Saturday, July 6, 2013

ముదిగొండ-వల్లభి గ్రామాల హింసా రాజకీయాలు: వనం జ్వాలా నరసింహారావు

ముదిగొండ-వల్లభి గ్రామాల హింసా రాజకీయాలు
వనం జ్వాలా నరసింహారావు

మా గ్రామం పక్కనున్న కమలాపురం సరిహద్దు గ్రామం బాణా పురంతో సహా చుట్టుపక్కల గ్రామాల్లో కమ్యూనిస్టుల ఆధిక్యతను దెబ్బతీసేందుకు, కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య చాలాకాలం హింసా కాండ జరిగింది. ఇరు వర్గాల్లో ఎంతోమంది చనిపోయారు. బాణాపురం పక్క గ్రామమైన వల్లభిలో, మండల కార్యాలయమున్న ముదిగొండ, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రాజకీయ హత్యలెన్నో జరిగాయి. ఖమ్మం జిల్లాకు "మార్క్సిస్టు-కమ్యూనిస్టుల కంచుకోట" అన్న పేరు నా చిన్నతనంనుండి వింటూనేవున్నాను. కాకపోతే, ఒకప్పుడు మా ప్రాంతంలో బలమైన ఉద్యమ నేపధ్యంలో నిర్మించబడిన కమ్యూనిస్ట్ పార్టీ, క్రమేపీ అంతర్గత కుమ్ములాటలతో, సొంతకంటిలో వేలు పొడుచుకున్న విధంగా బలహీనపడిపోయి, భవిష్యత్‌లో అలా పిలిపించుకునే అవకాశాలు ఉండవనే రీతిలో రూపాంతరంచెందిందనాలి. రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ఖమ్మం జిల్లాకొక ప్రత్యేక స్థానం ఉంది. వరంగల్‌ జిల్లాలో భాగంగా ఉన్నప్పుడే ఖమ్మం పట్టణ శాఖ ఏర్పడడం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చిర్రావూరి లక్ష్మీనరసయ్య, సర్వదేవభట్ల రామనాధం, మంచికంటి రామ కిషన్‌రావు, రావెళ్ళ సత్యనారాయణ, కె. ఎల్. నరసింహారావు, బోడేపూడి వెంకటేశ్వర రావు వంటి యోధులు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఉమ్మడి పార్టీ చీలిపోవడంతో సీపీఎం (కమ్యూనిస్ట్ పార్టీ-మార్క్సిస్ట్) బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చింది. రాష్ట్రం మొత్తంలో సీపీఎంకు పట్టున్న జిల్లాగా పేరు తెచ్చుకుంది. రాష్ట్ర చరిత్రలో-ఆ మాటకొస్తే దేశచరిత్రలోనే పౌరహక్కుల ఉద్యమాలకు నాంది పలికింది డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్‌ రాధా కృష్ణ, అడ్వకేట్ సుబ్బారావు నాయకత్వంలో ఖమ్మం జిల్లాలోనే అనాలి.

ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలలోనూ, ప్రత్యేకించి జిల్లా రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషించిన బొమ్మకంటి సత్యనారాయణరావు, కొంతకాలం రాష్ట్ర రాజకీయాలను శాసించి ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా ఉన్న జలగం వెంగళరావుల చుట్టూ ఖమ్మం జిల్లా రాజకీయాలు తిరుగుతుండేవి. ఏభై సంవత్సరాల క్రితం ముదిగొండ-ఆ పరిసర గ్రామాలలో కూడా వారి ప్రభావమే ఉండేది. శీలం సిద్ధారెడ్డి రాజకీయంగా ఎదిగి, మంత్రివర్గంలో స్థానం సంపాదించి, నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలగడంతో, జిల్లా కాంగ్రెస్‌లోని ఒక వర్గానికి ఆయన నాయకత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో, జలగం- శీలం వర్గాలుగా ఖమ్మం కాంగ్రెసు రాజకీయాలు సాగాయి. కమ్యూనిస్టులు జిల్లాలోనూ, ప్రత్యేకించి ముదిగొండ ప్రాంతంలోనూ, పరిస్థితులను బట్టి శీలం వర్గానికి మద్దతివ్వడమో, తీసుకోవడమో జరిగేది.

