108 అత్యవసర సహాయ సేవలను
అర్థాంతరంగా ఆపుచేస్తామనడంలో ఔచిత్యం?-II
వనం జ్వాలా నరసింహారావు
ఆశయం గొప్పది కావచ్చు. అమలు పరిచేవారు నిష్ణాతులే కావచ్చు- నిబద్ధత, అంకిత భావాలకు సాక్షాత్తు చిరునామా కావచ్చు. కాకపోతే, ప్రజాస్వామ్యంలో "అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు, సంబంధిత సమాచారాన్ని పొందే హక్కు" ప్రతి పౌరుడికి వుంది. దానికి తోడు, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో 95% ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న 108-అత్యవసర సహాయ సేవలు లభ్యం కావటంలో ఏ మాత్రం అలసత్వం వున్నా కారణాలు తెలుసుకుని, ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ లింగ రాజు (సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో) హఠాత్తుగా బాధ్యతల నుంచి తొలగడం, ఆయన స్థానంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, "లోకోపకార దాతృత్వ” భావంతో పలు సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు నిధులను సమకూరుస్తున్న జీ.వీ.కె సంస్థల అధిపతి శ్రీ జీ.వి.కృష్ణారెడ్డి, (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చొరవతో, చైర్మన్ గా రావడంతో, అత్యవసర సహాయ సేవలు అందచేయడంలో ఏ సమస్యలు రావని లబ్దిదారులు భావించారు. బహుశా ప్రభుత్వం కూడా అలానే భావించి వుంటుంది. అయితే, ప్రభుత్వం నాలుగు దశల్లో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు సమకూర్చిన 732 అంబులెన్సులు-అంతకు ముందే ప్రయివేట్ భాగస్వామిగా ‘రామ లింగరాజు గారి ఇ.ఎం.ఆర్.ఐ’ జతకూర్చిన మరో 70 అంబులెన్సులు కలిపి మొత్తం 802 అంబులెన్సులు పౌరులకు సేవలందించాల్సి వుండగా, వాటిలో కనీసం 100 అంబులెన్సులు, వివిధ కారణాల వల్ల సేవలందించలేని స్థితిలో వుండడంతో అలా ఎందుకు "ఒడిదుడుకులకు లోను కావాల్సి వచ్చిందో" అర్థం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం.
రాజుగారి స్థానంలోకి జీ.వీ.కె ప్రవేశించడమంటే, ఎటువంటి ఇబ్బందికి 108 అత్యవసర సహాయ సేవలు గురి కాకూడదనే కదా ! మరెందుకు మీడియాలో విభిన్న కథనాలొస్తున్నాయి? ప్రభుత్వ నిధులు సక్రమంగా అందడం లేదనుకోవాలా? జీ.వీ.కె అనుకున్న రీతిలో సహాయం అందించడం లేదా? అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండొచ్చు? వాస్తవానికి వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు గారు ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా రాజీనామా చేసిన నాటినుంచి (జనవరి 7, 2009) జీ.వీ.కె ఆ పదవి చేపట్టిన రోజు (మే నెల 26, 2009) వరకు బాహ్య ప్రపంచానికి అంతగా అవసరంలేని-పట్టని పలు ఇబ్బందులకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ లోనైంది. అయినా ఒక్క రోజుకూడా 108 అత్యవసర సహాయ సేవలు, ఒక్క క్షణం కూడా ఆపబడలేదు.
జీ.వీ.కె రెడ్డి అధ్యక్షతన జీ.వీ.కె. ఇ.ఎం.ఆర్.ఐ గా 108-అత్యవసర సహాయ సేవలు రూపాంతరం చెందాక యాజమాన్య పరంగా, నిర్వహణ పరంగా ఊహించీ-ఊహించని-ఊహ కందని అనేకానేక మార్పులు కనిపించసాగాయి. అనారోగ్యకరమైన మార్పులకు అంకురార్పణ జరిగిన ప్రతి సందర్భంలోనూ బాధను-అసంతృప్తిని బాహాటంగానే కొందరం వ్యక్త పరిచాం. నూతన చైర్మన్ జీ.వీ.కె రెడ్డి మొదటిసారి తన ఆంతరంగాన్ని ఇ.ఎం.ఆర్.ఐ సీనియర్ అధికారుల సమక్షంలో బహిర్గతం చేస్తూ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఇ.ఎం.ఆర్.ఐ-108 అత్యవసర సహాయ సేవల నెట్ వర్క్ నుంచి తొలగిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నప్పుడు, ఇతర రాష్ట్రాలను నెట్ వర్క్ లోకి తెచ్చిన మా లాంటి కొందరికి తీవ్రమైన బాధ కలిగింది. ఆయన ఆంతరంగం అర్థమయింది. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆపు చేస్తామని సిఇఓ తో లేఖ ఇప్పించినప్పుడు అప్పటి మా భయం నిజమయింది.
