మరువలేని మహనీయుడు వాసుదాసస్వామి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర భూమి దినపత్రిక (02-07-2017)
శ్రీ రామాయణం క్షీర ధార. వాసుదాసుగారి శ్రీ మదాంధ్ర
వాల్మీకి రామాయణం మందరాలన్నీ, మందార మకరంద మాధుర్యాలే. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర
కాండనుకూడా తెనిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి, కవి సార్వభౌమ వావిలికొలను సుబ్బరావు (వాసు దాసు) గారు. ఆయన సొంత, స్వతంత్ర రచన అనిపించుకున్న శ్రీమదాంధ్ర వాల్మీకి
రామాయణం మందరాలన్నీ,
తెలుగునేల
నాలుగుచెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో, ఓ శతాబ్దం క్రితమే, సంతరించుకున్నాయి. దురదృష్టవశాత్తు, కాలక్రమంలో, అవన్నీ మరుగున పడిపోతున్నాయి. తెలుగు పాఠకలోకం వారి రచనలను మరచిపోతున్నారు. 1909 వ సంవత్సరంలో నాటి చెన్నపురి (నేటి చెన్నై) లోని "శ్రీ వైజయంతీ ముద్రా శాల" లో ముద్రించబడి, ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా
"కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు చెందిన "బర్క్ లీ" గ్రంథాలయం చేరుకుని, "గూగుల్ సంస్థ" డిజిటలైజ్ చేసిన వాసు దాసు
గారి "శ్రీ మదాంధ్ర వాల్మీకి
రామాయణం"
మొదటి
సంపుటి లోని గ్రంథకర్త అభిప్రాయాలు అక్షర లక్షలు చేసే ఆణిముత్యాలు. తెర మరుగవుతున్న వందేళ్లనాటి
అపురూపమైన తెలుగు సాహిత్యంలోని అత్యంత ఆదరణీయమైన వాసు దాసుగారి అలనాటి "నిర్వచన రామాయణం" లో, ఆయన ఎందుకు, ఎలా వాల్మీకి రామాయణం
చదివింది,
ఎలా
రాసింది,
ఎలా
అంకితం ఇచ్చింది లాంటి విషయాలనేకం వున్నాయి.
వాల్మీకి రామాయణ క్షీరసాగర మధనాన్ని చేసి "మందర" మకరందాలనూ, రమా రామ పారమ్య పీయూషాలనూ, నాలుగు చెరగులా పంచి, ఆ మథనంలో ఆవిర్భవించిన శ్రీ
సీతారాముల తత్వాన్ని, వేద
వేదాంగేతిహాస స్మృతి శ్రుతి శుభంగా అన్వయించి, తెలుగువారి హృదయ కేదారాలను
ప్రపుల్లంచేసిన పరమ భాగవతోత్తములు "ఆంధ్ర వాల్మీకి" వాసుదాస స్వామి. "రామ భక్తి సామ్రాజ్యం యే
మానవుల కబ్బెనో మనసా!
ఆ
మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమే" అన్న త్యాగరాజ స్వామి వారి కీర్తనకు
సాకార దివ్య స్వరూపులు వాసుదాస స్వామి. ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి అవతరించి వున్న కాలంలో, వారి దర్శన, అనుగ్రహ భాషణా సౌభాగ్యమబ్బిన వారు, "శ్రీ మద్రామాయణం మందరం" పారాయణ పరులై, తమ పరంపరకు శ్రీ వాసుదాస
స్వామి దివ్య స్మృతులను అందించి తరించారు. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని
అందరికంటే మొట్ట మొదటగా తెనిగించి, పదే-పదే రామాయణ పఠన పాఠన శ్రవణాదుల పట్ల తెలుగువారికి అత్యుత్సాహాన్ని
కలిగించి, "రామ భక్తి సామ్రాజ్యం" అంటే, తెలుగునాడే సుమా, అనిపించిన నిరుపమ రామ భక్తులు
వాసుదాస స్వామివారు.
ఇరవైనాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష
వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. మహా మహానుభావులూ, మహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను
సుబ్బారావు (వాసుదాసు), వాల్మీకి రామాయణాన్ని
యధాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందో యతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి
తుల్యమైన స్థాయినీ,
పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర
వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, "మందరం" అని దానికి విశేష
ప్రాచుర్యాన్ని కలిగించారు. తెలుగు పాఠక లోకం మందరాన్ని అపారంగా అభిమానించింది, ఆదరించింది. వాసుదాసుగారి కీర్తికి
ఆలవాలమైంది ఆంధ్ర వాల్మీకి రామాయణం. తెలుగు భాషలో అంతకుముందు రామాయణానికి యధా మూలాలు లేవని, అర్థ పూర్తి కలిగి, కావ్య, ఇతిహాస గౌరవ పాత్రమై, సర్వజన పఠనీయమై, ప్రామాణికమై, మూలానుసరమైన రామాయణం తెలుగులో
వుండడం లోకోపకారంగా భావించి, రచించించారీ గ్రంథాన్ని వాసుదాసుగారు. ఎనిమిదేళ్లలో రామాయణాన్ని
తొలుత నిర్వచనంగా తెనిగించి, అలనాటి కడప మండలంలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామికి అంకితం
చేసారు . ఆయన
రచించిన నిర్వచన రామాయణం, ఆయన జీవిత కాలంలోనే, నాలుగైదు సార్లు
ముద్రించబడింది.
వాసుదాసుగారు రచించిన ఆంధ్ర
వాల్మీకి నిర్వచన రామాయణానికి తెలుగులో సరైన వ్యాఖ్యానముంటే, సంస్కృతం రానివారికి చక్కగా
అర్థమవుతుందని మిత్రులంటారాయనతో. మూల గ్రంథం రాయడంకంటే వ్యాఖ్యానం రాయడం కష్టమనుకుంటారాయన
మొదట్లో. బాగా
ఆలోచించిన తర్వాత, శ్రీ
మదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం" పేరుతో గొప్ప వ్యాఖ్యానం రాసారు. వాస్తవానికి అదొక గొప్ప
ఉద్గ్రంథం. సరికొత్త
విజ్ఞాన సర్వస్వం.
"మందరం" అంటే, క్షీరసాగరాన్ని
మథించడంలో కవ్వంగా ఉపయోగించిన మందర పర్వతమే గుర్తుకొస్తుంది సాధారణంగా ఎవరికైనా. కాని, వాసుదాసుగారి శ్రీపాద
సంబంధులకు మాత్రం, "మందరం" అంటే, మొదట
గుర్తుకొచ్చేది, ఆంధ్ర
వాల్మీకి రామాయణం మందరమే. వాల్మీకి విరచితమైన రామాయణాన్ని శ్రీవారు, "క్షీరవారాసి" గా సంభావించి, దానిని మధించిన తమ "మేథ" అందించిన మకరందాలను, మధురిమలను, ముచ్చటగా "మందరం" అని పేర్కొన్నారు. సహృదయ నైవేద్యంగా, అనుభవైక వేద్యంగా వచ్చిన
రచనలకు అసాధ్యంగా,
నిగమ
గోచరంగా భావించబడిన రామాయణానికి "మందరం" అని నామకరణం చేయడంలో తను
కొంతవరకే న్యాయం చేయగలిగానని అంటారాయన. ఇందులోంచి చిలికిన కొద్దీ ఎన్నో దివ్య రసాయనాలు
ఉద్భవిస్తాయని, భావితరాలవారు
ఇందుకు పూనుకోవాలని కూడా సూచించారు వాసుదాసుగారు.
