రామలక్ష్మణుల దగ్గరకు బిక్షుక వేషంలో పోయిన హనుమంతుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి
రామాయణం... కిష్కింధాకాండ-7
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం
సంచిక (08-12-2019)
నిజస్వరూపంలో రామలక్ష్మణుల దగ్గరికి పోతే, పోయిన పని నెరవేర్చడం కష్టమని భావించిన హనుమంతుడు, వానర రూపం వదిలి, సన్న్యాసి లాగా తానున్న కొండ దగ్గరినుండి, వారిదగ్గరికి పోయి ఏకాగ్రచిత్తంతో, వినయంగా వాళ్లకు నమస్కారం చేశాడు.
(ఇక్కడ సన్న్యాసి రూపం ధరించిన హనుమంతుడు
గృహస్తుడైన రామచంద్రమూర్తికి ముందుగా తానే నమస్కారం చేయడం అంటే సర్వత్రా ఇలాంటి
ఆచారం సమంజసమని అనుకోవాలి. సన్న్యాసి గృహస్తుడికి నమస్కారం చేయడం భావ్యం కాదని
కొందరంటారు కాని, అది వాస్తవం కాదు. మనువాక్యమూ
కాదు....మనుశాస్త్రానికి విరుద్ధం కూడా. ఆ మాటకు మూలం ఏంటో, కర్త ఎవరో కూడా తెలియదు. జ్ఞానాధికుడైన గృహస్తుడికి
సన్న్యాసి నమస్కరించాలి అనేదే మనువాక్యం. హనుమంతుడు అత్యద్భుతములైన రామలక్ష్మణుల
ఆకారాలు చూసిన వెంటనే అధికానంద పరవశుడై తాను ధరించిన సన్న్యాసి ఆకారాన్ని కూడ
మరచిపోయి అవశంగా వారికి నమస్కారం చేశాడు. ఇది సర్వత్రా ప్రామాణికం కాదని కొందరి
అభిప్రాయం. ఇది యుక్తంకాదు. హనుమంతుడు నిపుణమతి. గొప్ప మంత్రి. రాముడి అభిప్రాయం
కనుక్కొని రమ్మని సుగ్రీవుడు పంపగా వచ్చాడు. అలాంటి వాడు ఆదిలోనే తనను తాను
మరచిపోతే తక్కిన కార్యం ఎలా నెరవేర్చగలడు? రామచంద్రమూర్తి ఎలా నమ్ముతాడు? రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహం చూడగానే వీరు
సుగ్రీవుడికి మేలు చేసేవారే కాని పగవారు కాదని నిశ్చయించిన హనుమంతుడు తాను
వేసుకున్న వేషం మారు వేషమనీ, తాను చారుడనీ
తెలియచేయడానికే నమస్కారం చేశాడు. ఇక్కడ బిక్షువు అంటే సన్న్యాసికాడు. బ్రహ్మచారి
అని కొందరంటారు. అదీ యుక్తం కాదు. హనుమంతుడు మొదటినుండీ బ్రహ్మచారే కాని, ఇప్పుడు కొత్తగా వేయలేదు. కాబట్టి హనుమంతుడు సన్న్యాసి వేషం
ధరించాడనీ, జ్ఞానాధికుడైన రామచంద్రుడికి, గృహస్తుడికి, నమస్కరించడం తప్పుకాదనీ చెప్పాలి).
సుమనోజ్ఞంగా, సౌమ్యంగా, వంచనలేని
మాటలు చెప్పి, రాజకుమారులను తృప్తికావించి, సుగ్రీవుడి అభిప్రాయానికి సరిపోయేట్లు తన అభిప్రాయాన్ని
చెప్పాడు హనుమంతుడు రాముడితో ఇలా.
"అయ్యలారా! మీరెవరు? ఈ అడవి ప్రదేశానికి ఎందుకు వచ్చారు? మీలాంటివారు తిరగాల్సిన స్థలం కాదిదే? ఎందుకంటే మీరు రాజర్షులతో, దేవతలతో సమానంగా వున్నారు. అలాంటివారికి ఇలాంటి చోట ఏమిపని? మీరు రాజర్షులని నాకెలా తెల్సిందంటారా? మీరు ధరించిన మునిరాజుల వేషాలు అది తెలియచేస్తున్నది. మీలో రాజవేషం , ముని వేషం రెండూ కలిసి వున్నాయి. అలా అయితే మీరు సంకరులని
నా అభిప్రాయం కాదు. మీరేదో మంచి వ్రతం పూని ఇలా వున్నారని నేను అనుకుంటున్నాను.
