Saturday, November 20, 2021

గెలిచింది బృహన్నల, తాను కాదని చెప్పిన ఉత్తరుడు ...... ఉత్తరాభిమన్యుల వివాహం ..... ఆస్వాదన-47 : వనం జ్వాలా నరసింహారావు

 గెలిచింది బృహన్నల, తాను కాదని చెప్పిన ఉత్తరుడు

ఉత్తరాభిమన్యుల వివాహం

ఆస్వాదన-47

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (21-11-2021)

ఉత్తర గోగ్రహణంలో విజయం సాధించి తండ్రిని చూడడానికి వచ్చిన ఉత్తరుడికి కంకుడి ముఖం మీద వున్న గాయం కనిపించింది. ఇదేమిటని తండ్రిని అడిగాడు. సమాధానంగా విరాటుడు, తాను ఉత్తరుడి విజయాన్ని పొగడుతూంటే కంకుడు ఆ విజయం పేడి బృహన్నలదని అన్నాడని, దానితో కోపం వచ్చి సహించలేక వెనుకా-ముందూ చూడకుండా తాను పాచికతో కొట్టానని చెప్పాడు. తండ్రి తప్పు చేశాడని, పెద్దల మాట వినాలి కాని కోపగించుకోవడం తగదని అన్నాడు ఉత్తరుడు. దాంతో విరాటుడు ధర్మరాజును క్షమాపణ కోరాడు. తనకసలు కోపమే రాలేదని చెప్పాడు ధర్మరాజు. అదే సమయంలో అంతదాకా బయటే వేచి వున్న బృహన్నల లోపటికి వచ్చాడు. విరాటుడు అతడిని ఆదరించాడు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణ మొదలైన కౌరవ మహావీరులను ఒక్కడే ఎదిరించి ఎలా గెలిచాడని, ఆవులను ఎలా మళ్లించగలిగాడని ప్రశ్నించాడు ఉత్తరుడిని విరాటుడు.

కౌరవ సేనలను గెలిచింది తాను కాదని, ఆవులను మరల్చింది కూడా తాను కాదని, దైవబలం ఉన్నందున ఒక మహానుభావుడు, దేవాంశ సంభూతుడు వచ్చి యుద్ధంలో తనను కాపాడి, కౌరవులను ఓడించి, ఆవులను మరలించాడని జవాబిచ్చాడు ఉత్తరుడు. కౌరవ సేనలు ఆ దివ్యపురుషుడిని చుట్టుముట్టాయని, దుర్యోధనుడు సేనతో సహా ఎదురు తిరిగాడని, యుద్ధం ఘోరంగా జరిగిందని, శత్రువులంతా దివ్యపురుషుడు వేసిన బాణాలకు యుద్ధభూమిలో పడిపోయారని, ఎదిరించిన కర్ణుడిని ఓడించాడని, ద్రోణుడిని కూడా దివ్యపురుషుడు గెలిచాడని, భీష్ముడు కూడా వశం తప్పాడని, చివరకు దివ్యపురుషుడి ధాటికి కౌరవ సేనలు వెనుతిరిగాయని చెప్పాడు ఉత్తరుడు. ఎవరా దివ్యపురుషుడని అడిగాడు విరాటుడు. అతడు అదృశ్యమయ్యాడని మళ్లీ వస్తాడని అన్నాడు ఉత్తరుడు.

ఆ తరువాత బృహన్నల నాట్యశాలకు వెళ్లి యుద్ధ రంగం నుండి తాము తెచ్చిన కౌరవుల బొమ్మపొత్తికలు ఉత్తరకు ఇచ్చాడు. ఆ తరువాత పాండవులు, ద్రౌపదీదేవి ఒక రహస్య స్థలంలో కలుసుకుని ఉత్తర గోగ్రహణం విషయాలను ముచ్చటించుకున్నారు. విరాటుడు తనను పాచికతో కొట్టిన విషయాన్ని చెప్పాడు ధర్మరాజు అర్జునుడికి. అర్జునుడికి కోపం వచ్చినప్పటికీ ధర్మరాజు సర్ది చెప్పాడు. తమ్ములంతా శాంతించారు. తామొచ్చిన పని అయిపోయింది కాబట్టి ఏవిధంగా విరాటుడి కొలువు కూటం నుండి బయటపడాలని ఆలోచన చేశారు. ఇంతలో రాత్రి గడిచింది. తెల్లవారుజామునే లేచారు. స్నానాది కార్యక్రమాలు ముగించుకున్నారు. గౌరవప్రదమైన వేషాలతో రాచనగరికి సంతోషంగా వెళ్లారు.

వెళ్లిన తరువాత ధర్మరాజు సింహాసనం మీద కూచున్నాడు. తమ్ములంతా వారికి తగ్గ ఆసనాలమీద కూచున్నారు. కొలువుకు వచ్చిన విరాటుడు వారిని ఆ విధంగా చూసి ఆశ్చర్యపడ్డాడు. సాధువృత్తికల ధర్మరాజు ఎందుకలా తన సింహాసనం మీద కూచున్నాడని ప్రశ్నించాడు. దానికి జవాబుగా అర్జునుడు, సింహాసనం మీద కూచున్నది రాజసూయ యాగం చేసి అందరినీ గెలిచిన అజాతశత్రువు ధర్మరాజని చెప్పాడు. అతడు భూమండలం అంతా దిగ్విజయం చేసిన మహానీయుడన్నాడు. ఆయన ధర్మారజైతే భీమార్జున నకుల సహదేవులేరీ అని అడిగాడు విరాటుడు. వలలుడు భీముడని, దామగ్రంథి నకులుడని, తంత్రీపాలుడు సహదేవుడని, సైరంధ్రి వేషంలో మాలిని అన్న పేరుతో సుదేష్ణ  దగరున్నది ద్రౌపదీదేవని జవాబిచ్చాడు అర్జునుడు. అప్పుడు భీముడు కలిగించుకుని పేడి రూపంలో బృహన్నల అన్న పేరుతో విరాటుడి కూతురుకు నాట్యం నేర్పుతున్నది అర్జునుడని అన్నాడు.