జలగం-శీలం వర్గాల ఆధిపత్య పోరు కొనసాగుతున్న రోజుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఖమ్మం తాలూకా పాలేరు-తిరుమలాయపాలెం పరిధిలోని గ్రామాల్లో సిద్ధారెడ్డి వర్గానికి కమ్యూనిస్టుల మద్దతు లభిస్తే, ఖమ్మం సమితి పరిధిలోని గ్రామాలలో కమ్యూనిస్ట్ అభ్యర్థులకు సిద్ధారెడ్డి వర్గం మద్దతు లభించేది. ఆ విధంగా చెరొక సమితి దక్కించుకుని జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించేవారు. అయితే కమ్యూనిస్టులు విడిపోయిన తర్వాత సీపీఐ జలగం పక్షాన, సీపీఎం సిద్ధారెడ్డి వర్గంతోనూ కలిసి పనిచేశాయి. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కొంత మారింది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి, ఇంకో సారి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చేవారు-వారి మద్దతుతో వీలై నన్ని ఎక్కువ స్థానాలు ఆయా ఎన్నికల్లో సంపాదించుకునే ప్రయత్నం చేసేవారు. కమ్యూనిస్ట్ పార్టీలు స్వయంకృషితో ఎదగడం ఒకవిధంగా, రోజులుగడుస్తున్నకొద్దీ, ఆగిపోయిందనే అనాలి

ఇలాంటి రాజకీయ నేపథ్యంలో మొట్టమొదటి సారిగా, గత శతాబ్దం అరవయ్యో దశకంలో, మిగతా జిల్లాల్లో మాదిరిగానే ఖమ్మంలో కూడా గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగడం, ఎన్నికైన సర్పంచులు సమితి అధ్యక్షుడినీ, వీరంతా కలిసి జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని ఎన్నుకోబోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిందని రాజకీయ విశ్లేషకులందరూ భావించే "సీల్డ్ కవర్‌" రాజకీయాలకు అపర చాణక్యుడుగా పేరుపడ్డ బొమ్మకంటి సత్యనారాయణరావు (మా సమీప బంధువు) ఆ రోజుల్లోనే శ్రీ కారం చుట్టి, తన సమీప బంధువైన రావులపాటి సత్యనారాయణ రావుని, ‘పాలేరుసమితి అధ్యక్షుడిని చేశారు. అప్పట్లో రావులపాటిని తప్ప వేరెవరిని ప్రతిపాదించినా సమితి అధ్యక్ష పదవికి తాము కూడా పోటీలో ఉంటామని కమ్యూనిస్టు నాయకులు ప్రకటించడంతో, సర్పంచ్‌ కూడా కాని ఆయనను కో-ఆప్షన్‌ సభ్యునిగా ఎంపిక చేయించి అధ్యక్షుడిగా చేశారన్న విషయం ఆ ప్రాంతవాసులందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి బొమ్మకంటి నిర్ణయంవల్ల రాజకీయంగా ఎక్కువ నష్టపడింది ఆయన మరో బంధువు అయితరాజు రాం రావు (నాకు మామ గారు). అప్పటికే రాజకీయంగా బొమ్మకంటితో సమాన స్థాయికి ఎదిగిన ఆయన ఎదుగుదలను ఆపుచేసేందుకే బొమ్మకంటి తన చాణక్య నీతిని ప్రదర్శించాడంటారు. వల్లభి గ్రామ వాస్తవ్యుడైన రాం రావు గారి మూడో కూతురే నా భార్య.

