Saturday, June 24, 2017

మరో సర్వే సెటిల్‍మెంటే శ్రీరామరక్ష : వనం జ్వాలా నరసింహారావు

మరో సర్వే సెటిల్‍మెంటే శ్రీరామరక్ష
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (25-06-2017)

     హైదరాబాద్ నగరం చుట్టుపక్కల కొందరు దురాక్రమణదారులు ప్రభుత్వ భూములను స్వాహాచేసి, కృత్రిమ ‘‘జనరల్ పవర్ ఆఫ్ అటార్ని’’ పత్రాలను సృష్టించి, వాటిని ప్రయివేటు హక్కుభుక్తంలో వున్న భూములుగా చూపించి, అమ్మి సొమ్ముచేసుకోవడంతోపాటు, "ఎక్కడైనా రిజిస్ట్రర్ చేసుకునే" విధానాన్నిఆసరాచేసుకుని, సంబంధిత రిజిస్ట్రార్ల కుమ్ముక్కుతో, చట్ట విరుద్దంగా రిజిస్ట్రేషన్ చేయించడం వంటి దుశ్చర్యలకు పాల్పడటం జరిగిందిటీవల. తన దృష్టికి వచ్చిన వెనువెంటనే, ఇలాంటి చట్ట వ్యతిరేక మోసాలకు స్వస్తి పలకాలని నిర్ణయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన రిజిస్ట్రేషన్లన్నింటినీ రద్దు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా, "ఎక్కడైనా రిజిస్ట్రర్ చేసుకునే" విధానాన్ని ఉపసంహరించుకోవాలని కూడా ఆదేశాలిచ్చారు

     దీనికి కొనసాగింపుగా, తెలంగాణ "రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ యాక్ట్-1971 ను సవరిస్తూ, రికార్డ్ ఆఫ్ రైట్ (ఆర్వోఆర్) యాక్ట్ ఆర్డినెన్స్ అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. జాగీర్, మక్తా, సంస్థాన్, పాయిగా భూములకు ఇకపై ఆర్వోఆర్ హక్కులు లేవని ఈ ఆర్డినెన్స్ స్పష్టం చేసింది. గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో, కమ్మ్యూటేషన్ పద్ధతిన, జాగీర్దార్లు, వారి వారసులకు పరిహారం ఇచ్చినట్లుగానే భావించాలని ఈ యాక్ట్ అర్థం. ఇవన్నీ సర్కారు ఆస్తులుగానే పరిగణించాలని కూడా యాక్ట్ చెపుతోంది. అంటే, తెలంగాణ రాష్ట్రంలో  జాగీర్, ఇనాం భూముల రిజిస్ట్రేషన్ ను సంపూర్ణంగా రద్దు చేస్తున్నట్లు అయింది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయబడిన భూములు ప్రభుత్వం స్వాధీనపరుచుకునేందుకు ఈ నూతనంగా జారీ చేయబడిన ఆదేశాలు వెసులుబాటు కల్పిస్తాయి. అలాగే, భూమి నమోదుకు సంబంధించి, తొలిగించబడిన విధి విధానాలను ఉటంకిస్తూ తెలంగాణ భూమి పై హక్కులు, పట్టాదారుకు అందించాల్సిన పాసు పుస్తకాలు-2017  ప్రకారం, ఎలక్ట్రానిక్ విధానాన్ని అనుసరించి ఎటువంటి ప్రామాణికలను పాటించాల్సి వుంది, టైటిల్డీడ్, పాస్ పుస్తకాలను అనుసరించి ఎటువంటి ఒప్పంద పత్రాలు జారీ చేయవలసి వుంది, రెవెన్యూ పరిధిలో అధికారులు రిజిస్ట్రేషన్స్ గురించిన ఏఏ నియమాలకు బద్దులై వుండాలి, తద్వారా వ్యాపార లావాదేవీలను త్వరిత గతిన ఏ ప్రాతిపదికలను పాటించాల్సి వుంటుంది. భాద్యతాయుతమైన ఇట్టి పనులను నియమానుసారంగా, పారదర్శకంగా ఆ విభాగం ఎలా రూపొందించాల్సి ఉంటుంది, అనే అంశాలను పొందుపర్చడం కూడా జరిగింది. ఇదో చారిత్రాత్మక నిర్ణయంగా అనుకోవచ్చు.

