Wednesday, July 17, 2013

డబ్బై దశకంలో భూస్వాముల దాడులు-కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు: వనం జ్వాలా నరసింహారావు

డబ్బై దశకంలో భూస్వాముల దాడులు
కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు
వనం జ్వాలా నరసింహారావు

          డబ్బై దశకంలో మా చుట్టు పక్కల గ్రామ పంచాయితీలున్న పాలేరు సమితి, ఖమ్మం పంచాయితీ సమితిగా మారడం, మా గ్రామాలన్నీ అందులోకి రావడం జరిగింది. సమితి సభ్యులలో గణనీయమైన సంఖ్య కలిగి వున్న కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) బలమైన ప్రతి పక్షంగా వ్యవహరిస్తుండేది. జిల్లా రాజకీయాలకు సంబంధించినంతవరకు, కాంగ్రెస్ పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయి, ఒక వర్గం శీలం సిద్దారెడ్డి నాయకత్వంలో, మరో వర్గం జలగం వెంగళ్ రావు నాయకత్వంలో పని చేయసాగాయి. ఇద్దరూ కొంతకాలం మంత్రులే. జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా వెంగళ్ రావు ముఠాకు చెందిన వ్యక్తి వుండేవాడు. ఖమ్మం సమితికి ఆయన అనుంగు శిష్యుడు సామినేని ఉపేంద్రయ్య అధ్యక్షుడు. సమితి అధ్యక్షుడుగా వుంటూ, ఆ అధికార దర్పంతో, గ్రామాలలో ముఠా తగాదాలను ప్రోత్సహించేవాడని ఆయనకు పేరుంది. ఖానా పురం, ముదిగొండ, వల్లభి గ్రామాలలో కక్షలు ప్రబలిపోవడానికి ఆయనే కారణం. కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తుండే, ఖానా పురం గ్రామ వాసి వేదాద్రి హత్యలో అతడి పాత్ర వుందనేవారు.

          కాంగ్రెస్ పార్టీ ముఠా తగాదాలు, చివరకు సమితి అధ్యక్షుడు ఉపేంద్రయ్యపై, సిద్దారెడ్డి వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి దారి తీశాయి. నాడు సిపిఎం పార్టీ పక్షాన ఖమ్మం ఎమ్మెల్యేగా వున్న రజబ్ అలీ సహాయంతో, సమితిలోని ఆ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకుని, తన పదవిని నిలబెట్టుకున్నాడు ఉపేంద్రయ్య. తనకు సహాయం చేసిన పార్టీ అన్న విశ్వాసం కూడా లేకుండా, అదే పార్టీ కార్యకర్తలపై, మా చుట్టుపక్కల గ్రామాల కమ్యూనిస్టులపై దాడులు ప్రారంభించాడు ఉపేంద్రయ్య. బాణాపురం గ్రామంలో గండ్లూరి కిషన్ రావు నాయకత్వాన సాగుతున్న వ్యవసాయ కార్మిక రైతు కూలీ పోరాటాన్ని అణచివేయాలని పథకాలు పన్నుతున్న భూస్వాములను చేరదీశాడు. మా నాన్న పట్వారీగా పనిచేస్తున్న అమ్మపేట గ్రామ సర్పంచ్, కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరుడైన కోయ వెంకట్రావును, కాంట్రాక్టుల ప్రలోభం చూపించి తనవైపు తిప్పుకున్నాడు. కోయ వెంకట్రావు సహాయంతో గంధ సిరి గ్రామం మీద దాడి చేయించాడు. ఆ దాడిని గ్రామ ప్రజలు సంఘటితంగా తిప్పికొట్టారు. నాటి నుంచి వెంకట్రావు, ఉపేంద్రయ్యకు కుడి భుజంగా వ్యవహరించసాగాడు. బాణా పురంలో వుంటుండే వెంకట్రావు తమ్ముడు, కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని కోయ సత్యంను తన వైపు తిప్పుకున్నాడు అన్న. భవిష్యత్‍లో బాణా పురంతో సహా పరిసర గ్రామాలలో జరిగిన అనేక దాడులలో అన్నదమ్ములిద్దరు ముందుండేవారు. వారిద్దరితో పాటు మా మరో సరిహద్దు గ్రామం పమ్మికి చెందిన చిన కోటయ్య, పెద కోటయ్యలను కూడా చేరదీశాడు ఉపేంద్రయ్య. మిగిలిన గ్రామాల విషయం ఏమైనప్పటికీ, బాణా పురంలో మాత్రం కిషన్ రావు నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే పట్టుదలతో పని చేయసాగాడు ఉపేంద్రయ్య. ఆ గ్రామ భూస్వాములను చేరదీసి, డబ్బు పోగు చేశాడు. దెబ్బ తీయడానికి కాచుక్కూర్చున్నాడు. వారి పథకంలో భాగంగా, వారి పంచన పడి వున్న భూస్వాములకు అనుకూలంగా వ్యవహరించేందుకు, బాణా పురం, పమ్మి, పెద మండవ, అమ్మ పేట లాంటి కీలక గ్రామాలలో పోలీసు క్యాంపులు వెలిశాయి.


1970 జనవరి నెల రెండో వారంలో, ఉపేంద్రయ్య కుట్రలను వివరించడానికి, కమ్యూనిస్ట్ పార్టీ గ్రామగ్రామాన బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. ఒకనాటి రాత్రి పమ్మి గ్రామంలో జరుగుతున్న బహిరంగ సభలో గండ్లూరి కిషన్ రావు ప్రసంగిస్తున్న సమయంలోనే, అంతకు ముందే సిద్ధం చేసుకున్న ఒక పథకం ప్రకారం, బాణా పురంలో కోయ సత్యం నాయకత్వాన భూస్వాములు-వారి అనుయాయులు, స్థానిక పోలీసు క్యాంపు సహకారంతో, గ్రామంలో వున్న కమ్యూనిస్టులపై కవ్వింపు చర్యలకు దిగారు. ఎదురు తిరిగిన వారిని అమానుషంగా కొట్టారు. అంతటితో ఆగకుండా, గ్రామంలో లేని కిషన్ రావుపైన పోలీసు కేసులు పెట్టించారు మర్నాడు. అలనాటి సర్కిల్ ఇన్ స్పెక్టర్ దుర్గా ప్రసాద రావు తోడ్పాటుతోనే ఇదంతా జరిగిందని బహిరంగంగానే అనుకుండేవారు. పమ్మిలో మీటింగు ముగించుకుని గ్రామం చేరుకున్న కిషన్ రావును, ఆయన వెంట వచ్చిన జిల్లా సిపిఎం నాయకుడు రావెళ్ల సత్యం గారిని పోలీసులు విచారణ పేరుతో క్యాంపుకు పిలిపించారు. గ్రామంలోని సుమారు వంద మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలను కూడా క్యాంపుకు పిలిపించారు. ఒక విధంగా అందరినీ అక్కడ బంధించారనాలి. ఆ తరువాత గుండాలు, పోలీసుల సహాయంతో దాడులు చేశారు. ఇదేం అన్యాయమని నిలదీసిన రావెళ్ల సత్యం గారిని గ్రామం విడిచి వెళ్లమని హుకుం జారీ చేశారు. ఎదురు తిరిగిన సత్యం గారిని ఏమీ చేయలేక పోయారు. గ్రామంలోనే వుండి పోయిన సత్యం గారు, చిత్ర హింసలకు గురైన గ్రామస్తులకు అండగా నిలిచారు. పోలీసు క్యాంపులో వున్న గండ్లూరి కిషన్ రావును, ఆయన సహచర కమ్యూనిస్ట్ నాయకులైన ముక్కా చిన నర్సయ్యను, అప్పి రెడ్డిని హింసించారు పోలీసులు. ఇదంతా సరిపోదన్నట్లు, అందరినీ తాళ్లతో బంధించి, నేలకొండపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

బాణా పురం గ్రామంలో జరిగిన దాడులకు నిరసనగా, వేలాది మంది చుట్టు పక్కల గ్రామాల వారు, వూరేగింపుగా వెళ్లి, ఖమ్మంలో బస చేస్తున్న నాటి హోం మంత్రి వెంగళ్ రావుకు మెమొరాండం ఇచ్చారు. ఆ నాడు జరిగిన బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోటూరు హనుమంత రావు హాజరై, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హోం మంత్రిగారు ఉత్తుత్తి వాగ్దానాలు చేశారు కూడా. బాణా పురంలో అలనాడు జరిగిన హింసా కాండలో ముక్కా చిన నర్సయ్య, పెరుమాళ్ల చంద్రయ్య లతో సహా కిషన్ రావు కూడా శారీరకంగా బాధలకు గురయ్యారు చాలా రోజుల వరకు. గుండాల దాడులు, కవ్వింపు చర్యలు, పోలీసులు బనాయించే దొంగ కేసులు నిత్య కృత్యమయ్యాయి. ఈ నేపధ్యంలో, కమ్యూనిస్ట్ కార్యకర్తలిచ్చిన మెమొరాండాన్ని విచారించాల్సిన హోం మంత్రి జలగం వెంగళ్ రావు, అది చేయకపోగా, బాణా పురం గ్రామానికి స్వయంగా వచ్చి, భూస్వాములతో సమావేశమై, "మీకు నేను అండగా వుంటా" నని హామీ ఇచ్చి వెళ్లాడు! కాకపోతే, సుమారు రెండు వందల మంది పోలీసు బలగంతో మాత్రమే ఆయన ఆ రోజు బాణా పురం రాగలిగాడు! ఇది జరిగిన కొన్నాళ్లకు, మా గ్రామ సరిహద్దు గ్రామైన పమ్మిలో కమ్యూనిస్ట్ వ్యవసాయ కూలి సంఘ కార్యకర్త పెరుమాళ్ల చంద్రయ్యను పట్ట పగలే బండ రాళ్లతో కొట్టి చంపారు. ఆ వూళ్లో పోలీసు క్యాంపు కూడా వుండేదప్పుడు. కాకపోతే, క్యాంపులోని పోలీసులు గుండాలకే మద్దతిచ్చేవారు. కోర్టులో ఆ కేసు నీరు కారి పోయింది. చంద్రయ్యను చంపిన కొన్నాళ్లకు, మందా నారాయణ అనే మరో వ్యక్తి పోలీసు కాల్పుల్లో మరణించాడు అదే పమ్మి గ్రామంలో.

పమ్మి హత్యాకాండ, పోలీసు కాల్పులు, హంతకులకు సహాయ పడుతున్న పోలీసు వ్యవహార శైలి.....ఇవన్నీ...బాణా పురం భూస్వాములలో ఉత్సాహాన్ని నింపింది. ఒక పథకం ప్రకారం, గండ్లూరి కిషన్ రావు కుడి భుజంలా పని చేస్తున్న ముక్కా చిన నర్సయ్యను హత్య చేశారు. 1970 వ సంవత్సరం ఏప్రిల్ నెల మూడో వారంలో అనుకుంటా, చిన నర్సయ్య కోర్టు కేసుమీద ఖమ్మం వెళ్లాల్సి వచ్చింది. ఆయన వెళ్లే దారిలో, భూస్వాముల గుండాలు కాపు కాచి, గండ్ర గొడ్డళ్లు, బరిశెలతో ఆయనపై దాడి చేశారు. తప్పించుకునే వీలు లేకుండా దెబ్బ తీశారు. హత్య చేశారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేను ఖమ్మంలో వున్నాను. బాబాయి నర్సింగ రావుకు ఈ వార్త తెలిసింది. వెంటనే నేలకొండపల్లి వెళ్దామన్నాడు. తోడల్లుడు జూపూడి ప్రసాద్ కారు తీసుకుని నేలకొండపల్లి వెళ్లి నర్సింగ రావును అక్కడ దింపి వచ్చినట్లు గుర్తుంది. బహుశా అది అప్పటికి మూడో హత్య అనుకుంటా. ఇంతలో పంచాయితీ ఎన్నికలొచ్చాయి. ఏమైనా సరే.... సాధ్యమై నన్ని గ్రామ పంచాయితీలను గెలిచి, సమితిని, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని దక్కించుకోవాలని జలగం ముఠా, ఆయన అనుయాయుడు ఉపేంద్రయ్య పథకం రూపొందించారు. అన్నింటికన్నా ముఖ్యంగా బాణా పురం గ్రామ పంచాయితీని గెలవాలని పంతం పూనారు. కమలాపురం, గంధ సిరి గ్రామ పంచాయితీలు ఏకగ్రీవంగా కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) లకు దక్కాయి. మా గ్రామం వనం వారి కృష్ణా పురంలో, మొట్టమొదటి సారిగా కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసి, పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థిని గెలిపించుకుంది. పమ్మిలో పోటీ తీవ్రంగా వుండేది. అయినా కమ్యూనిస్టులే గెలిచారు. నాచే పల్లిలోనూ అంతే. తొలుత బాణా పురం ఎన్నికలు జరగకుండా హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు భూస్వాములు. ఎన్నికలు జరిగిన గ్రామాలలో చాలా భాగం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు, లేదా, సిద్దా రెడ్డి వర్గం అభ్యర్థులు గెలిచారు. ఉపేంద్రయ్య వర్గానికి అతి తక్కువ సీట్లొచ్చాయి మా ప్రాంతంలో. బాణా పురంలో స్టే ఎత్తి వేసింది కోర్టు. ఎవరెన్ని ఎత్తులు వేసినా, ఒక్క వార్డు (భూస్వాముల ఇళ్లున్న వార్డు) మినహా అన్నీ సిపిఎం పార్టీ గెలుచుకుంది. గండ్లూరి కిషన్ రావు మళ్లీ సర్పంచ్ అయ్యాడు. ఎన్నికల సమయంలో భూస్వాములు చేయని అరాచకం లేదు. ఐనా, ఓటమి తప్పలేదు.

