Saturday, December 7, 2019

రామలక్ష్మణుల దగ్గరకు బిక్షుక వేషంలో పోయిన హనుమంతుడు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-7 : వనం జ్వాలా నరసింహారావు


రామలక్ష్మణుల దగ్గరకు బిక్షుక వేషంలో పోయిన హనుమంతుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం... కిష్కింధాకాండ-7
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (08-12-2019) 
నిజస్వరూపంలో రామలక్ష్మణుల దగ్గరికి పోతే, పోయిన పని నెరవేర్చడం కష్టమని భావించిన హనుమంతుడు, వానర రూపం వదిలి, సన్న్యాసి లాగా తానున్న కొండ దగ్గరినుండి, వారిదగ్గరికి పోయి ఏకాగ్రచిత్తంతో, వినయంగా వాళ్లకు నమస్కారం చేశాడు.

(ఇక్కడ సన్న్యాసి రూపం ధరించిన హనుమంతుడు గృహస్తుడైన రామచంద్రమూర్తికి ముందుగా తానే నమస్కారం చేయడం అంటే సర్వత్రా ఇలాంటి ఆచారం సమంజసమని అనుకోవాలి. సన్న్యాసి గృహస్తుడికి నమస్కారం చేయడం భావ్యం కాదని కొందరంటారు కాని, అది వాస్తవం కాదు. మనువాక్యమూ కాదు....మనుశాస్త్రానికి విరుద్ధం కూడా. ఆ మాటకు మూలం ఏంటో, కర్త ఎవరో కూడా తెలియదు. జ్ఞానాధికుడైన గృహస్తుడికి సన్న్యాసి నమస్కరించాలి అనేదే మనువాక్యం. హనుమంతుడు అత్యద్భుతములైన రామలక్ష్మణుల ఆకారాలు చూసిన వెంటనే అధికానంద పరవశుడై తాను ధరించిన సన్న్యాసి ఆకారాన్ని కూడ మరచిపోయి అవశంగా వారికి నమస్కారం చేశాడు. ఇది సర్వత్రా ప్రామాణికం కాదని కొందరి అభిప్రాయం. ఇది యుక్తంకాదు. హనుమంతుడు నిపుణమతి. గొప్ప మంత్రి. రాముడి అభిప్రాయం కనుక్కొని రమ్మని సుగ్రీవుడు పంపగా వచ్చాడు. అలాంటి వాడు ఆదిలోనే తనను తాను మరచిపోతే తక్కిన కార్యం ఎలా నెరవేర్చగలడు? రామచంద్రమూర్తి ఎలా నమ్ముతాడు? రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహం చూడగానే వీరు సుగ్రీవుడికి మేలు చేసేవారే కాని పగవారు కాదని నిశ్చయించిన హనుమంతుడు తాను వేసుకున్న వేషం మారు వేషమనీ, తాను చారుడనీ తెలియచేయడానికే నమస్కారం చేశాడు. ఇక్కడ బిక్షువు అంటే సన్న్యాసికాడు. బ్రహ్మచారి అని కొందరంటారు. అదీ యుక్తం కాదు. హనుమంతుడు మొదటినుండీ బ్రహ్మచారే కాని, ఇప్పుడు కొత్తగా వేయలేదు. కాబట్టి హనుమంతుడు సన్న్యాసి వేషం ధరించాడనీ, జ్ఞానాధికుడైన రామచంద్రుడికి, గృహస్తుడికి, నమస్కరించడం తప్పుకాదనీ చెప్పాలి).

సుమనోజ్ఞంగా, సౌమ్యంగా, వంచనలేని మాటలు చెప్పి, రాజకుమారులను తృప్తికావించి, సుగ్రీవుడి అభిప్రాయానికి సరిపోయేట్లు తన అభిప్రాయాన్ని చెప్పాడు హనుమంతుడు రాముడితో ఇలా.

"అయ్యలారా! మీరెవరు? ఈ అడవి ప్రదేశానికి ఎందుకు వచ్చారు? మీలాంటివారు తిరగాల్సిన స్థలం కాదిదే? ఎందుకంటే మీరు రాజర్షులతో, దేవతలతో సమానంగా వున్నారు. అలాంటివారికి ఇలాంటి చోట ఏమిపని? మీరు రాజర్షులని నాకెలా తెల్సిందంటారా? మీరు ధరించిన మునిరాజుల వేషాలు అది  తెలియచేస్తున్నది. మీలో రాజవేషం , ముని వేషం రెండూ కలిసి వున్నాయి. అలా అయితే మీరు సంకరులని నా అభిప్రాయం కాదు. మీరేదో మంచి వ్రతం పూని ఇలా వున్నారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వ్రతం మీరు పూనడానికి కారణమేంటి? మీ దేహాలు, వాటి కాంతి చూస్తుంటే అవి వ్రతాల వల్ల తపించ తగినదిగా కనబడడం లేదు. నేనింతగా మాట్లాడినా, నాతో మాట్లాడకుండా కొలను ఒడ్డున వున్న చెట్లను చూస్తున్నారు. ఇలాంటి చెట్లను మీరు ఈ అడవిలో చూడలేదా? మిమ్మల్ని చూసి ఈ అడవిలోని పక్షులు, మృగాలు భయంతో పరుగెత్తుతున్నాయి. మీ దేహకాంతి ఈ నిర్మలమైన జలాలమీద పడి దానికి మెరుగు పెట్తున్నట్లు వుంది. ఇంత ఘోరారణ్యంలో మీరిద్దరే తిరగడం అంటే మీకు భయం లేదన్న మాట. మీరు భయమెరుగని ధైర్యవంతుల్లాగా వున్నారు. మీ శరీరాలు భంగారు చాయగా వున్నాయి. మంచి వయసులో వున్నారు మీరు”.

"సింహాల చూపుల్లాంటి చూపులు, సింహాల పరాక్రమంలాంటి పరాక్రమం కలవారు మీరు. ఇంద్రచాపాల్లాంటి పెద్ద విల్లులను చేతిలో ధరించి వున్నారు. స్థిరకాంతి సంపద కలవారిలా వున్నారు. బలసిన ఆబోతులలాగా నడుస్తున్నారు. మీ భుజాలు ఏనుగు తొండాల్లాగా వున్నాయి. ఇలా వున్నా చూడడానికి అందంగా, మహిమలో దేవతలకు సమానంగా వున్నారు. కాబట్టి ఎలాంటి శత్రువునైనా చంపగల సమర్థులు మీరు. ఎంధుకు మీద-మీద నిట్టూర్పులు విడుస్తున్నారు? నడిచిన అలసట వల్లా? మిమ్మల్ని చూసి పక్షులు భయపడుతున్నాయి. ప్రాజ్ఞులారా! మీ చిహ్నాలు చూస్తుంటే బంగారు సింహాసనాల మీద వుండతగ్గవారిలాగా కనిపిస్తున్నారు. ఇలాంటి వీరులు, మీరెందుకు నారచీరెలు కట్టి జడదారుల్లాగా జడలు ధరించి తిరుగుతున్నారు? మీ యోగ్యతకు, మీ ఇప్పటి స్థితి, పరస్పర విరుద్ధంగా వుండడానికి కారణం ఏంటి?

