గెలిచింది బృహన్నల, తాను కాదని చెప్పిన ఉత్తరుడు
ఉత్తరాభిమన్యుల వివాహం
ఆస్వాదన-47
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (21-11-2021)
ఉత్తర గోగ్రహణంలో విజయం సాధించి తండ్రిని చూడడానికి వచ్చిన ఉత్తరుడికి
కంకుడి ముఖం మీద వున్న గాయం కనిపించింది. ఇదేమిటని తండ్రిని అడిగాడు. సమాధానంగా
విరాటుడు, తాను ఉత్తరుడి
విజయాన్ని పొగడుతూంటే కంకుడు ఆ విజయం పేడి బృహన్నలదని అన్నాడని, దానితో కోపం వచ్చి సహించలేక
వెనుకా-ముందూ చూడకుండా తాను పాచికతో కొట్టానని చెప్పాడు. తండ్రి తప్పు చేశాడని, పెద్దల మాట వినాలి కాని
కోపగించుకోవడం తగదని అన్నాడు ఉత్తరుడు. దాంతో విరాటుడు ధర్మరాజును క్షమాపణ కోరాడు.
తనకసలు కోపమే రాలేదని చెప్పాడు ధర్మరాజు. అదే సమయంలో అంతదాకా బయటే వేచి వున్న
బృహన్నల లోపటికి వచ్చాడు. విరాటుడు అతడిని ఆదరించాడు. భీష్మ, ద్రోణ, కృప,
అశ్వత్థామ, కర్ణ మొదలైన కౌరవ మహావీరులను ఒక్కడే ఎదిరించి ఎలా గెలిచాడని, ఆవులను
ఎలా మళ్లించగలిగాడని ప్రశ్నించాడు ఉత్తరుడిని విరాటుడు.
కౌరవ సేనలను గెలిచింది తాను కాదని, ఆవులను మరల్చింది కూడా తాను కాదని, దైవబలం ఉన్నందున ఒక మహానుభావుడు,
దేవాంశ సంభూతుడు వచ్చి యుద్ధంలో తనను కాపాడి, కౌరవులను ఓడించి, ఆవులను మరలించాడని జవాబిచ్చాడు ఉత్తరుడు. కౌరవ
సేనలు ఆ దివ్యపురుషుడిని చుట్టుముట్టాయని, దుర్యోధనుడు సేనతో సహా ఎదురు తిరిగాడని, యుద్ధం ఘోరంగా జరిగిందని, శత్రువులంతా దివ్యపురుషుడు వేసిన
బాణాలకు యుద్ధభూమిలో పడిపోయారని, ఎదిరించిన
కర్ణుడిని ఓడించాడని, ద్రోణుడిని
కూడా దివ్యపురుషుడు గెలిచాడని, భీష్ముడు కూడా
వశం తప్పాడని, చివరకు
దివ్యపురుషుడి ధాటికి కౌరవ సేనలు వెనుతిరిగాయని చెప్పాడు ఉత్తరుడు. ఎవరా
దివ్యపురుషుడని అడిగాడు విరాటుడు. అతడు అదృశ్యమయ్యాడని మళ్లీ వస్తాడని అన్నాడు
ఉత్తరుడు.
ఆ తరువాత బృహన్నల నాట్యశాలకు వెళ్లి యుద్ధ రంగం నుండి తాము తెచ్చిన
కౌరవుల బొమ్మపొత్తికలు ఉత్తరకు ఇచ్చాడు. ఆ తరువాత పాండవులు, ద్రౌపదీదేవి ఒక రహస్య స్థలంలో
కలుసుకుని ఉత్తర గోగ్రహణం విషయాలను ముచ్చటించుకున్నారు. విరాటుడు తనను పాచికతో
కొట్టిన విషయాన్ని చెప్పాడు ధర్మరాజు అర్జునుడికి. అర్జునుడికి కోపం వచ్చినప్పటికీ
ధర్మరాజు సర్ది చెప్పాడు. తమ్ములంతా శాంతించారు. తామొచ్చిన పని అయిపోయింది కాబట్టి
ఏవిధంగా విరాటుడి కొలువు కూటం నుండి బయటపడాలని ఆలోచన చేశారు. ఇంతలో రాత్రి
గడిచింది. తెల్లవారుజామునే లేచారు. స్నానాది కార్యక్రమాలు ముగించుకున్నారు.
గౌరవప్రదమైన వేషాలతో రాచనగరికి సంతోషంగా వెళ్లారు.
వెళ్లిన తరువాత ధర్మరాజు సింహాసనం మీద కూచున్నాడు. తమ్ములంతా వారికి
తగ్గ ఆసనాలమీద కూచున్నారు. కొలువుకు వచ్చిన విరాటుడు వారిని ఆ విధంగా చూసి
ఆశ్చర్యపడ్డాడు. సాధువృత్తికల ధర్మరాజు ఎందుకలా తన సింహాసనం మీద కూచున్నాడని
ప్రశ్నించాడు. దానికి జవాబుగా అర్జునుడు,
సింహాసనం మీద కూచున్నది రాజసూయ యాగం చేసి అందరినీ గెలిచిన అజాతశత్రువు ధర్మరాజని
చెప్పాడు. అతడు భూమండలం అంతా దిగ్విజయం చేసిన మహానీయుడన్నాడు. ఆయన ధర్మారజైతే
భీమార్జున నకుల సహదేవులేరీ అని అడిగాడు విరాటుడు. వలలుడు భీముడని, దామగ్రంథి
నకులుడని, తంత్రీపాలుడు సహదేవుడని, సైరంధ్రి
వేషంలో మాలిని అన్న పేరుతో సుదేష్ణ
దగరున్నది ద్రౌపదీదేవని జవాబిచ్చాడు అర్జునుడు. అప్పుడు భీముడు
కలిగించుకుని పేడి రూపంలో బృహన్నల అన్న పేరుతో విరాటుడి కూతురుకు నాట్యం
నేర్పుతున్నది అర్జునుడని అన్నాడు.