జీ. వి. కృష్ణారెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ బాధ్యతలు చేపట్టిన తర్వాత 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం స్థానంలో "పి.పి.పి ఒప్పందం" పేరుతో కొత్త ముసాయిదాను పరిశీలన కొరకు ప్రభుత్వానికి సమర్పించింది సంస్థ. గతంలో కుదుర్చుకున్న మొదటి (ఏప్రియల్ 2, 2005) ఎంఓయు విషయంలో, రెండో (సెప్టెంబర్ 22, 2006) ఎంఓయు విషయంలో, మూడో (అక్టోబర్ 5, 2007) ఎంఓయు విషయంలో, నాలుగో (మే 5, 2008) ఎంఓయు విషయంలో ఏ విధమైన "కొర్రీలను" వేయని ప్రభుత్వం, ఈ సారి ఆక్షేపణలు తెలియచేసింది. అప్పట్లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పక్షాలకు చెందిన అధికార ప్రతినిధులు కూర్చొని-చర్చించి ముసాయిదాను ఖాయపరిచే సాంప్రదాయం వుండేది. "విశ్వాసం-నమ్మకం" అనే ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రధాన ప్రాతిపదిక ఆధారంగా మొదటి నాలుగు ఎంఓయు లన్నీ ఖరారయ్యాయి. మొట్టమొదటి సారిగా "కొర్రీల సాంప్రదాయానికి" అవకాశం ఇచ్చింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ఇలా జరగకుండా వుండాల్సింది. ఇంతకూ ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించిన ముసాయిదా ఎంఓయు లో వున్న అంశాలేంటి ? వాటి విషయంలో ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలేంటి ?
ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనలో ప్రధానమైంది నెల-నెలా సగటున ఒక్కో అంబులెన్సుకు ప్రభుత్వ పరంగా ఇస్తున్న ప్రత్యక్ష నిర్వహణ వ్యయానికి సంబంధించిన విషయం. 2008-2009 ఆర్థిక సంవత్సరానికి, అప్పట్లో ఇ.ఎం.ఆర్.ఐ, ఒక్కో అంబులెన్సుకు సగటున ప్రతినెలా రు. 1, 18, 420 వ్యయమవుతుందని ప్రతిపాదించగా, దాన్ని పరిశీలించి-అంగీకరించిన ప్రభుత్వం, తన వంతు 95% వాటాగా రు. 1, 12, 499 చొప్పున ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 502 అంబులెన్సులున్నప్పుడు అంగీకరించిన ఆ మొత్తం (రు. 1, 12, 499), తర్వాత సంఖ్య 652 కు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ సంఖ్య 802కు పెరిగినప్పటికీ, "విశ్వాసంతో-నమ్మకంతో" పునఃపరిశీలించకుండా చెల్లిస్తూ వస్తున్నారు. అది కూడా మొదట్లో మూడు నెలల అడ్వాన్సు ఒకే సారి ఇచ్చే సాంప్రదాయం వుండేది. జీ.వీ.కె యాజమాన్యం బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది నెలల ముందు నుంచి నెల-నెలా అడ్వాన్సుల సాంప్రదాయానికి అంగీకరించింది యాజమాన్యం. 108 అత్యవసర సహాయ సేవల ఒడిదుడుకులకు ఇదో ప్రధాన కారణం.
ముసాయిదాలో 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి 100% పెంచి, ప్రతి నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 1, 18, 420 వంతున ప్రభుత్వం భరించాలని ప్రతిపాదించింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అదనంగా మరో రు. 10 కోట్లు "మూల ధన వ్యయం" కొరకు కావాలని కోరింది. సంవత్సరానికి రు. 12 లక్షల కంటే ఎక్కువ (నెలకు లక్ష రూపాయలు!) వేతనం ఇవ్వాల్సిన ఉద్యోగుల జీత భత్యాలను మాత్రమే ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం భరిస్తుందని, మిగతా వారికి ప్రభుత్వమే ఇవ్వాలని మరో ప్రతిపాదన ఇచ్చింది. ఆర్థికంగా ప్రభుత్వంపై మరింత భారాన్ని పరోక్షంగా సూచించింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అడపాదడపా ఏదన్నా ఊహించని వ్యయం జరిగితే దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరింది. శిక్షణా కార్యక్రమాలన్నింటికీ అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని మరో ప్రతిపాదన. ఆర్థిక శాఖకు ఇది రుచించలేదు.
