట్టిల్లు. ప్రతిపండుగకూ ఒక నేపధ్యముంది. ప్రతి పండుగా సంప్రదాయాల నిలయమే. ఇతిహాసాల్లో, పురాణాల్లో ఏం చెప్పినా, ఆచరణలో మాత్రం, తెలంగాణాలో జరుపుకునే ప్రతి పండుగ స్థానిక ఆచారాలకు అనుగుణంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా బంధుమిత్రుల మధ్య గడుపుకోవడం అనాదిగా వస్తున్నదే. అలాంటి పండుగలలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న దసరా, బతుకమ్మ పండుగలు ఒకటివెంట మరొకటి ఈ నెలలో రావడం ఆదా-మగా అందరికీ ఆనందదాయకమే. ఏక కాలంలో చేసుకునే ఈ పండుగలకు సంబంధం ఒక విధంగా వుందనే అనాలి.

         ఊరూ-వాడా ఏకమై, ఊరి బయట జమ్మి వృక్షం కింద గుమికూడి, “శమీ శమయతే పాపం...శమీ శతృ వినాశనం...అర్జునస్య ధనుర్థారీ...రామస్య ప్రియదర్శనం” అంటూ ఒక కాగితం మీద రాసి, జమ్మిచెట్టు కొమ్మకు గుచ్చి, రామచిలుక దర్శనం చేసుకుని, జమ్మి ఆకు చేతబట్టుకుని, స్నేహితులకు ఇవ్వడం దసరా విశేషం. అలాగే, రంగు-రంగుల పూలతో, అందచందంగా అలంకరించిన బతుకమ్మలను ఉరేగింపుగా తీసుకుపోతూ, భక్తీ శ్రద్ధలతో పాటలు పాడుకుంటూ, ఊరిబయట వున్న నది ఒడ్డుకో, ఏటి ఒడ్డుకో, చెరువు ఒడ్డుకో పోయి, మహిళలంతా గుమికూడి జరుపుకునేదే బతుకమ్మ ఆఖరి రోజు పండుగ సద్దుల బతుకమ్మ. ఒకప్పుడు పల్లెటూళ్లతో సహా బస్తీలలో కూడా అట్టహాసంగా జరుపుకున్న ఈ పండుగలు, క్రమేపీ వాటి సహజ శైలిలో జరగకపోవడం, కొన్ని చోట్ల దాదాపు కనుమరుగవడం జరిగినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపధ్యంలో, వాటి పునఃప్రాభవం సంతరించుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఈ పండుగలు మళ్లీ అట్టహాసంగా జరుపుకోవడం చూస్తున్నాం. అన్ని పండుగాలలాగే వీటికీ చారిత్రిక నేపధ్యం వున్నది.

         పండుగలన్నింటిలోకి పెద్ద పండుగగా చెప్పుకునే దసరాను శరన్నవరాత్రి అని కూడా అంటారు. నవరాత్రులుగా జరుపుకునే ఈ పండుగలో భాగమే దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ పండుగకు కొత్త అల్లుళ్లను, ఆడపడుచులను ఆహ్వానిస్తారు. అందరూ కలిసి-మెలిసి ఆనందంగా గడుపుతారు. ఈ పండుగ జరుపుకునే రోజుల్లోనే, మన తెలంగాణా ప్రాంతంలో, తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుని తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ చేసుకుని ఆడపిల్లను అత్తారింటికి పంపినట్లే బతుకమ్మ-గౌరమ్మను నీటిలో కలిపి అత్తారింటికి సాగనంపుతారు.

         విజయదశమి అంటే విజయం అని అర్థం. పాండవులు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేసే పూర్వరంగంలో, అక్కడికి చేరుకునే ముందు, తమ అస్త్ర-శస్త్రాలను ఒక జమ్మిచెట్టుమీద వుంచి అవి తమకు తప్ప ఇతరులెవరికీ కనిపించకుండా ఏర్పాటు చేస్తారు. వారికి మాత్రమె అవి అస్త్ర-శస్త్రాలుగా కనిపించి, ఇతరులకు శవాకారంలో కనిపిస్తాయి. వారి అజ్ఞాతవాసం ముగిసిన తరువాత ఉత్తర గోగ్రహణం సందర్భంగా, ప్రగల్భాలాడుతూ యుద్ధానికి వచ్చిన ఉత్తరకుమారుడు కౌరవ సైన్యాన్ని చూసి భయపడి వెనుదిరిగి పారిపోతుంటే, ఆయనకు సారథిగా వచ్చిన బృహన్నల (అర్జునుడు) జమ్మిచేట్టుమీద వున్నా అస్త్రాలను బయటకు తీసి యుద్ధం చేసి, కౌరవులను ఓడించి విరాతరాజుకు విజయం చేకూరుస్తాడు. యుద్ధంలో అలా కౌరవులను జయించిన రోజునే “విజయదశమి” అని “దసరా” అని అంటారని ఒక కథ ప్రచారంలో వుంది.

         దీన్ని గురించే మరో కథ ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో బహుళ ప్రచారంలో ఎప్పటినుండో వుంది. ఆ మండలంలో మా గ్రామం వనంవారి కృష్ణాపురానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో బాణాపురం అనే గ్రామం వుంది. దానికి దగ్గరలోనే భక్తరామదాసు జన్మించిన నేలకొండపల్లి అనే గ్రామం వుంది. ఇది కూడా మండల కేంద్రమే. బౌద్ధుల కాలంనాటి ఎన్నో చారిత్రిక అవశేషాలు ఇక్కడ బయటపడ్డాయి. పాండవులు శస్త్రాస్త్రాలను వుంచిన జమ్మిచెట్టు వున్నవూరుకే బాణాపురం అన్న పేరొచ్చింది అంటారు. బాణాపురం నుండి నేలకొండపల్లికి వెళ్ళే మార్గమధ్యంలో, నేలకొండపల్లికి ఆనుకుని, పది-పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద మట్టిగద్దె వుంది. దీన్ని విరాటరాజు గద్దె అని ఇక్కడి స్థానికులు పిలుస్తారు. ఇదిప్పుడు పురాతత్వశాఖ వారి అధీనంలో వుంది. ఈ గద్దె నుండే విరాటరాజు పరిపాలన చేశాడని ఈ ప్రాంతంవారు నమ్ముతారు. గద్దెకు అతిసమీపంలో పెద్ద-పెద్ద గాడిపొయ్యిలు వున్నాయి. వలలుడుగా విరాటరాజు కొలువులో పనిచేసిన భీముడు వంటచేసిన స్థలం ఇదని చెప్పుకుంటారు.


