శ్రీరాముడిని
చూసి మోహించిన శూర్పణఖ
శ్రీమదాంధ్ర వాల్మీకి
రామాయణం...అరణ్యకాండ-29
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (07-10-2018)
(వనవాసం
చేయాల్సిన పద్నాలుగు సంవత్సరాలలో ఇప్పుడు పదమూడవ సంవత్సరం గడుస్తున్నది. అందులో
ఇది మార్గశిర మాసం).
కళ్యాణ
గునాలతో ప్రసిద్ధికెక్కిన శ్రీరామచంద్రమూర్తి, సీతాలక్ష్మణులతో
కూడి గోదావరీ నదీ స్నానం చేసి, తన తపోవనం
చేరి, అక్కడ నిష్ఠగా ప్రాతఃకాల కృత్యాలను ఆశ్రమానికి బయటే తీర్చి,
పర్ణసాలలో సీత, తాను,
లక్ష్మణుడు, పూర్వుల-పెద్దల
కథలు చెప్పుకుంటూ ముచ్చటించుకుంటుండగా, శ్రీరాముడు
చిత్రా నక్షత్రంతో కూడిన చంద్రుడిలాగా ప్రకాశించాడు. కథలు చెప్తున్న విష్ణు
సన్నిభుడైన శ్రీరాముడిని, అప్పుడు,
రావణాసురుడి చెల్లెలు శూర్పణక చూసి ఆశ్రమంలో ప్రవేశించింది.
సింహం
రొమ్ములాంటి విశాలమైన రొమ్ముకలవాడిని, తామర
రేకలలాంటి కళ్లు కలవాడిని, ఎడతెగని
ఉత్సాహంకలవాడిని, దీర్ఘంగా మోకాళ్లనంటే చేతులు
కలవాడిని, అందంగా ప్రకాశించే ముఖం కలవాడిని, సత్పురుషులతో
ఉపాసించబడే వాడిని, ఇంద్రుడితో సమానుడిని,
ఏనుగు నడకలాంటి నడక కలవాడిని, కీర్తించబడిన
కోమలత్వం కలవాడిని, విస్తారంగా జడలు ధరించినవాడిని,
ఎంతచూసినా ఇంకా చూడాలన్న ఆశ కలిగించే ప్రియమైన దర్శనం కలవాడిని,
శత్రువులను కృశింపచేయగలవాడిని, నల్లకలువల
చామన చాయకలవాడిని, సౌందర్యంలో మన్మధుడిని
జయించినవాడిని, రాజచిహ్నాలు కలవాడిని, మిక్కిలి
శక్తికలవాడిని, సన్నని నడుముకలవాడిని, శ్రీరామచంద్రమూర్తిని
చూసి కామదగ్దచిత్త అయ్యి, పాపపు
స్వభావం, పెద్దపొట్టకల ఆ రాక్షసి, భయంకరవృత్త,
శ్రీరాముడిని చేరవచ్చింది.
మంచి
అందమైన ముఖం కలవాడిని వికారమైన ముఖం కలది; పవిత్ర
చరిత్రుడిని పాపస్వభావ; శ్రేష్ఠమైన
అందం, అలంకారం కలవాడిని మిక్కిలి కురూపి; వినడానికి
ఇంపైన కంఠస్వరం కలవాడిని భయంకర ఖరస్వరం కలది; వెడల్పాటి
కళ్లు కలవాడిని గూబకళ్ల మిడిగుడ్లది; తుమ్మెదల్లాగా
నలుపు-నునువైన వెంట్రుకలు కలవాడిని, శ్రీరాముడిని,
ఎర్రటి వెంట్రుకలు కల్గినదైన శూర్పణక చూసింది. ఋజుభాషిణి,
వక్రభాషిణి, వయసువానిని,
తలవెంట్రుకలు నరసిన ముసలిది, భయంకరాకార
ప్రియుడైన వాడి భయంకర వేషం కలది, మన్మథ
బాణాలతో దహిమ్చబడుతున్న మనస్సుతో మోహావేషంతో ఇలా అంది.
మోహావేశంతో
శూర్పణఖ శ్రీరాముడిని చూసి "నువ్వెవరివి? జడలతో
మునీశ్వరుడి వేషం ధరించి, కాముకుడవై,
భార్యతోనూ, క్షత్రియ
రూపంలో విల్లు-బాణాల తోనూ, రాక్షసులు
స్వేచ్చగా తిరిగే ఈ స్థలానికి ఎందుకు వచ్చావు? ఈ
ప్రకారం ఇక్కడ వుండడానికి కారణం ఏమిటి?" అని
అడగగా శ్రీరామచంద్రమూర్తి వంచనలేక యథార్థాన్ని ఇలా చెప్పాడు.
(ఎలాంటి
సందర్భంలోనూ నవ్వులాటకైనా అసత్యం చెప్పడం రాముడికి ఇష్టమైన కార్యం కానేకాదు.
అమ్దునా, ఆడవారి ఎదుట, తపస్సు
చేసే స్థితిలో అసలే అబద్ధం ఆడడు).
"దశరథుడనే
మహారాజు పెద్ద కొడుకును నేను. నన్ను రాముడని అంటారు. వీడు నా తమ్ముడు లక్ష్మణుడు,
వా వెంట వచ్చాడు. ఈ స్త్రీ నా భార్య సీత. తల్లిదండ్రుల ఆజ్ఞ మీరలేక
పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని నిర్వహించే కోరికతో తపోరూప ధర్మాన్ని
స్థాపించడానికి మేం వచ్చాం. మా చరిత్ర విన్నావు కదా? నువ్వే
జాతిదానివి? నీ పేరేంటి? ఎవ్వరిదానవు?