ఉమ్మడి రాజదానిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమికి సంబంధించిన రికార్డులను ఇష్టానుసారంగా తయారు చేయటం వల్ల వాటిలో లోప భూయిష్టమైన తప్పులు అనేకం దొర్లటం జరిగింది. సర్వే నెంబర్లు లేకపోయినప్పటికీ చాలా సార్లు రిజిస్ట్రేషన్ జరిగిపోయేది. జాగీర్దారీ విధానాన్ని ఎన్నడో రద్దుచేసినప్పటికీ వాటి వల్ల ఉత్పన్నమౌతున్న తప్పిదాలు ఇప్పటికీ ప్రస్ఫుటంగా కానవస్తున్నాయి. నిజాం పరిపాలనా సమయంలో వేలకువేల ఎకరాల భూమిని వారికింద పని చేసే వారికి నజరానాగా ఇవ్వడం జరిగింది. అలాంటి నజరానా పత్రాలన్నీ ఉర్దూ భాషలో ఉండటంతో దాన్ని అనువుగా తీసుకొని కొందరు పాత దస్తావేజుల మీద, ఇష్టం వచ్చినట్లు నకిలీ ఆస్తి పత్రాలు సృష్టించి, భూముల ఆక్రమణకు పూనుకొవటం మొదలుపెట్టారు. సంబంధిత సబ్ రిజిస్ట్రార్లు వాటిని డబ్బుకు కక్కుర్తి పడి కొనుక్కున్న వారి పేర రిజిస్ట్రర్ చేయించడం కూడా జరిగిపోయేది. వాస్తవానికి, నిజాం ఆరోజుల్లో చేసిన అన్ని లావాదేవీలను ఒక "బ్లూ బుక్" లో నమోదు చేయడమే కాకుండా, దాని కాపీ ఒకటి నిజాం ట్రస్టుకు ఇచ్చి, మరోకటి  ప్రభుత్వం అధీనంలో వుంచడం జరిగింది. ఇదంతా జగమెరిగిన సత్యం.

ఉస్మానియా విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ బి..వి. శర్మ సంపాదకత్వంలో, 1980 దశకంలో, పలు ఆసక్తికరమైన విషయాలను, ముఖ్యంగా తెలంగాణ భూములకు సంబంధించిన వాటిని ప్రస్తావిస్తూ, "పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఇండియా" అనే పుస్తకాన్ని ప్రచురించారు. అందులో పేర్కొన్న వాటికీ, నేటి పరిస్తితులకు ఎంతో దగ్గరిసంబంధం, మూలాలు కానవస్తున్నాయి. ఈ పుస్తకంలో ఎందరో అనుభవజ్ఞులైన అధ్యాపకుల వ్యాసాలున్నాయి.

