Saturday, November 6, 2021

అర్జునుడి ద్వారా తిక్కన ప్రయోగించిన వాజ్మయాస్త్రాలు ...... ఆస్వాదన-45 : వనం జ్వాలా నరసింహారావు

అర్జునుడి ద్వారా తిక్కన ప్రయోగించిన వాజ్మయాస్త్రాలు

ఆస్వాదన-45

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (07-11-2021)

ఉత్తరగోగ్రహణ యుద్ధంలో అర్జునుడి చేతిలో ఒక్కొక్క కౌరవ వీరుడు వరుసవెంట పరాజయం పొందారు. ఆ క్రమంలో ఒకసారి ఓడిపోయిన కర్ణుడు మళ్లీ యుద్ధానికి వచ్చి అర్జునుడితో తలపడ్డాడు. ఇంతలో అర్జునుడు దుర్యోధనుడిని వెంబడించి దాడి చేశాడు. అర్జునుడు కర్ణుడి పెడతలను, దుశ్శాసనుడి వీపును బాణాలతో కొట్టాడు. అప్పుడు కర్ణుడు భీష్మద్రోణాదులతో, అర్జునుడు వెనకనుండి వెంటాడి కొట్తున్నాడని, కురువంశానికి మూలమైన దుర్యోధనుడిని రక్షించుకోవాలని అన్నాడు. కర్ణుడి మాటలు వినిపించుకోకుండా భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు వెళ్లిపోతుంటే, దుర్యోధనుడు స్వయంగా తనను కాపాడమని వారిని వేడుకున్నాడు. ఆ తరువాత భీష్మాదుల కొంత వెనక్కు తగ్గి, దుర్యోధనుడిని కలుపుకును పోసాగారు.

అలా పోతున్న దుర్యోధనుడిని అర్జునుడు అవహేళన చేశాడు. గట్టిగా కేకపెట్టి, క్షత్రియుడు ఎవరైనా ఓడిపోయి అతడిలాగా పారిపోతాడా? అని అడిగాడు. తాను ఒక్కడినే అయినా, నిస్సహాయుడినే అయినా, చిన్నవాడినైనా, దుర్యోధనుడిని యుద్ధానికి పిలుస్తుంటే రావడం లేదెందుకనీ నిలదీశాడు. అభిమానధనుడవని పేరు పొందాడని, ఇలా పారిపోతే సాటి రాజులు ఆయన్ను మెచ్చుకుంటారా అని అడిగాడు.  ఇక్కడ అద్భుతమైన ఒక పద్యం రాశారు తిక్కన కవి ఈ విధంగా:

సీ:       ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ రా బురవీధుల గ్రాలగలదె?

మణిమయంబైన భూషణ జాలములనొప్పి యొడ్డోలగంబున నుండగలదె?

కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొంపార భోగింపగలదె?

యతి మనోహర లగు చతురాంగనల తోడి సంగతి వేడ్కలు సలుపగలదె

తే:       కయ్యమున నోడి పాఱినఁ గౌరవేంద్ర వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి

సుగతి వడయుము తొల్లింటి చూఱగలదె జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము

         (ఓ కౌరవరాజా! యుద్ధంలో ఓడిపోతే, ఏనుగునెక్కి ప్రకాశిస్తూ రెండు వైపులా ఎన్నో ఏనుగులు రాగా పురవీథులలో వెళ్లగలవా? మణులు తాపిన భూషణాలు పెట్టుకుని నిండు సభలో కూర్చోగలగా? కర్పూర, చందన, కస్తూరికాదులతో ఇష్టంగా భోగాలు అనుభవించగలవా? అందమైన సుందరులతో వేడుకగా కులుకగలవా? నేను చెప్పేది విను. వెనక్కు తిరిగి యుద్ధం చేసి, చెయ్యలేకపోతే శరీరం విడిచి పెట్టయినా పుణ్యలోకాలు పొందు. ఇతరుల సొమ్ములను దోపిడీచేసే నీ పూర్వపు అలవాటు ఇంకా వున్నదా? ఒకప్పటి ఆటలు ఇక సాగవు. ఇక్కడ యుద్ధరంగంలో జూదం మాత్రం ఆడే వీలులేదు సుమా!)  

దీన్ని విశ్లేషిస్తూ డాక్టర్ కే రామగోపాల కృష్ణమూర్తి గారు ఇలా రాశారు: “నలుగురిలో రారాజును నవ్వులపాలు చేస్తూ పలికిన పలుకులివి. హస్తినాపురం చేరిన తరువాత పారిపోవడం వల్ల కలిగే ఫలితాలను, దుర్యోధనుడి బతుకు ఎన్ని అవమానాల పాలవుతుందో ఎలా జీవచ్చవంగా తయారవుతుందో తెలియచెప్పే పద్యం ఇది. సుయోధనుడు బతకడం కంటే చావడం మేలనీ, అది యుద్ధంలో అయితే మంచిదనీ, లేదా, ప్రాయోపవేశమైనా సముచితమనీ సూచించి దుర్యోధనుడిని మానసికంగా చంపినంత పని చేశాడు అర్జునుడు. జూదమాడడం దుర్యోధనుడి కళ అనీ, దోచుకోవడం అతడి స్వభావమనీ హెచ్చరించి, అవి కౌరవేంద్రుడి లక్షణాలు కావనీ, యుద్ధం చేయడం, పరాక్రమార్జితాన్ని పరువంతో గ్రహించడం కౌరవేంద్ర లక్షణాలనీ, ఆ లక్షణాలు రారాజులో అంతరించాయనీ, పాండవులకవి దక్కాయనీ, ఉత్తర గోగ్రహణం పరోక్షంగా కౌరవుల మీద పాండవుల విజయమనీ అధిక్షేపిస్తూ వ్యంగంగా విజయుడు ప్రకటించాడు”.

రారాజుకు కోపం వచ్చి వెనక్కు మళ్లి ఆర్జునుడిని ఎదుర్కున్నాడు. ఆయనతో పాటే భీష్మద్రోణాదులు కూడా వచ్చి అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. సైనికులు కూడా ఆర్జునుడిని చుట్టుముట్టారు. అప్పుడు అర్జునుడు తనను తాను రక్షించుకుంటూ, భీముడి ప్రతిజ్ఞ జ్ఞాపకం వచ్చి, అప్పటికి దుర్యోధనుడిని ఏమీ చేయవద్దనుకుని, సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. కౌరవ సేనంతా స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు అర్జునుడి సూచన మేరకు, ఉత్తర కోరిన విధంగా, కౌరవుల తలపాగాలు (భీష్ముడివి తప్ప) తీసుకుని వచ్చాడు ఉత్తరకుమారుడు. మెలకువ రాగానే జరిగిన సంగతి దుర్యోధనుడికి చెప్పి సేనను వెనక్కు మళ్లించాడు భీష్ముడు. పరాజితుడైన దుర్యోధనుడు మరలి తన నగరానికి పోయాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, పంచమాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

         

No comments:

Post a Comment