Wednesday, July 17, 2013

డబ్బై దశకంలో భూస్వాముల దాడులు-కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు: వనం జ్వాలా నరసింహారావు

డబ్బై దశకంలో భూస్వాముల దాడులు
కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు
వనం జ్వాలా నరసింహారావు

          డబ్బై దశకంలో మా చుట్టు పక్కల గ్రామ పంచాయితీలున్న పాలేరు సమితి, ఖమ్మం పంచాయితీ సమితిగా మారడం, మా గ్రామాలన్నీ అందులోకి రావడం జరిగింది. సమితి సభ్యులలో గణనీయమైన సంఖ్య కలిగి వున్న కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) బలమైన ప్రతి పక్షంగా వ్యవహరిస్తుండేది. జిల్లా రాజకీయాలకు సంబంధించినంతవరకు, కాంగ్రెస్ పార్టీ రెండు ముఠాలుగా చీలిపోయి, ఒక వర్గం శీలం సిద్దారెడ్డి నాయకత్వంలో, మరో వర్గం జలగం వెంగళ్ రావు నాయకత్వంలో పని చేయసాగాయి. ఇద్దరూ కొంతకాలం మంత్రులే. జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా వెంగళ్ రావు ముఠాకు చెందిన వ్యక్తి వుండేవాడు. ఖమ్మం సమితికి ఆయన అనుంగు శిష్యుడు సామినేని ఉపేంద్రయ్య అధ్యక్షుడు. సమితి అధ్యక్షుడుగా వుంటూ, ఆ అధికార దర్పంతో, గ్రామాలలో ముఠా తగాదాలను ప్రోత్సహించేవాడని ఆయనకు పేరుంది. ఖానా పురం, ముదిగొండ, వల్లభి గ్రామాలలో కక్షలు ప్రబలిపోవడానికి ఆయనే కారణం. కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తుండే, ఖానా పురం గ్రామ వాసి వేదాద్రి హత్యలో అతడి పాత్ర వుందనేవారు.

          కాంగ్రెస్ పార్టీ ముఠా తగాదాలు, చివరకు సమితి అధ్యక్షుడు ఉపేంద్రయ్యపై, సిద్దారెడ్డి వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి దారి తీశాయి. నాడు సిపిఎం పార్టీ పక్షాన ఖమ్మం ఎమ్మెల్యేగా వున్న రజబ్ అలీ సహాయంతో, సమితిలోని ఆ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకుని, తన పదవిని నిలబెట్టుకున్నాడు ఉపేంద్రయ్య. తనకు సహాయం చేసిన పార్టీ అన్న విశ్వాసం కూడా లేకుండా, అదే పార్టీ కార్యకర్తలపై, మా చుట్టుపక్కల గ్రామాల కమ్యూనిస్టులపై దాడులు ప్రారంభించాడు ఉపేంద్రయ్య. బాణాపురం గ్రామంలో గండ్లూరి కిషన్ రావు నాయకత్వాన సాగుతున్న వ్యవసాయ కార్మిక రైతు కూలీ పోరాటాన్ని అణచివేయాలని పథకాలు పన్నుతున్న భూస్వాములను చేరదీశాడు. మా నాన్న పట్వారీగా పనిచేస్తున్న అమ్మపేట గ్రామ సర్పంచ్, కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరుడైన కోయ వెంకట్రావును, కాంట్రాక్టుల ప్రలోభం చూపించి తనవైపు తిప్పుకున్నాడు. కోయ వెంకట్రావు సహాయంతో గంధ సిరి గ్రామం మీద దాడి చేయించాడు. ఆ దాడిని గ్రామ ప్రజలు సంఘటితంగా తిప్పికొట్టారు. నాటి నుంచి వెంకట్రావు, ఉపేంద్రయ్యకు కుడి భుజంగా వ్యవహరించసాగాడు. బాణా పురంలో వుంటుండే వెంకట్రావు తమ్ముడు, కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని కోయ సత్యంను తన వైపు తిప్పుకున్నాడు అన్న. భవిష్యత్‍లో బాణా పురంతో సహా పరిసర గ్రామాలలో జరిగిన అనేక దాడులలో అన్నదమ్ములిద్దరు ముందుండేవారు. వారిద్దరితో పాటు మా మరో సరిహద్దు గ్రామం పమ్మికి చెందిన చిన కోటయ్య, పెద కోటయ్యలను కూడా చేరదీశాడు ఉపేంద్రయ్య. మిగిలిన గ్రామాల విషయం ఏమైనప్పటికీ, బాణా పురంలో మాత్రం కిషన్ రావు నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే పట్టుదలతో పని చేయసాగాడు ఉపేంద్రయ్య. ఆ గ్రామ భూస్వాములను చేరదీసి, డబ్బు పోగు చేశాడు. దెబ్బ తీయడానికి కాచుక్కూర్చున్నాడు. వారి పథకంలో భాగంగా, వారి పంచన పడి వున్న భూస్వాములకు అనుకూలంగా వ్యవహరించేందుకు, బాణా పురం, పమ్మి, పెద మండవ, అమ్మ పేట లాంటి కీలక గ్రామాలలో పోలీసు క్యాంపులు వెలిశాయి.