అప్పుడు అక్కడే వున్న ఉత్తరుడు ఆర్జునుడిని చూపిస్తూ, తాను చెప్పిన దివ్యపురుషుడు అతడే అని అన్నాడు. అతడొక్కడే కౌరవ సేనను ఓడించాడని చెప్పాడు. ఇదంతా విన్న విరాటుడికి భయం, గౌరవం, సంతోషం ఒక్కసారే మనస్సులో వ్యాపించాయి. గౌరవంతో ఆర్జునుడిని కౌగలించుకున్నాడు. ధర్మరాజుకు సాగిలపడి మొక్కాడు. భీమ, నకుల, సహదేవులను కౌగలించుకున్నాడు. విరాటుడు తన పరివారాన్నంతా పిలిచి పాండవులను పరిచయం చేశాడు. రాణీవాసానికి కబురు చేసి ద్రౌపదీదేని తగిన విధంగా గౌరవించాలని సుదేష్ణను ఆదేశించాడు. అర్జునుడు తామిన్నాళ్లు విరాటరాజు దగ్గర వున్నందుకు ధన్యవాదాలు చెప్పాడు. అదంతా తన పుణ్యం అన్నాడు విరాటుడు. ఇక తన రాజ్యం అంతా ధర్మరాజుదేనని అన్నాడు.

ఉత్తరను తీసుకురమ్మని మంత్రులను ఆదేశించాడు విరాటుడు. ఆమెను సింగారించి ధర్మారాజు ఎదుటికి తెచ్చారు మంత్రులు. ఆ కన్యను అర్జునుడికి చేసుకొమ్మని అన్నాడు విరాటుడు. తాను ఉత్తరకు తండ్రి సమానుడినని, అందుకే ఆమెను తాను భార్యగా కాకుండా కోడలుగా స్వీకరిస్తానని చెప్పాడు అర్జునుడు. ఆమెను అభిమన్యుడు వివాహమాడుతాడని అన్నాడు. ఆ తరువాత దైవజ్ఞులను పిలిచి లగ్న నిశ్చయం చేయించారు.

ఇంతలో దుర్యోధనుడు పంపిన దూత వచ్చి ధర్మారాజాదుల అజ్ఞాతవాసం పూర్తికాక ముందే అర్జునుడు బయటపడ్డాడని రాజు మాటలుగా చెప్పాడు. తాము శపథం చేసినట్లుగా పదమూడేళ్లు అరణ్య, అజ్ఞాతవాసాలు ముమ్మాటికీ నిండాయని చెప్పమన్నాడు ధర్మరాజు. దూత అవే మాటలను దుర్యోధనుడికి చెప్పాడు. ధర్మారాజు చెప్పినదాన్ని భీష్ముడు ధృవపరచాడు.

ఆ తరువాత పాండవులు జమ్మిచెట్టుమీద దాచిన తమ సమస్త ఆయుధాలను తెచ్చుకుని ఉపప్లావ్యంలో నివసించారు. ఒకానాడు శ్రీకృష్ణ బలరామాదులు, ద్రుపద మహారాజు వచ్చారు వారిని చూడడానికి. పాండవులు వారికి తగిన మర్యాదలు చేశారు. శ్రీకృష్ణుడు, ద్రుపద మహారాజు అనేక బహుమానాలను తెచ్చారు పాండవులకు ఇవ్వడానికి. అదే విధంగా అనేకమంది రాజులు ఉత్తరాభిమన్యుల వివాహానికి వచ్చారు. విరాటరాజు నగరంలో వివాహ మహోత్సవం చాటింపు వేయించారు. ఊరంతా అందంగా అలంకరించారు.

శాస్త్రోక్తంగా జరగాల్సిన వివాహ పూర్వరంగంలోని పనులన్నీ జరిగాక, జ్యోతిష్కుడు దగ్గరుండి గుణించి శుభలగ్న సమయాన్ని సరిగ్గా తెలపగా మంగళ వాద్యాలు మోగుతుంటే ఉత్తరాభిమన్యుల మధ్యనున్న తెర ఎత్తారు. వధూవరులు ఒకరినొకరు చూసుకున్నారు. తలంబ్రాలు ఒకరి దోసిలి నుండి ఇంకొకరి దోసిలిలో పోసి పరస్పరం తలమీద పోసుకున్నారు. అభిమన్యుడు ఉత్తర మృదువైన హస్తాన్ని మృదువుగా గ్రహించాడు. ఈ విధంగా పాణిగ్రహణం జరిగింది. ఈ విధంగా విరాటరాజు ఉత్తరాభిమన్యుల వివాహం నిర్వహించాడు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, పంచమాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

        

 

 

Sunday, November 14, 2021

విశ్వామిత్రుడిని విశాల నగర వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-81 : వనం జ్వాలా నరసింహారావు

 విశ్వామిత్రుడిని విశాల నగర వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-81

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (15-11-2021)

