వనం జ్వాలా నరసింహారావు, కన్సల్టెంటు హెచ్ఎంఆర్ఐ
లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో, ఆరోగ్య నిర్వహణ-పరిశోధనా సంస్థ (హెచ్‍ఎంఆర్ఐ) సమకూరుస్తున్న "104 సంచార వాహన సేవల" (నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలు) నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు బదలాయించింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ విడుదల చేసిన ఉత్తర్వులో పర్యవేక్షణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వ భవిష్యత్తులో ఏర్పాటు చేయబోతున్న కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్ క్లస్టర్లకు 104 సంచార వాహన సేవలను అనుసంధానించనున్నట్లు కూడా పేర్కొంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా సేవలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు, కొత్త యాజమాన్య విధానాన్ని రూపొందించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) కు మూడు కిలోమీటర్ల ఆవల ఉండే గ్రామాల్లో ప్రసూతి, మాతా శిశు సంరక్షణ, దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, హృద్రోగం, రక్తపోటు, మూర్ఛ వంటి వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పరీక్షలు-మందుల పంపిణీ కోసం నిర్ధారిత తేదీల్లో ఆయా గ్రామాల్లోకి వెళ్లేందుకు "104 సంచార వాహన సేవలు" ఏర్పాటు చేసి వాటి నిర్వహణ భాద్యతను హెల్త్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కు అప్పచెప్పింది ప్రభుత్వం 2009 లో. వాహనాలలో పనిచేస్తున్న నాలుగు రకాల సిబ్బంది (డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లేబొరేటరీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్), "హెచ్‍ఎంఆర్ఐ యాజమాన్యంతో కొన్ని విషయాల్లో విభేదించి" నవంబర్ 9 నుంచి సమ్మెకు దిగారని, సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, మూడు వారాలకు పైగా "104 సంచార వాహన సేవలు" స్తంభించి పోయాయని, అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ప్రారంభించిన సేవల నిర్వహణలో అవరోధాలొస్తే, వాటిని అధిగమించడానికి, ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం, బాధ్యత ప్రభుత్వానికుందనే విషయం ఎవరూ కాదనరు. కాకపోతే, 104 సంచార వాహన సేవల సిబ్బంది సమ్మెను విరమింప చేయడంలో హెచ్ఎంఆర్ఐ యాజమాన్యం విఫలమైందని, విధుల నిర్వహణలో సక్రమంగా వ్యవహరించలేదని వస్తున్న వార్తలు వాస్తవం కాదు.
104 సంచార వాహన సేవలు ఆరంభించడానికి ఒక నేపధ్యం వుంది. దాని వెనుక ఒక మహత్తర ఆశయం వుంది. రాష్ట్రంలోని సుమారు 1600 కు పైగా వున్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 12000 కు పైగా వున్న ఉప కేంద్రాలు వివిధ కారణాల వల్ల అనుకున్న రీతిలో ఆరోగ్య వైద్య సేవలందించే స్థితిలో లేకుండా పోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) కు మూడు కిలోమీటర్ల ఆవల వున్న సుమారు 24000 కు పైగా గ్రామాల ప్రజలు కనీస ఆరోగ్య వైద్య సదుపాయాలకు కూడా నోచుకోక పోవడం అనే నగ్న సత్యాన్ని ఆరోగ్య నిర్వహణ-పరిశోధనా సంస్థ (హెచ్‍ఎంఆర్ఐ) గుర్తించి "నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల" పథకం నమూనాను రూపొందించింది. అప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో ఇఎంఆర్ఐ ఆధ్వర్యంలో 108 అత్యవసర సహాయ సేవలు, హెచ్‍ఎంఆర్ఐ ఆధ్వర్యంలో 104 (1056) ఆరోగ్య సమాచార హెల్ప్ లైన్ సేవలు ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో రూపు దిద్దుకుని విజయవంతంగా నడుస్తున్నాయి. 2008 జులై-ఆగస్ట్ నెలల్లో హెచ్‍ఎంఆర్ఐ కి చెందిన వైద్య-యాజమాన్య నిపుణులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డికి "నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల" పథకం నమూనాను వివరించడానికి వెళ్లారు. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి - ఇటీవల వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య, ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పీకే అగర్వాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. హరినారాయణ, నాటి హెచ్ఎంఆర్ఐ సంస్థ చైర్మన్ రామలింగ రాజుల సమక్షంలో నమూనా పథకం పరిశీలనా సమావేశం జరిగింది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ మొదటి స్లయిడ్ చూస్తూనే పథకం గురించి అర్థం-అవగాహన చేసుకున్న డాక్టర్ రాజశేఖర రెడ్డి "ఐ యాం సోల్డ్" అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విధి విధానాలను రూపొందించిన తర్వాత ప్రభుత్వం, హెచ్‍ఎంఆర్ఐ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుని "నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల" ను పైలట్ గా ఆరంభించి కొనసాగించింది.