1970 జనవరి నెల రెండో వారంలో, ఉపేంద్రయ్య కుట్రలను వివరించడానికి, కమ్యూనిస్ట్ పార్టీ గ్రామగ్రామాన బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. ఒకనాటి రాత్రి పమ్మి గ్రామంలో జరుగుతున్న బహిరంగ సభలో గండ్లూరి కిషన్ రావు ప్రసంగిస్తున్న సమయంలోనే, అంతకు ముందే సిద్ధం చేసుకున్న ఒక పథకం ప్రకారం, బాణా పురంలో కోయ సత్యం నాయకత్వాన భూస్వాములు-వారి అనుయాయులు, స్థానిక పోలీసు క్యాంపు సహకారంతో, గ్రామంలో వున్న కమ్యూనిస్టులపై కవ్వింపు చర్యలకు దిగారు. ఎదురు తిరిగిన వారిని అమానుషంగా కొట్టారు. అంతటితో ఆగకుండా, గ్రామంలో లేని కిషన్ రావుపైన పోలీసు కేసులు పెట్టించారు మర్నాడు. అలనాటి సర్కిల్ ఇన్ స్పెక్టర్ దుర్గా ప్రసాద రావు తోడ్పాటుతోనే ఇదంతా జరిగిందని బహిరంగంగానే అనుకుండేవారు. పమ్మిలో మీటింగు ముగించుకుని గ్రామం చేరుకున్న కిషన్ రావును, ఆయన వెంట వచ్చిన జిల్లా సిపిఎం నాయకుడు రావెళ్ల సత్యం గారిని పోలీసులు విచారణ పేరుతో క్యాంపుకు పిలిపించారు. గ్రామంలోని సుమారు వంద మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలను కూడా క్యాంపుకు పిలిపించారు. ఒక విధంగా అందరినీ అక్కడ బంధించారనాలి. ఆ తరువాత గుండాలు, పోలీసుల సహాయంతో దాడులు చేశారు. ఇదేం అన్యాయమని నిలదీసిన రావెళ్ల సత్యం గారిని గ్రామం విడిచి వెళ్లమని హుకుం జారీ చేశారు. ఎదురు తిరిగిన సత్యం గారిని ఏమీ చేయలేక పోయారు. గ్రామంలోనే వుండి పోయిన సత్యం గారు, చిత్ర హింసలకు గురైన గ్రామస్తులకు అండగా నిలిచారు. పోలీసు క్యాంపులో వున్న గండ్లూరి కిషన్ రావును, ఆయన సహచర కమ్యూనిస్ట్ నాయకులైన ముక్కా చిన నర్సయ్యను, అప్పి రెడ్డిని హింసించారు పోలీసులు. ఇదంతా సరిపోదన్నట్లు, అందరినీ తాళ్లతో బంధించి, నేలకొండపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