          ఖమ్మం సమితికి సిపిఎం అభ్యర్థి రాయల వీరయ్య అధ్యక్షుడుగా, గండ్లూరి కిషన్ రావు ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ సిద్దారెడ్డి వర్గానికి దక్కింది. సిపిఎం అభ్యర్థి టి. వి. ఆర్ చంద్రం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడయ్యారు.

          ఎన్నికలు ముగిసినప్పటికీ, భూస్వామ్య గుండాల దాడులు-దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతూనే వుండేవి. ఇంతలో 1971 లో లోక్ సభకు మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఎన్నికల ఓట్లు లెక్కింపు జరిగే నాటి సాయంత్రం, బాణా పురంలో జరిగిన కవ్వింపు సంఘటనలో, మరో కమ్యూనిస్ట్ కార్య కర్త బొల్లెద్దు రామనాధం ఒక బడా భూస్వామి చేతిలో, లైసెన్స్ లేని పిస్తోలు గుండుకు బలై హత్యకావించబడ్డాడు. చివరకు కోర్టు హత్య చేసినతనిని, ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపాడని నిర్దోషిగా తేల్చి వదిలేసింది!

ఇదిలా వుండగా....మా గ్రామ మరో సరిహద్దు గ్రామం అమ్మ పేటలో కూడా పోలీసు క్యాంపు వుండేది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ కోయ వెంకట్రావు (అతడు 1970 పంచాయితీ ఎన్నికలలో వార్డు మెంబరుగా లాటరీలో గెలిచాడు. సర్పంచ్ గా మా పెదనాన్న గారి కుమారుడు వనం వరదా రావు ఎన్నికయ్యాడు) పోలీసుల అండతో గ్రామంలో అనేక దౌర్జన్యాలు చేసేవాడు. అతడు తాగుబోతు కూడా. తన దగ్గరున్న ఒక లైసెన్సు లేని రివాల్వర్‌తో గ్రామంలో ఒకడిపై దాడి చేసే ప్రయత్నంలో అది విఫలమై పట్టుబడ్డాడు. పోలీసు కేసు అయింది. నాలుగు సంవత్సరాల శిక్ష పడడానికి ఒకటి-రెండు రోజుల ముందర 1972 జనవరి నెలలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య పూర్వాపరాలు నాకింకా గుర్తున్నాయి. బహుశా సంక్రాంతి ముందు రోజనుకుంటా....నేను, మా ఆవిడ, మా ఇంటి నుంచి దగ్గర లోనే వున్న మా తోడల్లుడు ఇంటికి నడుచుకుంటూ వెళుతుంటే కనిపించాడు వెంకట్రావు. ఒకరినొకరు పలకరించుకున్నాం. అప్పట్లో గ్రామంలో అతడికి పూర్తి వ్యతిరేకత వున్న కారణాన భయంతో ఖమ్మంలోనే వుంటూ కోర్టు చుట్టూ తిరుగుతుండేవాడు. ఎందుకో ఆ నాడు బాగా తాగి మా వూరు వెళ్లే ప్రయివేటు బస్సు ఎక్కి వాళ్ల వూరుకు బయల్దేరాడు. అప్పుడు మా పెద్దమ్మాయి బుంటికి ఇంకా ఏడాది కూడా నిండలేదు. భోగి పండ్లు పోయడానికి మా అమ్మ ఖమ్మంలో ఆగింది. ఆ కార్యక్రమం అయిపోయింతర్వాత అమ్మను మా వూళ్లో దింపడానికి తోడల్లుడి కారులో రాత్రి పొద్దు పోయిన తరువాత బయల్దేరాం. వూళ్లోదాకా కారు పోయే వీలు లేనందున వూరి బయటే ఆపి అమ్మను ఇంటిదగ్గర దింపడానికి నడుచుకుంటూ పోయి దింపి వెనక్కు వచ్చాం. తిరిగి ప్రయాణమై ఖమ్మం చేరుకున్నాం. ఆ మర్నాడు మాకు తెలిసిన వార్త....కోయ వెంకట్రావును, మా గ్రామంలో బస్సు దిగగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకు పోయారని, అమ్మపేట తీసుకు పోయి హత్య చేసారని. సరిగ్గా అతడిని మా వూరి నుంచి తీసుకుపోయే సమయానికే నేను మా అమ్మను కారులో మా వూరికి వెళ్లడం యాధృఛ్చికం అయినప్పటికీ, నాకు కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలుండడం వల్ల, నాపై కూడా అనుమానం వచ్చింది కాని దానిని మా గ్రామ పటేల్ తుల్లూరి రామయ్య ఖండించాడు.

కోయ వెంకట్రావు హత్యను అండగా చేసుకుని, ఉపేంద్రయ్య, కమ్యూనిస్ట్ పార్టీపై ధ్వజ మెత్తాడు. కమలాపురం గ్రామ సర్పంచ్ వనం నర్సింగరావును, గంధ సిరి గ్రామ సర్పంచ్ గండ్ర వీర భద్రా రెడ్డిని, బాణాపురం గ్రామానికి చెందిన బాజి హనుమంతును(శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న), అమ్మ పేట గ్రామానికి చెందిన పలువురిని ఆ హత్య కేసులో ముద్దాయిలుగా చేర్పించాడు. గండ్ర వీర భద్రా రెడ్డి మొదటి ముద్దాయి కావడంతో మూడు నెలల పాటు బెయిలు కూడా దొరకలేదు. ఆయన జైలులో వుండగా గ్రామంలోని ఆయన వ్యతిరేకులు గూండాయిజం చేసి కమ్యూనిస్ట్ కార్యకర్తలను హింసించారు. ఆయనపై బలవంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టించి నెగ్గించుకున్నారు. బెయిలుపై బయట కొచ్చిన గండ్ర వీర భద్రా రెడ్డిని గ్రామంలో ప్రవేశించ కుండా అడ్డుకున్నారు. గంధ సిరి గుండాలు ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా అరాచకం చేశారు. గండ్ర వీర భద్రా రెడ్డి ఆ రోజుల్లో బాణా పురంలో కిషన్ రావు ఇంట్లో వుంటుండేవాడు. అయితే, గంధ సిరి గుండాలు బాణా పురంపైన మాత్రం దాడి చేయలేకపోయారు. అదే సమయంలో మరో హత్య కేసులో కిషన్ రావును, నర్సింగరావును పోలీసులు అక్రమంగా ఇరికించారు. ఏడాదిన్నర పైగా బయట వున్న గండ్ర వీర భద్రా రెడ్డి తన గ్రామం చేరుకున్నాడు. తిరిగి ఆయన నాయకత్వంలో కమ్యూనిస్టులు సంఘటితం కాసాగారు. అది చూసి ఓర్వలేని భూస్వామ్య గుండాలు పోలీసుల సహాయంతో, 1973 డిసెంబర్ నెలలో, బజార్లో వెళ్తున్న గండ్ర వీర భద్రా రెడ్డిని అతి దారుణంగా హత్య చేశారు.

అలా ఒకరి వెంట మరొకరు హత్యా రాజకీయాలకు బలై పోయారు. చివరకు ఉపేంద్రయ్య ముఠా వెనక్కు తగ్గింది. నిర్బంధాలు, హత్యలు కమ్యూనిస్టులను లొంగదీయ లేకపోయింది. కొంతకాలం ప్రశాంత పరిస్థితి నెలకొంది. అంతా సర్దు మణిగిందనుకుంటున్న స్థితిలో భయంకరమైన కుట్రకు 1976 ఫిబ్రవరి 7 వ తేదీన గండ్లూరి కిషన్ రావు బలై పోయాడు. ఖమ్మంలో సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన ఇంటి సమీపంలో కాపుకాసిన హంతకులు కిషన్ రావుపై దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆయన హత్యతో ఒక శకం ముగిసి పోయింది. ఒక మహనీయుడు అస్తమించాడు.


దురదృష్టవశాత్తు, అలాంటి "ఎర్ర కోట" ల లాంటి గ్రామాలలో, నేడు ఒక్కటి కూడా కమ్యూనిస్టుల అధీనంలో లేదు. అలాంటి నాయకులూ లేరు. 

Wednesday, July 10, 2013

అలనాటి వ్యవసాయ కూలీ పోరాటాలు: వనం జ్వాలా నరసింహారావు

అలనాటి వ్యవసాయ కూలీ పోరాటాలు

వనం జ్వాలా నరసింహారావు

          1966 లో డిగ్రీ పరీక్షలు రాసిన తరువాత, నా మకాం, హైదరాబాద్ నుంచి మా గ్రామం వనం వారి కృష్ణా పురానికి మార్చాను. అలా, 1966-1969 మధ్య కాలంలో మా గ్రామంలో వున్న రోజుల్లో, ఆ తరువాత 1969-1971 మధ్య కాలంలో నాగపూర్లో ఎం.ఏ చదువుతూ అడపదడప లేదా శెలవుల్లో మా గ్రామానికి వచ్చిన సందర్భంలో, అదే విధంగా 1971-1973 మద్య కాలంలో ఖమ్మంలో ఉద్యోగ రీత్యా వుంటున్న సమయంలో, మా పరిసర గ్రామ రాజకీయాలతో ఒక కమ్యూనిస్ట్ అభిమానిగా సంబంధాలు పెట్టుకున్నాను. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని కూడా. సభలు సమావేశాలకు హాజరయ్యేవాడిని. మా గ్రామంలో రాజకీయపరంగా నా పాత్రకు సంబంధించి ప్రస్తావించాను. అప్పట్లో ఖమ్మం సమితిలో, పాలేరు నియోజక వర్గంలో, ఇప్పటి ముదిగొండ మండలంలో భాగంగా వున్న కమలాపురం, బాణాపురం, పెద మండవ, వల్లభి, నాచేపల్లి, గంధసిరి, పమ్మి, చిరు మర్రి, అనా సాగరం గ్రామాలతో పాటు మా గ్రామంలో జరిగిన వ్యవసాయ కూలీ పోరాటాలను స్వయంగా చూసే అవకాశం కలిగింది. ఆ పోరాటాలలో, అంతో-ఇంతో, మా వూళ్లో నాకు కూడా కొంత మేరకు పాత్ర వుంది. అదే విధంగా అలనాటి కాంగ్రెస్ రాజకీయాలు, నాటి సమితి అధ్యక్షుడు ఉపేంద్రయ్య రాష్ట్ర హోం మంత్రి జలగం వెంగళరావు అండతో నెరపిన హత్యా రాజకీయాలను కూడా కళ్లారా చూశాను. బహుశా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మా పరిసర గ్రామాలలో ఆ పోరాటాలు ఇతర ప్రాంతాల వారు ఆదర్శంగా తీసుకోవాల్సిన తరహాలో జరిగాయంటే అతిశయోక్తి కాదేమో!

          పరిసర గ్రామాలలో వ్యవసాయ కూలీ పోరాటాల కార్యాచరణ పథకానికి-అమలుకు కేంద్రం బాణాపురం గ్రామం. సర్పంచ్ గండ్లూరి కిషన్ రావు నాయకత్వంలో, అదే గ్రామానికి చెందిన హరిజన నాయకుడు బాజి హనుమంతు (ఆ తరువాత పాలేరు ఎమ్మెల్యేగా ఎన్నికై నాడు), కమలాపురం గ్రామ సర్పంచ్ వనం నర్సింగ రావు, గంధ సిరి గ్రామ సర్పంచ్ గండ్ర వీర భద్రా రెడ్డి, పెద మండవ సర్పంచ్ తాళ్లూరి వైకుంఠం, పమ్మి గ్రామ సర్పంచ్ బుగ్గ వీటి రంగయ్య ప్రభృతులు చుట్టు పక్కలున్న పది-పదిహేను గ్రామాల వ్యవసాయ కార్మిక వర్గాన్ని సమీకరించి వారి హక్కుల సాధనకై పోరాటం మొదలెట్టారు. వ్యవసాయ కూలీలకు కనీస కూలి రేట్లు అందేటట్టు చేయడమే వారి లక్ష్యం. కిషన్ రావు నాయకత్వంలో వారంతా పోరాట పద్ధతులను ఒక పక్కా ప్రణాళికా బద్ధంగా రూపొందించుకున్నారు.


