Sunday, November 14, 2021

విశ్వామిత్రుడిని విశాల నగర వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-81 : వనం జ్వాలా నరసింహారావు

 విశ్వామిత్రుడిని విశాల నగర వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-81

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (15-11-2021)

ఇంద్ర సమానుడైన విశ్వామిత్రుడు చెప్పిన కథలను వినగా-వినగా, తమ ఇరువురికీ, చాలా ఆశ్చర్యం కలిగిందని, సంతోషంగా మృధువైన మాటలతో ఆయనకు చెప్పి, రామ లక్ష్మణులు ఆ రాత్రంతా విశ్వామిత్రుడు చెప్పిన కథలను స్మరించుకున్నారు. సగర చక్రవర్తి సంపద, వైభవం-తన కొడుకని కూడా చూడకుండా భార్యతో సహా అసమంజుడిని అడవులకు పంపిన ఆయన ధర్మాభిమానం-అంశుమంతుడి సౌజన్యం, సంపత్తి-సాగరులు పితృవాక్య పాలన కొరకు చేసిన మహా కార్యం, పితృభక్తి-భగీరథ ప్రయత్నం, ఆయన కార్య సాధకత్వం-గంగా పతనం, మొదలైన సంఘటనలకు సంబంధించిన వ్యక్తుల గుణగణాలను మెచ్చుకుంటూ వారిరువురు సూర్యోదయం వేళ దాకా గడిపారు. సూర్యుడు తూరుపు కొండమీద కి రాగానే, ప్రాతః కాల కృత్యాలను తీర్చుకొని, విశ్వామిత్రుడి వద్దకు పోయి, ఆయనకు నిర్మలమైన భక్తితో నమస్కరించారు. రాత్రంతా విశ్వామిత్రుడు చెప్పిన కథలను గురించే తామిద్దరం ముచ్చటించుకున్నామని, తమందరం ఇక్కడ వున్న విషయం తెలుసుకున్న అక్కడి మునులు-మహా పుణ్యాత్ములు, సుఖాసనాలతో కూడిన ఓడను తమకొరకై పంపారని, దాంట్లో గంగను దాటిపోదామా? అని ఆయన్ను అడిగారు రామ లక్ష్మణులు. వారు చెప్పినట్లే, గారాబంతో వారి మాటలను విన్న విశ్వామిత్రుడు, శ్రీరామ లక్ష్మణులతో-ఋషీశ్వరులతో కలిసి, గంగ దాటి, ఉత్తరం వైపున్న ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ, ప్రాకారాలతో, కుల పర్వతాలను మించిన మేడల గుంపుల కాంతులతో, తియ్య మామిడి లాంటి ఫల వృక్షాలతో స్వర్గాన్నే మరిపిస్తున్న విషాల నగరంలోకి ప్రవేశించగానే, రాజకుమారుడైన రామచంద్రమూర్తి, మహాత్ముడైన విశ్వామిత్రుడితో, ఆ నగరాన్ని ఏలే రాజెవ్వరని-ఏ వంశం వాడని, అడిగాడు. సమాధానంగా మునీంద్రుడు ఆ కథనంతా చెప్పాడీవిధంగా:

"రామచంద్రా, పూర్వం కృతయుగంలో, వీరులైన దైత్యులు-శౌర్యంలోను, విస్తారంగా ధర్మ కార్యాలు నిర్వహించడంలోను ప్రీతిగలిగిన దేవతలు, తమకు ముసలితనం-మరణం-వ్యాధులు లేకుండా, హాయిగా వుండేందుకు మార్గమేంటని ఉమ్మడిగా ఆలోచించారు. పాలసముద్రం చిలికి-అందులోంచి పుట్టిన అమృతాన్ని భుజించినట్లైతే, తమకు మరణముండదని-ముసలితనం రాదని ఆలోచించి, మందర పర్వతాన్ని కవ్వంగా-వాసుకు తాడుగా, పాలసముద్రాన్ని చిలకడం మొదలెట్టారు. అలా వారు వేయి సంవత్సరాలు చిలకగా, ఆ రాపిడిని సహించలేక, వాసుకి విషాన్ని కక్కాడు. ఆ వేడికి కొండ రాళ్లు పగలడంతో పాటు, భయంకరమైన హాలాహలం రాక్షసులను, దేవతలను భస్మం చేయసాగింది. అంతులేని తాపాన్ని కలిగిస్తున్న హాలాహలాన్ని హరించేందుకు, వారందరూ, పాహి-పాహి అంటూ శివుడిని ప్రార్థించారు. మిక్కిలి భక్తితో ప్రార్థించిన వారికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అదే సమయంలో శంక చక్రాలను ధరించిన విష్ణుమూర్తి అక్కడ కొచ్చి, చిరునవ్వుతో, దేవతలు చిలికినప్పుడు మొట్టమొదటగా పుట్టిన సహించలేని విషాన్ని, దేవతల్లో పెద్దవాడైన శివుడు-ప్రధమంగా గౌరవించాల్సిన శివుడు, అందరికంటే ముందుగా మంచి మనస్సుతో తీసుకొమ్మని చెప్పాడు".