“అసమాన కాంతితో కొండలను, అడవులను ప్రకాశించేట్లు చేస్తున్నారు. ఒకరికి ఒకరు సమానంగా వున్నారు. విశాలమైన వక్షాలున్నాయి మీకు. పెద్ద-పెద్ద బాహువులున్నాయి. దేవతాకాంతితో ప్రకాశిస్తున్నారు. ఆకాశాన్ని విడిచి ఈ లోకాన్ని చూసిపోవడానికి క్రీడకోసం వచ్చిన సూర్య-చంద్రుల్లాగా వున్నారు. నిజంగా మీరెవరు? మీ చేతులు ఇసుకపట్ల గుదియల్లాగా గట్టిగా, సుందరంగా, మోకాళ్లను అంటుతూ, గుండ్రటి ఆభరణాలు ధరించడానికి యోగ్యమైనవిగా వున్నాయి. ఎందుకు మీరు ఆభరణాలు ధరించలేదు? ఆభరణాలతో కప్పిపెట్టుకుంటే మీ ఆయయవాలకు దృష్టి తాకుతుందా? మీరు ఆభరణాలు ధరించినట్లయితే అవే లోకాన్ని వశపర్చుకుంటాయి. నిరావారణమైన మీ దేహ సౌందర్యం ఎందుకు కనపడాలి? ఆభరణాలు ధరించకుండా, కేవలం ఆయుధాలు ధరించడం చూస్తే మీరేదో శత్రుసంహార కార్యక్రమానికి సిద్ధమైనట్లు కనపడుతున్నది. మీరు ఆభరణాలు ధరించకపోయినా మీకు కలిగే సౌందర్య హాని ఏమీ లేదు. కాని అవి తేజోహీనులై పడివున్నాయి కదా? మిమ్మల్ని ఆశ్రయించిన వాటిని తేజోహీనులుగా చేయవచ్చా?


“అడవులతో, సముద్రాలతో, మేరు-వింధ్య శ్రేణులతో ప్రకాశించే ఈ భూమండలమంతా పరిపాలించే యోగ్యతవున్నవారైనప్పటికీ ఇలాంటి దీన దశలో ఎందుకున్నారు? మీ విల్లు-బాణాలు చూడడానికి ఇంద్రుడి వజ్రాయుధానికి సమానంగా వున్నాయి. ఇలాంటివి లోకంలో సాధారణంగా కనపడవు. మీ అమ్ములపొదలు పగవారి ప్రాణాలు తీయడానికి బుసకొట్టే పాముల్లాగా బాణాలతో నిండి వున్నాయి. చూడడానికి నాణాల్లాగా శుభకరంగా వున్నాయి. చాలా నిడివి, వెడల్పు కలిగి చూడడానికి భయంకరంగా అపరంజి బంగారంతో కలిసిన మీ కత్తులు కుబుసం విడిచిన పాముల్లాగా వున్నాయి”.

(హనుమంతుడు ఇన్ని ప్రశ్నలు వేసినా రామలక్ష్మణులు ఆయన మాటల సొంపు-పెంపు వింటూ వూరకే వున్నారు తప్ప ఒక్కదానికైనా జవాబివ్వలేదు. కారణాలు అనేకం వుండొచ్చు. ఆయన మాటలపట్ల ఆసక్తి కావచ్చు. తాము మాట్లాడితే ఆయన మాటలు వినే అవకాశం కోల్పోవచ్చు. సన్న్యాసులు తిరగకూడని ప్రదేశంలో తిరుగుతున్న ఈ సన్న్యాసి నిజమైన సన్న్యాసా? కాదా? అన్న సందేహం కావచ్చు. బిక్షకోసం వచ్చిన సన్న్యాసి అయితే ఆయన స్థితిగతులు చెప్పుకోవాలి కాని తమ స్థితిగతులను గురించి ఎందుకు అడగాలి? వేగులవాడేమో! ఇక్కడ పరస్పర శత్రువులైన వాలి-సుగ్రీవులలో ఇతడు ఎవరి పక్షమో? కాబట్టి ముందుగా తానెవరో చెప్పిన తరువాత మాట్లాడుదామని రామలక్ష్మణులు భావించి వుండాలి.

ఇక హనుమంతుడు వేరే విధంగా ఆలోచించ సాగాడు. తానెంత మాట్లాడినా వీళ్లు బదులు చెప్పడం లేదు. తనమీద వీరికి సందేహం కలిగిందేమో? ఆ సందేహం తీరేవిధంగా తాను సంభాషిస్తేనేగాని వాళ్లు తనను నమ్మి తనతో మాట్లాడారని అనుకుంటాడు. వీళ్లు గొప్పవారిలాగా వున్నారు కాబట్టి వీళ్ల స్నేహం తప్పక చేయాలి అని ఆలోచించి తన వృత్తాంతాన్ని కపటం లేకుండా చెప్పడం ఆరంభించాడు).

“ఆర్యులారా! నేనింతసేపు మాట్లాడినా మీరొక్క మాటైనా బదులు ఇవ్వలేదు. ఇక నా వృత్తాంతాన్ని చెప్తా వినండి. ఈ ప్రాంతంలో సుగ్రీవుడు అనే ఒక ధర్మాత్ముడు, కోతిరాజు, వీరుల గౌరవానికి పాత్రుడు వున్నాడు. అతడిని ఆయన అన్న వెళ్లగొట్టితే నిలువనీడలేక, ప్రాణ భయంతో అమితంగా బాధపడ్తూ దేశంలో తిరుగుతున్నాడు. మీ స్నేహం కోరి ధర్మాత్ముడైన సుగ్రీవుడు పంపుతే మీ దగ్గరికి వచ్చాను నేను. నేనాయన మంత్రిని. వాయుపుత్రుడిని. నా పేరు హనుమంతుడు. నేను వానరుడిని. కోరిన రూపం ధరించి, కోరిన ప్రదేశానికి వెళ్లగలను. సుగ్రీవుడి మేలు కోరి సన్న్యాసి వేషంలో ఋశ్యమూకం నుండి ఇక్కడికి వచ్చాను” అని చెప్పి హనుమంతుడు మౌనం దాల్చాడు.

(దీంతో రామలక్ష్మణుల సందేహం తీరింది. వాలి-సుగ్రీవుల పేర్లు, వాలి సుగ్రీవుడిని వెళ్లగొట్టడం, సుగ్రీవుడు ఋశ్యమూకం మీద వుండడం, ఇవన్నీ రామలక్ష్మణులకు తెలిసిన విషయమే. కాబట్టి సందేహానికి తావు లేదు. ఆ తరువాత తాను సుగ్రీవుడి మంత్రినని చెప్పాడు హనుమంతుడు. అంటే సుగ్రీవుడి పక్షంవాడని అర్థమయింది).

హనుమంతుడి మాటలకు సంతోషించిన రాముడు, తమ్ముడు లక్ష్మణుడిని చూసి ఇలా అన్నాడు.

