సముద్రాన్ని లంఘించి కపులకు సీత జాడ చెప్పిన హనుమ
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (15-10-2018)
అపరిమిత శక్తిగల హనుమంతుడు, వింటినారినుండి విడువబడిన బాణంలా పోయి, మేఘంలా వున్న
మహేంద్ర పర్వతాన్ని చూసి, దిక్కులు దద్దరిల్లేటట్లు ఉరుములాగా సింహనాదం చేశాడు. మొదట లంకకు బయల్దేరే
ముందు వానరులతో తాను రాఘవుడి కోదండం నుండి వెడలి లక్ష్యాన్ని భేదించి, తిరిగి వచ్చి
రాముడికి ప్రదక్షిణం చేసి విధేయంగా వెళ్లి రాముడి అంబులపొదిలో ముచ్చటగా చేరే
రామబాణంలాగా వెళ్లి వస్తానంటాడు హనుమంతుడు. స్నేహితులను చూడడానికి తొందరపడుతున్న
హనుమంతుడు, తోకజాడించి, విదిలించేసరికి, ఆ అద్భుత ధ్వనికి, సూర్యుడితో కలిసి వున్న ఆకాశం బద్దలయిందేమోననిపించింది.
హనుమంతుడి సింహనాదం, ఆయన తొడలవేగానికి వాటి సందులోనుండి దూరి వెడలిన గాలి ధ్వని, ఆవలి ఒడ్డున వుండి, దిగులుపడుతూ, ఎప్పుడు హనుమంతుడిని చూస్తామా అని ఎదురుచూస్తున్న కోతులు
విని సంతోషించారు. హనుమంతుడు పోయిన పనిని చేసుకొస్తున్నాడనీ, అందుకే,
"జై-జై" నాదం చేస్తున్నాడనీ అంటాడు జాంబవంతుడు
వానరులతో.
"సందేహంలేదు. హనుమంతుడు కార్యం సాధించాడు. ఆయన చేసిన ధ్వనే దాన్ని
సూచిస్తున్నది. కార్యం సాధించనివాడు, ఇంత ఉత్సాహంగా సింహనాదం చేయడు" అని జాంబవంతుడు ఇతరులకు
చెప్పగా, వారందరూ హనుమంతుడు వస్తున్నాడని సంతోషిస్తూ,
స్నేహితుడిని చూడాలన్న ఆత్రంతో, ఆయన ధ్వనిని వింటూ గంతులేసారు. వస్తున్న హనుమంతుడిని
దూరాన్నుండే చూడాలన్న కోరికతో,
ఒక శిఖరాన్నుండి అంతకంటే ఎత్తైన మరో శిఖరానికీ, ఒక చెట్టునుండి అంతకంటే ఎత్తైన ఇంకో చెట్టుమీదకూ, కొమ్మనుండి కొమ్మపైకీ, కిలకిలా అరుచుకుంటూ దూకసాగారు వానరులందరూ. తాము ఫలానా
చోటున్నామని ఇతరులకు తెలపటానికి,
పూచిన కొమ్మలను,
చేతుల్లోని గుడ్డలను వూపుతూ ఆనందించసాగారు వారంతా.
కొండగుహల్లో దాక్కుని, అమిత వేగంతో ధ్వనిస్తూ బయటకొచ్చే గాలిలా, సింహనాదం చేస్తూ
హనుమంతుడొచ్చాడు. ఆ అకాశమార్గాన,
మేఘంలా వస్తున్న హనుమంతుడిని చూస్తూ, ఆకాశంవైపు చేతులు
జోడించి నిల్చున్నారు వానరులందరూ.
కొండంత దేహమున్న హనుమంతుడు, అతివేగంతో వస్తున్నందున, వృక్షాలతో నిండిన మహేంద్రగిరి రాళ్ల మీద దూకితే
గాయపడ్తానన్న ఆలోచనతో, కొండపక్కనున్న నీళ్లల్లో రెక్కలు తెగిన పర్వతంలాగా ఢభీలున పడ్డాడు. సంతోషించిన
వానరయూధాలు, ఆంజనేయుడు ఏం చెప్పబోతున్నాడో విందామని, అతన్నే చూస్తూ, అతడి చుట్టూ మూగారు. ఏ గాయం లేకుండా, దేహబాధ లేకుండా వున్న హనుమంతుడిని చూసి, వ్రేళ్లు, పళ్లు కానుకలుగా
ఇచ్చి ఆయన దగ్గరకు చేరారు మిత్రులందరూ. జ్ఞానవృధ్ధుడు, వయోవృధ్ధుడైన జాంబవంతుడికీ, యువరాజైన
అంగదుడికీ, తనకంటే వయసులో పెద్దవారికీ,
భక్తితో నమస్కరించాడు హనుమంతుడు.