హాలాహలాన్ని మింగిన శివుడు

"విష్ణుమూర్తి అలా చెప్పి వెళ్లగానే, భయపడుతున్న దేవతలను చూసిన శివుడు, విష్ణువు చెప్పినట్లే, విషాన్ని కంఠంలో ధరించాడు. వెంటనే దేవతలు, తిరిగి పాలసముద్రాన్ని చిలుకుతుండగా, వాళ్లు కవ్వంగా వాడుతున్న మందర పర్వతం పుటుక్కున మునిగింది సముద్రంలో. అది చూసిన దేవతలు, ప్రపంచాన్ని-ముఖ్యంగా తమను రక్షించే విష్ణుమూర్తిని, కొండ మునుగుతున్నదని-దాన్ని పైకెత్తి పట్టగల సమర్థుడు ఆయనేనని-ఆయనను సేవిస్తుండే వారు ఆపదల పాలవుతుంటే వూరకుండరాదని-ఆశ్రిత రక్షణ చేసి, తమను కాపాడమని ప్రార్థించారు. దేవతల ప్రార్థనలను విన్న విష్ణుమూర్తి, ప్రపంచ శరీరానికి ఆత్మగా వుండే దేవాదిదేవుడు, తానూ దేవతల్లో ఒకడై, ఒక చేయి కొండ కొనలో నిలిపి, కొండకింద తాబేలు ఆకారంలో మందరాన్ని మోస్తూ, స్వయంగా అమృతం కొరకు చిలక సాగాడు".

క్షీర సముద్రంలో ఉదయించిన ధన్వంతరి-తదితరములు

"స్థిరంగా-విఘ్నాలు లేకుండా, వేయి సంవత్సరాలు అలా చిలకగా, పాల సముద్రంలో తొలుత, యాగదండం-కమండలువు ధరించి, వైద్యుడైన ధన్వంతరి పుట్టాడు. పాల సముద్రంలోని జల వికారమైన పాలను చిలుకగా-చిలుకగా, సారం పుట్టింది. ఆ రసంలోంచి అందగత్తెలైన అరవైకోట్ల అప్సరసలు పుట్టారు. వారికెందరో పరిచారికలుండడంతో-వారిని లెక్కించడానికి ఎవరి తరం కాకపోవడంతో, ఆ స్త్రీలను దేవతలుగాని, రాక్షసులుగాని స్వీకరించలేదు. అప్సరసల పరిచారికలను ఎవరూ, కామంతో గ్రహించనందున, మగవారందరితోనూ సమాన పతి భావంతో ప్రవర్తించే వేశ్యలుగా-వార కాంతలుగా వారు పిలువబడ్డారు. తననెవరు స్వీకరించనున్నారోనని అనుకుంటూ బయట కొచ్చిన వరుణుడి కూతురు సురను, అసురులు వద్దనడంతో, దేవతలు ఇష్టంగా పరిగ్రహించారు. సురను దైత్యులు గ్రహించనందునే "అసురులు" గా పేరు తెచ్చుకున్నారు. స్వీకరించిన దేవతలు సురలై, దేహమంతా గగ్గురుపాటుగలిగే విధంగా సంతోషించారు. మరికొంత చిలుకగా, ఉచ్చైశ్రవం అనే గుర్రం పుట్టింది. తర్వాత కౌస్తుభం అనే రత్నం కలిగింది. అప్పుడు అమృతం పుట్టింది. చివరకు అమృతమే అసురుల వంశాన్ని నాశనం చేసింది".