Thursday, December 5, 2019

యుద్ధకాండ మందర మకరందం....."మధుర మధురమే తత్ మంగళం మంగళానామ్" : చిలకపాటి విజయ రాఘవాచార్యులు


యుద్ధకాండ మందర మకరందం
అనువక్త-వాచవి, వనం జ్వాలా నరసింహారావు
శ్రీరామ రామ రామ
"మధుర మధురమే తత్ మంగళం మంగళానామ్"
చిలకపాటి విజయ రాఘవాచార్యులు
శ్రీరామాయణము’ ‘ఆదికవి’ వాల్మీకి మహర్షి ప్రణీతము. సంస్కృత భాషలో ప్రథమ రచనము. ఇది ‘ఆంధ్రవాల్మీకి’ రామాయణము. తొలిసారిగా తెలుగు భాషలో వాల్మీకి రామాయణమునకు యధాతథముగా శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు (అనగా వాసుదాసుగారు) పద్య గద్యములతో రచించిన సత్య, ధర్మ, జ్ఞానపీఠము. దీనిని ప్రస్తుతము కడప-తిరుపతి మార్గములో గల ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వారికి వాసుదాసస్వామి వారు అంకితమిచ్చి, తాము తరించి, మనవంటి శ్రీరామదాసులకు శ్రీరామానుగ్రహము కలుగునట్లు అనుగ్రహించినారు. కాగా వాసుదాస స్వామి వారు వాల్మీకి రామాయణమునకు పద్యకావ్యముగా మూల విధేయముగా వ్రాసి, వారే ‘మందరము’ అను పేరుతో ప్రతి పదార్థ, విశేషార్థ తాత్పర్యములతో చక్కని తెలుగు భాషలో రచించడము జరిగినది.  వంద సంవత్సరాలు దాటినది.  భారత జాతికే ప్రతిష్టాత్మకమైన  ‘భారతరత్న’, ‘జ్ఞానపీఠ’ పురస్కారాలకు సర్వదా పాత్రమైన రచనము ఈ ‘మందరము’ నిర్మాత ఆంధ్రవాల్మీకి వాసుదాసస్వామివారు.  లక్షలమంది తెలుగువారు మందరాన్ని పఠించి ధన్యులైనారు, ఇంకా అవుతూనే వున్నారు.   శ్రీరామాయణ క్షీరసాగరాన్ని ‘మందరం’ మధించింది. ఆ దివ్య పీయూషాన్ని స్వర్ణ కలశంలో భద్రపరచి మనకందరికీ ఆప్యాయంగా అందించింది.  అయితే కాలాంతరంలో వస్తోన్న మార్పుల వలన ఆనాటి భాష, భావం, శైలి, స్వరూపం, తాత్పర్యం ఈనాటి తరానికి కించిత్తు క్లిష్టమన్పిస్తూండడంతో, ‘ఆంధ్రవాల్మీకి’  మన వనం జ్వాలా నరసింహరావు గారిలో ‘పరకాయ ప్రవేశం’ చేశారు.  శ్రీరామాయణ   పారాయణ పరాయణులైన వనం శ్రీనివాసరావు గారి పుత్రరత్నం జ్వాలా నరసింహరావుగారు.  సంస్కార సంపన్నమైన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి భక్తి ప్రపత్తులు. జన్మతః సంతరించుకున్న భద్ర వారసత్వం వారిది!  కొంచెం ఆలశ్యంగానైనా, జీవనయానంలో ‘వాల్మీకం’ జ్వాలా నరసింహారావు గారిని ఆవహించింది.   ఇప్పటి ఈ వాసుదాసస్వామి వారి ‘మందరా’నికి మకరందంగా, మధురాతి మధురమైన చక్కని తెలుగు నుడికారంతో షట్కాండయుక్తంగా వారిని వాల్మీకి రామయాణాన్ని రుచి చూపించే ‘వాచవి’ గా, మందరానికి  ‘అనువక్త’ గా మలచి, శ్లోక సముచ్ఛయాల జోలికి సోకకుండా, మజ్గళప్రదమైన మధురధారగా నడిపించింది.  ఇది ‘శ్రీరామప్రభావ’ మహిమ! 

         జ్వాలా’ గారు నాకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృధ్ధి సంస్థలో (Dr MCR HRDI AP), సహవ్రతులే గాక సహవాసులు కూడా!  నిద్ర లేచింది మొదలు నిద్రపోయేవరకు అవిశ్రాంత వక్త. వ్యాసకర్త  ‘గోష్టీప్రియ’ కర్త.  ఒకవిధంగా, నిత్యసంధ్యానుష్టానాల క్రమశిక్షణ అటుంచితే, బహుముఖీనమైన కార్యక్రమాల వ్యగ్రత వారిది.  అలాంటి వారిచేత శ్రీసీతారామచంద్రులు 16 సంవత్సరాల కృషిగా (2004-19) ఈనాటికి ఆరుకాండలకూ యథానువాదరూపంలో  ‘ఆంధ్రవాల్మీకి రామాయణా’ నికి అనువక్తవ్యంగా ఆరుగ్రంథాలను సుప్రసిద్ధ ఆధ్యాత్మిక మాసపత్రిక  ‘దర్శనమ్’ సౌజన్యంతో మనకు అందిస్తున్నారు.  జ్వాలా గారి జీవితంలో ఇది ఒక సువర్ణాధ్యాయం!

         భారతీయులకు భగవద్గీత - శ్రీరామాయణం - శ్రీమధ్భాగవతం - శ్రీమద్భారతం మహా పవిత్రగ్రంథాలు. ఇవి వేదంతో సమానమైన ప్రతిపత్తి కల్గినవి. వ్యాసవాల్మీకాదులు అనుగ్రహించిన అక్షరనిక్షేపాలు.  భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దివ్యజ్యోత్సులు. బ్రతుకు బాటలో వెలుగులు నింపిన దివిటీలు.  ధర్మమార్గదర్శకాలు. శ్రీ రామాయణం ఆదికావ్యం.   భారతం ఇతిహాసం. భాగవతం పురాణం.  ఈ మూడు శ్రీహరి అవతార కథాకథనాలు.  భగవద్గీత సాక్షాత్తూ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖారవిందం నుండి జాలు వారిన మధుర సుధాస్వాదనం. శ్రీరామాయణం శ్రీరామచంద్రుడ్ని, సీతమ్మ తల్లినీ ప్రధానంగా పెట్టుకుని ధర్మసంస్థాపనానికీ, ధర్మరక్షణకూ, సనాతన ధార్మిక సూత్రాలకూ రక్షాబంధనం చేసిన మహాకావ్యం.   భారతీయులకు ప్రాణస్పందనం శ్రీసీతారామగుణగానం!  దీనిని వేదానికి ‘ఉపబృంహణం’ అంటారు.

         ఇక భారతం ‘పంచమవేదం’గా ఆరాధించబడిన జాతీయనేపథ్య ఆంతరంగిక కథాగానం!  లోకరీతిని వివిధ కోణాలలో వివరిస్తూనే, సామాన్య ధర్మాలను, విశేషధర్మాలను ఉపదేశించే వ్యాసపీఠం, జ్ఞానదీపం, జయసంహిత!

         భాగవంతం పురాణరత్నం  ‘‘బాగవతం... భాగవతం... భాగవతం..’’ అంటేనే చాలు, ఎప్పటికైనా ‘బాగు అవుతాం’ అని లోకోక్తి. భాగవతం భగవంతుని చరితం.  ఎవరు ఆ భగవంతుడు? అంటే  ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అని నిష్కర్ష.   శ్రీ కృష్ణ స్వామే భగవంతుడు. ఆయనే జగన్నాటక సూత్రధారి, శ్రీ కైవల్యప్రధాత.  ధాత విధాత... విధాతకు పిత. తాత. త్రాత. జగత్రాత. వ్యాస మహర్షి సంస్కృత భాషలో 18వేల శ్లోకాలలో దీనిని రచించారు.  మన భాగ్యం పండినది. పోతనామాత్యుల వారు దీనికి 8984 పద్యగద్యాలలో చక్కని చిక్కని తెలుగు భాషలో ఆంధ్రీకరించి అందించారు.

         అలాగే వ్యాసప్రోక్తమైన మహాభారతం లక్షాధికశ్లోకయుక్తమైనది. కాగా కవిత్రయం వారు ఆంధ్రీకరించి 21,507 పద్యగద్యాలలో హృద్యంగా ఆవిష్కరించారు. ఇక వాల్మీకి విరచితమైన శ్రీరామాయణం - ఆదిలో శతకోటి శ్లోక ప్రవిస్తరం కాగా - 24 వేల శ్లోకాలతో అనుగ్రహించారు.  శ్రీ రామాయణ, భారతాలు సంస్కారశోభితమైన మన వైదిక భారతీయ జాతికి నేత్రద్వయమైతే, భాగవతం మాత్రం హృదయసీమయే! ఈ మూడింటినీ కలిసి శ్రీ వైష్ణవులు రహస్యత్రయ సౌరభం’  అంటారు. అందుకే ఇవి హిరణ్యనిధి. 

