Saturday, July 22, 2017

పౌర హక్కుల ఉద్యమ సారధి శ్రీ శ్రీ : వనం జ్వాలా నరసింహారావు

పౌర హక్కుల ఉద్యమ సారధి శ్రీ శ్రీ
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (22-07-2017)

(పౌరహక్కుల ఉద్యమం ఆరంభమై 55 ఏళ్లు నిండిన సందర్భంగా)

శ్రీశ్రీ గా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు విప్లవ రచయితల సంఘం (విరసం) నేతగా, సినీకవిగానే చాలామందికి తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మానవహక్కుల ఉద్యమం ఆవిర్భవించిన తొలినాళ్ళలో ఆయన హక్కుల సేనానిగా సేవలందించారు. తెలంగాణ ప్రాంతాలలో జరిగిన మానవహక్కుల ఉద్యమ సభల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన మహాకవి శ్రీశ్రీ పాలకుల నియంతృత్వ ధోరణులపై నిరసన గళం వినిపించారు. సరిగ్గా 55 ఏళ్ల క్రితం తెలుగునేలపై మానవహక్కుల ఉద్యమం ఆవిర్భావం వెనుక ఘన చరిత్ర వుంది.

ఖమ్మం జిల్లా కు చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి దేశవ్యాప్తంగా పలువురిని రాత్రికిరాత్రే అరెస్టు చేసి నిర్బంధంలో పెట్టిన వాళ్ళలో ఒకరు. ఆయనతో పాటు, జిల్లా మేదావిత్రయంగా అప్పట్లో పిలుబడ్డ వారైన బోడేపూడి వెంకటేశ్వరరావు, కేవీ సుబ్బారావు అనే ఇద్దరు లాయర్లు కూడా అరెస్టయ్యారు. వీరిని అరెస్ట్ చేయకముందు మరెందరినో అరెస్టు చేసినప్పుడు వారి మదిలో మెదిలిన ఆలోచనే దేశవ్యాప్త పౌర హక్కుల ఉద్యమానికి అంకురార్పణ.

మొదట్లో అరెస్టయ్యి నిర్బంధంలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులను విడుదల చేయించుకోవాలంటే అది కేవలం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన వ్యవహారం కాదని, అఖిల భారత స్థాయిలో ఆలోచన చేయాల్సిన సమస్యనీ గ్రహించింది మేధావిత్రయం. అలా చేయాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పాల్సిన అవసరముందని కూడా భావించారు. రాజకీయ పరమైన హక్కులకు కత్తెర పడ్డదన్న సంగతిని జనానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా తమపై వేసుకోదల్చారు. సిపిఎం నాయకులపై చైనా మద్దతు దారులన్న ముద్ర వేయడంతో పాటు, సిపిఐ నాయకుల పట్ల మెతక ధోరణిని అవలంబించింది ప్రభుత్వం అప్పట్లో. రాజకీయ-పౌరహక్కులకు భంగం కలిగింది కాబట్టి, ఆ దిశగా ఉద్యమించాలని, ఉద్యమానికి సిపిఐ నాయకుల మద్దతు కూడా పొందాలని మొట్టమొదటగా మేధావి త్రయం భావించింది.

ఆరోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్‌లో సిపిఐ పై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులకు నచ్చచెప్పారు మేధావిత్రయం. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించారు. విజయవాడలో కలిసిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి పౌర హక్కుల సంస్థను స్థాపించి, అదే రోజు బహిరంగసభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఆ బహిరంగ సభకు పిలువాలనుకున్న నాయకులలో సిపిఐకి చెందిన శ్రీపాద అమృత డాంగే, సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని అప్పట్లో ప్రభుత్వం భావించినందున సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌ను, జ్యోతిబసును అరెస్టు చేయలేదు అప్పట్లో. తొమ్మండుగురు సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుల్లో వారిద్దరినీ తప్ప మిగతా ఏడుగురిని నిర్బంధించింది ప్రభుత్వం.

ప్రభుత్వ ఆదేశాలను-ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు, ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జైళ్ళలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లో ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్‌లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పిడియాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల కమిటి, పి.యు.డి.ఆర్‌, పంజాబ్‌ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్‌. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.