సత్యం చెప్పు. ఇది రాక్షస భూమి ఐనా నీ మనోహరాకారం చూసి రాక్షసివి
అవుతావని అనుకోను. ఇక్కడికి నువ్వు రావడానికి కారణం ఏంటి?". ఇలా
అడిగిన రామచంద్రమూర్తికి నిజం చెప్తా వినమని అంటుంది.
శూర్ఫణఖ
శ్రీరాముడితో, "ఓ దేవస్వరూపా! సుందరుడా! నేను శూర్పణఖ అనే
స్త్ర్రెని. కోరిన రూపాన్ని ధరించగలను. ప్రాణికోటులకు భయం కలిగించేదానినై,
ఈ అడవుల్లో ఒంటరిగా తిరుగుతుంటాను. విశ్రవసుడి కొడుకు రాక్షసరాజైన
రావణాసురుడి పేరు విన్నావా? అతడు మా
అన్న. నిదురబోతు కుంభకర్ణుడు, ధర్మాత్ముడై
రాక్షస చేష్టలు లేని విభీషణుడు కూడా నా తోడబుట్టిన వారే. ఖరదూషణులు కూడా నా
తోబుట్టువులే. వాళ్లు యుద్ధంలో మహాశూరులు. వావి వరుసలకు వాళ్లు నా అన్నలని
చెప్పానేకాని వారి ఆజ్ఞకు లోబడి వుండేదాన్ని కాను నేను. నా ఇష్ట ప్రకారం నేను
తిరుగుతుంటాను. కాబట్టి నువ్వు నన్ను గ్రహించావా వాళ్లు నీ మీద కోపంగా వుంటారని
భయపడాల్సిన పనిలేదు. చక్కదనంలో నీలాంటి వాడిని నేను చూడలేదు. కాబట్టి కళ్లారా
నిన్ను చూసింది మొదలు దొడ్డమగవాడా, నువ్వే
నాకు తగిన మగడవని నిన్ను కోరుతున్నాను. నువ్వు నన్ను తిరస్కరించావా,
మా అన్నలందరనీ నీమీదకు యుద్ధానికి పిలుచుకొనివచ్చి నిన్ను
చంపిస్తాను”.
"రామా!
నన్నేమనుకుంటున్నావు? ఎవతో తోవలో పోయే ఆడది
అనుకుంటున్నావా? నేను మహీశుడిని అన్న గర్వం నీకు అవసరం లేదు. నేను ఇంత అని చెప్పలేని
ప్రభావ సంపదతతో స్తోత్రం చేయబడే దాన్ని. నువ్వు భూమికి ప్రభువైతే,
నన్ను ప్రభావ లక్ష్మే కొనియాడుతున్నది. అంతే కాదు. నువ్వు కాలినడకన
పోవాల్సినవాడివే. నేను నా ఇష్టం వచ్చినట్లు సంచారం చేయడానికి సిద్ధి పొందాను.
కాబట్టి నా మగడివై, నేను శూర్ఫణఖ మగడినని గర్వపడు.
నాకిదివరకే భార్య వుందంటావేమో? చీ,
చీ, ఇదేమి సీత? చూడడానికి
రోత పుడ్తున్నది. వేలెడు ముక్క. వెన్నంటు డొక్క విరిచిన బొందె తుంటెలాగా విరుగు
కాళ్లు, చేతులు, చింతాకంత కళ్లు,
అసలే లేని గోళ్లు, ఇక నా
సొగసు నేనే చెప్పకూడదు కాని, నా డొక్క,
నా పిక్క, నా ముక్కు,
నా చెక్కు, నా గోళ్లు,
నా కాళ్లు, నా కళ్లు,
నా చన్నులు, నా చేతులు
ఎలా వున్నాయో చూడు. సీత వికార రూప. దీన్ని వదిలిపెట్టు. దూరంగా పొమ్మను.
నీలాంటివాడికి తగిన పెళ్లాం కాదు. కానేకాదు. నెనే ముద్దు పెళ్లామని అను”.
"నన్ను
సరిగ్గా చూడు. నేను నీకు తగిన భార్యను కానా? అవునను.
కాబట్టి నన్ను నీ భార్యగా చేసుకో. దీన్నేం చేద్దామంటావా? దీన్ని
చూస్తే నాకే భయమేస్తున్నది. నువ్వెందుకు భయపడడం లేదు? దానికి
భయపడే నువ్వు దానికి అణగి వుంటున్నావు కాబోలు. దుర్మార్గురాలు కాబట్టే సవతి అనే
కోపంతో నన్ను హింసిస్తుంది. నాకు వశపడ్డావని నిన్ను చంపుతుంది. కాబట్టే అది
నీచురాలు....అదీ కాకుండా మనుష్య స్త్రీ. నాకు భోజ్యమైంది. కాబట్టి దీన్ని నీ
తమ్ముడితో సహా ఇప్పుడే గుటుక్కున మింగుతా. ఆ తరువాత నీకు ఇంక భయం లేదు...ఈ జంజాటం
వుందదు. కాబట్టి, నా ముద్దు మగడా! కొండల్లో,
అడవుల్లో స్వేఛ్చగా ఆడుకొందామా?"
No comments:
Post a Comment