         ఆంధ్రవాల్మీకి’ వాసుదాసస్వామి వారి మందరానికి జ్వాలాగారు అందించిన రుచులు (ఆయన ‘వాచవి’కద) ఆరు కాండలలో విస్తరించిన విశదవివరణమే నిదర్శనం.  మొదట వారు ‘సుందరకాండ’ ను సాంప్రదాయిక మర్యాదనునసరించి జుల నెల 2004 లో వ్యాఖ్యానం చేశారు.  సుందరకాండలో మొత్తం 68 సర్గలుండగా, దేనికదే ప్రత్యేకంగా 68 కథాంశాలుగా వివరిస్తూనే, చివరలో సుందరకాండ పారాయణ క్రమాన్నీ, ప్రాశస్త్యాన్ని వివరించారు. సుందరకాండ ‘బాపు’ గారి చక్కని చిత్రాలతో విశేష ఆదరణ పొంది, ప్రస్తుతం నాల్గవ ముద్రణకు సిద్ధమౌతోంది.   ఇది జ్వాలా గారి తొలి  శ్రీరామాయణ రచనం.   ఆనాటి MCR HRDI AP డైరెక్టర్ జనరల్, మహర్షిసత్తములు అయిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్, ఐ.ఎ.ఎస్. దీనిని ఆవిష్కరించారు.  నేను పుస్తక పరిచయ వాక్యాలను విన్నవించాను. 


         ఆ తరువాత క్రమంగా బాలకాండ, ఆయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధా కాండ, ప్రస్తుతం యుధ్దకాండలకు అనువక్తగా మందరాన్ని అందంగా వాచానువాదనం చేస్తూ వచ్చారు.   జూలై 2010లో బాలకాండను మెదట శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు ‘జీయరు శతాబ్ది శతగ్రంథమాల’లో భాగంగా ముద్రింపించి మజ్గాళాశాసనాలను అనుగ్రహించడం గమనార్హం! గణనార్హం! సత్సంప్రదాయానికీ, సనాతన ధర్మపథానికి నిలువుటద్ధంగా భాసించే ‘జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ ప్రచురణం సర్వజనామోద ప్రమోదం అయింది.   శ్రీ స్వామి వారి మాటలలో ‘తెలుగులో - ఆంగ్లంలో సమాన ప్రతిభ కల్గి ఉండటంతో సవ్యసాచిలా తమ వ్యాఖ్యానాన్ని అతి విలువైన సమాచారంతో నింపిన’ జ్వాలా వారు అభినందనీయులు! ఆ ఆతరువాత బాలకాండను రెండో మారు కూడా ముద్రించారు.

         అయోధ్యాకాండ, యుధ్దకాండలు విస్త్రుతమైనవి.   అయోధ్యాకాండ 119 సర్గలతో 4315 శ్లోకాలతో నడిచే కథనం. ఇది నవంబరు 2017లో ఆవిష్కరించబడింది. అప్పటికే జ్వాలాగారు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యధౌరంధర్యవ్యగ్రతలో వున్నా, శ్రీరామానుగ్రహం వల్ల చక్కగా వాసుదాసస్వామివారిని ‘సరళీకరించి’ లోక వ్యవహార భాషలో ‘మందరించారు’! మహా సహస్రావధాని మాడుగల నాగఫణిశర్మ గారు  ‘రామాయణంలోని అన్ని కాండలకు వాచవి వ్రాయుదురు గాక! ’ అని ఆశీర్వందించారు.  నిజానికి వాసుదాస్వామి వారు 110 సంవత్సరాల క్రితం  తమ 70 ఏట రోజుకు 20 గంటలు శ్రమించి ‘మందరాన్ని’ నిర్మించారు.  నేను ముందే మనవి చేసినట్లు వాసుదాసస్వామి వారే జ్వాలా గారిని ఆవహించి పరకాయ ప్రవేశం చేసి వుండకపోతే, జ్వాలా గారి బహుముఖ కార్యక్రమాల చక్రబంధంలో ఈ రామాయణం వ్రాయడం సాధ్యమయ్యేదా?! అయోధ్యకాండ భాషలో, భావంలో, భావప్రకటనంలో ‘కండ’ కలిగిన కలకండ కొండ! ఆధ్యంతములూ శ్రీరామ గుణసాగరతరంగములే ప్రతిధ్వనిస్తూంటాయి. వాటికి సంక్షిప్త సుంధరవచనానువాద పీయూషం  రసరమ్యకోశం!

         ఇక అరణ్యకాండ నవంబర్ 2018లో వెల్వడింది. ఇది అనుష్టానకాండ. అద్భుతమైన ఆర్షధర్మాలనూ,  ధర్మసూక్ష్మాలను నిష్కర్షించిన మహర్షి మహోపదేశమే అరణ్యకాండ. 

         జ్వాలాగారి అనువచనం అరణ్యకాండలో మరింత సుధాస్వాదమైంది. ప్రముఖ పాత్రికేయులు కావడం వల్ల సామాన్య పాఠకులకు అవగాహనా సౌలభ్యంగా వుండే విధంగా వారు మందరమకరందాన్ని మరింత మధురాయమానం గావించారు.  ముద్రాపకులు, ప్రచురణకర్తలు అయిన ‘దర్శనమ్’ మాసపత్రికాధిపతి శ్రీమాన్ మరుమాముల వేంకటరమణ శర్మ బొమ్మల గణేష్ తోడ్పాటుతో అద్భుతమైన ముఖచిత్రంతో, అందమైన అచ్చులో అందగించేలా ఆవిష్కరించడం అభినందనీయం!

         ఇక కిష్కింధకాండ జూలై 2019లో అచ్చుపడి, ముచ్చటగా బాపు శైలిలో గణేష్ ముఖచిత్రంతో ఆవిష్కరణ అయింది. ‘మందరం’ తెలుగువారి నిరుపమభాగ్య సంపద.  శ్రీరామానుగ్రహ ప్రాప్తికి దివ్యసాధనం.  జ్వాలా గారి రచన కేవలం ‘మందర’ వ్యాఖ్యానానికే పరిమితం కాలేదు. వాసుదాసస్వామి వారు ప్రయోగించిన ఛందోవృత్తాలు, సాహితీపిపాసికి  ‘వసంత కుసుమాకరాలు’, ‘పూర్ణచంద్రోదయాలు’.  జ్వాలాగారు వీటిని ప్రత్యేకించి చూసి, ఈ వృత్తాలను, వ్యాకరణ గ్రంథులను సైతం అవలోకనం చేసి వేరొక గ్రంథం వ్రాయడం జరిగింది.  శ్రీరామకథామృతపానం అలా వుంచితే, మందరంలో వాసుదాస స్వామివారు ప్రస్తావించిన అనేక రహస్యాలు, విశేషాలు, శాస్త్రాలు ఒక మహా విజ్ఞాన సర్వస్వంగా భాసిస్తాయి.    ఆ మహానుభావులు వాల్మీకి రామాయణాన్ని 108 సార్లు పారాయణం చేశారు.    ఆ వేళ శ్రీ సీతారాములకు ఏ  విధంగా వనవాసానంతరం మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని సురలు, మహర్షులు, సకల దేవతా గణాలు నిర్వహించాయో, యథాతథంగా  ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో 500 నదీ జలాలను తెప్పించి మహా సామ్రాజ్య పట్టాభిషేకాన్ని జరిపించిన ‘శతాభిషేకి’ వారు. ఇప్పటికీ అక్కడ వారు ప్రతిష్టించిన శిలాఫలకం మనకు స్పూర్తిమంతం చేస్తోంది.