ముస్లిం మతస్తులైన నిజాంలు, వారి అనుయాయులు ఉమ్మడిగా, అలనాటి హైదరాబాద్ రాష్ట్రంలో సుమారు 40 శాతం భూమిని తమ స్వాధీనంలో వుంచుకున్నారు. ‘‘పోలీసు యాక్షన్’’ జరిగిన తరువాత మాత్రమే ‘‘సర్ఫ్--ఖాస్’’, జాగీర్దారు వ్యవస్థలను రద్దు చేసి, ఈ భూములను ‘‘దివానీ’’ భూములకు అనుసంధానం చేసి, తద్వారా ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థలో చేర్చడం జరిగింది. నిజాం సొంత ఆస్తి అయిన సర్ఫ్--ఖాస్ భూములకు జాగీర్దారీ వ్యవస్థలో ఎక్కువ ప్రాముఖ్యం లభించేది. వీటినే "క్రౌన్ ల్యాండ్స్" అని వ్యవహారించేవారు. వీటిమీద వచ్చే ఆదాయాన్ని, పండేపంటలను నిజాం కుటుంబీకులే అనుభవించేవారు. అంతే కాకుండా హైదరాబాద్ రాష్ట్ర ఖజానా మొత్తం నుండి కూడా కొంత మొత్తాన్ని నిజాం వాడుకునేవారు. ఇలా 1948 లో భారత యూనియన్ లో కలిసిపోయేవరకు కొనసాగేదని, తెలంగాణకు సంబంధించినంత వరకు సర్ఫ్--ఖాస్ కింద పరిగణించబడే భూములన్నీ కూడా హైదరాబాద్ చుట్టు పక్కన ప్రాంతాలు మాత్రమేనని వీటినే అత్రాఫ్--బల్దా అనేవారిని శర్మ రాసిన పుస్తకంలో వుంది.

సర్ఫ్--ఖాస్ కాకుండా ఇతర జాగీరులు ఉండేవి. పాయిగాల పేరిట సంస్థానాలను నిజాం బంధువర్గానికి చెందిన ముస్లిం భూస్వాములకు ప్రత్యేకంగా కట్టబెట్టేవారు. వీరు నిజాంకు యుద్ధ సమయంలో సైనిక సిబ్బందిని సమకూర్చుతూ వారి నియామకాలను, శిక్షణను, పర్యవేక్షణను పరిశీలిస్తూ ఉండేవారు. వారు అంధించే సేవలకు బహుమతిగా జాగీరులను, సంస్థానాలను నిజాం వారికి ధారాదత్తం చేసేవారు. మక్తాలు, బంజరలు, అగ్రహారాలు, తనఖా జాగీరులు, జాత్ జాగీరులు, అల్తంగా జాగీరులు, ఇనాంలు వారి వారి సేవలను బట్టి ప్రకటించేవారు. వాటిని పొందేవారు, వారి పరిధిలో ఉన్నంతవరకు వాటిపై ఇష్టానుసారంగా శిస్తులు వసూలు చేస్తూ రైతులని ఇబ్బందులు పెట్టేవారు. పాయిగాల కింద, జాగీర్దారుల కింద, సంస్తానాదీశులకింద ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, సివిల్, క్రిమినల్ వ్యవస్థలు పనిచేసేవి.


     జాగీర్దారు వ్యవస్థ అలనాటి హైదరాబాద్ రాజకీయ వ్యవస్థలో ఒక కీలకమైన అంశం. ముఖ్యంగా ఖల్సా, దివానీ భూముల విషయంలో దేశ్ పాండేల, దేశ్ ముఖ్ ల పెత్తనo, ఆధిపత్యం విపరీతంగా ఉండేది. వీరి దుశ్చర్యల వల్ల వేల ఎకరాల వ్యవసాయ భూమిని అక్రమ మార్గంలో ఆధీనంలోకి తెచ్చుకోవడం వల్ల ఎందరో వ్యవసాయదారులు కేవలం కౌలుదారులుగా మిగిలిపోవాల్సి వచ్చింది. తొలి సర్వే, సెటిల్మెంట్  ఆధారంగా రైతుల ప్రమేయం లేకుండానే, వారికి ఏమాత్రం తెలియకుండానే, దేశ్ పాండేలు, దేశ్ ముఖ్‍లు తమ పేరుమీద దస్తావేజులను తయారు చేయించుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫస్లీ (1908 వ సంవత్సరం) కింద కొన్ని ప్రామాణికాలను అప్పటి సర్వే, సెటిల్మెంట్ భూ పరిపాలన పేర్కొంటూ తద్వారా భూమికి సర్వే నెంబర్లు పొందిన వారిని పట్టాదారులుగా పెర్కొంటూ వారినే భూ హక్కుదారులుగా పరిగణించటం జరిగింది. తద్వారా ఎప్పటికప్పుడు సంబంధిత రికార్డులలో భూ హక్కుదారులను పేర్కొంటూ ‘‘రికార్డు ఆఫ్ రైట్స్’’ (రికార్డుల రూపేణా హక్కుదారులను) పద్దతిని హైదరాబద్ లో 1346 ఫస్లీ (1937) లో అమల్లోకి తేవడం జరిగింది. కాకపోతే, మొత్తం 108 దివానీ తాలూకాలకు గాను, కేవలం 19 వాటిలో మాత్రమే రికార్డ్ ఆఫ రైట్స్ ని అమలుచేయడం జరిగింది. మొత్తం 6535 జాగీరు గ్రామాలుండగా వాటిలో సర్వే సెటిల్మెంట్ కేవలం 5938 గ్రామాలలో మాత్రమే జరిగింది. మిగతావి అపరిష్కృతంగా మిగిలిపోయాయి. అలా సర్వే సెటిల్మెంట్ జరగని గ్రామాలన్నీ దాదాపు తెలంగాణ ప్రాంతాలలోనే వుండడం గమనించాల్సిన విషయం.  

