కాలానుగుణంగా
బడ్జెట్
వనం
జ్వాలా నరసింహారావు
నమస్తే
తెలంగాణ దినపత్రిక (16-06-2017)
ఆర్థిక సంవత్సరాన్ని జనవరి
నెలతో మొదలుపెట్టి డిసెంబర్ నెలతో
ముగించాలన్న ప్రతి పాదనను ప్రధాని నరేంద్ర మోడీ తెరముందుకు తెచ్చారు. ఆర్థిక రాజకీయ
అస్తవ్యస్త పద్దతులతో దేశం ఎంతో నష్టపోయిందనీ, సమయాన్ని
సరిగ్గా ఉపయోగించుకునే పద్దతి లేక ప్రభుత్వం తీసుకున్న ఎన్నో మంచి నిర్ణయాలు, పథకాలు,
ఆశించిన ఫలితాలు అందుబాటులో ఉంచడానికే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు మోడీ అన్నారు.
దేశంలో వ్యవసాయాదాయం చాలా ముఖ్యమైనదనీ ఆ ఆదాయం చేతికందే కాలం ముగిసిన వెంటనే
బడ్జెట్ ను రూపొందించటం అవసరమని కూడా మోడీ చెప్పారు. ఏప్రిల్ నెలలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి అధ్యక్షత
వహిస్తూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే సాధారణ బడ్జెట్ ను
ముందుకు జరిపామనీ, బడ్జెట్ సమర్పణ తేదీల్లో మార్పులు
చేయడం చరిత్రాత్మకమనీ అంటూ, ఆ కోణంలోనే
ఆలోచించి ఆర్థిక సంవత్సరాన్ని కాలెండర్ ఇయర్ గా మార్చే ఆలోచన వున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఆలోచనా విధానానికి
అనుగుణంగా, అదే పంథాలో, ఒక (ఆంగ్ల)
కాలెండర్ సంవత్స్రరం నుండి మరుసటి కాలెండర్ సంవత్సరం వరకు (అంటే జనవరి 1 నుంచి
డిసెంబర్ 31 వరకు), ఆర్థిక
సంవత్సరంగా పరిగణించి,
తెలంగాణా
రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టే విధానానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ, తదితర ఉన్నతాధికారులతో సీఎం
సమావేశం నిర్వహించి తదనుగుణంగా ఆలోచనలు పంచుకోవటం కూడా జరిగింది. ఈ పాటికే ఈ విధానాన్ని సూత్రప్రాయంగా
అంగీకరించి, అమలు
చేయాలనుకుంటున్న మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఇలా నిర్ణయం తీసుకోవడానికి
దారితీసిన కారణాలను,
అమలు
కాబోతున్న పద్ధతులను,
పాటించాల్సిన
మెళకువలను,
అధ్యయనం చేయడానికి సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి-అధికారుల బృందం కసరత్తు
చేస్తోంది. బహుశా రాబోయే
ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ఈ పద్ధతిలోనే ప్రవేశ పెట్టడానికి అవకాశాలు
మెండుగా కనిపిస్త్రున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 2016 లో, మాజీ ప్రధాన ఆర్థిక
సలహాదారుడు డాక్టర్ శంకర్ ఆచార్య అధ్యక్షతనొక ఉన్నత స్థాయి కమిటీని నియమించి, ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నెల మొదటి నుండి మార్చి నెల చివరి వరకు
కాకుండా జనవరి మొదటి నుండి డిసెంబర్ నెల చివరి వరకు మార్చడానికి అనుగుణంగా, సాధ్యాసాద్యాలను పరిశీలించాలని కోరింది. కమిటీ తన సిఫార్సుల నివేదికను
