Tuesday, June 6, 2017

రాహుల్ జీ, ఇవీ నిజాలు! ...... వనం జ్వాలా నరసింహారావు

రాహుల్ జీ, ఇవీ నిజాలు!
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (07-06-2017)

ఇటీవల సంగారెడ్డిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించి ఆవాస్తవమైన విషయాలు ఎన్నో చెప్పారు. సమాచార లోపంవల్ల బహుశా అలా జరిగుండవచ్చు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇంటికో ఉద్యోగమిస్తానని అన్నాడని ఒక ఆరోపణ చేశారాయన. ఇది పూర్తిగా అసత్యం. ఇలా అనలేదనే విషయం సాక్షాత్తూ శాసనసభలో సీఎం స్వయంగా స్పష్టం చేసారు. నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం అని మరో ఆరోపణ......అది కూడా పూర్తిగా అబద్ధమే! యువత జీవితాల్లో వెలుగులు నింపే దిశగా అనేక విధాలుగా ప్రభుత్వేతర, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు విరివిగా కలిపించారు సీఎం. వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో, తద్వారా రాహుల్ గాంధీ దృష్టికి పొతే బాగుంటుందన్న ఆలోచనతో, రాష్ట్రంలో ఉద్యోగపరంగా ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న అనేక చర్యల సమాహారమే వ్యాసం. బహుశా రాష్ట్రంలో, ఇంత తక్కువ కాలంలో, యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో కాని, ఉద్యోగ భద్రతా విషయంలో కాని, పాటికే విధుల్లో వున్న ప్రభుత్వ-ప్రభుత్వ రంగ ఉద్యోగుల విషయంలో కాని, ప్రభుత్వం చేపట్టిన మోతాదులో మరే ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టలేదనే సంగతి జగమెరిగిన సత్యం. రాహుల్ గాంధీకి తెలియకపోవడం దురదృష్ఠం. ఇప్పటికైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అదృష్టం.

తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు, ప్రభుత్వ శాఖలలో ఖాలీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా, మొదటి మెట్టుగా, తెలంగాణ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర పబ్లిక్సర్వీస్కమీషన్ఏర్పాటు చేసింది. అకడెమిక్, పాలనా నిష్ణాతుడైన ఆచార్య ఘంటా చక్రపాణినిని కమీషన్ ఛైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. ఇలా నియమించబడిన సర్వీస్ కమీషన్ ద్వారా మొత్తం 27, 860 ఉద్యోగాల కల్పనా జరిగింది. విసిద స్థాయీలలో   నియామక ప్రక్రియ కొనసాగుతుంది. 5999 ఉద్యోగాలను పాటికే భర్తీ చేయడం జరిగింది. 7306 గురుకుల విద్యాలయాల పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయడం జరిగింది. మరో 2437 పోస్టులకు ఇటీవలే జూన్ 2, 2017 నోటిఫికేషన్ జారీ అయింది. ఆరోగ్య వైద్య శాఖలో  2118 పోస్టులను భర్తీ చేయాలని శాఖ నుంచి అభ్యర్ధన రావడం, వాటికి  త్వరలోనే  నోటిఫికేషన్ జారీకావడం జరగనుంది. ఇవి కాక కొత్తగా మరో 10000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధంగా వుంది. ఉద్యోగాల భర్తీకి ఒక పక్రియ వుంటుంది. ప్రాసెస్ పూర్తికాకుండా రాత్రికి రాత్రే ఉద్యోగాలు అలా-ఇలా ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు కదా! నోటిఫికేషన్లతో కలుపుకుని మరికొన్ని రాష్ట్రంలో వివిధ విద్యాసంస్థల్లో కొత్తగా 20వేల మందికి పైగా ఉద్యోగులను నియమించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశం ఇచ్చింది. వీటిలో కొన్నింటికి ఇప్పటికే నోటిఫికేషన్ వెలుబడింది. వివిధ విద్యాసంస్థల్లో అన్ని నియామకాలకు సంబంధించిన ప్రక్రియ వారంలోగా ప్రారంభం కావాలని మే 30, 2017 సిఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కొత్తగా 84 కస్తూరిభా గాంధి బాలికల విద్యాలయాలు ప్రారంభమవుతున్నాయి. వీటిలో 1428 ఉద్యోగాలు అవసరం అవుతాయి. 840 మంది బోధన, 588 మంది బోధనేతర సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలను కలుపుకుని మొత్తం 29 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 377 ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందివీటిలో 174 మంది బోధన, 203 మంది బోధనేతర సిబ్బందిని వెంటనే నియమించాలని సిఎం కలెక్టర్లను ఆదేశించారు.