         కిష్కింధకాండలో అనువక్త క్రొత్తదనాన్ని నింపడం జరిగింది. శాబ్ధికపారమ్యాన్నీ,  శ్రీరామావతార వైభవాన్ని వివరిస్తూనే,  ఇది  ‘జ్ఞానకాండ’ అన్న విషయాన్ని నవీకృతం చేశారు.   ఇది నిజానికి హనుమకాండ! కిష్కింధకాండలోనే ప్రథమంగా ‘హనుమ’ దర్శనమిస్తారు  శ్రీరామలక్ష్మణ సమేతులై! ఇందులో వర్ణనలు విశేషం.  వర్షఋతువర్ణనం, భౌగోళిక, ప్రాదేశిక వర్ణనం, వాలివధ విషయమై  ‘ధర్మచర్చ’, లౌకిక, ధర్మవివరణం - ఇలాంటి  మహా విషయాలు ఆలోచనామృతాలుగా నడిపిస్తాయి. వీటిని అనువచనం చేయడం క్లిష్టమే అయినా ‘వాగ్విదాంవరుని’ చలవతో జ్వాలాగారు సమర్ధంగా వ్యక్తపరచగలిగారు.  24 పుటలలో ‘రామాయణంలో ఏముంది - ఆంధ్రవాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి?’’ అన్న పీఠిక ఇందులో ప్రతివారు చదివి తీరవలసిన మంచి విషయం !

         ఇక యుద్ధకాండ. చాలా పెద్దకాండ.  ఆరవకాండ.  శ్రీరామపట్టాభిషేకంతో శుభ సమాప్తి.  దీని తరువాత ఉత్తరకాండ కూడా వున్నది.   కానీ దానిని  వాల్మీకి మహర్షి రచించాడనే విషయంలో  భేదాభిప్రాయాలున్నాయి.  ఏది ఏమైనా, ఉత్తరకాండ పారాయణం సంప్రదాయంగా తోచదు. యుద్ధకాండ 131వ సర్గ శ్రీరామపట్టాభిషేక సర్గ. దానితోనే శ్రీరామాయణ పారాయణానికి మజ్గాళాశాసనం.

         యుధ్ధకాండ  కథాంశం కంటే యుద్ధవర్ణనలు ఎక్కువ.   పాఠకులకు క్లిష్టంగా ఉంటుంది.    దీనిని అనువక్త  క్లుప్తంగా సుందరీకరించారు.    ప్రతి సర్గకు తనదైన శైలిలో వ్యాఖ్య వ్రాస్తూనే  పాఠక సౌలభ్యాన్ని దృష్టిలో వుంచుకొని మూలానికి, కథా సూత్రానికి భంగం కలుగనిరీతిలో  వ్రాయడం జరిగింది. మందరం మొత్తాన్నీ నవలా పఠనంగా నడిపించినందువలన  యుద్ధకాండలో కూడా మూలకథకు విధేయంగానే రచన సాగింది. అయితే చివరి సర్గలను కొంచెం విశేషంగా వ్యాఖ్యానిస్తే భవ్యంగా వుండేదనిపిస్తోంది. ఎలాగైతే ఏమి గాని, వాసుదాసస్వామి వారి చలవ జ్వాలాగారిపై  ప్రసరించింది.   వారిచేత తాను పలికిన కథను తాతగారు మనవడికి కథ చెప్పినట్లుగా జ్వాలాగారి చేత పలికించారు వాసుదాస స్వామి. ఇది జ్వాలా గారు చేసుకున్న సుకృతము.  శ్రీరామానుగ్రహఫలము.

         అన్ని కాండలను సాంగోపాంగంగా సంక్షిప్తీకరించిన చక్కని తృప్తితో... వీలైతే యధావిధేయంగా చిన్నపిల్లలకు  కథ చెప్పే విధంగా మరింత క్లుప్తసుందరంగా ‘శ్రీరామాయణ మందరా’న్ని వ్రాయాలని జ్వాలా గారికి సూచిస్తున్నాను.   అలాగే తెలుగు - ఆంగ్ల భాషలలో చేయి తిరిగిన రచయిత గనుక ఈ ‘వాచవి’ ని ఆంగ్లీకరించే ప్రయత్నం చేయాలనీ,  దానివల్ల విదేశియులకు సైతం వాసుదాసస్వామి వారిని, వారి మందరాన్నీ అనుసంధానించగలిగే భాగ్యం వారికి లభిస్తుందని నా ఆశంస!

         ఇక్కడ వాసుదాసస్వామి వారి గురించి ప్రస్తావించాల్సి వుంది.   శ్రీవారి జీవిత విశేషములను గురించి జ్వాలా నరసింహరావుగారు సంక్షిప్తంగా ఇందులోనే వివరించడం జరిగినదికద! 

         వావిలికొలను సుబ్బారావుగారే ‘వాసు’ దాసస్వామి. వారిది భారద్వాజ గోత్రము. ఆపస్తంబ సూత్రము.  గోల్కొండ వ్యాపారి శాఖకు చెందిన శ్రీవైష్ణవ సంప్రదాయస్థులు. విశిష్టాద్వైతులు.   పంచసంస్కారపరులైన నియోగి బ్రాహ్మణులు. వీరికి 15 ఏటనే క్షయరోగము సంభవించగా, పినతండ్రి లక్ష్మణరావు గారు సంరక్షించిరి. 73 సంవత్సరములు జీవించిరి. కాగా 47వ సంవత్సరమున భార్య రంగనాయకి గారు పరమపదించిరి. వాసుదాస స్వామి ఎన్నో మహాగ్రంథములను రచించిన మహానుభావులు.   వాటిలో ఆర్యకధా నిధులు.   హితచర్యమాలికా గ్రంథములు ధర్మశాస్త్ర సందేశములతో నిండినవి.  వారు స్థాపించిన  ‘భక్తి సంజీవని’ మాసపత్రిక అవిచ్ఛిన్నముగా సాగుచున్నది.  వాసుదాసస్వామి 108 పర్యాయములు శ్రీమద్రామాయణ పారాయణము, 108 శ్రీ సీతారామ కళ్యాణములు, 108 సామ్రాజ్య పట్టాభిషేకములు చేసిన మహా తపస్వి.

         శ్రీరామాయణము ధర్మశాస్త్రము.  ఇందులో రాజ, ప్రజా, పతి, సతీ, భ్రాతృ, పుత్ర, భృత్య, మిత్ర ధర్మములున్నవి.  శ్రీ రామాయణమ మంత్రశాస్త్రము.  ఇందులో ప్రతి అక్షరమూ మంత్రమేనని పెద్దల తీర్పు.  సుందరకాండకు మించిన మహామంత్రభాగము ప్రపంచములో మరొకటి లేదుకద!  గాయత్రీ బీజ సంయుతమని రామాయణమునకు ప్రసిద్ధి.  గాయత్రీ మంత్రమందలి  24 అక్షరములే  శ్రీరామాయణమందు 24 వేల శ్లోకములలో నిక్షిప్తమైనవి.