బాణా పురం గ్రామంలో జరిగిన దాడులకు నిరసనగా, వేలాది మంది చుట్టు పక్కల గ్రామాల వారు, వూరేగింపుగా వెళ్లి, ఖమ్మంలో బస చేస్తున్న నాటి హోం మంత్రి వెంగళ్ రావుకు మెమొరాండం ఇచ్చారు. ఆ నాడు జరిగిన బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోటూరు హనుమంత రావు హాజరై, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హోం మంత్రిగారు ఉత్తుత్తి వాగ్దానాలు చేశారు కూడా. బాణా పురంలో అలనాడు జరిగిన హింసా కాండలో ముక్కా చిన నర్సయ్య, పెరుమాళ్ల చంద్రయ్య లతో సహా కిషన్ రావు కూడా శారీరకంగా బాధలకు గురయ్యారు చాలా రోజుల వరకు. గుండాల దాడులు, కవ్వింపు చర్యలు, పోలీసులు బనాయించే దొంగ కేసులు నిత్య కృత్యమయ్యాయి. ఈ నేపధ్యంలో, కమ్యూనిస్ట్ కార్యకర్తలిచ్చిన మెమొరాండాన్ని విచారించాల్సిన హోం మంత్రి జలగం వెంగళ్ రావు, అది చేయకపోగా, బాణా పురం గ్రామానికి స్వయంగా వచ్చి, భూస్వాములతో సమావేశమై, "మీకు నేను అండగా వుంటా" నని హామీ ఇచ్చి వెళ్లాడు! కాకపోతే, సుమారు రెండు వందల మంది పోలీసు బలగంతో మాత్రమే ఆయన ఆ రోజు బాణా పురం రాగలిగాడు! ఇది జరిగిన కొన్నాళ్లకు, మా గ్రామ సరిహద్దు గ్రామైన పమ్మిలో కమ్యూనిస్ట్ వ్యవసాయ కూలి సంఘ కార్యకర్త పెరుమాళ్ల చంద్రయ్యను పట్ట పగలే బండ రాళ్లతో కొట్టి చంపారు. ఆ వూళ్లో పోలీసు క్యాంపు కూడా వుండేదప్పుడు. కాకపోతే, క్యాంపులోని పోలీసులు గుండాలకే మద్దతిచ్చేవారు. కోర్టులో ఆ కేసు నీరు కారి పోయింది. చంద్రయ్యను చంపిన కొన్నాళ్లకు, మందా నారాయణ అనే మరో వ్యక్తి పోలీసు కాల్పుల్లో మరణించాడు అదే పమ్మి గ్రామంలో.