ఇలాంటి వ్రతం మీరు పూనడానికి కారణమేంటి? మీ దేహాలు, వాటి కాంతి
చూస్తుంటే అవి వ్రతాల వల్ల తపించ తగినదిగా కనబడడం లేదు. నేనింతగా మాట్లాడినా, నాతో మాట్లాడకుండా కొలను ఒడ్డున వున్న చెట్లను
చూస్తున్నారు. ఇలాంటి చెట్లను మీరు ఈ అడవిలో చూడలేదా? మిమ్మల్ని చూసి ఈ అడవిలోని పక్షులు, మృగాలు భయంతో పరుగెత్తుతున్నాయి. మీ దేహకాంతి ఈ నిర్మలమైన
జలాలమీద పడి దానికి మెరుగు పెట్తున్నట్లు వుంది. ఇంత ఘోరారణ్యంలో మీరిద్దరే తిరగడం
అంటే మీకు భయం లేదన్న మాట. మీరు భయమెరుగని ధైర్యవంతుల్లాగా వున్నారు. మీ శరీరాలు
భంగారు చాయగా వున్నాయి. మంచి వయసులో వున్నారు మీరు”.
"సింహాల చూపుల్లాంటి
చూపులు, సింహాల పరాక్రమంలాంటి పరాక్రమం కలవారు మీరు. ఇంద్రచాపాల్లాంటి
పెద్ద విల్లులను చేతిలో ధరించి వున్నారు. స్థిరకాంతి సంపద కలవారిలా వున్నారు.
బలసిన ఆబోతులలాగా నడుస్తున్నారు. మీ భుజాలు ఏనుగు తొండాల్లాగా వున్నాయి. ఇలా
వున్నా చూడడానికి అందంగా, మహిమలో దేవతలకు సమానంగా వున్నారు. కాబట్టి
ఎలాంటి శత్రువునైనా చంపగల సమర్థులు మీరు. ఎంధుకు మీద-మీద నిట్టూర్పులు
విడుస్తున్నారు? నడిచిన అలసట వల్లా? మిమ్మల్ని చూసి పక్షులు భయపడుతున్నాయి. ప్రాజ్ఞులారా! మీ
చిహ్నాలు చూస్తుంటే బంగారు సింహాసనాల మీద వుండతగ్గవారిలాగా కనిపిస్తున్నారు.
ఇలాంటి వీరులు, మీరెందుకు నారచీరెలు కట్టి జడదారుల్లాగా జడలు
ధరించి తిరుగుతున్నారు? మీ యోగ్యతకు, మీ ఇప్పటి స్థితి, పరస్పర విరుద్ధంగా వుండడానికి కారణం ఏంటి?”
“అసమాన కాంతితో కొండలను, అడవులను ప్రకాశించేట్లు చేస్తున్నారు. ఒకరికి ఒకరు సమానంగా
వున్నారు. విశాలమైన వక్షాలున్నాయి మీకు. పెద్ద-పెద్ద బాహువులున్నాయి. దేవతాకాంతితో
ప్రకాశిస్తున్నారు. ఆకాశాన్ని విడిచి ఈ లోకాన్ని చూసిపోవడానికి క్రీడకోసం వచ్చిన
సూర్య-చంద్రుల్లాగా వున్నారు. నిజంగా మీరెవరు? మీ చేతులు ఇసుకపట్ల గుదియల్లాగా గట్టిగా, సుందరంగా, మోకాళ్లను అంటుతూ, గుండ్రటి ఆభరణాలు ధరించడానికి
యోగ్యమైనవిగా వున్నాయి. ఎందుకు మీరు ఆభరణాలు ధరించలేదు?
ఆభరణాలతో కప్పిపెట్టుకుంటే మీ ఆయయవాలకు దృష్టి తాకుతుందా?
మీరు ఆభరణాలు ధరించినట్లయితే అవే లోకాన్ని వశపర్చుకుంటాయి. నిరావారణమైన మీ దేహ
సౌందర్యం ఎందుకు కనపడాలి? ఆభరణాలు ధరించకుండా, కేవలం ఆయుధాలు ధరించడం చూస్తే మీరేదో శత్రుసంహార కార్యక్రమానికి
సిద్ధమైనట్లు కనపడుతున్నది. మీరు ఆభరణాలు ధరించకపోయినా మీకు కలిగే సౌందర్య హాని
ఏమీ లేదు. కాని అవి తేజోహీనులై పడివున్నాయి కదా? మిమ్మల్ని
ఆశ్రయించిన వాటిని తేజోహీనులుగా చేయవచ్చా?”
“అడవులతో, సముద్రాలతో, మేరు-వింధ్య శ్రేణులతో ప్రకాశించే ఈ
భూమండలమంతా పరిపాలించే యోగ్యతవున్నవారైనప్పటికీ ఇలాంటి దీన దశలో ఎందుకున్నారు? మీ విల్లు-బాణాలు చూడడానికి ఇంద్రుడి వజ్రాయుధానికి సమానంగా వున్నాయి.