         శ్రీ వాసుదాసస్వామి వారు గుంటూరు జిల్లా తెనాలి సమీపములో నడిగడ్డపాలెము గ్రామమునందొక ఆశ్రమమును స్థాపించి, నిర్వహించినారు.  తదుపరి శ్రీశ్రీశీ శ్రీమన్నారాయణ (పెద్ద) రామానుజ జీయర్ స్వామి వారు, క్రమముగా శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి వారు దానిని నిర్వహించుచున్నారు. 

         శ్రీ వాసుదాసస్వామి వారు తరువాత తమ శిష్యులైన శ్రీ దాసశేషస్వామి వారు (యామర్తి సుబ్బారావుగారు 1890-1968), క్రమముగా శ్రీ శేషదాసస్వామి వారు (ఉలిచి ఆదిశేషయ్యగారు), శ్రీ నారాయణదాస స్వామివారు (ముదిగొండ సత్యనారాయణ గారు), ప్రస్తుతము శ్రీ రామానుజ దాసస్వామి వారు (వడ్లమూడి శ్రీమన్నారాయణ మూర్తిగారు)  ఆచార్యత్వము వహించుచున్నారు.   శ్రీ వాసుదాసస్వామి వారు తెనాలి - గుంటూరు మార్గములో గల అంగలకుదురు నందు శ్రీ కోదండ రామసేవక సమాజమును స్థాపించిరి. ఆ ఆశ్రమము ప్రస్తుతము పంచమ గురుస్థానీయులైన  శ్రీరామానుజదాసస్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ ఉలిచి సీతారామశర్మ (పట్టాభి), అర్చకస్వాములైన శ్రీ బలభద్రపాత్రుని సుబ్బారావు ప్రభృతుల సహాయ సహకారములతో దినదిన ప్రవర్థమానముగా నిర్వహించబడుచున్నది. వాసుదాస స్వామివారి  శ్రీరామాయణాది (మందరం)  గ్రంథములన్నియూ ఇచ్చట లభించుచున్నవి.   శ్రీ రామచంద్రస్వామి కైంకర్యముగా శ్రీ ఆత్మకూరి వేంకటశ్రీమన్నారాయణ గారు ఇటీవలనే మందర సంక్షిప్త ప్రతులను ఆంగ్లీకరించి ప్రాచుర్యము కల్పించినారు.

         అయోధ్యలోగల ‘వాల్మీకి మందిర్ (భవన్)’ లో  వాసుదాసస్వామి వారి ‘మందరము’ చక్కగా భద్రపరచబడి ఆరాధింపబడుచున్నది. వాసుదాస స్వామి వారు విశ్వవిఖ్యాతిగాంచిన ‘నోబెల్’  పురస్కారానికో, ‘భారతరత్న’ కో,  జ్ఞానపీఠ’ పురస్కారమునకో అర్హతనొందిన మహా విజ్ఞాన ప్రభాసంపన్నులు. పరిపూర్ణ శ్రీరామానుగ్రహ ప్రాప్తులు.  శ్రీ సీతారాముల కటావీక్షణములు శ్రీ జ్వాలా నరసింహరావు గారిపై ప్రసరించడము, వారి చేత మందరమునకు మందిరముగా ‘వాచవి’ గావించడమూ శ్రీ రామానుగ్రహ ఫలమే! దానివల్ల జ్వాలాగారు ధన్యులైనారు. వారి పితృపితామహప్రపితామహ పరంపరయూ తరించినది.  పుణ్యాత్ములైన  జ్వాలా నరసింహరావు గారిని శ్రీ సీతారామశ్రీచరణ పురస్సర అభినందనచందనము సమర్పిస్తూ విరమిస్తున్నాను.  

శ్లో||    భారద్వాజ కులోద్భవం వరకవిం శ్రీరామచంద్రాత్మజం
శ్రీవత్సాన్వయ నారసింహ కరుణాసంలబ్ధమంత్రోత్తమమ్|
సీతారామ పదాంబు జాత యుగళీ ధ్యానైక నిష్ఠారతం
వాల్మీకిం వరదేశికం గుణనిధిం శ్రీ వాసుదాసంభజే||
శ్లో||   యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే|
తావత్ రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి ||

విజయవాడ                                       శ్రీరామ - రామానుజదాసానుదాసుడు
3 డిసెంబరు, 2019                              చిలకపాటి విజయ రాఘవాచార్యులు
                                                 ప్రిన్సిపల్ (రిటైర్డు) ఎ.పి. గురుకుల డిగ్రీ కళాశాల,
                                       పూర్వ కార్యదర్శి, హిందూ ధర్మ పంచారపరిషత్తు, టిటిడి.

Wednesday, December 4, 2019

వాసుదాస విరచిత శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.....యుద్ధకాండ మందర మకరందం : అనువక్త-వాచవి, వనం జ్వాలా నరసింహారావు


వాసుదాస విరచిత శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం,
యుద్ధకాండ మందర మకరందం
అనువక్త-వాచవి, వనం జ్వాలా నరసింహారావు
ముందుగా నా మాట
పదహారు సంవత్సరాల యజ్ఞం పూర్తయింది. 2003 లో మా రెండో అమ్మాయి కిన్నెర సిన్సినాటి (అమెరికా) లో వున్నప్పుడు దాని కూతురు ప్రసవ సమయంలో సహాయంగా వుండడానికి  దంపతీ సమేతంగా వెళ్లిన నేను హైదరాబాద్ లో మొదలుపెట్టిన సుందరకాండ మందర మకరందం పుస్తకాన్ని పూర్తిచేసాను. కొంతకాలానికి, మిత్రుల, సన్నిహితుల ప్రోత్సాహంతో బాలకాండ మొదలుపెట్టాను. అయితే, కారణాలు ఏమైనప్పటికీ, ఆ తరువాత చాలాకాలానికి గాని, అంటే, 2009 లో మా అబ్బాయి ఆదిత్య అమెరికా సాన్ ఫ్రాన్సిస్కో నగరంలో వున్నప్పుడు, మా మనవరాలు కనక్ పుట్టే సమయంలో అక్కడికి పోయినప్పుడు, బాలకాండ మందర మకరందం పూర్తి చేయగలిగాను. అది తీసుకుని ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్తే మొత్తం రామాయణాన్ని రాసిన తరువాత అన్నీ కలిపి ముద్రిస్తానన్నాడు. అదోక ఛాలెంజ్ లాగా తీసుకున్నాను. అన్ని కాండలు రాయాలని నిశ్చయించుకున్నాను. బాలకాండ మొదటి ముద్రణ చిన జీయర్ స్వామి దయతో జరిగింది.

తరువాత అయోధ్య కాండ మందర మకరందం మొదలుపెట్టాను. అది సాగనివ్వదని పలువురు చెప్పిన మాట నిజమేమో అన్నట్లుగా అది పూర్తి చేయడానికి చాలా కాలం పట్టింది. దాన్ని హైదరాబాద్ లో, సింగపూర్ లో కూడా రాశాను. కాని చివరకు 2017 లో మరోమారు అమెరికా పర్యటనకు సాన్ ఫ్రాన్సిస్కో, హ్యూస్టన్ నగరాలకు అబ్బాయి, అమ్మాయిల దగ్గరికి వెళ్లినప్పుడు పూర్తి చేయగలిగాను. తరువాత రెండేళ్ళు అమెరికా రావడం కుదరలేదు. అరణ్యకాండ మందర మకరందం, కిష్కింధ కాండ మందర మకరందం హైదరాబాద్ లోనే పూర్తి చేశాను. యుద్ధకాండ మొదలు పెట్టాను. కాని అది కూడా అమెరికాలోనే పూర్తి కావాలని వుందేమో! అమెరికా రావడం (2019 నవంబర్) పూర్తి చేయడం జరిగింది. ఆ విధంగా మొత్తం రామాయణం ఆరు కాండలు రాయడానికి పదహారేళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. నేను రామాయణం రాయడానికి పూర్వ రంగం వుంది.        
 