పమ్మి హత్యాకాండ, పోలీసు కాల్పులు, హంతకులకు సహాయ పడుతున్న పోలీసు వ్యవహార శైలి.....ఇవన్నీ...బాణా పురం భూస్వాములలో ఉత్సాహాన్ని నింపింది. ఒక పథకం ప్రకారం, గండ్లూరి కిషన్ రావు కుడి భుజంలా పని చేస్తున్న ముక్కా చిన నర్సయ్యను హత్య చేశారు. 1970 వ సంవత్సరం ఏప్రిల్ నెల మూడో వారంలో అనుకుంటా, చిన నర్సయ్య కోర్టు కేసుమీద ఖమ్మం వెళ్లాల్సి వచ్చింది. ఆయన వెళ్లే దారిలో, భూస్వాముల గుండాలు కాపు కాచి, గండ్ర గొడ్డళ్లు, బరిశెలతో ఆయనపై దాడి చేశారు. తప్పించుకునే వీలు లేకుండా దెబ్బ తీశారు. హత్య చేశారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేను ఖమ్మంలో వున్నాను. బాబాయి నర్సింగ రావుకు ఈ వార్త తెలిసింది. వెంటనే నేలకొండపల్లి వెళ్దామన్నాడు. తోడల్లుడు జూపూడి ప్రసాద్ కారు తీసుకుని నేలకొండపల్లి వెళ్లి నర్సింగ రావును అక్కడ దింపి వచ్చినట్లు గుర్తుంది. బహుశా అది అప్పటికి మూడో హత్య అనుకుంటా. ఇంతలో పంచాయితీ ఎన్నికలొచ్చాయి. ఏమైనా సరే.... సాధ్యమై నన్ని గ్రామ పంచాయితీలను గెలిచి, సమితిని, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని దక్కించుకోవాలని జలగం ముఠా, ఆయన అనుయాయుడు ఉపేంద్రయ్య పథకం రూపొందించారు. అన్నింటికన్నా ముఖ్యంగా బాణా పురం గ్రామ పంచాయితీని గెలవాలని పంతం పూనారు. కమలాపురం, గంధ సిరి గ్రామ పంచాయితీలు ఏకగ్రీవంగా కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) లకు దక్కాయి. మా గ్రామం వనం వారి కృష్ణా పురంలో, మొట్టమొదటి సారిగా కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసి, పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థిని గెలిపించుకుంది. పమ్మిలో పోటీ తీవ్రంగా వుండేది. అయినా కమ్యూనిస్టులే గెలిచారు. నాచే పల్లిలోనూ అంతే. తొలుత బాణా పురం ఎన్నికలు జరగకుండా హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు భూస్వాములు. ఎన్నికలు జరిగిన గ్రామాలలో చాలా భాగం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు, లేదా, సిద్దా రెడ్డి వర్గం అభ్యర్థులు గెలిచారు. ఉపేంద్రయ్య వర్గానికి అతి తక్కువ సీట్లొచ్చాయి మా ప్రాంతంలో. బాణా పురంలో స్టే ఎత్తి వేసింది కోర్టు. ఎవరెన్ని ఎత్తులు వేసినా, ఒక్క వార్డు (భూస్వాముల ఇళ్లున్న వార్డు) మినహా అన్నీ సిపిఎం పార్టీ గెలుచుకుంది. గండ్లూరి కిషన్ రావు మళ్లీ సర్పంచ్ అయ్యాడు. ఎన్నికల సమయంలో భూస్వాములు చేయని అరాచకం లేదు. ఐనా, ఓటమి తప్పలేదు.

          ఖమ్మం సమితికి సిపిఎం అభ్యర్థి రాయల వీరయ్య అధ్యక్షుడుగా, గండ్లూరి కిషన్ రావు ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ సిద్దారెడ్డి వర్గానికి దక్కింది. సిపిఎం అభ్యర్థి టి. వి. ఆర్ చంద్రం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడయ్యారు.

          ఎన్నికలు ముగిసినప్పటికీ, భూస్వామ్య గుండాల దాడులు-దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతూనే వుండేవి. ఇంతలో 1971 లో లోక్ సభకు మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఎన్నికల ఓట్లు లెక్కింపు జరిగే నాటి సాయంత్రం, బాణా పురంలో జరిగిన కవ్వింపు సంఘటనలో, మరో కమ్యూనిస్ట్ కార్య కర్త బొల్లెద్దు రామనాధం ఒక బడా భూస్వామి చేతిలో, లైసెన్స్ లేని పిస్తోలు గుండుకు బలై హత్యకావించబడ్డాడు. చివరకు కోర్టు హత్య చేసినతనిని, ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపాడని నిర్దోషిగా తేల్చి వదిలేసింది!