వీటికి అదనంగా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అమలవుతున్న టీఎస్‍ఐపాస్ ఏక గవాక్ష పారిశ్రామిక విధానం ద్వారా లైసెన్సులు పొందిన రు. 72, 000  కోట్ల విలువ చేసే సుమారు 3900 పరిశ్రమల్లో  దాదాపు 2, 40, 000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనుండగా, ఈపాటికే ఉత్పత్తులు ప్రారంభించిన  సుమారు 2300 పరిశ్రమల్లో 72, 000 మందికి పైగా ఉపాధి పొందారు. ఇవన్నీ ఉద్యోగ కల్పనలే కదా!

ఉద్యోగ భద్రతలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. గురుకుల పాఠశాలల్లో తొమ్మిదేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న 758 మంది టీచర్లు, అడ్హాక్ పద్ధతిలో పని చేస్తున్న 18 మంది టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, 2488 మంది భాషా పండిట్లను,1047 పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయంతో దాదాపు 25 వేల పైచిలుకు ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. విద్యుత్ శాఖలో వున్న 13,357 ఖాలీలను భర్తీ చేయాలని,  జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కంల పరిధిలోని లైన్ మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వo నిర్ణయించింది. 1500 నాన్ టెక్నికల్, ఉద్యోగుల నియామకాలను చేపట్టాలని కూడా నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో విద్యుత్ శాఖలోని దాదాపు 10 వేల మందికి వెంటనే పదోన్నతులు కల్పించాలని అధికారులను ఆదేశించింది. ఇదంతా ఉపాధి కల్పనే కదా! ఉద్యోగాలివ్వడమే కదా!

ఇక ఉద్యోగ భద్రతా విషయానికొస్తే....జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్ల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి మున్సిపల్ కార్మికుల వేతనం రూ.8,500 గా ఉండేది. వారి వేతనాన్ని రూ.12,500 కు పెంచింది ప్రభుత్వం. తర్వాత మరోసారి వారి జీతాలను పెంచతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జీతాలు రూ.1500 పెంచి, మొత్తం జీతాన్ని రూ.14,000 చేశారు. సుమారు 24 వేల మందికి జీతాలు పెరిగాయి. ప్రభుత్వం రెండు పర్యాయాలు అంగన్వాడిల జీతాలను పెంచింది. మొదటగా  మార్చ్ 11, 2015 అసెంబ్లీలో నిర్ణయం ప్రకటించింది. రెండో పర్యాయం ఫిబ్రవరి 27, 2017 అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ప్రతినిధులతో ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో వారి జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంగన్ వాడీల జీతాలు రూ.4,200 నుంచి రూ.10,500 (150 శాతం) కు పెరిగాయి. 3,989 మినీ అంగన్ వాడి టీచర్లు, జీతాలు 4,500 నుండి 6000 లకు పెరిగాయి. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలు పెంచాలనే నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 35,700 కేంద్రాల్లో పనిచేస్తున్న 67,411 మంది సిబ్బందికి ప్రయోజనం కలుగుతుంది. ఆశ వర్కర్ల పారితోషికాన్ని రూ.6 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆశ వర్కర్లను తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా పిలవాలని అధికారులను ఆదేశించారు. 


            తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సిని ప్రకటించింది. మూల వేతనంలో 43% శాతం మేర పెంచి (ఫిట్మెంట్‌) ఇవ్వడం జరిగింది. సకల జనుల సమ్మె లాంటి అధ్బుత పోరాటలు చేసిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం వేతనాలను పెంచింది. సెర్ఫ్తో పాటు జాతీయ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు పెరిగాయి. సెర్ప్లో 4,174 మంది ఉద్యోగులుండగా, వారిలో 767 మందికి రూ. 6,260 నుంచి రూ. 12, 000 మేర వేతనాలను పెంచారు. మిగతా వారికి 30 శాతం అధికం చేశారు. అలాగే ఉపాధి చట్టంలో పనిచేస్తున్న ఫీల్డ్అసిస్టెంట్లకు రూ.6,290 వేతనంగా ఉండగా, దాన్ని రూ.10,000 చేసింది ప్రభుత్వం. మిగతా వారికి 30 శాతం వర్తింపజేసారు. దీంతో మొత్తం 11,415 మందికి జీతాలు పెరిగాయి. ఇందులో 7402 ఫీల్డ్ అసిస్టెంట్లు కాగా, 4013 మంది(30 శాతం) ఎఫ్.టి.. లు వున్నారు.

అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 1578 మంది 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగుల వేతనాలను రూ.4 వేలు పెంచింది. వారసత్వంగా విలేజ్ రెవెన్యూ అసెస్టెంట్లుగా పనిచేస్తున్న వారి వేతనాలు 64.61 శాతం పెంచతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం విఆర్ఎలు అన్ని విధాల కలిపి రూ.6500 వేతనం పొందుతున్నారు. వేతనాన్ని రూ.10,500కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు రూ.200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంట్ కూడా ప్రకటించింది. దీంతో ఒక్కో విఆర్ఎకు రూ.4,200 వేతన పెరుగుతుంది. వీటితో పాటు వి.ఆర్., అటెండర్, డ్రైవర్ తదితర ఉద్యోగాల నియామకాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వి.ఆర్..లకు 30 శాతం ఉద్యోగాలు రిజర్వు చేయనున్నట్లు ప్రకటించింది. పబ్లిక్ సర్వీస్ పరీక్ష రాసి వి.ఆర్.. లుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయం వల్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్ష రాసి ఉద్యోగం పొందినప్పటికీ తక్కువ వేతనంతో పనిచేస్తున్న రాష్ట్రంలోని 2,900 మంది డెరెక్ట్ రిక్రూట్ వి.ఆర్..లకు మేలు కలుగుతుంది.

అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వి...) వేతనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 18,405 మంది వి...లు రూ.500 నుంచి రూ.1500 వరకు వేతనం మాత్రమే పొందుతున్నారు. వీరు చేసే పనికి వస్తున్న జీతం వారికి ఏమాత్రం సరిపోయేది కాదు. నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో వి...లతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ప్రతీ వి...కు నెలకు రూ.5వేల జీతం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2010 పిఆర్సి సిఫారసుల మేరకు ఎస్జీటిలకు 10,900 రూపాయలు, స్కూల్ అసిస్టెంట్స్కు 14వేల 800 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1892 మంది సిఆర్టిలకు మేలు కలుగుతుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాలని జనవరి 2,2016 జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి పెంచిన జీతాలను జనవరి 2016 నుండే అమలు చేశారు. ప్రస్తుతం రూ.6,700  జీతం వస్తున్న వాళ్ల వేతనాన్ని రూ.12 వేలకు, 8,400 వస్తున్న వారికి 15 వేలకు, 10,900 వస్తున్న వారి జీతాలను రూ.17 వేలకు పెంచారు.

కాంట్రాక్టు లెక్చరర్ల కనీస వేతనం రూ.37,000 పెంచడం వల్ల రాష్ట్రంలో 3,687 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రయోజనం పొందారు. అలాగే కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్ల మూల వేతనం రూ.40,270, డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకులకు రూ.43,670 పెంచారు. నిర్ణయంతో కాంట్రాక్టు అధ్యాపకులు కూడా రెగ్యులర్ టీచర్ల మాదిరిగా వేతనాలు పొందుతున్నారు. తెలంగాణలో ఆర్టిసి సిబ్బందికి 44శాతం ఫిట్ మెంట్ పెంచాలని నిర్ణయించి, అమలు చేసింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింపచేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల 58,770 మంది కార్మికులకు ప్రయోజనం కలిగింది. విద్యుత్ శాఖలోని ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లలో పనిచేస్తున్న దాదాపు 24 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని దశలవారీగా క్రమబద్దీకరణ చేయడం జరుగుతున్నది. వీరికి ఉద్యోగ భద్రతతో పాటు మెరుగైన జీతభత్యాలు లభిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్శాఖ ఉద్యోగులందరికి 27.5 శాతం ఫిట్మెంట్ అలవెన్స్ మంజూరు చేసింది ప్రభుత్వం. విద్యుత్శాఖలోని జెన్కో, ట్రాన్స్ కో, డిస్కం ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో కూడిన వేతన సవరణ చేస్తూ ప్రభుత్వం డిసెంబర్ 2, 2014 నిర్ణయించింది. ప్రతి నిత్యం విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల పట్ల ప్రభుత్వం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న హోంగార్డుల డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం డిసెంబర్ 5, 2014 పలు నిర్ణయాలు తీసుకుంది. 16 వేల మంది హోంగార్డుల వేతనం 9 వేల నుండి 12 వేలకు పెంచడం జరిగింది.  


ఇలా వందల, వేలమంది నిరుద్యోగ యువతకు, ఉద్యోగులకు వివిధ రకాల లబ్ది కూరేలా ప్రభుత్వం అనేక కార్యాలు చేపట్టింది. వాస్తవాలివైతే యువతకు ఏమీ చేయలేదనే వాదన సమంజసం కాదు. END

No comments:

Post a Comment