108 అత్యవసర సహాయ సేవలను
అర్థాంతరంగా ఆపుచేస్తామనడంలో ఔచిత్యం?-III
వనం జ్వాలా నరసింహారావు
ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7, 2009 న "సత్యం కంప్యూటర్స్ సంస్థ కుంభకోణం" వ్యవహారంలో, చైర్మన్ రామ లింగరాజు తాను "దోషి" నని, "తప్పుచేసానని" బహిర్గతం చేయడానికి అర గంట ముందు, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓకు ఫోన్ చేసి, మరి కాసేపట్లోనే తానొక "సంచలనాత్మక" ప్రకటన చేయబోతున్నానని, ఆ ప్రకటన ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని చెప్పారు. అయినప్పటికీ, తనకు అత్యంత గౌరవ ప్రదమైన-ప్రీతిపాత్రమైన-హృదయానికి చేరువైన 108-అత్యవసర సహాయ సేవలను "ఎన్ని కష్ట నష్టాలెదురైనా" నిరాటంకంగా కొనసాగించాలని కోరారు (అభ్యర్థించారు?).
లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను రామ లింగరాజు ఎందుకు ప్రారంభించ దలిచాడు, నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు, కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు, రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు, ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు, బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు, ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు, చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న సిఇఓ చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి.... ఇలాంటి వాటికి సమాధానం రాజు గారే ఏనాడో ఒకనాడు ఇవ్వాలి తప్ప ఇతరులకు జవాబు వెతకడం సాధ్య పడేది కాదు.
సంస్థను ఆరంభించిన నాటినుంచి జనవరి 9, 2009 వరకు, అత్యవసర సహాయ సేవల నిర్వహణ ఎలా రూపాంతరం చెందింది-ఎలా నిర్వహణ నిధులు సమకూరుతున్నాయి-ఆర్థిక పరమైన భారం తనపై ఎంత మేరకు తగ్గుతుంది-పెరుగుతుంది లాంటి విషయాలను రాజు గారు బహుశా ఎప్పటికప్పుడు అంచనా వేసుకునే వుంటారు. ఒక వైపు నిర్వహణ వ్యయంలో అధిక భారం ప్రభుత్వాలపై పడ్డప్పటికీ, ఇతర రాష్ట్రాలకు సేవలు వ్యాపించడంతో యాజమాన్య పరమైన వ్యయ భారం రాజు గారిపై పడడం కూడా ఎక్కువైంది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా సేవలు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంతో, ఆయన వంతు సమకూర్చాల్సిన నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి సకాలంలో విడుదల చేయడం బహుశా తలకు మించిన భారం అయ్యుండాలి. మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా, తొలుత బాంక్ ద్వారా రుణాన్ని- ఓవర్ డ్రాఫ్టును తీసుకోవడం మేలని భావించి, లోటును పూడ్చే ప్రయత్నం చేశారాయన. అయితే, ఆయన ఊహించని రీతిలో అత్యవసర సహాయ సేవలు ఒకటి వెంట-మరో రాష్ట్రానికి వ్యాపించడంతో, ఆయనపై అదనపు భారం పడ సాగింది. ఆ తాకిడిని తట్టుకోవడానికి సమాధానం కూడా అందులోనే దొరికింది.
అత్యవసర సహాయ సేవలను ఇ.ఎం.ఆర్.ఐ తోడ్పాటుతో ప్రారంభించిన ప్రతి రాష్ట్రంలో, అధికారులు-అనధికారులు, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను వ్యయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం, ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత ఈ సేవలను మొట్టమొదట (2007 లో) ఆరంభించిన గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. తాత్కాలిక అవగాహనా ఒప్పందం కుదిరిన మరుక్షణమే నాలుగు కోట్ల రూపాయలను అడ్వాన్సుగా ఇ.ఎం.ఆర్.ఐ కి విడుదల చేసింది. అప్పట్లో, అంత భారీ మొత్తంలో ఒకే దఫాగా బయట నుంచి నిధులు రావడం, అదే మొదటిసారి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతవరకు, అంత మొత్తానికి, ఒకే చెక్కును ఇవ్వడం జరగలేదు. ఇతర రాష్ట్రం ఇ.ఎం.ఆర్.ఐ పై అంత విశ్వాసంతో-నమ్మకంతో అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆ తర్వాత కాలంలో సేవలను ఆరంభించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పది కోట్ల రూపాయల మేరకు అడ్వాన్సుగా ఎంఓయు పై సంతకాలు చేసిన తక్షణమే విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. ఎంఓయు నిబంధనల ప్రకారం ముందస్తుగా విడుదల చేసిన ఆ నిధులను, అదే రాష్ట్రంలో ఆరంభించనున్న అత్యవసర సహాయ సేవల "మూల ధన వ్యయం" కొరకు (అంబులెన్సులు కొనడానికి, కాల్ సెంటర్ నెలకొల్పడానికి) ప్రధానంగా ఉపయోగించాలి. అయితే ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఆపాటికే ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను ఉపయోగించే సాంప్రదాయానికి తెర లేచింది. అలా చేయడం "దుర్వినియోగం" కిందకు రాదని, కేవలం అవసరార్థం సంస్థ "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం. ఒక రాష్ట్రంతో-కొద్ది మొత్తంతో ఆరంభమయిన ఆ సాంప్రదాయం "ఇంతై-ఇంతింతై- వటుడింతై" అన్న చందాన రాజుగారు నిష్క్రమించేనాటికి రు. 120 కోట్ల "రుణ భారానికి" చేరుకుంది. రాజుగారి నిష్క్రమణంతో ఆ రుణ భారం మోసేదెవరన్నది "మిలియన్ డాలర్ల ప్రశ్నార్థకంగా" మిగిలిపోయింది. రాజు గారి స్థానంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్. జీ.వీ.కె. రెడ్డి రు. 70 కోట్లకు పైగా సమకూర్చినట్లు చెప్పుకుంటున్నారు. ఆ రుణభారంలోనే రు. 40 కోట్ల బాంకు అప్పు కూడా వుంది!
ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను మళ్లించడానికి బాధ్యులైన వారు, తక్షణ సమాధానం ఇవ్వాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా వాడిన ఆ నిధుల్లో "ఇతర రాష్ట్రాల మూల ధన వ్యయానికి గాని, నిర్వహణ వ్యయానికి గాని, సంస్థ సమగ్ర యాజమాన్య-లేదా-నిర్వహణ వ్యయానికి గాని" ఏ మాత్రం సంబంధం లేని, అంతగా అత్యవసరం లేని, ప్రాధాన్యత ఖర్చు కిందకు రాని "మూల ధన వ్యయం" కొరకు ఎంత మేరకు నిధులను వాడారన్న విషయంలో పూర్తి పారదర్శకతతో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పుకోలేరు. అలా చేసిన వ్యయం "ఆస్తుల సంపాదన" కిందకు వస్తుంది. ఇ.ఎం.ఆర్.ఐ రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఆస్కారం వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని, సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి వున్న రుణ భారం సంగతేంటో గాని, అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని) ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సింది.
ఇంతకూ ఇతర రాష్ట్రాల నుంచి అందుతున్న నిధులను ఇ.ఎం.ఆర్.ఐ ఆయా రాష్ట్రాల అవసరాలకు అదనంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఏ అవసరాలకు వాడి వుండే ఆస్కారం వుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కష్టమేమీ కాదు. బాంక్ దగ్గర్నుంచి తెచ్చిన రుణం-ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం ఖర్చయ్యాక, ప్రతి రాష్ట్ర సహాయ సేవల నిర్వహణ వ్యయంలో భరించాల్సిన 5% వాటా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కు కావాల్సిన అదనపు మూలధనం ఖర్చు, పాలనా పరమైన వ్యయం, శిక్షణా సంబంధమైన వ్యయం (మౌలిక సదుపాయాలతో కలిపి), సీనియర్ ఉద్యోగుల జీత భత్యాలు, సాంకేతిక సంబంధమైన మూల ధన వ్యయం లాంటివన్నీ ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడాల్సిన అవసరం కలిగింది. ఆ పాటికే రాజుగారు నిధులను ఇవ్వడం నిలిపేశారు. అడగాల్సిన సిఇఓ తన బాధ్యతను విస్మరించారు. ఇతర రాష్ట్రాల నిధుల మళ్లింపే తేలికనుకున్నారు. సంస్థ ప్రాంగణంలో రెండో అంతస్తు భవన నిర్మాణానికి, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ శిక్షణ పొందుతున్నవారి వసతి హాస్టల్ నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడి వుండాలి. యాజమాన్యం అంగీకరించిందన్న మిషతో, సుమారు నలబై లక్షలు ఖరీదు చేసే అధునాతనమైన కారును ఇతర రాష్ట్రాల నిధులతో ఖరీదు చేయడం కూడా ఎంతవరకు సబబు? ఇలాంటి అనుమానాలను మీడియా అప్పట్లో వ్యక్తం చేసింది కూడా. అలా "సంబంధం లేని" వాటిమీద, ఇతర రాష్ట్రాల నిధులను వ్యయం (దుర్వినియోగం) చేయడంలోని ఔచిత్యాన్ని వివరించాల్సిన భాద్యత ప్రధానంగా సిఇఓ దే!
ఇ.ఎం.ఆర్.ఐ అప్పట్లో ఎదుర్కున్న కష్టాల్లో ప్రధానమైంది "ప్రయివేట్ భాగస్వామ్య పాత్ర పోషించాల్సిన వ్యక్తుల-సంస్థల అన్వేషణ". మాజీ చైర్మన్ పై పలు ఆరోపణలు, సుప్రీం కోర్టులో సంస్థపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం, మీడియా వ్యతిరేక ప్రచారం, మధ్యలో అకౌంట్ స్థంబింప చేసిన యాక్సెస్ బాంక్, కింది స్థాయి ఉద్యోగులకు కూడా సరైన సమయంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి, అప్పుల వాళ్ల బాధలు, నిత్యావసరాలకు కూడా నిధుల కొరత... వెరసి అన్నీ కష్టాలే. ప్రయివేట్ భాగస్వామిని పొందే ప్రయత్నంలో పిరమల్, జీ.వి.కె సంస్థలు మాత్రమే చివరి దాకా ఆసక్తి కనబరిచాయి. ఇ.ఎం.ఆర్.ఐ ని దక్కించుకోలేక పోవడం పిరమల్ సంస్థ దురదృష్టమా, లేక, దక్కించుకోవడం జీ.వి.కె అదృష్టమా భవిష్యత్ పరిణామాలే తేల్చాలి.