ఇంద్ర సమానుడైన విశ్వామిత్రుడు చెప్పిన కథలను వినగా-వినగా, తమ ఇరువురికీ, చాలా ఆశ్చర్యం కలిగిందని, సంతోషంగా మృధువైన మాటలతో ఆయనకు చెప్పి, రామ లక్ష్మణులు ఆ రాత్రంతా విశ్వామిత్రుడు చెప్పిన కథలను స్మరించుకున్నారు. సగర చక్రవర్తి సంపద, వైభవం-తన కొడుకని కూడా చూడకుండా భార్యతో సహా అసమంజుడిని అడవులకు పంపిన ఆయన ధర్మాభిమానం-అంశుమంతుడి సౌజన్యం, సంపత్తి-సాగరులు పితృవాక్య పాలన కొరకు చేసిన మహా కార్యం, పితృభక్తి-భగీరథ ప్రయత్నం, ఆయన కార్య సాధకత్వం-గంగా పతనం, మొదలైన సంఘటనలకు సంబంధించిన వ్యక్తుల గుణగణాలను మెచ్చుకుంటూ వారిరువురు సూర్యోదయం వేళ దాకా గడిపారు. సూర్యుడు తూరుపు కొండమీద కి రాగానే, ప్రాతః కాల కృత్యాలను తీర్చుకొని, విశ్వామిత్రుడి వద్దకు పోయి, ఆయనకు నిర్మలమైన భక్తితో నమస్కరించారు. రాత్రంతా విశ్వామిత్రుడు చెప్పిన కథలను గురించే తామిద్దరం ముచ్చటించుకున్నామని, తమందరం ఇక్కడ వున్న విషయం తెలుసుకున్న అక్కడి మునులు-మహా పుణ్యాత్ములు, సుఖాసనాలతో కూడిన ఓడను తమకొరకై పంపారని, దాంట్లో గంగను దాటిపోదామా? అని ఆయన్ను అడిగారు రామ లక్ష్మణులు. వారు చెప్పినట్లే, గారాబంతో వారి మాటలను విన్న విశ్వామిత్రుడు, శ్రీరామ లక్ష్మణులతో-ఋషీశ్వరులతో కలిసి, గంగ దాటి, ఉత్తరం వైపున్న ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ, ప్రాకారాలతో, కుల పర్వతాలను మించిన మేడల గుంపుల కాంతులతో, తియ్య మామిడి లాంటి ఫల వృక్షాలతో స్వర్గాన్నే మరిపిస్తున్న విషాల నగరంలోకి ప్రవేశించగానే, రాజకుమారుడైన రామచంద్రమూర్తి, మహాత్ముడైన విశ్వామిత్రుడితో, ఆ నగరాన్ని ఏలే రాజెవ్వరని-ఏ వంశం వాడని, అడిగాడు. సమాధానంగా మునీంద్రుడు ఆ కథనంతా చెప్పాడీవిధంగా:

"రామచంద్రా, పూర్వం కృతయుగంలో, వీరులైన దైత్యులు-శౌర్యంలోను, విస్తారంగా ధర్మ కార్యాలు నిర్వహించడంలోను ప్రీతిగలిగిన దేవతలు, తమకు ముసలితనం-మరణం-వ్యాధులు లేకుండా, హాయిగా వుండేందుకు మార్గమేంటని ఉమ్మడిగా ఆలోచించారు. పాలసముద్రం చిలికి-అందులోంచి పుట్టిన అమృతాన్ని భుజించినట్లైతే, తమకు మరణముండదని-ముసలితనం రాదని ఆలోచించి, మందర పర్వతాన్ని కవ్వంగా-వాసుకు తాడుగా, పాలసముద్రాన్ని చిలకడం మొదలెట్టారు. అలా వారు వేయి సంవత్సరాలు చిలకగా, ఆ రాపిడిని సహించలేక, వాసుకి విషాన్ని కక్కాడు. ఆ వేడికి కొండ రాళ్లు పగలడంతో పాటు, భయంకరమైన హాలాహలం రాక్షసులను, దేవతలను భస్మం చేయసాగింది. అంతులేని తాపాన్ని కలిగిస్తున్న హాలాహలాన్ని హరించేందుకు, వారందరూ, పాహి-పాహి అంటూ శివుడిని ప్రార్థించారు. మిక్కిలి భక్తితో ప్రార్థించిన వారికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అదే సమయంలో శంక చక్రాలను ధరించిన విష్ణుమూర్తి అక్కడ కొచ్చి, చిరునవ్వుతో, దేవతలు చిలికినప్పుడు మొట్టమొదటగా పుట్టిన సహించలేని విషాన్ని, దేవతల్లో పెద్దవాడైన శివుడు-ప్రధమంగా గౌరవించాల్సిన శివుడు, అందరికంటే ముందుగా మంచి మనస్సుతో తీసుకొమ్మని చెప్పాడు".

హాలాహలాన్ని మింగిన శివుడు

"విష్ణుమూర్తి అలా చెప్పి వెళ్లగానే, భయపడుతున్న దేవతలను చూసిన శివుడు, విష్ణువు చెప్పినట్లే, విషాన్ని కంఠంలో ధరించాడు. వెంటనే దేవతలు, తిరిగి పాలసముద్రాన్ని చిలుకుతుండగా, వాళ్లు కవ్వంగా వాడుతున్న మందర పర్వతం పుటుక్కున మునిగింది సముద్రంలో. అది చూసిన దేవతలు, ప్రపంచాన్ని-ముఖ్యంగా తమను రక్షించే విష్ణుమూర్తిని, కొండ మునుగుతున్నదని-దాన్ని పైకెత్తి పట్టగల సమర్థుడు ఆయనేనని-ఆయనను సేవిస్తుండే వారు ఆపదల పాలవుతుంటే వూరకుండరాదని-ఆశ్రిత రక్షణ చేసి, తమను కాపాడమని ప్రార్థించారు. దేవతల ప్రార్థనలను విన్న విష్ణుమూర్తి, ప్రపంచ శరీరానికి ఆత్మగా వుండే దేవాదిదేవుడు, తానూ దేవతల్లో ఒకడై, ఒక చేయి కొండ కొనలో నిలిపి, కొండకింద తాబేలు ఆకారంలో మందరాన్ని మోస్తూ, స్వయంగా అమృతం కొరకు చిలక సాగాడు".