          చుట్టుపక్కల గ్రామాలలో వేరు శనగ ముఖ్యమైన పంట. వేరు శనగ కాపుకొచ్చాక కూలీలతో  పీకించి కొట్టిస్తారు. తయారైన కాయను "డబ్బాల" తో కొలిచి కూలీ నిర్ణయించేవారు. "డబ్బా" కు 16 "మానికలు". మానికంటే రెండు శేర్లు. డబ్బా కాయ కొట్టినవారికి మూడు "సోల" ల నుండి ఒక "మానిక" వరకు జొన్నలు కొలిచి కూలీగా ఇచ్చేవారు. సోల అంటే అర్థ శేరు. అయితే వేరు శనగ కొలిచే డబ్బాలు, జొన్నలు కొలిచి కూలి ఇచ్చే మానికలు అన్నీ తప్పుడివే. 16 "మానికలు" వుండాల్సిన డబ్బాలు వాస్తవానికి  20, 22 మానికలు పట్టేవరకుండేవి. మానికకు నాలుగు సోలలుండాలి కాని మూడున్నర వుండేవి. అలా రెండు వైపులా తప్పుడు కొలతలతో కూలీలకు ముట్టచెప్పేవారు భూస్వాములు. ఒకవైపు కూలీ తక్కువ...మరో వైపు తప్పుడు కొలతలు...ఇలా రెండు విధాలుగా మోసం జరిగేది. అదో రకం దోపిడీ అనాలి. సరిగ్గా ఆ పిచ్చి కొలతలకు, తక్కువ కూలీకి వ్యతిరేకంగా వుద్యమం ప్రారంభమైంది. "వ్యవసాయంలో కష్టం చేసేది కూలోడు...కష్టానికి తగ్గ ప్రతిఫలం కోరే హక్కు అతడికి వుంది...న్యాయమైన కూలీ కోసం, ఖచ్చితమైన కొలతల కోసం మీరంతా పోరాడండి" అని పిలుపిచ్చారు కిషన్ రావు నాయకత్వంలో మిగిలిన గ్రామ సర్పంచులు. తొలుత పోరాటం బాణా పురం గ్రామంలో మొదలైంది.

          కిషన్ రావు ఇచ్చిన పిలుపుకు, ఆ నినాదానికి కూలీలలో మంచి స్పందన వచ్చింది. అంతా కలిసి కట్టుగా, ఐక్యంగా నిలబడ్డారు. తప్పుడు కొలతల డబ్బాలు, మానికలు కనుమరుగయ్యే సమయం ఆసన్నమైంది. కూలీలు, వారి ముఠాలు, డబ్బులు పోగు చేసుకుని ఖచ్చితమైన కొలత డబ్బాలు, మానికలు కొనుక్కున్నారు. వాటి ప్రకారం ఇస్తేనే పుచ్చుకుంటా మన్నారు. సమ్మె చేశారు. కూలీల ఐక్యత ముందు భూస్వాములు తలవంచక తప్పలేదు. ఆ గ్రామంలో ఖచ్చితమైన కొలతలు అమల్లోకి వచ్చాయి. బాణాపురం కూలీలు విజయం సాధించారు. తరతరాలుగా శ్రమ జీవుల కష్టాన్ని దోచుకు తింటున్న భూస్వాముల తప్పుడు కొలతలకు స్వస్తివాచకం పలికారు బాణాపురం గ్రామంలో. ఈ వుద్యమం పరిసర గ్రామాలకు కూడా పాకింది. ఆయా గ్రామాల కమ్యూనిస్ట్ నాయకులు బాణాపురం తరహాలోనే పోరాటానికి కూలీలను సిద్ధం చేశారు. గ్రామ-గ్రామాన సభలు సమావేశాలు జరిగాయి. వందల-వేల సంఖ్యలో, చిరకాలం నుండి భూస్వాముల ఎత్తుగడల కింద చీల్చ బడి, ఛిన్నా భిన్నమైన కులాలన్నీ ఒక్క చోట చేరాయి. తప్పుడు కొలతలు, తక్కువ కూలీకి వ్యతిరేకంగా మహోద్యమం సాగింది. పిచ్చి మానికలు, డబ్బాల స్థానంలో కొత్తవి వచ్చాయి. నేటికీ మా పరిసర గ్రామాలలో అవే కొలతలుగా పనిచేస్తున్నాయి.

          మా పరిసర గ్రామాల భూస్వాములు మరొక రకమైన వింత దోపిడీ చేసేవారు. కూలీలు పోగు చేసుకునే "పెంట కుప్పలను" వారు కారు చౌకగా కాజేయడం చేసేవారు. అదంతా ఒక ప్రణాళికా బద్ధంగా చేసేవారు దోపిడీ దారులు. కరవు కాలంలో కూలీలకు ఐదు-పది మానికలు ధాన్యం అప్పుగా ఇచ్చేవారు. అప్పిచ్చేటప్పుడు ఒక షరతు విధించేవారు. అప్పు పుచ్చుకున్న కూలీలు తమ పెంట కుప్పలను అప్పిచ్చినవారికే అమ్మాలని షరతు. పెంట కుప్పలను వారికిష్టమైన రేటుకే కొనేవాడు భూస్వామి. అప్పిచ్చిన ధాన్యానికి "నాగులు", "పెచ్చులు" (వడ్డీ లాంటిది) కట్టేవాడు. నిలువు దోపిడీకి కూలీని గురిచేసేవాడు. ఇక పెంట కుప్పలను తోలే "బండి జల్ల" కు ఒక నికరమైన కొలతలుండక పోయేది. బలిష్టమైన ఎద్దుల బండిని కట్టి, పెద్ద జల్ల నిండా పెంట పోయించి, జీత గాళ్లతో కరువు తీరా తొక్కించి, పెంటను కుక్కించేవాడు. పది బండ్లు అవుతుందనుకున్న పెంట నాలుగు బండ్లే అయ్యేది. అప్పు అలానే మిగిలేది. పెంట ఖాళీ అయ్యేది. దానికి వ్యతిరేకంగా కూలీలను సమీకరించారు కమ్యూనిస్ట్ నాయకులు. అప్పిచ్చిన ధాన్యానికి అడ్డగోలు నాగులు, పెచ్చులు కట్టడానికి వీల్లేదన్నారు కూలీలు. "పెంట జల్లలు" కొలత ప్రకారం వుండాలన్నారు. అడుగుకు ఫలానా రేటు వుండాలన్నారు. పెంట పోశాక తొక్కడానికి కుదరదన్నారు. భూస్వాములు కూడా బిగదీసుకున్నారు. అప్పులు ఇవ్వమన్నారు. జల్లలు మార్చమన్నారు. జల్లలు అల్లే ఎరుకలను, ఎరువులు నింపే పాలేర్లను తమకండగా కూలీలు సమ్మె చేయించారు. పెద్ద జల్లలు అల్లమని ఎరుకలు, పెంట బండ్లలో తొక్కమని పాలేర్లు భూస్వాములను బెదిరించారు. కూలీలంతా ఐక్యమయ్యారు. భూస్వాములు దిగి రాక తప్పలేదు. నాటి నుంచి నేటి వరకు మా పరిసర గ్రామాలలో కొల జల్లలు, కొల పెంటలు అమల్లో వున్నాయి.

భూస్వాముల మరో రకమైన దోపిడీ భూమి విస్తీర్ణాన్ని తక్కువ చేసి చెప్పడం...తద్వారా తక్కువ కూలీ చెల్లించడం. వేరు శనగ కూలీ, పెంట కుప్పల దోపిడీ విషయంలో విజయం సాధించిన వ్యవసాయ కూలీలు వరి నాట్లు, కోతలు, కలుపు తీయడం వంటి రోజువారీ పనులకు, కూలి రేట్లను పెంచాలని, పాలేర్ల జీతాలు పెంచాలని పోరాటాలు ప్రారంభించారు. ఆ పోరాటానికి కూడా గండ్లూరి కిషన్ రావు నాయకత్వంలో తొలుత బాణా పురం గ్రామం ముందంజ వేసింది. మా పరిసర చుట్టుపక్కల అన్ని గ్రామాలలోను నాట్లకు, కోతలకు, కలుపు తీయడానికి ఎకరానికి ఇంత అని కూలి ఇచ్చేవారు భూస్వాములు. సాధారణంగా అవంతా ముఠా కూలీలే కలిమిడిగా చేసేవారు. విడి కూలి వుండదు. ఇందులో కూడా భూస్వామి భూమి విస్తీర్ణానికి సంబంధించి దొంగ లెక్క చెప్పి కూలీలను మోసం చేసే వారు. ఇలాంటి దొంగ లెక్కలకు వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలు పోరాటం చేసి విజయం సాధించారు. బాణా పురంలో కూలీలు సాధించిన విజయాన్ని ఆసరా చేసుకుని, పరిసర గ్రామాలలోని ఇతర కూలీలు ఆ గ్రామం నడిచిన దారిలోనే తమ గ్రామాలలో కూడా విజయం సాధించారు.

ఇదిలా వుండగా చుట్టుపక్కల గ్రామాలలోని కూలీలు, బాణా పురం నుండి కూలి సంఘం తయారు చేసిన సరైన కొలత మానికలను తెచ్చుకున్నారు. ఆ మానికలతోనే తమ గ్రామాలలో కూడా కూలి ఇవ్వాలని భూస్వాములను నిలదీశారు. భూస్వాములలో గందరగోళం బయల్దేరింది. ఇలా మా ప్రాంతమంతా అన్ని గ్రామాలలోను కూలీలంతా ఒక్కటై నిల్చి కూలి పెంపుదల సాధించడమే కాకుండా వివిధ రకాల దోపిళ్లకు వ్యతిరేకంగా పోరాడారు. భూస్వాములు ఆక్రమించిన ప్రభుత్వ బంచరాయి భూములను కూడా కూలీలు స్వాధీన పరచుకున్న ఘటనలు అనేకం వున్నాయి. ఆ మొత్తం పోరాటానికి గండ్లూరి కిషన్ రావు ముందుంటే, ఆయన సహచర కమ్యూనిస్ట్ నాయకులు ఆయనకు అందగా నిలిచారు.   



Monday, July 8, 2013

ఆత్మీయతతో డాక్టర్ రంగారావు రాసిన పెళ్లినాటి ఉత్తరం: వనం జ్వాలా నరసింహారావు

ఆత్మీయతతో డాక్టర్ రంగారావు 
రాసిన పెళ్లినాటి ఉత్తరం
వనం జ్వాలా నరసింహారావు

          మాంచెస్టర్ (ఏప్రిల్ 1969),

          బావగారూ,

          ఇంతకన్నా తీయగా, అనురాగంగా మిమ్మల్ని సంభోధించలేకపోతున్నా. ఈ పిలుపుతో మన బంధం ఒక మలుపు తిరుగుతుంది. వలపుతో మా చెల్లి మెడన మీరేసిన మూడు ముళ్లతో మీరు మా మూడవ ముద్దుల బావయ్యారు.

          మా ఇంట్లో అందం, అదృష్టం, అమ్మాయిలది-ఆకతాయితనం, అలుక అబ్బాయిల వంతు. అందరిలో మాత్రం అనురాగం కొల్ల-మా అమ్మాయిలు అందంతో, ఆనందంతో, అదృష్టంతో అత్తవారింటికొస్తారు-అన్యోన్యమైన సంసారంతో, ఆదర్శవంతమయిన దాంపత్యంతో మాకానందం ఇస్తారు.

          మా చెల్లి విజయలక్ష్మి మీ ఇల్లాలు-అమ్మా నాన్నల కనురెప్ప ఈ చిన పాప-అక్కా అన్నల చెలి ఈ సుబాల. ఈ నాటి నుండి మీది. ఆదర్శంతో స్వీకరించారు. అనురాగంతో నింపుకొండి. అనునయంతో చూసుకొండి. అనువుగా మలుచుకొండి.


          ఈ శుభ సమయంలో బాధాకరమైన క్షణం అప్పగింతలు-అందరి మనసులు కెలికివేసేది, అందరి హృదయాలు నలిపివేసేది. నే దగ్గర లేకపోయి నాను. దగ్గర వున్నా పారిపోవాలని పించే క్షణం. దగ్గర వుండి చూడలేకపోయినందున దూరంగా వుండి చెప్పగలుగుతున్నా......చంద్రుని సరసనే చుక్కలు మెలుగుతాయి. మందారం పక్కనే మధుపాలు మసలుతాయి.....కలికితురాయి కంసాలి ఇంట రాణించదు.....కలవారి ఇంట కలకంఠి నొసటనే శోభిస్తుంది. అందుకే బావగారూ! అమ్మాయిని మీకిస్తున్నాం.

          పెద్దవారు మా నాన్న గారు. చిన్నవాడు తమ్ముడు. మధ్యముడ్ని నేను. పెళ్లి ఏర్పాట్లలో పెత్తనం చేయాల్సిన వాడ్ని. దగ్గర లేకపోయాను. పెళ్లి ఏర్పాట్లలో, సదుపాయాలలో, మర్యాదలలో పొరపాట్లు జరిగితే క్షమించమని అర్థిస్తున్నా.