2008 సంవత్సరంలో ప్రభుత్వం అంగీకరించిన నెలసరి సగటు అంబులెన్సు నిర్వహణ వ్యయానికి అదనంగా రు. 8,833 లు (అంటే రు. 1, 27, 253) ఖర్చయ్యాయని లెక్కలు చూపించింది సంస్థ. అయితే అధికారిక లెక్కల పుస్తకాలలో ఆ వ్యయం సుమారు రు. 90, 000 మాత్రమే వున్నట్లు ఆర్థిక శాఖ దృష్టికొచ్చింది. ఎంఓయు లో అంగీకరించిన దానికంటే ఎందుకంత అదనంగా ఖర్చయ్యిందన్న అంశాన్ని పరిశీలించాలని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. సగటున ప్రతి నెలా అంబులెన్సుకు అయ్యే సరాసరి నిర్వహణ వ్యయం ఎంతుంటుందన్న విషయాన్ని "నిపుణులతో క్షుణ్ణంగా అధ్యయనం చేయించడం గాని" లేదా "టెండర్ విధానం ద్వారా వేలం పోటీ పద్ధతిన సరసమైన ధరను నిర్ణయించడం గాని" జరగాలని ఆర్థిక శాఖ అభిప్రాయం. 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందంలోని పలు అంశాలను మార్చవలసిన ఆగత్యాన్ని కూడా ఆర్థిక శాఖ ప్రశ్నించింది. వంద కోట్ల రూపాయలకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నందున కుటుంబ సంక్షేమ శాఖలో "అంకిత భావం కలిగిన మానిటరింగ్ యూనిట్" ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా అభిప్రాయ పడింది. నిధుల సేకరణకు "అడ్వర్టయిజింగ్" విధానం అవలంభించడం మంచిదని మరో సూచన చేసింది. ఇలా అడుగడుగునా ప్రభుత్వానికి అనుమానాలొస్తుంటే భవిష్యత్ లో ఏం జరుగబోతోంది ఊహించడం కష్టమే!
"రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సహాయ సేవలందించే" “నోడల్ ఏజన్సీ” గా 2005 లో ఇ.ఎం.ఆర్.ఐ ని గుర్తించిన ప్రభుత్వం, 2006 లో "గ్రామీణ అత్యవసర రవాణా పథకం" పేరుతో ప్రవేశ పెట్టదలిచిన అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను కూడా "అత్యంత నమ్మకంతో-విశ్వాసంతో" అదే సంస్థకు అప్పగించారు. అదో చారిత్రాత్మక నిర్ణయం. వాస్తవానికి అలనాటి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సీ.బి.ఎస్. వెంకట రమణ గారి "నమ్మకం-విశ్వాసం" తో కూడుకున్న సాహసోపేత నిర్ణయమే ఈ నాటి రాష్ట్ర వ్యాప్త అత్యవసర సహాయ సేవలకు పునాది-నాంది. ఏమైందానాటి "నమ్మకం-విశ్వాసం" ? లోపం ఎవరిది ? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వుంది.
అప్పటి ఆర్థిక-ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రోశయ్య సమక్షంలో 22-09-2006 న అవగాహనా ఒప్పందం (ఎంఓయు) పై సంతకాలు చేశారు. పూర్తిగా తన స్వయం పర్యవేక్షణ కింద (నా సమక్షంలో) తానే తయారుచేసిన అవగాహనా ఒప్పందం "అవతారిక"లో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ గురించి రాసిన వాక్యాలు ఆ సంస్థమీద ప్రభుత్వానికి అప్పట్లో వున్న"నమ్మకానికి-విశ్వాసానికి" అసలు-సిసలైన మచ్చుతునకలు. ఎంఓయు పూర్వ రంగంలో అలనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జంధ్యాల హరినారాయణ్, అగర్వాల్ కు ముందున్న ఆరోగ్య వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఐ.వి.సుబ్బారావు, ఉప కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడానికి-అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయడానికి చేసిన కృషి-తీసుకున్న చొరవ "నమ్మకానికి- విశ్వాసానికి" ఉదాహరణలు. అదే "నమ్మకాన్ని-విశ్వాసాన్ని" ఐదేళ్ల తర్వాత ఇ.ఎం.ఆర్.ఐ కోల్పోవడానికి బలవత్తరమైన కారణాలుండి తీరాలి. అవి విశ్లేషించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ అధికారులపైనుంది.