ఈ నిర్ణయంతో బొమ్మకంటి నుండి కొందరు అయినవారు దూరం కావడం, జలగం వర్గం వారికి కోపం కలగడం దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు. ఆ నేపథ్యంలో, ముదిగొండ-పరిసర గ్రామాల రాజకీయాలు క్రమేపీ వేడెక్కాయి. కక్షలకు దారి తీసాయి. అప్పటి వరకూ కలసిమెలసి ఉంటున్న వారిమధ్య చిచ్చు రేగింది. బొమ్మకంటికి అత్యంత సన్నిహితుడి గా అప్పటివరకూ ఉంటూ వస్తున్న సమీప గ్రామానికి చెందిన ఓ భూస్వామికీ, అదే బొమ్మకంటి ఎంపిక చేసిన సమితి అధ్యక్షుడికి భూమితగాదాతో ప్రారంభమైన పేచీ చిలికి చిలికి తుఫానుగా మారింది. సమితి అధ్యక్షుడికి అండగా దళితులు, పేదలతో సహా, సాక్షాత్తు ఆయన్ను వ్యతిరేకించిన భూస్వామి కొడుకు పక్షాన పరోక్షంగా స్థానిక కమ్యూనిస్టులు నిల్చారు. దీర్ఘకాలం సాగిన ఆ పోరాటంలో సమితి అధ్యక్షుడి పక్షానున్న భూస్వామి (భాగవతుల భిక్షం) కొడుకు (వేదాద్రి) ను ఆయన తండ్రి నాయకత్వంలోని వైరి వర్గాల వారు హత్య చేయించారని చెప్పుకునేవారు ఆ రోజుల్లో. దీని ప్రభావం అదే మండలంలోని అనేక గ్రామాల్లో- ముందుగా వల్లభిగ్రామంలో పడింది.

 ముదిగొండలో ఇరుపక్షాల కాంగ్రెస్‌ వారి మధ్య పోరు సాగినంత కాలం శీలం వర్గం రావుల పాటికి అండగానూ, జలగం వర్గం ఆయనకు వ్యతిరేకంగానూ నిల్చింది. అయితే దళితులు, పేదలు రావులపాటికి మద్దతు ఇస్తుండడంతో, వారికి మద్దతుగా కమ్యూనిస్టులు నిల్చారు. ఆ ప్రాంత-జిల్లా, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులైన రాయల వెంకటేశ్వర్లు, రావెళ్ళ సత్యం పార్టీ పరంగా ముందున్నారు. రాయల వెంకటేశ్వర్లు ముదిగొండ పంచాయితీలో ఒకప్పుడు భాగమైన వెంకటాపురం గ్రామానికి, రావెళ్ళ సమీప గ్రామమైన గోకినేపల్లికి చెందినవారు. తర్వాత జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సమితి అధ్యక్షుడిగా జలగం వర్గీయుడు, ముదిగొండ సమీపంలోని మేడేపల్లి గ్రామానికి చెందిన నాటి కాంగ్రెస్‌ యువనేత సామినేని ఉపేంద్రయ్య గెలుపొందారు. సమితి స్థాయిలో తిరుగులేని నాయకుడిగా, జలగం వర్గంలో ముఖ్యుడిగా, అనతి కాలంలో ఎదిగాడు. అప్పటికే జలగం, శీలం వర్గాలుగా చీలిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో ఆధిపత్యం పోరులో కూరుకుపోయింది. ఆ ప్రభావం ముదిగొండ పరిసర గ్రామాల్లో పడింది. జలగం గ్రూప్‌ పక్షాన పలుకుబడిగలిగిన ఒక అగ్ర (కమ్మ వారు) వర్ణం వారు చేరగా, శీలం వైపున మరో అగ్ర (బ్రాహ్మణులు) వర్ణం వారే చేరారు. దళితుల్లో మెజార్టీ శీలం వర్గానికి చెందిన అగ్రవర్ణాల పక్షాన నిల్చారు.

సమితి అధ్యక్షుడిని తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన రావడం, అదీ, కాంగ్రెస్‌నుంచే రావడంతో ఆ ప్రాంత రాజకీయాలు మరో మారు వేడెక్కాయి. సీపీఎం సర్పంచ్‌లు ఉపేంద్రయ్యను పూర్తిగా వ్యతిరేకించగా, సీపీఐకి చెందిన కొందరితో సహా పార్టీ మద్దతుతో గెల్చిన మరి కొందరి మద్దతు ఆయనకు లభించింది. కాకపోతే అలా మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టు సర్పంచులు కొందరు (ఉదాహరణకు అమ్మపేట సర్పంచ్ కోయ వెంకట్రావు) చివరకు పార్టీని వీడి, ఉపేంద్రయ్య అండతో, ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టులపై పోరాటం చేసారు. ఇరుపక్షాలకు చెందిన కొందరు నాయకులు హత్యకు కూడా గురయ్యారు. రాజకీయంగా పలుకుబడి కోల్పోతున్న సమయాన ఉపేంద్రయ్య కూడా హత్యా రాజకీయాలకు బలైపోయారు.