తను
రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక పద్యం వంతున
రాసారు వాసుదాసు. మందరంలో
తను రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థ తాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న
వివిదార్థాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన మందరాలలోని శ్రీరామాయణ
వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి" కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది. ఇక ఆయన రాసిన నిర్వచన
రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలు, ఉత్పల మాలలు, సీస, ఆటవెలది, తేటగీతి, కంద, శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా, తెలుగు ఛందస్సులో వుండే
వృత్తాలన్నిటినీ, సందర్భోచితంగా
ప్రయోగించారు. వాటిలో, "మత్తకోకిలము" , "పంచ చామరం" , "కవిరాజ విరాజితము" , "తరలము" , "ప్రహరణకలిత" , "సుగంధి" , "ఉత్సాహం" , "మనోహరిణి" , "వనమయూరము" , "తోటకము" , "మానిని" , "ఇంద్రవంశము" , "లయగ్రాహి" , "తోదకము" , "మాలిని", "కలితాంతము" , "మధురగతిరగడ" , "వనమంజరి" , "కమల విలసితము" , "వసంతమంజరి" , "మంజుభాషిణి" , "స్రగ్ధర" , "వసంతతిలక" , "మాలి" , "కరిబృంహితము" , “చారుమతి", "వృషభగతిరగడ", "స్రగ్విని", "మనోరంజని", "తామరసం", "పద్మనాభ వృత్తం", "అంబురుహ వృత్తం", "మందాక్రాంత" లాంటివెన్నో వున్నాయి. ద్విపదలూ వున్నాయి. దండకం కూడా వుందో సందర్భంలో. ఎక్కడ ఎందుకు ఏ విధంగా ఛందః
యతులను ఉపయోగించారో కూడా వివరించారు. వీటికి తోడు అనేక వ్యాకరణ విషయాలను అవసరమైన ప్రతి చోటా
పాఠకులకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియచేశారు.
వాసుదాసు ఆంధ్ర వాల్మీకంలోని
ప్రతి కాండకొక ప్రత్యేకతుంది. ప్రతికాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వం. ప్రతి కాండలోని, ప్రతి పద్యానికి, ప్రతి పదార్థం ఇస్తూ, చివరకు తాత్పర్యం రాస్తూ, అవసరమైన చోట నిగూఢార్థాలను, అంతరార్థాలను, ఉపమానాలను ఉటంకిస్తూ, సాధ్యమైనంత వరకు ఇతర
గ్రంథాల్లోని తత్సంబంధమైన అంశాలను పేర్కొంటారు కవి. ప్రత్యుత్తరం కోరి చదవాల్సిన
విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారు. శ్రద్ధగా చదువుకుంటూ పోతే, అర్థం చేసుకునే ప్రయత్నం
చేసుకుంటూ చదువగలిగితే, ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం
దర్శనమిస్తుంది. ఒక
సారి ధర్మశాస్త్రం లాగా, ఇంకో సారి రాజనీతి శాస్త్రం లాగా, మరో చోట ఇంకో సందర్భోచిత
శాస్త్రం లాగా బోధపడుతుంది. ప్రతికాండ ఒక భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురా తత్వ శాస్త్రం లాగా
దర్శనమిస్తుంది. అసలు-సిసలైన పరిశోధకులంటూ వుంటే, మందరం ఏ ఒక్క కాండ మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు, వంద పీహెచ్‌డీలకు సరిపోయే
విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్ తో పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి. పాదరసం నుండి బంగారం చేసే
రహస్యమైన విషయాలలాంటి అనేకమైనవి తెలుసుకోవచ్చు.
వావిలికొలను
సుబ్బరావు, కడప
జిల్లా, జమ్మలమడుగులో 23 జనవరి 1863 లో
జన్మించి జులై 1, 1936 లో
పరమపదించారు. 1893-1904 మధ్య
కాలంలో పదకొండేళ్లు రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసారు మొదట్లో. కందుకూరి
వీరేశలింగం పంతులు తర్వాత, మద్రాస్ (నేటి చెన్నై) ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్య
కాలంలో పనిచేసారు.
కళాశాలలో చేరక ముందే, "శ్రీ కుమారాభ్యుదయం" అనే ప్రబంధ గ్రంథాన్ని
రచించి, నాటి
ఉద్దండ కవి పండితులను ఆశ్చర్య పరిచారు. ఆయన ప్రతిభకది తొలి హారం.
తెలుగు పండితుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే, భార్యా
వియోగం కలగడంతో, వాసుదాసు
భక్తి, యోగ మార్గం పట్టారు. పండిత పదవీ విరమణ చేసిన అనంతరం, తన జీవితమంతా, భక్తి
మార్గంలోనే గడిపారు.
