హైదరాబాద్
నగరంలో తొలి అనుభవాలు
కాలేజీ
కబుర్లు-Part FOUR
వనం జ్వాలా నరసింహారావు
నేను
హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నప్పుడే (చనిపోయిన) వనం రంగారావు
(నర్సింగరావు తమ్ముడు) ఉస్మానియా బి-హాస్టల్ లో వుంటూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుతో ఎం. ఏ చదువుతుండేవాడు. ఆయనను కలవడానికి తరచుగా
యూనివర్సిటీ కాంపస్‌కు వెల్లే వాళ్లం. అక్కడ ఆయన ద్వారా
పరిచయమైన ఆయన స్నేహితులలో ప్రొఫెసర్ హరగోపాల్ (ప్రముఖ పౌర హక్కుల నాయకుడు) ఒకరు.
సోషాలజీ డిపార్టుమెంటులో పని చేస్తున్న ప్రొఫెసర్ రాఘవేంద్ర రావు
కూడా అలానే పరిచయమయ్యారు. రంగారావు మరో క్లాస్ మేట్
వాసిరెడ్డి శివలింగ ప్రసాద్ (ఇందిరా గాంధి సార్వత్రిక విశ్వ
విద్యాలయం ప్రొ-ఛాన్సలర్ గా పదవీ విరమణ చేశారు) కూడా అప్పుడే పరిచయం. రంగారావు కంటే ఒక ఏడాది
జూనియర్ ఐన డాక్టర్ శ్రీధర్ రెడ్డి (ప్రముఖ కాంగ్రెస్
నాయకుడిప్పుడు-తెలంగాణ ప్రజా సమితి ఆవిర్భావంలో కీలక పాత్ర
పోషించాడు) కూడా అప్పుడే పరిచయం అయ్యాడు. శ్రీధర్ రెడ్డి విద్యార్థి నాయకుడు కూడా. యూనివర్సిటీ
ఆర్ట్స్ కాలేజీకి, యూనివర్సిటీకి విద్యార్థి సంఘ
అధ్యక్షుడుగా కూడా ఆ రోజుల్లో ఎన్నికయ్యాడు. నాకంటే ఒక
సంవత్సరం సీనియర్. వీరే కాకుండా రంగారావు కంటే ఒక ఏడాది
సీనియర్ ఐన బొమ్మకంటి శంకర్ రావు (పాత తరం ప్రముఖ కాంగ్రెస్
నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు గారి కుమారుడు) కూడా
కామన్ స్నేహితుల ద్వారా పరిచయం అయ్యారు. శంకర్ రావు ఐ.
పి.ఎస్. అధికారిగా
సీనియర్ పొజీషన్ లో రిటైర్ అయ్యారు. బొమ్మకంటి గారి
తోడల్లుడు, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కె. ఎల్. నరసింహా రావు గారు బావ మరిది నేదునూరి దుర్గా
ప్రసాద్ (వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పని చేసేవారు)
కూడా అలానే వూటుకూరు వరప్రసాద్ ద్వారా ఆ రోజుల్లో పరిచయం అయ్యారు.
మేం (నేను, రూమ్మేట్ రమణ,
వనం రంగారావు) బాగా స్నేహం చేసిన వారిలో సిటీ
కాలేజీలో పని చేస్తున్న సోమేశ్వర రావు గారు కూడా వున్నారు. ఆయన
ఖమ్మం కాలేజీలో కెమిస్ట్రీ డిమాన్ స్ట్రేటర్ గా పని చేసి బదిలీపైన హైదరాబాద్ సిటీ
కాలేజీకి వచ్చారు. అక్కడ పని చేస్తూ ఆ తరువాత కాలంలో ఎం.
ఏ (పొలిటికల్ సైన్స్) పట్టా
పుచ్చుకున్నారు. సిటీ కాలేజీలోనే కెమిస్ట్రీ లెక్చరర్‌గా పని
చేసే పరిమళ గారితో సోమేశ్వర రావు గారి పరిచయం ప్రేమ వరకూ-పెళ్లి
చేసుకునే వరకూ పోయింది. ఐతే, పెద్దల
నుంచి అంతగా సానుకూలత రాకపోవడంతో, మేమే పెళ్లి పెద్దలమై,
యాదగిరిగుట్టలో వారి పెళ్లి జరిపించాం. పరిమళా
సోమేశ్వర్ గారు ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి. వారందరితో నా
దూరపు స్నేహం ఇంకా కొనసాగుతూనే వుంది.