108-అత్యవసర సహాయ సేవల పటిష్ఠ అమలుకు ప్రభుత్వం ప్రదర్శించిన "విశ్వాసానికి- నమ్మకానికి" మరో మచ్చుతునక, జులై 12, 2007 న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. హరినారాయణ్, నాటి ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి పరిశీలనార్థం పంపిన వివరణ. ఆ వివరణ పూర్వ రంగంలో ఇ.ఎం.ఆర్.ఐ-ప్రభుత్వం మధ్య కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు, అప్పటికి సరిగ్గా నాలుగు నెలల క్రితం (8-2-2007 న) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన "ఇ.ఎం.ఆర్.ఐ సలహా సంఘం సమావేశం" జరిగింది. ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సహా పలువురు ఉన్నతాధికారులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆద్యతన భవిష్యత్ లో, ప్రభుత్వ పరంగా, ఇ.ఎం.ఆర్.ఐ కి 108-అత్యవసర సహాయ సేవల నిర్వహణ నిధులను దశలవారీగా పెంచడానికి నాంది జరిగిన చారిత్రాత్మక సలహా సంఘం సమావేశమది. అవగాహనా ఒప్పందం ఆధారంగా, ఒక్కో అంబులెన్సుకు రు. 68, 700 అవుతుందని నిర్ణయం తీసుకున్న సమావేశం అది. ఒక పథకం విషయంలో, ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పై "ఎంతో విశ్వాసం-నమ్మకం" వుండబట్టే అలా వ్యవహరించడం జరిగిందని భావించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఉత్తర్వులు వచ్చిన కొద్ది రోజుల్లోనే, అత్యవసర సహాయ సేవల అంశం క్రమేపీ ముఖ్యమంత్రి దృష్టికి మరింత చేరువగా పోవడంతో, అక్కడినుంచి నిర్ణయాలు ఆయన కనుసన్నల్లో జరగడం మొదలయింది. అత్యంత ఆదరణ పొందిన సేవలుగా ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా, ఇతర రాష్ట్రాలకు కూడా పాకడానికి మాత్రం కారకుడు (దివంగత) ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" గాని, ఆ తర్వాత (దివంగత) ముఖ్యమంత్రి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" గాని ఎంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ నిలబెట్టుకో గలిగిందనేది జవాబు దొరకని ప్రశ్న.
ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి జరిపిన మరో సమీక్షా సమావేశంలో, 108-అత్యవసర సహాయ సేవలందించడానికి ఇ.ఎం.ఆర్.ఐ కి, "ప్రత్యక్ష నిర్వహణ వ్యయం" కింద 95% వరకు ప్రభుత్వం భరించడానికి అంగీకరించింది ప్రభుత్వం. ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రభుత్వానికున్న "విశ్వాసం-నమ్మకం" కొనసాగిందనడాని నిదర్శనంగా అప్పుడున్న వాటికి అదనంగా తొలుత 150 అంబులెన్సులు, మలి విడతగా మరో 150 అంబులెన్సులు, మొత్తం 802 అంబులెన్సులు సమకూర్చడం జరిగింది. 95% నిర్వహణ వ్యయం కింద ప్రభుత్వం ఎంత భరించాలన్న నిర్ణయం తీసుకోవడంలో నాటి ఆరోగ్య-వైద్య శాఖల ముఖ్య కార్యదర్శి పి. కె. అగర్వాల్ తీసుకున్న చొరవ ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రభుత్వానికున్న"విశ్వాసానికి-నమ్మకానికి" మరో నిదర్శనం. ఆ మొత్తాన్ని ఒక్కో అంబులెన్సుకు రు. 1,12,499 గా నిర్ణయించి, ప్రభుత్వ పరమైన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 502 అంబులెన్సులున్నప్పుడు సగటున అయ్యే వ్యయం, 652కు, తర్వాత 802 కు పెరిగినప్పుడు, తగ్గుతుందన్న విషయం తెలిసిందే అయినప్పటికీ, బయటపడకుండా జాగ్రత్త పడ్డది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. పారదర్శకతతో ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం వ్యవహరించి, వాస్తవ లెక్కలను ఏదో ఒక సందర్భంలో బహిర్గతం చేసినట్లయితే బాగుండేదేమో ! End of Part II
No comments:
Post a Comment