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండు దశాబ్దాల క్రితం అదనపు సంచాలకుడిగా పనిచేస్తున్న రోజుల్లో అక్కడి ప్రభుత్వ క్వార్టర్స్లో నివసిస్తుండే వాడిని. మా పొరుగునున్న శ్రీమాన్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు లేచింది మొదలు నిద్ర పోయేదాక రామనామం తప్ప దేని మీద మనస్సు పోనీయడు. ప్రతినిత్యం రామాయణ పారాయణం చేస్తూ వుంటాడు. నా కంటే వయస్సులో చిన్న వాడైనా, జ్ఞానవృధ్ధుడు. నా నిత్య కృత్యాలు చాలవరకు ఆయనకు నచ్చవు. నేనంటే మాత్రం ఇష్టం. ఆయన ఉదయం అనుష్టానం చేసుకుంటుంటే, చనిపోయిన మా నాన్న స్వర్గీయ వనం శ్రీనివాసరావు గారు గుర్తొచ్చేవారు. నాన్నగారు వాసుదాసు గారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణం, మందరం అన్ని కాండల్నీ, కనీసం పాతిక సార్లకు పైగా పారాయణం చేసినవారు. వాసుదాసుగారూ ఆయన శిశ్యులు సుబ్బదాసుగారూ (దాసశేషుడు) ఖమ్మం జిల్లాలోని వనంవారి కృష్ణాపురం గ్రామంలో వున్న మా ఇంట్లో వారి పాదాలు మోపి మా ఇంటిని పావనం చేసారు.

మా శ్రీమతికి మా నాన్న గారి పూజ-పునస్కారాల వారసత్వం వచ్చింది. నాకంతగా అబ్బ లేదు. ప్రక్కనున్న విజయరాఘవ గారినీ,  ఆయన భక్తి సంబంధమైన మాటలను ఎప్పుడూ వింటుంటే ఆమె: " మీరు అన్న గారి మార్గంలోనన్నా పోతారు, లేదా, ఆయన మీ దారికన్నా వస్తారు" అనేది, మేమిద్దరం చర్చించుకుంటుంటే. అదే నిజమైంది కొద్ది రోజుల్లో. నేను రామాయణం చదువుతాను, మీదగ్గరుంటే ఇవ్వండి, అయితే వాసుదాసు గారు వ్రాసిన ఆంధ్రవాల్మీకి రామాయణం మాత్రమే కావాలన్నాను. అలా అడగటానికీ, అదే కావాలంటానికీ, ప్రత్యేక కారణం ఏమీ లేదు. కాకపోతే నా చిన్న తనంలో, మా నాన్న గారు "మందరం" పారాయణం చేస్తుంటే చూశాను కనుక అది మాత్రమే రామాయణమేమో అనుకున్నాను. ఆయితే నేను రామాయణం చదువుతానంటే ఆయన కొన్నాళ్ళు నమ్మలేదు. నేనూ గట్టిగా అడగనూలేదు. ఆయన ఇవ్వనూ లేదు. నేను ఆలోచన వచ్చిన వెంటనే చదవటమూ జరగలేదు.


         మళ్ళీ నిత్య జీవితం. దైనందిన చర్యలు. మధ్యలో మా జిల్లాలోనే వున్న భద్రాచల రాముడినీ, పొరుగు రాష్ట్రంలో ఉన్న శ్రీరంగనాధ స్వామినీ, దర్శించుకొనే భాగ్యం కలిగింది, డిసెంబర్ 2002-జనవరి 2003 లో. "శ్రీ రామావతార సమయంలో శ్రీ సీతా రాముల దర్శనం ఏదోవిధంగా కలగందే ఈ జన్మలో శ్రీరంగనాధుని (శ్రీరంగం) దర్శనం కలగనే కలగదు" అన్నారు విజయరాఘవ గారు. జనవరి 15, 2003 న తన ఇంట్లోకి పిల్చి, స్నానం చేసి రమ్మని, వాసుదాసుగారి శ్రీమదాంధ్రవాల్మీకి రామాయణం సుందరకాండ మందరం నా చేతిలో పెట్టారు. రామాయణం మొత్తం చదవడం తర్వాత, ముందిది చదవమన్నారు. ఎందుకంటే, రామాయణం పఠనమో, పారాయణమో సుందరకాండ తోనే మొదలెట్టాలన్నారు. అవునేమోననుకుని చదవడం ప్రారంభించాను.

         సరీగ్గా పది రోజుల్లో ఆసాంతం చదివాను. ఏరోజుకారోజు, వీలున్నప్పుడల్లా చదివేవాడిని. చదివిన విషయ సారాంశం ఎప్పటికప్పుడు బడి పిల్లాడిలా, విజయరాఘవ గారికి అప్ప చెప్పే వాడిని. వశిష్ఠుడి నోట బ్రహ్మర్షి అంటేనే విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడట! నేను చదువుతున్నానన్న నమ్మకం ఆయనకు కలిగితేనే నాకెందుకో తృప్తనిపిన్చేది. పదిరోజుల్లో చదవడం గొప్ప కాదు. నన్ను ప్రేరేపించి, ప్రోత్సహించి చదివించిన ఆయన గొప్పతనం అది. వాల్మీకి సంస్కృతంలో వ్రాసిన ఇరవైనాలుగు వేల శ్లోకాలను ఎప్పుడంటే అప్పుడు ప్రతిపదార్థంతో సహా అప్పచెప్పగల సమర్ధుడాయన!

ఆరువందల డెబ్భై పేజీల పద్య-గద్య-ప్రతిపదార్ధ తాత్పర్య సహిత సుందరకాండ మందరాన్ని చదవడానికైనా, పారాయణం చేయడానికైనా, నాలాంటి చాలామందికి తీరికా, ఓపికా వుండదేమో అనిపించింది. తెలుగు భాషలో కనీస ప్రావీణ్యత వున్నవారికి అర్ధమయ్యే రీతిలో వాసుదాసుగారి సుందరకాండ మందరాన్ని, ఆయనే "వక్తగా", నేను కేవలం "వాచవిగా"-"అనువక్తగా" సంక్షిప్తీకరించి నలుగురికీ అందించగలుగుతే బాగుంటుందేమో అనుకున్నాను. అలా రాస్తూ వచ్చి ఇప్పటికి పూర్వకాండలు మొత్తం ఆరు పూర్తి చేయగలిగాను. సహృదయులు ప్రోత్సహించాలని ప్రార్థన.
వనం జ్వాలా నరసింహారావు

The Valmiki Ramayana-2 .... Valmiki goes to River Tamasa for a sacred bath : Vanam Jwala Narasimha Rao


The Valmiki Ramayana-2
Valmiki goes to River Tamasa for a sacred bath
Vanam Jwala Narasimha Rao

(My 10-year-old granddaughter Kanak Vanam who lives in Redwood City, San Francisco, USA is a voracious reader even at this tender age. On seeing me writing Ramayana in Telugu whenever I come to USA, she asked me can’t it be in simple English so that she too can have the benefit of reading Ramayana. Once the same question was raised by my other granddaughters Mihira and Medha. Then I decided to do my best to write in English, as simple as possible. I made Kanak to read first couple of paragraphs and confirmed that she understands. Hence this weekly serial for her and for children of her age group)   
 
Valmiki on hearing the story of Rama narrated by Sage Narada, worshipped him along with his disciples. After Narada left the hermitage Valmiki with his disciples went around the banks of River Tamasa where he saw couple of crane birds, in the vicinity of that river's foreshore, flying there about in togetherness and chuckling delightfully. Even while Valmiki was looking at them, a tribal hunter killed the male bird with his arrow. Valmiki noticed the male bird slain on ground reeling with blood covered wings. The female bird on seeing the fate of his companion cuckooed with sorrow. On seeing the bird felled that way and the female bird out of state of compassion crying with sorrow the sage Valmiki cursed the tribal hunter. The sentences uttered by sage Valmiki surprisingly became a four-line stanza with each line equally postulated that had many meanings in it.