శర్మ సంపాదకత్వంలో వెలువడ్డ పుస్తకంలో ఆచార్య డాక్టర్ మారంరాజు సత్యనారాయణ రావు అనే రాజకీయ శాస్త్రవేత్త  ఈ అంశాలను గూర్చి విపులంగా ప్రస్తావిస్తూ, 1949 ఫిబ్రవరి మొదటి వారంలో అప్పటి మిలటరీ గవర్నర్ కు హైదరాబాద్ నిజాం స్వతంత్రంగా సర్ఫ్--ఖాస్ భూములను ప్రభుత్వ భూములుగా అప్పజెప్పడానికి ముందుకొచ్చినట్లు రాశారు. ఈ సర్ఫ్--ఖాస్ భూములు 5682 చదరపు మైళ్ల విస్థీర్ణంలో 1374 గ్రామాలకు విస్తరించబడి అధికంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేవి. మరో ప్రకటనలో ఆగస్టు 15, 1949 నుంచి జాగీర్దారి వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు కూడా మిలటరీ గవర్నర్ ప్రకటించారుమొత్తం మీద ఆ విధంగా, దాదాపు 150 లక్షల ఎకరాల జాగీరు భూములు రద్దుచేయడం జరిగింది. అనంతరం ఒక జాగీరు పరిపాలనా అధికారిని నియమించి ఎవరెవరు భూములను కోల్పోయారో వారికి తగు విధంగా నష్టపరిహారం చెల్లించడానికి కూడా నిర్ణయం  జరిగింది. అయితే భూములు కోల్పోయిన జాగీర్దారులు మాత్రం భూమి తమకే చెందుతుందనీ, అది వారికి సంబంధించినంత వరకు వారి స్వంత భూమేనని పేర్కొనటం జరిగింది. ఇదే లిటిగేషన్ ఇప్పటి దాకా కొనసాగడం వల్లనే ప్రభుత్వ భూములను అక్రమంగా సొంత భూములుగా చూపుతూ, రిజిస్ట్ర్తేషన్ అధికారుల కుమ్ముక్కుతో భూ బదలాయింపులు జరుగుతున్నాయి.