క్షీర సముద్రంలో ఉదయించిన ధన్వంతరి-తదితరములు

"స్థిరంగా-విఘ్నాలు లేకుండా, వేయి సంవత్సరాలు అలా చిలకగా, పాల సముద్రంలో తొలుత, యాగదండం-కమండలువు ధరించి, వైద్యుడైన ధన్వంతరి పుట్టాడు. పాల సముద్రంలోని జల వికారమైన పాలను చిలుకగా-చిలుకగా, సారం పుట్టింది. ఆ రసంలోంచి అందగత్తెలైన అరవైకోట్ల అప్సరసలు పుట్టారు. వారికెందరో పరిచారికలుండడంతో-వారిని లెక్కించడానికి ఎవరి తరం కాకపోవడంతో, ఆ స్త్రీలను దేవతలుగాని, రాక్షసులుగాని స్వీకరించలేదు. అప్సరసల పరిచారికలను ఎవరూ, కామంతో గ్రహించనందున, మగవారందరితోనూ సమాన పతి భావంతో ప్రవర్తించే వేశ్యలుగా-వార కాంతలుగా వారు పిలువబడ్డారు. తననెవరు స్వీకరించనున్నారోనని అనుకుంటూ బయట కొచ్చిన వరుణుడి కూతురు సురను, అసురులు వద్దనడంతో, దేవతలు ఇష్టంగా పరిగ్రహించారు. సురను దైత్యులు గ్రహించనందునే "అసురులు" గా పేరు తెచ్చుకున్నారు. స్వీకరించిన దేవతలు సురలై, దేహమంతా గగ్గురుపాటుగలిగే విధంగా సంతోషించారు. మరికొంత చిలుకగా, ఉచ్చైశ్రవం అనే గుర్రం పుట్టింది. తర్వాత కౌస్తుభం అనే రత్నం కలిగింది. అప్పుడు అమృతం పుట్టింది. చివరకు అమృతమే అసురుల వంశాన్ని నాశనం చేసింది".

"అమృతం ఎలా వారి వంశాన్ని నాశనం చేసిందని సందేహం కలగొచ్చు. అమృతం పుట్టగానే, అది దేవతలకు దక్కకుండా, తామే హరించాలని భావించిన రాక్షసులు-అసురులు, కలిసి కట్టుగా ఒక్కటై దేవతలతో యుద్ధానికి దిగారు. ఇరు పక్షాలనుండి అనేకమంది చనిపోయారా యుద్ధంలో. విష్ణువప్పుడు దేవతల పక్షం వహించి అమృతాన్ని హరించాడు. మోహిని వేషంలో రాక్షసులను మోహించినట్లు చేసి, విరోధించిన రాక్షసులను వధించి, దేవతల పట్ల స్నేహభావంతో, వారు సంతోష పడే విధంగా, అమృతాన్ని వారికిచ్చాడు విష్ణువు. ఇలా అమృతం తాగి-మరణం లేనివారైన దేవతలను చేర్చుకొని, ఇంద్రుడు, భయంకరమైన యుద్ధ భూమిలో, రాక్షసులను వధించి, దేవతలు-చారణులు-ఋషులు సంతోషించే విధంగా తన రాజ్యాన్ని మళ్లీ పొంది ఏలాడు".

(ఇంద్రుడు ఒకనాడు ఐరావతాన్నెక్కి విహారానికి వెళుతుంటే దుర్వాసుడు ఆయనకు ఎదురుగా వచ్చి, ఒక పుష్ప హారాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు దాన్ని తను ధరించకుండా, ఐరావతం కుంభాలకు చుట్టాడు. అది తొండంతో దాన్ని తీసేసి, నేలపై పడవేసి కాల రాసింది. సగౌరవంగా తానిచ్చిన పూల దండను, ఐశ్వర్యమదంతో అగౌరవ పర్చి-అవమానించిన ఇంద్రుడి ఐశ్వర్యమంతా సముద్రం పాలై పోవాలని దుర్వాసుడు శపించాడు. వెంటనే ఇంద్రుడి ఏనుగులు, గుర్రాలు, మణులు, ఇతర భోగ పదార్థాలన్నీ మాయమై సముద్రంలో పడ్డాయి. ఇంద్రుడు దరిద్రుడై-బుద్ధిమంతుడై, మరల విష్ణువును ప్రార్థించాడు. మున్ముందు పెద్దలను అవమానించ వద్దని ఇంద్రుడికి హితవు పలికి-బుద్ధిచెప్పి, మందరంతో పాల సముద్రాన్ని చిలకమని, అందులోంచి ఆయన మునుపటి ఐశ్వర్యమంతా లభిస్తుందని చెప్పాడు విష్ణుమూర్తి. అలా, ఆ మహా విష్ణువు సహాయంతో, ఇంద్రుడు మరల లబ్దైశ్వర్యుడు అయ్యాడు.

పాల సముద్రంలో అమృతం పుట్టడం కూడా యోగశాస్త్రాన్ననుసరించే వుంది. మూలాధారమందుండే త్రికోణం మందరం. దాన్ని చుట్టి వున్న వాసుకి కుండలి. దాన్ని మథించిన సురాసురులు ఇడాపింగళనాడులందుండే ప్రాణశక్తి వాయువులు. దీనంతటికి ఆధార భూతుడు విష్ణువు. కుండలి మొదలు మేల్కొన్నప్పుడు, దేహంలో శక్తి ప్రసారమైన కారణాన, వికారాలు పుట్తాయి. అప్పుడు, ఆ యోగవిద్య తెలిసిన గురువు, దాన్నుండి అపాయం కలగకుండా చేయాలి. ఆ గురువే, వాసుకి భూషణుడైన శివుడు. శివుడు వాసుకి కంకణుడు కాబట్టి, విషం ఆయనను భాదించదు. భగవంతుడైన విష్ణుమూర్తే, గురువైన శివుడిని, అపాయాన్నుండి కాపాడమని ప్రేరేపించాడు. ఆ తర్వాత, తానే ఆధారంగా నిలుచుండి, యోగి అభీష్ఠాన్ని నెరవేర్చాడు. అమృతం పుట్టినప్పటికీ, ఆ దశలో, హరి భక్తిలేని సాధకులు, అందగత్తెలను చూసి చెడిపోతారు. భగవంతుడిని ఆశ్రయించి వున్నవారు చెడరు. అందువల్ల ఆయనే విఘ్నాలను అణచివేసి, అమృతాన్ని దేవతలకిచ్చాడు).

