పొలంలో నిలిచిన మట్టిమనిషి
వనం జ్వాలా నరసింహా రావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (27-06-2017)
రైతుల అభ్యున్నతికి నిబద్ధతతో పనిచేస్తూ, గ్రామీణాభివృద్దికి
పెద్దపీట వేస్తూ, తదనుగుణంగా ప్రణాళికలను
సిద్దం చేస్తూ, సమగ్రమైన విధివిధానాలను రూపొందిస్తూ, రైతుల పురోభివృద్ది, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టే లక్ష్యంగా పెట్టుకుని
ముందుకు సాగుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ దిశగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర
రావు ఎకరానికి రూ. 8000 ఆర్థిక సహాయాన్ని ఒక ఏడాదిలో రెండు దఫాలుగా, ఖరీఫ్,
రబీ పంట కాలంలో రూ. 4000 చొప్పున రైతులకు ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయం వ్యవసాయరంగం సంపూర్ణంగా అభివృద్ది
చెందడానికి, రైతులు గణణీయంగా లాభాలను ఆర్జించేందుకు దోహదపడుతుంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా, తొలిసారిగా,
ప్రభుత్వ పెట్టుబడితో వ్యవసాయ రంగాన్ని, రైతు సమాఖ్యలను బలోపేతం చేయటం అనే వినూత్న
సంప్రదాయాన్ని ఆవిష్కరించటం ఒక అద్భుతంగా
చెప్పుకోవాలి.
దశాబ్దాలుగా దళారీల,
మధ్యవర్తుల దోపిడికి గురవుతున్న రైతాంగం ఆ చెర నుండి విముక్తులు కావటంతో పాటుగా ఒక
సంఘటిత శక్తిగా మారడానికి వారిలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఆస్కారం
లభిస్తుంది. రైతు పండించిన పంట అమ్ముడు పోకపోయినా, మధ్య దళారులు ఆటంకాలు కలిగించినా,
రైతు సమాఖ్యలు జోక్యం చేసుకుని, సరైన సమయంలో స్పందించి, ఆ పంటకు తగు ధరను నిర్ణయించి, సదరు పంటను కొనుగోలు చేసి,
రైతంగానికి అండగా నిలబడే విధంగా సమాఖ్య వద్ద వుంచడానికి రూ. 500 కోట్లతో నిధి
ఏర్పాటు చేయటం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెడుతూ ఆ ప్రకారం గ్రామీణ
స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సమాఖ్యలు ఏర్పాటు
కావించి వాటికి తగు రీతిన నిధులు అందించి దిగుమతికి తగ్గ చెల్లింపులు అందించేందుకు
ఆస్కారం కల్పించే విధంగా ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగానే రైతు సంఘాల ప్రతినిధులతో
సమాలోచనలు చేయాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు
అవగాహన కల్పించడానికి దశల వారీగా వివిధ ప్రాంతాలలో పర్యటించేందుకు, రైతులను
సమాయత్త పరిచి, వారికి ప్రభుత్వ ఆలోచనలను విశదీకరించేందుకు తగు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
రైతు సగటు కమతం రమారమి 1.12
హెక్టార్ల భూమిగా గణాంక లెక్కలు చెబుతున్నాయి. 61.97 లక్షల హెక్లార్ల భూమి 55.54
లక్షల మంది ఆధీనంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వర్ష పాతం ఆధారంగా,
ఎర్రరేగడి, నల్లరేగడి వంటి రకాల ఆధారంగా,
పండించే పంటల ఆధారంగా, రాష్ట్రం నాలుగు వాతావరణ ఆధారిత వ్యవసాయిక జోన్లుగా
విభజించడం జరిగింది. తిరిగి, ఈ నాలుగు జోన్లను ఆయా ప్రాంతాల పరిస్థితుల ఆధారంగా మరో
98 రకాల పంట భూమిగా విభజించటం జరిగింది. ఇందులో నలుపు, ఎరుపు, నిస్సార, కంకర చవుడు
మట్టి లాంటి రకాలున్నాయి. గణాంకాల ఆధారంగా 57 లక్షల హెక్టార్ల భూమి మాత్రమే సాగుకు
అణువుగా వుంది. తృణ ధాన్యాలైన వరి, గోధుమ, జొన్న, పప్పు ధాన్యాలైన కంది, పెసర,
శనగ, వేరుశనగ, సోయ, ఆముదం, పత్తి, మిరప, చెరకు, ఉల్లి తదితర పంటలు రాష్ట్రంలో
పండించటం జరుగుతోంది.