ఇక్కడ వనం రంగారావు గురించి కొంత చెప్పుకోవాలి. మా పక్క గ్రామం
కమలాపురం ఆయనది. నాకు వరసకు బాబాయి అవుతాడు. వయసులో రెండు-మూడేళ్లు పెద్ద.
కాలేజీలో సీనియర్. బాగా కష్టపడి చదివేవాడు. ఆయనకు, ఆయన అన్న గారైన నర్సింగరావుకు,
భావాల్లో కొంత తేడా కనిపించేది. ఐతే ఇద్దరూ వ్యక్తిగతంగా చాలా మంచి
స్వభావం కలవారే. నేను ఖమ్మంలో పియుసిలో చేరిన సంవత్సరం రంగారావు బి. ఏ. రెండో
సంవత్సరం చదువుతుండేవాడు. వాళ్లన్నయ్య లాగా కాలేజీ రాజకీయాలలో ఎక్కువగా పాల్గొనక
పోయేవాడు. ఎంత సేపటికీ చదువు మీదే శ్రద్ధ. బి.ఏ. ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు ఎస్. ఆర్. అండ్. బి. జి. ఎన్. ఆర్ కాలేజీ
మాగజైన్‍కు ఎడిటర్‌గా కూడా ఎంపికయ్యాడు. నేను హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో
డిగ్రీ రెండో సంవత్సరం చేరినప్పుడు, ఆయన ఎం. ఏ లో చేరాడు.
రెండేళ్ల తరువాత ఎం. ఏ ఫస్ట్ క్లాస్‍లో పాసై, సివిల్స్ పరీక్షలకు తయారవుండేవాడు. నా రూమ్మేట్ రమణకు చాలా దగ్గర బంధువు.
శెలవుల్లో (1967) ఒకసారి రమణ
వూరు కల్మలచెర్వుకు వెళ్లాడు. అక్కడ ఒకనాడు పొలంలో నడుస్తున్నప్పుడు చిన్న దుంప
గుచ్చుకుంది. కొద్ది రోజులకు అది చిన్న పుండుగా మారింది. దానికి వైద్యం
చేయించుకునేందుకు డాక్టర్ దగ్గరకు వెళ్తే పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్
ఇచ్చిన చోట పెద్ద పుండై, రణంగా మారి, హఠాత్తుగా
"టెటనస్" వ్యాధికి దారితీసింది. ఖమ్మం యలమంచిలి రాధా కృష్ణమూర్తి
ఆసుపత్రిలో చేర్పించడం, చనిపోవడం ఒకే రోజు జరిగిపోయాయి.
అప్పటికే రంగారావుకు వివాహం ఐంది కాని కాపురం మొదలెట్టలేదు. మా సమీప గ్రామం బాణాపురం
వాస్తవ్యుడు, ఖమ్మంలో మా ఇంటి పక్కనే వుండే గండ్లూరి నారాయణ
రావు గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఉజ్వలమైన భవిష్యత్ వున్న ఒక వ్యక్తి అలా
అకాల మరణం చెందాడు.
Osmania University Ats College
నేను
డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల
మధ్య, ఉపకులపతి (వైస్ ఛాన్స్ లర్) డి. ఎస్. రెడ్డి వ్యవహారంలో బాగా గొడవలు జరిగాయి. ఒక గ్రూపుకు నేటి కేంద్ర
మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, (మొన్నటి వరకూ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు...ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి
ప్రధాన కార్యదర్శి) కె. కేశవరావు మార్గదర్శకత్వం వహించగా, మరొక
గ్రూపుకు నాటి విద్యార్థి నాయకులు ఎం. శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి,
(జన సంఘ్) నారాయణ దాస్, కమ్యూనిస్టు పార్టీ
అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు నాయకత్వం వహించారు. 1966 లో, నాటి
రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, 1957 నుంచి ఉపకులపతిగా పని
చేస్తున్న డి. ఎస్. రెడ్డిని పదవి నుంచి
తప్పించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు కాలేజీ ప్రిన్సిపాల్
(పేరు గుర్తుకు రావడం లేదు) ను నియమించడం కూడా జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకోవడానికి
రావడం, విద్యార్థుల ఆందోళన మధ్య వెనక్కు తిరిగిపోవడం నా కింకా గుర్తుంది. బ్రహ్మానందరెడ్డి
తీసుకున్న చర్యకు మద్దతుగా జైపాల్ రెడ్డి, కేశవరావులు
ఉద్యమించగా, వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు ఉద్యమించారు.