జనవరి 7, 2009 న రాజు గారు జైలుకెళ్లే ముందర ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ గురించి బహుశా ఆందోళన పడినా తన వారసులెవరనే విషయంలో మనసు విప్పి వుండకపోవచ్చు. కుటుంబ సభ్యులకు సూచించి వుండవచ్చు. కుటుంబ సభ్యులకు పిరమల్, జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వుండకపోయుండవచ్చు. వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు సిఇఓ. ఆ తర్వాత జీ.వి.కె. రెడ్డిపై మనసు మళ్లి వుండవచ్చు. ఆ విషయం సూచన ప్రాయంగా బహిర్గతం చేశారే మో! జీ.వీ.కె తొలుత సానుకూలంగా స్పందించి జనవరి 24, 2009 న ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు కూడా.
ఇంతలో, మళ్ళీ ఏమైందో గాని, రాజుగారి కుటుంబం దృష్టి మరో మారు పిరమల్ వైపు మళ్లింది. స్వయంగా వారి కుటుంబ ప్రతినిధి పిరమల్ ను కలుసుకొని ఒప్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ రప్పించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారు. ఆయన హైదరాబాద్ లో లేనందున ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్యను ఉదయమే వెళ్లి కలిశాం. సుమారు అర్థ గంట పైగా సమావేశం జరిగింది. సంస్థ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు రోశయ్య. వారి ఆసక్తిని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత వారూ ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు. అంతా సవ్యంగా వుందనుకుంటుండగానే, నిరాసక్తతను వ్యక్త పరిచారు పిరమల్ అధినేత. ఇక ఆ తర్వాత మే 26, 2009 న ముఖ్యమంత్రి చొరవతో జీ.వీ.కె. రెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ బరువు బాధ్యతలు స్వీకరించారు. పిరమల్ అధినేత అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్యను కలిసినప్పుడు, డాక్టర్ జీ.వీ.కె. రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో మాట్లాడినప్పుడు (బహుశా) లేవనెత్తిన ఒక ప్రధాన అంశం ఇ.ఎం.ఆర్.ఐ కార్యాలయం, భవన సముదాయం వున్న సుమారు నలభై ఎకరాల భూమి వ్యవహారం గురించి.
అధునాతన సౌకర్యాలున్న రెండంతస్తుల ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో "ఉన్నత శిక్షణ” ను ఇచ్చేందుకు నిర్వహిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్ తరగతి విద్యార్థుల వసతి కొరకు నిర్మించిన (అర్థాంతరంగా ఆగిపోయిన) భారీ హాస్టల్ భవన సముదాయం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, సత్యం పబ్లిక్ స్కూల్ నాటి (తర్వాత ఆధునీకరించిన) ప్రధాన కార్యాలయం, ఇండిపెండెంట్ ’తరగతి గదులు’, కొంతమంది ఉద్యోగులుండడానికి అనువుగా వున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్..... ...... ఇలా "విలువైన ఆస్తులు"న్న, కోట్లాది రూపాయల విలువ చేసే, సుమారు నలభై ఎకరాల భూమి పూర్వాపరాల గురించి తెలుసుకునే ముందర, రాజు గారి సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి" గురించి, "సంఘ స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఇంతకు ముందే తెలియచేసినట్లు, తన కుటుంబీకులే ప్రమోటర్ సభ్యులుగా సంస్థను రిజిస్టర్ చేయించడమే కాకుండా, సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, అంత సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు గారు. యాదృచ్చికంగా అలా జరిగిందో, లేక, కావాలనే ఆయనో, ఆయన సలహాదారులో అలా చేయించారో తెలుసుకోవాలంటే, సమాధానం చెప్పాల్సింది రాజు గారే. సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షనలేని"వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు గారు.
ఈ నేపధ్యంలో ఏ ప్రయోజనం కోరి ఇ.ఎం.ఆర్.ఐ ఐ యాజమాన్యం, అత్యవసర సహాయ సేవలను అర్థాంతరంగా ఆపుదల చేస్తామని, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ లేఖ పంపించిందో అన్న అంశంపై విచారణ జరగాలి. లేఖ ఇవ్వడం ద్వారా ఎటువంటి ఒత్తిడిని ప్రభుత్వంపై యాజమాన్యం తేవాలనుకుందో వెల్లడి కావాలి. ప్రభుత్వం ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవచ్చా? భవిష్యత్ లో ఏం జరుగబోతోంది? END
No comments:
Post a Comment