ఉదయిస్తున్నసూర్య చంద్రుల
కలిమిడిని పోలిన హనుమ కళ్లు
కలిమిడిని పోలిన హనుమ కళ్లు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ
ఎందుకు చదవాలి?
ఎందుకు చదవాలి?
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (12-06-2017)
హనుమంతుడు సముద్రాన్ని దాటేందుకు ఉద్యుక్తుడయ్యాడు. బలమైన తన రెండు చేతులు కదలకుండా పట్టుకొని, భుజాలు, మెడ ముడుచుకుంటాడు. మోకాళ్లు సగం వరకు ముందుకు వంచి రెండు కాళ్లు ఒకేచోటుంచి, కనురెప్పలు పైకెత్తి, దూరంపైన దృష్టి నిలిపాడు. పర్వతానికి కాళ్లను బిగదన్ని, శ్వాస బిగించి, లంక చేరాలన్న కోరికతో, చేయాల్సిన పనికి తగిన పరాక్రమం తనకున్నదా అని ఆలోచించి, కార్యం సాధిస్తానన్న ధైర్యంతో సముద్రాన్ని దాటేందుకు సన్నధ్ధమయ్యాడు. (కష్టమైన పనికుద్యమించేవాడి సన్నాహాన్ని ధ్వనింపచేస్తున్నాడు హనుమంతుడు)
ఆక్కడున్న వానర ముఖ్యులతో, సంతోషంగా తన పౌరుషాన్ని, బలాన్ని తెలియచేస్తూ, వాయువేగ సమానమైన శ్రీరామ బాణంలాగా లంకలో ప్రవేశిస్తానంటాడు హనుమంతుడు. అక్కడ సీత కనిపించక పోతే, రావణుడిని బందించి తెస్తాననీ, ఏవిధంగా నైనా సీతను తోడ్కొని వస్తాననీ అంటాడు హనుమంతుడు.
ఒక వేళ వెళ్లేది తానొక్కడే కనుక, సీతాదేవిని లంకలో వెతకడం ఆలశ్యమైతే, లంకనే ఇక్కడకు తెస్తానంటాడు. అడ్డమొస్తే రావణుడిని పాతిపెట్తానని కూడా చెప్తాడు. ఇక తాను పోయివస్తాననీ, కార్యసాధకుడనై తిరిగి వస్తాననీ అంటూ హనుమంతుడు వానరుల వద్ద సెలవు తీసుకుంటాడు.
కపులవద్ద సెలవు తీసుకున్న హనుమంతుడు, తనను తానే గరుత్మంతునితో పోల్చుకుంటూ, చివాలున ఎగిరి వేగంగా పయనించడం ప్రారంభించాడు. ఆ వేగానికి కొండమీదున్న చెట్లు, వాటి మీదున్న పూలతో, పక్షులతో సహా, ఆకాశానికెగిరి, దూర ప్రయాణానికి వెళ్తుండే బందువులను సాగనంపడానికా అన్నట్లు, హనుమంతుడితో కూడి కొంత దూరం పోయాయి. అలా పయనిస్తున్న ఆంజనేయుడి తొడల వేగానికి విరిగి పోయిన మద్దిచెట్ల గుంపులు, సేనానాయకుడిని అనుసరిస్తూ పోయే సైనికుల్లా ఆయనతో పోసాగాయి. విస్తారంగా పూచిన చెట్ల కొమ్మలు, తన్ను అనుసరించి వస్తుంటే, ఆసమూహంతో హనుమంతుడు పూల కొండలా ఆశ్చర్యకరంగా కనిపించాడప్పుడు.
ఇంద్రుడు రెక్కలు త్రుంచేస్తుంటే ఆయన వేగానికి భయపడ్డ కొండలు సముద్రంలో ఎలా పడిపొయాయో, అదే రీతిలో, బరువైన కొన్నిచెట్లు సముద్రంలో పడ్డాయి. మేఘాన్నిపోలివున్న హనుమంతుడప్పుడు, మొగ్గలతో, మొలకలతో కూడిన పూలు తనమీద పడటంతో, రాత్రి సమయంలో మిణుగురు పురుగులతో ప్రకాశిస్తున్న కొండ మాదిరి కనిపించాడు. ఇక వేగంగా కదల్లేని ఇంకోన్ని చెట్లు వాటిపైనున్న పూలను రాల్చాయి. నీళ్లు అడ్డం వచ్చేవరకు హితులను సాగనంపి, కన్నీళ్లు కారుస్తూ, వెనుతిరిగే బంధువులలాగా ఆ పూలు అలా నీళ్లల్లో పడ్డాయి.