          మీ ఇద్దరూ కలకాలం, కనులకింపుగా, అన్యోన్యంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, పిల్లలతో, పాపలతో.....
          వేయేళ్లు కాపురం చేయాలని.....
          వేల మనసులతో కోరుతూ......
          వేనోళ్ల దేముళ్లను ప్రార్థిస్తూ.....
          వేల మైళ్ల దూరంలో......
          బావ


1968 నాటి "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం": వనం జ్వాలా నరసింహారావు

1968 నాటి 
"ప్రత్యేక తెలంగాణ 
రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం"
వనం జ్వాలా నరసింహారావు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కేవలం "భావించడం" మాత్రమే కాకుండా, దాన్ని సాధించడం కొరకు, రకరకాల మార్గాలను ఎంచుకోవడం ఆరంభమయింది 1956 నుంచే. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మూడూ, ఆంధ్ర ప్రదేశ్ లో కలిసున్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే చట్ట రీత్యా కలిగించడం ద్వారా, తెలంగాణ వే()ర్పాటు నినాదాన్ని, పాలక పక్షం విజయవంతంగా పక్కదారి పట్టించగలిగింది మొదట్లో. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతానికి వలసవచ్చిన కొందరు తెలంగాణే తరులు , ఎప్పుడైతే తమ "పరోక్ష దోపిడీ" విధానాన్ని "ప్రత్యక్ష దోపిడీ" విధానంగా మార్చడం మొదలయిందో, అప్పుడే దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో "దోపిడీకి ఎదురుతిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయింది. క్రమేపీ ఉద్యమరూపంగా మార్పుచెంద సాగిందా కాంక్ష. బంగారు భవిష్యత్ పై కొండంత ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, తమ ఆశలు అడియాశలవుతాయేమోనన్న భయం పట్టుకుంది. ఆ భయంలోంచే ఉద్యమం రూపుదిద్దుకోవడం మొదలయింది. ఆ ఉద్యమ బీజమే, నాలుగు దశాబ్దాల క్రితం (మా) ఖమ్మం జిల్లాల్లో-ఖమ్మం, కొత్తగూడెం పట్టణాలలో, ఆరంభమైన "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం". ఆ బీజమే "ఇంతై-ఇంతింతై-వటుడింతై" అన్న చందాన ఒక వట వృక్షమైంది. బలమైన గాలి వీచినప్పుడు కొమ్మలు విరిగినా, తిరిగి, బలం పుంజుకొని, ఉద్యమాన్ని సజీవంగా వుంచి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా దూసుకుపోతుందానాటి-నేటి ఉద్యమం. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందన్న నమ్మకం కలిగినట్లే కలిగి, కనుమరుమగుతూ కవ్విస్తున్నది.

 1968 లో తెలంగాణ ప్రజా పోరాటానికి "రక్షణల ఉద్యమం" పేరుతో ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రంలో అంకురార్పణ జరిగింది. కొత్తగూడెం సింగరేణి సంస్థలో పనిచేస్తుండే ఒక చిరుద్యోగి సర్వీసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో అతడు తెలంగాణ వాడు కావడంవల్ల జరిగిన తీరని అన్యాయంవల్ల, ఆయన సహోద్యోగులందరూ కలిసి తమ న్యాయమైన హక్కులకొరకు పోరాటం సాగించారు. ఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారి, జిల్లా అంతటా పాకి, ఖమ్మం పట్టణం చేరుకుంది. ఖమ్మం స్థానిక కళాశాలలో చదువుకుంటున్న "రవీంద్రనాథ్" (మా జూనియర్) అనే విద్యార్థి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ "గాంధి చౌక్" లోని గాంధి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. నాకు తెలిసినంతవరకు అతడే మొట్టమొదటి సారిగా తెలంగాణకొరకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నవ్యక్తి. ఆ నేపధ్యంలో నాకు గుర్తున్నంతవరకు, హక్కుల రక్షణ సమితి పక్షాన ఒక ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రిని కలుసుకుని విజ్ఞాపన పత్రం సమర్పించారు. వారి విజ్ఞాపనకు ముఖ్యమంత్రి స్పందించిన తీరు సరైందిగా లేదని భావించిన ప్రతినిధి వర్గంలోని ప్రముఖులు తెలంగాణ విడిపోవడమే సమస్యకు పరిష్కారంగా భావించారు.

కొత్తగూడెం-ఖమ్మంలో ఉద్యమం మొదలవడానికి సుమారు ఆరు నెలల క్రితం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని "" హాస్టల్లో, నాటి విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి (నా కంటే ఏడాది సీనియర్) రూమ్ లో, మాజీ లోక్ సభ సభ్యుడు అప్పట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి, స్వర్గీయ మల్లికార్జున్ తో సహా పలువురు విద్యార్థి నాయకులు సమావేశమయ్యారు. "విద్యార్థి కార్యాచరణ కమిటీ" పేరుతో ఒక సంస్థను నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించాలని తీర్మానించారు. వాస్తవానికి శ్రీధర్ రెడ్డి, భవిష్యత్ లో రూపు దిద్దుకోనున్న, బ్రహ్మాండమైన వేర్పాటు ఉద్యమానికి తొలి రాష్ట్ర స్థాయి నాయకుడనాలి.

ఆయన నాయకత్వంలోని విద్యార్థులందరూ స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని కలిసి, ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. వందేమాతరం రామచంద్ర రావు వేసిన ఎన్నికల పిటీషన్ లో, ఉన్నత న్యాయస్థానం తీర్పు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన నేపధ్యంలో, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైనందున, తన రాజకీయ పునరావాసానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి. చెన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం చేపట్టడానికి ముందే, ఉద్యమం వూపందుకోవడం-మధ్యలో ఖమ్మంలో విద్యార్థి వుద్యమం మొదలవడం, ఒకటి వెంట ఒకటి జరిగాయి. చెన్నారెడ్డి నాయకత్వం వహించడానికి పూర్వమే జరిగిన ఉద్యమంలో శ్రీధర్ రెడ్డి, బద్రి విశాల పిట్టి, మల్లికార్జున్, ఆమోస్ లాంటి ప్రముఖులు అరెస్ట్ కావడం-జైలుకెళ్లడం జరిగింది. ఆ ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే మాజీమంత్రి స్వర్గీయ మదన్ మోహన్ నాయకత్వంలో "తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ " పేరుతో మరో సంస్థ ఆవిర్భవించింది. చివరకు అన్నీ కలిసి ఉమ్మడిగా ఉద్యమించాయి. ఏకమైన సంస్థలన్నీ కలిసి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి.

1968 (నవంబర్-డిసెంబర్ నెలల్లో అనుకుంటా) లో జరిగిన "రక్షణల అమలు" ఉద్యమానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహాయం చేసినవారిలో అలనాటి తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు జె. చొక్కా రావు, రాష్ట్ర పంచాయితీ మండలి అధ్యక్షుడు జలగం వెంగళరావు, నూకల రామచంద్రారెడ్డి, జి. సంజీవరెడ్డి వున్నారు. వారి అనుయాయులు కొందరు అలనాటి ఉద్యమంలో పాల్గొన్నారు కూడా. క్రమేపీ టి. అంజయ్య, ఎం. ఎం. హాషిం, జి. వి. సుధాకర్ రావు, బి. రాజారాం, కె. ఆర్. ఆమోస్, ట్. సదా లక్ష్మి, ఎస్. బి. గిరి లాంటి వారు కూడా ప్రజా సమితి సమావేశాలలో చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారు. కొన్నాళ్లకు కొండా లక్ష్మణ్ బాపూజి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో ఉద్యమం క్రమేపీ మిలిటెంటుగా మార సాగింది. హింసాత్మకంగా మారిన ఉద్యమంలో మూడొందల మంది పైగా యువకులు, విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. కోదాడ, నందిగామలలో జరిగిన కొన్ని దుర్ఘటనలు నల్గొండ, వరంగల్ విద్యార్థులను రెచ్చగొట్టాయి. మొత్తం మీద అరాచకాలు ప్రబలిపోసాగాయి.

పునాదులు కదిలిన ప్రభుత్వం పోలీసుకు సహాయపడేందుకు, సైన్యాన్ని పిలిపించింది. సైనికులు పోలీసుల సహకారంతో పాశవికంగా ప్రవర్తించారని నాటి పత్రికలు పేర్కొన్నాయి. ఎందరో విద్యార్థులను, అమాయకులను జైళ్లలో నిర్బంధించారు. వేలాదిమంది తెలంగాణ ప్రజా సమితి నాయకులు, విద్యార్థి నాయకులు జైళ్లలో బంధించబడిన దరిమిలా, రెచ్చిపోయిన ప్రజలు ఉద్యమాన్ని ఉదృతం చేశారు. పరిస్థితిని అదుపులో తేవడానికి వ్యూహాత్మకంగా నాటి ప్రధాని ఇందిరా గాంధి, కొందరు తెలంగాణ ప్రముఖులతో ఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆహ్వానించబడినవారిలో తెలంగాణ వాదులు డాక్టర్ చెన్నారెడ్డి (అప్పటికింకా ప్రజా సమితి నాయకత్వం స్వీకరించలేదు), కొండా లక్ష్మణ్ బాపూజి, రామచంద్రారెడ్డి, చొక్కా రావు లతో పాటు ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చే పలువురున్నారు. ప్రతిపక్షాల నాయకులను కూడా ఆహ్వానించారు. అసలు సిసలైన పలువురు తెలంగాణ ప్రజా సమితి నాయకులను పిలవలేదు. మదన్ మోహన్ జైల్లో వున్నారప్పుడు. మరోవైపు తెలంగాణ ప్రాంతమంతా సత్యాగ్రహ శిబిరాలు వెలిశాయి. సామూహిక నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఢిల్లీ సమావేశంలో ఏ అంగీకారం కుదరలేదు. ప్రధాని ఏకపక్షంగా ఒక అష్ట సూత్ర కార్యక్రమాన్ని ప్రకటించడం, దాన్ని  డాక్టర్ చెన్నారెడ్డి, రామచంద్రారెడ్డి, చొక్కా రావులు సంయుక్తంగా వ్యతిరేకించడం జరిగింది

వి. బి. రాజు చొరవతో, ఉద్యమంతో సంబంధం వున్న నాయకులతో ప్రధాని చర్చలు జరపడానికి రంగం సిద్ధమైంది. మదన్ మోహన్, వెంకట్రామరెడ్డి, ఎస్. బి. గిరి, మల్లిఖార్జున్, శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి ప్రభృతులకు ఆహ్వానాలు అందాయి. అణచివేత విధానాన్ని, హింసా కాండను కొనసాగిస్తున్న ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రయోజనం లేదని భావించిన నాయకులు ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈ దశలో డాక్టర్ చెన్నారెడ్డి రంగప్రవేశం చేశారు. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు. అదే సందర్భంలో విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి పోటీ ప్రజా సమితిని స్థాపించి తన వ్యతిరేకతను వ్యక్త పరిచాడు. చెన్నారెడ్డి అధ్యక్ష పదవిని చేపట్టగానే, ప్రజా సమితి రాజకీయంగా బలాన్ని పుంజుకుంది. కొన్ని వనరులు కూడా చేకూర సాగాయి. ఉద్యమం కూడా తీవ్రమైంది. సాయుధ పోలీసుల రక్షణ లేకుండా ముఖ్యమంత్రి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కొంతకాలానికి ఎన్. జీ. వోల సంఘం నాయకుడు ఆమోస్‍ను ఉద్యోగం నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సత్యాగ్రహాలు చేసి కొన్ని వందల-వేల మంది అరెస్ట్ అయ్యారు. లాఠీ చార్జీలు నిత్యకృత్యమయ్యాయి. పరిస్థితి రోజురోజుకు దిగజారిపోసాగింది. రాజధాని హైదరాబాద్‌లో కర్ఫ్యూ విధించబడింది. ఢిల్లీలో వున్న ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు చొక్కా రావును వెంట పెట్టుకుని ప్రధాని ఇందిరాగాంధి, హుటాహుటిన ఒకనాడు హైదరాబాద్ వచ్చింది. నగరంలో రాత్రికి రాత్రే పర్యటించి తెల్లవారు ఝామున ఢిల్లీ వెళ్లి పోయారు.  