‘విత్తనం’ మెరుగైన
వ్యవసాయానికి మూలాధారం. నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయటం, సరఫరా చేయటం, రైతుకు అందుబాటులోకి
తేవటంతో పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని ‘‘భారతదేశానికే విత్తన భాండాగారంగా’’ అభివృద్ది
చేయడం లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ దిశగా దీర్ఘ కాల విత్తనోత్పత్తి
ప్రణాళికలను రూపొందించే క్రమంలో వ్యవసాయ శాఖ, అనుబంధ పరిశోధనా సంస్థలు,
విశ్వవిద్యాలయాలు కార్యాచరణకు పూనుకున్నాయి. రాష్ట్రంలో పది లక్షల క్వింటాళ్ళ నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి
రైతులకు
అందుబాటులోకి తేవటం జరుగుతుంది. అలాగే సబ్సీడీ కింద అందించే విత్తనాలను సరఫరా చేసే
ప్రభుత్వ నోడల్ ఏజెన్సీల ద్వారా అందుబాటులోకి తేవటం జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 విత్తనోత్పత్తి సంస్థలు
అందుబాటులో ఉన్నాయి.
రైతులకు సరైన సమయంలో నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయటంతో పాటు విత్తన నియంత్రణ
ప్రక్రియ కొరకు, విశ్లేషణ చేపట్టేందుకు, తదితర సేవలు అందించడానికి, విత్తన పరీక్షా
కేంద్రాలు, నాణ్యతా ప్రమాణాలను అందించే కార్యక్రమాలు, విత్తన సరఫరా సంస్థలకు
గుర్తింపు నిచ్చే కార్యాక్రమాలు చేపడుతూనే ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసి తద్వారా ఆకస్మిక
తనిఖీలు నిర్వహిస్తూ నాణ్యతకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతున్నది.
వ్యవసాయరంగం పురోభివృద్దికి,
పెద్దమొత్తంలో ఉత్పత్తికి, నాణ్యతతో కూడుకున్న దిగుబడికి సక్రమమైన ఎరువుల వాడకం అవసరం. వ్యవసాయ శాఖ
నాణ్యమైన ఎరువులను సరఫరా చేయటానికి చర్యలు
చేపడుతుంటుంది. పంటల పరిరక్షణకు, వాటిలో వచ్చే తెగుళ్లను, చీడ తదితర వ్యాధులను
నిరోధించడానికి తగు చర్యలను సునిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకు గాను కొత్త
రకాల మందులను, వ్యాధి నిరోధక పరిశోధనలను క్రమం తప్పక అణ్వేషించాల్సి ఉంటుంది. ఈ
క్రమంలో కొత్త రకం మందుల ఉత్పత్తితో పాటుగా, సమగ్ర పంటల పరిరక్షణ విధానాలు
రూపొందిస్తూ, వాటిని అధ్యయనం చేస్తూ, రైతులకు ఆయా విధానాల పట్ల అవగాహన కల్పిస్తూ,
శిక్షణనందిస్తూ, రైతన్నలకు చేదోడుగా ఉంటూ వ్యవసాయ శాఖ ఎన్నో చర్యలను చేపడుతున్నది.
యాంత్రీకరణ వ్యవసాయం వల్ల
దిగుబడి పెరిగి ఖర్చులు తగ్గేందుకు ఆస్కారం ఉంది. ఈ క్రమంలో ముందుకు పోవటం వల్ల
తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించేందుకు వీలు కలుగుతుంది. వ్యవసాయ శాఖ
ఇందుకు పెద్దపీట వేస్తూ వ్యవసాయ యంత్రాలను సబ్సీడీ ధరలకు అందుబాటులోకి తీసుకు
వచ్చి వ్యవసాయదారులకు తగు రీతిన సహాయ పడుతూ ఉంటుంది.
2016 నుండి ఇప్పటి వరకూ
రాష్ట్రంలో మూడు రకాలైన పంటల భీమా పథకాలను అమలు పరచటం జరుగుతున్నది. ఖరీఫ్ పంట
కాలంలో ప్రధాన మంత్రి ఫసల్ భీమాయోజన పథకం, వాతావరణ ఆధారిత పంటల భీమా పథకం,
ఏకీకృత భీమా పథకం వంటివి తీసుకురావటం
జరిగింది. పంటలకు రుణాలను పొందిన వారందరికీ ఈ భీమా పథకాన్ని వర్తింపచేస్తూ వారు
ఎంచుకున్న పంటలకు అనుగుణంగానే భీమా పథకాన్ని అమలు చేయటం జరుగుతోంది. ఇతరులకు
మాత్రం వారు కోరుకుంటేనే భీమా అందించే విధంగా చర్యలు చర్యలు చేపట్టడం జరుగుతుంది.