(బంధువులను, హితులను సాగనంపుతూ వీడ్కోలు పలికేవారు నీళ్లు అడ్డం వచ్చే వరకే పోవాలని, ఆపైన పోగూడదనీ శాస్త్రం చెప్తుంది)
బరువైన చెట్లు ముందుగా సముద్రంలో పడిపోగా, తేలికైన వాటి పూలు గాలి లోకి ఎగిరి, హనుమంతుడి తోకతో కదిలి పోయి, వేల సంఖ్యలో సముద్రంలో రాలిపోయాయి. పూలతో నిండిన సముద్రం ఆసమయంలో, నక్షత్రాలతో ప్రకాశిస్తున్న ఆకాశం మాదిరి కనిపించింది. ఇక హనుమంతుడప్పుడు పూలతో కప్పబడి వుండడంతో మెరుస్తున్న మేఘాన్ని జ్ఞప్తికి తెచ్చాడు. హనుమంతుడి వేగానికి ఆయన మీదున్న పూలు సముద్రంలో ఒకటి వెంట మరొకటి రాలుతుంటే, ఆ సన్నివేషం, నక్షత్రాలు ఉదయించే వేళ ప్రకాశించే ఆకాశాన్ని పోలి వుంది.
చేతులు చాచి ఆకాశంలో దూసుకెళ్తున్న పంచముఖ ఆంజనేయుడు పర్వత గుహలోంచి తలబయటకు చాచి ప్రాకుతున్న "పంచశీర్షయివోరగమా" (ఐదు తలల పామా!) అన్నట్లున్నాడు. అలలతో నిండిన సముద్రాన్ని రివ్వున దాటి ఆకాశాన పోతున్న హనుమంతుడు, ఆకాశ, సాగరాలను తాగుతూ పోతున్నాడా అనిపించింది. అంటే ఆయన వేగానికి ఆ రెండూ దాటిపోతున్నాయి. మండే కొండల మాదిరిగా వున్న హనమ కళ్లు, ఒకేసారి ఉదయిస్తున్న సూర్య, చంద్రుల కలిమిడిని పోలి గుండ్రంగా, పింగళ వర్ణంగా వున్నాయి. ఎర్రటి కాంతితో వున్న హనుమంతుడి ముఖమ్మీదున్న ముక్కు అంతకంటే ఎర్రగా, సంధ్యాకాలపు సూర్యబింబంలా వుంది. ఇట్లా పోతున్న ఆంజనేయుడు తోకను ఆడించినప్పుడల్లా అది ఆకాశంలో ప్రకాశిస్తున్న ఇంద్రుడి జండాను జ్ఞప్తికి తెచ్చేదిగా వుంది.
కోరలు వెలుపల ప్రకాశిస్తుండగా, తోక తనను గుండ్రంగా చుట్టుకోగా, హనుమంతుడాసమయంలో, పరివేశం మధ్యనున్న సూర్యుడిలాగా కనిపించాడు. ఎరుపెక్కిన పిరుదుల నిక్కుతో, ఎర్రని ధాతువులు నిండిన పర్వతంలాగా అనిపించాడు. వడిసేలతో రాయి రువ్వుతే ఎలాపోతుందో, అలానే పోతున్న హనుమంతుడి చంకలనుండి వీస్తున్న గాలి మేఘపు వురుముల్లా భయంకరంగా ధ్వనించింది.
