108 అత్యవసర సహాయ సేవలను
అర్థాంతరంగా ఆపుచేస్తామనడంలో ఔచిత్యం?- I
వనం జ్వాలా నరసింహారావు
అవగాహనా ఒప్పందం లేకుండా అత్యవసర సహాయ సేవలను అందిస్తున్నామని, నెల నెలా నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బుల కోసం కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని, ప్రభుత్వం నుంచి అనునిత్యం బెదిరింపులు-సాధింపులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ 108 అంబులెన్సు సేవలను నడపమని, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో వాటిని గత ఐదేళ్లు గా నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆ వార్తకు స్పందించిన వైద్య-ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ పీవీ రమేశ్ ఇ.ఎం.ఆర్.ఐ అధికారులకు ఎంఓయు విషయంలో భరోసా ఇవ్వడంతో తాత్కాలికంగా సమస్య సమసిపోయినా, ఒక ఇ.ఎం.ఆర్.ఐ బోర్డు సభ్యుడి ప్రోద్భలం మేరకు, సిఇఓ సంతకంతో ప్రభుత్వానికి అలాంటి హెచ్చరిక వెళ్లడం వెనక బలమైన కారణాలుండవచ్చు. సిఇఓ లేఖ కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కైతే, సమస్య పరిష్కరించింది ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కావడం కూడా గమనించాల్సిన విషయం.
అసలేం జరుగుతున్నది? ప్రభుత్వ హామీలు, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ చైర్మన్ జీ.వీ.కె హామీలు కాగితాలకే పరిమితమా? యాజమాన్య నిర్వహణలో లోపాలున్నాయా? అధికారులు నిరాసక్తతను పరోక్షంగా ప్రదర్శిస్తున్నారా? పాతికేళ్ళ పైబడి యాజమాన్య నిర్వహణలో అపారమైన అనుభవం గడించిన సిఇవో, ప్రభుత్వానికి అలా హెచ్చరిక ఎందుకు చేయాల్సి వచ్చింది? అంబులెన్సుల సేవలు ఆగిపోతే నష్టపోయేది పేద వారే కాని ధనికులు కాదు. వ్యక్తిగత పట్టింపులకు, పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన సేవలు ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో అనుకుని అలా హెచ్చరికలు జారీచేయడం ఎంతవరకు సమంజసం? ఏదో వంక చూపి, అత్యవసర సహాయ సేవలను నిలుపుదల చేస్తామని లిఖిత పూర్వ కంగా ఇవ్వడం నేరంగా పరిగణించాలి కదా!
108 అంబులెన్సుల ద్వారా అత్యవసర సహాయ సేవలందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ పని తీరుపై ఏడెనిమిది నెలల క్రితం ప్రభుత్వం ఒక కమిటీని నియమించినప్పుడే, ప్రభుత్వ ఆలోచనా సరళిలో కొంత మార్పు వస్తున్నట్లు భావించాలి. కమిటీని నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో... "ప్రస్తుతం లభిస్తున్న అత్యవసర రవాణా సేవలకు ప్రత్యామ్నాయాలే మన్నా వున్నాయేమో పరిశీలించడంతో సహా అన్ని అంశాలను సమీక్షించి, సరైన సూచనలను-సలహాలను ఇవ్వాల్సింది" గా పేర్కొనడం భవిష్యత్ పరిణామాలకు సంకేతం కావచ్చు.
ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు ఇంతకంటే "పెను సవాలు" మరోటి లేదు. ఇరువురు భాగస్వాముల ఆలోచనా ధోరణిలో మార్పురానంత కాలం అత్యవసర సహాయ సేవల అమలు గతంలో మాదిరి జరిగే అవకాశం లేదు. భాగస్వాముల మధ్య "విశ్వాసం"-"నమ్మకం" కలగడం ముఖ్యం. అలాంటి (లోగడ వున్న మాదిరిగానే) విశ్వాసం-నమ్మకం పునరుద్ధరించడానికి అవసరమైన తక్షణ చర్యలకు ప్రభుత్వం నియమించిన కమిటీ చొరవ తీసుకున్న దాఖలాలు ఆ కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు లేదు. అసలా నివేదికలో ఏముందో కూడా బహిర్గతం కాలేదు. అది జరక్కుండా, కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" ప్రతిపాదించడమే జరిగితే భవిష్యత్ లో 108-అత్యవసర సహాయ సేవలు కొనసాగినప్పటికీ, పౌరులకు గతంలో మాదిరి నాణ్యమైన సేవలు లభ్యం కాకపోవడం తప్పదేమో !
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగిన చిట్టచివరి సమీక్షా సమావేశంలో (ఇ.ఎం.ఆర్.ఐ ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య కన్సల్టెంటు గా నేను కూడా వున్నాను), ప్రభుత్వంతో ఇ.ఎం.ఆర్.ఐ కుదుర్చుకున్న ఎంఓయు గడువు మే నెల 5, 2008 తో ముగిసినందున, దాని అమలును, తగు సవరణలతో అవసరమైనంత కాలవ్యవధి వరకు పొడిగించాలని, కొత్త ఎంఓయు పై సంతకాలు కావాలని ఆయన చేసిన సూచన ఇంతవరకు అమలు జరగలేదు. లక్షలాది ప్రాణాలను కాపాడవలసిన సంస్థ నిర్వహణ వ్యయం కొరకు విడుదల చేయాల్సిన నిధులను తెచ్చుకోవడంలోనే సంస్థ అధికారులు నెలంతా కాలం వెళ్లబుచ్చాల్సిన పరిస్థితులున్నాయిప్పుడు. నిర్వహణ వ్యయం భరించే విషయంలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం సిద్ధాంత ప్రక్రియకు అనుగుణంగా, ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ తమ-తమ వంతు వాటాగా 95%-5% నిష్పత్తి విధానాన్ని పాటించాలని, యాజమాన్య పరమైన వ్యయం కింద ఇ.ఎం.ఆర్.ఐ పెడుతున్న ఖర్చును సంస్థ సమకూర్చాల్సిన 5% వాటాగా పరిగణించాలని, రాజశేఖర రెడ్డి సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్య నిర్వహణ బాధ్యతలు స్వీకరించబోయే భావి సంస్థల-వ్యక్తుల (జీవీకే సంస్థ) నుంచి, లోగడ ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణాల మొత్తాన్ని తీర్చేందుకు తగు ఆర్థిక సహాయాన్ని పొందే ఏర్పాటు చేసుకోవాలని ఆయన స్పష్టంగా సూచించారు. అత్యవసర సహాయ సేవల నిర్వహణకు నియమించబడిన ఆపరేషన్స్ సిబ్బంది జీతభత్యాలు, ప్రతి నెల మొదటి తేదీన చెల్లించే విధంగా, ప్రభుత్వం అంగీకరించిన నిధులను విడుదల చేస్తుందని మినిట్స్ లో నమోదుచేశారు. మినిట్స్ లో పొందు పరచకపోయినా ముఖ్యమంత్రి చేసిన మరి కొన్ని విలువైన సూచనలు, ఎంత మేరకు అమలుకు నోచుకున్నాయన్న విషయాన్ని ధృవీకరించాల్సింది అటు ప్రభుత్వం-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం.
ఇ.ఎం.ఆర్.ఐ సంస్థతో మూడున్నర సంవత్సరాలు అనుబంధం వున్న వ్యక్తిగా, "ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ" ఆవిర్భావం నుంచి ఆరోహణ వరకు, ఉన్నత శిఖరాలకు చేరుకోవడం దాకా, నా వంతు భూమిక నిర్వహించిన వ్యక్తిగా, ఇ.ఎం.ఆర్.ఐ సమకూరుస్తున్న 108-అత్యవసర సహాయ సేవల విషయంలో ఆ సంస్థపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఒకప్పుడున్న "నమ్మకానికి-విశ్వాసానికి" సంబంధించిన ఒకటి-రెండు అంశాలను పేర్కొంటానిక్కడ.
ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియలో ప్రారంభమైన అత్యవసర సహాయ సేవలు, కులాలకు-మతాలకు-రాజకీయాలకు-సామాజిక వర్గాలకు-ధనిక, బీద తేడాలకు-స్త్రీ, పురుష భేదాలకు అతీతంగా లక్షల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయడం పలు జాతీయ-అంతర్జాతీయ సంస్థలను, పరిశోధకులను ఆసక్తి పరిచాయి. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యానికి సంబంధించి "ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" తొలుత భాష్యం చెప్పింది 108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు ప్రోద్బలం-ప్రోత్సాహం అందించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సారధ్యంలోని అలనాటి రాష్ట్ర ప్రభుత్వం. ప్రయివేట్ భాగస్వామి "లాభాపేక్ష" తో ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం-కొనసాగించడం ఆచరణ సాధ్యమవుతుందేమోగాని, "లాభాపేక్ష లేకుండా" ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడం తేలికైన విషయం కాదు. అలా సాధ్య పడాలంటే భాగస్వామ్య పక్షాలైన ఇరువురి లో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి "విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న నేపధ్యంలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి బాధ్యులైన వారందరూ నేరస్తులే.
ప్రభుత్వ పరంగా ప్రజలకు లభిస్తున్న ఆరోగ్య-వైద్య రంగ సేవల నిర్వహణలోని లోటుపాటులను అధిగమించడానికి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ దోహద పడుతుంది. అత్యవసర సహాయ సేవలను, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సమకూర్చేందుకు ప్రభుత్వ, ప్రయివేట్ వ్యక్తులు కొందరు ఆంధ్ర ప్రదేశ్ లో చొరవ తీసుకోవడం, క్రమేపీ ఇతర రాష్ట్రాలకు వ్యాపించడం జరిగింది. అనవసర జాప్యాలకు, ప్రభుత్వ ఉద్యోగులలో కూరుకుపోయిన అలసత్వానికి అతీతంగా, ప్రభుత్వ పరంగా ప్రజలకు లభ్యమయ్యే అభివృద్ధి-సంక్షేమ పథకాలను మరింత మెరుగుగా-వేగవంతంగా అందించాలన్న ఆశయంతో, భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న పలు ప్రజాస్వామ్య దేశాల్లో, ఐదారు దశాబ్దాల క్రితం నెలకొన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. సంస్కరణల పుణ్యమా అని, భారతదేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయడం జరిగింది. వాటి మూసివేతకు కొంత ముందు-వెనుకగా "ప్రభుత్వ ప్రయివేట్ సంయుక్త రంగంలో" స్థాపించిన పరిశ్రమలు (జాయింట్ వెంచర్లు) కూడా యాజమాన్య పరమైన బాలారిష్టాలకు గురై, మూసివేయడం జరిగింది.
మరో వైపు, ప్రయివేట్ రంగంలో నెల కొన్న అనేక సంస్థలు మెరుగైన సేవలను అందించడమే కాకుండా, లాభాలను ఆర్జించడం కూడ మొదలయింది. ప్రయివేట్ పరంగా మెరుగైన పౌర సేవలు లభ్యమవుతున్న నేపధ్యంలో, ప్రభుత్వ ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ పరంగా సమకూర్చడం కన్నా, ప్రయివేట్ తోడ్పాటు తీసుకోవడానికి అనువైన-సులువైన-ఆచరణాత్మకమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఫలితంగా రూపుదిద్దుకున్నదే "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం". ఈ ప్రక్రియలో రెండు రకాల భాగస్వామ్యాలు ఆచరణలోకి రాసాగాయి. దీర్ఘకాలిక ఉత్పాదకతను దృష్టిలో వుంచుకుని రూపొందించే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, ప్రభుత్వ పరంగా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ కార్యక్రమాలను అమలుచేసేందుకు, లాభాపేక్షతో పనిచేస్తున్న ప్రయివేట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మొదటిది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వ బాధ్యతగా అమలుపర్చాల్సిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో-తోడ్పాటుతో, మరింత మెరుగైన రీతిలో, లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజలకు సమకూర్చడం రెండో తరహా భాగస్వామ్యం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సంక్షేమ కార్యక్రమాలను-అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరిచేందుకు-దీర్ఘకాలంగా కొనసాగించేందుకు, అవసరమైన ముఖ్య సాధనం, భాగస్వామ్య పక్షాల మధ్య అంగీకారంతో తయారు చేయబడే "ఎంఓయు-అవగాహనా ఒప్పందం".
