Sunday, November 14, 2021

పైటతో ధర్మరాజు గాయం రక్తాన్ని ఒత్తి, నీటితో తుడిచిన ద్రౌపదీదేవి ..... ఆస్వాదన-46 : వనం జ్వాలా నరసింహారావు

 పైటతో ధర్మరాజు గాయం రక్తాన్ని ఒత్తి, నీటితో తుడిచిన ద్రౌపదీదేవి

ఆస్వాదన-46

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (14-11-2021)

ఉత్తరగోగ్రహణ యుద్ధంలో అర్జునుడు కౌరవ సేనను జయించి, విజయం సాధించి మరలిపోతూ, ఆ విజయం ఉత్తర కుమారుడి వల్లే, ఆయన పరాక్రమంవలనే లభించిందని విరాటరాజుకు చెప్పమని ఉత్తరుడితో అన్నాడు. సరేనన్నాడు ఉత్తరుడు. ఆ తరువాత జమ్మిచెట్టు దగ్గరికి పోయి, అర్జునుడు తన గాండీవాన్ని ఇదివరకులాగానే దాయమని ఉత్తరుడికి చెప్పి తిరిగి బృహన్నల వేషం ధరించాడు. అర్జునుడి సలహా మేరకు, ఉత్తరుడు ముందుగా, విజయాన్ని పట్టణంలో చాటించడానికి గోపాలురను పంపాడు. ఈ లోగా విరాటరాజు దక్షిణ గోగ్రహణ యుద్ధంలో గెలుపు సాధించి సేనతో నగరానికి తిరిగి వచ్చాడు.

నగరానికి వచ్చి, సింహాసనం మీద కూర్చుని కొడుకు ఉత్తరుడిని గురించి అడిగాడు. బృహన్నల సారథిగా ఉత్తరాన తోలుకుపోతున్న గోవులను మరల్చడానికి వెళ్లాడని చెప్పారు. ఒక్కడే యుద్ధం ఎలా చేస్తాడోనని భయపడ్డాడు విరాటరాజు. ఉత్తరగోగ్రహణ యుద్ధంలో కూడా మనకే విజయం కలుగుతుందని, యుద్ధం చేసేవాడు ఒక్క ఉత్తరుడే అని అనుకోవద్దని, సారథిగా వున్న బృహన్నల అద్భుతమైన పరాక్రమం కలవాడని, దేవతలను కూడా గెలుస్తాడని అన్నాడు (ధర్మరాజు) కంకుభట్టు. విరాటరాజు భయపడుతున్న సమయంలోనే ఉత్తరుడు పంపిన గోపాలురు వచ్చి, ఉత్తరుడు కౌరవ సేనలను జయించి, గోవులను మళ్లించి, మహోత్సాహంతో వస్తున్నాడన్న వార్త చెప్పారు. నమ్మశక్యంకాని ఆ మాటలు విన్న విరాటరాజు ఆ విషయాన్ని నగరంలో చాటించమని, ఉత్తరుడిని ఘనంగా ఆహ్వానించాలని అన్నాడు.

ఇలా అంటూనే కంకుభట్టును చూసి ‘ఒక్క పలక జూదం’ ఆడుదామన్నాడు. అక్కడే వున్న సైరంధ్రిని చూసి రాజు పాచికలు తెమ్మన్నాడు. ఇద్దరూ జూదమాడుతున్న సమయంలో, విరాటుడు కొడుకు విజయం సాధించాడన్న సంతోషంతో, కౌరవ సేనలను గెలిచిన ఉత్తరుడిని, అతడి బాహుబలాన్ని పొగడసాగాడు.       

ఈ సందర్భాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ కే రామగోపాల కృష్ణమూర్తి గారు ఇలా రాశారు: “విరాటుడు అధికమైన సంతోషంవలన కలిగిన ఉన్మాదం అనే మానసికావస్థలో వుండి మాట్లాడుతున్నట్లు తిక్కన సూచించాడు. విరాటుడు తన కొడుకైన ఉత్తరుడికి సంబంధించిన విజయోదంతాలనే స్మరిస్తూ వుండడం ఉన్మాదావస్థ”.