పెరుగుతున్న జనాభా అవసరాల
మేరకు, ఆవశ్యకతలకు లోబడి ఆహర ధాన్యాల ఉత్పత్తి, పెంపుదల ఆధారపడి ఉంటుంది. ఈ
క్రమంలో రైతులకు తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా శిక్షణ, మెరుగైన
సాగుకు మెళుకువలు అందించడం జరుగుతుంది. వ్యవసాయ విస్తరణకు, వ్యవసాయ రంగంలో
సాగిస్తున్న సాంకేతిక పురోగతిని, రైతులకు అందుబాటులోకి తీసుకు రావటం ఎంతయినా
అవసరం. మహిళలు కూడా వ్యవసాయ రంగంలో ముఖ్య భూమిక వహిస్తుంటారు. భూమిని వ్యవసాయానికి
అణువుగా తయారు చేసి అందుబాటులోకి తేవటం మొదలుకుని దానిని మార్కెట్ వరకు
తీసుకురావటంలో వారి కృషి, వారి పరిశ్రమ ఎంతయినా ఉంటుంది. వ్యవసాయ రంగంలో మహిళల
భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు కృషి జరుగుతున్నది.
వర్షాధార ప్రాంతాల
అభివృద్దికి ‘‘రైన్ ఫెడ్ ఏరియా డెవలప్ మెంట్’’
(ఆర్.డి.ఎ) కార్యక్రమం కింద ఆయా ప్రాంతాలలో తగురీతిన వ్యవసాయం కొనసాగించే
విధంగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. ఈ ప్రాంతాలలో
సమీకృత వ్యవసాయ విధానం అవలంభించటం వల్ల పంటలు పండించటం, మిశ్రమ పంటలు పండించటంతో పాటుగా అనుబంధంగా
పూలు, కోళ్ళ పెంపకం, గొర్రెల పెంపకం, చేపల చెరువుల రూపకల్పన ద్వారా చేపలు, రొయ్యలు, వృద్ది చేయటం
జరుగుతుంది. తద్వారా, వారి జీవనోపాధిని పెంపొందించే విధంగా దోహద పడటం వంటి
కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.
నాణ్యమైన, ఆరోగ్యకరమైన
సాగుభూమిని రూపొందించుకొని దానిని పరిరక్షించుకోవటం ఈ మొత్తం ప్రక్రియలో
సాంకేతికమైన సవాలు. ఐతే రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించి వ్యవసాయ భూమిలో
సాంద్రత పెంచేందుకు చర్యలు చేపడుతూ పెద్ద ఎత్తున దిగుబడికి, ఆహార భద్రతకు, సమగ్ర
గ్రామీణాభివృద్దికి చర్యలు తీసుకోవటం, అమలు పరచటం జరుగుతుంది. ఈ కార్యక్రమ లక్ష్యం
సమీకృతంగా సారవంతంగా భూమి కొనసాగేవిధంగా చర్యలు తీసుకోవటం, తగురీతిగా ఎరువులను
తదితర ఉత్పత్తులను వినియోగించే విధంగా చూడటం, ఆర్గానిక్ ఎరువుల ద్వారా భూమి
సారాన్ని దీర్ఘకాలం వినియోగించుకునే విధంగా చూడటం, తద్వారా సారవంతమైన భూమిని
పరిరక్షించుకోవటం జరుగుతుంది. వ్యవసాయ శాఖ ఇందుకు తగ్గ పరీక్షలను నిర్వహించి
సారవంత భూముల సంపూర్ణ ఆరోగ్య భద్రతకు, పరిరక్షణకు తగ్గ భద్రతా ప్రమాణాలకు లోబడి
వారికి గుర్తింపు కార్డులను జారీ చేయటం జరుగుతుంది.
రాష్ట్రంలో వ్యవసాయపరంగా
ఉన్న అవసరాన్ని బట్టి అంచనాలు వేసి క్రాఫ్ కాలనీలు ఏర్పాటు కావాలని రాష్ట్ర
ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులైన పంటలు, కూరగాయలు,
నూనెలు, పళ్ళు మన అవసరాలకు సరిపడేవిగా మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతి
చేయటానికి అన్నట్లుగా ఉత్పత్తి చేసుకుని, అలాగే మానవ అవసరాలతో పాటుగా పశువుల
పోషణకు సరిపడే విధంగా దాణాకు, కోళ్ళ దాణాకు, చేపల దాణా తదితర అవసరాలకు తయారు
చేసుకునే విధంగా సన్నద్దం కావాలని ఆలోచనలు సాగించింది.
ప్రభుత్వం కొన్ని
ప్రాంతాల్లో పెరుగుతున్న అవసరాలకనుగుణంగా కేవలం కూరగాయలను మాత్రమే ఉత్పత్తి చేసే
విధంగా గుర్తించి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఒక గ్రామంలో స్వయం సమృద్దిగా
కూరగాయ పంటలు పండించినట్లయితే ఆ గ్రామ అవసరాలు సంపూర్ణంగా తీర్చినట్లు అవుతుందని
తద్వారా ప్రతీ గ్రామంలో వారి అవసరాలకు అనుగుణంగా కూరగాయలు అందుబాటులోకి తేవటం
జరుగుతుందని ఆయా పంటలు, ఉత్పత్త అక్కడికక్కడ ఉండటం ద్వారా స్వయం సమృద్ది సాధించినట్లు అవుతుందని
రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
No comments:
Post a Comment