That was in fact the beginning of authoring Valmiki Ramayana. Valmiki determined to write Ramayana elaborating what sage Narada tutored him in brief. Later Valmiki completed his bathing in the River Tamasa and carrying his sacramental belongings like the water vessel etc. moved towards his hermitage along with his disciples. On the way to hermitage he mentioned about his stanza several times repeatedly to his disciples. All through the way he became thoughtful as to why his utterance in grief and anguish for the bird became a powerful stanza and the curse has become a blessing one? Valmiki, after returning to the hermitage along with disciples, was totally preoccupied on the stanza that he uttered. 
  
Lord Brahma comes to see Valmiki 
While Valmiki was thinking of his utterances and the way it became a purposeful Shloka, the Four-faced creator of universe, the almighty Lord Brahma, arrived there on his own, to see that distinguished saint Valmiki. Not knowing that Brahma arrived to his hermitage to execute a divine deed through him, Valmiki started searching for valid reasons. Brahma started keenly observing Valmiki.   

Brahma entrusts responsibility of
telling Ramayana to Valmiki
            Then Brahma told Valmiki the reason for his utterances in the form of a stanza. He said “Oh! Saint! What has come out of your mouth is really a Shloka-four lined stanza. Goddess Saraswathi made it come out from your mouth. There is no need to think through. That Shloka of yours came out from you at my instance and hence you shall render the legend of Rama, in its entireness. You shall narrate the legend of Rama. The entire story of Rama will be in front of your eyes in its totality to enable you to write it in detail. As long as Rama's legend authored by you flourishes, till then you will flourish in heavenly abode. Your Ramayana shall remain as a great legend for ever and ever”. On saying like this, the Brahma vanished from there. Valmiki decided to write Ramayana.

Sage Valmiki then authored the highly renowned Rama's legend eulogizing Rama's prominence, with evenly worded verses, and words yielding great meanings.

Valmiki through Yogic Insight
views the whole Rama story
Valmiki gets ready to see the Rama Story as it is and as it happened. The sage saw wholly and clearly by the yogic power conferred by Brahma on him. Valmiki through his absolute concentration was able to see Rama, Lakshmana and Seetha, also King Dasharatha, and his wives Kousalya, Sumitra and Kaikeyi as well as the whole of Ayodhya people and what happened to Rama when he was in kingdom Ayodhya. Valmiki wanted to see the whole of Rama Story and then pioneered to author all of the legend of Rama in its entirety.


Valmiki saw Rama’s birth, killing the monsters Subhahu and Tataka in his childhood, the citizen friendly attitude of Rama and his patience, people bestowing confidence on Rama, the truthfulness of Rama, his very great valor, his gracefulness to all, his universal cordiality, perseverance, courteousness, and his truthful conduct, stories narrated by Sage Vishvamitra, Rama's breaking the great bow of Shiva, marriage with Sita, dispute of Rama and Parashurama etc.

Valmiki also saw, the merits of Rama, preparations for Rama’s coronation, Queen Kaikeyi’s malicious intentions, disruption of coronation plan, Rama’s exile to forests, Dasharatha’s death, grief of Ayodhya people, Rama leaving them all and going to forests, meeting Guha, asking Sumantra to return to Ayodhya, crossing River Ganga, visiting hermitage of Sage Bharadwaj, seeing Chitrakoota, construction of a hermitage and dwelling there, Bharata's arrival at that place  to request Rama to come back, Rama's denial of it, Rama's offering water obsequies  to his father, crowning shoe-sandals of Rama by Bharata, Bharata's living in a village Nandigrama etc.

Valmiki further saw Rama's going to Dandaka forests, Killing Monster Viradha, Rama's visit to Sage Sarabhanga and Suteekshna, their visiting Anasuya, her giving a body cream to Seetha, visit to sage Agastya, conversation with Jatayuvu, living in Panchavati, defacing Shoorphanaka, killing of demons like Khara, Dhooshana and Trishirsa and the upsurge of Ravana thereby, killing of demon Mareecha who was in the form of a fake deer, Ravana's abduction of Sita, Raghava's anguish at the loss of Sita, Ravana's killing the mighty eagle Jatayuvu, Rama's seeing Kabandha, Shabari’s hosting, meeting and conversation of Rama and Hanuman etc.

Then Valmiki with his yogic insight saw Rama reaching Rushyamook along with Hanuman, friendship with monkey leaders Sugriva, killing Vali with one single arrow in the duel between Vali and Sugriva, Vali’s wife Tara’s grief for the deceased Vali, coronation of Sugriva to the Monkey Kingdom etc.

Continuing to know the further story of Rama, Valmiki with his yogic insight saw Rama’s annoyance on Sugriva for not taking up the work of searching Sita immediately after completion of monsoon, Sugriva immediately assigning the job to monkey leaders and instructing them to go to all the four corners, Sugriva briefing them about the places that they are likely to see in their pursuit etc.

Later Valmiki saw Rama giving his ring to Hanuman going towards southern part as his representation, Hanuman and his entourage monkey team entering the cave of Swayamprabha, Sampathi the brother of Jatayuvu informing monkeys that Sita is in captive in Lanka, Monkeys climbing Mahendragiri hill, Hanuman crossing the ocean, Mainaka requesting Hanuman to rest on his back for a while on way to Lanka, Surasa challenging Hanuman’s heroism, Hanuman killing Simhika, Hanuman crossing the ocean and entering Lanka, thinking of proper strategy to search Sita, Hanuman noticing the great Pushpak plane etc.

Valmiki also saw monster king Ravana’s residence with full of alcohol and brewery, Ravana’s central palace, Hanuman searching there for Sita, Hanuman watching Ravana talking to Sita in indecent language, Hanuman handing over Rama’s representative ring to Sita, guarding monster women threatening Sita, Trijata’s dream version, Sita giving her bejeweled hair slide to Hanuman to be shown to Rama, Hanuman uprooting of the trees and destroying the Ashoka Garden, Hanuman killing the guards of that garden, monster women complaining to Ravana, the demon heroes dying in the hands of Hanuman, Hanuman temporarily surrendering to Indrajit (Ravana’s son) Brahmastra (a divine and magical missile), Ravana-Hanuman conversation, Hanuman’s burning down Lanka, his return from Lanka etc.

Valmiki further saw Hanuman briefing his colleague monkeys about his trip to Lanka, monkeys consuming honey in the honey garden, Hanuman solacing Rama, presenting the jewel given by Sita, Nala's building the bridge on ocean, reaching Lanka, Rama with his army crossing over the ocean by the boulder bridge built by Nala, seizure of Lanka in night, Vibhishana the younger brother of Ravana coming to meet Rama, Rama killing Ravana, Kumbhakarna and Indrajit in the war, Sita’s entering the sacred fire and returning safely, Rama accepting her, coronation of Vibhishana, Sita-Rama-Lakshmana and others return journey to Ayodhya on the divine Pushpak Aircraft, Rama meeting Bharata in Nandigram, Sriram’s coronation, all those who accompanied Rama returning to their places etc.