         దసరా పేరులోనే వున్నట్లు ఇది పదిరాత్రుల పండుగ. దక్షిణ భారతదేశంలో మొదటి తొమ్మిది రాత్రులను నవరాత్రులనీ, పడవరోజును విజయదశమి అనీ అంటారు. అయితే పురాతన సంస్కృత గ్రంథాలలో కానీ, పౌరాణిక ప్రామాణికాలలో కానీ దసరాను పండుగ దినంగా పేర్కొన్న దాఖలాలు లేవు. క్రీస్తుపూర్వం నాటి ప్రథమ, మధ్య శతాబ్దాల కాలం నాటి సూత్ర గ్రంథాలలో దసరాను ఏటేటా ఆనవాయితీగా జరుపుకునే ఒక రకమైన సత్యనిష్టా కార్యక్రమంగా మాత్రమే దీనిని అభివర్ణించారు. దక్షిణ భారతదేశంలో దసరా జరుపుకునే పదిరోజులు మట్టిబోమ్మలను, వివిధ ఆకృతులతో సేకరించి, బొమ్మల కొలువుగా ఇంటింటా తీర్చిదిద్దే ఆచారం ఎప్పటినుండో వస్తున్నది. బొమ్మలకొలువు పెట్టుకున్న ప్రతి ఇంటికీ పేరంటాళ్ళు రావడం, సంగీత కార్యక్రమాలు చేసుకోవడం, పండుగ వాతావరణంలో కాలక్షేపం చేయడం ఆనవాయితీ. పదిరోజుల బొమ్మల కొలువు తరువాత బొమ్మలన్నిటినీ జాగ్రత్తగా తీసి, భద్రపరచి, మరుసటి సంవత్సరం మరికొన్ని కొత్త బొమ్మల సరసన వీటిని చేర్చి, ఆ ఏడాదికూడా బొమ్మలకొలువును ఏర్పాటుచేసుకోవడం జరుగుతుంటుంది.

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆరాధించే, పూజించే సంరక్షిత దేవతల్లో, తెలంగాణవారు ప్రముఖంగా పూజించే దేవత బతుకమ్మ. జీవితాన్ని ప్రసాదించి, రక్షించే దేవత బతుకమ్మ అని నమ్ముతారు చాలామంది. నవరాత్రుల్లోనూ, దసరా పండుగ దినాల్లోనూ, ఆ దేవతను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. మూడొందర సంవత్సరాల క్రితం, ఇప్పటి వరంగల్ జిల్లాలోని, మొగిలిచర్ల గ్రామానికి చెందిన భట్ట నరసింహా అనే ఓ జానపద కవి తన కవితలో బతుకమ్మ ఆవిర్భావాన్ని వర్ణించారు. అందుకనేమో వరంగల్ వాసులకు బతుకమ్మ మీద ఇతరుల కంటే ఎక్కువ భక్తి. ఓ రకమైన స్థానిక ప్రత్యేకత సంతరించుకున్న ఈ పండుగను చారిత్రాత్మక వరంగల్ ఖిల్లా సమీపంలో ఉన్న భద్రకాళి (పద్మాక్షి) గుడి ప్రాంగణంలో, జనం గుమిగూడి అత్యంత ఉత్సాహభరితంగా జరుపుకుంటారు. గిరిజన సంప్రదాయ నేపథ్యంలో, కాకతీయ రాజులు ఈ పండుగ ఆవిర్భావానికి వికాసానికి కారకులై ఉండొచ్చు. జనాదరణ పొందిన పలు పండుగలను ప్రచారంలోకి తెచ్చిన ఘనత కాకతీయులదే.

         మొగిలిచెర్ల జానపద కవి రాసిన పాటలో బ్రతుకమ్మను గురించిన వివరాలున్నాయి. చోళ దేశంలో ధర్మాంగ అనే రాజు ఉండేవాడు. ఆయన భార్య సత్యవతి. ఆ దంపతులకు నూరుగురు పుత్రుల సంతానం. అందరూ ధైర్యసాహసాలు కలవారైనప్పటికీ, ఓ యుద్ధంలో శతృవుల చేతిలో మరణిస్తారు. దుఖంతో కృంగిపోయిన ధర్మాంగ-సత్యవతి దంపతులు లక్ష్మీదేవి కటాక్షం కోరకు అడవుల్లోకి పోయి తపస్సు చేస్తారు. ఫలితంగా సాక్షాత్ లక్ష్మీదేవే ఆ దంపతులను ఆశీర్వదించి, పుట్టిన బిడ్డకు బతుకమ్మ అని నామకరణం చేస్తుంది. అంద చందాలతో యవ్వనవతి అయిన బతుకమ్మను విష్ణుమూర్తి చక్రాంక పేరుతో వివాహమాడుతాడు. వారికి ఆరువేల మంది అతి చక్కని ధైర్యసాహసాలు గల పిల్లలు పుడతారు. సుఖసంతోషాలతో వీరంతా ఉంటుండేవారు. అది బతుకమ్మ పుట్టి పెరిగిన విధం. చోళరాజు ధర్మాంగకు కానీ, ఆయన కుటుంబానికి కానీ వరంగల్, తెలంగాణ ప్రాంతానికున్న సంబంధం గురించిన వివరాలు చరిత్రలో అంతగా లేవు.

         చరిత్రలో ఏం చెప్పినా ఇప్పటికీ ఎవరైనా దంపతులకు పుట్టిన పిల్లలందరూ వరుసగా చనిపోతుంటే ఆ తరువాత పుట్టిన బిడ్డకు బతుకమ్మ అని నామకరణం చేసే సంప్రదాయం తెలంగాణలో చాలాచోట్ల ఉంది. బతుకమ్మను ఆరాధిస్తూ కొలుస్తూ పాడే పాటల్లో కేవలం లక్ష్మీదేవి వర్ణనే కాకుండా గౌరి, సరస్వతుల వర్ణన కూడా ఉండడమంటే బహుశా ఆమెను త్రిమూర్తిణి గా భావించడమేమో. బతుకమ్మను కొలుస్తూ ఆ పండగప్పుడు ఆడుతూ ఎన్నోపాటలు పాడుతుంటారు స్త్రీలు. ప్రతి పాట చివర చరణంలో చివరగా ‘కోలు’ అనో, ‘ఉయ్యాల’ అనో, ‘చందమామ’ అనో, ‘గౌరమ్మా’ అనో ఉంటుంది. బతుకమ్మను కొలిచే విధానం, దానికి కావలసిన సన్నాహాలు ఎలా చేసుకోవాలి ఒకటి-రెండు పాటల్లో వివరంగా ఉన్నాయి.

         బతుకమ్మను ఆడేటప్పుడు పాటలు పాడుతూ ఆడతుంటారు. కోలాటం, కథ చెప్పుకోవడం, బిస్తీ గీయడం, చెమ్మచెక్కలాడడం బతుకమ్మ పండుగలో భాగం. పాటల్లో-కథలోని ప్రధానాంశం ఆడపిల్ల అత్తగారింట్లో ఎలా మసులుకోవాలో మొగుడితో ఎలా ఉండాలో, మెట్టినింటి గౌరవ మర్యాదలు ఎలా కాపాడుకోవాలో ఉంటుంది. ఈ రీతిగా ఆడపిల్లలకు బుద్దులు నేర్పడం పూర్వాకాలం సంప్రదాయం. బతుకమ్మ బొమ్మను ఉంచాల్సిన పళ్లెం ఆకులతో కానీ, వెదురుతో కానీ చేయాలంటారు. గుమ్మడిపూలు పళ్లెంలో అమర్చి, చుట్టూ ఇతర పూలను చేర్చి పసుపుతో తయారుచేసిన బతుకమ్మను (గౌరమ్మ) ఉంచుతారు. ఈ మొత్తం బతుకను ఒక స్థలంలో ఉంచి సంప్రదాయ రీతిగా పూజిస్తారు. ఇలాంటి మరికొందరు తయారుచేసిన బతుకమ్మలను ఓ చోట చేర్చి స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ లయబద్దంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుకుంటారు. ఓ గుడి ముందో, ఎవరైనా ఇంటి ముందో దీనికి అనువుగా ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకుంటారు.