కేంద్ర ఆర్థిక మంత్రికి అందచేసింది. మార్పు ద్వారా ఎదురయ్యే సమస్యలను, లభించనున్న వెసలుబాట్లను కూలంకషంగా ఈ నివేధికలో కమిటీ పేర్కొన్నది. ఐతే, ఈ నివేదికను ఇంకా బహిర్గతం మాత్రం చేయలేదు. కాకపోతే అనధికారికంగా అందుబాటులోకి వచ్చిన సమాచారం మేరకు, కమిటీ తన నివేదికలో, మార్పుకు అనుకూలంగా నిర్ణయం వెలిబుచ్చడంతో పాటు, వ్యవసాయరంగంలో పంటల కాలానికి అనుగుణంగా తీసుకునే చర్యలు, వ్యాపార రంగంపై ఉండే ప్రభావం, పన్నుల అవలంబన
పద్దతులు, గణాంకాలలో అనుసరించాల్సిన పద్దతులు, పరిగణించదగ్గ లెక్కల సమీకరణ తదితర అంశాలను, విశదీకరించింది. శంకర్ ఆచార్య తో పాటు ఈ కమిటీలో, మాజీ క్యాబినెట్
కార్యదర్శి కె.ఎమ్. చంద్రశేఖర్, సెంటర్ ఫర్ పాలసీ రీసర్చ్ సీనియర్ ఫెలో రాజీవ్ కుమార్, తమిళనాడు మాజీ ఆర్థిక కార్యదర్శి పి.వి. రాజారామన్ కూడా సభ్యలుగా ఉన్నారు. వాస్తవానికి లోగడ, 33 ఏళ్ల క్రితం కూడా, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఉన్నత స్థాయి కమిటీని 1984లో ఎల్. కె. ఝా అధ్యక్షతన ఎర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా
ఆర్థిక సంత్సరాన్ని కాలెండర్ ఇయర్ గా మార్చడానకి సూచించినప్పటికీ కమిటీ సూచనలను
సీరియస్ గా పరిగణలోకి తీసుకోలేదు. రుతుపవనాల ప్రభావం ప్రభుత్వ బడ్జెట్ మీద ఉంటుందనీ
ఝా అభిప్రాయ పడ్డారు. పలురకాల ఇతర కమిటీలు, విద్యావేత్తలు కూడా ఆర్థిక సంవత్సరాన్ని మార్చి సంస్కరణ దిశగా పయనించాలని
సూచించారు. నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దెబ్రాయ్, నీతి ఆయోగ్
ప్రత్యేక అధికారి కిశోర్ దేశాయ్, దీనికి సంబంధించి రూపొందించిన ఒక అధ్యయన పత్రంలో, ప్రపంచ వ్యాప్తంగా, ఏదేశంలో కూడా, ఫలానా కాలపరిమితిని
మాత్రమే ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలని నిర్దుష్టంగా చెప్పడం జరగలేదని
పేర్కొన్నారు. ఒక్కో దేశం ఒక్కో విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నది.
"ఇదీ" అంటూ ఒక ప్రమాణం ఏదీ లేదు. ఆర్థిక సంవత్సరంగా ఏప్రిల్ ఒకటి నుండి మార్చి 31 వరకు పాటించే విధానాన్ని భారతదేశం 1867 నుంచి పాటిస్తూ
వచ్చినప్పటికీ, గత 150 సంవత్సరాలలో, అనేక సందర్భాల్లో ఈ
విధానాన్ని ప్రశ్నించటం, దీనిపై వాడిగా-వేడిగా చర్చించటం జరుగుతూ
వస్తున్నదని వీరు అభిప్రాయపడ్డారు. 1867కు పూర్వం, ఆర్థిక సంవత్సరాన్ని మే 1 వ తేది నుంచి
మరుసటి సంవత్సరం ఏప్రిల్ 30 వరకు పాటించేవారు. అప్పటి బ్రిటీష్
ప్రభుత్వ పాలకులు భారతదేశంలో పాటించాల్సిన ఆర్థిక సంవత్సర తేదీలలో మార్పులు తీసుకు
రావటం జరిగింది. దానికి ప్రధాన కారణం వారి దేశంలో అమలవుతున్న విధానమే...ఆ పద్ధతినే
భారతదేశంలో కూడా అమలు చేయాలన్న వారి కోరికే.