ఇది విన్న కంకుభట్టు ఉత్తరుడు గెలిచాడని అనడం కన్నా ఆశ్చర్యకరమైన విషయం వేరే వుంటుందా? అన్నాడు. లోకంలో అతడొక్కడే మహావీరుడిగా ప్రసిద్ధికెక్కినాడా అని కూడా అంటాడు. ఆ మాటలను తాను సహించనన్నాడు విరాటరాజు. ధర్మరాజు అతడి మాటలు లెక్కచేయకుండా, ఆ గెలుపుకు కారణభూతుడు బృహన్నల అని స్పష్టం చేశాడు. బృహన్నల వుండగా ఉత్తరుడికి గెలుపు కలగక ఏమౌతుంది? అని అన్నాడు. వెంటనే ఆగ్రహం తెచ్చుకున్న విరాటరాజు, ‘ఓ బ్రాహ్మణుడా! ఇక నీమాటలు కట్టిపెట్టు అన్నాడు. తన మాట పోల్లుపోదని గెలిచింది బృహన్నలే అని మళ్లీ రెట్టించాడు కంకుభట్టు. బృహన్నల విజయాన్ని పట్టణంలో చాటించమని సలహా కూడా ఇచ్చాడు. ఆ మాటలకు, కోపంతో రెచ్చిపోయిన విరాటరాజు తన చేతిలోని పాచికతో ‘ఆ పేడిగాడిని పొగడవద్డంటే మానవేం అని అంటూ విసిరికొట్టాడు.

ఇది జరగ్గానే, అక్కడే వున్న సైరంధ్రిని (ద్రౌపదీదేవి) ధర్మరాజు చూశాడు. ఆమె వెంటనే వెళ్లి తన పైటతో ఆ రక్తం కారే గాయాన్ని ఒత్తింది. దగ్గరలో బంగారు చెంబులో వున్న నీరు తీసుకుని, చేయి తడుపుకుని, అతడి గాయం తుడిచింది. అది చూసిన విరాటుడు, ‘ఈ రక్తం నీ పైటతో ఎందుకు అద్దావు’ అని ప్రశ్నించాడు. జవాబుగా సైరంధ్రి ఇలా అంటుంది:

తే:       ‘విమల వంశంబునను బుణ్యవృత్తమునను | వఱలు నీతని రక్తంబు వసుమతీశ!

ధరణిపై నెన్ని బిందువుల్‌ దొరఁగె నన్ని | వర్షములు గల్గు నిం దనావర్షభయము.’

         (ఓ రాజా! స్వచ్చమైన వంశంలో పుట్టి, ధర్మంగా జీవించే ఇతడి రక్తపు బిందువులెన్ని చుక్కలు భూమ్మీద పడితే అన్నేళ్లు ఈ దేశంలో అనావృష్టి కలుగుతుంది). ఆదేశంలో ఎలాంటి కీడు కలగడం తనకు ఇష్టం లేదని అన్నది సైరంధ్రి. గాయం నుండి కారుతున్న రక్తపు చుక్కలు కిందపడకుండా తుడుస్తూనే వున్నది సైరంద్రి.    

ఈ సందర్భాన్ని, తిక్కన రాసిన పద్యాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ కే రామగోపాల కృష్ణమూర్తి గారు ఇలా రాశారు: “ఇది ఒక చక్కటి సూక్తి లాంటి పద్యం. స్వీయ వర్తనానికి ఒక ధార్మిక న్యాయాన్ని చూపుతున్న ద్రౌపది ప్రజ్ఞ ఇందులో ప్రదర్శితమైంది. ఇందులో ధర్మజుడి వంశం, శీలం చెప్పబడ్డాయి. నిర్మలత్వం చంద్రవంశ సూచకం. పుణ్యవృత్తం అతడి సార్థకనామ సూచకం. అలాంటి వారిని బాధిస్తే భూమి బాధపడుతుందని హెచ్చరిక! అనావృష్టి రాజుల అధర్మవర్తనకు ఫలితంగా కలిగే ప్రకృతి సంక్షోభమని ఆమె వ్యాఖ్యానించింది”.

చివరకు ఉత్తరుడు వచ్చి అసలు విషయం చెప్పినప్పుడు విజయం ఎవరిదో తెలుసుకున్నాడు విరాటరాజు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, పంచమాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

 

No comments:

Post a Comment