పథకం అమలు విషయంలో జరిగిన చర్చలో ముఖ్యమైంది సంచార వైద్య వాహనాలలో డాక్టర్లు వుండాలా-వద్దా అనే విషయం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో నియమించబడిన డాక్టర్లలో చాలా మంది అసలు డ్యూటీలో చేరక పోవడమో, చేరిన వారు ఆ గ్రామాల్లో వుండకపోవడమో, వున్న కొద్ది మంది వీలైనంత త్వరలో పట్టణాలకు బదిలీ చేయించుకుని వెళ్లడమో, ఎవరైనా పట్టుదలగా పని చేద్దామనుకుని వుంటే వారికి కనీస మౌలిక సదుపాయాలు ఆసుపత్రులలో లేకపోవడమో అందరికీ తెలిసిన విషయం. ఇక ఉప కేంద్రాల విషయానికొస్తే అవి కేవలం నామ మాత్రంగానే పనిచేసేవి. వున్న 1600 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసేందుకు వైద్యులు కరువైనప్పుడు సంచార వాహనాల్లో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రారనేది ముఖ్యమంత్రితో సహా అందరూ గుర్తించారు. వాహనాల్లో వైద్యులు లేకపోయినా, హైదరాబాద్ లోని 104 కాల్ సెంటర్ కు అనుబంధంగా పనిచేస్తున్న డాక్టర్ల తోడ్పాటుతో, సుశిక్షుతులైన సిబ్బందిని వాహనాల్లో పంపి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన మందులు ఫార్మసిస్టు ద్వారా పంపిణీ జరగాలని నిర్ణయం జరిగింది. ప్రభుత్వం తో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు శాయశక్తులా మారుమూల గ్రామాల్లో నివసించే పేద వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, మందులు పంపిణీ చేయడం హెచ్ఎంఆర్ఐ ఒక సామాజిక బాధ్యతగా తీసుకుంది. అందరికీ ఆరోగ్యం అన్న మహత్తర ఆశయంతో, చిత్త శుద్ధితో, అంకిత భావంతో 104 సంచార వాహన సేవలు నిరంతరాయంగా అందించిన హెచ్ఎంఆర్ఐ ఏ నాడూ వెన్ను చూపలేదు.
నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల పరిధిలోకి సుమారు నాలుగు కోట్ల మంది గ్రామీణులను తీసుకురావాలనే లక్ష్యంగా కార్యక్రమం అమలు బాధ్యతలను చేపట్టిన హెచ్ఎంఆర్ఐ సంస్థ, దాన్ని పూర్తి స్థాయిలో సాధించడం జరిగింది. హైదరాబాద్ మినహా మిగతా 22 జిల్లాల్లో 475 సంచార వాహనాల ద్వారా, 22500 సర్వీసు పాయింట్లలో, సమ్మెకాలం మినహా అన్ని రోజుల్లోను నిరంతరాయంగా సేవలందించింది సంస్థ. ఏ మాత్రం రహదారి సౌకర్యాలు లేని మారుమూల కుగ్రామాలకు, తండాలకు, గిరిజన ప్రాంతాలకు వాహనాలు పోయి సేవలందించాయి. గోదావరి పాపికొండలు పరిసర ప్రాంతాలలో పడవలోనే ఆరోగ్య సేవలందించడం జరిగింది. సుమారు రెండు కోట్ల నలబై లక్షల మంది ప్రజలు ఇప్పటి వరకు ఈ సేవల ద్వారా లబ్ది పొందారు. వీరిలో సుమారు 13 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, 15 లక్షల మంది పిల్లలు, 30 లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, 3 లక్షల 50 వేల మంది చక్కెర వ్యాధి పీడితులు, 7 లక్షల మంది రక్త పోటుతో బాధ పడేవారున్నారు. సుమారు 23 లక్షల పాఠశాల విద్యార్థులు కూడా లబ్ది పొందిన వారిలో వున్నారు. రోగ నిర్ధారణ తర్వాత వీరు, సగటున ఆరేడు పర్యాయాలు, సంచార వాహనాల సహాయం పొందారు. ప్రతి గర్భిణీ స్త్రీ సగటున మూడు సార్లు వాహనం దగ్గర కొచ్చి సేవలను పొందింది. లబ్ది పొందిన వారిలో అధిక సంఖ్యా కులు వెనుక బడిన వర్గాలకు, షెడ్యూల్డు కులాలు-తెగలకు చెందిన వారే.