ఈ పరిణామాలకు చాలాముందే, అంటే, 1965లోనే, విజయవాడలో ఆవిర్భవించనున్న పౌర హక్కుల సంస్థ ప్రకటన బహిరంగ సభకు అందరికీ ఆమోదయోగ్యమైన డాంగే, ఇ.ఎం.ఎస్‌లతో పాటు ఇంకెవరిని పిలవాలని ఆలోచన చేసారు మేధావి త్రయం. చర్చల్లో మహాకవి శ్రీ శ్రీ పేరు ప్రస్తావనకొచ్చింది సభా ముఖంగా. అదే విధంగా ఉభయ కమ్యూనిస్టులకు సమాన దూరంలో ఉంటూ వస్తున్న మాజీ పార్లమెంట్‌సభ్యుడు కడియాల గోపాలరావు పేరూ ప్రస్తావన కొచ్చింది. అజ్ఞాతంలో ఉన్న సిపిఎం నాయకులైన నండూరి ప్రసాదరావు, చెన్నుపాటి లక్ష్మయ్యల సూచన మేరకు జాతీయ స్థాయిలో పేరొందిన పౌరహక్కుల వాది జస్టిస్‌ ఎన్‌.సి. చటర్జీని పిలవాలన్న ఆలోచన జరిగింది. ఈయన ప్రముఖ సిపిఎం నాయకుడు, 2004-2009 మధ్య లోక్‍సభ సభాపతిగా వున్న సోమ్‍నాథ్‍చటర్జీ తండ్రి. ఖమ్మంకు చెందిన న్యాయవాదులు, వైద్యులు విజయవాడలో జరుగనున్న సదస్సుకు కావలసిన సదుపాయాలను సమకూర్చేందుకు సహాయపడ్డారు. జైల్లోవున్న ఆ నాటి సిపిఎం నాయకుడు తమ్మిన పోతరాజు అనుయాయులు విజయవాడ సభ ఏర్పాట్లకు తోడ్పడ్డారు. పౌర హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల వివరాలను, కార్యాచరణ పథకాన్ని సదస్సులో చర్చించాలని మేధావి త్రయం చేసిన సూచనను అందరూ అంగీకరించారు.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.వి.ఎస్. ప్రసాదరావును ఎన్నుకున్నారు. స్థానిక న్యాయవాదుల-వైద్యుల సహకారంతో, తమ్మిన పోతరాజు అనుయాయుల తోడ్పాటుతో, మేధావిత్రయం మార్గదర్శకత్వంలో, "ఆదివారం సంఘం" ఆశించిన స్థాయిలో, పౌరహక్కుల ఉద్యమం శ్రీకారం చుట్టడానికి విజయవాడ వేదికగా రంగం సిద్ధం కానున్న తరుణంలో, ఊహించని కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు తలెత్తాయి. కార్యాచరణలో భాగంగా, తొలుత ఉదయం పూట, నాలుగైదు వందలమంది వరకూ హాజరు కానున్న డెలిగేట్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను సాయంత్రం నిర్వహించదలచిన బహిరంగసభకు హాజరయ్యే ప్రజలకు వెల్లడి చేయాల్సి వుంది. అంతవరకూ అంతా సవ్యంగానే జరుగుతోంది. అనుకున్నరీతిలోనే సదస్సు నిర్వహించడం, సీ.పి.ఐ, సీ.పి.ఎం.లతో సహా పలువురు సానుభూతిపరులు ఆ సదస్సుకు హాజరవడం జరిగింది.

సదస్సు ఆరంభంలో సీ.పి.ఎంకు చెందిన బోడేపూడి వెంకటేశ్వరరావు భాగవతార్ రాజకీయ పరమైన హరికథను చెప్తూ, అందులో భాగంగా కేవలం సీ.పి.ఎం.కు చెందిన నాయకుల పేర్లనే ప్రముఖంగా ప్రస్తావించడంతో, సీ.పి.ఐ కి చెందిన వారినుండి తీవ్ర నిరసన వ్యక్తమై, వ్యవహారం చిలికి-చిలికి గాలివానగా మారింది. సదస్సు నిర్వహణంతా ఏకపక్షంగా జరుగుతున్నదంటూ, నిరసన తెలుపుతూ, సీ.పి.ఎం వారిని దూషించుకుంటూ, సదస్సునుండి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా, అప్పటికే విజయవాడ చేరుకున్న కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీపాద అమృత డాంగేను కలిసి, సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కావద్దని విజ్ఞప్తిచేశారు. కార్యకర్తల-సానుభూతిపరుల కోరిక మేరకు, డాంగేతో సహా సీ.పి.ఐకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరుకూడా బహిరంగ సభకు హాజరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద సీ.పి.ఐ.వారెవరూ రాకుండానే విజయవంతంగా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది. "ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంస్థ (Andhra Pradesh Civil Liberties Association-APCLA)" పేరుతో రాష్ట్రస్థాయి పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమ సంస్థను నెలకొల్పాలనీ, ఉద్యమాన్ని జిల్లా-గ్రామ స్థాయికి తీసుకుపోవాలనీ, ప్రతి స్థాయిలోనూ నాయకత్వాన్ని ఏర్పాటుచేయాలనీ సదస్సు తీసుకున్న నిర్ణయాలను బహిరంగ పరిచారు మేధావి త్రయం.