ఇదిలా వుండగా....మా గ్రామ మరో సరిహద్దు గ్రామం అమ్మ పేటలో కూడా పోలీసు క్యాంపు వుండేది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ కోయ వెంకట్రావు (అతడు 1970 పంచాయితీ ఎన్నికలలో వార్డు మెంబరుగా లాటరీలో గెలిచాడు. సర్పంచ్ గా మా పెదనాన్న గారి కుమారుడు వనం వరదా రావు ఎన్నికయ్యాడు) పోలీసుల అండతో గ్రామంలో అనేక దౌర్జన్యాలు చేసేవాడు. అతడు తాగుబోతు కూడా. తన దగ్గరున్న ఒక లైసెన్సు లేని రివాల్వర్‌తో గ్రామంలో ఒకడిపై దాడి చేసే ప్రయత్నంలో అది విఫలమై పట్టుబడ్డాడు. పోలీసు కేసు అయింది. నాలుగు సంవత్సరాల శిక్ష పడడానికి ఒకటి-రెండు రోజుల ముందర 1972 జనవరి నెలలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య పూర్వాపరాలు నాకింకా గుర్తున్నాయి. బహుశా సంక్రాంతి ముందు రోజనుకుంటా....నేను, మా ఆవిడ, మా ఇంటి నుంచి దగ్గర లోనే వున్న మా తోడల్లుడు ఇంటికి నడుచుకుంటూ వెళుతుంటే కనిపించాడు వెంకట్రావు. ఒకరినొకరు పలకరించుకున్నాం. అప్పట్లో గ్రామంలో అతడికి పూర్తి వ్యతిరేకత వున్న కారణాన భయంతో ఖమ్మంలోనే వుంటూ కోర్టు చుట్టూ తిరుగుతుండేవాడు. ఎందుకో ఆ నాడు బాగా తాగి మా వూరు వెళ్లే ప్రయివేటు బస్సు ఎక్కి వాళ్ల వూరుకు బయల్దేరాడు. అప్పుడు మా పెద్దమ్మాయి బుంటికి ఇంకా ఏడాది కూడా నిండలేదు. భోగి పండ్లు పోయడానికి మా అమ్మ ఖమ్మంలో ఆగింది. ఆ కార్యక్రమం అయిపోయింతర్వాత అమ్మను మా వూళ్లో దింపడానికి తోడల్లుడి కారులో రాత్రి పొద్దు పోయిన తరువాత బయల్దేరాం. వూళ్లోదాకా కారు పోయే వీలు లేనందున వూరి బయటే ఆపి అమ్మను ఇంటిదగ్గర దింపడానికి నడుచుకుంటూ పోయి దింపి వెనక్కు వచ్చాం. తిరిగి ప్రయాణమై ఖమ్మం చేరుకున్నాం. ఆ మర్నాడు మాకు తెలిసిన వార్త....కోయ వెంకట్రావును, మా గ్రామంలో బస్సు దిగగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకు పోయారని, అమ్మపేట తీసుకు పోయి హత్య చేసారని. సరిగ్గా అతడిని మా వూరి నుంచి తీసుకుపోయే సమయానికే నేను మా అమ్మను కారులో మా వూరికి వెళ్లడం యాధృఛ్చికం అయినప్పటికీ, నాకు కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలుండడం వల్ల, నాపై కూడా అనుమానం వచ్చింది కాని దానిని మా గ్రామ పటేల్ తుల్లూరి రామయ్య ఖండించాడు.

కోయ వెంకట్రావు హత్యను అండగా చేసుకుని, ఉపేంద్రయ్య, కమ్యూనిస్ట్ పార్టీపై ధ్వజ మెత్తాడు. కమలాపురం గ్రామ సర్పంచ్ వనం నర్సింగరావును, గంధ సిరి గ్రామ సర్పంచ్ గండ్ర వీర భద్రా రెడ్డిని, బాణాపురం గ్రామానికి చెందిన బాజి హనుమంతును(శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న), అమ్మ పేట గ్రామానికి చెందిన పలువురిని ఆ హత్య కేసులో ముద్దాయిలుగా చేర్పించాడు. గండ్ర వీర భద్రా రెడ్డి మొదటి ముద్దాయి కావడంతో మూడు నెలల పాటు బెయిలు కూడా దొరకలేదు. ఆయన జైలులో వుండగా గ్రామంలోని ఆయన వ్యతిరేకులు గూండాయిజం చేసి కమ్యూనిస్ట్ కార్యకర్తలను హింసించారు. ఆయనపై బలవంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టించి నెగ్గించుకున్నారు. బెయిలుపై బయట కొచ్చిన గండ్ర వీర భద్రా రెడ్డిని గ్రామంలో ప్రవేశించ కుండా అడ్డుకున్నారు. గంధ సిరి గుండాలు ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా అరాచకం చేశారు. గండ్ర వీర భద్రా రెడ్డి ఆ రోజుల్లో బాణా పురంలో కిషన్ రావు ఇంట్లో వుంటుండేవాడు. అయితే, గంధ సిరి గుండాలు బాణా పురంపైన మాత్రం దాడి చేయలేకపోయారు. అదే సమయంలో మరో హత్య కేసులో కిషన్ రావును, నర్సింగరావును పోలీసులు అక్రమంగా ఇరికించారు. ఏడాదిన్నర పైగా బయట వున్న గండ్ర వీర భద్రా రెడ్డి తన గ్రామం చేరుకున్నాడు. తిరిగి ఆయన నాయకత్వంలో కమ్యూనిస్టులు సంఘటితం కాసాగారు. అది చూసి ఓర్వలేని భూస్వామ్య గుండాలు పోలీసుల సహాయంతో, 1973 డిసెంబర్ నెలలో, బజార్లో వెళ్తున్న గండ్ర వీర భద్రా రెడ్డిని అతి దారుణంగా హత్య చేశారు.