ఎనిమిది రోజుల పాటు.. అమావాస్య రోజున ఎంగిలి పువ్వుతో మొదలుపెట్టి ఇలా ఎవరో ఒకరింటి ముందర చేసి తొమ్మిదో రోజున సమీపంలోని ఏటి ఒడ్డునో, నది ఒడ్డునో, చెరువు దగ్గరో చద్దుల బ్రతుకమ్మగా ఆడి నీటి ఒడిలో ఆమెను చేరుస్తారు. అంటే అత్తగారింటికి సాగనంపుతారన్నమాట. కంటికీ చెవికీ విందు కలిగించే పండుగ బతుకమ్మ.  చక్కటి చీరలు ధరించి అతి చక్కగా తయారయిన స్త్రీలు భక్తిశ్రద్ధలతో పాటలు పాడుకుంటూ బతుకమ్మను ఊరేగింపుగా తీసుకెళతారు. మంచి కంఠమున్న ఓ పెద్ద ముత్తయిదువ పాటను ఆరంభిస్తే మిగిలిన వారందరూ ఆమెతో గొంతు కలుపుతుంటారు. పురుషులు వారికి తోడుగా పోయి ఆ పాటలను ఆస్వాదిస్తారు.

         ప్రసాదం లేకుండా పండుగే లేదు. ఐదు రకాల ప్రసాదాలను (పెసరపప్పు, గోధుమపిండి, బియ్యం పిండి, కొబ్బరి, అల్లంతో తయారుచేసినవి) ఈ పండుగలో పంచిపెడతారు. లోగడ జగడాలాడి మాటలు కలవని స్త్రీలు కూడా అవన్నీ మర్చిపోయి బతుకమ్మ పండుగలో మళ్లీ స్నేహితులవుతారు. ఒకప్పుడు తెలంగాణ మొత్తం విరివిగా ఆడే బతుకమ్మ, నగరాల్లో దరిమిలా దాదాపు కనుమరుగై, గ్రామాల్లో కూడా అదే స్థితికి చేరుకుని, మళ్లీ ఇటీవలే తెలంగాణ జాగృతి పుణ్యమా అని గత వైభవాన్ని గుర్తుకు చేస్తోంది.

         ఏ పండుగయినా, పబ్బమయినా జరుపుకునేది ఆహ్లాదం కొరకే. మానవాళి అంతటికీ దైనందిన, యాంత్రిక, మార్పులేని జీవితంతో విసుగెత్తడం సహజం. ఇటువంటి జీవితానికి ఎప్పుడో అప్పుడు ఎడంగా ఉంటాలంటే పండుగల లాంటివి అవసరం. ప్రతిరోజు శలవుదినమైనా జీవితం దుర్భరమవుతుంది. అందుకే వారంలోని కొన్ని రోజులు శలవుదినాలని, కొన్ని పనిదినాలని భావిస్తాం. కొన్ని రోజులు ప్రార్థనకు పరిమితమయితే మరికొన్ని రోజులు ఆనందంతో గెంతులు వేయాలి కదా. అడప దడప పదిమందితో కలసి మెలసి ఆనందించాలంటే పండుగలు కావాలి. తరాలు, అంతరాలు అనే భేదం లేకుండా కులమతాలకతీతంగా ఆస్తులు, అంతస్తులకు దూరంగా డాబు, దర్పం, హక్కులకు తావీయకుండా సమాజంలో అందరు వ్యక్తులు ఏదో ఒక కార్యక్రమంలో సహజీవనం చేయాలి. అదే పండుగ. అలాంటి పండుగలలో అతి ప్రధానమైనవి దసరా, బతుకమ్మ. దేవతారాధన పేరుతో మనం ఇస్తున్న నైవేద్యం స్వర్గంలో ఉన్న దేవుళ్లకు చేరాలంటే దసరా, బతుకమ్మ లాంటి పండుగలు జరుపుకుని సమాజంలో కలసి మెలసి బతకాలి. అది కొంతసేపే కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, అయినా తప్పనిసరి.

Sunday, October 14, 2018

సముద్రాన్ని లంఘించి కపులకు సీత జాడ చెప్పిన హనుమ ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


సముద్రాన్ని లంఘించి కపులకు సీత జాడ చెప్పిన హనుమ
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (15-10-2018)

అపరిమిత శక్తిగల హనుమంతుడు, వింటినారినుండి విడువబడిన బాణంలా పోయి, మేఘంలా వున్న మహేంద్ర పర్వతాన్ని చూసి, దిక్కులు దద్దరిల్లేటట్లు ఉరుములాగా సింహనాదం చేశాడు. మొదట లంకకు బయల్దేరే ముందు వానరులతో తాను రాఘవుడి కోదండం నుండి వెడలి లక్ష్యాన్ని భేదించి, తిరిగి వచ్చి రాముడికి ప్రదక్షిణం చేసి విధేయంగా వెళ్లి రాముడి అంబులపొదిలో ముచ్చటగా చేరే రామబాణంలాగా వెళ్లి వస్తానంటాడు హనుమంతుడు. స్నేహితులను చూడడానికి తొందరపడుతున్న హనుమంతుడు, తోకజాడించి, విదిలించేసరికి, ఆ అద్భుత ధ్వనికి, సూర్యుడితో కలిసి వున్న ఆకాశం బద్దలయిందేమోననిపించింది.

హనుమంతుడి సింహనాదం, ఆయన తొడలవేగానికి వాటి సందులోనుండి దూరి వెడలిన గాలి ధ్వని, ఆవలి ఒడ్డున వుండి, దిగులుపడుతూ, ఎప్పుడు హనుమంతుడిని చూస్తామా అని ఎదురుచూస్తున్న కోతులు విని సంతోషించారు. హనుమంతుడు పోయిన పనిని చేసుకొస్తున్నాడనీ, అందుకే,  "జై-జై" నాదం చేస్తున్నాడనీ అంటాడు జాంబవంతుడు వానరులతో.

"సందేహంలేదు. హనుమంతుడు కార్యం సాధించాడు. ఆయన చేసిన ధ్వనే దాన్ని సూచిస్తున్నది. కార్యం సాధించనివాడు, ఇంత ఉత్సాహంగా సింహనాదం చేయడు" అని జాంబవంతుడు ఇతరులకు చెప్పగా, వారందరూ హనుమంతుడు వస్తున్నాడని సంతోషిస్తూ, స్నేహితుడిని చూడాలన్న ఆత్రంతో, ఆయన ధ్వనిని వింటూ గంతులేసారు. వస్తున్న హనుమంతుడిని దూరాన్నుండే చూడాలన్న కోరికతో, ఒక శిఖరాన్నుండి అంతకంటే ఎత్తైన మరో శిఖరానికీ, ఒక చెట్టునుండి అంతకంటే ఎత్తైన ఇంకో చెట్టుమీదకూ, కొమ్మనుండి కొమ్మపైకీ, కిలకిలా అరుచుకుంటూ దూకసాగారు వానరులందరూ. తాము ఫలానా చోటున్నామని ఇతరులకు తెలపటానికి, పూచిన కొమ్మలను, చేతుల్లోని గుడ్డలను వూపుతూ ఆనందించసాగారు వారంతా.

కొండగుహల్లో దాక్కుని, అమిత వేగంతో ధ్వనిస్తూ బయటకొచ్చే గాలిలా, సింహనాదం చేస్తూ హనుమంతుడొచ్చాడు. ఆ అకాశమార్గాన, మేఘంలా వస్తున్న హనుమంతుడిని చూస్తూ, ఆకాశంవైపు చేతులు జోడించి నిల్చున్నారు వానరులందరూ.