భారతదేశం అనుసరిస్తున్న
బడ్జెట్ పద్దతికి 150 సంత్సరాల పైగా చరిత్ర ఉంది. దీనిని తొలిసారిగా
ఏప్రిల్ 7, 1860లో ప్రవేశ పెట్టడం జరిగింది. అంటే భారత పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి, బ్రిటీష్
ఆధిపత్యానికి మారిన రెండేళ్ళకి జరిగింది. 2010లో అప్పటి
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బడ్జెట్ మాన్యువల్ లో, అప్పటి
తొలి ఆర్థిక మండలి సభ్యలు జేమ్స్ విల్సన్ బడ్జెట్ ఉపన్యాసాన్ని ఇస్తూ, మొట్టమొదటి సారి, దేశ ఆర్థిక విధానాలను సమగ్రంగా
వివరించటం జరిగింది.
ఆర్థిక సంవత్సరాన్ని ఒక
ఏడాదిగా పరిగణించాలనే విధానం, ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా, ప్రభుత్వ వ్యయానికి కావల్సిన మొత్తాన్ని చట్టసభల ఆమోదం పొందడానికి వీలుగా,
రూపొందించడం జరిగింది. 1865 కన్నా ముందే,
భారతదేశంలో ప్రస్థుతం అమల్లో వున్న ఆర్థిక సంవత్సరం విధానాన్ని
ఆచరణలో తేవడానికంటే పూర్వమే, అప్పటి మాజీ పేమాస్టర్ జనరల్ నేతృత్వంలో
నియమించిన కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ, కాలెండర్ ఇయర్ ను ఆర్థిక
సంవత్సరంగా వుండాలని సూచించింది. కారణాలేవైనా ఆ సూచన
ఆచరణలోకి రావడం కుదరలేదు. స్వాతంత్ర్యానికి పూర్వం, వెల్ బీ కమీషన్ , ఛాంబర్లెన్ కమీషన్ గా అందరికీ
తెల్సిన ది రాయల్ కమీషన్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్స్, కాలెండర్ ఇయర్ నే ఆర్థిక
సంవత్సరంగా వుండాలని సూచించినా, ఏ రకమైన మార్పులు జరగలేదు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత రాజ్యంగంలో నిర్దుష్ఠంగా ఆర్థిక సంవత్సరం ఇలా వుండాలని నిర్వచించడం
కాని, స్పష్ఠంగా చెప్పడం కాని జరగలేదు. 1956 లోనూ, ఆ తరువాత అడపదడప, ఆర్థిక
సంవత్సరం మార్పు గురించి ఏకాభిప్రాయంతో జాతీయ అభివృద్ది మండలిలో ప్రతిపాదనలు
వచ్చాయి. 1958లో పార్లమెంటు ఎస్టిమేట్స్ కమిటీ, ఆక్టోబర్ 1వ తేదీతో ఆర్థిక సంవత్సరం ప్రారంభం
కావాలని సిఫార్సు చేసింది కాని, ప్రభుత్వం దాన్ని
తిరస్కరించింది. మొట్టమొదటి పరిపాలనా సంస్కరణల కమీషన్ నివేదికలో, నిర్ధేశిత ఖర్చులు బడ్జెట్ లో
ప్రతిపాదించడానికి, జనవరి 1వ తేదీతో
ఆరంభమయ్యే ఆర్థిక సంవత్సరం సరైనదిగా సూచించింది. 1983లో
అప్పటికి ఆర్థిక మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు
సేకరించినప్పుడు, ముఖ్యమంత్రులందరూ ఒకవైపు మార్పుకు అంగీకారం
తెలుపుతూనే, మరో వైపు, ఆర్థిక సంవత్సరం
ఎప్పటి నుంచి ప్రారంభం కావాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలకు రావటం జరిగింది.