అలా ఒకరి వెంట మరొకరు హత్యా రాజకీయాలకు బలై పోయారు. చివరకు ఉపేంద్రయ్య ముఠా వెనక్కు తగ్గింది. నిర్బంధాలు, హత్యలు కమ్యూనిస్టులను లొంగదీయ లేకపోయింది. కొంతకాలం ప్రశాంత పరిస్థితి నెలకొంది. అంతా సర్దు మణిగిందనుకుంటున్న స్థితిలో భయంకరమైన కుట్రకు 1976 ఫిబ్రవరి 7 వ తేదీన గండ్లూరి కిషన్ రావు బలై పోయాడు. ఖమ్మంలో సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన ఇంటి సమీపంలో కాపుకాసిన హంతకులు కిషన్ రావుపై దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆయన హత్యతో ఒక శకం ముగిసి పోయింది. ఒక మహనీయుడు అస్తమించాడు.


దురదృష్టవశాత్తు, అలాంటి "ఎర్ర కోట" ల లాంటి గ్రామాలలో, నేడు ఒక్కటి కూడా కమ్యూనిస్టుల అధీనంలో లేదు. అలాంటి నాయకులూ లేరు. 

3 comments:

  1. Pavan Kondapalli:
    Nenu SR&BGNR lo degree chaduvutunna rojulu avi 75 june lo degree modati pariksha june 25na raasaanu rendopariksha moodurojula vyavadhi undindi june 26na emaragency prakatana veluvadatamto naayakulanu arrest chesaaru maanaanna KL gaaru raastrakendramlo unnakaarananga arest kaaledu june26 raatree nannu ramchanderrao marikontamandini tappukomani pillutla venkanna gaaru kaburu pettaaru maameeda warentlu lekapoina tappukovaalsivachhindi,daanto nenu degree parikshalurayaledu results vachinatarvaata maa ammaku fail inaanani cheppaanu vijayawadalo unnamaanaanna garu enimidinelala tarvaata gandluri gaari hatya jarigindani telisi udayaaniki khammam cherukunnaaru maanaanna baagaedavatam nenu rendusaarle choosaanu okati tammineni subbaiah gaaru chanipoinappudu rendosaari gandluri gaaru chnipoinappudu satyam gaaru maanaannanu dagaarikiteesukoni maammalnandarni dhiryam cheppi odaarcchaalsina meerey itlite etla meeruennochoosaaru gandlri bhaarya pillalina choosi meerucontrole chesukovaali anicheppatam pratyakshanga choosaanu.gandlri gaari antima yaatra khammamnunchi baanaapuram daaka kaalinadakana okarojantaa nadichindi.emina arojulu nirupaminavi. meeku paadaabhi vandanaalu meeru ivvaala swayaana baadhaloundi ivishayaalu spurnaku techhukuntunnaarante kannatalli puttinaparisaraalu snehitulanu gurtuku techhukovatamlo adoka swaantana.emina memu chaala runapadipotunnaamu.HATS OFF TO YOU SIR.

    ReplyDelete
  2. "చేయి" చరిత్రలో మంచి గతమున కొంచెమేనోయ్!

    ReplyDelete
  3. మీరు బ్లాగ్ వేదికలో మీ బ్లాగును అనుసంధానం చేసినందుకు కృతజ్ఞతలు అందిస్తున్నాము.బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.గమనించగలరు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.
    క్రింది లింక్ ను చూడండి. http://blogsvedika.blogspot.in/p/blog-page.html

    ReplyDelete