కొద్ది దినాల తరువాత, ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. దాంతో పాటే మరో విడత చర్చలకు చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ ప్రభృతులను ప్రభుత్వం ఆహ్వానించింది. చర్చలవలన ఏ ఫలితం చేకూరలేదు. ఉద్యమం నిలుపు చేయాలని మొరార్జీ దేశాయ్, వై. బి. చవాన్ ప్రభుత్వ పక్షాన కోరడం, అది అసంభవమని చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ లు స్పష్టం చేయడం జరిగింది. హైదరాబాద్ తిరిగి వచ్చిన నాయకులకు ఘన స్వాగతం లభించింది. ఇదిలా వుండగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జి. వెంకట స్వామిపై హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్యా ప్రయత్నాన్ని నిరసిస్తూ ఆ మర్నాడు తెలంగాణ అంతటా సంపూర్ణ హర్తాళ్ జరిగిందిడాక్టర్ జి. ఎస్. మెల్కోటే, సంగం లక్ష్మీబాయి తమ రాజీనామా లేఖలను ప్రజా సమితి అధ్యక్షుడికి అందచేశారు. అదే రోజు రాత్రి నారాయణ గుడాలోని స్నేహితుడు డాక్టర్ సుదర్శన రెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న డాక్టర్ చెన్నారెడ్డిని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టు చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించసాగారు పోలీసులు. చెన్నారెడ్డితో పాటే, ఏడెనిమిది మంది శాసన సభ సభ్యులను, సుమారు పాతిక మంది ఇతర ప్రముఖులను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. మరుసటి రోజునుంచి వందల సంఖ్యలో విద్యార్థి నాయకులను ప్రజా సమితి కార్యకర్తలను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. పోలీసులు చెన్నారెడ్డిని తీసుకెళ్తున్న కారును సూర్యాపేటలో ఆందోళనకారులు అడ్డగించారు కొద్ది సేపు. చెన్నారెడ్డి స్థానంలో మదన్ మోహన్ ప్రజా సమితి అధ్యక్షుడయ్యాడు. ఆయనను కూడా అరెస్ట్ చేసిన తరువాత సదా లక్ష్మి ఆ బాధ్యతలు నిర్వహించారు.

ఇది జరిగిన కొన్నాళ్లకు, ఉద్యమం ఇంకా ఉదృతంగా కొనసాగుతున్న నేపధ్యంలోనే, బి. వి. గురుమూర్తి మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరి కొందరి మంత్రుల రాజీనామాను ఆపు చేసేందుకు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వ్యూహాత్మకంగా తన రాజీనామాను అధిష్టానానికి సమర్పించారు. ఆ రాజీనామాను తమ విజయంగా భావించిన లక్షలాది మంది తెలంగాణ వాదులు రోడ్ల పైకొచ్చి పండుగ చేసుకున్నారు. ఊరేగింపులు, సభలు, సమావేశాలు జరుపుకున్నారు. పరిస్థితి పోలీసుల అదుపు తప్పే స్థాయికి చేరుకుంది మరో మారు. ముఖ్యమంత్రి తరహాలోనే కొందరు తెలంగాణ మంత్రులు కూడా రాజీనామా చేశారు. రాజీనామా అయితే చేశాడు కాని, పదవిలో కొనసాగడానికి కాసు చేయని ప్రయత్నం లేదు. అధిష్టానం దూతలుగా హైదరాబాద్ వచ్చి, ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ పేరుతో కాసుకు మద్దతు కూడగట్టారు కామరాజ్ నాడార్, నిజలింగప్పలు. బ్రహ్మానంద రెడ్డి కొనసాగాడు. ఆయన మంత్రివర్గంలో జె. వి. నరసింగ రావుకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు.

ఆ తరువాత జరిగిన శాసన సభ సమావేశాలలో, గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ ప్రసంగం, అర్థాంతరంగా ముగిసింది. జై తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. సమావేశాలు జరుగుతుండగా, కొందరు విద్యార్థులు అసెంబ్లీ ఆవరణలో ప్రవేశించి, మంత్రులపై కోడి గుడ్లు, టొమాటోలు విసిరారు. మరో సంఘటనలో ఒక యువకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌పైన బాంబు విసిరాడు. అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న నాయకుల విడుదలకు న్యాయ పరమైన చర్యలు తీసుకున్నారు. చివరకు డిటెన్యూలందరినీ విడుదల చేయాలని హైకోర్టు తీర్పిచ్చింది. దరిమిలా ఉద్యమ ఉదృతి అనేక కారణాల వల్ల తగ్గింది.


1971 సాధారణ ఎన్నికల్లో "టీ పీ ఎస్" పేరుతో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అప్పుడే నైతికంగా తెలంగాణ ఏర్పాటు జరిగిపోయుండాల్సింది. కాని జరగలేదు. నాయకత్వం మరో మారు ఉద్యమానికి వెన్ను పోటు పొడిచింది. నాటి ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి తన ప్రజా సమితిని విలీనం చేశారు. తెలంగాణ ఏర్పడడానికి బదులు మరికొన్ని రాయితీలను ఉపశమనంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. ఉద్యమంలో పాలుపంచుకొని రాజకీయ లబ్ది పొందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పదవులనుభవించారు-ఇంకా అనుభవిస్తూనే వున్నారు. కొంద రైతే వారసత్వంగా అనుభవిస్తున్నారు. కాకపోతే వారిలో కొందరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తమ ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజలు తమను మరిచిపోకుండా వుండేందుకు, అడపాదడపా "తెలంగాణ" అంటూ గొంతు చించుకుంటుంటారు. ఇటీవల పదవులకు రాజీనామా చేస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు "ఆ కోవకు" చెందినవారే. వారికి కావాల్సింది "రాజకీయ భద్రత" గాని, తెలంగాణ ఏర్పాటు కాదు.

Saturday, July 6, 2013

ముదిగొండ-వల్లభి గ్రామాల హింసా రాజకీయాలు: వనం జ్వాలా నరసింహారావు

ముదిగొండ-వల్లభి గ్రామాల హింసా రాజకీయాలు
వనం జ్వాలా నరసింహారావు

మా గ్రామం పక్కనున్న కమలాపురం సరిహద్దు గ్రామం బాణా పురంతో సహా చుట్టుపక్కల గ్రామాల్లో కమ్యూనిస్టుల ఆధిక్యతను దెబ్బతీసేందుకు, కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య చాలాకాలం హింసా కాండ జరిగింది. ఇరు వర్గాల్లో ఎంతోమంది చనిపోయారు. బాణాపురం పక్క గ్రామమైన వల్లభిలో, మండల కార్యాలయమున్న ముదిగొండ, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రాజకీయ హత్యలెన్నో జరిగాయి. ఖమ్మం జిల్లాకు "మార్క్సిస్టు-కమ్యూనిస్టుల కంచుకోట" అన్న పేరు నా చిన్నతనంనుండి వింటూనేవున్నాను. కాకపోతే, ఒకప్పుడు మా ప్రాంతంలో బలమైన ఉద్యమ నేపధ్యంలో నిర్మించబడిన కమ్యూనిస్ట్ పార్టీ, క్రమేపీ అంతర్గత కుమ్ములాటలతో, సొంతకంటిలో వేలు పొడుచుకున్న విధంగా బలహీనపడిపోయి, భవిష్యత్‌లో అలా పిలిపించుకునే అవకాశాలు ఉండవనే రీతిలో రూపాంతరంచెందిందనాలి. రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ఖమ్మం జిల్లాకొక ప్రత్యేక స్థానం ఉంది. వరంగల్‌ జిల్లాలో భాగంగా ఉన్నప్పుడే ఖమ్మం పట్టణ శాఖ ఏర్పడడం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చిర్రావూరి లక్ష్మీనరసయ్య, సర్వదేవభట్ల రామనాధం, మంచికంటి రామ కిషన్‌రావు, రావెళ్ళ సత్యనారాయణ, కె. ఎల్. నరసింహారావు, బోడేపూడి వెంకటేశ్వర రావు వంటి యోధులు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఉమ్మడి పార్టీ చీలిపోవడంతో సీపీఎం (కమ్యూనిస్ట్ పార్టీ-మార్క్సిస్ట్) బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చింది. రాష్ట్రం మొత్తంలో సీపీఎంకు పట్టున్న జిల్లాగా పేరు తెచ్చుకుంది. రాష్ట్ర చరిత్రలో-ఆ మాటకొస్తే దేశచరిత్రలోనే పౌరహక్కుల ఉద్యమాలకు నాంది పలికింది డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్‌ రాధా కృష్ణ, అడ్వకేట్ సుబ్బారావు నాయకత్వంలో ఖమ్మం జిల్లాలోనే అనాలి.

ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలలోనూ, ప్రత్యేకించి జిల్లా రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషించిన బొమ్మకంటి సత్యనారాయణరావు, కొంతకాలం రాష్ట్ర రాజకీయాలను శాసించి ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా ఉన్న జలగం వెంగళరావుల చుట్టూ ఖమ్మం జిల్లా రాజకీయాలు తిరుగుతుండేవి. ఏభై సంవత్సరాల క్రితం ముదిగొండ-ఆ పరిసర గ్రామాలలో కూడా వారి ప్రభావమే ఉండేది. శీలం సిద్ధారెడ్డి రాజకీయంగా ఎదిగి, మంత్రివర్గంలో స్థానం సంపాదించి, నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలగడంతో, జిల్లా కాంగ్రెస్‌లోని ఒక వర్గానికి ఆయన నాయకత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో, జలగం- శీలం వర్గాలుగా ఖమ్మం కాంగ్రెసు రాజకీయాలు సాగాయి. కమ్యూనిస్టులు జిల్లాలోనూ, ప్రత్యేకించి ముదిగొండ ప్రాంతంలోనూ, పరిస్థితులను బట్టి శీలం వర్గానికి మద్దతివ్వడమో, తీసుకోవడమో జరిగేది.

జలగం-శీలం వర్గాల ఆధిపత్య పోరు కొనసాగుతున్న రోజుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఖమ్మం తాలూకా పాలేరు-తిరుమలాయపాలెం పరిధిలోని గ్రామాల్లో సిద్ధారెడ్డి వర్గానికి కమ్యూనిస్టుల మద్దతు లభిస్తే, ఖమ్మం సమితి పరిధిలోని గ్రామాలలో కమ్యూనిస్ట్ అభ్యర్థులకు సిద్ధారెడ్డి వర్గం మద్దతు లభించేది. ఆ విధంగా చెరొక సమితి దక్కించుకుని జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించేవారు. అయితే కమ్యూనిస్టులు విడిపోయిన తర్వాత సీపీఐ జలగం పక్షాన, సీపీఎం సిద్ధారెడ్డి వర్గంతోనూ కలిసి పనిచేశాయి. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కొంత మారింది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి, ఇంకో సారి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చేవారు-వారి మద్దతుతో వీలై నన్ని ఎక్కువ స్థానాలు ఆయా ఎన్నికల్లో సంపాదించుకునే ప్రయత్నం చేసేవారు. కమ్యూనిస్ట్ పార్టీలు స్వయంకృషితో ఎదగడం ఒకవిధంగా, రోజులుగడుస్తున్నకొద్దీ, ఆగిపోయిందనే అనాలి

ఇలాంటి రాజకీయ నేపథ్యంలో మొట్టమొదటి సారిగా, గత శతాబ్దం అరవయ్యో దశకంలో, మిగతా జిల్లాల్లో మాదిరిగానే ఖమ్మంలో కూడా గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగడం, ఎన్నికైన సర్పంచులు సమితి అధ్యక్షుడినీ, వీరంతా కలిసి జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని ఎన్నుకోబోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిందని రాజకీయ విశ్లేషకులందరూ భావించే "సీల్డ్ కవర్‌" రాజకీయాలకు అపర చాణక్యుడుగా పేరుపడ్డ బొమ్మకంటి సత్యనారాయణరావు (మా సమీప బంధువు) ఆ రోజుల్లోనే శ్రీ కారం చుట్టి, తన సమీప బంధువైన రావులపాటి సత్యనారాయణ రావుని, ‘పాలేరుసమితి అధ్యక్షుడిని చేశారు. అప్పట్లో రావులపాటిని తప్ప వేరెవరిని ప్రతిపాదించినా సమితి అధ్యక్ష పదవికి తాము కూడా పోటీలో ఉంటామని కమ్యూనిస్టు నాయకులు ప్రకటించడంతో, సర్పంచ్‌ కూడా కాని ఆయనను కో-ఆప్షన్‌ సభ్యునిగా ఎంపిక చేయించి అధ్యక్షుడిగా చేశారన్న విషయం ఆ ప్రాంతవాసులందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి బొమ్మకంటి నిర్ణయంవల్ల రాజకీయంగా ఎక్కువ నష్టపడింది ఆయన మరో బంధువు అయితరాజు రాం రావు (నాకు మామ గారు). అప్పటికే రాజకీయంగా బొమ్మకంటితో సమాన స్థాయికి ఎదిగిన ఆయన ఎదుగుదలను ఆపుచేసేందుకే బొమ్మకంటి తన చాణక్య నీతిని ప్రదర్శించాడంటారు. వల్లభి గ్రామ వాస్తవ్యుడైన రాం రావు గారి మూడో కూతురే నా భార్య.