ఈ సేవలన్నీ అందించడానికి హెచ్ఎం ఆర్ఐ యాజమాన్యానికి క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మూడు వేల మంది సిబ్బంది, వారిని పర్యవేక్షించిన జిల్లా స్థాయి సీనియర్ ఉద్యోగులు తోడ్పడ్డారు. నవంబర్ 10, 2010 వరకు ఏ ఒక్కరు కూడా అలసత్వం ఏ సందర్భంలోను కనబర్చలేదు. మరెందుకు వారంతా సమ్మె చేశారు? సమ్మే చేయాల్సిన ఆగత్యం ఏమిటి? యాజమాన్యం పొరపాటే మైనా వుందా? ఎవరైనా పురికొల్పారా? వారు ఆశించిందేమిటి? చివరకు జరిగిందేమిటి? ఆరోగ్య వైద్య రంగంలో సంస్కరణల పేరుతో "కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్ క్లస్టర్ల" పథకం అమలు చేసేందుకు కొద్ది నెలల క్రితం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆ పథకాన్ని 104 సంచార వాహన సేవలకు అనుసంధానం చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకు రాదల్చిన మార్పుల వివరాలను, క్లస్టర్లకు 104 సంచార వాహన సేవల అనుసంధానం చేసే ఆలోచనను, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆ సేవలను నిర్వహిస్తున్న హెచ్ఎంఆర్ఐ యాజమాన్యానికి తెలియ చేసినట్లయితే బాగుండేదేమో! నిర్ణయం తీసుకునే ముందు వారితో చర్చించి వుండాల్సింది.
మాతా శిశు ఆరోగ్య సంరక్షణ మెరుగు పరచడం, పౌష్టికాహార లోపాలను అధిగమించడం ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య వైద్య రంగంలో ప్రవేశపెట్ట దల్చిన సంస్కరణలలో భాగంగా "సాముదాయిక ఆరోగ్య పౌష్టికాహార క్షేత్రాల" ను (కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్ క్లస్టర్లు-సీ హెచ్ ఎన్ సీ) గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పాలని భావించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వైద్య సేవలందించాల్సిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు (పీ హెచ్ సీ) దాదాపు నిర్వీర్యమై పోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పదల్చుకున్న "సీ హెచ్ ఎన్ సీ" లు, గ్రామాలు-పీ హెచ్ సీ), సబ్ సెంటర్ల మధ్య సరాసరి అనుసంధానం కలిగించే వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని ఆ పథకం రూపకర్త, ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేశ్ ధృఢంగా నమ్ముతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన నున్న 360 సాముదాయిక ఆరోగ్య పౌష్టికాహార క్షేత్రాలలోని ఒక్కొక్క క్లస్టర్ ద్వారా లక్ష-రెండు లక్షల మధ్య జనాభాకు, సమగ్ర ప్రాధమిక ఆరోగ్య సేవలు లభించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. "సీ హెచ్ ఎన్ సీ" కి కేంద్ర బిందువుగా వుండే "సాముదాయిక ఆరోగ్య కేంద్రం" (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) లేదా ఏరియా ఆసుపత్రి, దాని చుట్టు పక్కలున్న నాలుగు నుంచి పది వరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు రిఫరల్ యూనిట్ గా పనిచేస్తుంది. క్లస్టర్ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల-ఉప కేంద్రాల పనితీరును పర్యవేక్షించే బాధ్యత క్లస్టర్ ఆసుపత్రిలో వుండే క్లస్టర్ ఆరోగ్యాధికారికి వుంటుంది. 2011 సంవత్సరానికల్లా ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఇరవై నాలుగు గంటలు పనిచేసే దిగాను, దాని చుట్టు పక్కలున్న ప్రతి ఉప కేంద్రానికి నెలకు రెండు పర్యాయాలు వెళ్ళి ఆరోగ్య సేవలందించే "పీ హెచ్ సీ సంచార వాహనం" గాను వుండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. ఆ వాహనాలలో డాక్టర్ వుండే ఏర్పాటు కూడా చేసింది.