ఇలాంటివి లోకంలో సాధారణంగా కనపడవు. మీ అమ్ములపొదలు పగవారి ప్రాణాలు తీయడానికి బుసకొట్టే
పాముల్లాగా బాణాలతో నిండి వున్నాయి. చూడడానికి నాణాల్లాగా శుభకరంగా వున్నాయి. చాలా
నిడివి, వెడల్పు కలిగి చూడడానికి భయంకరంగా అపరంజి బంగారంతో
కలిసిన మీ కత్తులు కుబుసం విడిచిన పాముల్లాగా వున్నాయి”.
(హనుమంతుడు ఇన్ని ప్రశ్నలు వేసినా
రామలక్ష్మణులు ఆయన మాటల సొంపు-పెంపు వింటూ వూరకే వున్నారు తప్ప ఒక్కదానికైనా
జవాబివ్వలేదు. కారణాలు అనేకం వుండొచ్చు. ఆయన మాటలపట్ల ఆసక్తి కావచ్చు. తాము
మాట్లాడితే ఆయన మాటలు వినే అవకాశం కోల్పోవచ్చు. సన్న్యాసులు తిరగకూడని ప్రదేశంలో
తిరుగుతున్న ఈ సన్న్యాసి నిజమైన సన్న్యాసా? కాదా? అన్న సందేహం కావచ్చు. బిక్షకోసం వచ్చిన
సన్న్యాసి అయితే ఆయన స్థితిగతులు చెప్పుకోవాలి కాని తమ స్థితిగతులను గురించి
ఎందుకు అడగాలి? వేగులవాడేమో! ఇక్కడ పరస్పర శత్రువులైన
వాలి-సుగ్రీవులలో ఇతడు ఎవరి పక్షమో? కాబట్టి ముందుగా తానెవరో
చెప్పిన తరువాత మాట్లాడుదామని రామలక్ష్మణులు భావించి వుండాలి.
ఇక హనుమంతుడు వేరే విధంగా ఆలోచించ సాగాడు.
తానెంత మాట్లాడినా వీళ్లు బదులు చెప్పడం లేదు. తనమీద వీరికి సందేహం కలిగిందేమో? ఆ సందేహం తీరేవిధంగా తాను సంభాషిస్తేనేగాని
వాళ్లు తనను నమ్మి తనతో మాట్లాడారని అనుకుంటాడు. వీళ్లు గొప్పవారిలాగా వున్నారు
కాబట్టి వీళ్ల స్నేహం తప్పక చేయాలి అని ఆలోచించి తన వృత్తాంతాన్ని కపటం లేకుండా
చెప్పడం ఆరంభించాడు).
“ఆర్యులారా! నేనింతసేపు మాట్లాడినా మీరొక్క
మాటైనా బదులు ఇవ్వలేదు. ఇక నా వృత్తాంతాన్ని చెప్తా వినండి. ఈ ప్రాంతంలో
సుగ్రీవుడు అనే ఒక ధర్మాత్ముడు, కోతిరాజు, వీరుల గౌరవానికి పాత్రుడు వున్నాడు. అతడిని ఆయన అన్న వెళ్లగొట్టితే
నిలువనీడలేక, ప్రాణ భయంతో అమితంగా బాధపడ్తూ దేశంలో
తిరుగుతున్నాడు. మీ స్నేహం కోరి ధర్మాత్ముడైన సుగ్రీవుడు పంపుతే మీ దగ్గరికి
వచ్చాను నేను. నేనాయన మంత్రిని. వాయుపుత్రుడిని. నా పేరు హనుమంతుడు. నేను
వానరుడిని. కోరిన రూపం ధరించి, కోరిన ప్రదేశానికి వెళ్లగలను.
సుగ్రీవుడి మేలు కోరి సన్న్యాసి వేషంలో ఋశ్యమూకం నుండి ఇక్కడికి వచ్చాను” అని
చెప్పి హనుమంతుడు మౌనం దాల్చాడు.
(దీంతో రామలక్ష్మణుల సందేహం తీరింది.
వాలి-సుగ్రీవుల పేర్లు, వాలి సుగ్రీవుడిని వెళ్లగొట్టడం,
సుగ్రీవుడు ఋశ్యమూకం మీద వుండడం, ఇవన్నీ
రామలక్ష్మణులకు తెలిసిన విషయమే. కాబట్టి సందేహానికి తావు లేదు. ఆ తరువాత తాను
సుగ్రీవుడి మంత్రినని చెప్పాడు హనుమంతుడు. అంటే సుగ్రీవుడి పక్షంవాడని
అర్థమయింది).
హనుమంతుడి మాటలకు సంతోషించిన రాముడు, తమ్ముడు లక్ష్మణుడిని చూసి ఇలా అన్నాడు.
No comments:
Post a Comment