ఈ నిర్ణయంతో బొమ్మకంటి నుండి కొందరు అయినవారు దూరం కావడం, జలగం వర్గం వారికి కోపం కలగడం దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు. ఆ నేపథ్యంలో, ముదిగొండ-పరిసర గ్రామాల రాజకీయాలు క్రమేపీ వేడెక్కాయి. కక్షలకు దారి తీసాయి. అప్పటి వరకూ కలసిమెలసి ఉంటున్న వారిమధ్య చిచ్చు రేగింది. బొమ్మకంటికి అత్యంత సన్నిహితుడి గా అప్పటివరకూ ఉంటూ వస్తున్న సమీప గ్రామానికి చెందిన ఓ భూస్వామికీ, అదే బొమ్మకంటి ఎంపిక చేసిన సమితి అధ్యక్షుడికి భూమితగాదాతో ప్రారంభమైన పేచీ చిలికి చిలికి తుఫానుగా మారింది. సమితి అధ్యక్షుడికి అండగా దళితులు, పేదలతో సహా, సాక్షాత్తు ఆయన్ను వ్యతిరేకించిన భూస్వామి కొడుకు పక్షాన పరోక్షంగా స్థానిక కమ్యూనిస్టులు నిల్చారు. దీర్ఘకాలం సాగిన ఆ పోరాటంలో సమితి అధ్యక్షుడి పక్షానున్న భూస్వామి (భాగవతుల భిక్షం) కొడుకు (వేదాద్రి) ను ఆయన తండ్రి నాయకత్వంలోని వైరి వర్గాల వారు హత్య చేయించారని చెప్పుకునేవారు ఆ రోజుల్లో. దీని ప్రభావం అదే మండలంలోని అనేక గ్రామాల్లో- ముందుగా వల్లభిగ్రామంలో పడింది.

 ముదిగొండలో ఇరుపక్షాల కాంగ్రెస్‌ వారి మధ్య పోరు సాగినంత కాలం శీలం వర్గం రావుల పాటికి అండగానూ, జలగం వర్గం ఆయనకు వ్యతిరేకంగానూ నిల్చింది. అయితే దళితులు, పేదలు రావులపాటికి మద్దతు ఇస్తుండడంతో, వారికి మద్దతుగా కమ్యూనిస్టులు నిల్చారు. ఆ ప్రాంత-జిల్లా, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులైన రాయల వెంకటేశ్వర్లు, రావెళ్ళ సత్యం పార్టీ పరంగా ముందున్నారు. రాయల వెంకటేశ్వర్లు ముదిగొండ పంచాయితీలో ఒకప్పుడు భాగమైన వెంకటాపురం గ్రామానికి, రావెళ్ళ సమీప గ్రామమైన గోకినేపల్లికి చెందినవారు. తర్వాత జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సమితి అధ్యక్షుడిగా జలగం వర్గీయుడు, ముదిగొండ సమీపంలోని మేడేపల్లి గ్రామానికి చెందిన నాటి కాంగ్రెస్‌ యువనేత సామినేని ఉపేంద్రయ్య గెలుపొందారు. సమితి స్థాయిలో తిరుగులేని నాయకుడిగా, జలగం వర్గంలో ముఖ్యుడిగా, అనతి కాలంలో ఎదిగాడు. అప్పటికే జలగం, శీలం వర్గాలుగా చీలిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో ఆధిపత్యం పోరులో కూరుకుపోయింది. ఆ ప్రభావం ముదిగొండ పరిసర గ్రామాల్లో పడింది. జలగం గ్రూప్‌ పక్షాన పలుకుబడిగలిగిన ఒక అగ్ర (కమ్మ వారు) వర్ణం వారు చేరగా, శీలం వైపున మరో అగ్ర (బ్రాహ్మణులు) వర్ణం వారే చేరారు. దళితుల్లో మెజార్టీ శీలం వర్గానికి చెందిన అగ్రవర్ణాల పక్షాన నిల్చారు.

సమితి అధ్యక్షుడిని తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన రావడం, అదీ, కాంగ్రెస్‌నుంచే రావడంతో ఆ ప్రాంత రాజకీయాలు మరో మారు వేడెక్కాయి. సీపీఎం సర్పంచ్‌లు ఉపేంద్రయ్యను పూర్తిగా వ్యతిరేకించగా, సీపీఐకి చెందిన కొందరితో సహా పార్టీ మద్దతుతో గెల్చిన మరి కొందరి మద్దతు ఆయనకు లభించింది. కాకపోతే అలా మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టు సర్పంచులు కొందరు (ఉదాహరణకు అమ్మపేట సర్పంచ్ కోయ వెంకట్రావు) చివరకు పార్టీని వీడి, ఉపేంద్రయ్య అండతో, ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టులపై పోరాటం చేసారు. ఇరుపక్షాలకు చెందిన కొందరు నాయకులు హత్యకు కూడా గురయ్యారు. రాజకీయంగా పలుకుబడి కోల్పోతున్న సమయాన ఉపేంద్రయ్య కూడా హత్యా రాజకీయాలకు బలైపోయారు.

ఈ నేపధ్యంలో, ముదిగొండ మండలం (అప్పట్లో ఖమ్మం సమితి) లోని వల్లభి గ్రామంలో, జరిగిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకోవాలి.

నాటి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ ముఠా రాజకీయాలకు వల్లభి గ్రామం దళితులు బలయ్యారు. నీలం సంజీవ రెడ్డి గ్రూపుకు చెందిన జలగం వెంగళరావు పక్షాన వున్న గ్రామ అగ్ర వర్ణాల వారికి, కాసు బ్రహ్మానంద రెడ్డి గ్రూపుకు చెందిన శీలం సిద్దారెడ్డి పక్షాన వున్న దళితులకు "వల్లభి" గ్రామం ఒక భూ పోరాటానికి" వేదికైంది. దళితుల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన అగ్ర వర్ణాల వారికి, దళితులకు మధ్య వివాదం ఘర్షణలకు దారితీసింది. దళితులను భయబ్రాంతులను చేసే ప్రయత్నంలో, అగ్రవర్ణాలకు చెందిన కొందరు, పరిసర గ్రామాలలోని తమ మద్దతు దార్లను కూడగట్టుకుని, దళిత వాడపై దాడి చేయడంతో, పిల్లా పాపలతో-కుటుంబాలన్నీ గ్రామం విడిచి పోవాల్సిన పరిస్థితి కలిగింది. అలా వెళ్ళిన వారి ఇళ్లను కూడా సర్వ నాశనం చేశారు. వారి పశువులను తరిమి వేశారు. గృహోపకరణాలను పాడు చేశారు. మొత్తం మీద దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. దళితులకు అండగా నలిచిన గ్రామ పెద్ద, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తామ్ర పత్ర గ్రహీత అయితరాజు రాం రావు కూడా గ్రామం విడిచి కొంత కాలం ఖమ్మంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దళితులకు ఇబ్బందులు తొలగ లేదు. దేశ వ్యాప్తంగా పత్రికలు జరిగిన అన్యాయాన్ని ప్రచురించాయి. టైమ్, న్యూస్ వీక్ లాంటి అంతర్జాతీయ పత్రికలు, బ్రిడ్జ్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లాంటి జాతీయ ప్రముఖ పత్రికలు ఆ గ్రామంలో జరిగిన సంఘటనలను పూస గుచ్చినట్లు ప్రచురించాయి. ఇక స్థానిక రాష్ట్ర స్థాయి పత్రికలు సరే సరి.   ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం వరకూ తెలిసింది. బ్రహ్మానంద రెడ్డి తన మంత్రివర్గ సహచరులైన వల్లూరు బసవ రాజు ప్రభృతులను వల్లభి గ్రామానికి పంపినా ఫలితం కనిపించలేదు. గ్రామంలో రిజర్వుడు పోలీసులు, ఉన్నతాధికారులు కూడా మకాం వేశారు. అయినా మార్పు కానరాలేదు.

సమస్యకు పరిష్కారం గాంధేయ మార్గంతప్ప మరోటి కాదని గ్రామ పెద్ద అయితరాజు రాం రావు భావించారు. స్నేహితుల సహాయంతో ఆచార్య భన్సాలిని ఆశ్రయించాడు.

సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతిపిత మహాత్మాగాంధీ ఆధ్యాత్మిక వారసుడు, శాంతి, గ్రామ స్వరాజ్యం, హరిజనోద్ధరణే ధ్యేయంగా పెట్టుకున్న పవనార్‌ ఆశ్రమవాసి ఆచార్య వినోబా బావే, అనుంగు శిష్యుడు, ఆయనంతటి ప్రముఖుడుగా పేరొందిన ఆచార్య భన్సాలి, పోరాటం కన్నా శాంతే మేలని, తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా, సరిగ్గా నడవలేని స్థితిలో వుండి కూడా, వల్లభి గ్రామానికి వచ్చారు.

గ్రామానికొచ్చి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శాంతి యత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక దళితుడు పూజారిగా పనిచేస్తున్న స్థానిక రామాలయంలో దీక్షకు దిగారు. ఆయనకు అంతకు ముందు ఆ గ్రామం గురించి ఏ మాత్రం తెలియదు. ఆయనకు తెలియ చేయబడిందల్లా, ఆ గ్రామంలో, అగ్రవర్ణాల భూస్వాములకు, దళిత వర్గాల బీద వారికి మధ్య జరిగిన ఘర్షణలో, దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారని, వారు గ్రామంలోకి రావడానికి తాను పూనుకోవాలని మాత్రమే. అంతే, వెనుకా-ముందు చూడ కుండా, హుటాహుటిన బయల్దేరి, ఏ ఆర్భాటం చేయకుండా, నిరాహార దీక్షకు దిగారు. ఆయన డిమాండు నెరవేరింది. ఆ దీక్షకు, ఒక నిర్దుష్టమైన-సహేతుకమైన కారణం వుంది.

దళితులను గ్రామానికి రప్పించాలని, వారిని వెళ్లగొట్టిన అగ్రవర్ణాల వారిని కోరాడు. అంతే కాకుండా శాంతియుత వాతావరణంలో సహజీవనం సాగించాలన్న నిబంధననూ విధించాడు. చిట్ట చివరి దళితుడు గ్రామంలోకి వచ్చి ఇతరులతో సహజీవనం సాగించేంతవరకు తన దీక్ష విరమించేది లేదని శపధం చేశారు. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో కదిలిక వచ్చింది. నాటి గవర్నర్‌ ఖండూభాయ్ దేశాయి, ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి, ఆఘమేఘాల మీద సంధి ప్రయత్నాలు మొదలెట్టారు. సంధికి అంగీకరించాల్సిందెవరో కాదుకాంగ్రెస్‌లోని రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు, జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి. జిల్లా మంత్రుల సమక్షంలో గవర్నర్‌ముఖ్యమంత్రి భన్సాలి దీక్షను విరమింప చేసారు. నాటి నుంచి ఆ గ్రామంలో కొట్లాటలు జరిగిన దాఖలాలు లేవు.

రాష్ట్రంలో- బహుశా దేశంలోనే దళితుడు పూజారిగా ఉన్న మొదటి రామాలయం వల్లభి గ్రామంలో ఉంది. అప్పటి జాతీయ, అంతర్జాతీయ వార్తా పత్రికల్లో ఈ విశేషాలన్నీ ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. వల్లభి గ్రామ భూపోరాటంలో అక్కడి కమ్యూనిస్టులు దళితుల పక్షాన పోరు సల్పిన కాంగ్రెస్‌ వర్గానికి మద్దతిచ్చారు. 

వల్లభిలో అయితే పరిస్థితి మారింది కాని, ఆ ప్రాంత రాజకీయాలు మాత్రం హత్యా రాజకీయాలుగా, భౌతికంగా ఒక పార్టీ వారిని మరో పార్టీ వారు అనునిత్యం వెంటాడే స్థితికి చేరుకోసాగాయి. మళ్ళీ సమితి ఎన్నికలొచ్చే సరికి, ఆ ప్రాంతంలోని ప్రతి గ్రామ సర్పంచ్‌ ఓటు అత్యంత ప్రాముఖ్యంగా మారడం విశేషం. చివరకు శీలం వర్గం కాంగ్రెస్‌ సర్పంచుల సహకారంతో సిపిఎం సమితి పీఠాన్ని దక్కించుకుంది. అయితే అంతకుముందు, ఆ తర్వాత, చోటు చేసుకున్న పరిణామాల్లో, ఎంతోమంది కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ నేతలు హత్యకు గురయ్యారు. బాణాపురం గ్రామానికి చెందిన మార్క్సిస్ట్ నాయకుడు ముక్క చిన నర్సింహతో ఆరంభమైన హత్యాకాండ ఎంతో మందిని బలి తీసుకుంది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల మధ్య జరిగిన పోరులో సిపిఎం నాయకులు గంధసిరి గ్రామ వాసి గండ్ర వీరభద్రా రెడ్డి, బాణాపురం గ్రామవాసి గండ్లూరు కిషన్‌రావు, కాంగ్రెస్‌కు చెందిన మాజీ కమ్యూనిస్టు కోయ వెంకటరావుతో సహా చాలా మంది చనిపోయారు. పోలీసు క్యాంపులు ఆ ప్రాంతాల్లో అలవాటుగా మారిపోయాయి కొంత కాలం.