పైటతో ధర్మరాజు గాయం రక్తాన్ని ఒత్తి, నీటితో తుడిచిన ద్రౌపదీదేవి ..... ఆస్వాదన-46 : వనం జ్వాలా నరసింహారావు

 పైటతో ధర్మరాజు గాయం రక్తాన్ని ఒత్తి, నీటితో తుడిచిన ద్రౌపదీదేవి

ఆస్వాదన-46

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (14-11-2021)

ఉత్తరగోగ్రహణ యుద్ధంలో అర్జునుడు కౌరవ సేనను జయించి, విజయం సాధించి మరలిపోతూ, ఆ విజయం ఉత్తర కుమారుడి వల్లే, ఆయన పరాక్రమంవలనే లభించిందని విరాటరాజుకు చెప్పమని ఉత్తరుడితో అన్నాడు. సరేనన్నాడు ఉత్తరుడు. ఆ తరువాత జమ్మిచెట్టు దగ్గరికి పోయి, అర్జునుడు తన గాండీవాన్ని ఇదివరకులాగానే దాయమని ఉత్తరుడికి చెప్పి తిరిగి బృహన్నల వేషం ధరించాడు. అర్జునుడి సలహా మేరకు, ఉత్తరుడు ముందుగా, విజయాన్ని పట్టణంలో చాటించడానికి గోపాలురను పంపాడు. ఈ లోగా విరాటరాజు దక్షిణ గోగ్రహణ యుద్ధంలో గెలుపు సాధించి సేనతో నగరానికి తిరిగి వచ్చాడు.

నగరానికి వచ్చి, సింహాసనం మీద కూర్చుని కొడుకు ఉత్తరుడిని గురించి అడిగాడు. బృహన్నల సారథిగా ఉత్తరాన తోలుకుపోతున్న గోవులను మరల్చడానికి వెళ్లాడని చెప్పారు. ఒక్కడే యుద్ధం ఎలా చేస్తాడోనని భయపడ్డాడు విరాటరాజు. ఉత్తరగోగ్రహణ యుద్ధంలో కూడా మనకే విజయం కలుగుతుందని, యుద్ధం చేసేవాడు ఒక్క ఉత్తరుడే అని అనుకోవద్దని, సారథిగా వున్న బృహన్నల అద్భుతమైన పరాక్రమం కలవాడని, దేవతలను కూడా గెలుస్తాడని అన్నాడు (ధర్మరాజు) కంకుభట్టు. విరాటరాజు భయపడుతున్న సమయంలోనే ఉత్తరుడు పంపిన గోపాలురు వచ్చి, ఉత్తరుడు కౌరవ సేనలను జయించి, గోవులను మళ్లించి, మహోత్సాహంతో వస్తున్నాడన్న వార్త చెప్పారు. నమ్మశక్యంకాని ఆ మాటలు విన్న విరాటరాజు ఆ విషయాన్ని నగరంలో చాటించమని, ఉత్తరుడిని ఘనంగా ఆహ్వానించాలని అన్నాడు.

ఇలా అంటూనే కంకుభట్టును చూసి ‘ఒక్క పలక జూదం’ ఆడుదామన్నాడు. అక్కడే వున్న సైరంధ్రిని చూసి రాజు పాచికలు తెమ్మన్నాడు. ఇద్దరూ జూదమాడుతున్న సమయంలో, విరాటుడు కొడుకు విజయం సాధించాడన్న సంతోషంతో, కౌరవ సేనలను గెలిచిన ఉత్తరుడిని, అతడి బాహుబలాన్ని పొగడసాగాడు.       

ఈ సందర్భాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ కే రామగోపాల కృష్ణమూర్తి గారు ఇలా రాశారు: “విరాటుడు అధికమైన సంతోషంవలన కలిగిన ఉన్మాదం అనే మానసికావస్థలో వుండి మాట్లాడుతున్నట్లు తిక్కన సూచించాడు. విరాటుడు తన కొడుకైన ఉత్తరుడికి సంబంధించిన విజయోదంతాలనే స్మరిస్తూ వుండడం ఉన్మాదావస్థ”.

ఇది విన్న కంకుభట్టు ఉత్తరుడు గెలిచాడని అనడం కన్నా ఆశ్చర్యకరమైన విషయం వేరే వుంటుందా? అన్నాడు. లోకంలో అతడొక్కడే మహావీరుడిగా ప్రసిద్ధికెక్కినాడా అని కూడా అంటాడు. ఆ మాటలను తాను సహించనన్నాడు విరాటరాజు. ధర్మరాజు అతడి మాటలు లెక్కచేయకుండా, ఆ గెలుపుకు కారణభూతుడు బృహన్నల అని స్పష్టం చేశాడు. బృహన్నల వుండగా ఉత్తరుడికి గెలుపు కలగక ఏమౌతుంది? అని అన్నాడు. వెంటనే ఆగ్రహం తెచ్చుకున్న విరాటరాజు, ‘ఓ బ్రాహ్మణుడా! ఇక నీమాటలు కట్టిపెట్టు’ అన్నాడు. తన మాట పోల్లుపోదని గెలిచింది బృహన్నలే అని మళ్లీ రెట్టించాడు కంకుభట్టు. బృహన్నల విజయాన్ని పట్టణంలో చాటించమని సలహా కూడా ఇచ్చాడు. ఆ మాటలకు, కోపంతో రెచ్చిపోయిన విరాటరాజు తన చేతిలోని పాచికతో ‘ఆ పేడిగాడిని పొగడవద్డంటే మానవేం’ అని అంటూ విసిరికొట్టాడు.

ఇది జరగ్గానే, అక్కడే వున్న సైరంధ్రిని (ద్రౌపదీదేవి) ధర్మరాజు చూశాడు. ఆమె వెంటనే వెళ్లి తన పైటతో ఆ రక్తం కారే గాయాన్ని ఒత్తింది. దగ్గరలో బంగారు చెంబులో వున్న నీరు తీసుకుని, చేయి తడుపుకుని, అతడి గాయం తుడిచింది. అది చూసిన విరాటుడు, ‘ఈ రక్తం నీ పైటతో ఎందుకు అద్దావు’ అని ప్రశ్నించాడు. జవాబుగా సైరంధ్రి ఇలా అంటుంది:

తే:       ‘విమల వంశంబునను బుణ్యవృత్తమునను | వఱలు నీతని రక్తంబు వసుమతీశ!

ధరణిపై నెన్ని బిందువుల్‌ దొరఁగె నన్ని | వర్షములు గల్గు నిం దనావర్షభయము.’