ఏ.పి.సీ.ఎల్.ఏ అధ్యక్షుడుగా మహాకవి శ్రీ శ్రీ ని, కార్యదర్శిగా కడియాల గోపాల రావును, ఉపాధ్యక్షులుగా కే.వి.సుబ్బారావు, కే.వి.ఎస్.ఎన్.ప్రసాదరావులను, సభ్యులుగా కర్నాటి రామ్మోహనరావు, డాక్టర్ వై. రాధాకృష్ణమూర్తిగార్లతో సహా మరికొంత మందిని నియమిస్తూ సదస్సు తీసుకున్న నిర్ణయాలను, దరిమిలా చేపట్ట దలచిన కార్యాచరణ పథకాన్నిసభాముఖంగా బహిరంగపరచారు. నలభై వేల మందికి పైగా హాజరయిన భారీ బహిరంగ సభగా నాటి విజయవాడ పౌరహక్కుల ఉద్యమ ఆరంభ సభను గురించి చెప్పుకునేవారప్పట్లో. బహిరంగ సభకు హాజరై వేదికమీదున్న ప్రముఖుల్లో ఎన్. సి. ఛటర్జీ, ఇ.ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ శ్రీ,, కడియాల గోపాలరావులున్నారు. రహస్యంగా నండూరి ప్రసాదరావుగారిని కలుసుకొని, ఎన్. సి. ఛటర్జీని సంప్రదించడానికి, సభకు రప్పించడానికి డాక్టర్ రాదాక్రుష్ణమూర్తికి ప్రముఖ పాత్రికేయుడు వి. హనుమంతరావు సహాయం చేసారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లాస్థాయి సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించాలని ఏ.పి.సీ.ఎల్.ఏ నిర్ణయించింది. అనుకున్న విధంగానే కర్నూల్, అనంతపూర్, (సూర్యాపేట) నల్గొండ జిల్లాలలో సభలు జయప్రదంగా నిర్వహించారు.

మూడు జిల్లాల్లో జరిగిన సభలకు మహాకవి శ్రీ శ్రీ హాజరు కావడం విశేషం. పౌరహక్కుల ఉద్యమంతో అదే ఆయనకు మొదటి సారిగా ఏర్పడ్డ అనుబంధం. ఆయనే ప్రతి సభకు ప్రధాన ఆకర్షణ. నవంబర్ 1965 మూడో వారంలో సూర్యాపేటలో జరిగిన సదస్సు మిగతా రెండింటి కన్నా బాగా జరిగింది. సదస్సులో ప్రసంగించిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిప్పులు కురిపించారు. సూర్యాపేట సదస్సు జరిగిన ఎనిమిదో రోజున "మేధావిత్రయం"తో పాటు కర్నాటి రామ్మోహనరావు (అడ్వొకేట్)ను, రాష్ట్ర వ్యాప్తంగా వున్న నాయకత్వాన్ని, ముందస్తు నిర్బంధ చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం.

వీరి అరెస్టుకు పూర్వమే ఖమ్మంలో సదస్సు, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో, వారు లేకపోయినా, అరెస్టయిన పది రోజులకు స్థానిక న్యాయవాది-కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు ఏడునూతుల పురుషోత్తమ రావు సారధ్యంలో ఖమ్మంలో బ్రహ్మాండమైన సదస్సు, సభ జరిగింది. ఇ.ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, కడియాల గోపాలరావులు ఆ సదస్సుకు హాజరయ్యారు. శ్రీ శ్రీ వచ్చిన దాఖలాలు లేవు. దురదృష్ట వశాత్తు ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో అదే చివరి సభ అయింది. సూర్యాపేట సభ జరిగిన వారంలోపల మేధావిత్రయాన్ని, కర్నాటి రామ్మోహనరావును అర్థరాత్రి అరెస్ట్ చేసి, చంచల్ గూడా జైలుకు పంపింది ప్రభుత్వం. శ్రీశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన పోరాహక్కుల ఉద్యమం అంతటితో ఆగిందనాలి.


No comments:

Post a Comment