(హనుమంతుడు పెద్దలకు,
వృధ్ధులకు నమస్కరించాడంటే,
దానికీ సరైన కారణముంది. ఒక గ్రామంలో వున్న వాళ్లలో, తన కంటే పదేళ్ళు
పెద్దవారైతే వారిని "సఖులు" అంటారు. అంతకుపైబడ్డ వారందరు
"పెద్దవాళ్లు". గీతాదివిద్యలు నేర్చినవారు, తనకంటే ఐదేళ్ళు
పెద్దవారైతే "సఖుడే". అంతకన్న ఎక్కువ వయస్సుంటే, పెద్దవాడని
పిలుస్తారు. వేదాలు చదివిన వాడు,
మూడేళ్ళు పెద్దైతే, సఖుడు, అంతకంటే పెద్దైతే
పెద్దవాడు. తనవంశంవారిలో అన్నల్లాంటివారు పెద్దైనా సఖులే. అధికులందరూ అందుకే
నమస్కారానికి అర్హులు).
ఏం చెప్తాడో విందామని తహతహలాడ్తున్న వానరుల మనస్సు కుదుట
పడేటట్లు రెండే-రెండు మాటలు చెప్తాడు ఆరంభంలో: "చూచితి-సీత"నని. ఆ
తర్వాత అంగదుడి చేయిపట్టుకుని,
మహేంద్ర పర్వతం మీద, అందరూ కూర్చునే వీలున్న రమ్యమైన ప్రదేశానికి తీసుకుపోతాడు.
ఆప్పుడందరూ వింటూ వుండగా: "దయాహీనులైన రాక్షసస్త్రీల రక్షణలో వున్న సీతను
చూసాను. అశోకవనంలో, భర్తను చూడాలన్న కోరికతో,
ఆ పతివ్రత మాసిపోయిన వెంట్రుకలతో, ఆహారంలేక
శుష్కించింది" అనగానే అమృత సమానమైన ఆమాటలకు పోయిన ప్రాణాలు తిరిగొచ్చినట్లు
సంతోషంతో, మిగిలినదంతా వినే ఓపికలేక ఎగురసాగారు కొందరు. మరి కొందరురు గెంతులేశారు.
ఇంకొందరు కిలకిలా అరుచుకుంటూ,
తోకలను నేలకేసికొట్టారు.
హనుమంతుడి సమీపంలో వుండి వింటున్నవారు, వెంటనే
చెట్లమీదనుండి దూకి, హనుమంతుడిని కౌగలించుకుని,
"తండ్రీ బ్రతికించావు" అని అరిచారు. కోతుల మధ్యనున్న
అంగదుడు హనుమంతుడితో, "ఇంతపెద్ద సముద్రాన్ని దాటిపోయి, సుఖంగా తిరిగి రాగలవాడెవరున్నారు నీవు తప్ప! వేగంలో, బలంలో నీతో సమానులెవరూ లేరు. నీ ప్రభుభక్తి, శక్తి, ధైర్యం, ఆశ్చర్యకరమైంది.
మా అదృష్టం కొద్దీ, నువ్వు శ్రీరాముడి భార్యను, పతివ్రతైన సీతాదేవిని
చూసావు. సీతను విడిచి వున్నందున, రాముడికి కలిగిన శోకం అదృష్టం కొద్దీ పోయిందిక. నీవెట్లా
పోయావో, ఏం చేసావో, ఎట్లా
చూసావో, అదంతా వివరంగా చెప్పాలి. సముద్రాన్నెట్లా దాటింది, లంకలోకెట్లా ప్రవేశించింది, సీతనెట్లా
చూసింది, రావణుడెట్లా కనిపించింది, అదంతా వివరంగా
చెప్పు" అని అడుగుతాడు. ఆ సమయంలో అంగదుడు,
హనుమంతుడు వున్న మహేంద్రగిరి పర్వతం వారిరువురివల్ల ప్రకాశించింది.
లంకకు పోయివచ్చిన వృత్తాంతమంతా హనుమంతుడు, ఇంతవరకు
సుందరకాండలో చెప్పబడిన విషయమంతా,
దండకంగా చెప్పాడు హనుమంతుడు.