"అమృతం ఎలా వారి వంశాన్ని నాశనం చేసిందని సందేహం కలగొచ్చు. అమృతం పుట్టగానే, అది దేవతలకు దక్కకుండా, తామే హరించాలని భావించిన రాక్షసులు-అసురులు, కలిసి కట్టుగా ఒక్కటై దేవతలతో యుద్ధానికి దిగారు. ఇరు పక్షాలనుండి అనేకమంది చనిపోయారా యుద్ధంలో. విష్ణువప్పుడు దేవతల పక్షం వహించి అమృతాన్ని హరించాడు. మోహిని వేషంలో రాక్షసులను మోహించినట్లు చేసి, విరోధించిన రాక్షసులను వధించి, దేవతల పట్ల స్నేహభావంతో, వారు సంతోష పడే విధంగా, అమృతాన్ని వారికిచ్చాడు విష్ణువు. ఇలా అమృతం తాగి-మరణం లేనివారైన దేవతలను చేర్చుకొని, ఇంద్రుడు, భయంకరమైన యుద్ధ భూమిలో, రాక్షసులను వధించి, దేవతలు-చారణులు-ఋషులు సంతోషించే విధంగా తన రాజ్యాన్ని మళ్లీ పొంది ఏలాడు".

(ఇంద్రుడు ఒకనాడు ఐరావతాన్నెక్కి విహారానికి వెళుతుంటే దుర్వాసుడు ఆయనకు ఎదురుగా వచ్చి, ఒక పుష్ప హారాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు దాన్ని తను ధరించకుండా, ఐరావతం కుంభాలకు చుట్టాడు. అది తొండంతో దాన్ని తీసేసి, నేలపై పడవేసి కాల రాసింది. సగౌరవంగా తానిచ్చిన పూల దండను, ఐశ్వర్యమదంతో అగౌరవ పర్చి-అవమానించిన ఇంద్రుడి ఐశ్వర్యమంతా సముద్రం పాలై పోవాలని దుర్వాసుడు శపించాడు. వెంటనే ఇంద్రుడి ఏనుగులు, గుర్రాలు, మణులు, ఇతర భోగ పదార్థాలన్నీ మాయమై సముద్రంలో పడ్డాయి. ఇంద్రుడు దరిద్రుడై-బుద్ధిమంతుడై, మరల విష్ణువును ప్రార్థించాడు. మున్ముందు పెద్దలను అవమానించ వద్దని ఇంద్రుడికి హితవు పలికి-బుద్ధిచెప్పి, మందరంతో పాల సముద్రాన్ని చిలకమని, అందులోంచి ఆయన మునుపటి ఐశ్వర్యమంతా లభిస్తుందని చెప్పాడు విష్ణుమూర్తి. అలా, ఆ మహా విష్ణువు సహాయంతో, ఇంద్రుడు మరల లబ్దైశ్వర్యుడు అయ్యాడు.

పాల సముద్రంలో అమృతం పుట్టడం కూడా యోగశాస్త్రాన్ననుసరించే వుంది. మూలాధారమందుండే త్రికోణం మందరం. దాన్ని చుట్టి వున్న వాసుకి కుండలి. దాన్ని మథించిన సురాసురులు ఇడాపింగళనాడులందుండే ప్రాణశక్తి వాయువులు. దీనంతటికి ఆధార భూతుడు విష్ణువు. కుండలి మొదలు మేల్కొన్నప్పుడు, దేహంలో శక్తి ప్రసారమైన కారణాన, వికారాలు పుట్తాయి. అప్పుడు, ఆ యోగవిద్య తెలిసిన గురువు, దాన్నుండి అపాయం కలగకుండా చేయాలి. ఆ గురువే, వాసుకి భూషణుడైన శివుడు. శివుడు వాసుకి కంకణుడు కాబట్టి, విషం ఆయనను భాదించదు. భగవంతుడైన విష్ణుమూర్తే, గురువైన శివుడిని, అపాయాన్నుండి కాపాడమని ప్రేరేపించాడు. ఆ తర్వాత, తానే ఆధారంగా నిలుచుండి, యోగి అభీష్ఠాన్ని నెరవేర్చాడు. అమృతం పుట్టినప్పటికీ, ఆ దశలో, హరి భక్తిలేని సాధకులు, అందగత్తెలను చూసి చెడిపోతారు. భగవంతుడిని ఆశ్రయించి వున్నవారు చెడరు. అందువల్ల ఆయనే విఘ్నాలను అణచివేసి, అమృతాన్ని దేవతలకిచ్చాడు).

No comments:

Post a Comment