ఈ నాటికీ క్రమం తప్పకుండా గుంటూరు జిల్లా తెనాలి దగ్గరున్న
అంగలకుదురు నుంచి ప్రచురించబడుతున్న "భక్తి సంజీవని" అనే భక్తి,
జ్ఞాన, కర్మ యోగాలను తెలిపే ఆధ్యాత్మిక
మాసపత్రిక సంస్థాపక సంపాదకులుగా-వాసుదాసుగా, ఆంధ్ర
వాల్మీకిగా, కవి సార్వభౌమగా ప్రసిద్ధికెక్కారు. అంగలకుదురులోని శ్రీ కోదండ రామ
సేవక ధర్మ సమాజం స్థాపించింది ఆయనే. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని పునరుద్ధరించి, ఈ నాటికీ
దర్శనీయమైన రీతిలో శాశ్వత కైంకర్యం చేసిన వాసుదాసుగారు, వాజ్ఞ్మయ ప్రపంచంలోని భక్త కవులలో
తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.
వాసుదాసుగారు "కౌసల్యా పరిణయం" అనే
ప్రబంధం, "సుభద్రా
విజయం" అనే
నాటకంతో పాటు, "హిత
చర్యలు", "ఆధునిక
వచనరచనా విమర్శనం",
"పోతన నికేతన చర్చ", "పోతరాజు విజయం", "రామాశ్వమేథం", ఆంధ్రవిజయం" కూడా
రాసారు."ఆర్యకథానిధులు" అన్న
పేరుతో ఆయన రాసిన సులభ వచన గ్రంథాలు తెలుగువారందరికి అత్యంత ఆదరణీయమైనాయి."సులభ
వ్యాకరణం" తెలుగు
వ్యాకరణాన్ని నిజంగానే సులభం చేసింది. ఆయన రచించిన "కృష్ణావతార తత్వం" ప్రశస్త కృతిపాండిత్యంతో, ఆధ్యాత్మిక
భావనతో, పాఠకులలో
ఆంధ్ర భాషాభిమానాన్ని ఉద్దీపించచేసి-తాను తరించి, ఇతరులను తరింపచేసిన ధన్యాత్ముడు, మహామనీషి వావిలికొలను సుబ్బరావు
గారు.
ఆంధ్ర వాల్మీకిరామాయణం తర్వాత రచించబడిన పలు
గద్య-పద్య
రామాయణాలకు విశేష ప్రాచుర్యం లభించినా, ఆ రోజుల్లోనూ-ఈ రోజుల్లోనూ, వాసుదాసుగారి రామాయణానికి ప్రాచుర్యం లభించినా తగినంత గుర్తింపు
ఎందుకు లభించలేదనేది జవాబు దొరకని ప్రశ్న. వ్యాస మహాభారతాన్ని మొదట
తెనిగించిన నన్నయను "ఆదికవి" గా
పిలిచినప్పుడు, వాల్మీకి
రామాయణాన్ని యథావాల్మీకంగా పూర్వ కాండలతో కలిపి ఉత్తర కాండను కూడా మొట్టమొదట
తెనిగించిన వాసుదాసుగారు కూడా "ఆదికవే" కదా? నన్నయంతటి
గొప్పవాడే కదా. వాస్తవానికి
సరైన పోషకుడో, ప్రాయోజకుడో వుండి వుంటే, వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకిరామాయణం, ఎప్పుడో, ఏనాడో
నొబెల్ సాహిత్య బహుమతికో, జ్ఞానపీఠ పురస్కారానికో నోచుకుని వుండేది. ఏ మాత్రం మన తెలుగువారు ప్రయత్నం
చేసినా, ఆ
మహానుభావుడికి భారతరత్న, జ్ఞానపీఠ
ఆవార్డులతో పాటు నొబెల్ బహుమానం వచ్చేది. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే మంచిదేమో. కాలం గడిచిపోతున్నది. వాసుదారుగారు
మారిపోతున్న తరాలకు గుర్తురావడం కూడా కష్ఠమైపోతున్నది. వారి "ఆర్యకథానిథుల" తోనూ, "హితచర్యల" పరంపరలతోనూ, పరవశించిపోయిన
ఆ నాటి తెలుగు పాఠక మహనీయులు క్రమంగా తెరమరుగవుతున్నారు. మళ్లీ-మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిన, మరువలేని
మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు
వాసుదాసస్వామి. END
No comments:
Post a Comment