కొండంత దేహమున్న హనుమంతుడు, అతివేగంతో వస్తున్నందున, వృక్షాలతో నిండిన మహేంద్రగిరి రాళ్ల మీద దూకితే గాయపడ్తానన్న ఆలోచనతో, కొండపక్కనున్న నీళ్లల్లో రెక్కలు తెగిన పర్వతంలాగా ఢభీలున పడ్డాడు. సంతోషించిన వానరయూధాలు, ఆంజనేయుడు ఏం చెప్పబోతున్నాడో విందామని, అతన్నే చూస్తూ, అతడి చుట్టూ మూగారు. ఏ గాయం లేకుండా, దేహబాధ లేకుండా వున్న హనుమంతుడిని చూసి, వ్రేళ్లు, పళ్లు కానుకలుగా ఇచ్చి ఆయన దగ్గరకు చేరారు మిత్రులందరూ. జ్ఞానవృధ్ధుడు, వయోవృధ్ధుడైన జాంబవంతుడికీ, యువరాజైన అంగదుడికీ, తనకంటే వయసులో పెద్దవారికీ, భక్తితో నమస్కరించాడు హనుమంతుడు.

(హనుమంతుడు పెద్దలకు, వృధ్ధులకు నమస్కరించాడంటే, దానికీ సరైన కారణముంది. ఒక గ్రామంలో వున్న వాళ్లలో, తన కంటే పదేళ్ళు పెద్దవారైతే వారిని "సఖులు" అంటారు. అంతకుపైబడ్డ వారందరు "పెద్దవాళ్లు". గీతాదివిద్యలు నేర్చినవారు, తనకంటే ఐదేళ్ళు పెద్దవారైతే "సఖుడే". అంతకన్న ఎక్కువ వయస్సుంటే, పెద్దవాడని పిలుస్తారు. వేదాలు చదివిన వాడు, మూడేళ్ళు పెద్దైతే, సఖుడు, అంతకంటే పెద్దైతే పెద్దవాడు. తనవంశంవారిలో అన్నల్లాంటివారు పెద్దైనా సఖులే. అధికులందరూ అందుకే నమస్కారానికి అర్హులు).


ఏం చెప్తాడో విందామని తహతహలాడ్తున్న వానరుల మనస్సు కుదుట పడేటట్లు రెండే-రెండు మాటలు చెప్తాడు ఆరంభంలో: "చూచితి-సీత"నని. ఆ తర్వాత అంగదుడి చేయిపట్టుకుని, మహేంద్ర పర్వతం మీద, అందరూ కూర్చునే వీలున్న రమ్యమైన ప్రదేశానికి తీసుకుపోతాడు. ఆప్పుడందరూ వింటూ వుండగా: "దయాహీనులైన రాక్షసస్త్రీల రక్షణలో వున్న సీతను చూసాను. అశోకవనంలో, భర్తను చూడాలన్న కోరికతో, ఆ పతివ్రత మాసిపోయిన వెంట్రుకలతో, ఆహారంలేక శుష్కించింది" అనగానే అమృత సమానమైన ఆమాటలకు పోయిన ప్రాణాలు తిరిగొచ్చినట్లు సంతోషంతో, మిగిలినదంతా వినే ఓపికలేక ఎగురసాగారు కొందరు. మరి కొందరురు గెంతులేశారు. ఇంకొందరు కిలకిలా అరుచుకుంటూ, తోకలను నేలకేసికొట్టారు.

హనుమంతుడి సమీపంలో వుండి వింటున్నవారు, వెంటనే చెట్లమీదనుండి దూకి, హనుమంతుడిని కౌగలించుకుని, "తండ్రీ బ్రతికించావు" అని అరిచారు. కోతుల మధ్యనున్న అంగదుడు హనుమంతుడితో, "ఇంతపెద్ద సముద్రాన్ని దాటిపోయి, సుఖంగా తిరిగి రాగలవాడెవరున్నారు నీవు తప్ప! వేగంలో, బలంలో నీతో సమానులెవరూ లేరు. నీ ప్రభుభక్తి, శక్తి, ధైర్యం, ఆశ్చర్యకరమైంది. మా అదృష్టం కొద్దీ, నువ్వు శ్రీరాముడి భార్యను, పతివ్రతైన సీతాదేవిని చూసావు. సీతను విడిచి వున్నందున, రాముడికి కలిగిన శోకం అదృష్టం కొద్దీ పోయిందిక. నీవెట్లా పోయావో, ఏం చేసావో, ఎట్లా చూసావో, అదంతా వివరంగా చెప్పాలి. సముద్రాన్నెట్లా దాటింది, లంకలోకెట్లా ప్రవేశించింది, సీతనెట్లా చూసింది, రావణుడెట్లా కనిపించింది, అదంతా వివరంగా చెప్పు" అని అడుగుతాడు. ఆ సమయంలో అంగదుడు, హనుమంతుడు వున్న మహేంద్రగిరి పర్వతం వారిరువురివల్ల ప్రకాశించింది.

లంకకు పోయివచ్చిన వృత్తాంతమంతా హనుమంతుడు, ఇంతవరకు సుందరకాండలో చెప్పబడిన విషయమంతా, దండకంగా చెప్పాడు హనుమంతుడు.

దీంట్లో "త్రిజట" వాక్యాలను నమ్మి, రాక్షస స్త్రీలు సీతాదేవిని శరణాగతి కోరినట్లు, ఆమె వారికి అభయ ప్రదానం చేసినట్లు చెప్పాడు. అయితే, తననే రక్షించుకోలేని సీతాదేవి, తనను చెరనుండి తప్పించమని హనుమంతుడిని కోరుకున్న సీతాదేవి, ఇతరులనెట్లు రక్షించగలదన్న సందేహం కలగొచ్చు.

సీతాదేవి తనను తాను కాపాడుకోలేక హనుమంతుడిని ప్రార్థించడం జరగలేదు. అలా అనుకోవడం సమంజసం కాదు. లంకంతా సీతాదేవి తప ప్రభావం వల్ల దగ్దమైపోయిందనీ, రామచంద్రమూర్తి నిమిత్త మాత్రుడేననీ, హనుమంతుడు చెప్పాడు. తనను తాను రక్షించుకున్నా, హనుమంతుడు రక్షించినా, రామచంద్రమూర్తికి అపకీర్తి వస్తుందని ఆప్రయత్నం మానుకుంది సీతాదేవి.

సీతాదేవి అభయప్రదానం చేస్తూ, తాను రక్షించ గలిగినా, ఆ అధికారం తనకున్నదని స్వతంత్రించి చెప్పకూడదు కదా! అంటే సీతాదేవిలో "ఉపాయం" వుందేకాని, "ఉపేయం" లేదన్న మరో సందేహం రావడం కూడా సబబు కాదు. లక్ష్మీనారాయణులు, సీతారాములు, వేరు వేరు దంపతులు కానేకారు. లక్ష్మీదేవి, భగవంతుడి కరుణా శక్తే!

(వేదాంత దేశికులనే మహానుభావులు భగవంతుడిలో ఉన్న దయ అనే విశిష్ట గుణాన్ని దయాదేవి గా, శ్రీదేవి గా, చైతన్యస్తన్యదాయినీగా, శ్రీనివాసుడి ప్రేయసిగా, కరుణారూపిణిగా అభివర్ణించారు. లక్ష్మి రక్షించినా, నారాయణుడు రక్షించినా, సీత రక్షించినా, రాముడు రక్షించినా ఒకటే! రాముడు లేని కరుణ రక్షించలేదు. కరుణ లేని రాముడూ రక్షించలేడు. కృప రక్షించింది అంటే రాముడు రక్షించినట్లే! సీత, లక్ష్మి, కరుణ, కృప, దయ: ఇవన్నీ పర్యాయ పదాలే! అందుకే భక్తులు, లక్ష్మీ విశిష్ట నారాయణుడినీ, సీతా విశిష్ట రాముడినీ ఉపాసించాలని శాస్త్రాలు చెప్పుతున్నాయి. ఒకరి పేరు చెప్పితే రెండవ వారున్నట్లే! సీతతో పనిలేదు, రాముడు చాలుననీ, లేక, రాముడితో పనిలేదు, సీత చాలుననీ అనరాదు. ఎండలేని సూర్యుడు, వెన్నెల లేని చంద్రుడు, అలల్లేని సముద్రాన్ని అనుభవించలేం.