         (ఓ రాజా! స్వచ్చమైన వంశంలో పుట్టి, ధర్మంగా జీవించే ఇతడి రక్తపు బిందువులెన్ని చుక్కలు భూమ్మీద పడితే అన్నేళ్లు ఈ దేశంలో అనావృష్టి కలుగుతుంది). ఆదేశంలో ఎలాంటి కీడు కలగడం తనకు ఇష్టం లేదని అన్నది సైరంధ్రి. గాయం నుండి కారుతున్న రక్తపు చుక్కలు కిందపడకుండా తుడుస్తూనే వున్నది సైరంద్రి.    

ఈ సందర్భాన్ని, తిక్కన రాసిన పద్యాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ కే రామగోపాల కృష్ణమూర్తి గారు ఇలా రాశారు: “ఇది ఒక చక్కటి సూక్తి లాంటి పద్యం. స్వీయ వర్తనానికి ఒక ధార్మిక న్యాయాన్ని చూపుతున్న ద్రౌపది ప్రజ్ఞ ఇందులో ప్రదర్శితమైంది. ఇందులో ధర్మజుడి వంశం, శీలం చెప్పబడ్డాయి. నిర్మలత్వం చంద్రవంశ సూచకం. పుణ్యవృత్తం అతడి సార్థకనామ సూచకం. అలాంటి వారిని బాధిస్తే భూమి బాధపడుతుందని హెచ్చరిక! అనావృష్టి రాజుల అధర్మవర్తనకు ఫలితంగా కలిగే ప్రకృతి సంక్షోభమని ఆమె వ్యాఖ్యానించింది”.

చివరకు ఉత్తరుడు వచ్చి అసలు విషయం చెప్పినప్పుడు విజయం ఎవరిదో తెలుసుకున్నాడు విరాటరాజు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, పంచమాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

 

Sunday, November 7, 2021

భగీరథుడికి ప్రత్యక్షమైన బ్రహ్మ- గంగ మహాత్మ్యం ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-80 : వనం జ్వాలా నరసింహారావు

 భగీరథుడికి ప్రత్యక్షమైన బ్రహ్మ- గంగ మహాత్మ్యం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-80

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (08-11-2021)

               "తన వెంట భగీరథుడు గంగను తీసుకొనిపోయి, సగరకుమారులందరు భస్మమై పడివున్న ప్రదేశానికి చేరుకున్న తర్వాత, గతులులేక పడివున్న వారి బూడిదకుప్పలమీదిగా గంగపారడంతో, తృప్తి పడిన భగీరథుడికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అరవైవేలమంది సగర కుమారులు గంగ తమ బూడిదలపై ప్రవహించడంతో పిశాచత్వాన్ని వదిలి-భువర్లోకాన్ని విడిచి, స్వర్గలోకానికి పోయి, దేవత్వాన్ని పొందారని బ్రహ్మంటాడు. సముద్రంలో ఎంతవరకు నీరుంటుందో అంతవరకు వారందరు స్వర్గలోకంలోనే వుంటారని అంటాడు బ్రహ్మ. భూలోకంలో ప్రవహిస్తున్న గంగ భగీరథుడి కూతురుగా-భాగీరథి పేరుతో ప్రసిద్ధికెక్కుతుందని కూడా బ్రహ్మంటాడు. అలా ఆ దేవనదికి గంగ, త్రిపథగ, భాగీరథి అన్న మూడు పేర్లుంటాయనీ-మూడు మార్గాల్లో పారినందున త్రిపధగ అని సార్థకమవుతుందనీ భగీరథుడితో చెప్పుతాడు బ్రహ్మ. తాతలందరికి గంగా జలంతో తర్పణం చేసి పట్టిన పట్టు సాధించినవాడయ్యాడని-మిక్కిలి కీర్తిశాలి, ఉత్తమ ధర్మిష్టుడైన ఆయన ముత్తాత కూడా గంగను తేగల సమర్థుడు కాలేకపోయాడని-తాత అంశుమంతుడు ప్రతిజ్ఞ తీర్చాలని వృధా శ్రమ చేశాడని-తండ్రి దిలీపుడు రాజశ్రేష్ఠుడు, గొప్ప రాజర్షి, దేవ మహర్షి అయుండీ, తపస్సులో బ్రహ్మ సమానుడై వుండీ, క్షాత్ర ధర్మంలో నిలిచిన వాడై వుండీ, నిర్మల కీర్తి కలవాడై వుండి కూడా గంగను భూమ్మీద పారించలేక పోయాడని, ఆ కొరత తీర్చిన భగీరథుడు ఎంతో పుణ్యమూర్తుడని పొగుడుతాడు బ్రహ్మ భగీరథుడిని. భగీరథుడు తన కొరత తీరేదాకా, గంగా జలాల్లో స్నానం చేసి, శుచై, పుణ్య సమూహాల ఫలం పొందమని, తాతలందరికీ ఆ నీళ్లతో తర్పణాలు వదలమని, ఆ తర్వాత తన స్వస్థలానికి పొమ్మని చెప్పి బ్రహ్మ సత్యలోకానికి వెళ్తాడు. భగీరథుడు తాతలందరికి తర్పణాలొదిలి, తన నగరానికి పోయి, రాజ్య సంపదను యథావిధిగా స్వీకరించి, దుఃఖాన్ని వదిలి, మనోవేదన విడిచి, సంతోషంగా రాజ్య పాలన చేశాడు"

ఈ విధంగా గంగ చరిత్రమంతా ఆద్యంతం రామచంద్రమూర్తికి తెలిపాడు విశ్వామిత్రుడు. సంధ్య వేళ అతిక్రమించిందని అంటూ, గంగ భూమ్మీదకు దిగిన కథ వినినవారికి కలిగే శుభాల గురించి కూడా చెప్పాడు. "ధనం కోరినవారికి ధనం లభిస్తుంది. కీర్తి కోరినవారికి కీర్తి కలుగుతుంది. ఆయువు కోరుకున్న వారికి ఆయువు పెరుగుతుంది. పుత్రులుకావాలన్న కోరికలుంటే పుత్రులుపుట్తారు. స్వర్గం పోదల్చుకుంటే ఆ ప్రాప్తి కలుగుతుంది. పితృలకు మిక్కిలి ప్రీతి కలిగిస్తుంది. దేవకోటులు తృప్తి పడుతారు. నాల్గు వర్ణాలవారెవరైనా శ్రద్ధగా వింటే-వినిపిస్తే, సర్వ పాపాలు తొలిగి, దీర్ఘాయుస్సు పొంది సమస్తమైన కోరికలు తీరుతాయి" అనంటాడు విశ్వామిత్రుడు.