(ఆ వివరాలన్నీ మరో మారు).  

Friday, July 5, 2013

స్థానిక గ్రామ పంచాయితీ రాజకీయాలతో అనుబంధం: వనం జ్వాలా నరసింహారావు

స్థానిక గ్రామ పంచాయితీ రాజకీయాలతో అనుబంధం
వనం జ్వాలా నరసింహారావు

          1966 మార్చ్-ఏప్రిల్ నేలలో డిగ్రీ పరీక్షలు అసంపూర్తిగా రాయడం, ఎలాగూ ఫెయిల్ కాబోతుండడం, తక్షణం హైదరాబాద్‌లో చేయాల్సిన పనేమీ లేకపోవడం, నా మకాం హైదరాబాద్ నుంచి మా గ్రామం వనం వారి కృష్ణా పురంకు మార్చడానికి దారితీసింది. అంతకుముందు చిన్నతనం నుండీ మా గ్రామంలో వుంటున్నప్పటికీ, రాజకీయాల జోలికి పెద్దగా పోలేదు. కాని డిగ్రీ చదువు పూర్తైన తరువాత గ్రామానికి పోవడంతో, ఎందుకో, నాలో కొంత మార్పొచ్చింది. రాజకీయాలంటే ఆసక్తి కలగడం మొదలైంది. అంతకు రెండేళ్ల క్రితం (1964 లో), మా పక్క గ్రామం కమలాపురం సర్పంచ్‌గా, కాలేజీలో నా సీనియర్ సహచరుడు, బాబాయి వనం నర్సింగరావు, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. అలానే సమీపంలోని గ్రామాలైన బాణాపురం, గంధసిరి, మండవ, బుద్ధారం, చెర్వు మాధారం, అమ్మపేట, వల్లాపురం, చిరు మర్రి, ముదిగొండ, వల్లభి, నేలకొండపల్లి, ...తదితర గ్రామాలకు కూడా మా సమీప బంధువులో, లేక వారి ప్రతినిధులో సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. బాణా పురానికి గండ్లూరి కిషన్ రావు (నాకు మామయ్య), గందసిరికి గండ్ర వీర భద్రా రెడ్డి, మండవకు అయితరాజు పట్టాభిరాం రావు (మా సమీప బంధువు), బుద్ధారానికి వెంకటేశ్వర రావు (నాకు మామయ్య), చెర్వు మాధారానికి కొరుప్రోలు చిన వెంకటేశ్వర రావు (నాకు మామయ్య), అమ్మపేట-వల్లాపురానికి కోయ వెంకట రావు (మా పెదనాన్న-నాన్న సూచించిన మనిషి), ముదిగొండకు రావులపాటి సత్యనారాయణ రావు (మా బంధువు) గారి మనిషి, వల్లభికి మా మామగారు అయితరాజు రాం రావు గారు, నేలకొండపల్లికి పెండ్యాల సత్యనారాయణ రావు గారు...ఇలా మా బంధువులో, స్నేహితులో, వారి దగ్గరి వారో దాదాపు అన్ని గ్రామాలకు సర్పంచులుగా వుండేవారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ శీలం సిద్దారెడ్డి వర్గంగా, జలగం వెంగళరావు వర్గంగా చీలిపోయి, గ్రామ-గ్రామాన, ఒకరిపై మరొకరు కత్తులు దూసుకునే స్థితిలో వున్న రోజులవి. శీలం వర్గానికి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సి. పి. ఎం పక్షం, జలగం వర్గానికి సి. పి. ఐ మద్దతుగా వుండేవి. సమితి అధ్యక్షుడుగా జలగం వర్గానికి చెందిన మేడేపల్లి (మా మేనమామ స్వర్గీయ కంకిపాటి రాజేశ్వర రావు గారు పట్వారీగా వున్న గ్రామం) గ్రామ వాసి సామినేని ఉపేంద్రయ్య వుండేవాడు.

          మా గ్రామ సర్పంచ్‌గా పర్చూరి వీరభద్రయ్య గారుండేవారు. ఆయన మనసులో-భావాలలో కమ్యూనిస్ట్ అయినప్పటికీ, గ్రామ సర్పంచ్‌గా కావడం మటుకు కాంగ్రెస్ వారి ఆశీస్సులతోనే! జిల్లాలోని ఇతర గ్రామాలలో వున్న ఆయన సమీప బంధువులంతా కమ్యూనిస్ట్ పార్టీ వారే. మా వూరు ప్రజల్లో చాలా భాగం కమ్యూనిస్ట్ అభిమానులైనప్పటికీ, గ్రామ పెత్తందార్ల దాష్టీకం కింద భయంతో, గ్రామ రాజకీయాలలో తలదూర్చడానికి భయపడేవారు. వాళ్లను కూడగట్టి ఒక గొడుగు కిందకు చేర్చే వాళ్లు అప్పట్లో లేనందున, నోరు మూసుకుని, గ్రామ కాంగ్రెస్ పెద్దలు చెప్పిన మాటకు తల వంచి, వాళ్ళు సూచించిన అభ్యర్థినే ఏకగ్రీవంగా సర్పంచ్‌గా అంగీకరించే వారు. గ్రామంలో పోలీసు పటేల్ తుల్లూరి రామయ్య, మాలీ పటేల్ నీరు కొండ వెంకయ్య, వాళ్ల అనుయాయులైన చాగంటి వారి కుటుంబాలు, వారి మాట జవదాటని శివారు గ్రామ పెద్దలు వాడపల్లి రాజేశ్వర రావు గారు, పెత్తనం చెలాయించేవారు. మా నాన్న గారిని కూడా వారితో కలుపుకుపోయేవారు. నాన్న సమీపంలోని అమ్మపేట గ్రామ పట్వారీ అయినప్పటికీ, మా గ్రామంలోను పెద్ద మనిషి కిందే లెక్క. పంచాయితీ ఎన్నికల తేదీ ప్రకటించగానే, వీరంతా కలిసి (సాధారణంగా) మా ఇంట్లో సమావేశమయ్యేవారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా పర్చూరి వీరభద్రయ్య గారి పేరును సర్పంచ్‌గా ప్రతిపాదించి, గ్రామంలోని రచ్చ బండ దగ్గర ఆ పేరే ప్రకటించి, ఆయననే ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. ఎవరూ పోటీకి దిగే సాహసం చేయక పోయేవారు. అలా అప్పటికి మూడు-నాలుగు పర్యాయాలు జరిగింది. గ్రామంలో పటేల్ మీద, వాళ్ల మనుషుల మీద వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా వుండేది. సరిగ్గా ఆ రోజుల్లోనే నేను మా గ్రామం చేరుకున్నాను.

          మా గ్రామంలో మల్లెల అనంతయ్య అనే నిబద్ధతగల ఒక కమ్యూనిస్ట్ కార్యకర్త వుండేవాడు. అతడొకరకమైన మనిషి. ఎవరికీ భయపడేవాడు కాదు. గ్రామ పెద్దలు చెప్పే ప్రతిమాటకూ ఎదురు చెప్పేవాడు. ఐనా ఎవరూ అతడిని పెద్దగా పట్టించుకోక పోయేవారు. పంచాయితీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా, పోటీ చేస్తానని ముందుకొచ్చేవాడు. అతడి ప్రయత్నాలకు గ్రామ పెద్దలు అడ్డుపడేవారు. ఆతడికి పెద్దగా ఆస్తి-పాస్తులు లేవు కాబట్టి, జనం ఆయన వెంట (పోవాలని వున్నా) పోవడానికి జంకేవారు. గ్రామ పెద్దలతో పంచాయితీ పెట్టుకుని గ్రామంలో మనుగడ సాగించడం కష్టమని వూళ్లో ప్రజల భావనగా వుండేది. నేను గ్రామానికి రావడంతోనే, ఆపాటికే, అంతో-ఇంతో కమ్యూనిస్ట్ భావాలను కలిగి వున్న నన్ను కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చేపట్టాల్సిందిగా కోరాడు అనంతయ్య. దానికి కారణం లేకపోలేదు...ఒకటి నేను కమ్యూనిస్ట్ అభిమానిని కావడం...రెండోది నేను కూడా ఇతర గ్రామ పెద్దల లాగానే ఆస్తిపరుడిని కావడం. బహుశా నేను నాయకత్వం వహిస్తే కమ్యూనిస్ట్ అభిమానులు ధైర్యంగా నిలబడగలరని అనంతయ్య నమ్మకం కూడా కావచ్చు. నేను గ్రామానికి వచ్చిన మొదటి రోజుల్లోనే మా పొలం పక్క నుండి రోడ్డు వేసే విషయంలో నాకు, మా గ్రామ పటేల్‌కు కొంత వాదన అయింది. నా మాటకు విలువ ఇవ్వకుండా, తన పెత్తనం చెలాయించాడు పటేల్. నాకు కూడా అతడి మీద కొంచెం కోపం కలిగి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని వుండేది. కాకపోతే, మా నాన్న గారు, పటేల్ మంచి స్నేహితులు. మా ఇల్లు, వాళ్ల ఇల్లు ఎదురెదురుగా వుంటాయి. ప్రతి రోజు ఉదయం నాన్న గారు, పటేల్ రామయ్య కలవకుండా వుండక పోయేవారు. నాన్నకి కూడా వూళ్లో పెద్దలతో పంచాయితీకి దిగడం ఇష్టం లేక అందరితో మంచిగా వుండేవాడు. గ్రామ సర్పంచ్‌గా పర్చూరి వీరభద్రయ్య గారి పేరును నాన్నతోనే ప్రకటించేవారు. 

          ఇదిలా వుండగా, గ్రామ రాజకీయాలలో కొన్ని కీలకమైన ఘటనలు జరిగాయి. గ్రామంలో చాగంటి నారాయణ అనే ఒక వ్యక్తి తాగుడుకు బానిసై, వూళ్లో ఎవరినీ లెక్క చేయకుండా, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. "చాగంటి" ఇంటి పేరుగల కుటుంబాలు మా గ్రామంలో పది-పదిహేను దాకా వుండేవి. అన్నీ మధ్యతరగతి కుటుంబాలే. గ్రామంలోని ఒక బజారుని "చాగంటి వారి వీధి" అని కూడా పిలిచేవారు. వాళ్లంతా కలిసి కట్టుగా వుంటూ, అవసరమైతే ఎవర్నైనా ఎదిరించడానికి, కొట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుండేవారు. చాగంటి నారాయణ, గ్రామ పటేల్ తుల్లూరి రామయ్యకు, సన్నిహితంగా మసలేవాడు చాలా కాలం వరకు. పటేల్ అండ చూసుకుని గ్రామంలో అందరిమీద పెత్తనం చేసేవాడు. తాగకపోతే అంత ఉత్తముడు ఎవరూ లేరన్నట్లుగా వ్యవహరించేవాడు. అతడిని తన గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చేసేవాడు పటేల్ (సినిమా ఫక్కీలో). చివరకు పటేల్‌కు ఎదురు తిరిగాడు నారాయణ. ఒకరినొకరు బెదిరించుకునే దాకా పోయింది వ్యవహారం. గ్రామంలో తనను ఎదిరించేవాడు వుండడం సహించలేని రామయ్య ఎలాగైనా చాగంటికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అదృష్టవశాత్తు అతడి ప్రమేయం లేకుండానే, ఒక దసరా పండుగ నాడు, గ్రామంలో వుండే బత్తుల రాజులు అనే యువకుడు, సైకిల్ చైన్‍తో చాగంటిని చితకబాదాడు. వారిద్దరికీ ఏదో విషయంలో తగాదా వచ్చి ఆ పని చేశాడు రాజులు. "శత్రువు శత్రువు మిత్రుడు" అన్న సామెత ప్రకారం ఆ సంఘటనలో రాజులుకు వత్తాసు పలికిన పటేల్ మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశాడు. చాగంటి వారి కుటుంబాలు కూడా ఆ రోజున నారాయణకు మద్దతుగా రాకపోవడానికి కారణం అతడికి ఏ విధంగానైనా కనువిప్పు కలగాలనే. మర్నాడు హూంకరించుకుంటూ పటేల్ ఇంటి మీదకు యుద్ధానికి వచ్చిన నారాయణను మరింత నిర్వీర్యం చేశాడు పటేల్. గ్రామంలో ఇక ముందెన్నడూ నారాయణను పెత్తనం చేయనివ్వనని స్పష్టం చేశాడు. పటేల్‌కు, చాగంటి నారాయణకు ఆ విధంగా పూర్తిగా బెడసి కొట్టింది.