"అహం" భగవంతుడైతే, "అహంత" లక్ష్మీదేవౌతుంది. సీతాదేవి అనుగ్రహించిన వారిని రాముడూ అనుగ్రహించినందు వల్ల ఆమెలో "ఉపాయత్వం" వున్నదనీ, రాక్షస స్త్రీలను ఆమె కాపాడినందు వల్ల ఆమెలో "ఉపేయత్వం" (స్వతంత్ర రక్షణ శక్తి) వుందనీ తెల్సుకోవాలి. అందువల్లనే మిధున కైంకర్యం శ్రేష్టమన్నారు. సీతారాములలో, లక్ష్మీనారాయణులలో ఏ ఒక్కరినో ఆశ్రయించ కూడదు.  శూర్పనఖ రాముడినే కోరింది, సీతమ్మను కాదన్నది. ఫలితం ముక్కూ-చెవులూ తెగినాయి. రావణుడు సీతమ్మను కోరాడు, రాముడిని విడిచాడు. పది తలలు తెగి కింద పడిపోయాయి. హనుమంతుడు సీతారాములను కోరుకున్నాడు. సీతారామానుగ్రహ లబ్ది పొందాడు. చిరంజీవి అయినాడు. కనుక మిధున (దంపత్సమేతంగా) కైంకర్యాన్నే కోరుకోవాలంటారు మన పెద్దలు.

Saturday, October 13, 2018

శూర్ఫణఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడు....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-30:వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-30
శూర్ఫణఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (14-10-2018)

అని శూర్పణఖ చెప్పగా, కామవశమైన ఆ రాక్షసి మాటలకు నేర్పుగల శ్రీరామచంద్రమూర్తి, కోపపడకుండా, మెత్తటి మాటలతో సందేహం కలగకుండా, తాను చెప్పేది స్పష్టంగా అర్థమయ్యేట్లు చెప్పాడిలా ఆమెకు. "రాకాసీ! దీనిని ముందు పెళ్లి చేసుకున్నాను. అయినా ఏంటంటావా? ఇప్పుడు ప్రియురాలైన దీనిని నేనెలా విడుస్తాను? అది ధర్మం కాదే? అది వుండవచ్చు...నువ్వూ వుండవచ్చు అంటావా? నీలాంటి అద్భుతమైన అందగత్తెకు సవతి పోరు వుండకూడదు. కాబట్టి నీకు దుఃఖం కలగక తప్పదు.నున్ని దుఃఖ పెట్టడానికా పెళ్లి చేకోవడం? కాబట్టి నామీద భ్రాంతి వదిలిపెట్టు. నువ్వు కామం నిలుపలేనని అంటావా? ఇదిగో వీడిని చూడు. మంచి శీలం కలవాడు. నా తమ్ముడు. చూడడానికి ప్రియమైన వాడు. సహించరాని తేజం కలవాడు. లక్ష్మణుడనే పేరుకలవాడు. ఈ లక్ష్మణుడు భార్య లేనివాడు. అసమాన శౌర్యవంతుడు. సమర్థుడు. యౌవనంలో వున్నాడు. అందగాడు. ఇదివరకు భార్యా సుఖం తెలియనివాడు. భార్య కావాలని కోరుతున్నాడు. నీ అందమైన రూపం చూడగానే వీడు నీకు పతిత్వయోగ్యుడు అవుతాడు. పూబోడీ! సవతి పోరులేకుండా అతడిని భజించు”.

అని శ్రీరామచంద్రుడు చెప్పగా విని ఆ రాక్షసి, రామ మోహం కళ్లకు కప్పి వుండడం వల్ల, తన విధవాగర్భాదాన నూతన మహోత్సవం నిమిషమైనా ఆలశ్యం కావడానికి సహించలేక, లక్ష్మణుడితో "ఓయీ అందగాడా! నీ చక్కదనానికి సరైన అందగత్తెను నేనే. నీకు పెళ్లాం అవుతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకో. వనాలలో,కొండలలో సంచారం చేద్దామా? రా..పోదాం" అన్నది. శ్రీరామచంద్రమూర్తి పరిహాసంగా మాట్లాడిన భావం తెలుసుకొన్న లక్ష్మణుడు, తానూ శూర్పణఖతో పరిహాసంగానే మాట్లాడాడు. "ఓసీ! వెర్రి పిల్లా! నేను బానిసను. నన్ను పెళ్లి చేసుకొని నువ్వు కూడా బానిసవై వీరి సేవ చేస్తావా? నీ చక్కదనానికి నువ్వు బానిసగా వుంటావా? ఈ మహాత్ముడుకి నేను బంటుగా సేవ చేస్తున్న సంగతి నీకు తెలియదేమో? నీకు తెలిసే అవకాశం లేదు. తెలుస్తే, నేనేంటి...బానిసను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అనుకొనేదానివి. అలాంటి సమృద్ధమైన అర్థం కలవాడిని నువ్వే సంతోషపెట్టగలవు. నిర్మలకాంటి కలదానివి కాబట్టి, నువ్వు, ఆయన్నే వరిస్తే నువ్వు చిన్న భార్యవై,కులుకుతూ ముద్దులొలకవచ్చు. మగవారికి పెద్ద భార్య మీద కంటే చిన్న భార్యమీదే ప్రేమ ఎక్కవ కదా! ఈ మాత్రం ఆలోచించలేవా? నిన్నేమనాలి? ఇలాంటి వికార స్వరూపం గలదానిని, భయంకర స్వరూపం వున్నదానిని, ఆ సవతిని, పెద్ద పొట్టకలదానిని, ముసలిదానిని, జానకిని నెట్టి నిన్ను భార్యగా గ్రహిస్తాడు. ఇలాంటి పరమ సుందరిని వదిలి ఎవరు మనుష్య స్త్రీకొరకు వేడుక పడతాడు?" అని లక్ష్మణుడు పలికాడు శూర్పణఖతో.


లక్ష్మణుడు చెప్పిన మాటలు పరిహాస వచనాలని తెలుసుకోలేని ఆ బుద్ధిహీన, నిజమని నమ్మి, పర్ణశాలలో సీతతో వున్న శ్రీరామచంద్రుడి దగ్గరకు పోయి మదనతాపంతో ఇలా అంది: "ఈ విరూపను, సవతిని, ఈ కరాళను, నిర్ణతోదరిని గ్రహించి నువ్వు నన్ను గౌరవించడం లేదు. కాబట్టి దీన్ని ఇప్పుడే మింగి సవతిపోరు లేకుండా సుఖపడతాను". ఇలా అంటూ శూర్పణఖ జింకపిల్ల కళ్లలాంటి కళ్లున్న సీతమీద దూకింది. ఇది చూసిన శ్రీరాముడు దాన్ని బిగపట్టి, కోపంతో లక్ష్మణుడితో "లక్ష్మణా! నీచులతో పరిహాసం ఆడడం తప్పు. అలా మనం చేసినందువల్ల కష్టం కలిగింది. దీనివాత పడకుండా సీతాదేవి ఎలా బతికి సుఖంగా వుంటుందో ఆలోచించు. ఇది స్త్రీ. ఆయుధం ధరించి యుద్ధానికి వచ్చింది కాదు. కాబట్టి చంపకూడదు. దీన్ని, బలగర్వంతో దేహం తెలియనిదాన్ని, రాకాసిని పట్టుకొని విరూపగా చేయి" అన్నాడు. అప్పుడు శూర్ఫణఖ కంటే మహాబలశాలి అయిన లక్ష్మణుడు తటాలున కత్తి దూసి, అది ఎదిరించినా వదలక, దాని ముక్కు, చెవులు కోశాడు.