దీంట్లో "త్రిజట" వాక్యాలను నమ్మి, రాక్షస స్త్రీలు
సీతాదేవిని శరణాగతి కోరినట్లు, ఆమె వారికి అభయ
ప్రదానం చేసినట్లు చెప్పాడు. అయితే, తననే రక్షించుకోలేని సీతాదేవి, తనను చెరనుండి తప్పించమని హనుమంతుడిని కోరుకున్న సీతాదేవి, ఇతరులనెట్లు
రక్షించగలదన్న సందేహం కలగొచ్చు.
సీతాదేవి తనను తాను కాపాడుకోలేక హనుమంతుడిని ప్రార్థించడం
జరగలేదు. అలా అనుకోవడం సమంజసం కాదు. లంకంతా సీతాదేవి తప ప్రభావం వల్ల
దగ్దమైపోయిందనీ, రామచంద్రమూర్తి నిమిత్త మాత్రుడేననీ, హనుమంతుడు
చెప్పాడు. తనను తాను రక్షించుకున్నా,
హనుమంతుడు రక్షించినా,
రామచంద్రమూర్తికి అపకీర్తి వస్తుందని ఆప్రయత్నం మానుకుంది
సీతాదేవి.
సీతాదేవి అభయప్రదానం చేస్తూ, తాను రక్షించ గలిగినా, ఆ అధికారం తనకున్నదని స్వతంత్రించి చెప్పకూడదు కదా! అంటే సీతాదేవిలో
"ఉపాయం" వుందేకాని,
"ఉపేయం" లేదన్న మరో సందేహం రావడం కూడా సబబు కాదు.
లక్ష్మీనారాయణులు, సీతారాములు, వేరు వేరు దంపతులు కానేకారు. లక్ష్మీదేవి, భగవంతుడి కరుణా శక్తే!
(వేదాంత దేశికులనే మహానుభావులు భగవంతుడిలో ఉన్న దయ అనే
విశిష్ట గుణాన్ని దయాదేవి గా,
శ్రీదేవి గా, చైతన్యస్తన్యదాయినీగా, శ్రీనివాసుడి ప్రేయసిగా, కరుణారూపిణిగా అభివర్ణించారు. లక్ష్మి రక్షించినా, నారాయణుడు రక్షించినా, సీత రక్షించినా, రాముడు రక్షించినా ఒకటే! రాముడు లేని కరుణ రక్షించలేదు. కరుణ లేని రాముడూ
రక్షించలేడు. కృప రక్షించింది అంటే రాముడు రక్షించినట్లే! సీత, లక్ష్మి, కరుణ, కృప, దయ: ఇవన్నీ పర్యాయ పదాలే! అందుకే భక్తులు, లక్ష్మీ విశిష్ట
నారాయణుడినీ, సీతా విశిష్ట రాముడినీ ఉపాసించాలని శాస్త్రాలు చెప్పుతున్నాయి. ఒకరి పేరు
చెప్పితే రెండవ వారున్నట్లే! సీతతో పనిలేదు, రాముడు
చాలుననీ, లేక, రాముడితో పనిలేదు, సీత చాలుననీ అనరాదు. ఎండలేని సూర్యుడు, వెన్నెల లేని చంద్రుడు, అలల్లేని సముద్రాన్ని
అనుభవించలేం.
"అహం" భగవంతుడైతే, "అహంత" లక్ష్మీదేవౌతుంది.
సీతాదేవి అనుగ్రహించిన వారిని రాముడూ అనుగ్రహించినందు వల్ల ఆమెలో
"ఉపాయత్వం" వున్నదనీ, రాక్షస స్త్రీలను ఆమె కాపాడినందు
వల్ల ఆమెలో "ఉపేయత్వం" (స్వతంత్ర రక్షణ శక్తి) వుందనీ తెల్సుకోవాలి.
అందువల్లనే మిధున కైంకర్యం శ్రేష్టమన్నారు. సీతారాములలో, లక్ష్మీనారాయణులలో
ఏ ఒక్కరినో ఆశ్రయించ కూడదు. శూర్పనఖ
రాముడినే కోరింది, సీతమ్మను కాదన్నది. ఫలితం ముక్కూ-చెవులూ
తెగినాయి. రావణుడు సీతమ్మను కోరాడు, రాముడిని విడిచాడు. పది
తలలు తెగి కింద పడిపోయాయి. హనుమంతుడు సీతారాములను కోరుకున్నాడు. సీతారామానుగ్రహ
లబ్ది పొందాడు. చిరంజీవి అయినాడు. కనుక మిధున (దంపత్సమేతంగా) కైంకర్యాన్నే
కోరుకోవాలంటారు మన పెద్దలు.
No comments:
Post a Comment