ఇంతకు, డి. ఎస్. రెడ్డి చేసిన తప్పేంటి అంటే...ఆయన ఉస్మానియా
యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కావాలని ప్రతిపాదించడమే! అది నచ్చని బ్రహ్మానందరెడ్డి
ఉపకులపతిని తొలగించడానికి చట్టాన్ని సవరించే ప్రయత్నం కూడా చేశాడు. డి.ఎస్. రెడ్డి హైకోర్టుకు, సుప్రీం
కోర్టుకు న్యాయం కోసం వెళ్లాడు. చివరికి కోర్టులో ఆయన పక్షానే తీర్పు వచ్చింది. 1969 వరకు ఆయనే వైస్ ఛాన్స్
లర్‍గా కొనసాగారు. 1968
లో
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అంకురార్పణ జరుగుతున్నప్పుడు ఆయనే వైస్ ఛాన్స్ లర్.
ఉద్యమం వూపందుకునే సరికి రావాడ సత్యనారాయణ ఆయన స్థానంలో వచ్చారు. వైస్ ఛాన్స్ లర్‍గా
డి.ఎస్. రెడ్డి కొనసాగించాలని న్యాయస్థానం తీర్పు
ఇచ్చిన నేపధ్యంలో, డిగ్రీ విద్యార్థులకు పరీక్షల్లో
"గ్రేస్ మార్కులు" ప్రకటించింది యూనివర్సిటీ. నేను పరీక్ష రాయకపోయినా,
కేవలం హాజరైనందుకు నాకు అన్ని సబ్జెక్టుల్లో 15 మార్కులొచ్చాయి!
నా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు మార్చ్-ఏప్రిల్ 1966 లో జరిగాయి. నేను
లెక్కల పేపర్ రాసిన తరువాత మంచి మార్కులు రావని భావించి, మిగతా పేపర్‌లకు
కేవలం హాజరవడం (పరీక్ష పేపర్లు తెచ్చుకోవడానికి) తప్ప రాయలేదు. ఫలితాలు
ఊహించినట్లే ఫెయిలయ్యాను. కాకపోతే రాసిన ఒక్క లెక్కల సబ్జెక్టులో పాసయ్యాను. ఆ
తరువాత సప్లిమెంటరీ పరీక్షలు రాయలేదు. మళ్లీ హైదరాబాద్‌లో చిక్కడపల్లిలో ఒక చిన్న
ఇల్లు అద్దెకు తీసుకుని రమణ, నేను మరో స్నేహితుడు
వుండేవాళ్లం. ఐతే, నేను ఎక్కువగా మా వూళ్లోనే వుంటూ, మధ్య-మధ్య వచ్చి పోతుండేవాడిని. గ్రామ రాజకీయాలలో చురుకైన పాత్ర
పోషించేవాడిని. ఆ విషయాలు ముందు..ముందు రాస్తాను. చిక్కడపల్లిలో వుండే రోజుల్లోనే,
సమీపంలో, ఒక మేడపైన, వూటుకూరు
అనంత రామారావు, సూర్య ప్రకాశరావు వుంటుండేవారు. వాళ్లిద్దరూ
ఉద్యోగాలు చేస్తుండేవారు. వారితో పాటు రావులపాటి సీతారాం రావు కూడా వుండేవారు.
మేమంతా తరచుగా కలుస్తుండేవాళ్లం. అనంత రామారావు పేరుకు ఇంజనీరైనా, జనరల్ విషయాలను-వర్తమాన రాజకీయాలను, చాలా చక్కగా
విడమర్చి మాట్లాడుతుండేవాడు. ప్రస్తుతం అనంత రామారావు అమెరికాలోని షికాగోలో
స్థిరపడ్డారు. మధ్య మధ్య హైదరాబాద్ వచ్చి స్నేహితులతో బంధువులతో కాలక్షేపం చేసి
పోతుంటారు. సీతారాం రావు సీనియర్ పోలీసు (ఐ. పి.ఎస్) అధికారిగా పదవీ విరమణ చేశారు.