ముక్కు-చెవులు ఈ విధంగా మొక్కలు పోగా, లబలబ నోరు కొట్టుకుంటూ, రొమ్ము గుద్దుకుంటూ, వానాకాలంలోని మేఘం అదిరినట్లు, అడవి ప్రతిధ్వనించేట్లు, పెద్ద ధ్వనితో బొబ్బలు పెట్టుకుంటూ, నెత్తురు కారుతుంటే, వికార రూపం మరింత వికారం కాగా, మనుష్యులు తనను ఇలా చేశారే, నలుగురిలో నవ్వుల పాలైతిని కదా అని ఆక్రోశంతో ఏడుస్తూ అడవుల్లో పడి వేగంగా పరుగెత్తింది. 

ఇలా పరుగెత్తుకుంటూ పోయి జనస్థానంలో రాక్షసుల మధ్యన వున్న తమ్ముడు ఖరుడిని చూసి, ఏడుపు ధ్వనితో ఆకాశం నుండి పిడుగుపడ్డట్లు ధభీలున నేలమీదపడి పెద్దపెట్టున ఏడ్చింది.

Sunday, October 7, 2018

సీతాదేవిని మళ్లీ సందర్శించి శలవు తీసుకున్న హనుమ .... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


సీతాదేవిని మళ్లీ సందర్శించి శలవు తీసుకున్న హనుమ
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (08-10-2018)

ఇలా తలచిన హనుమంతుడు, సీతాదేవి వుండే ప్రదేశానికి పోయి, శింశుపావృక్షం కిందున్న ఆమెకు నమస్కరించి, తను చేసిన పూర్వ పుణ్యఫలంవల్ల, క్షేమంగా వున్న సీతను మళ్లా దర్శించే భాగ్యం తనకు కలిగిందని చెప్తూ, తన ప్రభుకార్యం ఏదెట్లా చేయాలో, ఎట్లా జరగాలో అవన్నీ అలానే చేయడం జరిగిందని అంటాడు.

(సీతాదేవి మాత్రమే క్షేమంగా వుండడమే కాకుండా, ఆమెను ఆశ్రయించిన కారణం వల్ల, శింశుపావృక్షం, అశోక వృక్షాలతో సహా వాటి చుట్టు ప్రక్కలున్న చెట్లు కూడా కాలిపోక, విరిగిపోక నిల్చి వున్నై. సీతారాములనాశ్రయించిన వారే కాకుండా, వారిని ఆశ్రయించిన వారు కూడా చెడరని దీనివల్ల స్పష్టమైంది. విభీషణుడే కాకుండా, ఆయన వెంట వచ్చిన వారందర్నీ రక్షిస్తాడు శ్రీరాముడు. విష్ణు భక్తులను ఆశ్రయించిన పశు-పక్ష్యాదులు, మనుష్యులు కూడా వారి వెంట విష్ణుని పరమపదానికి పోతారు).

ఇలాచెప్పి బయల్దేరబోతున్న హనుమంతుడితో, తనభర్తపై తనకున్న ప్రేమను తెలిపే వాక్యాలను మరోసారి చెప్పింది సీతాదేవి ఆయనతో. తాననుకున్న రీతిలో, శ్రీరాముడికి చెప్పి, ఇక్కడకు తీసుకునిరాగల సమర్ధుడు ఆంజనేయుడొక్కడేనని అంటుంది సీతాదేవి. చేయబోయె కార్యాన్ని తన బలాధిక్యంతో, శత్రువులను వధించే శక్తియుక్తులతో సాధించగల శక్తి కలవాడనికూడా అంటుంది. ఆయనకంటే గొప్పవారు సుగ్రీవుడి దగ్గరున్నారని తన బరువు తగ్గించుకొనే ప్రయత్నం చేయవద్దనికూడా చెప్తుంది. ఎందరున్నా ఈ కార్యభారం తనమీదే వేసుకోవాలని ఆంజనేయుడిని మరీమరీ కోరుతుంది సీతాదేవి.

అణకువతో  సకారణంగా, దోషరహితంగా అర్ధం స్ఫురిస్తూ, సీతచెప్పిన ఆ మాటలకు సరైన రీతిలో స్పందిస్తాడు ఆంజనేయుడు. రామచంద్రమూర్తి వానర సైన్యంతో సముద్రాన్ని దాటివచ్చి, రాక్షసుల పొగరణచి, ఆమె శోకాన్ని నిర్మూలిస్తాడనీ, తనమాటలు నమ్మమనీ, దిగులుపడవద్దనీ సీతకు ఓదార్పు వచనాలు చెప్తాడు హనుమంతుడు. సాహసంచేసి, అపాయం కలిగే ఎటువంటి పనీ చేయవద్దని సీతకు చెప్పి, తానిప్పుడే రామచంద్రమూర్తిని చూడబోతున్నానని, ఆమె అనుజ్ఞ కోరుతూ ఆమెకు నమస్కరిస్తాడు.


సీత అనుమతి తీసుకుని, ఆమెకు అభివాదం చేసి, ఆశీర్వాదాన్ని పొందిన హనుమంతుడు, రాముడి దర్శనం త్వరలో చేసుకోవాలన్న కోరికతో అరిష్టమనే పేరున్న కొండనెక్కాడు. అరిష్ట పర్వతం అందచందాలు వర్ణనాతీతం. విశేషమైన తీగలతో, చెట్లతో, సింహధ్వనులను పోలిన పొడుగాటి గుహలతో, యక్షసంఘాలు, గంధర్వులు, మునులు, పాములు, తియ్యటి కందమూలాలున్న పర్వతమది. ఎత్తైన తామర రంగు చెట్లున్న నల్లటి ఉద్యానవనం ధోవతిలాగా, శిఖరాల మధ్య వ్రేలాడే మేఘాలు ఉత్తరీయంలాగా, సూర్యకిరణాలతో మెలకువ వచ్చి, రెప్పలు తెరిచి చూస్తున్న ధాతువులు నేత్రాలుగా, సెలయేళ్ల గంభీరధ్వనులు వేదాభ్యాసం చేస్తున్నరీతిలో, ఊటనీరు చప్పుళ్లు మనోహర సంగీతంలా, దేవదారు వృక్షాలు ఎత్తిన చేతుల్లాగా కనిపిస్తున్నదా పర్వతం. నలుపురంగు పుష్పాలతో, శరత్కాల మేఘాలకు ముసలిదానిలాగ వణకుతున్నదా పర్వతం. వెదురుబొంగుల్లోంచి వస్తున్న గాలి, కోకిల పంచమ ధ్వనిలాగా వుందక్కడ. పాములు బుసకొట్టే నెపంతో, హనుమంతుడిపై శ్వాస విడుస్తున్నాయా కొండమీద. ఆసాంతం మంచుతోనిండి, గంభీరమైన గుహలు ధ్యానం చేస్తున్నట్లుగా వుందక్కడ. మేఘాలు ప్రాకగల గుట్టలున్నాయక్కడ. మద్ది, తాటి, ఇనుమద్ది, వెదురుచెట్లతో నిండి వున్నదా అరిష్టాద్రి.