ఉత్తరం నుండి దక్షిణం వైపు పయనిస్తున్న తోకచుక్కలాగా, ఆంజనేయుడు పెద్ద తోకతో, ప్రకాశిస్తున్న దేహంతో, జంకూ, గొంకూ, భయం లేకుండా లంకవైపు ప్రయాణం కొనసాగించాడు. (ఇక్కడ తోకచుక్క ప్రస్తావన తేవడమంటే లంకకు త్వరలో జరుగనున్న అరిష్టం గురించి సూచనమాత్రంగా చెప్పడమే) ఏనుగు మాదిరి దీర్ఘకాయుడై ఆకాశాన వున్న ఆయన రూపం నీడ, క్రింద నీళ్లల్లో పడటంతో, హనుమంతుడు సగం నీళ్లల్లో, సగం బయటా నడిచే పడవలాగా వున్నాడప్పుడు. హనుమంతుడు పయనిస్తున్న సాగరమార్గమంతా ఆయన తొడల వేగంతో తలక్రిందులై, తారుమారై, పిచ్చిపట్టిన దానిలాగా కనిపించింది. ఆకాశన్నంటుతున్న అలలను హనుమంతుడు తన దేహం నుండి వీస్తున్న గాలితో తన్నుకుంటూ పోసాగాడు.
హనుమంతుడి కదలికతో వీస్తున్న గాలి, మేఘాల కదలికతో వెలువడ్తున్న గాలీ, రెండూ కలవడంతో, సముద్రం కలవరపడింది. అలల సమూహాన్ని లాగుతున్నాడా, లేక, భూమ్యాకాశాలకు ఎల్లలు ఏర్పాటు చేస్తున్నాడా అన్న రీతిలో సాగుతున్నది ఆంజనేయుడి ప్రయాణం. మేరునగమంత ఎత్తుకు ఎగుస్తున్న అలలను హనుమంతుడు లెక్కించుకుంటూ పోతున్నాడా అనిపించింది. ఆయన వేగానికి వెలువడ్తున్న వాయువు సముద్రపు నీటిని తెల్లని తుంపర, తుంపరలుగా ఆకాశానికి ఎగజిమ్ముతుంటే, అవి శరత్కాల మేఘాల్లా కనిపించసాగాయి.
మనిషి వంటిమీదున్న దుస్తులు తీసేస్తే అవయవాలన్నీ కనిపించినట్లే, హనుమంతుడి ఉల్లంఘన వేగానికి సముద్రపు నీళ్లన్నీ ఆకాశంలోకి ఎగిరిపోవడంతో, అందులో వుండే తాబేళ్లు, మొసళ్లు, చేపలు, ఇతర జలచరాలు, బయటకు కనిపించసాగాయి. ఆకాశంలో పోతున్న హనుమంతుడిని గరుత్మంతుడనుకుని, నీటిలో వున్న పాములు కలవరపడి మూర్ఛపోయాయి. సముద్రంలో పడ్తున్న ఆయన నీడ పది ఆమడల వెడల్పు, ముఫ్ఫై ఆమడల పొడవుండి, దట్టమైన మేఘం పొరలాగా హనుమంతుడడి వెంటనే పోసాగింది. నిరాధారంగా వెళ్తున్న హనుమంతుడు రెక్కల పర్వతంలాగా కనిపించాడు. ఆయన పయనిస్తున్న మార్గమంతా, మధ్య పల్లంలాగా, ఇటు, అటు మెరకలాగా, దోసెమాదిరిగా కనిపించింది. పక్షుల నడుమ గరుత్మంతుడిలాగా పోతున్న హనుమంతుడు పెనుగాలివలె మేఘాలను చెదరగొట్టసాగాడు. ఆయన ఆకర్షణకు గురైన మేఘాలు, తెలుపు, ఎరుపు, నలుపు రంగుల కలయికయ్యాయి. మబ్బుల్లో దోబూచులాడే చందమామలాగా కొంతసేపు కనిపిస్తూ, మరికొంతసేపు కనిపించకుండా వున్నాడు హనుమంతుడు. ఆయన మీదప్పుడు దనుజులు, గన్ధర్వులు, దేవతలు పూలవర్షం కురిపించారు. సూర్యుడు తన తాపాన్ని తగ్గించాడు. రామకార్యం నిర్వహించటానికి అనువుగా, హనుమంతుడికి శ్రమ కలుగకుండా వుండేందుకు, వాయువు చల్లగా వీచింది. (భగవత్ కైంకర్యం చేసేవారికి దేవతలందరూ సహాయం చేస్తారనేందుకు ఇదో నిదర్శనం)
No comments:
Post a Comment