          1875 లో సాలార్జంగ్ నేతృత్వంలో భూసంబంధిత సంస్కరణలు తీసుకరావటం జరిగేంతవరకు భూ వ్యవహారాలకు ఒక కేంద్రీకృత వ్యవస్థ అనేది లేదని, సరైన పరిపాలనా విధానం అవలంభించకపోవడం వల్లనే భూములకు సంబంధించిన అంశాలు పరిష్కరించలేకపోయారని ఆచార్య సత్యనారాయణ రావు రాశారు. నిజాం అతని ఇష్టానుసారంగా ఎవరికిపడితే వారికి జాగీర్లను దారాదత్తం చేసేవారని, సాలార్జంగ్ ‘‘జిల్లాబంద్’’ వ్యవస్థను ప్రవేశ పెట్టిన తర్వాత రెండు రకాలుగా పరిపాలన వ్యవహారాలు జరిగేవని ఆయన పేర్కొన్నారు. ఇందులో మొదటి పద్దతి ద్వారా ప్రభుత్వ పరిపాలన కింద దివాని భూముల వ్యవహారం చక్కదిద్దబడేదని, రెండవ పద్దతి ద్వారా భిన్న పరిపాలన కింద భిన్న తరహా జాగీరు భూముల వ్యవహారం పరిష్కరించబడేదనీ పేర్కొన్నారు. అయితే సర్వే, సెటిల్మెంట్ కింద సర్ఫ్--ఖాస్ భూముల సమస్య మాత్రం పరిష్కరింపబడలేదని వాటి వర్గీకరణ ఎన్నడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు.

మరోరకమైన భూ వర్గీకరణ ఉండేది. దానినే ‘‘కాందిశీకుల ఆస్థి’’ అని పేర్కొనేవారు. విభజన సమయంలో వారంతా పాకిస్తాన్ దేశానికి తరలిపోయారు. భారత ప్రభుత్వం ఈ కాందిశీకుల భూముల పరిష్కారానికి ఒక పరిపాలనాధికారిని ప్రస్తుత ముంబయి (అప్పటి బొంబాయి) నగరం లో నియమించటం జరిగింది.       పాకిస్తాన్ నుండి వలస వచ్చిన హిందువులకు-ఇతరులకు అవి అప్పజెప్పాలన్నది అప్పటి ఆదేశం. కాకపోతే జరిగింది దీనికి విరుద్ధం. అనేక మంది నకిలీ దృవపత్రాలను తీసుకరావటంలో సఫలీకృతులయ్యారు. కొందరైతే, అలనాటి భూ సొంతదారులు తమకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారని అంటూ, నకిలీ పత్రాలను సృష్టించి, ప్రభుత్వ భూములను ఖబ్జా చేసారు. ఉదాహరణకు 6వ నిజాం అయిన మహబూబ్ అలీ ఖాన్ మహబూబాబాద్ లో 40 ఎకరాలలో ‘‘మ్యాచ్ ఫాక్టరీ’’ స్థాపించారు. ఐతే పోలీసు యాక్షన్ తదుపరి గుర్తుతెలియని కొందరు  కాందిశీకుల ఆస్తికింద కాజేసి దానిని ఇళ్ల స్థలాల కింద ముక్కలు చేసి అమ్ముకున్నారు. ఈ రోజున అక్కడ ఎటువంటి మ్యాచ్ ఫాక్టరీ ఆదారాలు, ఆనవాళ్లు లేవు. హైదరాబాద్ నగరంలోని బేగంపేటలో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మహిళా కళాశాల, సికింద్రాబాద్ లోని కస్తూరిబా డిగ్రీ కళాశాల భూములూ కాందిశీకులవేనని డాక్టర్ సత్యనారాయణ రావు అంటారు

అనధికారికంగా, అక్రమంగా భూపట్టాలు, హక్కులు పొందిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే, మరో సర్వే, సెటిల్మెంట్ చేసి అపరిష్కృత భూములను పరిష్కృతం చేసేంత వరకు, తద్వారా రెవెన్యూ రికార్డులను సరిదిద్ది పటిష్టపరిచేంతవరకు, ఈ లిటిగేషన్లు, వివాదాలు ఇలా కొనసాగుతూనే వుంటాయి. అన్ని వివరాలను ప్రజలకు బహర్గతం చేసి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ భూములను సరిచేసినట్లుగానే పట్టణ ప్రాంతాలలోనూ రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) పద్దతిని ప్రవేశపెడుతూ ఆ విధంగా చట్టం చేసి భూ ఆక్రమణదారులకు చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమయ్యిందనే చెప్పాలి. అందుకే మరో సర్వే సెటిల్మెంటే ప్రభుత్వ భూములకు శ్రీరామరక్ష! End

No comments:

Post a Comment