Saturday, October 13, 2018

శూర్ఫణఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడు....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-30:వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-30
శూర్ఫణఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (14-10-2018)

అని శూర్పణఖ చెప్పగా, కామవశమైన ఆ రాక్షసి మాటలకు నేర్పుగల శ్రీరామచంద్రమూర్తి, కోపపడకుండా, మెత్తటి మాటలతో సందేహం కలగకుండా, తాను చెప్పేది స్పష్టంగా అర్థమయ్యేట్లు చెప్పాడిలా ఆమెకు. "రాకాసీ! దీనిని ముందు పెళ్లి చేసుకున్నాను. అయినా ఏంటంటావా? ఇప్పుడు ప్రియురాలైన దీనిని నేనెలా విడుస్తాను? అది ధర్మం కాదే? అది వుండవచ్చు...నువ్వూ వుండవచ్చు అంటావా? నీలాంటి అద్భుతమైన అందగత్తెకు సవతి పోరు వుండకూడదు. కాబట్టి నీకు దుఃఖం కలగక తప్పదు.నున్ని దుఃఖ పెట్టడానికా పెళ్లి చేకోవడం? కాబట్టి నామీద భ్రాంతి వదిలిపెట్టు. నువ్వు కామం నిలుపలేనని అంటావా? ఇదిగో వీడిని చూడు. మంచి శీలం కలవాడు. నా తమ్ముడు. చూడడానికి ప్రియమైన వాడు. సహించరాని తేజం కలవాడు. లక్ష్మణుడనే పేరుకలవాడు. ఈ లక్ష్మణుడు భార్య లేనివాడు. అసమాన శౌర్యవంతుడు. సమర్థుడు. యౌవనంలో వున్నాడు. అందగాడు. ఇదివరకు భార్యా సుఖం తెలియనివాడు. భార్య కావాలని కోరుతున్నాడు. నీ అందమైన రూపం చూడగానే వీడు నీకు పతిత్వయోగ్యుడు అవుతాడు. పూబోడీ! సవతి పోరులేకుండా అతడిని భజించు”.

అని శ్రీరామచంద్రుడు చెప్పగా విని ఆ రాక్షసి, రామ మోహం కళ్లకు కప్పి వుండడం వల్ల, తన విధవాగర్భాదాన నూతన మహోత్సవం నిమిషమైనా ఆలశ్యం కావడానికి సహించలేక, లక్ష్మణుడితో "ఓయీ అందగాడా! నీ చక్కదనానికి సరైన అందగత్తెను నేనే. నీకు పెళ్లాం అవుతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకో. వనాలలో,కొండలలో సంచారం చేద్దామా? రా..పోదాం" అన్నది. శ్రీరామచంద్రమూర్తి పరిహాసంగా మాట్లాడిన భావం తెలుసుకొన్న లక్ష్మణుడు, తానూ శూర్పణఖతో పరిహాసంగానే మాట్లాడాడు. "ఓసీ! వెర్రి పిల్లా! నేను బానిసను. నన్ను పెళ్లి చేసుకొని నువ్వు కూడా బానిసవై వీరి సేవ చేస్తావా? నీ చక్కదనానికి నువ్వు బానిసగా వుంటావా? ఈ మహాత్ముడుకి నేను బంటుగా సేవ చేస్తున్న సంగతి నీకు తెలియదేమో? నీకు తెలిసే అవకాశం లేదు. తెలుస్తే, నేనేంటి...బానిసను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అనుకొనేదానివి. అలాంటి సమృద్ధమైన అర్థం కలవాడిని నువ్వే సంతోషపెట్టగలవు. నిర్మలకాంటి కలదానివి కాబట్టి, నువ్వు, ఆయన్నే వరిస్తే నువ్వు చిన్న భార్యవై,కులుకుతూ ముద్దులొలకవచ్చు. మగవారికి పెద్ద భార్య మీద కంటే చిన్న భార్యమీదే ప్రేమ ఎక్కవ కదా! ఈ మాత్రం ఆలోచించలేవా? నిన్నేమనాలి? ఇలాంటి వికార స్వరూపం గలదానిని, భయంకర స్వరూపం వున్నదానిని, ఆ సవతిని, పెద్ద పొట్టకలదానిని, ముసలిదానిని, జానకిని నెట్టి నిన్ను భార్యగా గ్రహిస్తాడు. ఇలాంటి పరమ సుందరిని వదిలి ఎవరు మనుష్య స్త్రీకొరకు వేడుక పడతాడు?" అని లక్ష్మణుడు పలికాడు శూర్పణఖతో.


లక్ష్మణుడు చెప్పిన మాటలు పరిహాస వచనాలని తెలుసుకోలేని ఆ బుద్ధిహీన, నిజమని నమ్మి, పర్ణశాలలో సీతతో వున్న శ్రీరామచంద్రుడి దగ్గరకు పోయి మదనతాపంతో ఇలా అంది: "ఈ విరూపను, సవతిని, ఈ కరాళను, నిర్ణతోదరిని గ్రహించి నువ్వు నన్ను గౌరవించడం లేదు. కాబట్టి దీన్ని ఇప్పుడే మింగి సవతిపోరు లేకుండా సుఖపడతాను". ఇలా అంటూ శూర్పణఖ జింకపిల్ల కళ్లలాంటి కళ్లున్న సీతమీద దూకింది. ఇది చూసిన శ్రీరాముడు దాన్ని బిగపట్టి, కోపంతో లక్ష్మణుడితో "లక్ష్మణా! నీచులతో పరిహాసం ఆడడం తప్పు. అలా మనం చేసినందువల్ల కష్టం కలిగింది. దీనివాత పడకుండా సీతాదేవి ఎలా బతికి సుఖంగా వుంటుందో ఆలోచించు. ఇది స్త్రీ. ఆయుధం ధరించి యుద్ధానికి వచ్చింది కాదు. కాబట్టి చంపకూడదు. దీన్ని, బలగర్వంతో దేహం తెలియనిదాన్ని, రాకాసిని పట్టుకొని విరూపగా చేయి" అన్నాడు. అప్పుడు శూర్ఫణఖ కంటే మహాబలశాలి అయిన లక్ష్మణుడు తటాలున కత్తి దూసి, అది ఎదిరించినా వదలక, దాని ముక్కు, చెవులు కోశాడు.

ముక్కు-చెవులు ఈ విధంగా మొక్కలు పోగా, లబలబ నోరు కొట్టుకుంటూ, రొమ్ము గుద్దుకుంటూ, వానాకాలంలోని మేఘం అదిరినట్లు, అడవి ప్రతిధ్వనించేట్లు, పెద్ద ధ్వనితో బొబ్బలు పెట్టుకుంటూ, నెత్తురు కారుతుంటే, వికార రూపం మరింత వికారం కాగా, మనుష్యులు తనను ఇలా చేశారే, నలుగురిలో నవ్వుల పాలైతిని కదా అని ఆక్రోశంతో ఏడుస్తూ అడవుల్లో పడి వేగంగా పరుగెత్తింది. 

ఇలా పరుగెత్తుకుంటూ పోయి జనస్థానంలో రాక్షసుల మధ్యన వున్న తమ్ముడు ఖరుడిని చూసి, ఏడుపు ధ్వనితో ఆకాశం నుండి పిడుగుపడ్డట్లు ధభీలున నేలమీదపడి పెద్దపెట్టున ఏడ్చింది.

No comments:

Post a Comment