అరిష్టాద్రిపైనెక్కిన హనుమంతుడి కాళ్లరాపిడికి, రాళ్లు పొడిపొడవుతుంటే, "కొలువాసాలు"అనే చేపలు, పాములూ, వున్న భయంకరమైన సముద్రాన్ని దాటే ప్రయత్నం చేసాడు హనుమంతుడక్కడినుండి. సముద్రపు ఉత్తరగట్టు చేరేందుకు, ఆ పర్వతం మీదనుండి సన్నధ్ధుడవుతున్న హనుమంతుడి కాళ్లతొక్కిడికి, అక్కడున్న అడవిజంతువులు తత్తరలాడాయి. పూలగుత్తులున్న చెట్లన్నీ నేలకూలాయి. కొండగుహల్లో వున్న సింహాలన్నీ బెదిరిపోయి దిక్కులు పిక్కటిల్లేటట్లు ధ్వని చేసాయి. వేగంగా పోతున్న అతడి తొడలతాకిడికి పూచిన పూల చెట్లన్నీ, పిడుగుపడ్డ చెట్ల మాదిరిగా కూలి విరిగిపోయాయి. ఆయన వేగానికి భయపడ్డ కొండసింహాలు, గుహల్లోకి పారిపోయి, అందులో చిక్కుకుని, తబ్బిబ్బై, దిక్కులు పగిలిపోయేటట్లు అరవసాగాయి. చీరలు జారుతుంటే, పైటలు వేలాడుతుంటే, ఆభరణాలు ఒకదానికొకటి పెనవేసుకుని రాసుకుంటుంటే, కలత చెందిన ఆ కొండలోని, విధ్యాధర స్త్రీలు అక్కడినుండి వెళ్లిపోయారు వేగాతివేగంగా.

హనుమంతుడు సముద్రాన్ని దాటేందుకు, ఆకాశానికి లంఘించి ఎగరగానే, అక్కడున్న విషం జ్వలించే సర్పాలు సందుల్లోకి దొర్లిపోయాయి. కిన్నరులు, పన్నగులు, యక్షులు, కింపురుషులు ఆ పర్వతాన్ని వదిలి ఆకాశానికి ఎగిరారు. చెట్లతో, శిఖరాలతో, ఎత్తుగా వున్న ఆ పర్వతం పాతాళానికి దిగబడింది. పదియోజనాల వెడల్పు, ముఫ్పై యోజనాల ఎత్తున్న ఆ పర్వతం నిమిషంలో నేల మట్టమైంది. 

ఆకాశ మార్గంలో పోతున్న హనుమంతుడు, సముద్రంలో పోతున్న నావలా వున్నాడు. సూర్యుడనే నీరుకోడిని, చంద్రుడనే తెల్లకలువను, పుష్యమి, శ్రవణ నక్శత్రాలనబడే హంసలను, మేఘాలనబడే పాచిపచ్చికను, పునర్వసు నక్షత్రమనే పెద్ద చేపను, అంగారకుడనే మొసలిని, ఐరావతమనే దీవిని, స్వాతి అనే హంసను, గాలికి కలిగే అలలనే మేఘాన్ని, సిద్ధులు, యక్షులు, సర్పాలు, గంధర్వులతో వికసించిన తామర రేకుల్లాగున్న ఆకాశమనే సముద్రాన్ని నావదాటినట్లు దాటిపోతున్నాడు హనుమంతుడు. అమిత తేజస్సుగల హనుమంతుడి దేహంతాకిడికి మేఘాలు, తెల్లగా కొన్ని, ఎర్రగా కొన్ని, పసుపు, నలుపు కలయికగా ఇంకొన్ని, ఎరుపు-నలుపు కలయికగా మరికొన్ని కనిపించాయి. మేఘాలమధ్య దూరిన చంద్రుడు కనిపించీ-కనిపించక వున్నరీతిలోనే, హనుమంతుడు కూడా మబ్బుల్లో దోబూచులాడుకుంటూ పోతున్నాడు. తెల్లటి వస్త్రాలు ధరించిన హనుమంతుడు, మేఘాలమధ్య చుట్టుకున్నప్పుడు ఆకాశంలోని చంద్రుడిలా, మేఘాలను చీలుస్తున్నప్పుడు ఆకాశంలో వెళ్తున్న గరుత్మంతుడిలా కనిపించాడు.

Saturday, October 6, 2018

శ్రీరాముడిని చూసి మోహించిన శూర్పణఖ ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-29 : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడిని చూసి మోహించిన శూర్పణఖ
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-29
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (07-10-2018)

(వనవాసం చేయాల్సిన పద్నాలుగు సంవత్సరాలలో ఇప్పుడు పదమూడవ సంవత్సరం గడుస్తున్నది. అందులో ఇది మార్గశిర మాసం).

కళ్యాణ గునాలతో ప్రసిద్ధికెక్కిన శ్రీరామచంద్రమూర్తి, సీతాలక్ష్మణులతో కూడి గోదావరీ నదీ స్నానం చేసి, తన తపోవనం చేరి, అక్కడ నిష్ఠగా ప్రాతఃకాల కృత్యాలను ఆశ్రమానికి బయటే తీర్చి, పర్ణసాలలో సీత, తాను, లక్ష్మణుడు, పూర్వుల-పెద్దల కథలు చెప్పుకుంటూ ముచ్చటించుకుంటుండగా, శ్రీరాముడు చిత్రా నక్షత్రంతో కూడిన చంద్రుడిలాగా ప్రకాశించాడు. కథలు చెప్తున్న విష్ణు సన్నిభుడైన శ్రీరాముడిని, అప్పుడు, రావణాసురుడి చెల్లెలు శూర్పణక చూసి ఆశ్రమంలో ప్రవేశించింది.

సింహం రొమ్ములాంటి విశాలమైన రొమ్ముకలవాడిని, తామర రేకలలాంటి కళ్లు కలవాడిని, ఎడతెగని ఉత్సాహంకలవాడిని, దీర్ఘంగా మోకాళ్లనంటే చేతులు కలవాడిని, అందంగా ప్రకాశించే ముఖం కలవాడిని, సత్పురుషులతో ఉపాసించబడే వాడిని, ఇంద్రుడితో సమానుడిని, ఏనుగు నడకలాంటి నడక కలవాడిని, కీర్తించబడిన కోమలత్వం కలవాడిని, విస్తారంగా జడలు ధరించినవాడిని, ఎంతచూసినా ఇంకా చూడాలన్న ఆశ కలిగించే ప్రియమైన దర్శనం కలవాడిని, శత్రువులను కృశింపచేయగలవాడిని, నల్లకలువల చామన చాయకలవాడిని, సౌందర్యంలో మన్మధుడిని జయించినవాడిని, రాజచిహ్నాలు కలవాడిని, మిక్కిలి శక్తికలవాడిని, సన్నని నడుముకలవాడిని, శ్రీరామచంద్రమూర్తిని చూసి కామదగ్దచిత్త అయ్యి, పాపపు స్వభావం, పెద్దపొట్టకల ఆ రాక్షసి, భయంకరవృత్త, శ్రీరాముడిని చేరవచ్చింది.