మెజారిటీ ముఖ్యమంత్రులు మాత్రం, రుతుపవనాలను
బట్టి, ఖరీష్ కాలంలో దిగుబడిని బట్టి, ఆ
తదుపరి రోజుల్లో ఆరంభమయ్యే విధంగా, అంటే దాదాపు క్యాలెండర్
సంవత్సరాన్ని, ఆర్థిక
సంవత్సరంగా సూచించారు.
ఆర్థిక సంవత్సరాన్ని
ఏప్రిల్ మొదటి తేదీ నుండి మార్చి 31 వరకు కొనసాగించే విషయం పలు మార్లు
వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇలానే ఎందుకుండాలని పలువురు నిపుణులు ప్రశ్నించడం
జరిగింది. మార్పులు తేవాలనే ప్రతిపాదనలు ఎన్నిసార్లు, ఎన్నో
విధాలుగా, ఎంతో మంది చర్చకు తీసుకు వచ్చినా ఆ ప్రతిపాదనలు ఒక
కొలిక్కి వచ్చే ప్రక్రియ చోటుచేసుకోక పోవడం గమనార్హం. బ్రిటీష్ ఇండియాలో, బ్రిటీష్ ప్రభుత్వం పాటించే పద్దతినే అనుసరించాలనే క్రమంలో, ఈ విధానం మొదలై, కొనసాగించటం జరిగింది. భారతదేశం స్థితిగతులు, స్థానిక వాతావరణ తదితర
పరిస్థితులు, ఇతర స్థానిక అంశాలు ఏ మాత్రం పరిగణలోనికి
తీసుకోకపోవటం దురదృష్ఠం. ఆర్ధిక సంవత్సరంలో మార్పులు
తీసుకుని రావాలనే ఆలోచన కలగడానికి ప్రధాన కారణం, ప్రస్తుతం
అమల్లో వున్న ఆర్థిక సంవత్సరం ఆధారంగా, రూపొందించబడుతున్న
బడ్జెట్ ప్రతిపాదనలు, నైరుతి, ఆగ్నేయ
రుతుపవనాల ప్రభావం, తద్వారా సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద
పడే ప్రభావం పరిగణలోకి తీసుకోక పోవడమే! ప్రభుత్వానికి
వర్షాకాల పరిస్థితులపై సరైన సమాచారం లేకుండానే నిధులు కేటాయించేయడం వల్ల, వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోవటం,
తద్వారా, పూర్తిగా ఆర్థిక వ్యవస్థ
ఛిన్నాభిన్నమయ్యే పరిస్థితికి చేరుకోవడం జరగవచ్చు. ఇతర అంశాలనూ పరిశీలించినట్లయితే, పనిచేసే కాలాన్ని పరిపూర్ణంగా సద్వినియోగపరుచుకునే అంశాన్ని, జాతీయ సంప్రదాయాల్ని, సంస్కృతిని, సౌలభ్యాన్ని, పరిపాలనని,
శాసన సభ్యుల సౌలబ్యాన్ని, పరిగణలోనికి
తీసుకోవలసి ఉంటుందని నీతీ ఆయోగ్ కు చెందిన దెబ్రాయ్, దేశాయ్
అంటున్నారు.
ఈ నేపధ్యంలో, ప్రస్తుతం కేంద్ర
ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక
సంవత్స్రరం పద్ధతిని మార్చాల్సిన అవసరం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రధానితో సహా, చాలా మంది
ముఖ్యమంత్రులు కూడా మార్పుకు అనుకూలంగా వుండడంతో, బహుశా,
మార్పుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే శ్రీకారం చుట్టినా ఆశ్చర్య
పోనక్కరలేదు.
No comments:
Post a Comment