నేను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పని చేస్తున్నప్పుడు,
సీతారాం రావు అక్కడ తన చివరి పోస్టింగ్ చేశారు. అదనపు డైరెక్టర్ జనరల్‌గా
పదవీ విరమణ అక్కడే చేశారు.
ఇక్కడ అన్నింటికన్నా ముఖ్య విషయం ....ఒక ముఖ్యమైన వ్యక్తి విషయం
తెలియచేయాలి. నేనింతకు ముందే రాశాను...ఎల్. వి. ఎస్. ఆర్. శర్మ గురించి. వాడు నాకు
హెచ్. ఎస్. సి వరకు, ఆ తరువాత పియుసిలో క్లాస్ మేట్. "నా"
అనేవాడెవరూ లేని మనిషి. ఖమ్మంలో చిన్నప్పుడు వరసకు మేనత్తగారింట్లో వుండి
చదువుకునేవాడు. వాళ్లతో గొడవపడి మొదట్లో కొంతకాలం తాత్కాలికంగా హెచ్. ఎస్. సి లో వున్నప్పుడు, ఆ
తరువాత శాశ్వతంగా పియుసిలో చేరాక వాళ్లింటి నుంచి బయటకొచ్చాడు. వారాలు చేసుకుని
ఖమ్మంలో పియుసి పూర్తి చేశాడు. బహుశా పాసవ్వలేదనుకుంటా. ఆ తరువాత విజయవాడకు
చేరాడు. కొన్నాళ్లు మద్రాస్‌లో వుండేవాడు. బహు బాషా కోవిదుడు...ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు అనర్గళంగా మాట్లాడేవాడు. విజయవాడ,
మద్రాస్ లలో అనేక ఉద్యోగాలు చేశాడు. వాడికి ఒకానొక సందర్భంలో ఆ
ఉద్యోగాలేవీ నచ్చలేదు. నేను హైదరాబాద్‌లో చిక్కడపల్లిలోని ఇంట్లో రమణ, రంగారావులతో వుంటున్నప్పుడు, తనకే దన్నా ఉద్యోగం
ఇప్పించమని, హైదరాబాద్ వస్తానని ఉత్తరం రాశాడు.
సరే...రమ్మన్నాను. తాజ్ మహల్ హోటల్లో లెక్కల పద్దు రాసే ఉద్యోగాన్ని మిత్రుడు
కామత్ ఇప్పించాడు. కాని...అది వాడికి నచ్చలేదు. మేం తెప్పించుకునే కారేజీ
భోజనంలోనే వాడు కూడా సర్దుకుపోయేవాడు. చివరకు "తద్దినం బ్రాహ్మణుడి"
అవతారం ఎత్తాడు. చిక్కడపల్లి స్వరాజ్ హోటెల్ దగ్గరున్న బ్రాహ్మణుల "అడ్డ"
కు పోయి ఉదయాన్నే కూర్చుండేవాడు. అంతకు ముందు రూమ్‌లో స్నానం చేసి, గోడకున్న సున్నాన్ని "విభూతి" లాగా పెట్టుకునేవాడు. చేతికందిన
పూజల పుస్తకాన్ని పట్టుకు పోయేవాడు. బ్రాహ్మణుల అడ్డ దగ్గరకు "బ్రాహ్మణీకం"
అవసరాలున్న వ్యక్తులెందరో వచ్చేవారు ఉదయాన్నే. వాళ్ల అవసరాలకు అనుగుణంగా, వీడు "భోక్త" గానో, "తద్దినం
పెట్టించే బ్రాహ్మణుడు" గానో, వ్రతాలు చేయించే
"పూజారి" గానో అవతారం ఎత్తేవాడు ఆ పూటకు. మొత్తం మీద ఆ పూటకు భోజనం,
కొంత "సంభావన" గిట్టేది. సంభావనతో రాత్రి భోజనం
కానిచ్చేవాడు. ఏ పనీ దొరకని నాడు మాతోనే భోజనం. అలా కొన్నాళ్లు చేసి, మళ్లీ మద్రాస్ వెళ్లి పోయాడు. పెళ్లి చేసుకున్న తరువాత విజయవాడలో స్థిరపడి
పోయాడు. దానికంటే ముందు కొన్నాళ్లు గయ దగ్గర ఒక ఆయుర్వేద కంపెనీలో పని చేశాడు.