అప్పుడు అక్కడే వున్న ఉత్తరుడు ఆర్జునుడిని చూపిస్తూ, తాను చెప్పిన దివ్యపురుషుడు అతడే
అని అన్నాడు. అతడొక్కడే కౌరవ సేనను ఓడించాడని చెప్పాడు. ఇదంతా విన్న విరాటుడికి
భయం, గౌరవం, సంతోషం ఒక్కసారే మనస్సులో
వ్యాపించాయి. గౌరవంతో ఆర్జునుడిని కౌగలించుకున్నాడు. ధర్మరాజుకు సాగిలపడి
మొక్కాడు. భీమ, నకుల, సహదేవులను
కౌగలించుకున్నాడు. విరాటుడు తన పరివారాన్నంతా పిలిచి పాండవులను పరిచయం చేశాడు.
రాణీవాసానికి కబురు చేసి ద్రౌపదీదేని తగిన విధంగా గౌరవించాలని సుదేష్ణను
ఆదేశించాడు. అర్జునుడు తామిన్నాళ్లు విరాటరాజు దగ్గర వున్నందుకు ధన్యవాదాలు
చెప్పాడు. అదంతా తన పుణ్యం అన్నాడు విరాటుడు. ఇక తన రాజ్యం అంతా ధర్మరాజుదేనని
అన్నాడు.
ఉత్తరను తీసుకురమ్మని మంత్రులను ఆదేశించాడు విరాటుడు. ఆమెను
సింగారించి ధర్మారాజు ఎదుటికి తెచ్చారు మంత్రులు. ఆ కన్యను అర్జునుడికి
చేసుకొమ్మని అన్నాడు విరాటుడు. తాను ఉత్తరకు తండ్రి సమానుడినని, అందుకే ఆమెను తాను
భార్యగా కాకుండా కోడలుగా స్వీకరిస్తానని చెప్పాడు అర్జునుడు. ఆమెను అభిమన్యుడు
వివాహమాడుతాడని అన్నాడు. ఆ తరువాత దైవజ్ఞులను పిలిచి లగ్న నిశ్చయం చేయించారు.
ఇంతలో దుర్యోధనుడు పంపిన దూత వచ్చి ధర్మారాజాదుల అజ్ఞాతవాసం పూర్తికాక
ముందే అర్జునుడు బయటపడ్డాడని రాజు మాటలుగా చెప్పాడు. తాము శపథం చేసినట్లుగా
పదమూడేళ్లు అరణ్య, అజ్ఞాతవాసాలు
ముమ్మాటికీ నిండాయని చెప్పమన్నాడు ధర్మరాజు. దూత అవే మాటలను దుర్యోధనుడికి
చెప్పాడు. ధర్మారాజు చెప్పినదాన్ని భీష్ముడు ధృవపరచాడు.
ఆ తరువాత పాండవులు జమ్మిచెట్టుమీద దాచిన తమ సమస్త ఆయుధాలను తెచ్చుకుని
ఉపప్లావ్యంలో నివసించారు. ఒకానాడు శ్రీకృష్ణ బలరామాదులు, ద్రుపద మహారాజు వచ్చారు
వారిని చూడడానికి. పాండవులు వారికి తగిన మర్యాదలు చేశారు. శ్రీకృష్ణుడు, ద్రుపద
మహారాజు అనేక బహుమానాలను తెచ్చారు పాండవులకు ఇవ్వడానికి. అదే విధంగా అనేకమంది
రాజులు ఉత్తరాభిమన్యుల వివాహానికి వచ్చారు. విరాటరాజు నగరంలో వివాహ మహోత్సవం
చాటింపు వేయించారు. ఊరంతా అందంగా అలంకరించారు.
శాస్త్రోక్తంగా జరగాల్సిన వివాహ పూర్వరంగంలోని పనులన్నీ జరిగాక,
జ్యోతిష్కుడు దగ్గరుండి గుణించి శుభలగ్న సమయాన్ని సరిగ్గా తెలపగా మంగళ వాద్యాలు
మోగుతుంటే ఉత్తరాభిమన్యుల మధ్యనున్న తెర ఎత్తారు. వధూవరులు ఒకరినొకరు
చూసుకున్నారు. తలంబ్రాలు ఒకరి దోసిలి నుండి ఇంకొకరి దోసిలిలో పోసి పరస్పరం తలమీద
పోసుకున్నారు. అభిమన్యుడు ఉత్తర మృదువైన హస్తాన్ని మృదువుగా గ్రహించాడు. ఈ విధంగా
పాణిగ్రహణం జరిగింది. ఈ విధంగా విరాటరాజు ఉత్తరాభిమన్యుల వివాహం
నిర్వహించాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, విరాటపర్వం, పంచమాశ్వాసం
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment