డిసెంబర్ 19, 2010 న "అధ్యాపక వృత్తిలో"
ఏబై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో
మాటల్లో ఆత్మీయతకు-చేతల్లో నిబద్ధతకు-ఆద్యంతం నిజాయితీకి
పర్యాయపదం మా "మారం రాజు సత్యనారాయణ రావు"
(ఆంధ్ర ప్రభ 20-12-2010)
వనం జ్వాలా నరసింహారావు
ఖమ్మం కళాశాలలో పీయుసి, మొదటి రెండు సంవత్సరాల బీయెస్సీ డిగ్రీ కోర్సు పూర్తి చేసుకుని మిగిలిన ఏడాది చదువు కొనసాగించడానికి హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో నేను చేరిన ఏడాదే, 1965 లో, ఖమ్మం కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా బదిలీ మీద వచ్చారు మారం రాజు సత్యనారాయణ రావు గారు. రావడంతోనే ఖమ్మం మామిళ్లగూడెంలో వున్న మా ఇంట్లో దక్షిణం వైపున్న మూడు గదుల్లో అద్దెకు చేరారు. అప్పట్లో మా ఇంట్లో కాలేజీ లెక్చరర్లు అద్దె కుండే ఆనవాయితీ కొంతకాలంగా సాగుతోంది. కొన్నాళ్లు ఎకనామిక్స్ లెక్చరర్ జగన్మోహన రావు గారు, ఇంగ్లీషు లెక్చరర్ కెవైఎల్ నరసింహారావు గారు, అంతకు ముందు మరో నరసింహారావు గారు మా ఇంట్లో అద్దెకుండేవారు. అయితే వారికీ మారం రాజు గారికి చాలా తేడా వుందనాలి. మిగిలిన వారిలా కాకుండా, అద్దె కొచ్చిన మరుక్షణం నుంచే మా కుటుంబీకులందరితో కలిసిమెలిసి పోయారు. ఆయన అద్దెకున్నాడని మేము కాని, మేము స్వంతదారులమని ఆయన కాని, ఆయన శ్రీమతి సీతమ్మ గారు కాని ఏనాడూ భావించలేదు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. మారం రాజు సత్యనారాయణ రావు గారు మా అమ్మ వైపు సమీప బంధువై తే, ఆయన శ్రీమతి సీతమ్మ గారు మా నాన్న వైపు సమీప బంధువు కావడం కూడా ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరగడానికి దోహదపడింది. రెండు వైపులా వున్న బంధుత్వం ప్రకారం ఆయన నాకు బాబాయి వరుసై తే, ఆమె నాకు పిన్ని వరుసయ్యేది. అలానే పిలుస్తుండేవాడిని నేను.
ఇంతలో 1966 మార్చ్ నెలలో నా డిగ్రీ చదువు పూర్తి చేసుకుని ఖమ్మం సమీపంలోని మా గ్రామం వనం వారి కృష్ణా పురం చేరుకున్నాను నేను. మూడు సంవత్సరాలు మా వూళ్లో గడిపినప్పటికీ, ఖమ్మం ఇంట్లో కూడా వుండడానికి వస్తుండేవాడిని. ఆ రోజుల్లో ఖమ్మం సమితి కింద వున్న మా గ్రామాల్లో రాజకీయ పోరు రాయలసీమ ముఠా తగాదాల మోతాదులో, వాటిని మరిపించే స్థాయిలో వుండేవి. కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గంతో, కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తోడ్పాటుతో ఆధిపత్య పోరులో హత్యా రాజకీయాలు నడుస్తుండేవి. ఇరు పక్షాలకు చెందిన ముఖ్య నాయకులెందరో హత్యకు గురయ్యారు కూడా. అప్పట్లో సీపీఎం కు మా గ్రామాల్లో నాయకత్వం వహిస్తున్న స్వర్గీయ గండ్లూరి కిషన్ రావుకు మారం రాజు సత్యనారాయణ రావు గారి భార్య సీతమ్మగారు స్వయానా సోదరి కావడంతో, ఆయన మా ఇంటికి తరచూ వస్తుండేవారు. అదే రోజుల్లో మా వూళ్ళో వుంటున్న నాకు కూడా సీపీఎం పట్ల వున్న అభిమానంతో గ్రామ రాజకీయాల్లో ఆసక్తి కలగడం, కిషన్ రావు మీద గౌరవం వుండడం, మారం రాజు గారి దగ్గర కొచ్చే ఆయనను-ఆయన ద్వారా మారం రాజు గారిని తరచుగ కలవడానికి అవకాశం కలిగించింది. మారం రాజు గారు, నాకు తెలిసినంతవరకు ఏ పార్టీకి చెందిన వాడు కాదు. కమ్యూనిస్టులతో సహా అందరితో ను సన్నిహిత సంబంధాలుండేవి. కాకపోతే అధ్యయన పరంగా, రాజకీయ శాస్త్ర అధ్యాపకుడిగా మార్క్సిజం అన్నా-కమ్యూనిజం అన్నా వీలున్నప్పుడల్లా "మేధో మధనానికి" సిద్ధపడేవారు. బహుశా అదే మా ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యానికి దారి తీసిందనుకుంటాను. బహుశా మొదట్లో గండ్లూరి ప్రభావం, ఆ తర్వాత స్థానిక డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి గారి వంటి "మేధావుల" ప్రభావం ఆయన మీద కొంత పడి అధ్యయన పరంగా ఆ దృక్ఫదం వున్న వారితో ఇతరులకంటే కొంచెం ఎక్కువ సాన్నిహిత్యం కలిగుండా లి.
మారం రాజు సత్యనారాయణ రావు గారి విద్యార్థుల్లో కమలాపురం గ్రామానికి చెందిన వనం రంగారావు (నాకు బంధువు కూడా) ఒకరు. పొలిటికల్ సైన్స్ తరగతుల్లో ఆయన పాఠాలు చెప్పే విధానాన్ని ఎంతో అభిమానంగా-గౌరవంగా మా మిత్రులకు వివరించేవాడు. చక్కటి సందర్భోచిత ఉదాహరణలతో వర్తమాన రాజకీయాలకు అన్వయించుకుంటూ, పొలిటికల్ సైన్స్ - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాఠ్య పుస్తకాల్లోని విషయాలను సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎలా ఆయన చెప్పేవాడో మాకు వివరించేవాడు. మా ఇంట్లో వుంటున్న మారం రాజు గారి దగ్గరకు కాలేజీ అయింతర్వాత కూడా వచ్చి సందేహాలను తీర్చుకునేవాడు రంగారావు. ఆ రోజుల్లో ఆయన దగ్గర తాను నేర్చుకున్న విద్యే తనకెంతగానో తోడ్పడిందని ఇప్పటికీ అంటుంటాడు రంగారావు. నేను డిగ్రీలో సైన్స్ చదువుకున్నా, పోస్టు గ్రాడ్యుయేషన్ "పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్" లో చేయడానికి స్ఫూర్తి కలిగింది బహుశా సత్యనారాయణ రావు గారి సాన్నిహిత్యం వల్లనే అనాలి. ఆయన రాజకీయ శాస్త్రం లోని విషయాలను తీరికున్నప్పుడల్లా చెప్పే పద్దతికి ఆకర్షితుడనైన నేను, అవకాశం దొరకగానే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో చేశాను.
నాకు అప్పుడప్పుడూ వర్తమాన రాజకీయాల గురించి, గత కాలం నాటి రాజకీయాలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించడం గురించి, పత్రికల్లో వ్యాసాలు రాసే అలవాటుంది. నేనేదైనా అంశం గురించి రాయదల్చుకున్నప్పుడు, ఆ విషయాల్లో ప్రవేశం, ప్రావీణ్యం వున్న వారితో ముచ్చటించడం తప్పనిసరిగా చేస్తుంటాను. విషయ సేకరణకు నేను సంప్రదించే వారిలో అతి ముఖ్యుడు మారం రాజు సత్యనారాయణ రావు గారు. హైదరాబాద్ లో వుంటున్న వాళ్లబ్బాయింట్లో ఆయన వున్నప్పుడల్లా ఆయనతో ముచ్చటించడానికి వెళ్తుంటాను. కలిసినప్పుడల్లా ఒక ఆర్టికల్ రాయడానికి కావల్సినంత సమాచారం ఆయనిస్తుంటారు. ఇటీవల కాలంలో తరచుగా ఆయనను కలిసే అవకాశం దొరుకున్నదలా.
వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో ఎలా అంతర్భాగం అయ్యాయి, ఎలా ధిక్కార పర్వాల-అసంతృప్తి కాండల అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానం సాగింది అన్న విషయాన్ని గురించి నేను రాసిన ఆర్టికల్ కు విషయాన్ని సమకూర్చింది మారం రాజు గారే. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావపు తొలినాళ్లలోనే, పార్టీని-పార్టీ కార్య కలాపాలను ప్రభావితం చేసిన మితవాద భావాల "మాడరేట్ల" ప్రభావం క్షీణించి, మిలిటెంట్ భావాల వారి పలుకుబడి పెరగడంతో, 1907 లో పార్టీలో ఎలా చీలి కొచ్చింది నాకు వివరించింది ఆయనే. మాడరేట్ల "కన్వెన్షన్" బాల గంగాధర తిలక్ ప్రభృతులను పార్టీ నుంచి బహిష్కరించడంతో వారంతా "నేషనలిస్ట్ పార్టీ" పేరుతో సమావేశమైన నాడే , వంద సంవత్సరాల పూర్వమే ధిక్కార స్వరాలకు అంకురార్పణ జరిగిన విషయాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పింది మారం రాజు గారే. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో, మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులు పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి, తిరిగి స్వగృహ ప్రవేశం చేసి, అదే సంజీవరెడ్డి ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి ఎలా అయింది, మద్య నిషేధం సాకుగా, సంజీవరెడ్డి బలపర్చిన ప్రకాశం పంతులు రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించిన విధానం, శాసన సభను రద్దుచేయడం నాకు చెప్పింది ఆయనే. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా పార్టీని వదిలి, "డెమోక్రాటిక్ పార్టీ” ని స్థాపించిన వైనం ఆయనకు తెలిసినంతగా ఇతరులకు తెలవకపోవచ్చునేమో! బొమ్మ కంటి చెప్పిన "హైదరాబాదు స్వాతంత్ర్య పోరాటం" నేను రాయడానికి ప్రోత్సహించింది మారం రాజు గారే.
ఇంటర్మీడియట్, బియ్యే, ఎంఏ (పొలిటికల్ సైన్స్) హైదరాబాద్ నిజాం కళాశాలలో ముగించుకున్న మారం రాజు సత్యనారాయణ రావు గారు "ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాల" మీద 1979-1983 మధ్య కాలంలో పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ తెచ్చుకున్నారు. ఆయనకు "పీహెచ్‌డీ" వచ్చిన విషయం అందరికి తెలిసే అవకాశం వున్నా, తన పరిశోధనలో భాగంగా ఎవరెవరి ని కలిసిందనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చునేమో! ఆయన కలిసి విషయ సేకరణలో అభిప్రాయాలు పొందిన ప్రముఖుల్లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, స్వర్గీయులు కాసు బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహా రావు, టంగుటూరి అంజయ్య, కోట్ల విజయ భాస్కర రెడ్డి వున్నారు. పీవీ గారిని కలిసినప్పుడు మిగతా విషయాలకు అదనంగా "భూ సంస్కరణల" విషయం ప్రస్తావనకొచ్చింది. జవాబును దాటవేసిన పీవీ, ఆ విషయాలను గురించి నిష్పక్షపాతంగా తెలుసుకోవాలంటే, తన చుట్టు పక్కలున్న వారిని, తన ఆంతరంగికులైన వ్యక్తిగత కార్యదర్శిని, ఆఖరుకు తన డ్రైవర్‌ను కలిస్తే బాగుంటుందని సూచించాడట. కాసు బ్రహ్మానందరెడ్డి ఆయన అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పడమే కాకుండా, మరిన్ని వివరాలకు ఆయన మంత్రివర్గ సహచరుడైన రొండా నారపరెడ్డి గారిని కలవమని సలహా ఇవ్వడం, ఆయనను కలిసి మారం రాజు గారు తనకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం జరిగింది. సత్యనారాయణ రావు గారు కలిసిన మరో ప్రముఖ వ్యక్తి స్వర్గీయ కల్లూరి చంద్రమౌళి గారు. ఎడిన్ బరో లో పీహెచ్‌డీ చేసిన కల్లూరి ఒక పల్లెటూరు రైతులా మారం రాజు గారితో ముచ్చటించారు. ఆయన కలవడానికి వెళ్లిన సత్యనారాయణ రావు గారికి "అల్లుడి మర్యాదలు" చేశారాయన. విజయభాస్కర్ రెడ్డిని కలిసేందుకు వెళ్లారట. ఆయన కలిసిన రోజున బిజీగా వున్న విజయభాస్కర్ రెడ్డి, మర్నాడు రమ్మని చెప్పారట. మర్నాడు కూడా ఆయన బిజీగా వుండొచ్చుకదా అన్న సందేహం వ్యక్త పరిచారు మారం రాజు. వెంటనే, తన ఆంతరంగిక సిబ్బందిలో ఒకరిని పిలిచి, మర్నాడు మారం రాజు వచ్చిన సమయంలో, తాను "బాత్ రూమ్” లో తప్ప ఎక్కడున్నా-ఎవరితో మాట్లాడుతున్నా, ఆయనను తన దగ్గరకు తీసుకురమ్మని ఆదేశాలిచ్చారట. ఆయన మాట ప్రకారమే, ఐదారు గంటల సమయం మారం రాజు గ్రంధం కొరకు కేటాయించారట. అదీ, విజయభాస్కర్ రెడ్డి "కమిట్‌మెంట్" అన్నారు సత్యనారాయణ రావు గారు నాతో.