ఈ నేపధ్యంలో, ముదిగొండ మండలం (అప్పట్లో ఖమ్మం సమితి) లోని వల్లభి గ్రామంలో, జరిగిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకోవాలి.

నాటి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ ముఠా రాజకీయాలకు వల్లభి గ్రామం దళితులు బలయ్యారు. నీలం సంజీవ రెడ్డి గ్రూపుకు చెందిన జలగం వెంగళరావు పక్షాన వున్న గ్రామ అగ్ర వర్ణాల వారికి, కాసు బ్రహ్మానంద రెడ్డి గ్రూపుకు చెందిన శీలం సిద్దారెడ్డి పక్షాన వున్న దళితులకు "వల్లభి" గ్రామం ఒక భూ పోరాటానికి" వేదికైంది. దళితుల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన అగ్ర వర్ణాల వారికి, దళితులకు మధ్య వివాదం ఘర్షణలకు దారితీసింది. దళితులను భయబ్రాంతులను చేసే ప్రయత్నంలో, అగ్రవర్ణాలకు చెందిన కొందరు, పరిసర గ్రామాలలోని తమ మద్దతు దార్లను కూడగట్టుకుని, దళిత వాడపై దాడి చేయడంతో, పిల్లా పాపలతో-కుటుంబాలన్నీ గ్రామం విడిచి పోవాల్సిన పరిస్థితి కలిగింది. అలా వెళ్ళిన వారి ఇళ్లను కూడా సర్వ నాశనం చేశారు. వారి పశువులను తరిమి వేశారు. గృహోపకరణాలను పాడు చేశారు. మొత్తం మీద దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. దళితులకు అండగా నలిచిన గ్రామ పెద్ద, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తామ్ర పత్ర గ్రహీత అయితరాజు రాం రావు కూడా గ్రామం విడిచి కొంత కాలం ఖమ్మంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దళితులకు ఇబ్బందులు తొలగ లేదు. దేశ వ్యాప్తంగా పత్రికలు జరిగిన అన్యాయాన్ని ప్రచురించాయి. టైమ్, న్యూస్ వీక్ లాంటి అంతర్జాతీయ పత్రికలు, బ్రిడ్జ్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లాంటి జాతీయ ప్రముఖ పత్రికలు ఆ గ్రామంలో జరిగిన సంఘటనలను పూస గుచ్చినట్లు ప్రచురించాయి. ఇక స్థానిక రాష్ట్ర స్థాయి పత్రికలు సరే సరి.   ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం వరకూ తెలిసింది. బ్రహ్మానంద రెడ్డి తన మంత్రివర్గ సహచరులైన వల్లూరు బసవ రాజు ప్రభృతులను వల్లభి గ్రామానికి పంపినా ఫలితం కనిపించలేదు. గ్రామంలో రిజర్వుడు పోలీసులు, ఉన్నతాధికారులు కూడా మకాం వేశారు. అయినా మార్పు కానరాలేదు.

సమస్యకు పరిష్కారం గాంధేయ మార్గంతప్ప మరోటి కాదని గ్రామ పెద్ద అయితరాజు రాం రావు భావించారు. స్నేహితుల సహాయంతో ఆచార్య భన్సాలిని ఆశ్రయించాడు.

సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతిపిత మహాత్మాగాంధీ ఆధ్యాత్మిక వారసుడు, శాంతి, గ్రామ స్వరాజ్యం, హరిజనోద్ధరణే ధ్యేయంగా పెట్టుకున్న పవనార్‌ ఆశ్రమవాసి ఆచార్య వినోబా బావే, అనుంగు శిష్యుడు, ఆయనంతటి ప్రముఖుడుగా పేరొందిన ఆచార్య భన్సాలి, పోరాటం కన్నా శాంతే మేలని, తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా, సరిగ్గా నడవలేని స్థితిలో వుండి కూడా, వల్లభి గ్రామానికి వచ్చారు.