ప్రభుత్వ శాఖలలోని నైపుణ్యం-నాణ్యతా పరమైన లోటుపాటులను, ప్రయివేట్ రంగంలోని (లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల) ఆర్థిక పరమైన ఇబ్బందులను, ఉమ్మడిగా అధిగమించేందుకు, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం సరైన ప్రక్రియని ప్రభుత్వం గుర్తించింది. మౌలిక వసతులను ఏర్పాటు చేయగలిగే సామర్థ్యం, దానికి కావాల్సిన తొలి విడత పట్టుబడి సమకూర్చుకోగలిగే స్థోమత, సాంకేతిక పరిజ్ఞానం అమర్చుకోగల శక్తి గల, లాభాపేక్ష రహిత ప్రయివేట్ వ్యక్తులతో-సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందించే ఆలోచన చేసింది ప్రభుత్వం. పరస్పర సంబంధ-బాంధవ్యాల విషయంలో, భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం-నిబద్ధత-హక్కులు-బాధ్యతల విషయంలో, ఎవరి పాత్ర ఏమిటన్న అంశం క్షుణ్ణంగా పరిశీలించాలని భావించింది ప్రభుత్వం.
పదకొండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2007-2012), ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరోగ్య సేవలందించేందుకు, తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేయడానికి, ప్రణాళికా సంఘం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక కార్య నిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రజల ఆరోగ్య-వైద్య అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన-మెరుగైన-నాణ్యమైన సేవలను పౌరులకు లభ్యమయ్యేలా చేసేందుకు, యావత్ వైద్య రంగం "జాతీయ సంపద" గా మలిచేందుకు, ఒక ప్రధానమైన సాధనంగా "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" ఉపయోగించుకోవాలని, ఆ ప్రక్రియకు నిర్వచనం వివరిస్తూ పేర్కొంది ప్రణాళికా సంఘం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలోని ప్రయివేట్ పదానికి పెడార్థాలు చెప్పరాదని, ఆరోగ్యరంగాన్ని పూర్తిగా "ప్రయివేటీకరణ" చేసి, బాధ్యతలనుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నదని భాష్యం చెప్పొద్దని ప్రణాళికా సంఘం అభిప్రాయం వెలిబుచ్చింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లక్ష్యాలు-ధ్యేయాలు చేరుకునేందుకు, అందులో ప్రధాన భాగమైన "గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా సేవల పథకం" అమలుకు-ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమై పది రాష్ట్రాలకు పాకిన 108-అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడింది.
ఫిబ్రవరి 8, 2005 న సత్యం కంప్యూటర్స్ చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా, ఇ.ఎం.ఆర్.ఐ ఆవిర్భావం జరిగింది. తన కుటుంబ సభ్యులే "ప్రమోటర్స్" గా అతి చాకచక్యంగా సొసైటీ నియమ-నిబంధనలను రూపొందించారు రాజు గారు. "భద్రత మీ హక్కు" అన్న నినాదంతో, ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థగా, ఒకే గొడుకుకింద-ఒకే వ్యవస్థ నిర్వహణలో, వైద్య-అగ్నిమాపకదళ-పోలీసు సంబంధిత అత్యవసర సహాయ సేవలను అందించేందుకు నెలకొల్ప బడిందే అత్యవసర యాజమాన్య నిర్వహణా పరిశోధనా సంస్థ. తొలుత ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించకుండా, సగటు పౌరుడిపై ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా, వీరు-వారు అనే తేడా లేకుండా, అందరికీ లభ్యమయ్యేలా నిర్వహించేందుకు ఉద్దేశించబడిన ఇ.ఎం.ఆర్.ఐ అందుకనుగుణంగానే తన లక్ష్యాలను-ధ్యేయాలను రూపొందించుకుంది. End of Part-I
No comments:
Post a Comment