1960 లో ఎంఏ పూర్తిచేసిన మారం రాజు గారు మొదట సిద్దిపేట కాలేజీలోను, తర్వాత రాజమండ్రి, ఖమ్మం, నల్గొండ, సత్తుపల్లి కళాశాలలలోను పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా పనిచేశారు. రెండవ పర్యాయం ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు అప్పటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి రాం రెడ్డి గారు సత్యనారాయణ రావు గారి ప్రతిభను గుర్తించి, అక్కడ పనిచేసేందుకు ఆయనను ఒప్పించారు. డాక్టర్ మారం రాజు సత్యనారాయణ రావు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో ఒక్క ఉపకులపతి పదవి మినహా అన్ని పదవులను నిర్వహించారు. రిజిస్ట్రార్ గాను, రాజకీయ శాస్త్రం విభాగానికి ఆచార్యుడు గాను పనిచేసే రోజుల్లో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశోధనాత్మక గ్రంథం రాశారు. రాజకీయ శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలపై పుస్తకాలు రాశారు. 1983 ఎన్ టీ ఆర్ ఎన్నికల విజయంపై "ఎన్నికల రాజకీయాలు" అనే పరిశోధనాత్మక గ్రంథం రాశారు. ఇందిరా గాంధీ మెదక్ లోక్ సభకు పోటీ చేసి గెలిచినప్పుడు, ఎన్నికల ముందు, ఎన్నికల అనంతరం నియోజక వర్గంలో అధ్యయనం చేసేందుకు మారం రాజు గారు విస్తృతంగా పర్యటించారు. నారాయణ్ ఖేడ్ సమీపంలోని ఒక గ్రామంలో మొత్తం ఆరువందల ఓట్లలో ఒకే ఒక్క ఓటు ఇందిరకు పడడం ఆశ్చర్యం కలిగించిందంటారాయన. ఆ గ్రామ పెద్ద (వకీల్ సాబ్) చెప్పిన వారికే తాము వోటు వేశామని గ్రామస్తులు చెప్పిన విషయాన్ని ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటుంటారు మారం రాజు గారు.
మారం రాజు సత్యనారాయణ రావు గారిది విలక్షణమైన వ్యక్తిత్వం. తనకు చేతనైనంత సహాయపడాలనే మనస్తత్వం ఆయనను చాలా మందికి సన్నిహితుడిని చేసింది. పాతిక-ముప్పై సంవత్సరాల క్రితం మా బంధువుల ఇళ్లల్లో వివాహాలు జరిగినప్పుడు, ఇప్పటిలా కాకుండా, అనేక విషయాల్లో "బరువు బాధ్యతలు" నిర్వహించాల్సిన వ్యక్తుల అవసరం బాగా వుండేది. ఇప్పటిలా అప్పట్లో అన్నీ కాంట్రాక్టుకు ఇచ్చే ఆనవాయితీ లేదు. నాకు తెలిసినంతవరకు, చాలా పర్యాయాలు, చాలా మందికి ఆ విషయాల్లో తోడ్పడి "ఆదుకున్న వ్యక్తి" మారం రాజు సత్యనారాయణ రావు గారు. వివాహాల్లో ఆడ పెళ్లి వారి పక్షాన "నిలబడి", మగ పెళ్ళి వారికి కావాల్సిన సామానులను బధ్ర పరిచిన "స్టోర్స్" బాధ్యతను ఏ ఇబ్బందులు కలగకుండా అను క్షణం నిర్వహించే "ఆత్మీయుడు" గా మారం రాజు సత్యనారాయణ రావు గారిని జ్ఞాపకం చేసుకోని బంధువులు బహుశా మాలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదే మో!
ఇలాంటి, అలాంటి మహనీయుడు మా బాబాయి మారం రాజు సత్యనారాయణ రావు బాబాయి గారు "అధ్యాపక వృత్తిలో" ఏబై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో నమస్కార పూరిత అభినందనలు తెలియ చేసుకుంటున్నాను. 1983 లో ఆయనకు "ఉత్తమ ఉపాధ్యాయుడి" పురస్కారం వచ్చిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ఆయనను అభిమానించే అందరికీ ఆ విషయాన్ని మరో మారు గుర్తు చేస్తున్నాను. నా భార్య శ్రీమతి విజయ లక్ష్మి, నా కూతురు టీవీ 9 ప్రేమ మా పిన్ని సీతమ్మ గారి (మా అమ్మాయి ప్రేమగా "తాతమ్మ" అని పిలిచే ది) తో వున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
No comments:
Post a Comment