(శంకరుడి శిరస్సులో పడినందున-పాపాలను పోగెట్టేదైనందున పావనమైంది గంగంటారు. పావనమైంది కనుకనే రుద్రుడు ధరించాడు.అందువల్ల మనం కూడా పావనమవుదామని సమస్త దేవతలు స్నానమాడి వారు పావనులై-గంగనూ పావనం చేసారు. శివుడి శిరస్సునుండి వెలువడిందికనుకనే గంగ పవిత్రమైందని-అంతకు ముందు అపవిత్రమయిందనీ అనడం సరికాదు. వాస్తవానికి, భగీరథుడి కోరిక ప్రకారం గంగా జలాలు తన శిరస్సుమీద పడడం చూసిన శివుడు, యోగ్యుడనయ్యానని భావించి-పావనుడు కావడానికి గంగను తన శిరస్సుపై ధరించాడు. గంగ పవిత్రం కావడానికి అసలు కారణం, విష్ణు పాదంలో పుట్టడమే. హరుడి శిరస్సునందుండి పడడం వల్ల గంగ పుణ్య నదైందని శైవులు వాదిస్తారు. గంగ పుణ్యనది కనుకనే శివుడు తలపై ధరించాడని వైష్ణవ వాదం. ఈ వివాదాన్ని పరిష్కరించేది వాల్మీకి రామాయణం మాత్రమేనని వాసుదాసుగారి అభిప్రాయం. రామాయణం మూల శ్లోకంలో పుణ్యగంగ, పుణ్యశివుడి శిరస్సులో పడిందనుంది. గంగాశివులకు పరస్పర సంబంధం లేనప్పుడు కూడ ఇద్దరూ పుణ్యులనే అర్థం. అయోధ్యా కాండలో వశిష్ఠ వాక్యంగా కూడా ఇది చెప్పబడుతుంది. అక్కడ గంగ పాదతీర్థం ధరించి పార్వతీ పతి ధన్యుడయ్యాడు అని చెప్పబడుతుంది ఒకానొక చోట.

గంగా జలాన్నంతా నిమిషంలో తాగిన జహ్నముని రాజర్షి. భరత వంశపు రాజు. ఆ వంశంలో అజామీఢుడు అనే రాజుండేవాడు. ఆయన కొడుకే జహ్నుడు. ఆయన కొడుకు సింధుధ్వజుడు. ఆయన కొడుకు బలాకాశ్వుడు. బలాకాశ్వుడి కొడుకు వల్లభుడు. ఆయన కొడుకు కుశికుడు. కుశికుడి కొడుకు గాధి. కొడుకుకై గాధి తపస్సు చేస్తున్నప్పుడు అడవిలో ఆయనకు సత్యవతి జన్మించింది. తర్వాత విశ్వామిత్రుడు పుట్టాడు. సత్యవతిని భృగు వంశంలో పుట్టిన చ్యవనుడి కొడుకు ఋచీకుడు వివాహం చేసుకున్నాడు. సత్యవతి-ఋచీకులకు జమదగ్ని పుట్టాడు. జమదగ్ని భార్య రేణుక. వీరిరువురికి పరుశురాముడు జన్మించాడు.

మరో ఆసక్తికరమైన విషయం ఈ సర్గలో చెప్పబడింది. కుమార సంభవ సందర్భంలో "రసవాదం" గురించి పరోక్షంగా చెప్పినట్లే ఇక్కడ యోగ విషయం చెప్పడం జరిగింది. గంగోద్భవానికి యోగవిద్యకు సంబంధముందని ఈ సర్గలో వాల్మీకి చెప్పిన శ్లోకాల్లో వుందంటారు వాసుదాసుగారు. "ప్రాణ శక్తి వాయువాహనగా, బ్రహ్మ రంధ్రం మూలంగా, సహస్రార కమలస్థానం ప్రవేశించి, అక్కడనుండి, శివ స్థానమైన ఆజ్ఞా చక్రానికి దిగి, అక్కడ మూడు పాయలుగా ఇడాపింగళసుషుమ్నలవతుంది. అందులో సుషుమ్న మధ్యది. దీన్నే తపోబలంతో భగీరథుడు తెచ్చాడు. ఇది మేరు దండం వెంట కిందకు దిగి-దిగి, మూలాధారంలోని కుండలిని (నాగ లోకాన్ని) తాకింది. ఈ కారణాన, నిశ్చేష్ఠంగా పడి వున్న అణువులు ఊర్ధ్వగాములవుతాయి". అని సూచన మాత్రంగా వ్యాఖ్యానించి, యోగులకు సవిశేషంగా తెలుస్తుందని అంటారు వాసుదాసుగారు. కాకపోతే ఇతరులకీ విషయం అభేద్యం అనికూడా చెప్తారు).

Saturday, November 6, 2021

అర్జునుడి ద్వారా తిక్కన ప్రయోగించిన వాజ్మయాస్త్రాలు ...... ఆస్వాదన-45 : వనం జ్వాలా నరసింహారావు

అర్జునుడి ద్వారా తిక్కన ప్రయోగించిన వాజ్మయాస్త్రాలు

ఆస్వాదన-45

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (07-11-2021)

ఉత్తరగోగ్రహణ యుద్ధంలో అర్జునుడి చేతిలో ఒక్కొక్క కౌరవ వీరుడు వరుసవెంట పరాజయం పొందారు. ఆ క్రమంలో ఒకసారి ఓడిపోయిన కర్ణుడు మళ్లీ యుద్ధానికి వచ్చి అర్జునుడితో తలపడ్డాడు. ఇంతలో అర్జునుడు దుర్యోధనుడిని వెంబడించి దాడి చేశాడు. అర్జునుడు కర్ణుడి పెడతలను, దుశ్శాసనుడి వీపును బాణాలతో కొట్టాడు. అప్పుడు కర్ణుడు భీష్మద్రోణాదులతో, అర్జునుడు వెనకనుండి వెంటాడి కొట్తున్నాడని, కురువంశానికి మూలమైన దుర్యోధనుడిని రక్షించుకోవాలని అన్నాడు. కర్ణుడి మాటలు వినిపించుకోకుండా భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు వెళ్లిపోతుంటే, దుర్యోధనుడు స్వయంగా తనను కాపాడమని వారిని వేడుకున్నాడు. ఆ తరువాత భీష్మాదుల కొంత వెనక్కు తగ్గి, దుర్యోధనుడిని కలుపుకును పోసాగారు.