అదే రోజుల్లో, రకరకాల కారణాల వల్ల, గ్రామంలోని మరో మోతుబరి రైతు, బత్తుల సురేందర్ (తరువాత రోజుల్లో వాళ్ల అబ్బాయి ఆదినారాయణ గ్రామ సర్పంచ్‌గా చేశాడు) పటేల్ రామయ్య మీద పగ పెంచుకున్నాడు. ఇలా గ్రామంలో ఒకరి వెంట మరొకరు బహిరంగంగా-కొంత ధైర్యంగా పటేల్‌కు వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందుకు రాసాగారు. నన్ను వాళ్లల్లో కలుకుని వ్యూహం పన్న సాగారు. నేను కూడా రాజకీయాలపై మక్కువతో కొంత, కమ్యూనిస్ట్ పార్టీపై అభిమానంతో కొంత వాళ్లకు అనుకూలంగా వుండసాగాను. దీనికి తోడు, పక్క గ్రామంలో వున్న బాబాయి నర్సింగరావు, బాణాపురం సర్పంచ్ గండ్లూరి కిషన్ రావు, వల్లాపురంలో వుండే పెదనాన్న వనం శ్రీ రాం రావు గారు, గోకినేపల్లి వాస్తవ్యుడు-జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ (సి. పి. ఎం) నాయకుడు రావెళ్ల సత్యం గారి ప్రోత్సాహం మాకు లభించింది. ఎన్నేళ్లగానో మా వూరిని కమ్యూనిస్ట్ పార్టీ పరం చేయాలని అనుకుంటుండే వాళ్లకు ఇదో మంచి అవకాశంగా దొరికింది. గ్రామానికి చెందిన పర్చూరు రఘుపతి, చేబ్రోలు సత్యం, పటేల్ మీద కోపంగా వున్న చాగంటి నారాయణ, వాళ్ల కజిన్ చాగంటి సత్యం, దమ్మాలపాటి వీరయ్య, దేవబత్తుల పుల్లయ్య, దళిత వాడల నాయకులు కొందరు మాతో చేతులు కలిపారు. వాస్తవానికి మా గ్రామంలో కమ్యూనిస్ట్ ఓటర్లే ఎక్కువగా వుండేవారు. బయటపడడానికి భయపడే వాళ్లు. మొత్తం మీద వీరందరినీ ఒక తాటిమీదకు తెచ్చే బాధ్యత నెత్తి నేసుకున్నాడు మల్లెల అనంతయ్య. అందరూ కలిశారు. కలిసి వుండాలని "పసుపు బియ్యాల" తో ప్రమాణం చేశారు. నాన్న గారికి నేనలా వారితో కలిసి పని చేయడం ఇష్టం లేదు. నన్ను చాలా సార్లు మందలించారు కూడా. ఇంతలో పంచాయితీ ఎన్నికలు రానే వచ్చాయి.

          అప్పట్లో మూడంచెల పంచాయితీ వ్యవస్థ వుండేది. గ్రామంలో మొదలు ఎన్నికలు జరిగేవి. తొలుత "వార్డు సభ్యులను" ఎన్నుకునేవారు. ఓటింగ్ వార్డు వారీగా జరిగేది. అదే రోజు సాయంత్రం గెలిచిన వార్డు సభ్యులంతా సాధారణ మెజారిటీ పద్ధతిలో సర్పంచ్‌ను ఎన్నుకునేవారు. కొద్ది రోజుల తరువాత, సర్పంచ్ లంతా కలిసి సమితి అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. ముందుగా సమితికి ఆరుగురు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుని, అందరూ కలిసి సమితి అధ్యక్షుడిని రహస్య బాలెట్ ద్వారా ఎన్నుకునేవారు. వివిధ కారణాల వల్ల ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ నాయకులను కో-ఆప్ట్ చేసుకుంటారు. కో-ఆప్ట్ చేసుకున్న సభ్యులకు కూడా సమితికి పోటీ చేసే అర్హత వుంటుంది. ఆ తరువాత సమితి అధ్యక్షులంతా కలిసి ఇదే ప్రక్రియలో జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. అక్కడా కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునే పద్ధతి వుంటుంది. జడ్. పి. చైర్మన్ గా పిలువబడే ఆ వ్యక్తిది చాలా పవర్ ఫుల్ హోదా. మన రాష్ట్రంలో కాబినెట్ మంత్రులుగా వుంటూ రాజీనామా చేసి, కొందరు జిల్లా పరిషత్  అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భాలున్నాయి. జడ్. పి. చైర్మన్లకు, ఎంత పలుకుబడి-ప్రాబల్యం వుండేదంటే, వాస్తవానికి వాళ్ల అంగీకారం లేకుండా ముఖ్య మంత్రి కావడం కూడా కష్టంగా వుండేదారోజుల్లో. ఒకే ఒక్క గ్రామ సర్పంచ్ జిల్లా పరిషత్ ఎన్నికల భవితవ్యాన్ని కూడా మార్చగలిగే స్థితిలో వుండేవారు అప్పుడప్పుడూ. సమితిలో ఒక్క ఓటుతో అదృష్టం తారుమారయ్యేది. అదే ఒక్క ఓటు జడ్. పి. లో కీలకమయ్యేది. ఖమ్మం జడ్. పి. లో అలా జరిగింది కూడా.

          మా గ్రామ పంచాయితీలో అప్పట్లో తొమ్మిది వార్డులుండేవి. చాగంటి నారాయణను తాగుడు మానేయాలని నిబంధన విధించాం. అలా చేస్తే ఎన్నికల తరువాత అతడే సర్పంచ్ అని హామీ ఇచ్చాం. నేను పోటీ చేయాలంటే నాకింకా ఓటింగ్ వయసు రాలేదప్పటికి. కంకిపాటి హనుమంతరావు (అడ్వకేట్) ను బరిలో వుండమంటే అయన అంగీకరించలేదు. ఇంతలో బత్తుల సురేందర్ పసుపు బియ్యాల ప్రమాణం మరిచిపోయి మా వ్యతిరేక (పటేల్) కాంగ్రెస్ పార్టీ గ్రూప్‍లో చేరి పోయాడు. చాగంటి నారాయణ పోటీ చేసిన వార్డులోనే ఆయనా పోటీకి దిగాడు. ఆయన సోదరుడు, వూరంతటికీ మంచివాడని పేరున్న బత్తుల సత్యనారాయణ "రైతులందరు" వుండే వార్డులో పోటీకి దిగాడు పటేల్ పక్షాన. మల్లెల అనంతయ్య, చేబ్రోలు సత్యం, దమ్మాలపాటి వీరయ్య, దేవబత్తుల నాగేశ్వర రావు, తిరుపతయ్య...తదితరులు కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన (ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవి) వార్డు మెంబర్లుగా పోటీ చేసారు. ఒక్క బత్తుల సత్యనారాయణ పోటీ చేసిన వార్డు మినహా, మిగతావన్నీ మాకే దక్కాయి. చివరి క్షణం వరకూ మా వార్డు మెంబర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసారు వాళ్లు. చివరకు చాగంటి నారాయణ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఎన్నికలు జరగడానికి ఒక రోజు ముందు, మా ఇంటి మీద, నా పై దాడికి దిగారు ప్రత్యర్థులు. వాళ్లకు తెలియకుండా, కన్ను కప్పి, పక్క వూరు కమలాపురం పోయి, అక్కడ నుంచి, సహాయంగా కొందరిని తెచ్చుకోవాల్సి వచ్చింది.

          చాగంటి నారాయణను గ్రామంలో ఎన్నటికీ పెత్తనం చేయనీయనన్న పటేల్ మాట చెల్ల లేదు. కాకపోతే...దీనికి ముగింపు వేరే విధంగా జరిగింది. అచిర కాలంలోనే...తాగుడుకు మరోసారి బానిసైన నారాయణ మళ్లీ పటేల్ పక్షంలో చేరి పోయాడు. కమ్యూనిస్టులకు నిరాశే మిగిలింది. అదెలా జరిగిందంటే....మా గ్రామ పంచాయితీతో పాటే ఇతర గ్రామాలకు కూడా ఎన్నికలు జరిగాయి. పక్కనున్న వల్లాపురం-అమ్మపేట ఉమ్మడి గ్రామ పంచాయితీ ఎన్నిక మాత్రం వాయిదా పడింది. సగం గ్రామాలు కమ్యూనిస్ట్ (సి. పి. ఎం)-శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్ వర్గాలు గెలుచుకున్నాయి. సమితి దక్కించుకోవడానికి, ఇంకొక పంచాయితీ అవసరం, అటు శీలం వర్గానికి (సి. పి. ఎం మద్దతుతో), ఇటు జలగం వర్గానికి (సి. పి. ఐ మద్దతుతో) వుంది. వల్లాపురం ఎన్నిక కీలకమై పోయింది. ఖమ్మం సమితి ఎవరు గెలుస్తే, వారి పక్షమే జడ్. పి. గెలుచుకునే పరిస్థితి నెలకొంది. ఓ వారం రోజుల్లో వల్లాపురం ఎన్నిక జరిగింది. జిల్లాకు చెందిన అన్ని పార్టీల నాయకులు, అతిరథ-మహారథులు, అందరూ వల్లాపురం చేరుకున్నారు. మా పెదనాన్న సారధ్యంలో ఆ గ్రామ పంచాయితీకి, మరో పెదనాన్న కుమారుడు వనం వరదా రావు (సిద్ధారెడ్డి వర్గానికి చెందిన) ఎన్నికయ్యాడు. అప్పటికింకా సమితి ఎన్నిక ఐదారు రోజులే వుంది. వల్లాపురం ఎన్నిక కావడంతోనే జలగం, శీలం వర్గాలు తమ తమ సర్పంచ్‌లతో "క్యాంపులు" పెట్టే చర్యలు చేపట్టారు. ఆ క్యాంపుకు మా గ్రామ సర్పంచ్ చాగంటి నారాయణ కూడా వెళ్లాలి. అప్పుడే పేచీ పెట్టాడు వెళ్లనని. అప్పటికే మా గ్రామ పటేల్‌తో రహస్య ఒప్పందం కుదిరుండాలి! చివరికి బలవంతం మీద వెళ్లక తప్పలేదు. క్యాంపులోనే తాగుడికి అలవాటు పడ్డాడని కొందరంటారు.

          పద్ధతి ప్రకారం నిర్ధారించిన తేదీ నాడు ఖమ్మం సమితి అధ్యక్ష ఎన్నికకు సర్వం సిద్ధమైంది. తొలుత కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగాలి. ఇరు పక్షాలకు, ఎవరి లెక్క ప్రకారం వారికి, ఒకే ఒక్క ఓటు మెజారిటీ. మా గ్రామ సర్పంచ్ చాగంటి నారాయణను, ఇరు వర్గాల వారు తమ ఓటు కింద వేసుకున్నారు. చాగంటి నారాయణ కూడా తెలివిగా వ్యవహరించడం మొదలెట్టాడు. మొదటి కో-ఆప్టెడ్ సభ్యుడిగా శీలం-సి. పి. ఎం అభ్యర్థి గెలిచాడు. రెండవ అభ్యర్థిగా గోకినేపల్లి గ్రామానికి చెందిన, ప్రముఖ సి. పి. ఎం నాయకుడు రావెళ్ల సత్యం, శీలం-సి. పి. ఎం పక్షాన పోటీలో వున్నాడు. చాగంటి అతడికి ఓటు వేయకపోవడంతో ఓడి పోయాడు. గెలిచినట్లయితే అతడే సమితి అధ్యక్ష అభ్యర్థి. తెలివిగా ఆయనను ఓడించారు ప్రత్యర్థులు. ఆ సమయంలో చాగంటికి వార్నింగ్ పోయింది. గీత దాటితే పరిస్థితులు తీవ్రంగా వుంటాయన్న హెచ్చరికలు పోయాయి. మొత్తం మీద, ఆ తరువాత నాలుగు కో-ఆప్టెడ్ సభ్యులుగా శీలం-సి. పి. ఎం గ్రూపు వారే ఎన్నికయ్యారు. వారిలో రాయల వీరయ్య ఒకరు. ఓటమికి గురి కాబోతున్న జలగం గ్రూపు అభ్యర్థి సామినేని ఉపేంద్రయ్య, శీలం గ్రూపు కాంగ్రెస్ వారిని తనకు మద్దతు ఇవ్వమని వేడుకున్నా ఫలితం లేకపోయింది. రాయల వీరయ్య సమితి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఉపేంద్రయ్య గ్రూపు ఆ తరువాత ఎన్నికను బాయ్ కాట్ చేయడంతో, బాణాపురం గ్రామ సర్పంచ్ గండ్లూరి కిషన్ రావు ఉపాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వీరయ్య ఎన్నికను కోర్టులో సవాలు చేశారు. తాత్కాలికంగా ఎన్నిక రద్దు అయింది. కిషన్ రావు ఇన్-ఛార్జ్ అధ్యక్షుడుగా చాలాకాలం పని చేశారు. ఆ సారి జడ్. పి. కూడా శీలం వర్గానికే దక్కింది.        

          తన పదవీ కాలం పూర్తిగా ముగియకుండానే, చాగంటి నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన స్థానంలో ఉప సర్పంచ్ గా ఎన్నికైన కమ్యూనిస్ట్ మల్లెల అనంతయ్య సర్పంచ్ అయ్యాడు.
అదో అనుభవం....