మంచి అందమైన ముఖం కలవాడిని వికారమైన ముఖం కలది; పవిత్ర చరిత్రుడిని పాపస్వభావ; శ్రేష్ఠమైన అందం, అలంకారం కలవాడిని మిక్కిలి కురూపి; వినడానికి ఇంపైన కంఠస్వరం కలవాడిని భయంకర ఖరస్వరం కలది; వెడల్పాటి కళ్లు కలవాడిని గూబకళ్ల మిడిగుడ్లది; తుమ్మెదల్లాగా నలుపు-నునువైన వెంట్రుకలు కలవాడిని, శ్రీరాముడిని, ఎర్రటి వెంట్రుకలు కల్గినదైన శూర్పణక చూసింది. ఋజుభాషిణి, వక్రభాషిణి, వయసువానిని, తలవెంట్రుకలు నరసిన ముసలిది, భయంకరాకార ప్రియుడైన వాడి భయంకర వేషం కలది, మన్మథ బాణాలతో దహిమ్చబడుతున్న మనస్సుతో మోహావేషంతో ఇలా అంది.


మోహావేశంతో శూర్పణఖ శ్రీరాముడిని చూసి "నువ్వెవరివి? జడలతో మునీశ్వరుడి వేషం ధరించి, కాముకుడవై, భార్యతోనూ, క్షత్రియ రూపంలో విల్లు-బాణాల తోనూ, రాక్షసులు స్వేచ్చగా తిరిగే ఈ స్థలానికి ఎందుకు వచ్చావు? ఈ ప్రకారం ఇక్కడ వుండడానికి కారణం ఏమిటి?" అని అడగగా శ్రీరామచంద్రమూర్తి వంచనలేక యథార్థాన్ని ఇలా చెప్పాడు.

(ఎలాంటి సందర్భంలోనూ నవ్వులాటకైనా అసత్యం చెప్పడం రాముడికి ఇష్టమైన కార్యం కానేకాదు. అమ్దునా, ఆడవారి ఎదుట, తపస్సు చేసే స్థితిలో అసలే అబద్ధం ఆడడు).

"దశరథుడనే మహారాజు పెద్ద కొడుకును నేను. నన్ను రాముడని అంటారు. వీడు నా తమ్ముడు లక్ష్మణుడు, వా వెంట వచ్చాడు. ఈ స్త్రీ నా భార్య సీత. తల్లిదండ్రుల ఆజ్ఞ మీరలేక పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని నిర్వహించే కోరికతో తపోరూప ధర్మాన్ని స్థాపించడానికి మేం వచ్చాం. మా చరిత్ర విన్నావు కదా? నువ్వే జాతిదానివి? నీ పేరేంటి? ఎవ్వరిదానవు? సత్యం చెప్పు. ఇది రాక్షస భూమి ఐనా నీ మనోహరాకారం చూసి రాక్షసివి అవుతావని అనుకోను. ఇక్కడికి నువ్వు రావడానికి కారణం ఏంటి?". ఇలా అడిగిన రామచంద్రమూర్తికి నిజం చెప్తా వినమని అంటుంది.

శూర్ఫణఖ శ్రీరాముడితో, "ఓ దేవస్వరూపా! సుందరుడా! నేను శూర్పణఖ అనే స్త్ర్రెని. కోరిన రూపాన్ని ధరించగలను. ప్రాణికోటులకు భయం కలిగించేదానినై, ఈ అడవుల్లో ఒంటరిగా తిరుగుతుంటాను. విశ్రవసుడి కొడుకు రాక్షసరాజైన రావణాసురుడి పేరు విన్నావా? అతడు మా అన్న. నిదురబోతు కుంభకర్ణుడు, ధర్మాత్ముడై రాక్షస చేష్టలు లేని విభీషణుడు కూడా నా తోడబుట్టిన వారే. ఖరదూషణులు కూడా నా తోబుట్టువులే. వాళ్లు యుద్ధంలో మహాశూరులు. వావి వరుసలకు వాళ్లు నా అన్నలని చెప్పానేకాని వారి ఆజ్ఞకు లోబడి వుండేదాన్ని కాను నేను. నా ఇష్ట ప్రకారం నేను తిరుగుతుంటాను. కాబట్టి నువ్వు నన్ను గ్రహించావా వాళ్లు నీ మీద కోపంగా వుంటారని భయపడాల్సిన పనిలేదు. చక్కదనంలో నీలాంటి వాడిని నేను చూడలేదు. కాబట్టి కళ్లారా నిన్ను చూసింది మొదలు దొడ్డమగవాడా, నువ్వే నాకు తగిన మగడవని నిన్ను కోరుతున్నాను. నువ్వు నన్ను తిరస్కరించావా, మా అన్నలందరనీ నీమీదకు యుద్ధానికి పిలుచుకొనివచ్చి నిన్ను చంపిస్తాను”.

"రామా! నన్నేమనుకుంటున్నావు? ఎవతో తోవలో పోయే ఆడది అనుకుంటున్నావా? నేను మహీశుడిని అన్న గర్వం నీకు అవసరం లేదు. నేను ఇంత అని చెప్పలేని ప్రభావ సంపదతతో స్తోత్రం చేయబడే దాన్ని. నువ్వు భూమికి ప్రభువైతే, నన్ను ప్రభావ లక్ష్మే కొనియాడుతున్నది. అంతే కాదు. నువ్వు కాలినడకన పోవాల్సినవాడివే. నేను నా ఇష్టం వచ్చినట్లు సంచారం చేయడానికి సిద్ధి పొందాను. కాబట్టి నా మగడివై, నేను శూర్ఫణఖ మగడినని గర్వపడు. నాకిదివరకే భార్య వుందంటావేమో? చీ, చీ, ఇదేమి సీత? చూడడానికి రోత పుడ్తున్నది. వేలెడు ముక్క. వెన్నంటు డొక్క విరిచిన బొందె తుంటెలాగా విరుగు కాళ్లు, చేతులు, చింతాకంత కళ్లు, అసలే లేని గోళ్లు, ఇక నా సొగసు నేనే చెప్పకూడదు కాని, నా డొక్క, నా పిక్క, నా ముక్కు, నా చెక్కు, నా గోళ్లు, నా కాళ్లు, నా కళ్లు, నా చన్నులు, నా చేతులు ఎలా వున్నాయో చూడు. సీత వికార రూప. దీన్ని వదిలిపెట్టు. దూరంగా పొమ్మను. నీలాంటివాడికి తగిన పెళ్లాం కాదు. కానేకాదు. నెనే ముద్దు పెళ్లామని అను”.

"నన్ను సరిగ్గా చూడు. నేను నీకు తగిన భార్యను కానా? అవునను. కాబట్టి నన్ను నీ భార్యగా చేసుకో. దీన్నేం చేద్దామంటావా? దీన్ని చూస్తే నాకే భయమేస్తున్నది. నువ్వెందుకు భయపడడం లేదు? దానికి భయపడే నువ్వు దానికి అణగి వుంటున్నావు కాబోలు. దుర్మార్గురాలు కాబట్టే సవతి అనే కోపంతో నన్ను హింసిస్తుంది. నాకు వశపడ్డావని నిన్ను చంపుతుంది. కాబట్టే అది నీచురాలు....అదీ కాకుండా మనుష్య స్త్రీ. నాకు భోజ్యమైంది. కాబట్టి దీన్ని నీ తమ్ముడితో సహా ఇప్పుడే గుటుక్కున మింగుతా. ఆ తరువాత నీకు ఇంక భయం లేదు...ఈ జంజాటం వుందదు. కాబట్టి, నా ముద్దు మగడా! కొండల్లో, అడవుల్లో స్వేఛ్చగా ఆడుకొందామా?"