అలా పోతున్న దుర్యోధనుడిని అర్జునుడు అవహేళన చేశాడు. గట్టిగా కేకపెట్టి, క్షత్రియుడు ఎవరైనా ఓడిపోయి అతడిలాగా పారిపోతాడా? అని అడిగాడు. తాను ఒక్కడినే అయినా, నిస్సహాయుడినే అయినా, చిన్నవాడినైనా, దుర్యోధనుడిని యుద్ధానికి పిలుస్తుంటే రావడం లేదెందుకనీ నిలదీశాడు. అభిమానధనుడవని పేరు పొందాడని, ఇలా పారిపోతే సాటి రాజులు ఆయన్ను మెచ్చుకుంటారా అని అడిగాడు.  ఇక్కడ అద్భుతమైన ఒక పద్యం రాశారు తిక్కన కవి ఈ విధంగా:

సీ:       ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ రా బురవీధుల గ్రాలగలదె?

మణిమయంబైన భూషణ జాలములనొప్పి యొడ్డోలగంబున నుండగలదె?

కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొంపార భోగింపగలదె?

యతి మనోహర లగు చతురాంగనల తోడి సంగతి వేడ్కలు సలుపగలదె

తే:       కయ్యమున నోడి పాఱినఁ గౌరవేంద్ర వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి

సుగతి వడయుము తొల్లింటి చూఱగలదె జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము

         (ఓ కౌరవరాజా! యుద్ధంలో ఓడిపోతే, ఏనుగునెక్కి ప్రకాశిస్తూ రెండు వైపులా ఎన్నో ఏనుగులు రాగా పురవీథులలో వెళ్లగలవా? మణులు తాపిన భూషణాలు పెట్టుకుని నిండు సభలో కూర్చోగలగా? కర్పూర, చందన, కస్తూరికాదులతో ఇష్టంగా భోగాలు అనుభవించగలవా? అందమైన సుందరులతో వేడుకగా కులుకగలవా? నేను చెప్పేది విను. వెనక్కు తిరిగి యుద్ధం చేసి, చెయ్యలేకపోతే శరీరం విడిచి పెట్టయినా పుణ్యలోకాలు పొందు. ఇతరుల సొమ్ములను దోపిడీచేసే నీ పూర్వపు అలవాటు ఇంకా వున్నదా? ఒకప్పటి ఆటలు ఇక సాగవు. ఇక్కడ యుద్ధరంగంలో జూదం మాత్రం ఆడే వీలులేదు సుమా!)  

దీన్ని విశ్లేషిస్తూ డాక్టర్ కే రామగోపాల కృష్ణమూర్తి గారు ఇలా రాశారు: “నలుగురిలో రారాజును నవ్వులపాలు చేస్తూ పలికిన పలుకులివి. హస్తినాపురం చేరిన తరువాత పారిపోవడం వల్ల కలిగే ఫలితాలను, దుర్యోధనుడి బతుకు ఎన్ని అవమానాల పాలవుతుందో ఎలా జీవచ్చవంగా తయారవుతుందో తెలియచెప్పే పద్యం ఇది. సుయోధనుడు బతకడం కంటే చావడం మేలనీ, అది యుద్ధంలో అయితే మంచిదనీ, లేదా, ప్రాయోపవేశమైనా సముచితమనీ సూచించి దుర్యోధనుడిని మానసికంగా చంపినంత పని చేశాడు అర్జునుడు. జూదమాడడం దుర్యోధనుడి కళ అనీ, దోచుకోవడం అతడి స్వభావమనీ హెచ్చరించి, అవి కౌరవేంద్రుడి లక్షణాలు కావనీ, యుద్ధం చేయడం, పరాక్రమార్జితాన్ని పరువంతో గ్రహించడం కౌరవేంద్ర లక్షణాలనీ, ఆ లక్షణాలు రారాజులో అంతరించాయనీ, పాండవులకవి దక్కాయనీ, ఉత్తర గోగ్రహణం పరోక్షంగా కౌరవుల మీద పాండవుల విజయమనీ అధిక్షేపిస్తూ వ్యంగంగా విజయుడు ప్రకటించాడు”.

రారాజుకు కోపం వచ్చి వెనక్కు మళ్లి ఆర్జునుడిని ఎదుర్కున్నాడు. ఆయనతో పాటే భీష్మద్రోణాదులు కూడా వచ్చి అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. సైనికులు కూడా ఆర్జునుడిని చుట్టుముట్టారు. అప్పుడు అర్జునుడు తనను తాను రక్షించుకుంటూ, భీముడి ప్రతిజ్ఞ జ్ఞాపకం వచ్చి, అప్పటికి దుర్యోధనుడిని ఏమీ చేయవద్దనుకుని, సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. కౌరవ సేనంతా స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు అర్జునుడి సూచన మేరకు, ఉత్తర కోరిన విధంగా, కౌరవుల తలపాగాలు (భీష్ముడివి తప్ప) తీసుకుని వచ్చాడు ఉత్తరకుమారుడు. మెలకువ రాగానే జరిగిన సంగతి దుర్యోధనుడికి చెప్పి సేనను వెనక్కు మళ్లించాడు భీష్ముడు. పరాజితుడైన దుర్యోధనుడు మరలి తన నగరానికి పోయాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, పంచమాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)