గ్రామానికొచ్చి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శాంతి యత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక దళితుడు పూజారిగా పనిచేస్తున్న స్థానిక రామాలయంలో దీక్షకు దిగారు. ఆయనకు అంతకు ముందు ఆ గ్రామం గురించి ఏ మాత్రం తెలియదు. ఆయనకు తెలియ చేయబడిందల్లా, ఆ గ్రామంలో, అగ్రవర్ణాల భూస్వాములకు, దళిత వర్గాల బీద వారికి మధ్య జరిగిన ఘర్షణలో, దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారని, వారు గ్రామంలోకి రావడానికి తాను పూనుకోవాలని మాత్రమే. అంతే, వెనుకా-ముందు చూడ కుండా, హుటాహుటిన బయల్దేరి, ఏ ఆర్భాటం చేయకుండా, నిరాహార దీక్షకు దిగారు. ఆయన డిమాండు నెరవేరింది. ఆ దీక్షకు, ఒక నిర్దుష్టమైన-సహేతుకమైన కారణం వుంది.

దళితులను గ్రామానికి రప్పించాలని, వారిని వెళ్లగొట్టిన అగ్రవర్ణాల వారిని కోరాడు. అంతే కాకుండా శాంతియుత వాతావరణంలో సహజీవనం సాగించాలన్న నిబంధననూ విధించాడు. చిట్ట చివరి దళితుడు గ్రామంలోకి వచ్చి ఇతరులతో సహజీవనం సాగించేంతవరకు తన దీక్ష విరమించేది లేదని శపధం చేశారు. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో కదిలిక వచ్చింది. నాటి గవర్నర్‌ ఖండూభాయ్ దేశాయి, ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి, ఆఘమేఘాల మీద సంధి ప్రయత్నాలు మొదలెట్టారు. సంధికి అంగీకరించాల్సిందెవరో కాదుకాంగ్రెస్‌లోని రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు, జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి. జిల్లా మంత్రుల సమక్షంలో గవర్నర్‌ముఖ్యమంత్రి భన్సాలి దీక్షను విరమింప చేసారు. నాటి నుంచి ఆ గ్రామంలో కొట్లాటలు జరిగిన దాఖలాలు లేవు.

రాష్ట్రంలో- బహుశా దేశంలోనే దళితుడు పూజారిగా ఉన్న మొదటి రామాలయం వల్లభి గ్రామంలో ఉంది. అప్పటి జాతీయ, అంతర్జాతీయ వార్తా పత్రికల్లో ఈ విశేషాలన్నీ ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. వల్లభి గ్రామ భూపోరాటంలో అక్కడి కమ్యూనిస్టులు దళితుల పక్షాన పోరు సల్పిన కాంగ్రెస్‌ వర్గానికి మద్దతిచ్చారు. 

వల్లభిలో అయితే పరిస్థితి మారింది కాని, ఆ ప్రాంత రాజకీయాలు మాత్రం హత్యా రాజకీయాలుగా, భౌతికంగా ఒక పార్టీ వారిని మరో పార్టీ వారు అనునిత్యం వెంటాడే స్థితికి చేరుకోసాగాయి. మళ్ళీ సమితి ఎన్నికలొచ్చే సరికి, ఆ ప్రాంతంలోని ప్రతి గ్రామ సర్పంచ్‌ ఓటు అత్యంత ప్రాముఖ్యంగా మారడం విశేషం. చివరకు శీలం వర్గం కాంగ్రెస్‌ సర్పంచుల సహకారంతో సిపిఎం సమితి పీఠాన్ని దక్కించుకుంది. అయితే అంతకుముందు, ఆ తర్వాత, చోటు చేసుకున్న పరిణామాల్లో, ఎంతోమంది కమ్యూనిస్టు, కాంగ్రెస్‌ నేతలు హత్యకు గురయ్యారు. బాణాపురం గ్రామానికి చెందిన మార్క్సిస్ట్ నాయకుడు ముక్క చిన నర్సింహతో ఆరంభమైన హత్యాకాండ ఎంతో మందిని బలి తీసుకుంది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల మధ్య జరిగిన పోరులో సిపిఎం నాయకులు గంధసిరి గ్రామ వాసి గండ్ర వీరభద్రా రెడ్డి, బాణాపురం గ్రామవాసి గండ్లూరు కిషన్‌రావు, కాంగ్రెస్‌కు చెందిన మాజీ కమ్యూనిస్టు కోయ వెంకటరావుతో సహా చాలా మంది చనిపోయారు. పోలీసు క్యాంపులు ఆ ప్రాంతాల్లో అలవాటుగా మారిపోయాయి కొంత కాలం.


(ఆ వివరాలన్నీ మరో మారు).  

No comments:

Post a Comment