అక్కడ నుంచి ఎప్పటికీ దాచిపెట్టుకునే రీతిలో చక్కటి ఉత్తరం రాశాడు. విజయవాడలో
కొన్నాళ్లు మద్యం వ్యాపారుల దగ్గర పని చేసేవాడు. ఆ తరువాత చిన్న హోటెల్
ప్రారంభించాడు. ఓ పది సంవత్సరాల క్రితం హఠాత్తుగా చని పోయాడు.
మొత్తం మీద రెండు-మూడు ప్రయత్నాల తరువాత, మార్చ్
1968 లో లెక్కలు, భౌతిక
శాస్త్రం, సెప్టెంబర్ 1968 లో రసాయన శాస్త్రం
కంపార్ట్ మెంటల్ గా డిగ్రీ పాసయ్యాను. అలా నా హైదరాబాద్ చదువు-నివాసం ప్రధమ ఘట్టం
పూర్తయింది.
Ravindranath Muthevi:
ReplyDeleteజ్వాలా గారూ !
మీ మిత్రులు ఎల్.వి.యస్.ఆర్. శర్మ గారి ఉదంతం జీవితం యొక్క చేదైన పార్శ్వాన్ని చూపేదిగా ఉంది. ఆయన గోడకు వేసిన సున్నంతో విభూతి రేఖలు దిద్దుకుని తద్దినపు బ్రాహ్మణుడి అవతారం ఎత్తి ఎలాగోలా జీవించేందుకు యత్నించడం, 'విజయ' వారి 'రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్' చిత్రంలో పెట్టుడు అడ్డబొట్లతో బ్రాహ్మణుడై హోటల్ యజమాని అవతారమెత్తిన దళిత క్రిస్టియన్ పాత్రను గుర్తుకు తెచ్చింది.( ఆ చిత్రంలో ఈ పాత్రను కీ.శే.కొంగర జగ్గయ్య గారు ధరించారు.) శర్మగారి నిజాయతీ చూసో, ఆయన సామర్థ్యం చూసో ఆయనకు జీవనోపాధి కల్పించడానికి ముందుకురాని సమాజం ఆయన వేసిన పురోహితుడి వేషానికి ప్రాధాన్యమిచ్చి, ఆయన చేతిలో అమాయకంగా మోసపోవడానికి మాత్రం ముందుండడం చిత్రం. ఆయన గయ నుంచి రాసిన అపురూపమైన లేఖలో మరీ వ్యక్తిగతమైన విషయాలు లేకుంటే, దాన్ని కూడా మీ 'ఆత్మకథ' చదువరుల ముందుంచితే బాగుంటుందేమో ఆలోచించండి.
ధన్యవాదాలతో-- మీ.....రవీంద్రనాథ్.
Bhandaru Srinivasrao:
ReplyDeleteశర్మ ఉదంతం చాలా గొప్పది. బెజవాడలో వైన్ షాపులో పనిచేసేటప్పుడు, రైలు స్టేషన్ సమీపంలో చిన్న హోటల్ నడిపేటప్పుడు నాకు తెలుసు. చాలా ఆత్మాభిమానం కలవాడు. ఎవరినీ చేయిచాచి అడగలేదు. పెద్ద మనసు కలవాడు కనుకనే చిన్నతనంలోనే కన్నుమూసాడు. అలాటివాడు క్లాస్ మేట్ అని చెప్పుకోవడానికి గర్వపడతాను. అతడు గయ నుంచి రాసిన ఉత్తరం అతడి వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. భార్యా పిల్లలు ఎక్కడ వున్నారో, ఎలా వున్నారో. ఖచ్చితంగా బాగానే వుండి వుంటారు. ఎందుకంటె వాళ్ళు శర్మ కుటుంబ సభ్యులు కాబట్టి.