ప్రాధమిక ఆరోగ్య వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలు గ్రామీణ ప్రజలకు ఉపయోగ పడడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హెచ్ఎంఆర్ఐ యాజమాన్యం తన సంపూర్ణ సహకారాన్ని ప్రకటించింది. క్లస్టర్ పథకంలో భాగంగా ఆరంభం కానున్న "పీ హెచ్ సీ సంచార వాహనం" 104 సంచార వాహన సేవలకు ప్రత్యామ్నాయం కాబోతున్న విషయం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సుమారు మూడు వేల మంది హెచ్ఎం ఆర్ఐ సిబ్బందికి అధికారికంగా తెలియకపోవడం, జిల్లా స్థాయి అధికారుల నుంచి అనధికారికంగా తప్పుడు సమాచారం అందడం, వారిలో ఉద్యోగ రీత్యా అభధ్రతా భావం నెల కొనడానికి దారితీసింది. సంస్కరణలలో రానున్న మార్పుల విషయంలో పెద్దగా చర్చ జరగలేదు. క్షేత్ర స్థాయి సిబ్బందిలో పెరుగుతున్న అసహనాన్ని గమనించిన హెచ్ఎం ఆర్ఐ యాజమాన్యం, సరైన సమాచారం అధికారికంగా పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విస్తృత స్థాయిలో సంస్కరణల విషయంలో చర్చ జరుగుతే బాగుంటుందని భావించిన హెచ్ఎంనఆర్ఐ యాజమాన్యం ఈ విషయాన్ని పలువురు విజ్ఞుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. నాటి ముఖ్యమంత్రి రోశయ్యతో సహా, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును, టిఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర రావును కలిసింది.
ఈ నేపధ్యంలో 104 సంచార వాహన సేవల అమలులో హెచ్ఎంఆర్ఐ సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందానికి అనుగుణంగా ఏప్రియల్ 2010 నుండి అక్టోబర్ 2010 వరకు సంస్థకు అందాల్సిన రు. 110 కోట్లకు గాను ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమీషనర్ విడుదల చేసింది కేవలం రు. 57 కోట్లు మాత్రమే. మూడు నెలల నిర్వహణ వ్యయాన్ని ఒకే సారి ముందస్తుగా విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఆ నిబంధనకు కట్టుబడలేదు. "ఏపీహెచ్ఎంహెచ్ఐడీసీ" నుంచి సరఫరా కావాల్సిన మందులు నాలుగైదు నెలలుగా సకాలంలో అందడం జరగలేదు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వాహన సిబ్బంది గ్రామాల్లోకి పోయినప్పుడు ప్రజల నుంచి నిరసన ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కలిగాయి. క్లస్టర్ పథకం అమలవుతే ఉద్యోగ భద్రత వుండదని భావించిన సిబ్బంది మరికొన్ని సాకులు చూపి సమ్మెకు దిగింది. వారి డిమాండ్లన్నీ నెరవేర్చడం కష్టమైనవే కాకుండా, హెచ్ఎంఆర్ఐ పరిధిలో లేనటువంటివి. ప్రభుత్వం తీసుకున్న చొరవ కూడా సమ్మె పరిష్కారానికి దోహద పడలేదనే విషయం ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో కూడా స్పష్టంగా వుంది. సమ్మెను పరిష్కరించి 104 సంచార వాహన సేవలను పునరుద్ధరించేందుకు యాజమాన్యం చేతనైనంత చేసింది. ట్రేడ్ యూనియన్ నాయకులతో చర్చలు జరిపింది. ఆ యూనియన్ అనుబంధ పార్టీ సీపీఎం నాయకులకు , మాజీ ముఖ్యమంత్రికి , ప్రస్తుత ముఖ్యమంత్రి సభాపతిగా వున్నప్పుడు ఆయనకు విజ్ఞప్తి చేసింది. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ఇప్పటి ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి సేవలు పునరుద్ధరించమని విజ్ఞప్తి చేసింది యాజమాన్యం.
పరిష్కార మార్గం కొరకు యాజమాన్యం చేయని ప్రయత్నం లేదు. ఏ కలెక్టర్లకైతే ప్రస్తుతం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించిందో, వారిలో పలువురి సహాయాన్ని సమ్మె ప్రారంభమైన తొలినాళ్లలోనే సంస్థ కోరింది. ఇప్పటి ఏర్పాటు అప్పుడే చేసి వున్నట్టయితే కనీసం ఇన్నాళ్లన్నా సేవలు ఆగకుండా కొనసాగేవి కదా! కలెక్టర్లు రంగంలోకి దిగినట్లయితే సమ్మె ఇన్నాళ్లు కొనసాగక పోయేదేమో! కేవలం హెచ్ఎంఆర్ఐ వైఫల్యం కారణంగానే సమ్మె కొనసాగిందనడం ఎంతవరకు భావ్యం? అవగాహనా ఒప్పందంలో అంగీకరించిన మేరకు నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోతే, దాని ప్రభావం ఉద్యోగుల జీతభత్యాలపై పడితే, దానిని కూడా హెచ్ఎంఆర్ఐ వైఫల్యంగా భావించాలా? మందుల పంపిణీ చేయాల్సిన బాధ్యతున్న ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోతే దానిని హెచ్ఎంఆర్ఐ వైఫల్యంగా చిత్రించవచ్చా?
సమ్మె ప్రభావం అంతగా లేదని వాదించేవారికొక విజ్ఞప్తి. నిరక్షరాస్యులైన నిరుపేద ప్రజలకు తమకేంకావాలో వారికే తెలియని వారెందరో వున్నారు. కనీస వైద్య సౌకర్యం కూడా నోచుకోని అమాయక గ్రామీణులు తమ గ్రామానికి సంచార వాహనం వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇస్తే ఆనందిస్తారు. రాని రోజున ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలుసుకునే తీరికా-ఓపికా వారికి లేదు. అలాంటి నాలుగు కోట్ల మంది అభాగ్యులకు 104 సంచార వాహన సేవలు మొదలయ్యేంతవరకు అలాంటి సేవలుంటాయనే విషయమే తెలియదు. కలెక్టర్ల ఆధ్వర్యంలో తాత్కాలికంగా నిర్వహించ తలపెట్టిన 104 సంచార వాహన సేవలు కాని, క్లస్టర్ పథకంలో భాగంగా ఆరంభం కానున్న "పీ హెచ్ సీ సంచార వాహన సేవలు" కాని ప్రజలకు ఇప్పటికంటే ఎక్కువ మేలు చేయగలిగితే, వారిపై ఎక్కువ ప్రభావం చూపగలిగితే ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే!
అలా జరక్కుండా, కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" అమలు పరచడమే జరిగితే భవిష్యత్ లో 104 సంచార వాహన సేవలు కొనసాగినప్పటికీ, నాణ్యతా లోపం-పౌరులకు గతంలో మాదిరి సేవలు లభ్యం కాకపోవడం తప్పదేమో ! ఇలాంటి సేవలు, అలసత్వం వల్లనో, నిధుల కొరత వుందనో, కేంద్రం నుంచి నిధులు సకాలంలో అందడం లేదనో, సంస్కరణలు అమలు పరచడంలో భాగంగా సేవలను కుదించాలనో, కొత్త భాష్యం చెప్పాలనో.... మరింకేదో తలపెట్టే ప్రయత్నమో చేయడం జరుగుతే, నష్టపోయేది అమాయక ప్రజలే!
ప్రభుత్వ పరంగా చాలాకాలం నుంచీ ప్రజలకు లభిస్తున్న ఆరోగ్య-వైద్య రంగ సేవల నిర్వహణలోని లోటుపాటులను అధిగమించడానికి, సంస్కరణలే శరణ్యమని, ఆ రంగంలోని నిపుణులు నిర్ధారించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలనే సరైన రీతిలో నిర్వహించలేని స్థితిలో వుందని గుర్తించింది ప్రభుత్వం. ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా గ్రామీణ-గిరిజన ప్రాంతాలలో పనిచేయడానికి వైద్యులు కావల్సినంత సంఖ్యలో ముందుకు రావడం లేదు. ఈ నేపధ్యంలో, సామాన్యుడికి-అ సామాన్యుడికి మధ్య ఆరోగ్య-వైద్య సేవలు లభించడం విషయంలో అంతరాలు పెరిగాయి. ప్రయివేట్ సామర్థ్యాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిన అవసరం వచ్చింది. సంస్కరణలకు నాంది పలికింది ప్రభుత్వం. సంస్కరణలలో ప్రధానంగా పేర్కొనాల్సింది ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ ద్వారా ఆరోగ్య-వైద్య సేవల కల్పన. "జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్" ఈ ప్రక్రియకు ఊతమిచ్చింది. అలాంటి ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరంభమై ఇంతవరకు నిరంతరాయంగా ప్రజలకు లభ్యమవుతున్న సేవలు పూర్తిగా ప్రభుత్వం ద్వారానే లభించాలను కోవడం ఎంతవరకు సమంజసమో భవిష్యత్తే నిర్ణయిస్తుంది.
No comments:
Post a Comment